ఆదికాండము 41:46 మరియు 45వ అధ్యాయము

ఉద్దేశము
మనుష్యులు తాము చేసిన తప్పుల విషయములో నిజముగా పశ్చాత్తాపపడిన యెడల వారిని క్షమించాలి అని బోధించుట.

ముఖ్యాంశము
మీ అమ్మ లడ్లు తయారు చేసి ఇంటిలో అందరికీ పంచి, మీ నాన్నగారి కోసం కొన్ని తీసి ప్రక్కన దాచిపెట్టింది అనుకోండి. మీరు రహస్యంగా వెళ్లి అది కూడా తిని వేస్తే ఆమెకు ఎంతో కోపం వస్తుంది కదూ! మిమ్మల్ని కొట్టవచ్చు కూడా. కాని తరువాత మీరు వెళ్లి ఎప్పుడూ అలా చేయను అని మాట ఇచ్చి క్షమించమన్నప్పుడు ఆమె తప్పక క్షమిస్తుంది. మీరు మళ్లీ అలా చేయరు అని మీ అమ్మ నమ్మడం వలన క్షమించగలిగింది. మిమ్మల్ని పరీక్షించడానికి మరొకసారి కూడా ఆ విధముగానే చేయవచ్చు. మీరు అ లడ్లు రెండవసారి తీసుకొనకపోతే మీరు నిజముగా మారారు అని మీ అమ్మ నమ్ముతుంది.

గతవారము
యోసేపు కలలుఏ విధముగా నెరవేరాయి అనే విషయము మనము గతవారం చూశాము. ఆ కలలు ఏమిటి? కలలో కనిపించిన విధముగా యోసేపు సహోదరులు అతని యెదుట సాగిలపడ్డారు. 20 సంవత్సరముల క్రిందట తనకు కలిగిన స్వప్నములు నెరవేరాయి అని యోసేపు గ్రహించాడు. 20 సంవత్సరముల క్రిందట యోసేపుకు తాము చేసిన కీడును గురించి అతని సహోదరులు బాధపడుతూ మాట్లాడుకోవడం యోసేపు విన్నాడు. కాని వారు నిజముగా మారారా లేదా అని ఖచ్చితంగా తెలుసుకోవాలి అని యోసేపు అనుకున్నాడు. వారు మరల అటువంటి పనులు చేస్తారా లేదా అనే విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకోవాలి అని అనుకున్నాడు.

బెన్యామీనును కూడా తమతో పంపుమని మిగిలినవారు యాకోబును అడిగినప్పుడు అతడు ఎంతో దుఃఖ పడ్డాడు. యోసేపు వలె బెన్యామీను కూడా చనిపోతే తాను బ్రతకలేను అని యాకోబు దుఃఖించాడు. మిగిలిన కుమారులతో కూడా బెన్యామీనును ఐగుప్తు పంపవలసి రావడం యాకోబును ఎంతో బాధించింది. కాని ఐగుప్తుకు వెళ్లకపోతే ఆహారము దొరకదు అని యాకోబుకు తెలుసు.

యోసేపు సహోదరులు తిరిగి ఐగుప్తు చేరుట
కొన్ని దినముల తరువాత బెన్యామీనుతో కూడా ఐగుప్తుకు వెళ్ళి ఆహారము తీసికొని రమ్మని యాకోబు మిగిలిన కుమారులతో చెప్పాడు. దేవుడు వారికి తోడుగా ఉండి క్షేమంగా తిరిగి తీసుకొని వస్తాడు అని యాకోబు విశ్వసించాడు. తమతో కఠినంగా మాట్లాడి ధాన్యము ఇప్పించిన వ్యక్తి ఎన్నో సంవత్సరాల క్రిందట తాము దాసునిగా అమ్మివేసిన యోసేపు అని వారు గుర్తు పట్టలేకపోయారు. వారు రెండవసారి ఐగుప్తునకు వెళ్ళినప్పుడు యోసేపు వారిని తనతో కలిసి భోజనము చేయుటకు పిలిపించాడు. వారు ఆ విషయము తెలియక ఎంతో భయపడ్డారు. యోసేపు ఇంటికి తమను ఎందుకు తీసుకొని వచ్చారో వారికి అర్థం కాలేదు. తమ గోనెసంచులలో దొరికిన డబ్బుల నిమిత్తము తమను ప్రశ్నించడానికి పిలిచి ఉంటాడు అని తలంచారు. తాము ఎటువంటి తప్పు చేయలేదు అని ఎలా నిరూపించు కోవాలి అని వారు ఆలోచించసాగారు. తాము దొంగలమని తలంచి యోసేపు చంపివేస్తాడు అని వారు భయపడ్డారు. తమ గోనెసంచులలో దొరికిన డబ్బుతో పాటు, యోసేపుకు ఇవ్వడానికి కొన్నికానుకలను కూడా వారు తీసుకొని వచ్చారు.

యోసేపు తన సహోదరులకు భోజనము ఏర్పాటు చేయుట

యోసేపు తన సహోదరుల నందరిని భోజనానికి పిలిచాడు. వారు యోసేపు ఇంటికి వెళ్లగానే షిమ్యోను కూడా వారిని కలుసుకున్నాడు. వారందరూ కాళ్ళు కడుగుకొని యోసేపు కొరకు ఎదురుచూడసాగారు. ఏమి జరగబోతుందో వారికి అర్థం కాలేదు. వారు యోసేపు కొరకు కానుకను సిద్ధముచేసి ఎదురు చూస్తూ కూర్చున్నారు.

యోసేపు మధ్యాహ్నము అక్కడకు వచ్చాడు. అప్పుడు వారు తాము తీసుకొని వచ్చిన మస్తకి, తేనె, సుగంధద్రవ్యాలు, బోళము, పిస్తాచకాయలు, బాదం కాయలు తీసుకొని కానుకగా యోసేపుకు ఇచ్చి అతని యెదుట సాగిలపడ్డారు. అప్పుడు యోసేపు కన్నులెత్తి తన తల్లి కుమారుడు, తన తమ్ముడైన బెన్యామీనును చూసాడు. తన సొంత తమ్ముని 20 సంవత్సరముల తరువాత చూడడం యోసేపుకు ఎంతో సంతోషం కలిగించింది. యోసేపుకు తన తమ్ముడి పట్ల ప్రేమ పొర్లుకొని వచ్చుట వలన దుఃఖం కలిగింది. అతడు త్వరపడి ఏడ్చుటకు లోపలి గదిలోకి వెళ్ళాడు. తరువాత అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చాడు.

వారు తమ తమ వయస్సు ప్రకారము వరుసగా భోజనము చేయుటకు కూర్చున్నారు. అది చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వారందరూ కలిసి భోజనం చేసిన తరువాత వారు అక్కడ నుండి వెళ్లిపోయారు. యోసేపు తమను శిక్షించనందుకు వారు ఎంతో సంతోషించారు. త్వరలో అందరూ కలిసి తండ్రి దగ్గరకు వెళ్ళవచ్చు అని అనుకున్నారు.

యోసేపు తన సహోదరులను పరీక్షించుట

తన సహోదరులు నిజముగా మారినట్లయితే తనపట్ల చేసినట్లు, మరెన్నడు ఎవరికీ చేయరు అని యోసేపుకు తెలుసు. తన తమ్ముడైన బెన్యామీను పట్ల వారు ఎలా ప్రవర్తిస్తున్నారు తెలుసుకోవాలి అని యోసేపు తలంచాడు. బెన్యామీను అందరికంటె చిన్నవాడు గనుక యాకోబు అతనిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండవచ్చు. వారు తన పట్ల ఎలా ఈర్ష్యపడ్డారో బెన్యామీను పట్ల కూడా అలాగే ఉన్నారా అని పరీక్షించుటకు యోసేపు ఒక ఆలోచన చేశాడు.

తన సహోదరుల గోనె సంచులలో పట్టినంత ఆహారపదార్ధములు నింపి, ఎవరి డబ్బులు వారి సంచిలో ఉంచుమని యోసేపు తన గృహనిర్వాహకునితో చెప్పాడు. బెన్యామీను గోనెసంచిలో తన వెండి గిన్నెను కూడా ఉంచమని చెప్పాడు. యోసేపు సహోదరులకు ఈ విషయాలు ఏమీ తెలియదు. తెల్లవారినప్పుడు వారు తమ గాడిదలను కట్టుకొని ఎంతో సంతోషంగా బయలుదేరారు. వారు పట్టణము వెలుపలికి రాగానే యోసేపు గృహ నిర్వాహకుడు వచ్చి వారిని కలుసుకున్నాడు. అతడు వారిని - " మీరు మేలుకు కీడు చేయనేల? మీరు నా ప్రభువు గిన్నె ఎందుకు దొంగిలితిరి?" అని ప్రశ్నించాడు. తాము అటువంటివారము కాదు అని వారు అతనికి చెప్పారు. తాము దొంగతనం చేయలేదు గనుక వారు భయపడలేదు. అప్పుడు ఆ గృహనిర్వాహకుడు వారితో - "ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకునో అతడే నాకు దాసుడగును.అతడు తిరిగి ఐగుప్తుకు రావలెను" అని చెప్పాడు. అప్పుడు వారందరు తమ గోనె సంచులను క్రిందికి దించి వాటిని తెరిచారు. బెన్యామీను సంచిలో ఆ వెండి గిన్నె దొరికింది. బెన్యామీను దాసునిగా ఐగుప్తు వెళ్ళాలి అనే ఆలోచన వారికి ఎంతో బాధ కలిగించింది. బెన్యామీను వారికి తాను ఆ గిన్నెను దొంగిలించ లేదని, అది ఎలా తన సంచిలో ఉన్నదో తెలియదు అని చెప్పి ఉండవచ్చు. వారికి ఏమి చేయాలో అర్థం కాలేదు. తమ తండ్రికి ఏమి చెప్పాలి? అని భయపడ్డారు. తిరిగి వారందరు ఐగుప్తుకు వెళ్లారు. అక్కడ యోసేపు వారితో కోపంగా మాట్లాడసాగాడు. యోసేపు వారితో - ``బెన్యామీను మాత్రమే నాకు దాసుడై ఉండాలి మిగిలిన వారు మీ తండ్రి వద్దకు వెళ్ళవచ్చు" అని చెప్పాడు.

ఇది యోసేపు సహోదరులకు పెద్ద పరీక్ష. వారిప్పుడు ఏమి చేయాలి? బెన్యామీనును అక్కడే వదిలి వెళ్ళిపోతారా? 20 సంవత్సరముల క్రిందట తనను వదిలివేసినట్లు బెన్యామీనును కూడా వదిలి వేస్తారా అని యోసేపు ఆలోచించసాగాడు. బెన్యామీనును వదిలి వెళ్ళిపోతే తండ్రికి ఏమి చెప్పగలరు? వారి ఆలోచనలు ఏమిటి?యోసేపు వారిని జాగ్రత్తగా పరీక్షిస్తున్నాడు.

యోసేపు సహోదరులలో నిజమైన మార్పు

సహోదరులలో యూదా యోసేపు దగ్గరకు వెళ్లి బెన్యామీనును విడిచిపెట్టమని మనవి చేసాడు. తమ తండ్రి బెన్యామీనును ఎంతగా ప్రేమిస్తాడో యోసేపుకు వివరించాడు. బెన్యామీనును తీసుకుని వెళ్లకపోతే తమ తండ్రి తప్పకుండా చనిపోతాడు అని చెప్పాడు. యూదా చివరగా యోసేపుతో - " కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము" అని మనవిచేశాడు.

యూదా మాటలు వినిన తరువాత వారిలో కలిగిన మార్పును చూచి యోసేపు ఎంతో ఆశ్చర్యపోయాడు. సహోదరులు తాము చేసిన పొరపాట్ల ద్వారా అవసరమైన పాఠాలు నేర్చుకున్నారు. బెన్యామీను, యాకోబుల విషయములో వారు ఎంతో శ్రద్ధ చూపుతున్నారు అని యోసేపు గ్రహించాడు. వారు గతములో తన పట్ల చేసిన కీడును గురించి పశ్చాత్తాప పడ్డారు అని యోసేపుకు అర్థమైంది.

తన సహోదరులలో అప్పుడు ఉన్నకఠినత్వం ద్వేషానికి బదులుగా ప్రేమను, ఆప్యాయతను యోసేపు చూడగలిగాడు. యోసేపు తనను తాను అదుపు చేసుకోలేక తన సహోదరులను తప్ప మిగిలిన వారందరిని బయటకు పంపి వేసి గట్టిగా ఏడ్చాడు. ఐగుప్తీయులు, ఫరో యింటి వారందరికి కూడా ఆ ఏడుపు వినిపించింది. అప్పుడు యోసేపు తన సహోదరులతో - " నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా?" అని అడుగగా అతని సహోదరులు ఆశ్చర్యముతో సమాధానం చెప్పలేక పోయారు. 20 సంవత్సరముల క్రితం దాసునిగా తాము అమ్మి వేసిన తమ సహోదరుడు ఇప్పుడు ఐగుప్తు దేశమంతటిపై అధికారి అని తెలియగానే వారు దిగ్భ్రాంతితో ఉండిపోయారు.

అప్పుడు యోసేపు వారితో - "నా దగ్గరకు రండి నేను ఇక్కడకు వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. దేవుడు నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికందరికి ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్లి నీ కుమారుడైన యోసేపును దేవుడు ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. నా యొద్దకు రమ్ము నీవు అక్కడ ఉండవద్దు. అప్పుడు అందరూ

నాకు సమీపముగా ఉండవచ్చు, నేను మిమ్మును పోషించెదను" అని చెప్పాడు. అతడు తన తమ్ముడైన బెన్యామీను, మిగిలిన సహోదరులను ముద్దుపెట్టుకొని ఏడ్చాడు. తరువాత అతని సహోదరులు సంతోషించి, యోసేపుతో మాట్లాడసాగారు. యోసేపు బ్రతికి ఉన్నాడు అన్న సంగతి వినిన యాకోబు ఏమి చేసాడో వచ్చేవారం తెలుసుకుందాము.

సందేశము
తన సహోదరులు తమ చెడు పనుల విషయంలో పశ్చాత్తాప పడిన విషయం యోసేపు పరీక్షించి తెలిసికొన గలిగాడు. తమ ప్రవర్తన ద్వారా వారు తమ మార్పును స్పష్టంగా చూపించగలిగారు. యోసేపు ఎంతో సంతోషంగా వారిని క్షమించగలిగాడు. 20 సంవత్సరముల క్రిందట తనకు వచ్చిన కలల విషయములో తన సహోదరులకు కోపము వచ్చినా, అవి తన జీవితములో నెరవేరుతాయి అని యోసేపు విశ్వసించాడు. పోతీఫరు ఇంటిలో ఉన్నా, చెరసాలలో ఉన్నా దేవుడు తన జీవితంపై అధికారిగా ఉన్నాడు అని యోసేపు అర్థం చేసుకున్నాడు. దేవుడు తన ప్రణాళిక చొప్పున ముందుగానే తనను ఐగుప్తుకు పంపించాడు గనుక బాధపడవద్దు అని యోసేపు తన సహోదరులకు ధైర్యంచెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం! తన సహోదరులు తనకు హాని చేసినందుకు వారిపై ద్వేషంతో యోసేపు వారిని చెరసాలలో వేసి ఉండవచ్చు. కాని వారు నిజముగా పశ్చాత్తాపపడి నందు వలన యోసేపు వారిని క్షమించాడు.

అన్వయింపు
కొన్నిసార్లు మనము పొరపాటు చేసినప్పుడు అమ్మ నాన్నలను క్షమించమని అడుగుతాము. కాని నిజముగా పశ్చాత్తాపముతో అడుగుతామా? మనము నిజముగా పశ్చాత్తాపపడితే మరెన్నడూ ఆ పొరపాటు చేయకుండా ఉంటాము. నిజముగా పశ్చాత్తాపముతో మనలను ఎవరైనా క్షమించమని అడిగితే వారిని క్షమించాలి. ఇతరుల తప్పులను మనము క్షమించ లేకపోతే, మన తప్పులు క్షమించమని దేవుని ఎలా అడగగలము? (మత్తయి 6:14).

ఉదాహరణ
జిమ్ ఇలియట్ తన నలుగురు స్నేహితులతో కలసి ఈక్వెడార్ దగ్గర అడవులలో ఆకాజాతి వారికి క్రీస్తును గురించి చెప్పడానికి వెళ్లారు. వారు తమతో స్నేహంగా ఉంటూ,తమ మాటలు వింటున్నందుకు వారు ఎంతో సంతోషించారు. వారిపట్ల తాము చూపుతున్న ప్రేమకు, దయకు వారు ఎంతో ఆకర్షింప బడ్డారు అని అనుకున్నారు. కానీ 1956 సంవత్సరములో జనవరి 8న ఆకాజాతి వారు వారిపై దాడి చేసి అందరినీ చంపేశారు. యౌవనస్థులైన వారి భార్యలు ఎంతో దుఃఖంతో నిండిపోయారు.

కాని జిమ్ ఇలియట్ భార్య ఎలిజబెత్ తన భర్తను చంపిన వారి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసేది. వారిపట్ల ఆమె హృదయములో ఏ మాత్రము ద్వేషంలేదు. క్రీస్తు ప్రేమతో ఆమె నింపబడింది. అనేక సంవత్సరముల తరువాత అనేకమంది ఆకా జాతివారు పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొంది క్రైస్తవులుగా మారారు అని ఆమె తెలిసికొని ఎంతో సంతోషించింది. ప్రభువైన యేసు మన హృదయాలలో తన ప్రేమను ఉంచాడు గనుక మన శత్రువులను మనము కూడా క్షమించగలగాలి.

కంఠతవాక్యము
క్షమించుడి అప్పుడు మీరు క్షమించ బడుదురు (లూకా6:38)

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.