పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 11:1, 11:2, 11:3 , 11:4, 11:5,6 , 11:7 ,11:8 , 11:9,10 .

 నిర్గమకాండము 11:1

మరియు యెహోవా మోషేతో ఇట్లనెను ఫరో మీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.

ఈ వచనంలో దేవుడు మోషేకు, ఐగుప్తుపైకి తాను రప్పించబోయే చివరి తెగులు గురించి ప్రకటించడం మనం చూస్తాం. ఆ తెగులు తరువాత గత అధ్యాయంలో "నేను మిమ్మును పోనిచ్చెదనా" అని మోషేను గర్వంగా ప్రశ్నించిన ఫరో, "పురుషులు మాత్రమే వెళ్ళుడి" ( నిర్గమకాండము 10:10,11) "పశువులను విడిచిపెట్టి ప్రజలు మాత్రమే వెళ్ళుడి" ( నిర్గమకాండము 10:24) అంటూ నియంత్రణలు విధించిన ఫరో ఇక ఎటువంటి నిర్బంధమూ లేకుండా ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ, వారి పశువులన్నింటినీ ఐగుప్తు నుండి పంపివేస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు "అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు బొత్తిగా వెళ్ళగొట్టును" అనే పదం ఉపయోగించాడు.

నిర్గమకాండము 11:2
కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలి కత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము.

ఈ వచనంలో దేవుడు, ఇశ్రాయేలీయులను ఫరో ఐగుప్తునుండి పంపివేసేటప్పుడు వారు ఆ జనుల దగ్గరనుండి బంగారు వెండి‌ నగలను తీసుకోవాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. మోషేను ఫరో యొద్దకు మొదటిసారి పంపేటప్పుడు కూడా ఆయన ఈ మాటలు తెలియచేసాడు (నిర్గమకాండము 3:21,22 వ్యాఖ్యానం చూడండి). ఇలా ఎందుకు చెయ్యమంటున్నాడంటే, ఇంతవరకూ ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకు చేసిన కఠినసేవకు వారినుండి పొందుకున్న జీతం చాలా తక్కువ. ఆ బానిసత్వానికి ఇదే ఆఖరిరోజు కాబట్టి ఇశ్రాయేలీయుల కష్టానికి రావలసిన జీతాన్ని వసూలు చేయిస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇశ్రాయేలీయులకూ ఐగుప్తీయులకూ మధ్య ఉన్న లెక్కలన్నిటినీ ఇప్పుడు ఆయన సరి చేస్తున్నాడు. ఈలోకంలో చాలామంది తమ చేతుల కష్టం విషయంలో అన్యాయానికి గురౌతుంటారు. కానీ దేవుడు అందరికీ పైగా ఉండి, తగిన సమయంలో వారికి న్యాయం చేస్తాడు. దానికి మంచి నిదర్శనమే ఈ ఇశ్రాయేలీయుల సంఘటన.

ప్రసంగి 5: 8 ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కనబడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవారున్నారు; "మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా నున్నాడు".

నిర్గమకాండము 11:3
యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.

దీనికి పై వచనంలో, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను వెండి, బంగారు నగలను అడిగి తీసుకోవాలని ఆజ్ఞాపించినట్టు రాయబడితే, ఈ వచనంలో ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు అడిగినవాటిని ఇచ్చేలా యెహోవా వారికి కటాక్షం కలుగచేసినట్టు రాయబడడం మనం చూస్తాం. చివరి తెగులు సంభవించిన తరువాత జరిగినదానిని మోషే ఇక్కడ నమోదు చేస్తున్నాడు‌ (నిర్గమకాండము 12:36). ఇక్కడ దేవుడు మానవహృదయాలను తన చిత్తానుసారంగా నియంత్రించే అధికారం కలిగినవాడిగా స్పష్టంగా అగుపడుతున్నాడు. నేటి సంఘాలలో చాలామంది ఈ విషయాన్ని తిరస్కరించడం చాలా విచారకరం. ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఎవరి హృదయాన్నైనా నియంత్రించగలడు, తనకు అనుకూలమైన మనస్సును పుట్టించగలడు. ఉదాహరణకు ఈ సందర్భాలు చూడండి.

ఎజ్రా 1:1 పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్య మును నెరవేర్చుటకై "యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా" అతడు తన రాజ్యమం దంతట చాటింపుచేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను.

ఎజ్రా 1: 5 అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును "ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో" వారందరు వారితో కూడుకొని వచ్చి, యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి.

ఎజ్రా 6:22 ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు "యెహోవా అష్షూరురాజు హృదయమునువారి వైపు త్రిప్పి" వారిని సంతోషింపజేసెను.

సామెతలు 21: 1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.

ఈరోజు విశ్వాసులమైన మనందరమూ ఆయనకు అనుకూలంగా నడుచుకోవడానికి, ఆయన సువార్తను అంగీకరించడానికి కూడా మన స్వచిత్తం కారణం కాదు, ఆయన మనలో పుట్టించిన నూతనస్వభావమే (మనస్సు) కారణం.

యెహెజ్కేలు 36:26,27 నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.

యెహేజ్కేలు 11: 19 ​వారు నా కట్ట డలను నా విధులను అనుసరించి గైకొను నట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.

తీతుకు 3: 5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన(పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

లేదంటే మనం కూడా ఈ లోకస్తులలానే దేవునిదృష్టికి భయంకరంగా ప్రవర్తించేవారం;

ఎఫెసీయులకు 2: 3 వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

ఎందుకంటే మన స్వచిత్తం, మన పతన స్వభావం మనల్ని ఆ దిశగానే ప్రేరేపిస్తుంది.

రోమీయులకు 8: 7 ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.

కాబట్టి సువార్తను అంగీకరించి, ఆ సువార్త ప్రకారం జీవించే ఆత్మస్వభావాన్ని (నూతనమనస్సును) మనకు మనకిచ్చినందుకు ఆయనను ఎంతగానో స్తుతించేవారంగా ఉండాలి. ఐతే ఇక్కడ కొందరు "దేవుడు అందరికీ అలాంటి మనస్సు ఎందుకు‌ పుట్టించడు, అలా పుట్టించియుంటే వారు కూడా ఆయన సువార్తను అంగీకరించి దాని ప్రకారంగా జీవించేవారుగా" అనే ప్రశ్నలు సంధిస్తారని నాకు తెలుసు. అలాంటి ప్రశ్నలకు 10వ అధ్యాయపు వ్యాఖ్యానంలో కూడా నేను సమాధానం ఇచ్చాను.

ఈ విషయం ఎప్పటికీ మరచిపోవద్దు;
దేవుడు తన చిత్తానుసారంగానే ఏదైనా చేస్తాడు, ఎందుకంటే ఆయన దేవుడు.

ఎఫెసీయులకు 1: 12 ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

దానియేలు 4: 35 భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.

కాబట్టి అందరిపట్లా తప్పకుండా నెరవేర్చవలసిందిగా ఆయనపై ఎటువంటి బాధ్యతలూ మోపబడలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన ఎవరికీ రుణస్తుడు కాదు. ఆయన మనుషులకు ఈవులను అనుగ్రహించేది కేవలం ఆయన చిత్తానుసారమైన కృపను బట్టి మాత్రమే.

రోమీయులకు 9:15
ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును. 
 
అదేవిధంగా ఇక్కడ "ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడైనట్టు" మనం చూస్తాం. ఇదంతా పదవ తెగులు సంభవించిన తరువాత జరుగుతున్న చరిత్ర. ఇక మోషే ఇంతకాలం ఫరో చేత, అతని సేవకుల చేత ఎన్నో‌ అవమానాలను, బెదిరింపులను కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు అతను వారందరి దృష్టికీ గొప్పవాడిగా ఎంచబడుతున్నాడు. కాబట్టి దేవుని పిల్లలు దేవుని నామాన్ని బట్టి లోకంచేత అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ ఆయన తగిన సమయంలో వారిని హెచ్చిస్తాడు.

యెషయా 61: 7 మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందు దురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములోరెట్టింపుభాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును.

మత్తయి 5: 11,12 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.

నిర్గమకాండము 11:4
మోషే ఫరోతో ఇట్లనెను యెహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను.

ఈ వచనంలో మోషే ఫరోతో ఐగుప్తీయులపైకి రాబోయే పదవ తెగులు గురించి పరిచయం చేస్తూ "యెహోవా మధ్యరాత్రి ఐగుప్తు దేశంలోకి బయలువెళ్తాడని చెప్పడం మనం చూస్తాం". ఇది ఫరోకు ఇప్పటివరకూ చేసిన హెచ్చరికలకంటే అత్యంత భయంకరమైన హెచ్చరిక. ఎందుకంటే ఇప్పటివరకూ ఐగుప్తుపైకి వచ్చిన తెగుళ్ళు మోషే అహరోనులు తమ చేతిని చాచగానో, కర్రతో నేలను కొట్టగానో లేక దేవుని మాటప్రకారంగానో వచ్చాయి. ఐగుప్తుదేశానికి ఆ తెగుళ్ళే చాలా తీవ్రమైన నష్టాన్ని కలుగచేసాయి. అలాంటిది ఈసారి స్వయంగా దేవుడే ఐగుప్తులో సంచరించబోతున్నాడంటే దాని తీవ్రత మరెంతో అధికంగా ఉండబోతుంది. అందుకే మోషే ఆ మాటలను ప్రత్యేకంగా చెబుతున్నాడు.

హెబ్రీయులకు 10: 31 జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.

నిర్గమకాండము 11:5,6
అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతువులలోను తొలిపిల్లలన్నియు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.

ఈ వచనాలలో మోషే, యెహోవా దేవుడు ఐగుప్తులో సంచరించి ఏం చేస్తాడో ఫరోకు వివరించడం మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితి ఐగుప్తులో ఎప్పుడూ సంభవించలేదు కాబట్టి "అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు" అని ప్రత్యేకంగా చెప్పబడింది. దీనికి కారణమేంటంటే, గతంలో ఫరో ఇశ్రాయేలీయుల మగపిల్లలను మంత్రసానుల ద్వారా చంపించడానికి ప్రయత్నించి, అది విఫలమయ్యేసరికి వారిని నీటిలో‌ పడవేసి చంపమన్నాడు. దానికి ప్రతీకారంగానే దేవుడు ఇక్కడ ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను, వారి పశువులతో సహా సంహరించబోతున్నాడు. దీనికారణంగా పసిపిల్లలే కాదు, ప్రతీ కుటుంబంలోనూ ప్రధమసంతానమైన ప్రతీవాడూ చంపబడతాడు. ఐతే ఇక్కడ ఫరో యొక్క క్రూర నిర్ణయాన్ని బట్టి ఇశ్రాయేలీయుల పసిపిల్లలు చంపబడితే, దేవుడు మొత్తం ఐగుప్తీయులపై పగతీర్చుకోవడమేంటనే ప్రశ్న రావొచ్చు. ఒకవేళ ఫరో కనుక వేరే కారణాలతో ఐగుప్తీయుల పసిపిల్లలనే చంపమంటే వారంతా ఇశ్రాయేలీయుల విషయంలో మౌనం వహించినట్టు మౌనం వహించేవారా? తప్పకుండా ఫరోపై తిరుగుబాటు చేసేవారు కదా!

మరి ఇశ్రాయేలీయుల విషయంలో మాత్రం ఎందుకు అలా చెయ్యలేకపోయారు? కనీసం మాతృత్వపు ప్రేమ తెలిసిన స్త్రీలు కూడా ఆ విషయంలో స్పందించలేదు కదా! ఎందుకంటే వారందరూ ఇశ్రాయేలీయుల పట్ల అసహ్యభావంతో ఉన్నారు, అందుకే వారి పసిపిల్లలు చంపబడుతుంటే మౌనం వహించారు/సంతోషించారు. అలా పిల్లలను కోల్పోయి వేదనలో ఉన్న తల్లితండ్రుల చేత కూడా ఎటువంటి సానుభూతీ లేకుండా కఠినసేవ చేయించుకున్నారు. అందుకే ఇప్పుడు వారి వంతు వచ్చింది. మనిషిపై మరో‌ మనిషికి నైతికబాధ్యత ఉంటుంది, ఆ బాధ్యతను తప్పుతూ మరో మనిషిపై అసహ్యం పెంచుకుని, వారు బాధపడుతున్నపుడు స్పందించకుండా మౌనం వహించినా, వారి కష్టాన్ని చూసి సంతోషించినా, దేవుడు దానిని తీవ్రమైన నేరంగానే పరిగణిస్తాడు. అదే పర్యవసానం ఎదుర్కొనేలా చేస్తాడు.

ఓబద్యా 1:15 యెహోవాదినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును.

అందుకే "నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు" ఇది దేవుడు మనకు సాటి మనిషి విషయంలో అప్పగించిన బాధ్యత. నిన్ను వలె నీ పొరుగువానిని‌ ప్రేమించమనే ఆజ్ఞలో, నీకు కష్టం, నష్టం కలిగితే ఎలా స్పందిస్తావో, అలాంటి పరిస్థితి ఇతరులకు సంభవించినా అంతే తీవ్రంగా స్పందించమనే కోణం కూడా దాగియుంది.

అదేవిధంగా ఈ సంఘటనను బట్టి, దేవుడు; పెద్దవారు చేసిన పాపాలను బట్టి పసిపిల్లలను చంపెయ్యడం ఎంతవరకూ సమంజసం అనే ప్రశ్న కూడా రావొచ్చు. ఈ ప్రశ్నకు నేను ఇప్పటికే దేవుడు సొదొమ పట్టణాలను నాశనం చేసిన సందర్భంలో సమాధానం ఇచ్చాను (ఆదికాండము 19వ అధ్యాయపు వ్యాఖ్యానం చూడండి).

ఇక దేవుడు ఐగుప్తీయుల దేవతలకు తీర్పుతీర్చే క్రమంలో ఈ తొలిచూలు పిల్లల వధ "టా" Ptah అనే దేవునిపై కుమ్మరించబడిన తీర్పుగా మనం అర్థం చేసుకోవాలి. ఐగుప్తీయులు ఈ దేవుణ్ణి తమ‌ జీవదేవునిగా పూజించేవారు. ఇక్కడ మన దేవుడు ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను మరణింపచేసి జీవాన్ని అనుగ్రహించేవాడు, దానిని తీసివేసేవాడు ఆయన మాత్రమేయని రుజువుచేసుకున్నాడు.

1సమూయేలు 2: 6 జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే.

నిర్గమకాండము 11:7
యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచు నని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.

ఈ వచనంలో మోషే ఐగుప్తుపైకి రాబోతున్న తెగులునుంచి దేవుడు ఇశ్రాయేలీయులను వేరుచేస్తున్నట్టు ప్రకటించడం మనం చూస్తాం. ఇక్కడ "మనుష్యులమీదగాని జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు" అనేమాటలు ఐగుప్తీయుల ఇళ్ళల్లో శవాలు లేస్తుంటే, వారి పశువులు కూడా చచ్చిపడుతుంటే "ఇశ్రాయేలీయులకూ వారి పశువులకూ మాత్రం ఒక కుక్క కూడా హాని చెయ్యదు" అనే భావంలో అలంకారంగా చెప్పబడ్డాయి.

నిర్గమకాండము 11:8
అప్పుడు నీ సేవకులైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసినీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలంద రును బయలు వెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదుననెను. మెషే అలాగు చెప్పి ఫరో యొద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను.

ఈ వచనంలో మోషే ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలవధ తరువాత ఏం జరగబోతుందో ముందే ఫరోకు ప్రవచించడం మనం చూస్తాం. ఇంతవరకూ మోషేను చులకనగా చూసి, అతడిని కించపరిచినవారు ఆ సమయంలో‌ అతనికి నమస్కారం చేసి మరీ ఐగుప్తునుండి సాగనంపుతారు. దేవునిపై ఆధారపడి, ఆయనకోసం నిందలనూ శ్రమలనూ అనుభవించిన సేవకులకు ఆయన కలిగించే ఘనత ఈవిధంగానే ఉంటుంది. త్వరలో ఈ ఘనత మనకు కూడా కలగబోతుంది.

ప్రకటన గ్రంథము 3:8,9 నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.

అదేవిధంగా ఇక్కడ‌ మోషే ఫరోకు హెచ్చరిక చెయ్యడం ముగిసిన తరువాత "అక్కడినుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయినట్టు" మనం చూస్తాం. ఎందుకంటే ఫరో ఈ హెచ్చరికను కూడా ఖాతరు చెయ్యకుండా ఇంకా దేవునిపై, ఆయన ప్రజలపై అతిశయపడడం "భూమిపై ఉన్నవారందరిలోనూ మిక్కిలి సాత్వికుడైన మోషేకు అత్యాగ్రహం కలిగించింది". నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు తమ విషయంలో సాత్వికాన్ని ప్రదర్శించగలరు కానీ దేవుని‌ కార్యాలకు అడ్డంకులు కలిగిస్తున్నవారి విషయంలో తప్పకుండా ఆగ్రహానికే గురౌతారు. ఒకవేళ వారికి అటువంటి ఆగ్రహమేమీ కలగకుంటే, దేవునిపై వారికున్న ప్రేమలో ప్రధానమైన లోపముందని మనం అర్థం చేసుకోవాలి. అయితే దైవవిరోధులపై ఆగ్రహం కలగడం వేరు, ఆ ఆగ్రహంతో ఆ దైవనియమాలను మీరుతూ ప్రవర్తించడం వేరు. ఉదాహరణకు; దాడులు చెయ్యడం వంటివి. ఇక్కడ మోషేకు ఆగ్రహం‌ కలిగింది, యూదులపై పౌలుకు కూడా అదే ఆగ్రహం కలిగింది. కానీ వారు "పగతీర్చువాడు దేవుడే" అనే మాటలను విడిచిపెట్టి ఎటువంటి తొందరపాటు చర్యలకూ పాల్పడలేదు.

నిర్గమకాండము 11:9,10
అప్పుడు యెహోవాఐగుప్తుదేశములో నా మహ త్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోనులు ఫరో యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్య డాయెను.

ఈ వచనాలలో మోషే మొదటినుండీ ఇంతవరకూ జరిగినదానిని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఆఖరి తెగులుతో ఇశ్రాయేలీయులకు విడుదల లభించబోతుంది కాబట్టి, దేవుడు చెప్పినట్టుగానే ఇదంతా జరిగిందని అతను ఈ మాటలు మరలా ప్రస్తావించాడు. ఈ సంఘటన జరగాలనే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచుకుంటూ వచ్చాడు. ఈ కఠినపరచడం గురించి ఇప్పటికే ఆ మాటలు రాయబడిన ప్రతీ సందర్భంలోనూ నేను వివరణ ఇచ్చాను.

 

 

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.