విషయసూచిక:- 22:1, 22:2, 22:3 , 22:4, 22:5 , 22:6 ,22:7 , 22:8 , 22:9 , 22:10,11 , 22:12 , 22:13 , 22:14 , 22:15 , 22:16 , 22:17 , 22:18 , 22:19 , 22:20 , 22:21 , 22:22-24 , 22:25 , 22:26,27 , 22:28 , 22:29,30
నిర్గమకాండము 22:1
ఒకడు ఎద్దునైనను గొఱ్ఱెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ యెద్దుకు ప్రతిగా అయిదు ఎద్దులను ఆ గొఱ్ఱెకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెలను ఇయ్య వలెను.
ఈ వచనంలో దొంగతనం గురించి వివరించబడిన న్యాయవిధిని జాగ్రత్తగా పరిశీలిస్తే;
1. ఇక్కడ ఎద్దు మరియు గొఱ్ఱె విషయంలో చెప్పబడిన మాటలు అన్నిరకాల జంతుదొంగతనాలలోనూ వర్తిస్తుంది. ఇక్కడ ఈ రెండు జంతువుల పేర్లు ఉదాహరణలుగా మాత్రమే చెప్పబడ్డాయి.
2. గొఱ్ఱెను దొంగిలిస్తే నాలుగు గొఱ్ఱెలను తిరిగివ్వాలి, అదే ఎద్దును దొంగిలిస్తే ఐదింటిని తిరిగివ్వాలి. వాస్తవానికి గొఱ్ఱెకంటే ఎద్దు విలువైంది. ఈవిధంగా ఇక్కడ దొంగతనం చేసేవాటి స్థాయి పెరిగేకొద్దీ ఎక్కువ నష్టపరిహారం విధించబడింది. చిన్నదైన గొఱ్ఱెను దొంగిలిస్తే నాలుగే (తక్కువ నష్టపరిహారం), అదే పెద్దదైన ఎద్దును దొంగిలిస్తే మాత్రం ఐదు (ఎక్కువ నష్టపరిహారం).
3. ఎద్దు అనేది వ్యవసాయ సాధనం. అది లేకపోతే ఒక వ్యక్తి తన భూమిని సాగుచేసుకోలేడు. అది అతనికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఎద్దును దొంగిలిస్తే ఎక్కువ నష్టపరిహారం విధించబడింది. జరిగిన దొంగతనం వల్ల ఒక యజమానుడికి సంభవించే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, దానికి తగినవిధంగా ఆ దొంగనుండి ఎక్కువ నష్టపరిహారం వసూలు చెయ్యాలని ఈ నియమం నేర్పిస్తుంది.
4. సాధారణంగా గొఱ్ఱెను దొంగిలించడం కంటే ఎద్దును దొంగిలించడమే సులభం. గొఱ్ఱెలు కాపరిని వెంబడిస్తాయి కాబట్టి, వాటిని దొంగిలించే అవకాశం అంతగా ఉండదు, అదే ఎద్దులు చేలలో అటూ ఇటూ తిరుగుతూ మేస్తుంటాయి కాబట్టి వాటిని దొంగిలించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సులభంగా దొంగిలించడానికి అవకాశం ఉన్న ఎద్దుకు ఎక్కువ నష్టపరిహారం విధించబడడాన్ని బట్టి, సులభంగా చేయగలిగే దొంగతనాల్లో ఎక్కువ నష్టపరిహారం విధించాలని ఈ న్యాయవిధి చెబుతుంది. ఎందుకంటే సులభమైన దొంగతనాలే ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి, ముందుగా నియంత్రించవలసింది వాటినే.
నిర్గమకాండము 22:2
దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన రక్తాపరాధ ముండదు.
ఈ వచనంలో ఒక దొంగ దొంగతనం చేస్తుండగా వాడిని చచ్చేలా కొట్టినప్పటికీ నేరం కాదని చెప్పబడడం మనం చూస్తాం. ఎందుకంటే దొంగలు దొంగతనానికి వచ్చినప్పుడు, వారిని అడ్డుకునేవారికి హానిచేసే ఉద్దేశాన్ని కూడా కలిగియుంటారు, దానికి అవసరమైన ఆయుధాలతో కూడా వస్తుంటారు. అందుకే ఆ సమయంలో వారిచేతినుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వారిని చచ్చేలా కొట్టినప్పటికీ అది నేరం కాదని ఈ న్యాయవిధి చెబుతుంది. "చచ్చునట్లు కొట్టబడినయెడల" అంటే చనిపోయేవరకూ కొట్టమని కాదు కానీ, మనం కొడుతున్న క్రమంలో ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయినప్పటికీ నేరం కాదని ఆ మాటల యొక్క భావం. ఈ న్యాయవిధి మన ప్రాణ, మానాలకు హాని సంభవిస్తున్నప్పుడు ఆత్మరక్షణ చేసుకునేదిశగా ప్రతిదాడికి సిద్ధపడవచ్చని నేర్పిస్తుంది. బైబిల్ పగతీర్చుకోవడాన్ని నిషేధిస్తుంది తప్ప (రోమా 12:19, లేవీకాండము 19:18, 1థెస్సలోనిక 5:15), దాడి జరుగుతున్న సమయంలో ఆత్మరక్షణ చేసుకోవడాన్ని కాదు. మనపై దాడి జరుగుతున్న సమయంలో చివరికి అక్కడినుండి పారిపోయే అవకాశం కూడా లేనప్పుడు, ప్రతిదాడి చేసే ఆ అపాయం నుండి తప్పించుకోవాలి. ఐతే ఆ సమయంలో ఇక మనపై దాడి చెయ్యలేనివిధంగా ఆ వ్యక్తి గాయపడినప్పుడు మరలా అతనిపై దాడికి పాల్పడకూడదు, అలా చేస్తే మాత్రం పగతీర్చుకోకూడదనే బైబిల్ బోధను ధిక్కరించినట్టే ఔతుంది.
నిర్గమకాండము 22:3
సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టినయెడల వానికి రక్తాపరాధముండును; వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను. వానికేమియు లేకపోయిన యెడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను.
దీనికి పై వచనంలో దొంగ దొంగతనం చేస్తుండగా వాడిని చచ్చేలా కొట్టినప్పటికీ నేరం కాదని చెప్పబడి, ఈ వచనంలోనైతే వాడిని సూర్యుడు ఉదయించాక కొడితే మాత్రం నేరమే ఔతుందని చెప్పబడింది. ఎందుకంటే సాధారణంగా ఆ కాలంలో పగటిపూట దొంగతనాలు జరిగేవి కావు. దానిని బట్టి ఎవరైనా ఒక దొంగను పగటిపూట కొడుతున్నారు అంటే, వాడు గతంలో చేసిన దొంగతనాన్ని బట్టే అలా కొడుతున్నారు. అందుకే "వానికేమియు లేకపోయిన యెడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను" అని చెప్పబడింది. ఒకవేళ ఆ దొంగతనం అప్పుడే జరిగిందైతే ఆ సొమ్ము వాడిదగ్గరే ఉంటుంది కదా! ఈవిధంగా ఆలోచించినప్పుడు ఆ దొంగ గతంలో ఎప్పుడో దొంగతనం చేసాడు. ఎప్పుడో చేసిన దొంగతనాన్ని బట్టి ఇప్పుడు వాడిని కొట్టడమంటే అది పగతీర్చుకోవడంలో భాగమే కాబట్టి, దేవుడు అలా చేయొద్దు అంటున్నాడు. 2వ వచనంలో వివరించబడినట్టుగా, ఆ దొంగవల్ల మన ప్రాణాలకు హాని సంభవించే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే వాడిని కొట్టాలి. ఆ దొంగతనం గురించి తరువాత బయటపడితే, వాడు దొంగిలించింది మరలా చెల్లించేలా న్యాయాధిపతులకు వాడిని అప్పగించాలి, అప్పటికే వాడు ఆ సొమ్మును కర్చు చేసేసి, తిరిగి ఇవ్వడానికి వాడికి ఏమీలేకపోతే వాడిని అమ్మివేయాలి. ఈ అమ్మబడడం గురించి, అలా అమ్మబడినవాడి విషయంలో జరగవలసిన విధి గురించీ ఇప్పటికే వివరించాను (నిర్గమకాండము 21:2 వ్యాఖ్యానం చూడండి).
నిర్గమకాండము 22:4
వాడు దొంగిలినది ఎద్దయినను గాడిదయైనను గొఱ్ఱెయైనను సరే అది ప్రాణముతో వానియొద్ద దొరికినయెడల రెండంతలు చెల్లింపవలెను.
ఈ వచనంలో ఒక దొంగ దొంగిలించినవి అతనిదగ్గర ప్రాణంతో దొరికితే, సంబంధిత యజమానుడికి వాటితో పాటుగా మరో రెండింతలు కలిపి చెల్లించాలని రాయబడడం మనం చూస్తాం. ఒకవేళ అవి అతనిదగ్గర ప్రాణంతో దొరకకపోతే (చంపేసినా, అమ్మేసినా) మొదటి వచనం ప్రకారం ఆ జంతువుల స్థాయిని బట్టి, వాటితో పాటుగా ఐదు లేదా నాలుగింతలు చెల్లించవలసియుంటుంది. ఈ రెండూ జరుగకుండా, ఆ దొంగకనుక ముందే పశ్చాత్తాపపడి తన దొంగతనాన్ని దేవుని ముందు (యాజకుని సమక్షంలో) ఒప్పుకుంటే ఆ జంతువుతో పాటుగా ఆ జంతువుయొక్క విలువలో ఐదవవంతు చెల్లిస్తే సరిపోతుంది (లేవీకాండము 6:5). ఉదాహరణకు అతను దొంగిలించిన జంతువు విలువ 100రూపాయలు ఐతే, ఆ జంతువుతో పాటుగా 5రూపాయాలను చెల్లిస్తే సరిపోతుంది. ఈ నియమం ఎక్కువ నష్టపోకుండా, మీ దొంగతనాన్ని మీకు మీరుగా ఒప్పుకుని, తక్కువ నష్టంతో సరిపెట్టుకోమని బోధిస్తుంది. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం కూడా, దైవ ఆజ్ఞలను మీరి పాపం చేస్తూ మీకున్నదానిని (ప్రాణంతో సహా) నష్టపోవద్దని హెచ్చరించడమే.
నిర్గమకాండము 22:5
ఒకడు చేనునైనను ద్రాక్షతోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసినయెడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నియ్యవలెను.
ఈ వచనంలో ఎవరిదైనా పశువు, పొరుగువాని చేనును పాడుచేస్తే, ఆ పశువు యొక్క యజమానుడు ఆ చేనుగల వ్యక్తికి తనపొలం నుండి శ్రేష్టమైన పంటను ఇవ్వాలని రాయబడడం మనం చూస్తాం. ఎందుకంటే ఒక పశువు పొరుగువాడి పొలాన్ని పాడు చేయడమనేది పూర్తిగా ఆ పశువు యజమానుడి అజాగ్రత్త వల్లే జరుగుతుంది. ఆ పశువు యొక్క యజమానుడు దగ్గరుండి దానిని మేపుకునే బాధ్యతను కలిగియున్నాడు. కాబట్టి తన పశువువల్ల పొరుగువాని పొలానికి నష్టం కలుగుతుందనే సాధారణమైన విషయం తెలిసి కూడా అజాగ్రత్తగా దానిని విడిచిపెట్టినవాడు నష్టాన్ని భరించక తప్పదు. ఐతే ఈ నియమం కేవలం ఒకరి పశువు వేరేవ్యక్తి పొలాన్ని పాడు చెయ్యడం విషయంలోనే కాదు, ఒక వ్యక్తికి సంబంధించిన వాటివల్ల మరోవ్యక్తికి సంభవించే నష్టాలన్నింటిలోనూ వర్తిస్తుంది. మన అజాగ్రత్త వల్ల వేరేవ్యక్తి పొలానికి కానీ లేక మరిదేనికైనా కానీ నష్టం కలిగితే తప్పకుండా దానికి తగిన నష్టపరిహారం చెల్లించాలి. ఈ క్రింది వచనం కూడా ఇదే చెబుతుంది.
నిర్గమకాండము 22:6
అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుటవలన పంట కుప్పయైనను పంటపైరైనను చేనైనను కాలి పోయినయెడల అగ్ని నంటించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను.
ఈ వచనంలో కూడా ఒకరి అజాగ్రత్త వల్ల పొరుగువాని ఆస్థికి నష్టం వాటిల్లితే ఆ నష్టాన్ని చెల్లించాలని రాయబడడం మనం చూస్తాం. మనల్ని సాటిమనుషుల పట్ల బాధ్యతకలిగిన పౌరులుగా తీర్చిదిద్దేందుకే దేవుడు వీటన్నిటినీ వివరించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మన సొత్తు విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, పొరుగువాని సొత్తు విషయంలో కూడా ఆంతే జాగ్రత్తను పాటించాలని వీటి సారాంశం.
నిర్గమకాండము 22:7
ఒకడు సొమ్మయినను సామానైనను జాగ్రత్తపెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని యింట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికినయెడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను.
సాధారణంగా ఆ కాలంలో ఎవరైనా దూరప్రయాణానికి సిద్ధమైనప్పుడు, దొంగలభయం వల్ల తమకున్న విలువైన వస్తువులను తమ ఇంటిలో ఉంచుకోకుండా, పొరుగువారికి అప్పగించి వెళ్ళేవారు. వాటిని ఆ పొరుగువారు తమ ఇంటిలో పెట్టుకుని భద్రపరిచేవారు. అలా పొరుగువారికి అప్పగించబడిన వస్తువులు దొంగిలించబడితే ఏం చేయాలో ఈ వచనం చెబుతుంది. ఆ వస్తువులను దొంగిలించిన దొంగ దొరికితే ఆ దొంగ ఆ వస్తువులతో పాటుగా వాటి విలువకు సమానమైన మరో రెండింతల సొమ్ము ఆ యజమానుడికి చెల్లించాలి. ఒకవేళ అవి పశువులు ఐతే మొదటి వచనంలోనూ, నాలుగవ వచనంలోనూ ఉన్న నియమాలను అనుసరించి చెల్లించాలి.
నిర్గమకాండము 22:8
ఆ దొంగ దొరకని యెడల ఆ యింటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసికొనెనో లేదో పరిష్కారమగుటకై దేవునియొద్దకు రావలెను.
ముందటి వచనానికి కొనసాగింపుగానే ఈ వచనాన్ని మనం చూస్తాం. ఒకవేళ ఆ దొంగ దొరకకపోతే ఎవరి ఇంట్లో ఐతే పొరుగువాని వస్తువులు దొంగిలించబడ్డాయో, ఆ ఇంటి యజమానుడు, ఆ పొరుగువానితో కలసి దేవుని యొద్దకు అనగా న్యాయాధిపతుల యొద్దకు రావాలి (ఇక్కడ న్యాయాధిపతుల గురించే దేవుడు అనే పదం వాడబడింది "నిర్గమకాండము 21:6, కీర్తనలు 82:1,2"). ఎందుకంటే ఆ దొంగ దొరకనప్పుడు తన వస్తువులు ఆ ఇంటి యజమానుడే దొంగిలించాడేమో అనే అనుమానం ఆ వస్తువుల యజమానికి తప్పక కలుగుతుంది. ఆ అనుమానం నివృత్తి చెయ్యబడడానికే వారిద్దరూ కలసి న్యాయాధిపతుల యొద్దకు రావాలి.
నిర్గమకాండము 22:9
ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దునుగూర్చి గాడిదనుగూర్చి గొఱ్ఱెను గూర్చి బట్టనుగూర్చి పోయినదాని నొకడు చూచి యిది నాదని చెప్పిన దానిగూర్చి ఆ యిద్దరి వ్యాజ్యెము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవనిమీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొన వలెను.
ఈ వచనం ప్రకారం అలా దేవునియొద్దకు అనగా న్యాయాధిపతుల యొద్దకు వచ్చిన ఇద్దరికీ వారు న్యాయం తీరుస్తాడు. ఒకవేళ ఆ ఇంటియజమానుడే ఆ వస్తువులను దొంగిలించాడని రుజువైతే ఒక దొంగచెల్లించేటట్టుగా, అతను కూడా ఆ వస్తువులతో పాటు వాటివిలువను రెండింతలు చెల్లించాలి. ఒకవేళ న్యాయాధిపతుల విచారణలో విషయం తెలియకపోతే అప్పుడు ఏం చేయాలో క్రింది వచనాలలో వివరించబడింది.
నిర్గమకాండము 22:10,11
ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొఱ్ఱెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించినమీదట, అది చచ్చినను హాని పొందినను, ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను, వాడు తన పొరుగువాని సొమ్మును తీసికొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరిమధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను; ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు.
ఈ వచనాల ప్రకారం పొరుగువాని వస్తువులు కానీ, పశువులు కానీ ఎవరికైనా అప్పగించబడినప్పుడు అవి అతని దగ్గరనుండి దొంగిలించబడినా లేక హాని పొందినా వాటిని అతను దొంగిలించలేదు అని రుజువు చేసుకోవడానికి "యెహోవా నామం పేరిట ప్రమాణం చెయ్యాలి". న్యాయాధిపతుల విచారణలో కూడా పరిష్కరించబడని సమస్యలకు ఇది మాత్రమే పరిష్కారం (హెబ్రీ 6:16). విచారణలో రుజువు చెయ్యబడని నేరారోపణలకు శిక్షవిధించడం న్యాయం కాదు కాబట్టి, అలా చేస్తే నిర్దోషులు కూడా శిక్షించబడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, దేవుడు ఈ నియమాన్ని ప్రవేశపెట్టాడు. ఈ నియమంలో ఆయన పేరిట చెయ్యబడే ప్రమాణాన్ని బట్టి ఇక ఆ వ్యాజ్యాన్ని ఆయనే చూసుకుంటాడు. "యెహోవా నామం పేరిట ప్రమాణం చెయ్యడమంటే" సామాన్యమైన విషయం కాదు, ఒకవేళ తప్పు చేసి కూడా, తప్పించుకోవడానికి ఆ ప్రమాణాన్ని చేస్తే అలాంటివారికి ఆయనచేతిలో విధించబడే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది.
హెబ్రీయులకు 10:31 జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.
యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడమే పాపమైతే (నిర్గమకాండము 20:7) తమ పాపాన్ని కప్పి పుచ్చుకోవడానికి అ నామం పేరిట ప్రమాణం చెయ్యడమనేది మరింత ఘోరమైన పాపం కదా!
నిర్గమకాండము 22:12
అది నిజముగా వానియొద్దనుండి దొంగిలబడినయెడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను.
ఈ వచనం ప్రకారం ఆ వ్యక్తికి అప్పగించబడిన పశువులు దొంగిలించబడితే వాటి యజమానుడికి నష్టపరిహారం చెల్లించాలి. 11వ వచనంలో "ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు" అని చెప్పబడింది, ఆ పశువులను అతను తీసుకోలేని పక్షంలోనే తప్ప, దొంగిలించిబడిన వాటి విషయంలో కాదు. ఒకరికి అప్పగించబడిన పశువులు దొంగిలించబడ్డాయి అంటే దానికి అతని అజాగ్రత్త కూడా కారణం కాబట్టి అతను నష్టపరిహారం చెల్లించాలి.
నిర్గమకాండము 22:13
అది నిజముగా చీల్చబడినయెడల వాడు సాక్ష్యముకొరకు దాని తేవలెను; చీల్చబడినదాని నష్టమును అచ్చుకొన నక్కరలేదు.
ఈ వచనం ప్రకారం; ఆ వ్యక్తికి అప్పగించబడిన పశువులు ఏదైనా క్రూరమృగం చేతిలో చీల్చబడితే ఆ పశువుకు క్రూరమృగం చేతిలో చనిపోయింది అనేందుకు రుజువుగా మిగిలిన శరీరభాగాలను న్యాయాధిపతుల యొద్దకు సాక్ష్యంగా తేవాలి. ఆ విషయంలో మాత్రం అతను ఆ పశువుల యజమానుడికి నష్టపరిహారం చెల్లించక్కర్లేదు. ఎందుకంటే క్రూరమృగం దాడి చెయ్యడంలో అతని అజాగ్రత్త ఏమీ ఉండదు. ఆ సమయంలో అతను తన ప్రాణాలు కాపాడుకోవడానికే ఎక్కువగా ప్రయత్నించాలి.
నిర్గమకాండము 22:14
ఒకడు తన పొరుగువానియొద్ద దేనినైనను బదులు దీసి కొనిపోగా దాని యజమానుడు దానియొద్ద లేనప్పుడు, అది హానిపొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొన వలెను.
ఈ వచనం ప్రకారం; ఒక వ్యక్తి తన పొరుగువాని దగ్గర ఏదైనా పశువును తన పని నిమిత్తం తీసుకునిపోయినప్పుడు అది హానిపొందితే ఆ పశువుయొక్క యజమానుడికి నష్టపరిహారం చెల్లించాలి. ఆ కాలంలో వ్యవసాయ పనులకు ఇతరుల పశువులను (ఉదాహరణకు ఎద్దులను) కొదువుగా తీసుకునిపోవడం సాధారణంగా జరుగుతుండేది. ఆ సమయంలో అవి హాని పొందితే వాటిపై శక్తికి మించిన భారాన్ని మోపడమో లేక వాటిపట్ల అజాగ్రత్తగా వ్యవహరించడమో కారణమయ్యుంటుంది కాబట్టి, నష్టపరిహారం చెల్లించాలి. ఈ నియమం ఇతరుల దగ్గర కొదువు తీసుకున్నవాటిపట్ల మనం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నేర్పిస్తుంది.
నిర్గమకాండము 22:15
దాని యజమానుడు దానితో నుండిన యెడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన యెడల అది దాని అద్దెకు వచ్చెను.
ఈ వచనంలో ఆ పశువుయొక్క యజమానుడు కనుక ఆ పశువుతోపాటే ఉంటే, అప్పుడు దానికి ఎలాంటి హాని సంభవించినప్పటికీ, నష్టపరిహారం చెల్లించనవసరం లేదని రాయబడడం మనం చూస్తాం. ఎందుకంటే ఆ పశువుయొక్క యజమానుడు దానితోపాటే ఉన్నప్పుడు ఎవరూ ఆ పశువుపై ఎక్కువభారం మోపలేరు. అలా మోపబడితే దానికి ఆ యజమానుడు కూడా కారణమయ్యుంటాడు. అలాగే ఆ పశువుకు ఏదైనా అజాగ్రత్త వల్ల హానిసంభవిస్తే దగ్గరుండి కూడా సరైన జాగ్రత్త తీసుకోలేని యజమానుడు కూడా దానికి బాధ్యుడు. అందుకే దానికి ఎలాంటి నష్టపరిహారం విధించబడలేదు.
నిర్గమకాండము 22:16
ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను మరులుకొల్పి ఆమెతో శయనించినయెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలెను.
ఈ వచనంలో అవివాహితులైన స్త్రీ పురుషుల మధ్యలో లైంగిక అపవిత్రత చోటుచేసుకుంటే వారు వెంటనే వివాహం చేసుకోవాలని రాయబడడం మనం చూస్తాం. వ్యభిచారులకు విధించబడే మరణదండన వారికి విధించబడదు. ఎందుకంటే వివాహం చేసుకోవడం ద్వారా వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పిదాన్ని సరిచేసుకునే అవకాశం వారికి ఇవ్వబడింది. ఐతే దేవునిపిల్లలు ఈవిషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నియమాన్ని అడ్డుపెట్టుకుని ఎలాగూ పెళ్ళి చేసుకుంటాంలే అని లైంగిక అపవిత్రతకు లోనవ్వడం కృపను దుర్వినియోగపరచడమే ఔతుంది. ఈ నియమం పొరపాటున జరిగిన పాపం విషయంలో ఏం చెయ్యాలో చెబుతుందే తప్ప, పాపం చెయ్యడానికి అనుమతిగా మాత్రం కాదు.
అదేవిధంగా ఆ కాలంలో కన్యకలకు ఓలిని (కట్నాన్ని) ఇచ్చే ఆనవాయితీ ఉండేది, ఆ ఆనవాయితీని అనుసరిస్తూనే ఇక్కడ
"ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలెను" అని రాయబడింది. ఇష్టపూర్వకంగా వరుడు తరుపునుండి కానీ, వధువు తరుపునుండి కానీ ఇవ్వబడే కట్నకానుకలను బైబిల్ నిషేధించదు.
నిర్గమకాండము 22:17
ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని యెడల వాడు కన్యకల ఓలిచొప్పున సొమ్ము చెల్లింపవలెను.
ఈ వచనంలో ఆ స్త్రీయొక్క తండ్రి వివాహానికి ఇష్టపడనప్పటికీ ఆ పురుషుడు మాత్రం ఓలి సొమ్మును చెల్లించాలని రాయబడడం మనం చూస్తాం. జరిగిన తప్పులో ఆ పురుషుడి ప్రమేయం ఉంది కాబట్టి, వివాహానికి ఆ స్త్రీ తండ్రి ఒప్పుకోనప్పటికీ తన వంతుగా చేయవలసింది మాత్రం తప్పించుకోకుండా చేసితీరాలి (ఓలి చెల్లించాలి). అప్పటినుండి ఆ స్త్రీ జీవితంలో జరిగేదానికి ఆమెయొక్క తండ్రే పూర్తిగా బాధ్యుడు. ఎందుకంటే అతను వివాహానికి అంగీకరించలేదు. ఒకవేళ దానికి కారణం ఆ పురుషుడి ప్రవర్తనే ఐతే న్యాయాధిపతుల సమక్షంలో దానిని సరిచేసేవిధంగా ప్రయత్నించాలి తప్ప, వివాహాన్ని అడ్డుకోవడం మాత్రం ఆ అమ్మాయి జీవితానికి శ్రేయష్కరం కాదు.
నిర్గమకాండము 22:18
శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.
ఈ వచనంలో శకునం చెప్పేదానిని బ్రతుకనియ్యకూడదని రాయబడడం మనం చూస్తాం. ఇది స్త్రీలకు మాత్రమే వర్తించేది కాదు. అందుకే దీనిగురించిన మరో లేఖనభాగంలో ఏమని రాయబడిందో చూడండి.
లేవీయకాండము 20:27 పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణ శిక్ష విధింప వలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.
ఈ వచనం ప్రకారం; కర్ణపిశాచి ద్వారా శకునం చెప్పేది పురుషుడైనా, స్త్రీయైనా వారిని చంపివెయ్యాలి. ఎందుకంటే దేవునిపిల్లలు ఆ దేవునిపైనే ఆధారపడాలి, ఆయననే ఆశ్రయించాలి. దానికి ప్రతిగా దుష్టశక్తులను ఆశ్రయించకూడదు. మరిముఖ్యంగా ఈ మంత్రవిధ్యను అభ్యసించేవారు, దానిని సాధనం చేసేవారు నరబలులవంటివి ఇస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా అలాంటి బలులు అర్పించినవారిని మనం చూసాం. అందుకే సమాజానికి ప్రమాదకరమైన అలాంటివారిని బ్రతుకనియ్యకూడదు (లేవీకాండము 20:27).
నిర్గమకాండము 22:19
మృగసంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.
ఈ వచనంలో మృగసంయోగం అనగా మృగాలతో లైంగికసంబంధం పెట్టుకునేవాడికి మరణశిక్ష విధించాలని రాయబడడం మనం చూస్తాం. కనాను వంటి దేశాలలో ఈ హేయమైన కార్యాలు విపరీతంగా జరుగుతుండేవి.
లేవీయకాండము 18:23,24 ఏ జంతువు నందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి.
దేవుడు స్త్రీ పురుషులలో స్వభావసిద్ధంగా కలిగే కామవాంఛను తీర్చుకోవడానికి వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఆ వ్యవస్థకు వెలుపల కామవాంఛను తీర్చుకోవడానికి దేవుడు ఏ మాత్రం అంగీకరించడు. వివాహ వ్యవస్థకు వెలుపల వ్యభిచరించడం పాపమైతే, జంతుశయనం చేయడమనేది మరింతహేయమైన పాపం. అందుకే అలాంటి పనులు చేసినవారికి మరణమే సరి.
నిర్గమకాండము 22:20
యోహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు.
"నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు" అనే ప్రారంభ ఆజ్ఞ పరిథిలోనే ఈ మాటలు చెప్పబడుతున్నాయి. ఆయన మాత్రమే దేవుడు కాబట్టి ఆయనకు మాత్రమే బలులు అర్పించాలి. ఆయనకు కాకుండా అన్యదేవతలకు బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు.
నిర్గమకాండము 22:21
పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గదా.
ఈ వచనంలో పరదేశిని విసిగించవద్దని, బాధించవద్దని రాయబడడం, దానికి కారణం కూడా వివరించబడడం మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల మధ్యలో చాలామంది పరదేశులు వ్యాపారాల నిమిత్తం మరియు దాసత్వం నిమిత్తం నివసించేవారు. అందుకే వారికోసం ఈ మాటలు చెప్పబడ్డాయి. ఇవే ఈమాటలు మరలా మరలా కూడా జ్ఞాపకం చెయ్యబడ్డాయి.
నిర్గమకాండము 23:9 పరదేశిని బాధింపకూడదు; పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు; మీరు ఐగుప్తుదేశములో పరదేశులై యుంటిరిగదా.
లేవీయకాండము 19:33 మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు.
ఇలా చెప్పబడడం వెనుక "నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలనే" నియమం మనకు స్పష్టంగా కనిపిస్తుంది (లేవీయకాండము 19:34). యేసుక్రీస్తు ప్రభువు ఈమాటల సారాంశాన్నే తన సువార్తలో తెలియచేసారు.
మత్తయి సువార్త 7:12 కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము నైయున్నది.
నిర్గమకాండము 22:22-24
విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్ట కూడదు. వారు నీచేత ఏ విధముగా నైనను బాధనొంది నాకు మొఱ పెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను, మీ భార్యలు విధవ రాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కు లేనివారగుదురు.
ఈ వచనాలలో దేవుడు విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదని ఆజ్ఞాపిస్తూ, అలా బాధపెడితే ఆయన ఏం చేస్తాడో కూడా హెచ్చరించడం మనం చూస్తాం. ఎందుకంటే విధవరాలు మరియు దిక్కులేని పిల్లలు నిస్సహాయులుగా ఉంటారు. చాలామంది దానిని అదునుగా తీసుకుని వారిపై దౌర్జన్యం చేస్తుంటారు. అందుకే ఇక్కడ దేవుడు వారిపక్షంగా మాట్లాడుతున్నాడు. లేఖనాలలో ఇవే మాటలు మనకు మరలా మరలా జ్ఞాపకం చెయ్యబడుతుంటాయి. కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి విషయంలోనే కాదు నిస్సహాయులైన అందరివిషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ మాటలయొక్క భావం. ఉదాహరణకు ఆసరా లేనివారు, వికలాంగులు.
నిర్గమకాండము 22:25
నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింప కూడదు, వానికి వడ్డికట్టకూడదు.
ఈ వచనంలో దేవుని ప్రజలు సాటి దేవుని ప్రజలకు వడ్డీ నిమిత్తం అప్పు ఇవ్వకూడదని రాయబడడం మనం చూస్తాం. మనమంతా ఒకే దేవుని కుటుంబం కాబట్టి, మనం ఎవరికైనా ఇచ్చే సొమ్ము కష్ట సమయంలో చేబదులుగా ఇస్తున్నట్టుగా ఉండాలి తప్ప ఒడ్డీ సొమ్ము ఆశించి ఇచ్చేదిగా ఉండకూడదు. అలాగని న్యాయమైన వడ్డీ వ్యాపారానికి బైబిల్ వ్యతిరేకం కాదు. ఇతరులకు న్యాయమైన వడ్డీకి అప్పు ఇవ్వవచ్చు. కానీ దేవునిపిల్లల విషయంలో మాత్రం, వారికున్న ప్రత్యేకతను బట్టి అలా చెయ్యకూడదు.
ద్వితీయోపదేశకాండము 23:19,20 నీవు వెండినేగాని ఆహారద్రవ్యమునేగాని, వడ్డికి వేయ బడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు. అన్యునికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు.
నిర్గమకాండము 22:26,27
నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించువేళకు అది వానికి మరల అప్ప గించుము. వాడు కప్పుకొనునది అదే. అది వాని దేహ మునకు వస్త్రము; వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొఱపెట్టిన యెడల నేను విందును.
సాధారణంగా ఆకాలంలో వస్త్రాలను కూడా తాకట్టుగా పెట్టుకుని అప్పులు ఇచ్చేవారు. ఎందుకంటే ఆ కాలంలో వస్త్రాలు తయారు చెయ్యబడడం అనేది చాలా ప్రయాసతో కూడిన పని కాబట్టి వస్త్రాలకు చాలా విలువ ఉండేది. అలాంటి విలువైన వస్త్రాన్ని ఎవరైనా తాకట్టుగా పెట్టుకుని అప్పు ఇస్తే, తాకట్టు పెట్టిన వ్యక్తి చలితో పడుకోకుండా ఉండడానికి దానిని సాయంత్రానికల్లా అతనికి మరలా అప్పగించాలని, ఈ వచనాలలో మనం చూస్తాం. కావాలంటే ఉదయం దానిని తిరిగి తీసుకోవచ్చు. ఈ నియమం చలిని తట్టుకునేలా నెయ్యబడిన ఒకేఒక వస్త్రం ఉన్నవారి విషయంలో వర్తిస్తుంది.
ద్వితీయోపదేశకాండము 24:12 ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించు నట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.
ఒకవేళ ఆ తాకట్టు పెట్టిన వ్యక్తికి మరిన్ని వస్త్రాలు ఉంటే, అతను చలిని తట్టుకునేలా వాటిని ధరిస్తాడు కాబట్టి, దీనిని అనుసరించవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఈ నియమం అన్నింటి విషయంలోనూ వర్తిస్తుంది. ఒక వస్తువును మనం తాకట్టు పెట్టుకున్నప్పుడు అది అతనిదగ్గర లేకపోవడం ఆ వ్యక్తిని చాలా ఇబ్బందికి గురిచేస్తున్నట్టైతే తప్పకుండా దానిని అతనికి అప్పగించెయ్యాలి. ఒక వ్యక్తి జీవనానికి సంబంధించినవాటినైతే అసలు తాకట్టే పెట్టుకోకూడదు. అలాంటివారికి వ్యక్తిగత హామీచొప్పున కానీ, సాక్షుల హామీ చొప్పున కానీ అప్పును ఇస్తుండాలి.
ద్వితీయోపదేశకాండము 24:6 తిరగటినైనను తిరగటిమీద దిమ్మనైనను తాకట్టు పట్ట కూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే.
నిర్గమకాండము 22:28
నీవు దేవుని నిందింపగూడదు, నీ ప్రజలలోని అధి కారిని శపింపకూడదు.
ఈ వచనంలో మనం దేవుణ్ణి నిందించకూడదని, ప్రజలలో అధికారిని శపించకూడదని రాయబడడం మనం చూస్తాం. దేవుడు న్యాయవంతుడు కాబట్టి, ఆయనలో ఎటువంటి అన్యాయం ఉండదు కాబట్టి (కీర్తనలు 92:14, కీర్తనలు 128:4, యోబు 34:10), ఆయనను నిందించకూడదు. ఆయన తన చిత్తానుసారంగా మానవజీవితాల్లోకి శ్రమలను కూడా అనుమతించడానికి అధికారం కలిగినవాడు కాబట్టి (ఉదాహరణకు యోబు జీవితం), ఆయన సృష్టించుకున్న మనిషిజీవితంలో దేనినైనా జరిగించే హక్కు ఆయనకు ఉంటుంది కాబట్టి, ఒకవేళ మనం ఆయనచేత శ్రమలమార్గంలో నడిపించబడుతున్నప్పటికీ ఆయనను నిందించకూడదు. మరిముఖ్యంగా చాలాసార్లు శ్రమలు అనేవి మనం చేసిన అతిక్రమాలకు శిక్షగా విధించబడుతుంటాయి కాబట్టి, ఆ సమయంలో ఆయనను నిందించకూడదు.
అదేవిధంగా అధికారులు ఆ దేవుని చేత నియమించబడినవారు కాబట్టి, దేవునివలన కలిగిన అధికారం తప్ప మరేదీ లేదు కాబట్టి మనం వారిని కూడా శపించకూడదు.
రోమీయులకు 13:1,2 ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. కాబట్టి అధికారమును ఎది రించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.
ఒకవేళ ఆ అధికారులు చెడ్డవారైతే వారి సంగతి దేవుడు చూసుకుంటాడు. మనం మాత్రం వారిని శపించకూడదు. పౌలు దీనినే అనుసరిస్తూ చెడ్డవాడైన ప్రధానయాజకుడి విషయంలో కూడా పశ్చాత్తాపపడ్డాడు.
అపొస్తలుల కార్యములు 23:1-4 పౌలు మహా సభవారిని తేరిచూచిసహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవునియెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. అందుకు ప్రధానయాజకుడైన అననీయ అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్నవారికి ఆజ్ఞాపింపగా పౌలు అతనిని చూచిసున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను.దగ్గర నిలిచియున్నవారు నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి. "అందుకు పౌలు సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి యున్నదనెను".
మరోవిధంగా చెప్పాలంటే; అధికారులు మనకు శిక్షవిధించే అధికారాన్ని కలిగియుంటారు కాబట్టి, వారిని శపించి మనకు అపాయం తెచ్చుకోవద్దని హెచ్చరించడానికి కూడా "నీ ప్రజలలోని అధికారిని శపించకూడదనే" ఈ మాటలు రాయబడ్డాయి.
సామెతలు 20:2 రాజువలని భయము సింహగర్జనవంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందురు
నిర్గమకాండము 22:29,30
నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయ కూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. అట్లే నీ యెద్దులను నీ గొఱ్ఱెలను అర్పింపవలెను. ఏడు దినములు అది దాని తల్లియొద్ద ఉండవలెను. ఎనిమిదవ దినమున దానిని నాకియ్యవలెను.
ఈ వచనాలలో ఇశ్రాయేలీయులకు మొదటిగా జన్మించిన కుమారులను, అలాగే వారి పశువులకు మొదటిగా జన్మించినవాటిని కూడా దేవునికి అర్పించాలని రాయబడడం మనం చూస్తాం. కొందరు బైబిల్ విమర్శకులు ఇక్కడ రాయబడిన "నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. అట్లే నీ యెద్దులను నీ గొఱ్ఱెలను అర్పింపవలెను" అనే మాటలను చూపించి, ఇక్కడ బైబిల్ దేవుడు "యెద్దులనూ గొఱ్ఱెలనూ" బలిగా అర్పించినట్లే, మొదటిగా జన్మించిన కుమారులను కూడా బలిగా అర్పించమంటున్నాడని ఆరోపణ చేస్తుంటారు. కానీ ఇక్కడ "అర్పింపవలెను" అన్నప్పుడు దేవునికి ఇవ్వడం గురించి చెప్పబడుతుంది. అలా ఇవ్వబడినవాటిలో వేటిని బలిగా అర్పించాలో వేటిని విడిపించాలో 13వ అధ్యాయంలోనే దేవుడు వివరంగా రాయించాడు.
నిర్గమకాండము 13:2,11-15 ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను. యెహోవా నీతోను నీ పితరులతోను ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలి చూలుపిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగసంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని యెడల దాని మెడను విరుగదీయ వలెను. "నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగ వానిని వెలయిచ్చి విడిపింపవలెను". ఇకమీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతాన మంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; "అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను".
కాబట్టి బైబిల్ దేవుడు పసిపిల్లలను బలిగా కోరాడని ఆరోపించడానికి ఇక్కడ తావులేదు. పైగా ఆయన నరబలిని హేయమైనదిగా ద్వేషించేవాడు, ఆయన కనానీయులను సంహరించడానికి అది కూడా ప్రధానమైన కారణం.
ద్వితియోపదేశకాండము 12:31 తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవు డైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కూమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి వేయుదురు గదా.
తరువాత కాలంలో ఇశ్రాయేలీయులు కూడా కనానీయుల సంస్కృతి చొప్పున తమ పసిపిల్లలను అన్యదేవతలకు బలిగా అర్పిస్తున్నప్పుడు ఆయన దానిని తీవ్రంగా ప్రతిఘటించాడు. వారికి శిక్షవిధించాడు.
యిర్మియా 7:31-33 నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు. కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టు టకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును; ఇదే యెహోవా వాక్కు. ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహార మగును, వాటిని తోలివేయువాడు లేకపోవును.
నిర్గమకాండము 22:31
మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను.
ఈ వచనంలో ఏదైనా జంతువు చేతిలో హానిపొందిన జీవియొక్క మాంసాన్ని తినకుండా పడవెయ్యాలని రాయబడడం మనం చూస్తాం. ఇది దేవునిపిల్లల యొక్క ప్రతిష్టను సూచిస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయులకు ఎంతో పశుసంపదను ఇచ్చాడు, కాబట్టి వారు ఏమీలేదన్నట్టుగా చీల్చబడిన జీవియొక్క మాంసాన్ని తినడం వారిని వారు దిగజార్చుకోవడమే ఔతుంది. అందుకే అలా చీల్చబడిన మాంసం తినకూడదు. పైగా అలా జంతువుల చేతిలో చీల్చబడిన మాంసాన్ని తినడం వల్ల అనారోగ్యాలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
నిర్గమకాండము అధ్యాయం 22

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"