ఆదికాండము 12:1-7; అ.కా. 7:2-4; హెబ్రీ. 11:8-11
ఉద్దేశము/లక్ష్యము
కొన్నిసార్లు చాలా కాలం ఎదురు చూడవలసి వచ్చినప్పటికి దేవుడు తన వాగ్దానములు తప్పక నెరవేరుస్తాడు అని భోధించుట
గతవారము
అబ్రాహాము చేసిన పొరపాటు గురించి మనము గత వారం చూశాము. అబ్రాహాము ఏమి చేశాడు? అలా ఎందుకు చేశాడు? దేవుడు అబీమెలెకు రాజుతో ఏ విధముగా మాట్లాడాడు? దేవుడు రాజుతో ఏమి చెప్పాడు? రాజు శారాతో పాటు ఎన్నో బహుమతులు అబ్రాహామునకు ఇచ్చాడు. దేవుడు రాజును ఏ విధముగా ఆశీర్వదించాడు?
ముఖ్యాంశము
అమెరికా నుంచి ఇండియాకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను అని మీ మామయ్య ఫోన్ చేసి చెప్పాడు అనుకుందాము. నేను వచ్చేటప్పుడు మంచి బహుమతులు తెస్తాను అని చెప్పాడు అనుకోండి. ప్రతి నెల ఫోన్ చేసి అలాగే చెబుతున్నాడు. కొన్ని నెలల తరువాత మీకు అసలు మీ మామయ్య చెప్పిన మాటలు నిజమేనా, నిజంగానే వస్తాడా అని సందేహం కలుగుతుంది కదూ! కానీ అలా పదే పదే ఫోన్ చేసి చెప్పకపోతే మీరు మరిచిపోయే పరిస్థితులు రావచ్చు. సంతానము అనుగ్రహిస్తాను అని దేవుడు అబ్రాహాము శారాలకు చేసిన వాగ్దానము గురించి ఈరోజు తెలుసుకుందాము. దేవుడు పదే పదే తన వాగ్దానాలను వారికి గుర్తు చేస్తున్నప్పటికి, అవి నెరవేరడానికి వారు 25 సంవత్సరములు ఎదురు చూడవలసి వచ్చింది.
దేవుడు వాగ్దానము చేసిన మూడు సందర్భాలు
అబ్రాహాము కుటుంబము ఊరు పట్టణంలో నివసిస్తున్న సమయములో దేవుడు వాగ్దానము చేయడం మొదలైంది (ఆది 12:1-7) అబ్రాహామును ఆ పట్టణము వదలి వేరొక ప్రాంతమునకు వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఆ సందర్భములో దేవుడు అబ్రాహాముకు ఎన్నో వాగ్దానాలు చేశాడు."నీ సంతానం అత్యధికముగా విస్తరించి, నేను ఇవ్వనైయున్న దేశమును స్వతంత్రించుకుంటారు" అని దేవుడు అబ్రాహాముకు చెప్పాడు."భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును" అని కూడా వాగ్దానం చేశాడు. దేవుని మాటలకు అబ్రాహాము విధేయుడై భార్య అయిన శారాను, తన సహోదరుని కుమారుడైన లోతును తీసుకొని ఊరు నుండి బయలుదేరాడు. వారు హారానుకు చేరి అక్కడ కొన్ని సంవత్సరాలు నివసించారు. 75 సంవత్సరముల వయస్సు నందు అతని తండ్రి చనిపోయాడు. అప్పుడు దేవుడు తిరిగి ప్రత్యక్షమై తాను వాగ్దానము చేసిన దేశమునకు వెళ్ళమని అబ్రాహాముకు చెప్పాడు (అ. కా 7:4).
అబ్రాహాము కనాను దేశమునకు చేరుకున్నాడు. దేవుడు చేసిన వాగ్దానములలో మొదటిది నెరవేర్చబడటం చూచి అబ్రాహాము శారాలు ఎంతో సంతోషించి ఉండవచ్చు. అప్పుడు అబ్రాహాము షెకెము నందు ఒక బలిపీఠము కట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాడు. "నీ సంతానము ఈ భూమిని స్వాధీనం చేసుకుంటుంది" అని తన వాగ్దానాన్ని దేవుడు మరొకసారి అబ్రాహాముకు గుర్తుచేశాడు తిరిగి వాగ్దానాన్ని గుర్తు చేయుట అబ్రాహాము లోతు ఎంతో ధనవంతులైనట్లు మనము చూశాము (ఆది.13:14-18). గొర్రెలు, పశువులు విస్తారమైనందున వారు కలిసి నివసించ లేకపోయారు. లోతు సొదొమలో నివసించుటకు ఎన్నుకున్నాడు. తరువాత ప్రభువు అబ్రాహాముతో "కన్నులెత్తి నీవున్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము.
నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును, నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను" అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే అబ్రాహాము చేశాడు. అబ్రాహాము శారా గుడారములలో నివసిస్తూ, ఆ దేశమంతట సంచరిస్తూ, దేవుడు వాగ్దానము చేసిన ప్రదేశాన్ని చూశారు.
అబ్రాహాము దేవుని ప్రశ్నించుట
ఇంకను అబ్రాహాము శారాలకు సంతానము కలుగలేదు. ఒకరోజు అబ్రాహాము "ప్రభువా నాకేమి ఇచ్చిన నేమి? నేను సంతానము లేని వాడనై పోవుచున్నాను. నీవు నాకు సంతానము ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగును" అని దేవునితో చెప్పాడు (15:23). అప్పుడు దేవుడు అబ్రాహామును వెలుపలికి తీసుకొని వచ్చి "నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము" అని చెప్పాడు. రాత్రి సమయములో ఆకాశంలో కనిపించే నక్షత్రాలను మనము లెక్క పెట్టగలమా? కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి గనుక లెక్క పెట్టలేము. మనమే కాదు ఎవ్వరూ లెక్కపెట్టలేరు. దేవుడే నక్షత్రములను చేశాడు కనుక ఆయన మాత్రమే లెక్కించగలడు, అంతేకాక వాటిని పేర్లు పెట్టి పిలువ గలడు (కీర్తనలు 147: 4). దేవుడు తిరిగి అబ్రాహాముతో - "నీ సంతానము ఆకాశనక్షత్రములవలె అగును" అని చెప్పాడు. ఎంత అద్భుతం! అబ్రాహాము దేవుడు తనకు చెప్పిన మాటలన్నింటిని నమ్మాడు. దేవుడు ఒక దినాన తప్పకుండా తనకు శారాకు సంతానం దయచేస్తాడు అని విశ్వసించాడు.
అబ్రాహాము దేవుని విశ్వసించుట
సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అబ్రాహాము, శారాలకు సంతానము కలుగలేదు. దేవుడు తన వాగ్దానాన్ని మరిచి పోయాడా? అబ్రాహాము,శారా బహువృద్ధులు గనుక పిల్లలను కనడం అసాధ్యం. అబ్రాహాము 100 సంవత్సరములు, శారా 90 సంవత్సరముల వయస్సుకు దగ్గరలో ఉన్నారు. ఆ వయస్సులో సంతానాన్ని పొందడం మానవ రీతిగా అసాధ్యం. దేవుడు అబ్రాహాముతో "నేను శారాను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగజేసెదను" అని చెప్పాడు (17:16). అప్పుడు అబ్రాహాము దేవునితో "నూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబది యేండ్ల శారా కనునా?''అని ప్రశ్నించాడు. దేవుడు మరల - "నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును అతనికి ఇస్సాకు పేరు పెట్టుదువు" అని చెప్పాడు.(17:15-19)
శారా విశ్వసించక పోవడం
అబ్రాహాము దగ్గరకు ముగ్గురు అతిథులు వచ్చి భోజనం చేసిన తరువాత దేవుడు అబ్రాహాముతో సంభాషించాడు. మరొక సంవత్సరములో శారాకు కుమారుడు కలుగుతాడు అని దేవుడు చెప్పాడు. గుడారములో నుండి ఆ మాటలు వినిన శారా నవ్వుకుంది. వృద్ధురాలైన నేను కుమారుని ప్రసవించడం అసాధ్యం అని అనుకుంది. అప్పుడు - "ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా?'' అని దేవుడు ప్రశ్నించాడు. అబ్రాహాము వలె దేవుని వాగ్దానాలు శారా నమ్మలేక పోయింది.
ఇస్సాకు జననం
శారా దేవుడు తాను చేసిన వాగ్దానములు నెరవేర్చబోతున్నాడు అని తరువాత గ్రహించింది. తాను కుమారుని కనబోతున్నాను అని విశ్వసించింది (హెబ్రీ. 11:11). అబ్రాహాము, శారా ఎంతగా సంతోషించి ఉంటారు! ఎన్నో సంవత్సరాలుగా వారు కుమారుని కోసం ఎదురుచూస్తున్నారు. వారు కనాను దేశానికి వచ్చి 25 సంవత్సరములు గడిచిపోయాయి. చివరకు ప్రభువు తన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు.
దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలం లో శారా గర్భవతియై కుమారుని కన్నది (ఆది 21:1- 27). కుమారుడు జన్మిస్తాడు అని, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టమని దేవుడు ముందుగానే వారికి చెప్పాడు. శారా ముసలితనమున మాకు సంతానం కలిగింది అని అందరూ సంతోషిస్తారు అని తలంచింది. అబ్రాహాము ప్రతిదినము ఇస్సాకును ఎత్తుకొని బయటకు వెళ్ళి ఆకాశంలోని నక్షత్రములను చూస్తూ ప్రభువుకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి ఉండవచ్చు. తన సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఆ దేశాన్ని స్వాధీనపరచుకుటుంది అనే దేవుని వాగ్దానాన్ని అబ్రాహాము మరొకసారి గుర్తు చేసుకుని ఉండవచ్చు.
సందేశము
తన వాగ్దానాన్ని 25 సంవత్సరాల పాటు అబ్రాహాము శారాలకు అనేకమార్లు గుర్తు చేసిన దేవుడు, చివరకు ఇస్సాకును వారికి కుమారునిగా ఇచ్చాడు. వృద్ధాప్యంలో అబ్రాహాము శారాలకు కుమారుడు జన్మించడం గొప్ప అద్భుతం! ఆయన సమస్త సృష్టిని, నిన్ను, నన్ను చేసినవాడు. ఆయన శారాతో - ``ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా కలదా?'' అని చెప్పిన రీతిగా ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదు.
అన్వయింపు
స్నేహితుడు - అబ్రాహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు అని మీకు తెలుసా? (యాకోబు2:23; 2 ది.వృ20:7). దేవుని స్నేహితునిగా కలిగియుండుట ఎంత భాగ్యం! మన స్నేహితులు ఎన్నోసార్లు ఇచ్చిన మాట నెరవేర్చకుండా తప్పిపోతారు, కానీ దేవుడు తన వాగ్దనాలను తప్పక నెరవేర్చగలడు (సంఖ్యా 23 :19). మనము కూడా ఎలా దేవుని స్నేహితులము కాగలము? ప్రభువైన యేసు దానికి మార్గం చూపాడు. యేసు - "నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు" అని చెప్పాడు. మనము యేసుకు సమీపముగా వచ్చి ఆయన మాటలకు లోబడాలి. మన పాపముల కొరకు పశ్చాత్తాపపడి ఆయన మనలను క్షమించగలడు అని విశ్వసించాలి. ఆయన మనలను క్షమించేవరకు ప్రార్ధన చేయాలి. దేవుడు మాటతప్పని వాడు అని బైబిల్ లో వ్రాయబడింది (సంఖ్యా 23:19).
మాదిరి
దేవుని వాగ్దానములు నమ్మదగినవి అని అబ్రాహాము తన జీవితం ద్వారా ఒక మాదిరి చూపించాడు. మనకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలను వాగ్దానం చేశాడు. మిమ్మును ఎన్నడూ విడిచిపెట్టను సదాకాలము మీతోకూడ ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడు (మత్తయి 24:30,31). ఆయన మన త్రోవలను సరాళము చేస్తాడు అని సామెతలు 3:6 లో ఉంది. మన ప్రార్థనలు వింటాడు,వాటికి సమాధానం ఇస్తాడు అని కూడా బైబిల్ లో వ్రాయబడింది. బైబిల్ అంతా దేవుని అద్భుతమైన వాగ్దానములతో నిండి ఉన్నది. క్రైస్తవులముగా మనం కూడా దేవుని వాగ్దానములు నెరవేరేవరకు సహనంతో ఎదురుచూడాలి.
అబ్రాహాము వలె మనము బైబిల్ లోని దేవుని వాగ్దానములను విశ్వసిస్తున్నామా ?
గొప్ప వాగ్దానము
రానైయున్న కాలములో గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహిస్తాను అని ప్రభువు బైబిల్ లో చెప్పాడా? అవును, యేసు తాను మరల తిరిగి వస్తాను అని వాగ్దానం చేశాడు. రెండవసారి యేసు పసి బాలుడుగా కాదుగాని గొప్పరాజుగా రాబోతున్నాడు. ఆయన ప్రభావముతో, మహామహిమతో వస్తాడు అని మత్తయి 24:30 లో ఉంది. అబ్రాహాము దేవుని వాగ్దానములను విశ్వసించాడు. మీరు కూడా నమ్ముతున్నారా? ఆయన వాగ్దానములు విశ్వసిస్తున్నవారైతే ఆయన రెండవ రాకడ కోసం ఎదురుచూస్తారు.
ఉదాహరణ
150 సంవత్సరముల క్రితం జార్జ్ ముల్లర్ అనే గొప్ప విశ్వాసి అబ్రాహాము వలె దేవుని వాగ్దానాలను విశ్వసించాడు. తల్లిదండ్రులు లేని కొన్ని వేలమంది అనాథలకు ఆశ్రయం ఇవ్వడానికి ముల్లర్ ఒక అనాధ శరణాలయం (ఆర్ఫనేజ్) ప్రారంభించాడు. వారికి అవసరమైన బట్టలు, ఆహారము దేవుడే సమకూరుస్తాడు అని విశ్వసించాడు. కొన్నిసార్లు భోజనానికి ఏమీ ఉండేది కాదు. కానీ ప్రభువు ఖచ్చితంగా భోజనము చేసే సమయానికి అన్నింటిని సమకూర్చేవాడు. అక్కడ ఉండే పిల్లలకు ఒక్కసారి కూడా ఆహారం తక్కువ కాలేదు. ఒకరోజు వారు తినడానికి ఒక రొట్టె ముక్క కూడా ఆశ్రమంలో లేదు. ఆశ్రమములో ఉన్న వారందరు విశ్వాసముతోప్రార్ధించసాగారు. ఆ సమయంలో ఒక రొట్టెల వ్యాను పాడై వారి ఆశ్రమము ముందు నిలబడింది. వారు ఎంత ప్రయత్నించినా దానిని బాగు చేయలేక అందులోని రొట్టెల నన్నింటిని ఆ అనాధ ఆశ్రమంలో ఇచ్చి వెళ్లిపోయారు.
దేవుడు తన వాగ్దానములను తప్పక నెరవేరుస్తాడు. అనాధ ఆశ్రమం పెట్టమని ముల్లర్ కు చెప్పిన దేవుడు దానికి అవసరమైనది సమకూరుస్తాను అని వాగ్దానం చేశాడు. దానిని చివరి వరకు నెరవేర్చాడు. అబ్రాహాము కూడా తన జీవితములో దేవుని వాగ్దానముల నెరవేర్పును చూశాడు. మరి మన జీవితాలలో దేవుని వాగ్దానాలను మనము నమ్మగలుగుతున్నామా?
కంఠతవాక్యము
వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు (హెబ్రీ. 10:23)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF