ఆది. 13:1-18

ఉద్దేశము/లక్ష్యము
చిన్న వయస్సులో చెడు స్నేహితుల ప్రభావము పిల్లలపై ఉంటుంది అని బోధించుట.

గతవారము
మనము అబ్రాహాము గురించి విన్నాము. అబ్రాహాము భార్య పేరు ఏమిటి? వారు ఎక్కడ నివసించేవారు? దేవుడు అబ్రాహాముతో ఏమి మాట్లాడాడు? అబ్రాహాము ఆ మాటలకు విధేయత చూపించాడా? అబ్రాహాము తన కుటుంబముతో బయలుదేరి హారానుకు వెళ్ళాడు. అక్కడ దేవుడు మరల అబ్రాహాముకు తాను చెప్పిన క్రొత్త దేశమునకు వెళ్ళమని చెప్పాడు. ప్రభువు అబ్రాహాముకు వాగ్దానము చేసిన మూడు విషయాలు ఏమిటి?

  • అబ్రాహాము సంతతివారు గొప్ప జనముగా అభివృద్ధి చెందుతారు.
  • అబ్రాహాము సంతానపు వారు వాగ్దానదేశాన్ని స్వతంత్రించుకుంటారు.
  • భూలోకములోని జనములన్నియు అబ్రాహాము సంతానము వలన ఆశీర్వదించబడతాయి.

అబ్రాహాము తన కుటుంబంతో కలిసి కనాను దేశము చేరుకున్నాడు. అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠమును కట్టి ప్రభువును ఆరాధించాడు.

ముఖ్యాంశము
మన జీవితంలో మనము ఎన్నో నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ ఏమి తిందాము, ఏమి బట్టలు వేసుకుందాము, ఏమి ఆడుకుందాము? ఇలా ఎన్నో విషయాలు మనము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాము. స్కూల్ లో, ఇంట్లో, గ్రౌండ్ లో ఎన్నో విషయాలు ఎంచుకోవలసి ఉంటుంది. మీరు పెద్దవారయిన తరువాత ఉద్యోగం, వివాహం మొదలైన పెద్ద విషయాలను కూడా నిర్ణయించుకో వలసి ఉంటుంది. కొన్నిసార్లు సరియైన నిర్ణయాలు తీసుకుంటాము, మరి కొన్నిసార్లు మన ఎంపిక సరి అయినదిగా ఉండదు. ఈరోజు సరియైన ఎంపిక చేసుకొనలేని ఒక వ్యక్తి గురించి మనము తెలుసుకుందాము. అతని పేరు లోతు.

లోతు - అబ్రాహాము యొక్క సహోదరుని కుమారుడు

తన తండ్రి చనిపోయినందువలన అతడు అబ్రాహాము, శారాలతో కలిసి ఉండేవాడు. లోతు కూడా అబ్రాహాము శారాలతో కలిసి ప్రయాణం చేసి కనాను దేశం చేరుకున్నాడు. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినదే కనాను దేశము. వారు గుడారములలో నివసిస్తూ ఆ ప్రదేశములన్నింటిలో తిరుగుచుండేవారు.

అబ్రాహాము ప్రభువుకు బలిపీఠము కట్టి ఆరాధిస్తున్న సమయములో లోతు కూడా అక్కడే ఉండి చూసి ఉండవచ్చు. అబ్రాహాము లోతుకు ఎంతో మంచి మాదిరిగా అతని కన్నుల ముందే ఉన్నాడు. ప్రభువును ఆరాధించుట ద్వారానే ఆయనకు సమీపంగా జీవించగలము అని అబ్రాహాము లోతుకు చెప్పి ఉండవచ్చు. లోతు కూడా దేవుని యందు విశ్వాసము కలిగినవాడు అని మనము అనుకొనవచ్చు (2 పేతురు 2:7,8).

జగడము (కలహము) ప్రారంభమగుట

అబ్రాహాము బహు ధనవంతుడు. అతని దగ్గర 318 మంది దాసులు ఉండేవారు (ఆది. 14:14). వారు గొర్రెలను మేపుతూ ఉండేవారు. అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగిన బహు ధనవంతుడు. అబ్రాహాముతో పాటు లోతుకు కూడా గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేవి. వారి ఆస్తి వారు కలిసి నివసించ లేనంత ఎక్కువగా ఉంది. అప్పుడు అబ్రాహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు గొడవలు తగాదాలు మొదలయ్యాయి.

అబ్రాహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు ఏ విషయములలో కలహము కలిగి ఉండవచ్చు?

పశువులను ఎక్కడ మేపాలి? ముందు ఎవరి పశువులకు నీళ్లు పెట్టాలి ? ఎక్కడ కట్టి వేయాలి? ఇటువంటి విషయాలలో వారికి గొడవలు కలిగి ఉండవచ్చు. వారు ఆ విధముగా గొడవలు పెట్టుకోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఆ మనుష్యులకు, పశువులకు అక్కడి స్థలం సరిపోలేదు అని మనకు అర్థమవుతుంది. మరి ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి?

అబ్రాహాము మంచితనము

ఈ జగడముల గురించి అబ్రాహాము తెలిసికొనినప్పుడు ఎంతో బాధపడ్డాడు. కానీ ఆ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలి అనుకున్నాడు. అప్పుడు అబ్రాహాము లోతును పిలిచి - ``మనము బంధువులము కనుక నాకు నీకు, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్లిన యెడల నేను కుడి తట్టునకును, నీవు కుడివైపునకు వెళ్ళిన యెడల నేను ఎడమ తట్టునకు వెళ్లుదును'' అని చెప్పాడు. అబ్రాహాము ఎంతో సాత్వికుడు, ఇంకా ఎక్కువ కాకుండా ఆ గొడవలు పరిష్కరించాలి అని అబ్రాహాము అనుకున్నాడు. ఎంత మంచితనం! అబ్రాహాము వయస్సులో వృద్ధుడు, ఇంటికి పెద్దవాడు కనుక మొదటగా తాను ఎంపిక చేసుకుని ఉండవచ్చు. అబ్రాహాము స్వార్ధం లేని వాడు కనుక ముందుగా లోతు ఎంపిక చేసుకొనుటకు అవకాశం ఇచ్చాడు. లోతు దేనిని ఎన్నుకున్నాడు?

లోతు ఎంపిక

బేతేలు, హాయికి మధ్య ఉన్న పర్వతము మీద అబ్రాహాము లోతు నిలువబడి ఉన్నారు. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూశాడు. అది ఎంతో సారవంతమైన ప్రాంతము. యొర్దాను ప్రాంతంలో నీళ్ళు పారుతుండేవి గనుక అది ఎంతో సారవంతమైన ప్రాంతంగా ఉండేది. అక్కడ మంచి పశువుల మేత, కూరగాయలు, పండ్లు పండేవి. అది ఏదెను తోట వలె ఉండేది అని బైబిల్ లో వ్రాయబడింది (ఆది. 13:10). అక్కడ అన్ని రకములైన పంటలు సమృద్ధిగా పండేవి. లోతు తూర్పు దిక్కున ఉన్న యొర్దానును ఎంచుకున్నాడు. అబ్రాహాముతో కలిసి అక్కడే ఉంటే లోతు జీవితం ఎంతో బాగుండేది, కాని ఆ సారవంతమైన మంచి ప్రదేశానికి వెళ్లాలని లోతు ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు. ఎంతో శ్రేష్ఠమైన ప్రాంతాన్ని తనకోసం ఎంచుకున్నాడు. లోతు ఎంపిక అతనికి ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులను కలిగించిందో తరువాత పాఠాలలో చూద్దాము. లోతుకు ప్రభువును గురించి తెలిసినా కూడా సరిగా ఎంపిక చేసుకునుటకు సహాయము చేయుమని దేవునికి ప్రార్ధించలేదు.

సొదొమ పట్టణము

యొర్దాను ప్రాంతములో అప్పటికే చాలా మంది నివసిస్తున్నారు. అక్కడ సొదొమ, గొమొర్రా అనే రెండు పట్టణములు ఉండేవి. అక్కడ పంటలు సమృద్హిగా పండేవి కనుక మనుష్యులు కష్టపడి పని చేసేవారు కాదు. దుష్టత్వముతో నిండినవారై, దేవుని లక్ష్యపెట్టేవారు కారు (ఆది. 13 :13). వారి పాపము ఎంతో ఘోరమైనది గనుక దేవునికి ఎంతో వేదన కలిగింది. లోతు సొదొమ గొమొర్రా పట్టణములకు దూరంగా తన గుడారమును వేసికొని ఉండవచ్చు, కానీ అతడు సొదొమ పట్టణపు సమీపములో గుడారము వేసుకున్నాడు. అంత ఘోరమైన పాపముతో నిండిన ఆ ప్రాంతపు మనుష్యులతో మాట్లాడాలని, వారితో స్నేహం చేయాలని లోతు ఎందుకు ఆలోచించాడో మనకు తెలియదు. దేవుని లక్ష్యపెట్టని వారితో కలిసి ఉండుటకు లోతు నిర్ణయించుకున్నాడు. ఆ పట్టణపు పెద్దలతో కలిసి తీర్పు తీర్చుటకు పట్టణపు ద్వారము దగ్గర కూర్చొని ఉన్నట్లు బైబిల్ లో వ్రాయబడింది (ఆది. 19:1). సొదొమ పట్టణములో పేరు సంపాదించుకోవాలి అని లోతు తలంచి ఉండవచ్చు! లోతు వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను అని బైబిల్ లో వ్రాయబడింది (2 పేతురు 2:8).

అబ్రాహాము ఆశీర్వదించబడుట లోతు తనకు దూరముగా వెళ్లినందుకు అబ్రాహాము బాధ పడి ఉండవచ్చు, కానీ లోతు నివసిస్తున్న ప్రాంతము చూసి ఉంటే ఇంకా ఎంతో బాధపడి ఉంటాడు. అబ్రాహాము తన జీవితములో దేవునికి మొదటిస్థానము ఇచ్చినందువలన ఎంతో సంతోషముగా ఉండగలిగాడు. అతడు వివేకము, నిస్వార్థము, సాత్వికము కలిగినవాడు. అబ్రాహాము విశ్వాసముతో గుడారములలో నివసిస్తూ, దేవుడు ఆ ప్రదేశమును తన సంతానమునకు స్వాస్థ్యముగా ఇస్తాడు అని ఎదురుచూశాడు (హెబ్రీ 11:9-10). ఈ భూమికంటె శ్రేష్ఠమైన పరలోకములో ఒక దినాన నివసిస్తాను అని విశ్వసించాడు. బేతేలు కొండపై ప్రభువు మరొకసారి అబ్రాహాము దగ్గరకు వచ్చి తన వాగ్దానాలను జ్ఞాపకం చేశాడు. దేవుడు అబ్రాహాముతో - "ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానము భూమి మీద నుండు ఇసుక రేణువుల వలె విస్తరింప చేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు ఇసుక రేణువులను

లెక్కింప కలిగిన యెడల నీ సంతానమును కూడా లెక్కించవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున ఉన్నదానిలో సంచరించుము అది నీకిచ్చెదను" అని చెప్పాడు. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోను లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో వేసుకున్నాడు. ప్రభువు తనకు చెప్పిన మాటలు అన్నింటిని అబ్రాహాము విశ్వసించాడు. దేవుడు తనను చూసుకుంటున్నాడు అని అబ్రాహాము గ్రహించాడు.

సందేశము
లోతు జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు. దేవుని గురించి అబ్రాహాము ద్వారా తెలుసుకున్నప్పటికి తన నిర్ణయం విషయంలో దేవుని సహాయం కొరకు ప్రార్ధించలేదు. అతడు కష్టము లేకుండా జీవించాలి అని తలంచి యొ ర్దాను నదీ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. దేవుని ఎదుట ఎంతో ఘోరమైన దుష్టత్వము, పాపముతో నిండిన సొదొమ ప్రజల మధ్య లోతు నివసించటం సరిఅయిన నిర్ణయం కాదు. వారు దేవుని ద్వేషిస్తున్నప్పుడు లోతు బాధ పడ్డాడు, కాని అక్కడ నుండి బయటకు రావటానికి ప్రయత్నించలేదు. వారిని మంచివారుగా మార్చ గలను అని లోతు తలంచి ఉండవచ్చు, కానీ లోతు మాటలు వినుటకు వారికి ఏ మాత్రం ఆసక్తి లేదు (ఆది.19 :19).

అబ్రహాము లోతుకు పూర్తిగా వ్యతిరేకం. అబ్రాహాము మొదట దేవుని, తరువాత ఇతరులను, చివరగా తనను గురించి ఆలోచించేవాడు. అతడు ఎంతో సంతోషంగా ఉండేవాడు. ప్రతి దినము దేవుని వైపు చూస్తూ పరలోకం కొరకు కనిపెట్టుకుని ఉండేవాడు.

అన్వయింపు
ఈ వయస్సులో వివాహము, ఉద్యోగము, ఇల్లు ఇటువంటి వాటిని ఎంపిక చేసికొనవలసిన అవసరం మీకు లేకపోవచ్చు, కానీ మీరు కూడా కొన్ని విషయాలను ఎంపిక చేసి కొనవలసి వస్తుంది.

ఇందులో ముఖ్యమైనది - ఎటువంటి వారితో స్నేహము చేయాలి అనేది. దేవుని విషయాలు చెబుతున్నప్పుడు మిమ్మల్ని, దేవుని ఎగతాళి చేసే వారితో స్నేహం చేయాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఎప్పుడూ సండేస్కూల్ కి వెళ్ళకుండా, మిమ్మల్ని కూడా వెళ్లనీయకుండా చేసే వారితో స్నేహం చేయాలనుకుంటున్నారా? అబద్ధాలు చెప్పి, దొంగతనాలు చేస్తూ, ఒట్టు పెట్టుకుంటూ, అవిధేయులుగా ఇతర పిల్లలను కొడుతూ, చెడ్డ మాటలు మాట్లాడుతూ వేరేవాళ్లను పట్టించుకోని వారితో మీకు స్నేహం కావాలా? అటువంటి వారితో స్నేహం చేస్తే కొంతకాలం తరువాత మనము కూడా వారివలె మారుతాము అని మీకు తెలుసా? వారు అల్లరి చేసేవారు అయితే ఆ ప్రభావం మీ మీద కూడా ఉంటుంది. మిమ్మల్ని దేవుని నుండి దూరము చేసి వారి మాటలు వినేటట్లు చేయగలరు. వారిని, వారి అల్లరి పనులను మీరు అనుకరించుట మొదలుపెడతారు. దీనివలన మీరు సంతోషంగా ఉండలేరు. మంచి వారిని, దేవుని ప్రేమించే వారిని స్నేహితులుగా చేసుకోవడం మంచి ఎంపిక. ఎవరైతే దేవుని విషయాలను నేర్చుకుని, ఆయనకు ఇష్టమైన విధంగా జీవిస్తారో వారితో స్నేహం చేయడం మంచి నిర్ణయం. కానీ అటువంటివారు ఎక్కువమంది కనిపించరు. కనీసం మంచి అలవాట్లు, క్రమశిక్షణ ఉన్న వారితో నైనా స్నేహం చేయవచ్చు. అబ్రాహాము వలె మనము కూడా సరియైన నిర్ణయాలు తీసుకోగలగాలి. దేవుని సహాయం కొరకు ప్రార్ధించకుండా, క్రైస్తవులు కూడా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. మనము ప్రభువును ప్రేమించి ఆయనను మొదటిస్థానంలో ఉంచుకుంటే, మనము తీసుకొనవలసిన నిర్ణయాలలో ఆయన మనకు సహాయం చేస్తాడు. సరియైన ఎంపిక మనము చేసుకున్నట్లయితే అబ్రాహాము వలె సంతోషంగా జీవిస్తూ పరలోకము కొరకు ఆశతో ఎదురుచూస్తాము.

ఉదాహరణ

కావ్య, శ్రావ్య ఇద్దరు అక్కచెల్లెళ్ళు. స్కూల్ అయిన వెంటనే శ్రావ్య ఇంట్లో కూర్చుని హోంవర్క్ చేసుకునేది, కాని కావ్య పెద్దది అయినా బయటకు వెళ్లి ఆడుకునేది, హోంవర్క్ చేసేది కాదు, స్నేహితులతో కలిసి సరదాగా కాలం గడిపేది. చెల్లెలిని ఎప్పుడూ ఎగతాళి చేసేది. శ్రావ్య కష్టంగా ఉన్నా హోం వర్క్ చేసి ఇంట్లో వాళ్ళ అమ్మకు సహాయం చేసేది. శ్రావ్యకు మంచి స్నేహితులు ఉండేవారు. వారందరూ కలిసి చదువు గురించి, తరువాత ఏమి చేయాలి అనేదానిని గురించి మాట్లాడుకునేవారు. శ్రావ్య 11 సంవత్సరముల వయసులో ఒక పరీక్ష వ్రాసి మంచి మార్కులు తెచ్చుకుని పెద్ద స్కూల్ లో సీటు తెచ్చుకుంది. శ్రావ్య శ్రమకు తగిన ఫలితం దొరికినందుకు టీచర్లు, స్నేహితులు,తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు.

కావ్య మాత్రం తన స్నేహితులతో తిరుగుతూ, ఆటలు ఆడుతూ, సినిమాలు చూస్తూ సమయం వృధా చేస్తుండేది. పెద్దగా అయిన తరువాత ఇంకా చెడు స్నేహితులతో కలిసి, చెడు అలవాట్లు నేర్చుకోవటం మొదలు పెట్టింది. తల్లిదండ్రులకు తెలియకుండా స్నేహితులతో చాలా చెడ్డ పనులు చేస్తుండేది. తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారు అని కావ్యకు తెలిసినా, స్నేహితుల ప్రభావం వలన బయటకు రాలేక పోయింది. తరువాత తన జీవితంలో ఎటువంటి సంతోషం లేకుండా పోయింది.

ఇది అబ్రాహాము లోతుల కథవలె ఉంది కదూ! అబ్రాహాము సరియైన దానిని ఎన్నుకొని దేవుని సంతోషపెట్టాడు. లోతు తనకు నచ్చిన దానిని ఎన్నుకొని తన మార్గంలో ముందుకు వెళ్ళాడు. తాను నివసిస్తున్న జనుల ప్రవర్తనను బట్టి లోతు ఎంతగానో నొప్పించబడ్డాడు, సంతోషము పోగొట్టుకున్నాడు.

మీరు అబ్రాహము వలె సరియైన వాటిని ఎంచుకుంటారా, లేక లోతు వలె దేవుని సహాయము కోరకుండా మీకు నచ్చిన వాటిని ఎన్నుకుంటారా? ఆలోచించండి. మనము అడిగినప్పుడు సహాయం చేయడానికి ప్రభువు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

కంఠతవాక్యము
కీడు చేయుట మాని మేలు చేయుము (కీర్తన 34 :14)

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.