పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 28:1, 28:2, 28:3 , 28:4, 28:5-8 , 28:9-11 ,28:12 , 28:13-28 , 28:29 , 28:30 , 28:31 , 28:32 , 28:33-35 , 28:36,37 , 28:38 , 28:39 , 28:40 , 28:41 , 28:42,43.

 నిర్గమకాండము 28:1

మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము.

గత అధ్యాయాలలో సమాజమందిర నిర్మాణం, అందులో ఉండవలసిన వస్తువుల తయారీ గురించి మనం చూసాం. ఆ సమాజమందిరంలో సేవ చేసే యాజక వ్యవస్థను, వారి వస్త్రధారణను ఈ అధ్యాయంలో మనం చూస్తాం. నిర్గమకాండము 19:6 ప్రకారం ఇశ్రాయేలీయులు ఈ భూమిలో ఉన్న ప్రజలందరిలోనూ ఆయనకు యాజకులుగా ఉన్నారు. అయితే ఆ ఇశ్రాయేలీయుల్లో లేవీ గోత్రానికి చెందిన అహరోను వంశం మాత్రమే యాజకులుగా ప్రతిష్టించబడింది. "నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము" అంటే వారిని ఆయన సేవకోసం ప్రజల్లో నుండి ప్రత్యేకించమని అర్థం. ఇది జరగడానికి ముందు ప్రజల్లోని కుటుంబపెద్దలే యోబులా ఆయనకు బలులను అర్పించేవారు. ఇకనుండి మాత్రం అహరోను వంశంవారే ఆ పని చెయ్యాలి. ఇది అహరోను వంశం వారికి ఆయన అప్పగిస్తున్నటువంటి ఉన్నతమైన బాధ్యత. ఎందుకంటే ఇకపై ఆ వంశంవారు మాత్రమే ఇశ్రాయేలీల జాతికి దేవుని ప్రతినిధులుగా వ్యవహరించబోతున్నారు. ఈ ఘనత కేవలం దేవుని కృప మూలంగానే అహరోను వంశానికి కలిగింది.

హెబ్రీయులకు 5:4 - మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనత పొందును.

మొదటినుండీ అహరోను మోషేకు సహకారిగా ఉన్నాడు. మోషేతో పాటుగా ప్రజల నుండి‌ ఎంతో విముఖతను ఎదుర్కొన్నాడు, అయినప్పటికీ అతను ఇంతవరకూ ఎలాంటి ఘనత కోసం ఆరాటపడలేదు. అందుకే ఇప్పుడు దేవుడు అతనికి ఊహించని ఘనతను కలుగచేస్తున్నాడు. "మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు" (హెబ్రీ 6:10) అంటే ఇదే. మనం కూడా ఆయన సేవలో సహకారులుగా పాటుపడినప్పుడు, ఆయన సేవకులతో కలసి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు, అయినప్పటికీ ఎలాంటి ఘనతనూ ఆశించకుండా "హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గువాటియందే ఆసక్తులైయున్నప్పుడు" (రోమా 12:16) అహరోనులానే ఘనపరచబడతాం, ఉన్నతంగా దీవించబడతాం.

ఇక్కడ మనం గమనించవలసిన మరోవిషయం ఏంటంటే, ఇప్పటివరకూ మోషే దేవుని ప్రతినిధిగా వ్యవహరించాడు. ఇప్పుడు ఆ స్థానం అహరోను వంశానికి అప్పగించబడుతుంది. ఇందులో‌ మోషే కుమారులకు (వంశానికి) ఎలాంటి పాలుపొంపులూ ఉండవు, వారు మిగిలిన లేవీయులతో పాటు సాధారణ లేవీయులుగా కొనసాగవలసిందే. ధర్మశాస్త్ర చరిత్ర మోషే కల్పించింది కాదు, ఇది పూర్తిగా దేవుని కార్యం (నిర్ణయం) అనడానికి ఇదొక మంచి నిదర్శనం. ఒకవేళ ఈ చరిత్రనూ ఈ యాజక వ్యవస్థనూ మోషేనే కల్పించియుంటే ఇశ్రాయేలీయుల్లో తరతరాలు పాటు తన వంశమే ఘనపరచబడే విధంగా అతను తన‌ కుమారులనే యాజకులుగా ప్రతిష్టించేవాడు. కానీ అలా చెయ్యలేదు. కాబట్టి ఇది పూర్తిగా దేవుని కార్యం (నిర్ణయం). అలాగే మనం ఇక్కడ మోషే యొక్క ఉన్నతమైన స్వభావాన్ని కూడా గమనిస్తాం. అతను ఇంతకాలం దేవుని ప్రతినిధిగా ఎన్నో కష్టాలను భరిస్తూ వ్యవహరించినప్పటికీ, ఘనమైన యాజకత్వం తన వంశానికి కాకుండా అహరోను‌ వంశానికి నిర్ణయించబడడాన్ని బట్టి ఎలాంటి అసంతృప్తినీ వ్యక్తం చెయ్యడం లేదు. ఆ దేవుని నిర్ణయానికి మనస్ఫూర్తిగా లోబడుతూ అహరోనునూ అతని కుమారులనూ సేవకోసం ప్రతిష్టిస్తున్నాడు. ఎందుకంటే దేవుని నిర్ణయమే సరైనదని, న్యాయమైనదని అతను విశ్వసించాడు. కాబట్టి మనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడే ఇలాంటి నమ్మకమైన స్వభావాన్ని సేవకులుగా, విశ్వాసులుగా మనమందరం అలవరచుకోవాలి.

ప్రాముఖ్యంగా, ఈ యాజకవ్యవస్థ అనేది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఏర్పాటు చెయ్యబడింది. మానవమాత్రుడైన అహరోను ప్రజల పాపాలకు జంతువుల రక్తంతో పరిహారం చెల్లిస్తే, దైవమానవుడైన యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తంతో ప్రజల పాపాలకు పరిహారం చెల్లించాడు. ఈ విషయం‌ మనం హెబ్రీ 8,9,10 అధ్యాయాలలో వివరంగా చదువుతాం. అదేవిధంగా యేసుక్రీస్తును బట్టి మనం కూడా దేవునికి యాజకులుగా ప్రతిష్టించబడ్డాం (1 పేతురు 2:9). కాబట్టి మనం కూడా అహరోనువలే దేవునికి నమ్మకంగా సేవ చెయ్యాలి. ఆయన శ్రేష్టమైన గుణాతిశయాలను లోకానికి మన నోటిద్వారా, మన ప్రవర్తన ద్వారా ప్రకటించడమే ఆయనకు మనం చెయ్యవలసిన నమ్మకమైన సేవ.

నిర్గమకాండము 28:2
అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.

ఈ వచనంలో దేవుడు ప్రధానయాజకుడైన అహరోనుకు ప్రతిష్టిత వస్త్రాలను కుట్టమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ప్రతిష్టిత వస్త్రాలు అంటే, ప్రత్యేకించబడిన వస్త్రాలు అని అర్థం. అతను పరిశుద్ధుడైన దేవునికి ప్రధానయాజకుడు కాబట్టి అతని వస్త్రాలు సాధారణ ప్రజలు ధరించే వస్త్రాలకంటే ఎంతో హుందాగా పరిశుభ్రంగా ఉండాలి. ఆ కాలపు కొన్ని దేవాలయాల్లో పూజలు చేసేవారు నగ్నంగా ఉండేవారంట. దానికి విరుద్ధంగా కూడా ప్రభువు ఈవిధంగా ఆజ్ఞాపిస్తున్నాడని కొందరు అభిప్రాయపడ్డారు. లేఖనం స్పష్టంగా చెప్పేదాని ప్రకారమైతే "అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు" ప్రతిష్టిత వస్త్రాలు కుట్టాలి. తనసేవ నిమిత్తం యాజకునిగా పిలవడం ద్వారా దేవుడు అహరోనును ఘనపరిస్తే, ఆ ఘనతకు తగినట్టుగా ఆ వస్త్రాలు ఉండాలి. ఈ యాజకత్వం అనేది యేసుక్రీస్తు యాజకత్వానికి సాదృశ్యంగా ఉందని ఇప్పటికే నేను హెబ్రీ 8,9,10 అధ్యాయాల ఆధారంగా తెలియచేసాను. కాబట్టి ఈ ప్రతిష్టిత వస్త్రాలు యేసుక్రీస్తు యొక్క మచ్చలేని పరిశుద్ధస్వభావానికి (హెబ్రీ 7:26) ఛాయగా ఉన్నాయి. ప్రకటన గ్రంథపు ప్రత్యక్షతల్లో ఆయన యాజకవస్త్రాలు ధరించినవాడిగా మనకు కనిపిస్తాడు (ప్రకటన 1:13).

అదేవిధంగా యేసుక్రీస్తును బట్టి మనం కూడా యాజకసమూహంగా సంబోధించబడ్డాము (1 పేతురు 2:9), లోకం నుండి ఆయన సేవ కోసం ప్రత్యేకించబడ్డాము. కాబట్టి మనం కూడా ఘనమైన ప్రతిష్టిత వస్త్రాలు ధరించి ఆయన సేవ చెయ్యాలి. నీతి క్రియలే ఆ వస్త్రాలు (ప్రకటన 19:8). అహరోను ఏవిధంగానైతే ఆ ప్రతిష్టిత వస్త్రాలను ధరించకుండా ప్రత్యక్షగుడారంలో పరిచర్య చెయ్యలేడో, కనీసం అందులోకి ప్రవేశించను కూడా ప్రవేశించలేడో అలానే మనం కూడా నీతిక్రియలను ధరించకుండా ఆయన పరిచర్య చెయ్యలేం, ఆయన సన్నిధిలోకి ప్రవేశించలేం. ధర్మశాస్త్రంలోని బాహ్య ఆచారాలు, యాజక వస్త్రధారణలు మన అంతరంగ పరిశుద్ధతకు ఛాయగా ఉన్నాయని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను.

ఇక నిర్గమకాండము 19:6 ప్రకారం, ఇశ్రాయేలీయులందరూ దేవునికి యాజకులే. కానీ ఆ ఇశ్రాయేలీయుల్లో లేవీ గోత్రానికి చెందిన అహరోను వంశం నిరంతరం దేవుని సేవ చేసేలా ప్రత్యేకమైన యాజకత్వం కలిగియుంది. వారిని ఇశ్రాయేలీయులు ప్రతిష్టిత వస్త్రాలతో, దశమ భాగాలతో ఘనపరచాలి. అదేవిధంగా 1 పేతురు 2:9 ప్రకారం విశ్వాసులందరూ ఆయన యాజకులే. కానీ సంఘంలో పరిచర్య చేసేవారు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగియున్నారు. కాబట్టి సంఘమంతా వారికి లోబడుతూ, వారి కష్టానికి తగిన కానుకలను చెల్లిస్తూ వారిని సన్మానించాలి‌.

1తిమోతికి 5:17,18 - బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి (కళ్ళము త్రొక్కుచున్న)యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది.

గలతీయులకు 6:6 - వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను.

హెబ్రీయులకు 13:17 - మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.

అయితే సంఘపరిచర్యకు ప్రత్యేకించబడినవారు అహరోను ధరించిన ఘనమైన వస్త్రాలవలే ఘనమైన నీతి క్రియలను కలిగియుండడం తప్పనిసరి. అందుకే పౌలు సంఘపెద్దగా నియమించబడేవారికి ఎలాంటి అర్హతలు ఉండాలో స్పష్టంగా వివరిస్తున్నాడు (1 తిమోతీ 3). పెద్దలకే కాదు ఇతర పరిచర్యలు చేసేవారికి కూడా ఈ అర్హతలు ఉండి తీరాలి. కొందరు ఈ అర్హతలను (క్రియలను) పక్కనపెట్టి, ప్రత్యేకమైన వస్త్రధారణను బట్టి పెద్దలుగా, పరిచారకులుగా చలామణి ఔతున్నారు. ఉదాహరణకు తెల్లని వస్త్రాలు, నడుముకు తాడు. అలాంటివారు నూతన నిబంధనలో వస్త్రధారణకు ప్రాముఖ్యత ఇవ్వబడలేదని, యాజకవస్త్రాలు మన నీతి క్రియలకు మాత్రమే సాదృశ్యంగా ఉన్నాయని గమనించాలి.

నిర్గమకాండము 28:3
అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేకహృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.

ఈ వచనంలో మొదటిగా దేవుడు అహరోనును యాజకుడిగా ప్రతిష్టించమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. యాజకుడిగా అంటే ప్రధానయాజకుడిగా అని అర్థం. అహరోను కుమారులు యాజకులైతే అహరోను మాత్రం వారందరిపై ప్రధానయాజకుడుగా ప్రతిష్టించబడుతున్నాడు. ఆ ప్రధానయాజకుడు మాత్రమే అతిపరిశుద్ధస్థలంలోకి, అది కూడా సంవత్సరానికి ఒక్కసారే ప్రవేశించే అర్హతను కలిగియుంటాడు (హెబ్రీ 9:7). ప్రతీతరంలోనూ ఈవిధంగానే జరుగుతుంది.

"అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేకహృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము"

ప్రత్యక్ష గుడార సంబంధమైన వస్తువులనూ, యాజకులకు వస్త్రాలనూ తయారుచెయ్యడానికి దేవుడు బెసలేలు మరియు అహోలీయాబు అనే ఇద్దరు వ్యక్తులను జ్ఞానాత్మతో నింపినట్టు నిర్గమకాండము 31:1-11 వచనాలలో మనం చదువుతాం. సహజంగా చెయ్యగలిగిన పనులు అందరూ చెయ్యగలరు కానీ, ప్రత్యక్షగుడారపు వస్తువులు, యాజకుల వస్త్రాలు అనేవి సంక్లిష్టంగా తయారు చెయ్యవలసినవి కాబట్టి, వాటి తయారీ కోసం దేవుడే ఆ ఇద్దరు వ్యక్తులనూ జ్ఞానాత్మతో నింపవలసి వచ్చింది. ఈరోజుకు కూడా మన సంఘానికీ, సమాజానికీ అవసరమైన వాటినెన్నో మనుషులు కనిపెట్టి తయారుచేస్తున్నారంటే దానంతటికీ దేవుడు వారిని జ్ఞానాత్మతో నింపడమే కారణం.

యాకోబు 1:17 - శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్ద నుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు.

యెషయా 28:26 - వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు.

యోబు 35:11 - భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగ జేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అను కొనువారెవరును లేరు.

ఆయన జ్ఞానాత్మ మనుషులకు కేవలం ఆధ్యాత్మిక సంబంధమైనవాటినీ, నైతికపరమైన వాటినే కాకుండా మానవ ప్రగతికి సంబంధించిన విషయాలను కూడా కాలానుగుణంగా నేర్పిస్తుంది. అందుకే మనిషి అదే దేవుని జ్ఞానం చేత సృష్టించబడిన (సామెతలు 8) పకృతిని ఆధారం చేసుకుని తరతరాలుగా ఎన్నో కనిపెడుతున్నాడు, సంక్లిష్టమైన వాటినెన్నో తయారు చేస్తున్నాడు. అంతటికీ మూలం ఈ ప్రకృతే. ఈ ప్రకృతిని కలిగించిన అదే జ్ఞానాన్ని దేవుడు మనిషిలో నింపడం వల్ల అది సాధ్యమౌతుంది. కాబట్టి ఇలాంటి జ్ఞానవంతమైన తలాంతులు కలిగినవారు తమకు ఆ జ్ఞానం ఎలా లభించిందో ఆలోచించుకుని జ్ఞానానికి మూలమైన దేవునియొద్దకు రావాలి. తమ జ్ఞానాన్ని మొదటిగా సంఘానికీ, తరువాత సమాజానికీ ప్రయోజనకరంగా వినియోగించాలి.

నిర్గమకాండము 28:4
పతకము ఏఫోదు నిలువుటంగీ విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడైయుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.

ఈ వచనంలో ప్రధాన యాజకుడైన అహరోనుకూ మరియు యాజకులైన అతని కుమారులకూ కుట్టువలసిన ప్రత్యేక వస్త్రాల గురించి దేవుడు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. సాధారణ యాజకుల వస్త్రాల కంటే ప్రధానయాజకుడి వస్త్రాలు ఘనుడైన దేవునికి తగినట్టుగా ఘనంగా ఉంటాయి. ఆ వివరణ మనకు క్రింది వచనాల నుండి కనిపిస్తుంది.

నిర్గమకాండము 28:5-8
వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననారను తీసికొని బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్ర కారునిపనిగా చేయవలెను. రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడియుండును. మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.

ఈ వచనంలో ప్రధానయాజకుడైన అహరోనుకు ధరించవలసిన ఏఫోదు గురించి మనం చూస్తాం.‌ ఈ ఏఫోదు సన్నపునార వస్త్రంపై రెండు భుజాలనూ కప్పుతూ చాతికి‌ కొంచెం క్రింది వరకూ (సుమారుగా బొడ్డు వరకూ) బంగారంతోనూ నీలధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను చెయ్యబడుతుంది. నీలధూమ్ర రక్తవర్ణములుగల నూలు అంటే నీలం, ఊదా, ఎరుపు రంగుల ధారాలు అని అర్థం. ఈ ఏఫోదును ఇంచుమించుగా మనం షర్ట్ పై ధరించే జాకెట్ తో పోల్చి ఊహించుకోవచ్చు. కాదంటే ఇది మన జాకెట్ లా చేతులవరకూ, నడుం వరకూ ఉండదు. అదేవిధంగా, సాధారణ యాజకులకు కూడా ఏఫోదు ఉంటుంది (1 సమూయేలు 2:18, 22:18) కానీ అది ప్రధానయాజకుడి ఏఫోదులా బంగారంతో కాకుండా కేవలం సన్నపునారతో మాత్రమే తయారు చెయ్యబడుతుంది. దానిని యాజకులు మాత్రమే కాకుండా రాజైన దావీదు కూడా ధరించి నాట్యమాడినట్టు 2 సమూయేలు 6:14 లో మనం చదువుతాం. కాబట్టి ప్రధానయాజకుడి బంగారు ఏఫోదు ప్రత్యేకమైనది. బంగారం దేవుని పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది కాబట్టి, ఆ పరిశుద్ధుడైన దేవుని ప్రధానయాజకుడు మాత్రమే బంగారు ఏఫోదును ధరిస్తాడు. ఆ బంగారు ఏఫోదుపై బంగారు దట్టీ కూడా ఏకమైయుంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రకటనగ్రంథ ప్రత్యక్షల్లో ఈ ఏఫోదును ధరించుకున్నవాడిగానే మనం ఆయనను చూస్తాం.

ప్రకటన గ్రంథము 1:13 - ..తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.

కాబట్టి ఆయనద్వారా యాజకులుగా పిలవబడిన మనం కూడా (1 పేతురు 2:8) బంగారంతో పోల్చబడిన ఆయన పరిశుద్ధ స్వభావాన్ని ధరించుకోవాలి, ఆ స్వభావానికి తగినట్టుగా నడుచుకోవాలి.

ఎఫెసీయులకు 4:22-24 - కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.

అహరోనును ఆయన యాజకుడిగా పిలిచాడు. అతను ఎలాంటి వస్త్రాలను ధరించాడో వివరించాడు. ఇప్పుడు ఆ వస్త్రాలను ధరించడం అతని బాధ్యత. అలానే రక్షణలో కూడా ఆయన పరిశుద్ధస్వభావాన్ని ధరించుకోవడం మన బాధ్యతగానే ఉంటుంది.

నిర్గమకాండము 28:9-11
మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.

ఈ వచనాలలో దేవుడు రెండు లేతపచ్చలను తీసుకుని వాటిపై ఇశ్రాయేలీయుల పేర్లను రాయమనడం మనం చూస్తాం. లేతపచ్చలు అంటే వేరువేరు రంగులు కలగలసిన రత్నాలు అని అర్థం. అలాంటి రెండు రత్నాలపై ఇశ్రాయేలు గోత్రకర్తల పన్నెండుమంది పేర్లనూ రూబేను నుండి బెన్యామీను వరకూ వారు పుట్టిన వరుసక్రమాన్ని బట్టి ఒకదానిపై ఆరుగురి పేర్లు మరోదానిపై ఆరుగురు పేర్లను చెక్కాలి. అలా చెక్కబడిన రత్నాలను బంగారు జవలలో (అంచుల్లో) పొదిగించాలి.

నిర్గమకాండము 28:12
అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును.

ఈ వచనంలో ఇశ్రాయేలీయుల పేర్లు చెక్కబడిన రెండు రత్నాలనూ ప్రధానయాజకుడి ఏఫోదు భుజాలపై ఉంచాలని మనం చూస్తాం. ఈవిధంగా ప్రధానయాజకుడు ఆ ఇశ్రాయేలీయుల పేర్లను తనపై భరిస్తూ దేవునిసన్నిధిలోకి తీసుకువెళ్ళి ఆయనకూ ఆ ప్రజలకూ ఉన్న నిబంధనను జ్ఞాపకం (గుర్తు) చేస్తుంటాడు. ఎలాగైతే ఆయన వర్షం వచ్చేటప్పుడు మేఘంలో కనిపించే ధనస్సును చూసి నోవహుతో చెయ్యబడిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడో, అలానే ప్రధానయాజకుడి భుజాలపై ఉన్న ఇశ్రాయేలీయుల పేర్లను బట్టి వారితో చెయ్యబడిన నిబంధననూ జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ జ్ఞాపకం అనేమాట మానవభాషలో చెప్పబడిందని మనం అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం (నిబంధన) జరిగేటప్పుడు దానికి‌ వారు ఒక గుర్తును పెట్టుకోవడం ఆనవాయితీ. ఇక్కడ దేవుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ, ఇశ్రాయేలీయులతో చెయ్యబడిన తన‌ నిబంధనకు గుర్తుగా ఆ రత్నాలను ప్రవేశపెట్టాడు. ఆ విధంగా ప్రధానయాజకుడి ఏఫోదు భుజాలపై ఉన్న ఆ రెండు రత్నాలు దేవునికీ, ఇశ్రాయేలీయులకూ మధ్య ఏర్పడిన నిబంధనకు జ్ఞాపకంగా (గుర్తుగా) ఉంటాయి.

ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. ప్రధానయాజకుడు ఎవరి పేర్లనైతే తన భుజాలపై భరిస్తున్నాడో ఆ ఇశ్రాయేలీయులు మాత్రమే నిబంధన ప్రజలు. ఆ నిబంధనలో ఏ అన్యుడికీ పాలుపొంపులు ఉండవు. ప్రధానయాజకుడు తన భుజాలపై భరిస్తున్న ఇశ్రాయేలీయులకోసమే ప్రత్యక్షగుడారంలో విజ్ఞాపన చేస్తాడు, వారి పాపాలకే బలులను అర్పించి ప్రాయశ్చిత్తం చేస్తుంటాడు. మన ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇంతే. ఆయన తన నిబంధన ప్రజలకోసం మాత్రమే దేవునికి‌ విజ్ఞాపన చేస్తుంటాడు, తన సిలువ రక్తంతో వారి పాపాలకు మాత్రమే ప్రాయశ్చిత్తం చేస్తాడు.

హెబ్రీయులకు 7:25 - ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.

కొందరు అపార్థం చేసుకుంటున్నట్టుగా ఆయన అందరి కోసమూ ప్రాణం పెట్టలేదు, అందుకే అందరి కోసమూ విజ్ఞాపన కూడా చెయ్యడు. దేవుని నిర్ణయంలో ఉన్న నిబంధన ప్రజల కోసం మాత్రమే ఆయన ప్రాణం పెట్టాడు. ప్రస్తుతం వారి కోసం మాత్రమే విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే ఆయన ఈలోకం‌లో ఉన్నప్పుడు కూడా "నేను ఈలోకం‌ కొరకు ప్రార్థించుట లేదు" అంటూ తన నిబంధన ప్రజలను ఈ లోకం నుండి ప్రత్యేకించి, వారి కోసం‌ మాత్రమే ప్రార్థించాడు.

యోహాను సువార్త 17:9,21 - నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించియున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.

ఈ అంశాన్ని మరింత వివరంగా చదవడానికీ, అభ్యంతరాలకు సమాధానం తెలుసుకోవడానికీ ఈ వ్యాసం చదవండి.

రక్షణ యెహోవాదే

https://hithabodha.com/books/salvation/256-divine-predestination-in-salvation.html

నిర్గమకాండము 28:13-28
మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను; సూత్రములవలె అల్లికపనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలెను. ఏఫోదుపనివలె దాని చేయవలెను; బంగారు తోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలు తోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలదై యుండవలెను. దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్న ముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములుగల పంక్తి మొదటిది; పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది; గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములుగల పంక్తి మూడవది; రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరులచొప్పున పండ్రెండుండవలెను. ముద్రమీద చెక్కినవాటివలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను.

మరియు ఆ పతకము అల్లికపనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజముల మీద కట్టవలెను. మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను. మరియు నీవు రెండు బంగారు ఉంగర ములుచేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పు నొద్ద, దాని యెదుటి ప్రక్కకు దిగువను, ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదునుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను.

ఈ వచనాలలో బంగారు ఏఫోదుపైన అమర్చవలసిన న్యాయవిధాన పతకం గురించి మనం చూస్తాం. దీనిని ఏఫోదులానే బంగారంతోనూ, నీలం, ఊదా, ఎర్రరంగుల దారాలతోనూ చేసి మడతపెట్టాలి. అలా మడతపెట్టబడిన ఆ పతకం క్రింద మరియు ఇరువైపులా బంగారు అంచుతో మూయబడుతుంది. అది మొత్తం జేన పొడవు, జేన వెడల్పుగా ఉంటుంది. దాని పై‌ భాగం మాత్రం చిన్న సంచివలే తెరవబడేలా ఉంటుంది. అందులోనే ఊరీము, తుమ్మీము ఉంచుతారు.

ఇక ఈ పతకంపైన నాలుగు వరసలుగా మూడేసి చొప్పున మొత్తం 12 రత్నాలు బంగారు అంచులతో అమర్చబడతాయి. ఆ 12 రత్నాలపైనా పన్నెండుమంది ఇశ్రాయేలీయుల గోత్రకర్తల పేర్లు చెక్కబడతాయి. ఇలా నాలుగు వరసల్లో మూడేసి చొప్పున అమర్చబడిన రత్నాలపై ఏ క్రమంలో, ఏ రత్నంపై ఎవరి పేరు రాయబడిందో మనకు వివరించబడలేదు. అయితే ఆడాం క్లార్క్ గారు యూదుల రచనలద్వారా ఆ వివరాలను మనకు తెలియచేసారు. వాటిని పరిశీలించినప్పుడు ఏఫోదు భుజాలపై అమర్చబడిన రెండు రత్నాలపై చెక్కబడినవిధంగానే ఈ పతకపు రత్నాలపై కూడా ఆ గోత్రకర్తల పేర్లను వారి జననక్రమం చొప్పున చెక్కారని అర్థమైంది. మొదటి వరసలోని మూడు రత్నాలపై రూబేను-షిమ్యోను-లేవీల పేర్లు చెక్కబడ్డాయి. రెండవ వరసలోని మూడు రత్నాలపై యూదా-ఇశ్శాఖారు-జెబులూనుల పేర్లు చెక్కబడ్డాయి. మూడవ వసరలోని మూడు రత్నాలపై దాను-నఫ్తాలి-గాదుల పేర్లు చెక్కబడ్డాయి. నాలుగవ వరసలోని రత్నాలపై ఆషేరు-యోసేపు-బెన్యామీనుల పేర్లు చెక్కబడ్డాయి.

చివరిగా ఆ పతకానికి పైన ఇరువైపులా రెండు‌ బంగారు ఉంగరాలు చేసి బంగారు గొలుసుల ద్వారా ఏఫోదు భుజాలకు దానిని నీలిధారంతో కడతారు. ప్రజలు ప్రధానయాజకుడిని చూసినప్పుడు ఏఫోదుపై ఉన్న ఈ పతకం, దానిపై ఉన్న 12 రత్నాలూ వారికి మెరుస్తూ కనిపిస్తాయి.

నిర్గమకాండము 28:29
అట్లు అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్లునప్పుడు అతడు తన రొమ్ముమీద న్యాయవిధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను.

ఈ వచనంలో ఆ పతకపు ఉద్దేశాన్ని మనం చూస్తాం. నేను 12వ వచనంలో వివరించినట్టుగా ఈ పతకపు రత్నాలు కూడా దేవునికీ ఇశ్రాయేలీయులకూ మధ్య జరిగిన నిబంధనకు జ్ఞాపకార్థంగా ఉంటాయి. ప్రధానయాజకుడు తప్పనిసరిగా ఆ పతకాన్ని ధరించే ఆయన సన్నిధిలో ప్రవేశించాలి. ఆవిధంగా ఏఫోదు ధరించిన అతని రొమ్ముపై కనిపించే ఈ పతకం దేవునికీ ఇశ్రాయేలీయులకూ మధ్య జరిగిన నిబంధనకు గుర్తుగా ఉంటుంది. ప్రస్తుతం దేవునికీ మనకూ జరిగిన నిబంధనకు కూడా ఒక జ్ఞాపకార్థం‌ నియమించబడింది. అదే ప్రభువు బల్ల. కాబట్టి ఆయన రక్తం వలన నిబంధనప్రజలుగా మారిన మనమంతా దానికి జ్ఞాపకార్థమైన ప్రభువు బల్లలో యోగ్యులుగా పాల్గోవాలి.

లూకా 22:19,20 - పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చిఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొనిఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన.

నిర్గమకాండము 28:30
మరియు నీవు న్యాయవిధాన పతకములో ఊరీము తుమ్మీము అనువాటిని ఉంచ వలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును.

ఈ వచనంలో ఊరీము, తుమ్మీమము అనేవాటి గురించి మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల న్యాయవ్యవస్థలో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే ఇవి ఉంచబడే పతకాన్ని న్యాయవిధాన పతకం అని పిలుస్తున్నారు. వీటి ద్వారా దేవుడు తన నిర్ణయాన్ని (తీర్పులను) ప్రధానయాజకుడికి తెలియచేసేవాడు (సంఖ్యాకాండము 27:21). ఇశ్రాయేలీయుల్లో న్యాయాధిపతులు పరిష్కరించలేని వివాదాలను ఈ ఊరీము, తుమ్మీమము ద్వారా ప్రధానయాజకుడే పరిష్కరించేవాడు. ప్రాముఖ్యంగా ఆ దేశనాయకులు ఈ ఊరీము, తుమ్మామము ద్వారానే దేవునియొద్ద విచారణ చేసి సమాధానం పొందుకునేవారు. ఉదాహరణకు దావీదు, సౌలు యెహోవా యొద్ద విచారణ చేసినట్టు మనం చాలా సందర్భాల్లో గమనిస్తాం, వారు విచారణ చేసింది వీటిద్వారానే (న్యాయాధిపతులు 20:18, 1 సమూయేలు 23:9,10, 28:5,6).

ఇక్కడ మనం గమనించవలసిన మరో విషయం ఏంటంటే, ప్రత్యక్షగుడారం, అందులోని వస్తువులూ, యాజకుడి వస్త్రాలూ వేటితో తయారు చేసారో మనకు వివరాలు ఇవ్వబడ్డాయి కానీ, ఈ ఊరీము, తుమ్మీమును వేటితో తయారు చేసారో మనకు తెలీదు. కానీ యూదా రచనల ప్రకారం ఇవి రత్నాలవంటి రెండు విలువైన రాళ్ళు. ఊరీము అనేది తెలుపురంగులోనూ, తుమ్మీమము నలుపురంగులోనూ ఉంటుంది. వీటి పేర్లకు వెలుగు, సంపూర్ణత అని అర్థం. ఈవిధంగా అవి‌ వెలుగైయున్న సంపూర్ణుడైన దేవుని తీర్పును ప్రజలకు ప్రధానయాజకుడి ద్వారా తెలియచేస్తాయి. అయితే బబులోను చెర తరువాత రెండవ దేవాలయపు కాలంలో (Second Temple period) వీటి వినియోగాన్ని మనం ఎక్కడా చూడము. దీనిని బట్టి మనం ఒక ప్రాముఖ్యమైన పాఠం‌ నేర్చుకోవాలి. దేవుడు అన్ని సమయాల్లోనూ ప్రజలతో నేరుగా మాట్లాడి తన నిర్ణయాన్ని తెలియచేస్తాడు అనుకోవడం సరైనది కాదు. ఆ నిర్ణయాన్ని ఆయన వేరే మాధ్యమం ద్వారా కూడా తెలియచేసేటప్పుడు మరలా నేరుగా మాట్లాడవలసిన అవసరం ఉండదు. రెండవ దేవాలయపు కాలానికి యూదులకు ధర్మశాస్త్రమే కాకుండా మరెన్నో లేఖనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక‌ వారు వాటిని బట్టే నిర్ణయాలు తీసుకోవాలి, తీర్పు తీర్చాలి. ప్రస్తుతం మనం కూడా వాక్యాన్ని‌ బట్టే మన క్రైస్తవ జీవితాన్ని‌ కొనసాగించాలి.

నిర్గమకాండము 28:31
మరియు ఏఫోదు నిలువు టంగీని కేవలము నీలిదారముతో కుట్టవలెను.

ఈ వచనంలో దేవుడు ప్రధానయాజకుడి ఏఫోదు అంగీని నీలిధారంతో మాత్రమే కుట్టాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆలయసంబంధమైన మరిన్ని ఉపకరణాల విషయంలో కూడా ఈ నీలపు బట్టను మనం గమనిస్తాం (నిర్గమకాండము 36:11, సంఖ్యాకాండము 4:7). ఇశ్రాయేలీయులు ప్రజలు కూడా తమ వస్త్రాల అంచులకు ఈ నీలి సూత్రాన్ని కట్టుకోవాలని ఆజ్ఞాపించబడ్డారు (సంఖ్యాకాండము 15:38). ఈ నీలం అనేది దేవుని సన్నిధికి అనగా ఆయన నీతికి సాదృశ్యంగా ఉంది‌ (యెహెజ్కేలు 1:26) అందుకే ఆయన ఈవిధంగా ఆజ్ఞాపిస్తున్నాడు.

యెషయా 54:11 ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును

నిర్గమకాండము 28:32
దానినడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంఠ కవచ రంధ్రమువలె దాని రంధ్రముచుట్టు నేతపనియైన గోటు ఉండవలెను.

ఈ వచనం ప్రకారం నీలి ధారంతో కుట్టబడిన ఏఫోదు నిలువుటంగీ మెడనుండి కాలివరకూ ఒకే అంగీగా ఉండి మెడద్వారా ధరించేలా దానికి రంధ్రం చెయ్యబడాలి (మన టీషర్ట్ వలే). అలా ధరించేటప్పుడు ఆ రంధ్రం చిరిగిపోకుండా చుట్టూ అంచును నెయ్యలి. ఎందుకంటే అది యాజకుడి పరిశుద్ధమైన వస్త్రం. అది ఏమాత్రం చిరిగిపోకూడదు. రక్షణ ద్వారా మనం ధరించుకున్న నీతిక్రియలు ఎప్పటికీ పదిలంగా ఉండేలా చూసుకోవాలని అంగీని గురించిన ఈ ఆజ్ఞ మనకు నేర్పిస్తుంది.

అదేవిధంగా దేవాలయపు కొన్ని ఉపకరణాలు ఒకే బంగారంతో చెయ్యాలని మనం చూస్తాం, అలానే ఈ ప్రధానయాజకుడి అంగీ కూడా ఒకే వస్త్రంతో కుట్టబడుతుంది (ముక్కలు అతికించకుండా). ఈవిధంగా ఒకే బంగారంతో, వస్త్రంతో వాటిని తయారుచెయ్యడం, యేసుక్రీస్తు చేసిన రక్షణ సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. ఆయన ఒక్కసారే బలిగా అర్పించబడి మన రక్షణను సంపూర్ణం చేసాడు.

హెబ్రీయులకు 10:10,14 - యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడువారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.

నిర్గమకాండము 28:33-35
దాని అంచున దాని అంచులచుట్టు నీల ధూమ్ర రక్తవర్ణములుగల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగీ చుట్టు తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మపండును ఆ నిలువు టంగీ క్రింది అంచున చుట్టు ఉండవలెను. సేవచేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించునప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను.

ఈ వచనాలలో దేవుడు ప్రధానయాజకుడి ఏఫోదు అంచులకు దానిమ్మ పండ్లు వాటిమధ్యలో గంటలను తయారు చెయ్యాలని ఆజ్ఞాపించ‌డం మనం చూస్తాం. ఈ బంగారు దానిమ్మపండ్లు, గంటలు ఏఫోదుకు చక్కటి అలంకారంగా, ప్రధానయాజకుడి ఘనతను పెంచేవిగా ఉంటాయి. ఆ వస్త్రాన్ని వేసుకునే అతను సేవ చెయ్యాలి. ఈ ప్రధానయాజకుడి పరిచర్య అనేది యేసుక్రీస్తు పరిచర్యకు సాదృశ్యంగా ఉంది కాబట్టి, అతను తూచా తప్పకుండా దేవుడు చెప్పినట్టుగానే ఆ పరిచర్యలో‌ పాల్గోవాలి. లేదంటే చావు తప్పదు. ప్రస్తుతం ప్రభువు పరిచర్యలో కొనసాగుతున్నవారు కూడా ఈ విషయంలో‌ జాగ్రత్త వహించాలి. మనం చేస్తున్న పరిచర్య పూర్తిగా ఆయన వాక్యానుసారమైనదై యుండాలి. అప్పుడే మనకు బహుమానం లభిస్తుంది. లేదంటే ఆయన శిక్షను రుచిచూడవలసి వస్తుంది.

అదేవిధంగా ప్రధానయాజకుడు ప్రత్యక్షగుడారంలో చేస్తున్న సేవను ఆ గంటలధ్వని తెలియచేస్తుంటాయి. ఆ గంటల శబ్దం వినిపించడం లేదంటే, ప్రధానయాజకుడు మరణించాడని అర్థం. ఈ గంటలధ్వని మన ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు ఈలోకంలో నిర్విరామంగా చేసిన పరిచర్యకు సాదృశ్యంగా ఉంది. అలానే ఆ యేసుక్రీస్తును‌ బట్టి యాజకులుగా పిలవబడిన మనం కూడా సువార్త ప్రకటన అనే శబ్దాన్ని నిర్విరామంగా ఈలోకంలో వినిపింపచెయ్యాలని ఈ నియమం మనకు బోధిస్తుంది. దానివల్ల మన ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తంతో పరిశుద్ధస్థలంలోకి ప్రవేశించాడనే సందేశాన్ని మనం లోకానికి ప్రకటించేవారిగా ఉంటాం (హెబ్రీ 9:11,12). ఎలాగైతే ఆ గంటల శబ్దం మోగనప్పుడు ప్రధానయాజకుడు మరణించాడని అర్థమో అలానే సువార్త ప్రకటన మరియు సువార్త సంబంధమైన క్రియలు లేని సంఘం మరణించిందని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ సువార్త సంబంధమైన క్రియల విషయంలోనే సార్దీస్ సంఘాన్ని హెచ్చరించినట్టు మనం చదువుతాం.

ప్రకటన గ్రంథం 3:1,2 సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.

నిర్గమకాండము 28:36,37
మరియు నీవు మేలిమి బంగారు రేకుచేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగామీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను.

ఈ వచనాలలో దేవుడు ప్రధానయాజకుడి తలపాగా ముందుభాగంలో బంగారురేకుపై "యెహోవా పరిశుద్ధుడు" అనే మాటను చెక్కి నీలిసూత్రంతో దానిని కట్టాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇది ప్రజలందరికీ కనిపించేవిధంగా ఉండి "నేను పరిశుద్ధుడను కనుక మీరునూ పరిశుద్ధులైయుండాలని" (లేవీకాండము 11:44) వారిని హెచ్చరిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధత అనేది ఆయన గుణలక్షణాలు అన్నిటిలోనూ ప్రాముఖ్యమైనది. పరిశుద్ధతే ఆయనకు అలంకారం, మరియు మహిమకరం. యేసుక్రీస్తు ఈలోకానికి వచ్చి బలిగా మారి, ప్రధానయాజకుడిగా తన స్వరక్తంతో ఆయన సముఖంలోకి ప్రవేశించింది కూడా ఆయన పరిశుద్ధతకు వ్యతిరేకంగా చెయ్యబడిన మన పాపాలను పరిహరించడం కొరకే. లేదంటే ఆయన పరిశుద్ధత పాపియైన మనిషిపై ఉగ్రతను కుమ్మరిస్తుంది. ఈవిషయం సాదృశ్యంగా తెలియచెయ్యడానికే అహరోను పాగాపైని బంగారు రేకుపై "ఆయన పరిశుద్ధుడు" అనేమాటలు రాయబడ్డాయి. ఈరోజు సంఘం కూడా ప్రధానయాజకుడి పాగాపైని‌ బంగారు రేకువలే ఆయన పరిశుద్ధతను ప్రజలకు ప్రకటించేదిగా ఉండాలి.

నిర్గమకాండము 28:38
తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధ మైనవాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను; వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను.

ఈ వచనంలో దేవుడు అహరోను పాగాపైని బంగారు రేకుపై "యెహోవా పరిశుద్ధుడు" అనేమాటలు ఎందుకు చెక్కబడాలో తెలియచెయ్యడం మనం చూస్తాం. నేను పైభాగంలో చెప్పినట్టుగా ప్రధానయాజకుడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి దేవుని పరిశుద్ధతను బట్టి అతను ప్రజల దోషాలను భరించాలి. అహరోను అలా ఆ పేరును భరించినప్పుడే ప్రజలు అంగీకరించబడతారు. క్రీస్తు మన దోషాలను భరించబట్టే మనమూ అంగీకరించబడ్డాము (యెషయా 53:5). ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇశ్రాయేలీయులు ఎంతో జాగ్రత్తగా అర్పించే అర్పణల విషయంలోనే వారు దోషులయ్యే అవకాశం ఉంటే, మనం అజాగ్రత్తగా ఆయన సన్నిధిలోకి ప్రవేశించినప్పుడు, పాపానికి మనల్ని మనం అమ్మివేసుకున్నప్పుడు మనమెంత‌ దోషులమౌతామో ఊహించండి. దేవుడు కనుక వాటిని లెక్కలోకి తీసుకుంటే ఉన్నపాటుగా నరకంలో పడడానికి మాత్రమే మనం అర్హులం. కానీ ఆయన యేసుక్రీస్తు మన దోషాలను భరించడాన్ని బట్టి సహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈవిషయంలో మనందరం జాగ్రత్త కలిగియుండాలి.

నిర్గమకాండము 28:39
మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను. సన్న నారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను.

ఈ వచనంలో దేవుడు ప్రధానయాజకుడికి సన్నపునారతో చొక్కాయినీ పాగానూ, నడుముకు దట్టీని కూడా చెయ్యాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ప్రధానయాజకుడు మొదట అంగీని‌, దానిపై ఈ చొక్కాయిని ధరించి నడుముకు దట్టీ కట్టుకుంటాడు. ఆ పైన బంగారు ఏఫోదును ధరిస్తాడు. చివరిగా యెహోవా పరిశుద్ధుడు అనే బంగారు రేకు కట్టబడిన పాగాను తలపై పెట్టుకుంటాడు.

నిర్గమకాండము 28:40
అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను; వారికి దట్టీలను చేయవలెను; వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్లాయిలను వారికి చేయవలెను.

ఈ వచనం ప్రకారం; సాధారణ యాజకులైన అహరోను కుమారులకు కూడా అంగీలపై చొక్కాయిలు నడుముకు దట్టీలు తయారు చెయ్యబడతాయి. కానీ వారికి బంగారు ఏఫోదు కానీ, ఆ ఏఫోదుపై బంగారు పతకం కానీ, యెహోవా పరిశుద్ధుడు అని బంగారు రేకుపై రాయబడిన తలపాగా కానీ ఉండవు. అవి కేవలం ప్రధానయాజకుడు మాత్రమే ధరిస్తాడు.

నిర్గమకాండము 28:41
నీవు నీ సహోదరు డైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను; వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకముచేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను.

ఈ వచనంలో దేవుడు మోషేతో సన్నపునారతో చేసిన చొక్కాయిలనూ, నడుముకు దట్టీలనూ అహరోనుకూ మరియు‌ అతని కుమారులకూ తొడిగించి, వారిని యాజకులుగా అభిషేకించమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇక్కడ యాజకవ్యవస్థ అనేది మొదటిసారిగా ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు దానిని తన ప్రవక్త ద్వారా నియమిస్తున్నాడు. అప్పటినుంచి అది అహరోను వంశానికి వారసత్వంగా కొనసాగుతుంది.

నిర్గమకాండము 28:42,43
మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధస్థలములో సేవచేయుటకు బలిపీఠమును సమీపించునప్పుడైనను, వారు దోషులై చావక యుండునట్లు అది అహరోనుమీదను అతని కుమారులమీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ.

ఈ వచనాలలో దేవుడు అహరోను మరియు అతని కుమారులు పరిచర్య చేసేటప్పుడు అంగీలోపల నార లాగులను ధరించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇప్పుడు వారు పరిచర్య చేయబోతుంది పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో కాబట్టి, వారి వస్త్రధారణ ఆయన ముందు గౌరవప్రధంగా ఉండితీరాలి. ఉదాహరణకు మనం ఎవరైన ఒక రాజును కలిసేటప్పుడు, గౌరవప్రధమైన వస్త్రాలను ధరించి వెళ్తాం. లేకపోతే ఆ రాజును అవమానపరిచినట్టు అర్థం. దేవుడు కూడా తన ఘనతను నొక్కి చెప్పడానికి, ఆయనకు సేవ చెయ్యడం ద్వారా ఆ యాజకులకు ఏర్పడిన ఘనతను కూడా తెలియచెయ్యడానికి వారి వస్త్రధారణ విషయంలో ఇలాంటి నియమాలు ఉంచాడు. ఆధ్యాత్మికంగా ఈ నియమం ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ప్రవేశించాలని, ఆయన పరిచర్యను గౌరవప్రధంగా చెయ్యాలని‌ మనకు బోధిస్తుంది. లేదంటే దోషులై శిక్షను పొందుకోకతప్పదు.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.