విషయసూచిక;15:1, 15:2, 15:3,4 , 15:5, 15:6,7 , 15:8 , 15:9 , 15:10 , 15:11 , 15:12 , 15:13 , 15:14,15, 15:16 , 15:17,18 ,15:19 , 15:20 , 15:21 , 15:22 , 15:23,24 , 15:25,26 , 15:27.
నిర్గమకాండము 15:1
అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహో వానుగూర్చి యీ కీర్తన పాడిరి యెహోవాను గూర్చి గానము చేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను.
ఈ వచనంలో ఇశ్రాయేలీయుల ప్రజలంతా సముద్రం దాటి తీరానికి చేరగానే "మోషేయు ఇశ్రాయేలీయుల ప్రజలూ" కలసి దేవునికి స్తుతి కీర్తన పాడడం మనం చూస్తాం. ఇక్కడ మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.
1. ఈ కీర్తన మోషేయే ప్రజలకు నేర్పించాడు, అందుకే ప్రకటన గ్రంథంలో ఈ కీర్తనను మోషే కీర్తనగా ప్రస్తావించడం జరిగింది (ప్రకటన 15:5). ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎలాగైతే సముద్రాన్ని దాటి తీరం చేరాక కీర్తన పాడుతున్నారో, అక్కడ కూడా జయించిన విశ్వాసులు స్ఫటికపు సముద్రం దగ్గర నిలిచి మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయూ పాడుతున్నారు. అందువల్ల ఆ కీర్తన ఇదే అని స్పష్టంగా అర్థమౌతుంది. కాబట్టి మోషే నాయకుడిగా ప్రజలను నడిపించడం మాత్రమే కాదు, ఒక కీర్తనను రచించి ఆ ప్రజలను దైవారాధనకు కూడా ప్రోత్సహిస్తున్నాడు, క్రైస్తవ నాయకుడు ఇటువంటి లక్షణమే కలిగియుండాలి.
2. "అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి యీ కీర్తన పాడిరి" అంటే సముద్రం దాటి తీరం చేరిన వెంటనే ఈ కీర్తన పాడినట్టు అర్థమౌతుంది. వారు దేవుడు తమను అద్భుతంగా విడిపించగానే ఇక ఎటువంటి ఆలస్యం చెయ్యకుండా ఆయనను స్తుతిస్తూ కీర్తన పాడుతున్నారు. మనం కూడా దేవుడు చేస్తున్న ఉపకారాలను బట్టి వెంటనే ఆయనను స్తుతించేవారిగా ఉండాలి, ఆ విషయంలో ఆలస్యం చెయ్యకూడదు. అందుకే భక్తుడైన దావీదు దేవుడు తనను సౌలు చేతినుండి విడిపించిన రోజునే ఆయనకు కీర్తన పాడి స్తుతించినట్టు చదువుతాము (2 సమూయేలు 22:1).
3. గడచిన అధ్యాయపు ముగింపులో దేవుడు సముద్రాన్ని చీల్చి ప్రజలను నడిపించి, ఐగుప్తీయులను ఆ సముద్రంలో నాశనం చేసినప్పుడు ఇశ్రాయేలీయుల సమూహమంతా దేవుణ్ణీ మోషేనూ విశ్వసించినట్టు చదువుతాము. ఇక్కడ ప్రజలు అదే విశ్వాసంతో మోషేతో కలసి కీర్తన పాడుతున్నారు. కాబట్టి దేవునికి పాడే కీర్తనలు, ఆయనకు చెల్లించే స్తుతులు విశ్వాసంతో కూడినవై యుండాలి, అప్పుడే అవి దేవునికి అంగీకారంగా ఉండగలవు.
అదేవిధంగా ఇక్కడ మనం మోషే గురించి గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సముద్రంలో ఐగుప్తీయుల సైన్యం, ఫరో నాశనమవ్వడం అతను కళ్ళారా చూసాడు. అతను తలచుకుంటే ఆ ప్రజలను తీసుకుని చుట్టుదారిలో ఐగుప్తుకు చేరుకుని ఆ దేశానికి రాజుగా మారగలడు, లేదా ఆ ప్రజలపై పగ తీర్చుకోగలడు. కానీ అతను అవేమీ చెయ్యకుండా ప్రజలను కనానును చేర్చాలనే దేవుని ఆజ్ఞకు కట్టుబడుతున్నాడు. ఆయనను స్తుతిస్తూ కీర్తనపాడుతున్నాడు. నిజమైన దైవజనుడు దేవుని మాటకు కట్టుబడే ఇలాంటి లక్షణమే కలిగియుంటాడు, దానికి విరుద్ధంగా ఎటువంటి గొప్ప అవకాశాలు వచ్చినప్పటికీ వాటివైపు మొగ్గుచూపలేడు.
"ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను"
ఈ మాటలు ఆయన ఐగుప్తీయులనూ వారి గుఱ్ఱాలనూ సముద్రంలో నాశనం చేసి వారిపై విజయం పొందడాన్ని తెలియచేస్తున్నాయి. ఇక్కడ మిగుల "అతిశయించి జయించెను" అన్నచోట "ఘన విజయం సాధించాడు" అనేది సరైన తర్జుమా, గ్రేస్ మినిస్ట్రీస్ వారి వాడుక బాష అనువాదంలో కూడా మనం ఈవిధంగానే చూస్తాం.
నిర్గమకాండము 15:2
యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ స్తుతించెదను.
"యెహోవాయే నా బలము"
మోషే పలుకుతున్న ఈ మాటలు ఆయన ఐగుప్తులో ప్రదర్శించిన బలం గురించి తెలియచేస్తున్నాయి. ఆయన చెప్పినట్టుగానే "బలమైన హస్తముతో" (నిర్గమకాండము 6:1) ప్రజలను అక్కడినుండి విడిపించాడు.
"నా గానము"
ఇక్కడ మోషే అతను పాడుతున్న కీర్తన సారాంశమంతా దేవుడే, ఆయనకు స్తుతులు చెల్లించడమే అనే భావంలో ఈమాటను పలుకుతున్నాడు. దేవునికోసం పాడే పాటలు ఈవిధంగా ఆయనకు మహిమ తెచ్చేవిగా ఉండాలి. కానీ నేటి క్రైస్తవ సంఘంలో చాలా పాటలు వ్యక్తులను ఉద్దేశించి రాయబడుతున్నాయి.
"ఆయన నాకు రక్షణయు ఆయెను"
ఈ మాటలు ఐగుప్తునుండీ మోషేనూ ఇశ్రాయేలీయుల ప్రజలనూ ఎటువంటి హానికలగకుండా విడిపించి రక్షించిన దానికి తెలియచేస్తున్నాయి. జరిగిన దానిలో మోషేది కానీ ఇశ్రాయేలీయుల ప్రజలది కానీ ఏమీ లేదు, ఆ విషయాన్ని మోషే నిజాయితీగా ఒప్పుకుంటూ వారి రక్షణ కేవలం దేవుడు మాత్రమేయని కొనియాడుతున్నాడు. మన రక్షణ విషయంలో కూడా ఇదే జరుగుతుంది, మన రక్షణలో మన పాత్ర ఏమీలేదు, కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే మనం రక్షించబడుతున్నాం.
ఎఫెసీయులకు 2: 8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
అందుకే పరలోకం చేరిన విశ్వాసులందరూ ఇక్కడ మోషే పలుకుతున్న మాటలనే పలుకుతూ ఆయనను స్తుతిస్తున్నట్టు మనం చూస్తాం.
ప్రకటన గ్రంథం 7: 10 సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
"ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను"
వాస్తవానికి ఆయన ఈ భూమిపై ఉన్న అందరికీ దేవుడే, కానీ ఇక్కడ మోషే; తనకు ఐగుప్తు నుండి ఎటువంటి హానీ సంభవించకుండా కలిగించిన విమోచనను బట్టి "నా దేవుడు" అంటున్నాడు. అదేవిధంగా ఆయనను దేవునిగా అంగీకరించిన ప్రతీ ఒక్కరూ ఆయన గుణాతిశయాలను వర్ణించేవారిగా ఉండాలి, ఈ కీర్తన ద్వారా మోషే అదే చేస్తున్నాడు.
"ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ స్తుతించెదను"
ఈమాటల్లో మోషే; అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చెయ్యబడిన నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నిబంధనను బట్టే ఆయన "అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవునిగా" పిలవబడ్డాడు.
నిర్గమకాండము 15:3,4
యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరి.
ఈ వచనాలలో దేవుడు ఫరోపై అతని సైన్యం పై యుద్ధం చేసి వారిని ఎలా నాశనం చేసాడో చెప్పబడడం మనం చూస్తాం. ఇవే మాటలు కీర్తనకారుడు కూడా జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల చరిత్రలో దేవుడు ఐగుప్తీయులపై చేసిన ఈ యుద్ధం చాలా ప్రాముఖ్యమైనది.
కీర్తనలు 136: 15 ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.
నిర్గమకాండము 15:5
అగాధజలములు వారిని కప్పెను వారు రాతివలె అడుగంటిపోయిరి.
ఈమాటలు ఐగుప్తీయుల సైన్యం సముద్రంలో మునిగిపోవడాన్ని తెలియచేస్తున్నాయి. సాధారణంగా ఎవరైనా వ్యక్తి నీటిలో పడినప్పుడు ముందు మునిగిపోతాడు, చనిపోయాక మాత్రమే అతని దేహం పైకి తేలుతుంది. సముద్రం ఐగుప్తీయులను ముంచివేసినప్పుడు అదే జరిగింది, వారు ఏమీ చెయ్యలేక (పైకి తేలలేక) రాయివలే మునిగిపోయారు.
నిర్గమకాండము 15:6,7
యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితక గొట్టును. నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయమువలన అణచివేయుదువు నీ కోపాగ్నిని రగులజేయుదువు అది వారిని చెత్తవలె దహించును.
ఈ వచనాలు దేవుడు తన శత్రువులపై పగతీర్చుకోవడాన్ని తెలియచేస్తున్నాయి. ఆయన పగతీర్చుకోవడం ప్రారంభించినప్పుడు ఆయన శత్రువులందరూ ఈవిధంగానే నశిస్తారు.
నిర్గమకాండము 15:8
నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధజలములు సముద్రముమధ్య గడ్డకట్టెను.
ఈ వచనంలో ఆయన సముద్రాన్ని చీల్చి గోడలుగా నిలబెట్టిన అద్భుతం గురించి చెప్పబడడం మనం చూస్తాం. ఈ భూమిపై ఉండే గురుత్వాకర్షణ శక్తివల్ల నీరు గోడలుగా, కుప్పగా నిలవడం సాధ్యం కాదు. కానీ ఆయన తన ఊపిరిని విడిచి ఆ నీరు ఆ విధంగా నిలిచేలా గడ్డ కట్టించాడంట. ఇక్కడ ఆయన "ఊపిరివలన" అనే మాటలు అలంకారంగా చెప్పబడుతున్నాయి. యోబు గ్రంథంలో ఉన్న మాటల ప్రకారం ఆయన మంచును కురిపించి, సముద్రాన్ని అలా గొడలుగా (రాశిగా/కుప్పగా) గడ్డ కట్టించియుండవచ్చు.
యోబు 37: 10 దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.
నిర్గమకాండము 15:9
తరిమెదను కలిసికొనియెదను దోపుడుసొమ్ము పంచుకొనియెదను వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకొనెను.
ఈ వచనంలో ఫరో ఇశ్రాయేలీయులను ఏ ఉద్దేశంతో తరిమాడో వివరించబడడం మనం చూస్తాం. అతనిలో ఇశ్రాయేలీయులను తిరిగి ఐగుప్తుకు తీసుకురావాలనే ఉద్దేశమే కాకుండా వారిలో కొందరిని నాశనం చేసి, వారు ఐగుప్తీయుల నుండి న్యాయబద్ధంగా తీసుకున్న బంగారు వెండి నగలను కూడా దోచుకోవాలనే దురాశ, క్రూరమైన ఆలోచన కలిగింది, అందుకే వారిని తరిమాడు.
నిర్గమకాండము 15:10
నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి.
నిర్గమకాండము 14:21 ప్రకారం, మోషే చెయ్యి చాచినప్పుడు ఆయన తూర్పుగాలిని విసిరింపచేసి సముద్రాన్ని పాయలుగా చేసాడు, ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను తరుముతూ సముద్రం మధ్యలోకి చేరినప్పుడు, ఈ వచనం ప్రకారం ఆయన మరలా గాలిని విసిరింపచేసి సముద్రాన్ని మూసివెయ్యడం ప్రారంభించాడు. దానివల్ల ఐగుప్తీయులు సముద్రంలో మునిగిపోయి చనిపోయారు.
నిర్గమకాండము 15:11
యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు.
ఈ వచనంలో మోషే "వేల్పులలో" (దేవతలలో) నీవంటివాడు ఎవడు అంటూ యెహోవా దేవుణ్ణి ఈలోకంలోని దేవతలనుండి ప్రత్యేకపరుస్తున్నట్టు మనం చూస్తాం. వాస్తవానికి ఈలోకంలో దేవతలుగా దేవుళ్ళుగా పూజించబడేవారు ఎంతోమంది ఉన్నారు వారు నిజంగా దేవుళ్ళు కానప్పటికీ ప్రజలు వారిని దైవాలుగానే పూజిస్తున్నారు.
మొదటి కొరింథీయులకు 8:4,5,6 లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను.
అలాగే దైవాలుగా బిరుదు కలిగిన ప్రముఖులు/రాజులు కూడా ఉన్నారు. కానీ యెహోవా దేవునికీ వారికీ ఉన్న ప్రధానమైన వ్యత్యాసాలు ఏంటంటే;
"పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు"
ఈలోకంలో దేవతలుగా/దైవాలుగా పూజించబడుతున్న లేదా పిలవబడుతున్న ఎవరిలోనూ కూడా మన దేవునికి ఉన్న పరిశుద్ధత లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే పాపం చేసినవారిని శిక్షిస్తాడు, ఫరోనూ ఐగుప్తీయులనూ శిక్షించింది అందుకే. ఆయన పరిశుద్ధుడు కాబట్టే పాపం నుండి తన ప్రజలను వేరుచేసి రక్షిస్తాడు "నేను పరిశుద్ధుడను కనుక మీరునూ పరిశుద్ధులై యుండవలెను" అని తన ప్రజలకు ఆజ్ఞాపించింది అందుకే (లేవీకాండము 19:2).
"స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు"
మన దేవుడు సజీవుడిగా ఉన్నవాడై పరలోకంలో కోటానుకోట్ల దేవదూతల చేత నిత్యం పూజించబడుతున్నాడు (యెషయా 6:1-4). మోషే ఈ కీర్తన ద్వారా స్తుతించి పూజిస్తుంది కూడా ఆయననే.
"అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు"
కర్రను సర్పంగా మార్చడం దగ్గరనుండి, ఐగుప్తులో సంభవించిన పది తెగుళ్ళు, సముద్రం పాయలుగా చీల్చబడడం వంటి అద్భుతాలను చూసిన మోషే ఈమాటలు పలుకుతున్నాడు. యెహోవా దేవునికీ ఈలోకంలో ఉన్న దేవతలకూ ఉన్న మరో ప్రధానమైన వ్యత్యాసం ఇదే. ఆయన చేసినట్టుగా మరెవ్వడూ కూడా అద్భుతాలను చేసి తన ఉనికినీ శక్తినీ చాటుకోలేడు. అందుకే ఆయన ఐగుప్తుపైకి పది తెగుళ్ళను రప్పిస్తున్నప్పుడు ఐగుప్తీయుల దేవుళ్ళందరూ ఏమీ చెయ్యలేక శిలలుగానే ఉండిపోయారు. అందుకే మోషేతో పాటు ఇతరభక్తులు కూడా ఆయన గురించి ఏమంటున్నారో చూడండి.
నిర్గమకాండము 18: 11 ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్య మునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను.
కీర్తనల గ్రంథము 135:5,6 యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు నేనెరుగుదును. ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు.
1దినవృత్తాంతములు 16: 25,26 యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు.
నిర్గమకాండము 15:12
నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మింగివేసెను.
దక్షిణ హస్తం (కుడి చెయ్యి) అన్నప్పుడు అది దేవుని బలాన్ని సూచిస్తుంది (యెషయా 62:7). వాస్తవానికి ఐగుప్తీయుల సైన్యం సముద్రంలో మునిగిమాత్రమే చనిపోలేదు, ఆయన సముద్రాన్ని మూసివేస్తున్న సమయంలో భూకంపం కూడా కలిగింది (కీర్తనలు 77:18)
ఆ భూకంపంలో భూమి నెరలు విడిచినప్పుడు అందులో కూరుకుపోయి కూడా చాలామంది చనిపోయారు, ఆ విషయాన్నే ఇక్కడ మోషే ప్రస్తావిస్తున్నాడు.
నిర్గమకాండము 15:13
నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి.
ఈ వచనం నుండి మనకు కనిపించే కీర్తన అంతా, మోషే చేత భవిష్యత్తుకు సంబంధించి ప్రవచనాత్మకంగా పలుకబడుతుంది. అందుకే ఇశ్రాయేలీయుల ప్రజలు ఇంకా పరిశుద్ధాలయానికి నడిపించబడకముందే "నడిపించితివి" అని అది జరిగిపోయినట్టుగా ప్రస్తావించబడింది.
"నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి"
ఈమాటల్లో దేవుని కృపను బట్టే ఇశ్రాయేలీయులు విడిపించబడి పరిశుద్ధాలయంలో ప్రవేశించబోతున్నట్టు మనం చూస్తాం. మన రక్షణ విషయంలో కూడా ఇదే జరుగుతుంది, మనం ఆయన కృపను బట్టే రక్షించబడ్డాం (ఎఫెసీ 2:5)
ఆ కృపను బట్టే ఆయన బలాన్ని బట్టే లోకపాపం నుండి తప్పించుకుని పరలోకంలో ప్రవేశించబోతున్నాం.
2తిమోతికి 4: 18 ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్.
నిర్గమకాండము 15:14,15
జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవు దురు. భయము అధికభయము వారికి కలుగును.
ఈ వచనాలలో ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడుదల పొంది కనానుకు ప్రవేశించే క్రమంలో ఆ చుట్టుపక్కల రాజ్యాలైన ఫిలిష్తియులు, ఎదోమీయులు, మోయాబీయులు కనానులో నివసిస్తున్న కనానీయులు కలవరపడబోతున్నట్టు, అధికభయానికి గురవ్వబోతున్నట్టు మనం చూస్తాం. ఇక్కడ మోషే ప్రవచించినట్టుగానే ఆ ప్రజలంతా భయానికి లోనయ్యారు. ఎందుకంటే ఆయన ఐగుప్తులో చేసిన అద్భుతాలు, సముద్రాన్ని పాయలుగా చెయ్యడం వారందరికీ ప్రచారమైంది.
ద్వితీయోపదేశకాండము 2:4 శెయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవు చున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి.
సంఖ్యాకాండము 22:2,3 సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీ యులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి; మోయాబీయులు ఇశ్రాయేలీ యులకు జంకిరి.
యెహొషువ 2:9-11 యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశ మందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.
నిర్గమకాండము 15:16
యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు.
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశిస్తున్నప్పుడు వారి పగవారు అంతా ఎలా నిస్సహాయులుగా చేతకానివారిగా ఉంటారో తెలియచెయ్యబడడం మనం చూస్తాం. రాయి ఏ విధంగా అయితే చలనం లేకుండా ఉంటుందో అలానే వారు కూడా ఇశ్రాయేలీయుల విషయంలో ఏమీచెయ్యలేకుండా ఉంటారు.
నిర్గమకాండము 15:17,18
నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు.
ఈ వచనాలలో ఇశ్రాయేలీయులకు దేవాలయం నిర్మించబడకముందే మోషే దాని గురించి ప్రవచించడం మనం చూస్తాం. ఆయన నిరంతరం ఏలేవాడు కాబట్టి ఎటువంటి ఆటంకం లేకుండా తన ప్రజలను తాను కోరుకున్న చోట ప్రవేశపెట్టి వారిని స్థిరపరుస్తాడు.
కీర్తనలు 22: 28 రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే.
ఆయన సార్వభౌముడు కాబట్టి సర్వాధికారి కాబట్టి మన విషయంలో కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చుకుని పరలోకమనే పరిశుద్ధాలయంలో మనల్ని ప్రవేశపెడతాడు.
హెబ్రీయులకు 10: 23 వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.
1యోహాను 2: 25 నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము.
నిర్గమకాండము 15:19
ఫరో గుఱ్ఱములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిరి.
ఈ వచనంలో జరిగిన సంఘటనను మోషే మరలా జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. సముద్రం పాయలుగా చీల్చబడడం ఒక అద్భుతమైతే, నీరు గోడలుగా గడ్డకట్టడం మరో అద్భుతమైతే, ఆ గోడలమధ్యలోని నేల ఎటువంటి చెమ్మా, బురదా లేకుండా ఆరిపోవడం ఇంకో అద్భుతం. ఒకవేళ అలా జరగకపోతే ఇశ్రాయేలీయులు తమ పశువులతో పిల్లలతో నడవడం చాలా కష్టతరంగా ఉండేది.
నిర్గమకాండము 15:20
మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా-
ఈ వచనంలో మోషే అక్కయైన మిర్యాము (నిర్గమకాండము 2:4)
గురించి ప్రస్తావించబడడం మనం చూస్తాం. ఆమె మోషేకూ అహరోనుకూ సహోదరి అయినప్పటికీ మోషేతో కంటే అహరోనుతోనే గడిపిన కారణం చేత అహరోను సహోదరిగా ప్రస్తావించబడింది. అహరోను మోషే స్వంత అన్నదమ్ములు అయినప్పుడు (నిర్గమకాండము 6:20) ఆమె మోషేకు కూడా స్వంత అక్కనే. ఇక ఆమె ఈ వచనంలో ప్రవక్తినిగా పేర్కోబడింది. అహరోను ఏ విధంగా అయితే మోషేతో దేవుడు పలికిన మాటలు ప్రజలకు చేరవేస్తూ ప్రవక్తగా గుర్తించబడ్డాడో (నిర్గమకాండము 7:1) మిర్యాము కూడా మోషే మాటలను ప్రజలకు (ముఖ్యంగా స్త్రీలకు) ప్రకటిస్తూ ప్రవక్తినిగా గుర్తించబడింది. అదేవిధంగా దేవుడు ఆమె ద్వారా కూడా కొన్ని మాటలు పలికించాడు, ఆ విషయం ఆమె మోషేను నిందించేటప్పుడు (సంఖ్యాకాండము 12:2). మీకా గ్రంథంలో కూడా మనకు స్పష్టమౌతుంది.
మీకా 6: 4 ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించితిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని.
ఈవిధంగా మిర్యాము ప్రవక్తిని. అయితే ఈమె కానీ, అహరోను కానీ మోషేవంటి ప్రవక్తలు కాదు, ఆ విషయం స్వయంగా దేవుడే తెలియచేసిన మాటలు చూడండి.
సంఖ్యాకాండము 12:2-8 వారు మోషే చేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకు డైన మోషే అట్టివాడుకాడు. అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధ ముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను.
నిర్గమకాండము 15:21
మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.
ఈ వచనంలో మిర్యాము మోషే పాడుతున్న పాటలో పల్లవిని (ప్రారంభమాటలు) ఎత్తి పాడడం మనం చూస్తాం. యూదుల పాటల్లో ఇది సాధారణంగా మనకు కనిపిస్తుంది. వారు ఒకరు పాడుతున్న పాటలో పల్లవిని ఎత్తి మరలా పాడుతుంటారు.
నిర్గమకాండము 15:22
మోషే ఎఱ్ఱ సముద్రమునుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచిరి; అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి.
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు ఎఱ్ఱ సముద్రం దాటాక షూరు అరణ్యంలో ప్రవేశించినట్టు మనం చూస్తాం. సంఖ్యాకాండము 33:8 లో ఈ అరణ్యాన్ని ఏతాము అని ప్రస్తావించడం జరిగింది. దీనికారణంగా కొందరు, ఇశ్రాయేలీయులు అసలు సముద్రాన్నే దాటలేదని వారు యే ఏతాము నుండైతే సముద్రం వైపు ప్రయాణమయ్యారో (నిర్గమకాండము 13:20)
తిరిగి అక్కడికే చేరుకున్నారని వాదిస్తుంటారు. కానీ ఇశ్రాయేలీయులు ఏతాము నుండి ప్రయాణం చేసి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రాన్ని దాటారు. ఆ సముద్రాన్ని దాటాక ఏతాము అనే పేరుతోనే ఉన్న అరణ్యంలో ప్రయాణం చేసారు. సముద్రానికి అవతల ఉన్న అరణ్యానికీ ఇవతల ఉన్న అరణ్యానికీ ఏతాము అనే ఒకటే పేరు ఉండింది.
నిర్గమకాండము 15:23,24
మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలుమేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా-
ఈ వచనాలలో చేదైన మారా నీళ్ళను బట్టి ఇశ్రాయేలీయులు రెండవ సారి దేవునిపై తిరుగుబాటు చెయ్యడం మనం చూస్తాం. నిజానికి వారు అక్కడ చెయ్యవలసింది సణుగుకోవడం కాదు, సహాయం చెయ్యమని ప్రార్థన చెయ్యాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మరచిపోకూడదు, దేవుడు నడిపిస్తున్న మార్గంలో మనకు తప్పకుండా మారావంటి అనుభవాలు (శ్రమలు) ఎదురౌతూనే ఉంటాయి (యోహాను 16:33). అలాంటి సమయంలో ఇశ్రాయేలీయుల్లా సణుగుకోకుండా ప్రార్థన చెయ్యాలి.
ఫిలిప్పీయులకు 4:6 దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
నిర్గమకాండము 15:25,26
అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.
ఇశ్రాయేలీయులు తమకు సంభవించిన శ్రమ (చేదైననీరు) ను బట్టి దేవునిపై మోషేపై సణుగుకుంటే మోషే మాత్రం వారితో కలపి దేవునిపై సణుగుకోకుండా ఆ శ్రమను బట్టి ఆయనకు ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం. దైవజనుడు ఈవిధంగా ప్రజల తిరుగుబాటులో పాలివాడు కాకుండా సరైన పరిష్కారాన్ని ఆశ్రయించేవాడిగా ఉండాలి. ఇక మోషే ప్రార్థన విన్న దేవుడు ఒక చెట్టును చూపించినట్టు ఆ చెట్టును మారా నీటిలో వేసినప్పుడు ఆ నీరు మధురంగా మారినట్టు మనం చూస్తున్నాం. వాస్తవానికి ఆ చెట్టులో ఆ నీటిని మధురంగా మార్చే గుణమేమీ లేదు. దానికి ప్రతిగా జోనాథాన్ టార్గంలో ఆ చెట్టు మరింత చేదును కలిగించేదని రాయబడింది, అదే నిజమైన చేదైన చెట్టు ద్వారా చేదైన నీటిని మధురంగా మార్చడం మరింత అద్భుతం. ఇంతకూ దేవుడు ఆ చెట్టును నీటిలో ఎందుకు వెయ్యమన్నాడంటే; కొన్నిసార్లు దేవుడు అద్భుతాలను చేస్తున్నప్పుడు భక్తులను ఈవిధంగా చెయ్యమనడం మనం గమనిస్తాం. ఉదాహరణకు; ఏలీయా నీటిలో ఉప్పును వేసి ఆ నీటిని మంచినీరుగా మార్చాడు (2రాజులు 2:19-22)
. ఎలీషా ఒక చెట్టుకొమ్మను నీటిలో వేయించి గొడ్డలి పైకి తేలేలా చేసాడు (2రాజులు 6:5-7). వాస్తవానికి ఆ ఉప్పులో కానీ, చెట్టు కొమ్మలో కానీ ఏమీ లేదుకానీ, ఏ శక్తీ లేనివాటి ద్వారా కూడా దేవుడు అద్భుతాలను జరిగించగలడని రుజువు చెయ్యడానికే అవి సాధానాలుగా ఉపయోగించబడ్డాయి.
నిర్గమకాండము 15:27
తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి.
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు మారా నుండి ఏలీముకు వచ్చినట్టు అక్కడ వారికి మంచినీరు, ఈతపళ్ళు లభించినట్టు మనం చూస్తాం. దీనినిబట్టి మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి, దేవుడు మనల్ని నడిపిస్తున్న మార్గంలో మారావంటి చేదైన అనుభవాలు (శ్రమలు) ఉంటాయి, ఏలీము వంటి తియ్యనైన (సంతోషకరమైన) అనుభవాలు కూడా ఉంటాయి. చేదైన అనుభవాలలో సణుగుకోకుండా ప్రార్థన చెయ్యాలి, సంతోషకరమైన అనుభవాలలో దేవుణ్ణి మరచిపోకుండా ఆయనను స్తుతించాలి.
యాకోబు 5: 13 మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయము 15
విషయసూచిక;15:1, 15:2, 15:3,4 , 15:5, 15:6,7 , 15:8 , 15:9 , 15:10 , 15:11 , 15:12 , 15:13 , 15:14,15, 15:16 , 15:17,18 ,15:19 , 15:20 , 15:21 , 15:22 , 15:23,24 , 15:25,26 , 15:27.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.