క్రైస్తవ్యం మరియు చట్టం

రచయిత: కె. విద్యా సాగర్
ఆడియో

Article Release అబార్షిన్ ఆమె హక్కా min

29-9-2020 గురువారం, మన దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు (త్రిసభ్య ధర్మాసనం) స్త్రీలకు అనారోగ్య సమయంలోనూ అత్యాచారాల్లోనూ భర్త ఏకాభిప్రాయంతోనూ ఏర్పడే గర్భధారణలను పరిగణలోకి తీసుకుంటూ, ఇవన్నీ ఆర్టికల్ 14 ప్రకారం స్త్రీల హక్కులకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి, అబార్షన్ చేయించుకోవడం అనేది "స్త్రీల హక్కు" అంటూ తీర్పునివ్వడం జరిగింది. అయితే, ఈ విషయంలో నేను మన దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని గౌరవిస్తూ సవినయంగా తెలియచేసేది ఏమిటంటే, త్రిసభ్య ధర్మాసనం ఇటువంటి తీర్పు ఇచ్చేముందు సమాజంపై అది చూపించబోయే దుష్ప్రభావాలను ఆలోచించకపోవడం, అటువంటి పరిస్థితులు చోటుచేసుకోకుండా తగిన ఆదేశాలు ఇవ్వకపోవడం (దుర్వినియోగం చేస్తే కఠినచర్యలు) చాలా విచారించవలసిన విషయం.

ఎందుకంటే, ఈ తీర్పు కారణంగా వివాహితులైన స్త్రీలు తమకు పిల్లలను కనడం ఇష్టం లేకపోతే అది వారి హక్కుగా భావిస్తూ, భర్త అనుమతితో పనిలేకుండా అబార్షన్ చేయించుకోవచ్చు. దానిని ఎవరైనా ప్రశ్నిస్తే ఇది నా భర్త ఏకాభిప్రాయం వల్ల ఏర్పడిన గర్భధారణ అని సాకుగా చెప్పడమూ ఆ విషయంలో వ్యతిరేకత చూపించిన భర్తపై వైవాహిక అత్యాచార ఆరోపణ మోపి జైలుకు పంపడమూ చేయవచ్చు. కొందరు భార్యలు తమ భర్తలపై ఇటువంటి అసత్య ఆరోపణలు చెయ్యడం కొత్తేం కాదని సమాజంలో ఏం జరుగుతుందో న్యాయబద్ధంగా పరిశీలించే అందరికీ తెలుసు. ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో మన‌ కళ్ళ ముందు జరుగుతున్నాయి.

మరొక విషయం ఏమిటంటే ఒక భార్య భర్త ద్వారానే గర్భవతిగా మారుతుంది. అలాంటపుడు ఆ గర్భాన్ని తొలగించుకోవడం కేవలం స్త్రీ హక్కు మాత్రమే ఎలా ఔతుంది? ఇటువంటి హక్కు కారణంగా, నేను పైన వివరించినట్టు కొందరు భార్యలు పిల్లలను కనడం ఇష్టంలేక అబార్షన్లు చేయించుకుంటే, అక్కడ తండ్రులు కావాలని ఆశపడే భర్తల సంగతేంటి? తండ్రులు అవ్వడం భర్తల హక్కు కాదా? ఇప్పటికే తమ అందం క్షీణిస్తుందని పిల్లలను కనడానికి ఇష్టపడని భార్యలెందరినో సమాజం చూస్తుంది. ఇలాంటివారు రేపటినుండి ధైర్యంగా అబార్షన్లు చేయించుకుని, ప్రశ్నించిన భర్తలపై అత్యాచార ఆరోపణలు చేస్తుంటే ఆ భార్యలపై గౌరవ సుప్రీం కోర్టు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? బాధితులకు ఎలా న్యాయం చేస్తుంది? గర్భాన్ని ఉంచుకోవాలా వద్దా అనేది స్త్రీ హక్కు మాత్రమే అయితే ఇంతకాలం ఆడపిల్లలను చంపేస్తున్నారనే కారణంతో స్కేనింగ్ సెంటర్లలో పిండ నిర్థారణను నేరంగా ఎందుకు పరిగణించినట్టు, ఆడపిల్లను కనాలో మగపిల్లాడిని కనాలో కూడా స్త్రీ హక్కే కదా? దానివల్ల ఆడపిల్లల పుట్టుకకు ప్రమాదం వాటిల్లితే, ఈ తీర్పువల్ల ఇప్పుడు శిశువులందరికీ ప్రమాదం వాటిల్లింది కదా?

కాబట్టి సుప్రీం‌ కోర్టు అబార్షన్ అనేది స్త్రీల హక్కుగా పేర్కోవడం నైతిక కోణంలో చూసినపుడు సబబుగా అనిపించడం లేదు. ఇది గర్భంలోని శిశువులకు పెను ప్రమాదంగా మారనుంది. అమెరికాలో ఇటువంటి పరిస్థితుల వల్లే ఆ దేశపు కోర్టు విచ్చలవిడి అబార్షన్లపై నియంత్రణ విధించింది. అలా అని తల్లి అనారోగ్యం కారణంగా చేయవలసి వచ్చే అబార్షన్లను నేను వ్యతిరేకించడం లేదు, కాకపోతే అది హక్కుగా కాదు కానీ, ఒక మినహాయింపుగా మాత్రమే అని గతంలో చట్టం కలిగియున్న దృక్పథాన్నే సమర్థిస్తున్నాను. ఎందుకంటే అది తల్లి ప్రాణాన్ని కాపాడడానికి తప్పనిసరి కాబట్టి. ఈ విషయాన్ని మానవత్వం‌‌ కలిగినవారందరూ ఆలోచించుకోవాలి.

అయితే ఈ తీర్పును బట్టి క్రైస్తవ స్త్రీలు కూడా అబార్షన్ అనేది తమ హక్కుగా భావించే అవకాశం ఉంది కాబట్టి లేఖనాల ప్రకారం అబార్షన్ అనేది దేవుని దృష్టిలో ఎంతటి నేరమో తెలియచెయ్యడానికి నేను ఈ వ్యాసం రాస్తున్నాను. అంతమాత్రమే కాకుండా ఇందులో ఒక విశ్వాసి చట్టానికి/ప్రభుత్వానికి ఏ పరిధిలో లోబడాలో కూడా వివరించి, చివరిగా ఈ అంశంపై ఉత్పన్నమయ్యే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను.

మొదటిగా, లేఖనాల ప్రకారం అబార్షన్ అనేది దేవుని సంకల్పానికి విరుద్ధమైనది. ఎందుకంటే దేవుడు ఆదాము హవ్వలను సృష్టించి వారిద్దరినీ ఏకశరీరంగా చేసి మీరు ఫలియించి అభివృద్ధి చెందాలని ఆదేశించాడు (ఆదికాండము 1:28). కాబట్టి వివాహ జీవితంలో లైంగిక సుఖాన్ని మాత్రమే కోరుకుంటూ తమ ఇష్టానుసారంగా దేవుని బహుమానమైన గర్భఫలాన్ని తృణీకరించేవారు దేవుని సంకల్పానికి వ్యతిరేకులు.

రెండవదిగా, లేఖనాల ప్రకారం అబార్షన్ అనేది నరహత్యతో సమానం. నరహత్య చెయ్యవద్దని లేఖనాలలో అనేకచోట్ల ఆజ్ఞాపించబడడం మనం చూస్తాం (ఆదికాండము 9:6, నిర్గమకాండము 20:13) ఈ కారణాన్ని బట్టి దేవుడు పాతనిబంధనలో ఎందరో రాజులనూ పట్టణాలనూ సర్వనాశనం చేసాడు. కాబట్టి అబార్షన్ అనేది తమ హక్కుగా భావించి గర్భంలోని శిశువులను చంపేవారంతా దేవుని న్యాయంలో నరహత్యకు తగిన శిక్షకు పాత్రులు‌ (ప్రకటన 21:8). అయితే కొందరు గర్భంలోని శిశువును చంపడం నరహత్య పరిధిలోకి రాదని వాదిస్తారు. కానీ, అండం ఫలధీకరణం చెందగానే జీవం (Zygote) ఏర్పడుతుంది, ఇది science చెప్పే వాస్తవం. దీనినిబట్టి అబార్షన్ అనేది నరహత్య కాదని చెప్పడం వీలుపడదు.

గర్భంలోని శిశువు ప్రాణాలకు హాని కలగడం నరహత్య కాబట్టే, గర్భిని స్త్రీకి ఎవరిమూలంగానైనా హాని‌ కలిగినప్పుడు ఆమెకు అకాల ప్రసవం జరిగి ఆ శిశువు ఒకవేళ సజీవంగా ఉండకుండా చనిపోతే ఆ హాని చేసినవాడికి మరణశిక్ష విధించాలని ధర్మశాస్త్రం చెబుతుంది (ఆ వాక్యభాగం తెలుగులో సరిగా అనువదించబడలేదు కాబట్టి ఇంగ్లీష్ నుండి పెడుతున్నాను చూడండి).

If men strive, and hurt a woman with child, so that her fruit depart from her, and yet no mischief follow: he shall be surely punished, according as the woman's husband will lay upon him; and he shall pay as the judges determine. "And if any mischief follow, then thou shalt give life for life"- "ప్రాణమునకు ప్రాణం"  (exodus 21:22,23).

మూడవదిగా, ఈ భూమిపై జన్మించే ప్రతీ మనిషీ కేవలం దేవుని మూలంగానే జన్మిస్తున్నాడు. ఈ విషయంలో స్త్రీ పురుషులు (భార్యాభర్తలు) కేవలం సాధనాలు మాత్రమే.

మొదటి కొరింథీయులకు 11:12 స్త్రీ పురుషుని నుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి.

కీర్తనలు 100: 3 యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను.

కీర్తనల గ్రంథము 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే.

ఈ భువిపై మానవ జననం అనేది కేవలం దేవుని‌మూలంగా జరుగుతుంది కాబట్టే, ఈరోజు ఎంతోమంది భార్యాభర్తలు పిల్లలు కావాలని ఎన్నో ప్రయాసలు పడుతున్నప్పటికీ పొందుకోలేకపోతున్నారు. కాబట్టి గర్భం ధరించడం నా గొప్పతనమని కానీ, గర్భాన్ని తొలగించుకోవడం నా హక్కు అని‌ కానీ భావించేవారు దేవునికి ప్రతిగా తమకు ఘనత ఆపాదించుకునే దైవద్రోహులు, కలుషాత్ములు, గర్వాంధులు. ఈ విషయాలను క్రైస్తవ స్త్రీలు అందరూ మనస్సులో ఉంచుకోవాలి.

ఇక విశ్వాసులు చట్టానికి/ప్రభుత్వానికి లేఖన పరిధిలోనే లోబడియుండాలనే విషయం మనం మరచిపోకూడదు (రోమా 13:1-3) ఈ కారణాన్ని బట్టి మన ప్రభుత్వాలు, కోర్టులు ప్రజలకు వాక్యవిరుద్ధమైన మినహాయింపులు కల్పిస్తున్నప్పటికీ వాటి ద్వారా మనం కలుషితం కాకుండా జాగ్రతవహించాలి. ఉదాహరణకు మనకు మాదిరిగా జీవించిన అపోస్తలులు తమ దేశపు అధికారులు విధించిన కట్టడ విషయంలో ఏవిధంగా స్పందిస్తున్నారో చూడండి.

అపొస్తలుల కార్యములు 4:19,20 అందుకు పేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి.

మానవ చట్టాలు మనుషులకు అనుకూలంగా మారుతుంటాయి, వాటికి కొన్నిసార్లు నైతికతతో పని ఉండదు. దానికి మంచి ఉదాహరణగా ఇప్పటికే కొన్ని దేశాలు (మన సుప్రీం కోర్టు కూడా) దేవుడు ఎంతగానో అసహ్యించుకున్న స్వలింగ సంపర్కాన్ని వారి హక్కుగా గుర్తించడం, మనం చూస్తున్నాం. ఉన్నపాటుగా ఒకే తల్లితండ్రులకు జన్మించిన పిల్లలు (Brothers & Sisters) వివాహం చేసుకున్నప్పటికీ లేక స్వచ్చందంగా లైంగిక సంబంధం‌ కలిగియున్నప్పటికీ దానిని కూడా కోర్టు వారి హక్కుగానే పరిగణించవచ్చు (ఇలాంటి సంబంధాలను నిషేధించే/నేరంగా గుర్తించే ఒక్కచట్టం కూడా మన దేశంలో అమలులో లేదని గమనించాలి).

హబక్కూకు 1: 7 వారు ప్రభుత్వమును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు.

అంతమాత్రమే కాదు ఒకసారి ఈ కోర్టు తీర్పులను కూడా మనం పరిశీలిస్తే, ఒక కోర్టు చెప్పిన తీర్పును మరొక కోర్టు కొట్టేస్తుంది. ఒక బెంచ్ (ధర్మాసనం) ఇచ్చిన తీర్పును మరొక బెంచ్ (ధర్మాసనం) తప్పుపడుతుంది. ఈ కారణంగా ఎంతమంది నిర్దోషులు దోషులుగా శిక్షించబడుతున్నారో, ఎంతమంది దోషులు నిర్దోషులుగా చలామణి ఔతున్నారో ఊహించండి. విజయవాడ అయోషా హత్య కేసులో నిందితుడిగా పరిగణించబడిన సత్యంబాబు ఏడు సంవత్సరాలు శిక్ష అనుభవించిన తరువాత నిర్దోషని తేలింది. యూపీలో అత్యాచారం కేసులో నిందితుడిగా శిక్షించబడిన వ్యక్తి 21 సంవత్సరాల తరువాత నిర్దోషని తేలింది. కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మానవమాత్రులైన న్యాయమూర్తుల చేత నిర్ణయించబడే న్యాయంలో ఇటువంటి లోపాలు మనకు తప్పకుండా కనిపిస్తాయి. కానీ దేవుని న్యాయం విషయంలో ఇటువంటి లోపాలు మనకు కనిపించవు. ఆయన ఆజ్ఞలు నైతికపరమైనవై, న్యాయమైనవై ఎప్పటికీ మారనివిగా ఉంటాయి. కాబట్టి మనం‌ దేవుని ఆజ్ఞల (మాటలు) ప్రకారంగానే ఈలోకంలో నడుచుకోవాలి.

కీర్తనలు 19: 9 యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.

హోషేయా 14: 9 జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహిం తురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతి మంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగు బాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.

అదేవిధంగా ఈ ప్రపంచంలోని కోర్టులు, ప్రభుత్వాలు దైవదృష్టికి హేయమైన కార్యాలను మానవ హక్కులుగా భావిస్తున్నపుడు ప్రతీ విశ్వాసీ యేసుక్రీస్తు పలికిన మాటలు జ్ఞాపకం‌ చేసుకోవాలి.

లూకా 17: 26,28 నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. లోతు దినములలో జరిగినట్టును జరుగును.

ఈ మాటలను బట్టి ప్రస్తుత ప్రపంచమంతా నోవహు దినాల్లోనూ లోతు దినాల్లోనూ ఉన్నట్టుగా దుర్మార్గంగా మారబోతున్నట్టు గ్రహించగలం. ఈ క్రమంలో విశ్వాసులు నోవహులా దేవుని దృష్టికి నిందారహితులుగా నడుచుకోవాలి (ఆదికాండము 6:9) నీతిమంతుడైన లోతువలే దుర్మార్గాన్ని చూసి బహు బాధపడేవారిగా ఉండాలి.

రెండవ పేతురు 2:7,8 - దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.

ఇప్పుడు ఈ అంశానికి సంబంధిన ప్రశ్నల దగ్గరకు వెళ్దాం.

1. సుప్రీం కోర్టు అబార్షన్ "స్త్రీల హక్కు" అనే తీర్పును ఇవ్వడానికి, అత్యాచారాల సమయంలోనూ అనారోగ్యంతో ఉన్న సమయంలోనూ వైవాహిక అత్యాచారాల సమయంలోనూ వారికి కలిగే గర్భధారణలే కారణంగా ఉన్నపుడు వాటిని పక్కన పెట్టి, కేవలం ఆ తీర్పు ద్వారా జరగబోయే దుష్ప్రభావాలను మాత్రమే ప్రస్తావించడం ఎంతవరకూ సబబు?

A. గౌరవ సుప్రీం కోర్టు అనారోగ్యంతో ఉన్న స్త్రీలు లేక అత్యాచారాలకు గురైన స్త్రీలు గర్భం దాల్చినపుడు వారి పరిస్థితులను బట్టి అబార్షన్ చేయించుకోవచ్చని ఒక వెసులబాటుగా దానిని ప్రస్తావించియుంటే, దానిపై నా స్పందన వేరేలా ఉండేది. ఇప్పటికే నేను అనారోగ్యంతో ఉన్న స్త్రీలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అబార్షన్ చేయించుకోవచ్చనే వెసులబాటును సమర్థించాను. అత్యాచారాల విషయం గురించి క్రింద మాట్లాడతాను. కానీ సుప్రీం కోర్టు ఏకంగా అబార్షన్ అనేది "స్త్రీల హక్కుగా" పేర్కోవడం‌ జరిగింది. దీనిని బట్టే నేను దుష్ప్రభావాలపై స్పందిస్తున్నాను. ఎందుకంటే కొందరు స్త్రీలు తమ పిల్లల విషయంలో ఎటువంటి క్రూరత్వానికి (చంపడం‌, హింసించడం) ఒడిగడుతున్నారో, భర్తలపై ఎటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారో న్యాయంగా ఆలోచించే సమాజానికి బాగా తెలుసు. ఈ కారణాన్ని బట్టి భవిష్యత్తులో మానవ మనుగడపై ఆందోళన చెందేవారు ఎవరైనా, ఆ తీర్పు అబార్షన్ అనేది స్త్రీల హక్కుగా చెప్పడాన్ని బట్టి, "కనీసం ఆ హక్కును దుర్వినియోగం చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారో అందులో ప్రస్తావించకపోవడాన్ని బట్టి" ముందుగా ఆ తీర్పుయొక్క దుష్ప్రభావాలపైనే స్పందిస్తారు. అమెరికాలో ఇటువంటి ఒక హక్కు కారణంగా ఎంతోమంది స్త్రీలు మా శరీరాలు మా ఇష్టమంటూ విచ్చలవిడి అబార్షన్లకు ఒడిగట్టలేదా?

పోని ఈ తీర్పును బట్టి కొందరు స్త్రీలు పిల్లలను కనడం కనకపోవడం అనేది కేవలం తమ హక్కుగా భావించి, ఇష్టానుసారంగా అబార్షన్ చేయించుకోరని కానీ దానిని ప్రతిఘటించే భర్తల విషయంలో వైవాహిక అత్యాచారమనే ఆరోపణ మోపి జైలుకు పంపరని కానీ ఎవరైన హామీ ఇవ్వగలరా? అలా ఇవ్వడానికి ఎవరైనా సిద్ధపడితే వారు ముందుగా ఇప్పటివరకూ స్త్రీలు తమ భర్తల విషయంలో చేసిన అసత్య ఆరోపణలు (కేసుల) విషయంలోనూ పిల్లలను చంపివేసిన/హింసించిన ఘటనల విషయంలోనూ వివరణ ఇవ్వవలసి ఉంటుంది.

ఇకపోతే వైవాహిక అత్యాచారాలు అంటున్నారు సరే, ఒక భార్యకు ఇష్టం లేకపోయినా భర్త ఆమెపై అత్యాచారం చేసాడు, దానివల్ల ఆమెకు గర్భం వచ్చింది అనుకుందాం. ఇంతకూ ఒక భార్య భర్తవల్ల గర్భవతి అవ్వడంలో ఉన్న ఇబ్బంది ఏంటి? కేవలం తనకు ఇష్టం లేని సమయంలో సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో గర్భాన్ని తొలగించుకోవాలా? ఒకవేళ గర్భధారణకు అది సమయం కాదంటారా? లేక ఆమె ఆరోగ్యం బాలేదు అంటారా? ఆరోగ్యం సంగతి పక్కనపెడదాం ఈ సమయం‌ సంగతి ఏంటి? పోని స్త్రీలు ఏ సమయంలో గర్భధారణకు సిద్ధమో ఏ సమయంలో సిద్ధం‌ కాదో ఆ తీర్పులో వివరణ ఏమైనా ఉందా?

ఒకవేళ ఎవరైనా భర్త భార్యను కేవలం లైంగిక అవసరతను తీర్చే వస్తువుగా వాడుకుంటూ, దానివల్ల పుట్టిన బిడ్డలను పట్టించుకోని మనస్తత్వంతో ఉంటే దానికి పరిష్కారం ఆ భర్తను శిక్షించడం, సరిచెయ్యడమే తప్ప అసలు ఆ బిడ్డే పుట్టకుండా కడుపులోనే చెంపెయ్యడం కాదు. అలాగైతే భార్య తన పిల్లలను పెంచే మనస్తత్వంతో లేదని గుర్తించిన ఒక భర్త తనవల్ల‌ కలిగిన ఆ గర్భాన్ని ఆమెకు తెలియకుండా అబార్షన్ అయ్యేలా చేస్తే దానిని ఒప్పుకుంటారా? పోని అతను పిల్లలను పెంచడానికి అది సరైన సమయం‌ కాదు అనుకుని ఆ పని‌ని చేస్తే అప్పుడైనా సమర్థిస్తారా? ఇలా ఎందుకు అంటున్నానంటే ఈ సమాజంలో పిల్లలను పెంచలేక వదిలేసిన తండ్రులే కాదు, పిల్లలను సాకలేక వదిలేసిన తల్లులు కూడా ఉన్నారు.

2. అబార్షన్ బైబిల్ ప్రకారం నరహత్య అయినపుడు అది ఏ కారణాన్ని బట్టి చేసినా నరహత్యేగా, తల్లుల అనారోగ్యం విషయంలో దానిని ఎందుకు మినహాయిస్తున్నట్టు?

A. ఎందుకంటే అక్కడ జరిగే అబార్షన్ ఒకరి హక్కుగా జరగడం లేదు, కేవలం తల్లి ప్రాణాలను కాపాడే ఏకైక మార్గంగా మాత్రమే జరుగుతుంది. నా ఇష్టమంటూ ఒక పని చెయ్యడానికి, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని చెయ్యడానికి చాలా తేడా ఉంది. అక్కడ తల్లి ప్రాణాలా బిడ్డ ప్రాణాలా అనే నిర్ణయంలో తల్లికి అప్పటికే ఈలోకంలో ఏర్పడిన సంబంధాలను బట్టి ఆమెకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. అంతమాత్రమే కాకుండా ఒక బిడ్డకు జన్మనిచ్చే పరిస్థితి (ఆరోగ్యం) లేని స్త్రీ విషయంలో అటువంటి నిర్ణయం తీసుకోకపోతే అటు తల్లి ప్రాణాలు ఇటు బిడ్ద ప్రాణాలు రెండూ దక్కవు. కాబట్టి వేరే ప్రత్యామ్నాయం లేని ఆ పరిస్థితి లో మాత్రమే దీనిని అనుమతించాలని చెబుతున్నాను.

3. ప్రియుల చేతిలో మోసపోయి గర్భవతులుగా మారినవారి సంగతేంటి?

A. నేను ఒక క్రైస్తవుడిగా బైబిల్ బోధిస్తున్న నైతిక విలువలు కలిగినవాడిగా ఈ వ్యాసం రాస్తున్నాను. ఆ నైతిక ప్రమాణం ప్రకారం వివాహానికి ముందు ఒక వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవడం వ్యభిచారం ఔతుంది, అది దేవుని దృష్టిలో నేరం. ఈ విషయంపై కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు కానీ దేవుని పోలిక దేవుని స్వరూపంలో జన్మిస్తున్న ప్రతీ మనిషికీ అవగాహన ఉంటుంది. ఈ కారణం చేత ప్రియుడి చేతిలో మోసపోయి గర్భవతిగా మారిన స్త్రీ వివాహానికి ముందు లైంగిక సంబంధం కలిగియుండకూడదనే నైతిక ప్రమాణానికి విరుద్ధంగా ప్రవర్తించబట్టే ఆ పరిస్థితి తెచ్చుకుంది. కాబట్టి దానికి ఆమె కూడా బాధ్యురాలు. సమాజంలో తప్పుచేసినవారు దానిని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చెయ్యడం సాధారణమే కదా! కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం చూపించవలసిన బాధ్యత నాపై లేదు.

అయితే ఇలాంటి సంఘటనల విషయంలో సమాజం "మోసపోయారనే" కారణాన్ని బట్టి వారిపై సానుభూతి చూపిస్తుంటుంది. కానీ నైతికత కలిగిన మనుషులంతా అక్కడ వారు ఊరికే మోసపోవడం లేదని, దానికి తమలోని నైతికవిరుద్ధమైన కోరికలే కారణమని గమనించాలి. యథార్థంగా ప్రేమించి మోసపోవడానికి, ప్రేమ ముసుగులో నైతికతకు విరుద్ధంగా ప్రవర్తించి (వ్యభిచారం చేసి) మోసపోవడానికి మధ్యలో చాలా వ్యత్యాసం‌ ఉంది. దీనిని సమర్థించుకోవడానికి "బలహీనులు, అమాయకులు" అనే డైలాగులు చెప్పవద్దు, అప్పుడు నేను అదే "బలహీనతను, అమాయకత్వాన్ని" చాలా విషయాలకు ఆపాదించవలసి వస్తుంది (ఈ సమాధానంలో నేను ప్రస్తావించిన మాటలు మానసిక వైఫల్యం కలిగిన స్త్రీలకు వర్తించవు)

4. అత్యాచారాల కారణంగా గర్భవతులు ఔతున్నవారి సంగతేంటి?

A. ఒక స్త్రీపై అత్యాచారం జరగడం మనుషులంగా మనమంతా విచారించవలసిన, ఖండించవలసిన విషయం. అయితే దానివల్ల గర్భవతులుగా మారినవారు దానికి ఒక సవాలుగా స్వీకరించి పుట్టిన బిడ్డను పెంచుకోవడమో లేక వేరేవారికి చట్టపరంగా దత్తతు ఇవ్వడమో చెయ్యగలగాలి. ఆ బిడ్డను చంపడం కంటే జీవించనివ్వడం గొప్ప విషయం కదా! అలా అని ఆమె జీవితాన్ని నాశనం చేసుకోమని నేను చెప్పడం లేదు, ఇటువంటి వారి విషయంలో సమాజం పరిణితి కలిగి ఆలోచించాలి. ఆమెపై జరిగింది కేవలం ఒక దాడిగా గుర్తించి ఆమె స్నేహితులలోనో బంధువులలోనో ఎవరైనా వ్యక్తి ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధపడాలి. ఇప్పటికే కొన్నిచోట్ల ఇటువంటి పరిణితి కలిగినవారిని మనం చూస్తున్నాం. ఒకవేళ ఇటువంటి పరిస్థితి లేక ఆమె అబార్షన్ చేయించుకుంటే, ఆ బిడ్డ చావు విషయంలో ఆమెపై అత్యాచారం చేసినవాడే కాదు, ఆ బిడ్డ ప్రాణానికి భరోసాగా నిలువలేని సమాజం కూడా నిందించబడాలి.

చివరిగా ముందు చెప్పినమాటలనే మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వ్యాసం యొక్క ప్రాథమిక ఉద్దేశం గౌరవ సుప్రీం కోర్టును తప్పుపట్టడం కాదు. ఈ "అబార్షన్ హక్కు" తీర్పుకు విశ్వాసులు ఎలా స్పందించాలో వాక్యం నుండి తెలియచెయ్యడమే నా ముఖ్యోద్దేశం. అయితే ఆ క్రమంలో ఈ తీర్పులో ఉన్న కొన్ని నైతిక లోపాలనూ అది సమాజంపై చూపించబోయే దుష్ప్రభావాలను వివరించవలసి వచ్చింది.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.