దావీదు - గొల్యాతు
1 సమూయేలు 17వ అధ్యాయము

ఉద్దేశము
మన జీవితములో మహా గొప్ప విపత్తులను ఎదుర్కొను సమయములో ప్రభువుపై ఆధారపడాలి అని బోధించుట.

ముఖ్యాంశము
కొంతమంది చాలా పెద్ద శరీరాకారము కలిగి ఉంటారు. మన మధ్యలో అటువంటి వారు ఎక్కువగా కనిపించరు. పాత రోజులలో చాలామంది అటువంటి భారీ శరీరం కలిగి ఉండేవారు. గిన్నిస్ రికార్డులు చూస్తే అందులో 8 అడుగుల 8 అంగుళాలు ఎత్తు గల వ్యక్తి కూడా ఉన్నాడు అని మనము తెలుసుకోవచ్చు. దావీదు దినములలో ఫిలిష్తీయుల దేశములో గొల్యాతు అనే ఒక శూరుడు ఉండేవాడు. అటువంటి గొప్ప శూరుడుని దావీదు ఎలా చంపివేశాడో ఈ రోజు తెలుసుకుందాం.

గతవారము
ఇశ్రాయేలీయులు తమ మొదటి రాజును ఏ విధముగా ఏర్పరచుకున్నారో చూసాము. ఆ రాజు పేరు మీకు గుర్తుందా? అవును సౌలు, అతడు ఎటువంటి రాజు? అతని హృదయము చెడుతనము కలిగినది మరియు అతడు ప్రభువును ప్రేమించే వాడు కాదు. సౌలుపై దేవునికి ఎందుకు కోపం కలిగింది? ఎందుకంటే అతని అవిధేయతను బట్టి. దేవుడు సమూయేలుకు ఏమి ఆజ్ఞాపించాడు? సౌలు స్థానములో రాజుగా ఉండుటకు బేత్లెహేములోని యెషయి కుమారులలో ఒకని అభిషేకించుమని చెప్పాడు. తనపై దావీదుకు ఉన్న ప్రేమను, విశ్వాసాన్ని, అతని హృదయాన్ని దేవుడు గ్రహించాడు. దావీదు వెంటనే రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాడా? లేదు, సౌలు మరణించువరకు ఎదురు చూడవలసి వచ్చింది. సమూయేలు చేత అభిషేకము పొందిన తరువాత దావీదు ఎప్పటివలె తన ఇంటి వారి గొర్రెలను కాయ సాగాడు.

దావీదు తన సహోదరుల యొద్దకు వెళ్ళుట
దావీదు జీవితాన్ని మార్చి వేసిన ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఫిలిష్తీయులు తమ సైన్యమును సమకూర్చుకుని ఇశ్రాయేలు దేశము మీదికి యుద్ధానికి వచ్చారు. సౌలు కూడా తన సైన్యాన్ని సమకూర్చాడు. దావీదు సహోదరులలో ముగ్గురు సౌలు సైన్యములో ఉండి యుద్దానికి బయలుదేరారు. దావీదు గొర్రెలను మేపేవాడు గనుక సైన్యములో చేరి ఉండకపోవచ్చు. ఒకరోజు యెషయి తన కుమారుడైన దావీదు ను పిలిచి - "నీ సహోదరులకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు ఈ పది జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతి కిమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలిసికొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకొని రమ్మ"అని చెప్పి పంపించాడు. దావీదు ఉదయమే లేచి గొర్రెలను ఒక కాపరికి అప్పగించి ఆ వస్తువులను తీసికొని ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ స్థలం దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. దావీదు అక్కడకు చేరుకొని సైన్యము లోపలికి వెళ్లి తన సహోదరుల యోగక్షేమములు అడిగాడు. ఏలా లోయలో పర్వతము ఒక తట్టు ఫిలిష్తీయులు, ఇంకొక తట్టు ఇశ్రాయేలీయులు సైన్యమును కూర్చుకొని ఉండుట దావీదు చూశాడు. ఫిలిష్తీయుల దండు ముందుగా గొల్యాతు అనే శూరుడు నడవడం కూడా దావీదు చూశాడు.

గొల్యాతు
గొల్యాతు గురించి బైబిల్ లో కొన్ని వివరాలు వ్రాయబడ్డాయి: అతని ఎత్తు తొమ్మిది అడుగుల ఆరు అంగుళాలు. అతని తలమీద రాగి శిరస్త్రాణము ఉండేది. అతడు 5000 తులముల బరువు గల రాగి కవచమును ధరించేవాడు. అతని కాళ్ళకు రాగి కవచం, అతని భుజముల మధ్య రాగి బల్లెము ఉండేవి. అతని ఈటె కొన ఆరు వందల తులముల ఇనుముతో చేయబడింది. ఒక సైనికుడు డాలును మోయుచు గొల్యాతు ముందర నడిచేవాడు. ఇవన్నీ చూచినప్పుడు గొల్యాతు ఎంత భారీ శరీరం కలిగిన వాడు అని మనకు అర్థమవుతుంది. అతడు తన బలమును చూసుకొని ఎంతగానో గర్వపడుతుండవచ్చు. అతడు ధరించిన వాటి వలన అతని శరీరము పూర్తిగా కప్పి వేయబడి ఎటువంటి అపాయము కలుగకుండా సురక్షితంగా ఉంది. తన శరీరము, బలము, తాను ధరించిన వాటి వలన ఎవరూ తనను జయించలేరు అనే ధైర్యము, గర్వము గొల్యాతు కలిగి ఉండవచ్చు.

గొల్యాతు ఇశ్రాయేలీయులను హేళన చేయుట
గొల్యాతు ప్రతిదినము బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులను చూచి - " మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోరాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. నేనతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు"అని గట్టిగా కేకలు వేసేవాడు. గొల్యాతు నలుబది దినములు ప్రతి ఉదయము, సాయంత్రము బయలుదేరి వచ్చి తనను తాను ఇశ్రాయేలీయులకు కనపరచుకొని తిరిగి వెళ్తుండేవాడు. ఇశ్రాయేలీయులు గొల్యాతును చూచి, అతని మాటలు వినిన వెంటనే మిక్కిలి భయముతో గొల్యాతు ఎదుటనుండి పారిపోయేవారు. ఇశ్రాయేలీయుల సైన్యములో ఒక్కరు కూడా గొల్యాతుతో యుద్ధము చేయుటకు ముందుకు రాలేకపోయారు. గొల్యాతు మాటలు విని దావీదుకు ఎంతో కోపం వచ్చింది. జీవము గల దేవుని సైన్యములను, దేవుడు తెలియని గొల్యాతు తిరస్కరించుట చూచి సహించలేకపోయాడు. గొల్యాతును చంపి ఇశ్రాయేలీయులు ఎదుర్కొంటున్న అవమానమును పోగొట్టాలి అని తలంచాడు. తన ఆలోచనను అక్కడ ఉన్న వారికి చెప్పాడు. దావీదు పెద్ద అన్న అయిన ఏలీయాబు అతనితో - "నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి"అని కోపంతో గద్దించాడు. దావీదు ఆ మాటలు విని తన సహోదరులకు దూరంగా వెళ్లిపోయాడు.

దావీదు తనకు తాను సిద్ధపడుట
దావీదు మాటలు సౌలుకు వినబడినప్పుడు అతడు దావీదును తన దగ్గరకు పిలిపించాడు. దావీదు సౌలుతో - " ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు క్రుంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదును" అని చెప్పాడు. ఆ మాటలకు సౌలు ఎంతో ఆశ్చర్యముతో - "ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు" అని దావీదు తో చెప్పగా దావీదు తిరిగి - "నేను గొర్రెలను కాయుచుండగా ఒకసారి సింహమును, ఒకసారి ఎలుగుబంటిని తరిమి వాటిని చంపి గొర్రెలను విడిపించితిని. సింహము యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన ప్రభువు ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడా నన్ను విడిపించును"అని చెప్పాడు. అప్పుడు సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణము కట్టి యుద్ధ కవచము తొడిగించాడు. దావీదుకు అవి అలవాటు లేనందువలన నేను వీటితో వెళ్ళలేను అని సౌలుతో చెప్పి వాటిని తీసి వేశాడు. దావీదు ఆయుధాలపై కాదు గాని ప్రభువు శక్తిపై ఆధారపడి యుద్ధమునకు బయలు దేరాడు.

దావీదు తన కర్ర చేతపట్టుకుని యేటి లోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన దగ్గర ఉన్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఫిలిష్తీయుడైన గొల్యాతు దగ్గరకు వెళ్ళాడు. వడిసెలలో రాళ్ళు పెట్టి విసిరి వేయుటకు చాలా నేర్పరి తనం కావాలి. కానీ దావీదు దేవునిపై విశ్వాసముతో వాటిని ఉపయోగించుకో బోతున్నాడు.

గొల్యాతు, దావీదు కలిసికొనుట
మరుసటి రోజు ఒకడు డాలు పట్టుకుని ముందు నడవగా గొల్యాతు ఇశ్రాయేలీయులను హేళన చేస్తూ అక్కడకు వచ్చాడు. అక్కడ ఉన్న దావీదును చూచి గొల్యాతు అపహసించ సాగాడు. దావీదును చంపి అతని మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చి వేస్తాను అని గొల్యాతు తన దేవతల పేరిట దావీదును శపించడం మొదలుపెట్టాడు. అప్పుడు దావీదు గొల్యాతుతో - "నీవు కత్తియు, బల్లెము, ఈటెను ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు ప్రభువు పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. యుద్ధము ప్రభువుదే. ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును"అని చెప్పాడు. దేవుడు తమకు విజయము కలుగజేయుట చూచి లోక నివాసులందరు ఇశ్రాయేలీయుల దేవుని గురించి తెలుసుకుంటారు అని దావీదు చెప్పాడు.

దావీదు గొల్యాతును చంపుట
దావీదు తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి గొల్యాతు నుదుట కొట్టాడు. ఆ రాయి గొల్యాతు నుదుటికి తగిలిన వెంటనే అతడు నేలమీద పడిపోయాడు. గొల్యాతు తన శరీరము అంతా కప్పి వేసుకున్నాడు గాని అతని నుదుటి మీద మాత్రం ఏమీ లేదు.
గొల్యాతు బోర్ల పడిన వెంటనే దావీదు పరుగెత్తుకొని పోయి అతని మీద నిలబడి గొల్యాతు కత్తితోనే అతని చంపి తలను నరికి వేశాడు. ఫిలిష్తీయులు తమ శూరుడైన గొల్యాతు చనిపోవుట చూచి పారిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు వారందరు జయము జయము అని అరుస్తూ లోయ వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేశారు. ఇశ్రాయేలీయులు యుద్ధమందు తమకు విజయము కలుగుట చూచి ఎంతో ఆనందించారు.

దావీదు ఇశ్రాయేలీయులందరి ఎదుట గొప్పవాడు గా ఎంచబడ్డాడు. సౌలు దావీదును తన రాజనగరు లోనే ఉంచుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. కానీ దావీదు గొల్యాతుపై తనకు విజయము కలుగజేసిన ప్రభువు కు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాడు.

సందేశము
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి .


  • సైన్యములు దిగిన దండు లోనికి దావీదు ఎందుకు వెళ్ళాడు?
  • దావీదు ఎందుకు గొల్యాతుతో యుద్ధము చేయాలనుకున్నాడు?
  • దావీదు సౌలుతో ఏమి మాట్లాడాడు?
  • సౌలు యొక్క యుద్ధ ఆయుధములు దావీదు ఎందుకు ధరించలేదు?
  • గొల్యాతు దావీదును చూచి ఏమని శపించాడు?
  • దావీదు గొల్యాతుకు ఏమి చెప్పాడు?
  • రాయి గొల్యాతు నుదుటికి తగులునట్లు ఎవరు చేశారు?

దావీదు వంటి బాలుడు శూరుడైన గొల్యాతుతో యుద్ధము చేయుటకు ఇష్టపడటం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ! సింహమును, ఎలుగుబంటిని చంపుటకు తనకు సహాయము చేసిన ప్రభువు గొల్యాతును చంపుటకు కూడా సహాయపడతాడు అని దావీదు విశ్వసించాడు. దావీదు తన బలము నందు కాక దేవుని శక్తి యందు నమ్మకముంచాడు.

అన్వయింపు
యుద్ధము చేయడానికి గొల్యాతు వంటివారు మన జీవితాలలో ఉండరు కానీ అంతకంటే పెద్దవైన సమస్యలు మనకు ఉంటాయి. చిన్న పిల్లలకు కూడా సమస్యలు వస్తుంటాయి, అప్పుడు ఏమి చేయాలో వారికి తెలియదు. స్కూల్ లో సీనియర్స్ ఎగతాళి చేస్తూ ఉంటారు, టీచర్స్ కోప పడుతుంటారు, ఇంటిలోని వారు అనారోగ్యంతో ఉంటారు ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. మనము చిన్న విషయాలలో దేవుని విశ్వసించినప్పుడే, పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు కూడా ఆయన పై విశ్వాసము కలిగి ఉండగలము. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనే విషయం మనము ఎప్పుడూ మరువకూడదు. మనము మన హృదయమంతటితో ప్రభువును విశ్వసించినప్పుడు ఆయన మనకు తప్పక సహాయము చేస్తాడు.

కంఠతవాక్యము
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణ హృదయముతో ప్రభువు నందు నమ్మకముంచుము (సామెతలు 3:5).

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

 

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

  1. మోషే తన పని ప్రారంభించుట
  2. ఐగుప్తు దేశము మీద తెగుళ్ళు
  3. పస్కా పండుగ
  4. ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రమును దాటుట
  5. దేవుడు మన్నా కురిపించుట
  6. దేవుడు ఇశ్రాయేలీయులకు నీటిని సమకూర్చుట
  7. సీనాయి పర్వతం
  8. పది ఆజ్ఞలు
  9. బంగారు దూడ
  10. వేగులవారి సమాచారము
  11. ఇత్తడి సర్పము
  12. మోషే మరణము

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

  1. యెహోషువ - క్రొత్త నాయకుడు
  2. జ్ఞాపక సూచకమైన రాళ్ళు
  3. రాహాబు విశ్వాసము
  4. యెరికో పట్టణము కూలిపోవుట
  5. ఆకాను పాపము
  6. గిబియోనీయులు మోసగించుట
  7. యెహోషువ వీడ్కోలు - న్యాయాధిపతుల కాలము
  8. గిద్యోను సిద్దపడుట
  9. గిద్యోను విజయము
  10. సమ్సోను
  11. సమూయేలు జన్మించుట
  12. సమూయేలును దేవుడు పిలుచుట

సిరీస్ 6 - ఇశ్రాయేలీయుల రాజుల పరిచయం

  1. సౌలు తృణీకరించబడుట - దావీదు ఎన్నుకొనబడుట
  2. దావీదు - గొల్యాతు
  3. దావీదు తప్పించు కొనిపోవుట
  4. సౌలు దావీదును వెంటాడుట
  5. దావీదు -నాబాలు
  6. సౌలు జీవితము - మరణము
  7. మెఫీబోషెతు
  8. దావీదు యొక్క భయంకరమైన పాపము
  9. అబ్షాలోము దావీదు పై తిరగబడుట
  10. దావీదు జీవితము
  11. సొలొమోను జ్ఞానము కోరుకొనుట
  12. షేబ దేశపు రాణి సొలొమోనును దర్శించుట
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.