మోషే తన పని ప్రారంభించుట
నిర్గమ. 4:29-6:13; 6:28-7:25

ఉద్దేశము
ప్రభువునందు విశ్వాసముంచిన యెడల సత్యము మాట్లాడుటకు ఆయన మనకు ధైర్యం ఇస్తాడు అని బోధించుట.

ముఖ్యాంశము
ఎవరినైనా ఏదైనా అడగాలంటే మీరు భయపడతారా? స్కూల్ టైమ్ లో పర్మిషన్ కోసం టీచర్ ని అడగడానికి, వస్తువులు మార్చుకోవాలంటే షాపు యజమానిని అడగడానికి - ఇలా ఎన్నో ఉంటాయి. మీరు అడిగినది వారు ఇవ్వరు అని మనసులో అనిపిస్తుంటే ఇంకా భయం వేస్తుంది. మాట్లాడటానికి ముందు ఎంతో ఆలోచించి ధైర్యం తెచ్చుకుంటారు కదా! ఫరో దగ్గరకు వెళ్లే సమయంలో మోషేకు కూడా అలాగే అనిపించి ఉండవచ్చు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు విడిచి వెళ్లడం ఫరోకు ఇష్టం లేదు అని మోషేకు తెలుసు.

నేపధ్యము
ఐగుప్తులో నివసించుటకు వెళ్ళిన యోసేపు కుటుంబీకులు దేవుడు వాగ్దానము చేసిన విధముగా దాదాపు 20 లక్షల జనాంగముగా అభివృద్ధి చెందిన విషయము మీకు గుర్తుంది కదా! 400 సంవత్సరముల తరువాత ఇశ్రాయేలీయులను తిరిగి వారి వాగ్దాన దేశమైన కనానుకు నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఐగుప్తు రాజు అయిన ఫరో ఇశ్రాయేలు వారిపట్ల ఎంతో ద్వేషము కలిగి ఉండేవాడు. వారితో కఠినమైన పనులు, వెట్టి చాకిరి చేయించుకుంటూ ఎంతగానో కష్టపెట్టేవాడు. శ్రమలలో వారు దేవునికి ప్రార్ధించగా ఆయన వారి ప్రార్థనలు విన్నాడు. దేవుని వాగ్దానం ప్రకారం ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి పెట్టవలసిన సమయం కూడా దగ్గర పడింది. కాని వారిని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. మోషే చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుండి దేవుడు అతడిని కాపాడుతూ వచ్చాడు. 40 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు రాజభవనములో ఫరో కుమార్తెకు కుమారుడిగా సౌకర్యముగా జీవించాడు. ఒకరోజు ఐగుప్తీయుని చంపి భయముతో మిద్యాను దేశమునకు పారిపోయాడు. అక్కడ 40 సంవత్సరములు అరణ్యములో నివసించాడు. ఆ సమయములో దేవుడు మండుచున్న పొదలో నుండి మోషేతో మాటలాడి ఐగుప్తులో ఫరో దగ్గరకు వెళ్ళి ఇశ్రాయేలీయులను విడిచిపెట్టు అని నీవు చెప్పాలి అని ఆజ్ఞాపించాడు.

ఫరోను మొదటిసారి మోషే కలుసుకొనుట (నిర్గమ.4:29 - 6:13)
ఐగుప్తునకు వెళ్లుచున్న దారిలో మోషే తన అన్న అయిన ఆహరోనును కలుసుకున్నాడు (నిర్గమ. 4:27). వారు ఐగుప్తునకు వచ్చి ముందుగా ఇశ్రాయేలీయుల పెద్దలను కలిసారు. వారి బాధను, కష్టమును చూచి వారికి సహాయము చేయుటకు, ఐగుప్తీయుల చేతినుండి తప్పించుటకు తమను దేవుడు పంపించాడు అని వారితో చెప్పారు(నిర్గమ 3:18). ఇశ్రాయేలీయులకు ఎంత మంచి వార్త! దేవుడు తమ బాధను కనిపెట్టాడు అనే మాట ఇశ్రాయేలీయులు విని తలవంచి దేవునికి నమస్కరించారు (నిర్గమ4:31). మోషే అహరోనులు ఫరోతో మాట్లాడుటకు రాజభవనము లోపలికి వెళ్ళాలి. రాకుమారునిగా తాను ఆ భవనములో నివసించిన విషయం, అక్కడ నుండి పారిపోయిన విషయం కూడా మోషేకు గుర్తుకు వచ్చి ఉండవచ్చు. కానీ దేవుడు నీ ప్రాణమును తీయ చూచినవారు చనిపోయారు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మోషేకు ధైర్యం చెప్పాడు. అయినప్పటికి ఎంతో భయముగా మోషే అహరోనులు క్రూరుడైన ఐగుప్తు రాజు ఎదుట నిలువబడ్డారు. వారు ఫరోతో ఇశ్రాయేలీయుల దేవుడు అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్పారు( నిర్గమ.5:1). కాని, ఫరోకు ఆ మాటలు నచ్చలేదు. తమకు వెట్టిచాకిరి చేస్తున్న వారిని పంపివేయడం ఫరోకు ఇష్టం లేదు. అప్పుడు అతడు వారితో "నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు ప్రభువు ఎవడు? నేను మీ దేవుని ఎరుగను ఇశ్రాయేలలీయులను పోనీయను" అన్నాడు. ఎంత భయంకరమైన విషయం! దేవుని మాటలు వినుటకు ఫరో ఇష్టపడలేదు. వారందరూ విగ్రహారాధికులు కనుక నిజ దేవునియందు విశ్వాసముంచుటకు ఫరోకు మనస్సు లేదు. ఇశ్రాయేలీయులను పంపుమని చెప్పినందుకు ఫరో ఎంతో ఆగ్రహంతో నిండినవాడై వారిపట్ల క్రూరముగా ప్రవర్తించుటకు నిశ్చయించుకున్నాడు. ఆ దినమే ఫరో ప్రజలపై నియమించబడిన కార్యనియామకులను పిలిచి - ``ఇటుకలు చేయుటకు మీరు ఇకమీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారిమీద మోపవలెను. దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు కనుక మేమువెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొర్ర పెట్టుచున్నారు. వారిచేత ఎక్కువ పని చేయించవలెను, దానిలో వారు కష్టపడవలెను. అబద్ధపు మాటలను వారు లక్ష్యపెట్టకూడదు'' అని వారికి ఆజ్ఞాపించాడు. వారు ఇటుకలు తయారు చేయుటకు అవసరమైన వాటిని సమకూర్చుకొనుటకు ఐగుప్తు దేశమంతా చెదిరి పోయారు. వారు ఎప్పటివలె ఇటుకలు చేయలేకపోవడం చూచి, వారిపై ఉంచబడిన అధికారులు ఇశ్రాయేలీయులను కొడుతూ కష్టపెట్ట సాగారు.

ఇశ్రాయేలీయులు అంతకుముందుకంటే ఎక్కువ కష్టాలను ఎదుర్కొనసాగారు. వారు దారిలో మోషే అహరోనులను చూచి - "ప్రభువు మిమ్మును చూచి న్యాయము తీర్చునుగాక. ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్మ చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరి" అని చెప్పారు. వారు మోషే అహరోనులను నిందించసాగారు. ఆ పరిస్థితులలో మోషే దేవునికి ఈలాగు ప్రార్థించాడు - "ప్రభువా నీవెందుకు ఈ ప్రజలకు కీడు చేసితివి? నన్నేల పంపితివి? నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు నీవు నీ జనులను విడిపింపను లేదు" అని మొర్ర పెట్టాడు. దేవుడు మోషేను మరల ఫరో యొద్దకు వెళ్లి మాట్లాడమని ఆజ్ఞాపించాడు. కానీ ఈసారి ఫరో ఎదుట వారు సూచకక్రియలు చేయాలి అని తెలియచేశాడు.

ఫరోను రెండవసారి కలుసుకొనుట (నిర్గమ.7: 8-13)
ఇశ్రాయేలీయులను పోనిమ్ము అని చెప్పుటకు మోషే అహరోనులు మరల ఫరో దగ్గరకు వెళ్లారు. ఫరో వారితో ఒక మహత్కార్యము కనుపరచుమని అడిగాడు. మోషే అహరోను చేతిలోని కర్రను పట్టుకొని ఫరో యెదుట పడవేయమని చెప్పగా అహరోను అలాగే చేశాడు. వెంటనే ఆ కర్ర సర్పముగా మారింది. కదలలేని కర్రను పడవేస్తే అది పామువలె ప్రాకడం ఎంత ఆశ్చర్యం. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రగాండ్రను శకునగాండ్రను పిలిపించాడు. ఫరో ఆజ్ఞప్రకారం వారు కూడా మంత్రముల చేత తమ కర్రలను పడవేసి వాటిని సర్పములుగా మార్చారు. కానీ అహరోను కర్ర వారి కర్రల నన్నింటిని మింగివేసింది. తిరిగి అహరోను ఆ సర్పమును చేతిలోనికి తీసుకొనగానే అది కర్రగా మారిపోయింది. దేవుని మహాశక్తి వలన వారు ఆ అద్భుతాన్ని చేయగలిగారు. ఫరో ఇప్పుడు వారి మాటలను విన్నాడా? లేదు, ఫరో వారిని వారి మాటలను పట్టించుకొనలేదు. దేవుని పట్ల ఫరో హృదయం ఎంతో కఠినంగా మారింది.

ఫరోను మూడవసారి కలుసుకొనుట (నిర్గమ.7:14-25)
దేవుడు మోషే అహరోనులతో ప్రొద్దున బయలుదేరి యేటి ఒడ్డున ఫరోను కలుసుకొనుమని చెప్పాడు. ఫరోను చూచి మోషే - "అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను ఇశ్రాయేలీయుల దేవుడు నన్ను నీ యొద్దకు పంపెను నీవు ఇది వరకు వినకపోతివి" అని చెప్పాడు. అప్పుడు అహరోను కర్ర పట్టుకుని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదుల మీద, నీటి గుంటలన్నింటిమీద చేయి చాపగా నీరు అంతా రక్తముగా మారిపోయింది. ఐగుప్తీయులు యేటి నీళ్లు త్రాగలేకపోయారు. ఎంత భయంకరమైన విషయం! ఇది దేవుడు ఐగుప్తీయుల మీదకు పంపిన మొదటి తెగులు. వచ్చేవారం మిగిలిన వాటిని గురించి తెలుసుకుందాము. ఇశ్రాయేలీయులను పంపించకుండా ఫరో ఎన్నో కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన వలసివచ్చింది.

సందేశము
మోషే భయపడి నప్పటికి, అహరోనుతో కలిసి ఐగుప్తు దేశం వెళ్లి ఫరో దగ్గరకు వెళ్లాడు. దేవుడు వారితో కూడా ఉండి వారిని ఎంతో ధైర్యపరిచాడు. కానీ ఫరో ఎలా ఉన్నాడు? దేవుని మహత్కార్యములను చూచిన తరువాత కూడా దేవునియందు విశ్వాసముంచలేదు. ఎంతో కఠినంగా మొండిగా ప్రవర్తించాడు. తన విషయాలను మాత్రమే ఆలోచిస్తూ ఎంతో గర్వంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ దేవుని ప్రణాళిక ఎదుట ఫరో ఆలోచనలు నశించిపోవలసిందే. ఇశ్రాయేలీయుల యెడల ఎంతో కఠినంగా ప్రవర్తించిన ఫరోను, అతని జనులను దేవుడు శిక్షించనైయున్నాడు.

అన్వయింపు
ఫరోయెదుట నిలువబడి మాట్లాడడం మోషేకు ఎంతో కష్టమైన విషయం. ఫరో నా మాటలు ఎట్లు వినును అని మోషే దేవుని ప్రశ్నించాడు (నిర్గమ 6:28-30). ప్రభువు నీకు తోడుగా ఉంటాను అని పదేపదే మోషేకు చెప్పి బలపరిచాడు. కొన్నిసార్లు మనము కూడా కొన్ని విషయాల గురించి మాట్లాడవలసి వస్తుంది. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే దానిని గురించి మాట్లాడవలసిన అవసరం రావచ్చు. అలా మాట్లాడటం వలన మనకు ఎన్నో సమస్యలు రావచ్చు బెదిరింపులు రావచ్చు లేదా చాలా మంది దూరం కావచ్చు. కానీ మనము ప్రభువుకు ఇష్టమైన విధంగా నడుచుకోవాలి, ప్రభువైన యేసును గురించి ఇతరులతో పంచుకోవాలి, నిజాలను ధైర్యంగా మాట్లాడుటకు ప్రభువు సహాయాన్ని అడగాలి. ఆయన మనలను బలపరచి ధైర్యాన్ని ఇవ్వగలడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసం ఉంటే ఆయనకు ఇష్టమైన రీతిలో మాట్లాడగలము, జీవించగలము .

కంఠతవాక్యము
ప్రభువా నా ప్రార్థన ఆలకించుము నా మొర్ర నీ యొద్దకు చేర నిమ్ము - కీర్తన 102:1

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

  1. మోషే తన పని ప్రారంభించుట
  2. ఐగుప్తు దేశము మీద తెగుళ్ళు
  3. పస్కా పండుగ
  4. ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రమును దాటుట
  5. దేవుడు మన్నా కురిపించుట
  6. దేవుడు ఇశ్రాయేలీయులకు నీటిని సమకూర్చుట
  7. సీనాయి పర్వతం
  8. పది ఆజ్ఞలు
  9. బంగారు దూడ
  10. వేగులవారి సమాచారము
  11. ఇత్తడి సర్పము
  12. మోషే మరణము

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.