ఆదికాండము 39:20-41:46
ఉద్దేశము
జీవితములో కష్టాలు ఉన్నా, సంతోషం ఉన్నా క్రైస్తవులు దేవునికి ప్రీతికరం గా జీవించాలి అని బోధించుట.
ముఖ్యాంశము
ఎంతో నిరాశతో కూడిన పరిస్థితులు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? మీ తల్లిదండ్రులు పుట్టినరోజు కానుకగా సైకిల్ గాని కంప్యూటర్ గాని బహుమతిగా ఇస్తాము అని మీకు చెప్పారు అనుకుందాం, కాని మీ పుట్టినరోజు నాడు మీ అమ్మ దగ్గరకు వచ్చి - "నీకు బహుమతి కొనడానికి కావలసినంత డబ్బు ఇప్పుడు లేదు. వచ్చే సంవత్సరం తప్పకుండా కొంటాము" అని చెప్తారు అనుకోండి. బాధగా అనిపిస్తుంది కదూ! మరుసటి సంవత్సరము కూడా వారు కొనలేని పరిస్థితిలో ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా నిరాశకు గురి అవుతారు కదూ! అలా ప్రతిసారి ఎదురు చూడడం ఎంతో బాధ కలిగిస్తుంది.
గతవారము
గతవారం నేర్చుకున్నకథ మీకు గుర్తుందా? పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతికి వచ్చిన కలల భావాన్ని దేవుని సహాయముతో యోసేపు వారికి వివరించగలిగాడు. పానదాయకుల అధిపతికి ఏమి జరిగింది? యోసేపు అతడిని ఏమి అడిగాడు? ఫరో రాజు తనను చెరసాల నుండి విడిపిస్తాడు అని యోసేపు రోజులు, వారాలు, నెలలు ఎదురు చూడసాగాడు. తరువాత ఆ పానదాయకుల అధిపతి తన మనవిని మరిచిపోయాడు అని గ్రహించాడు. యోసేపుకు ఎంత గొప్ప నిరాశ కలిగిందో కదా? అంతకాలం ఎదురు చూడటం ఎంతో కష్టంగా అనిపించి ఉండవచ్చు. తాను చెప్పినది నెరవేరువరకు దేవుని వాక్యం యోసేపును పరీక్షించుచుండెను అని కీర్తన 105:19 లో వ్రాయబడింది. తన పట్ల దేవుని ప్రణాళిక, ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవో యోసేపు ఊహకు కూడా అందలేదు.
చెరసాల
యోసేపు చెరసాలలో ఉన్నాడు. తన తండ్రి, తమ్ముడు గుర్తుకు వచ్చినప్పుడు ఎంతో బాధ పడి ఉండవచ్చు. వారిని విడిచిపెట్టి యోసేపు ఎప్పుడూ దూరంగా ఉండలేదు. తన సహోదరుల ప్రవర్తనలో ఏమైనా మార్పు కలిగి ఉంటుందా అని అలోచించి ఉండవచ్చు. ఏ విధమైన తప్పు చేయనప్పటికి, జైలులో ఉండటం యోసేపుకు దుఃఖాన్ని కలిగించి ఉంటుంది. కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికి యోసేపు ప్రభువుపై విశ్వాస ముంచాడు. జైలులో ఉన్నవారికి సహాయం చేస్తూ సంతోషంగా ఉండేవాడు. చెరసాలలో కూడా ప్రభువు అప్పగించిన పరిచర్య నమ్మకంగా, సంతోషంగా చేసేవాడు. ప్రభువు యోసేపు పనులన్నింటిలో అతనిని ఆశీర్వదించాడు.
ఫరో యొక్క స్వప్నములు (కలలు)
రెండు సంవత్సరములు గడచిన తరువాత ఐగుప్తు రాజు అయిన ఫరో కొన్ని కలలు కన్నాడు. ఫరో ఏటి (నది) దగ్గర నిలిచియుండగా చూపునకు అందమైనవియు బలిసినవియు నైన యేడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. చిక్కిపోయిన ఆవులు బలిసిన ఆవులను తినివేయు చుండెను. ఫరో రెండవసారి నిద్రించినప్పుడు మరొక కల వచ్చింది. రెండవ కలలో మంచి పుష్టిగల ఏడు వెన్నులు ఒక దంటున పుట్టగా తూర్పు గాలిచేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు ఆ ఏడు బలహీనమైన వెన్నులు పుష్టిగల వెన్నులను మ్రింగివేసాయి.
అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించాడు.
తెల్లవారినప్పుడు తనకు కలలు వచ్చిన సంగతి గుర్తుకు వచ్చి ఫరో మనసు కలవరపడింది. ఆ కలలకు అర్థము ఏమిటో ఫరోకు తెలియలేదు. ఫరో ఐగుప్తు శకునగాండ్రను, విద్వాంసులను అందరిని పిలిపించి తన కలలను వారికి వివరించి చెప్పాడు. కాని వారు ఆ కలల భావము తెలుపలేక పోయారు. అప్పుడు ఆ విషయాలు తెలుసుకున్న పానదాయకుల అధిపతి పరోతో - " నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసికొనుచున్నాను" అని చెప్పాడు. చెరసాలలో భక్ష్యకారుల అధిపతికి, తనకు వచ్చిన కలలను యోసేపు వివరించి చెప్పడం, ఆ విధముగానే జరగడం ఫరోకు చెప్పాడు. యోసేపు తనను జ్ఞాపకముంచుకొనుమని చెప్పిన సంగతిని తాను మరచిపోయినట్టు కూడా చెప్పాడు. వెంటనే ఫరో యోసేపును చెరసాల నుండి పిలిపించాడు. చెరసాల నుండి బయటకు రాగానే యోసేపుకు ఎలా అనిపించి ఉండవచ్చు? ఒక కలలాగా కనిపించి ఉండవచ్చు. యోసేపును త్వరగా చెరసాల నుండి బయటకు తెచ్చి క్షౌరము చేయించి, మంచి బట్టలు తొడిగించి ఫరో దగ్గరకు తీసుకొని వచ్చారు.
యోసేపు ఫరో స్వప్నముల(కలల)ను వివరించుట
యోసేపు ఫరో యెదుట నిలువగా ఫరో అతనితో - "నేనొక కలగంటిని దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలలు వినినయెడల దాని భావములు తెలుపగలవు అని నిన్నుగూర్చి వింటిని" అని చెప్పాడు. అందుకు యోసేపు - "అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చును" అని చెప్పాడు. ఫరో తన కలను గురించి చెప్పగా యోసేపు దేవుని సహాయము వలన వాటిని వివరించ సాగాడు.
యోసేపు ఫరోతో - "ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియజేసెను. యేడు మంచి ఆవులు యేడు సంవత్సరములు, ఆ యేడు మంచి వెన్నులు యేడు సంవత్సరములు. కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన యేడు ఆవులును యేడు సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను. ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు యేడు సంవత్సరములు వచ్చుచున్నవి. మరియు కరువు గల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తు మరువబడును. ఆ కరవు దేశమును పాడుచేయును. దాని తరువాత కలుగు కరవు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడక పోవును. ఆ కరవు మిక్కిలి భారముగా ఉండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడియున్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను" అని చెప్పాడు.
కాబట్టి ఆ కరవును ఎదుర్కొనడానికి వివేక జ్ఞానములు గల ఒక మనిషిని ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశం మీద అతనిని నియమించుకుని పంటలు సమృద్ధిగా పండిన సంవత్సరములలో ఐదవ భాగం పంట కూర్చి దాచి ఉంచుకోవాలి అని చెప్పాడు. కరవు చేత ఐగుప్తు నశించి పోకుండా దాచి ఉంచిన ఆహారమును పంచిపెట్టాలి అని వివరించాడు.
యోసేపును అధికారిగా నియమించుట
యోసేపు మాటలు ఫరో దృష్టికి సరియైనవిగా అనిపించాయి.
అప్పుడు ఫరో యోసేపుతో - "దేవుడు ఇదంతయు నీకు తెలియ పరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గల వారెవరును లేరు. నీవు నా ఇంటికి అధికారివై యుండవలెను. నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు" అని చెప్పాడు. ఫరో ఐగుప్తు దేశమంతటి మీద యోసేపును అధికారిగా నియమించాడు. ఫరో రాజుగా ఉన్నప్పటికిని, తన తరువాత యోసేపుకు సమస్త అధికారాన్ని ఇచ్చాడు. ఫరో రాజుకు యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఫరో తన చేతికి ఉన్న ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి, సన్నపునార బట్టలు తొడిగించి మెడకు బంగారు గొలుసు వేశాడు. ఆ ఉంగరముతో యోసేపు అన్ని అధికార సంబంధమైన పత్రాల మీద ముద్ర వేయవచ్చు. అప్పటి నుండి యోసేపు యొక్క ప్రతి ఆజ్ఞకు ఐగుప్తులోని ప్రతి ఒక్కరు లోబడవలెను అని ఫరో ప్రకటించాడు.
ఫరో తన రెండవ రథము మీద యోసేపును ఎక్కించి ఐగుప్తులో ఊరేగించాడు. జనులు రధము ముందు నడచుచు యోసేపుకు నమస్కరించి వందనము చేయండి అని కేకలు వేశారు. యోసేపు సెలవు లేకుండా ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతి నైనను కాలి నైనను ఎత్తకూడదని చెప్పాడు. ఫరో యోసేపుకు వివాహము చేసి అవసరమైనవి అన్నీ ఇచ్చాడు. యోసేపు ఫరో తనకు అప్పగించిన పని చేయుటకు సిద్ధంగా ఉన్నాడు.
సందేశము
ఈరోజు ఎంత అద్భుతమైన విషయాన్ని మనము విన్నాము. ఎవరి జీవితంలోనైనా ఒక్క రోజులో అంత మార్పు సంభవిస్తుందా? యోసేపు ఆ దినము కూడా నిద్రలేచి చెరసాలలో తన పనులను చేసుకుంటూ ఉండి ఉండవచ్చు. వెంటనే కొందరు మనుష్యులు వచ్చి ఫరో యొద్దకు త్వరగా తీసుకుని వెళ్లి ఉంటారు. కొన్ని గంటలలోనే యోసేపు జీవితంలో అన్నీ మారిపోయాయి.
జైలులో బందీగా ఉన్న యోసేపు, అందమైన ఇంటిలో స్వేచ్ఛగా ఉండబోతున్నాడు. జైలులోని ఖైదీలకు పరిచర్య చేయుటకు బదులుగా, ఐగుప్తు దేశముపై అధికారిగా ఉండబోతున్నాడు. జైలులో ఖైదీల వస్త్రాలకు బదులు, సన్నపునార వస్త్రములు ధరించాడు. జైలులో ఏమీ లేదు గాని, ఇప్పుడు బంగారు గొలుసు ధరించాడు. జైలులో భోజనమునకు బదులు, రాజ గృహములో విందును కలిగియుండబోతున్నాడు. జైలులో బంధింపబడి ఉండుటకు బదులుగా ఐగుప్తు దేశము అంతా సంచరించనై యున్నాడు.
ఎన్నో శ్రమలు ఎదుర్కొనిన యోసేపు జీవితములో అకస్మాత్తుగా ఎంత మార్పు! యోసేపు ప్రభువుకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి ఉండవచ్చు. యోసేపుకు భార్య ,పిల్లలు చక్కటి కుటుంబం ఏర్పడింది.
ఎన్నో సౌకర్యాలు కలిగినప్పటికి, యోసేపు హృదయములో ఎటువంటి మార్పులేదు. చెరసాలలో ఉన్నప్పుడు ప్రభువును విశ్వసించి నట్లుగానే, రాజ గృహములో ఉన్నాకూడా అదే విధమైన విశ్వాసాన్ని కలిగియున్నాడు. చెరసాలలో పానదాయకుల అధిపతి కలను వివరించిన రీతిగానే, రాజైన ఫరో కలను కూడా వివరించాడు. కలల భావము చెప్పుట దేవునికి మాత్రమే సాధ్యము అని వారితో చెప్పాడు. యోసేపు తన పూర్ణహృదయముతో ప్రభువును ప్రేమించాడు. చెరసాలలో ప్రభువుకు ఇష్టమైన రీతిగా పరిచర్య చేయుట నేర్చుకున్నాడు. అదే విధముగా ఐగుప్తు దేశపు రాజు దగ్గర పరిచర్య చేయుట కూడా ప్రభువు దగ్గరే నేర్చుకున్నాడు. దేవుడు మార్పులేని వాడు, యోసేపు కూడా మారిపోలేదు. తన కష్టాలు తీరినందుకు కలిగిన సంతోషం కంటె దేవుని చిత్తము తన జీవితములో నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాడు.
అన్వయింపు
మనుష్యులు క్రీస్తును తెలుసుకుని క్రైస్తవులుగా మారినప్పుడు దేవుడు వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడు. వారి జీవితాలలో కష్టాలు ఉన్నప్పటికి ప్రభువు వారితో ఉంటాడు. వారిపట్ల దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. ఎంతోమంది క్రైస్తవులు కష్టాల్లో కూడా ప్రభువు పట్ల విశ్వాసం కలిగినవారై సంతోషంగా ఉంటారు. యోసేపు వలె క్రైస్తవులు కూడా తమ కష్టాలలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఆశ కలిగి ఉండాలి. మనకు ఏది మంచిదో దేవునికి తెలుసు అనే నమ్మిక ఉండాలి.
ఉదాహరణ
రష్యా దేశములో ఒక క్రైస్తవ సేవకుడు ఉండేవాడు. యేసును గూర్చి ఇతరులకు చెప్పినందుకు అతడిని ఎనిమిది సంవత్సరములు జైలులో వేశారు. ఎటువంటి తప్పు చేయకపోయినా జైలులో ఉండవలసి వచ్చింది. ఆ జైలులో ఒకే గదిలో 50 మందితో కలిసి ఉండేవాడు. అక్కడ ఎంతో చలి, సరియైన ఆహారం ఉండేది కాదు. జైలులో ఎంతో కష్టమైన పనులు చేయించేవారు. చాలా అనారోగ్యంతో అతడికి గుండెజబ్బు వచ్చి మరణించే పరిస్థితి వచ్చింది.
అతడు జైలులో ఉన్నప్పుడు అక్కడి అధికారులతో ఎంతో దయతో ఉంటూ వారికి సహాయపడేవాడు. మిగిలిన వారితో
స్నేహంగా ఉండేవాడు. తన ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికి, అందరితో కలిసి ఉండేవాడు. తరువాత అకస్మాత్తుగా అమెరికా దేశం వారు అతనిని తమ దగ్గరకు తీసుకుని వెళ్లారు. జైలు నుండి అతడు విడిపించబడి అమెరికాలో స్వేచ్ఛగా జీవించాడు. కుటుంబము కూడా అతడిని కలుసుకుని వారందరు సంతోషంగా దేవుని పరిచర్య చేయసాగారు. దేవుడు క్రైస్తవుల ప్రార్ధనలు ఆలకించి ఆశ్చర్యకరంగా జవాబులు దయచేస్తాడు.
కంఠతవాక్యము
దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము ( రోమా 8:28)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF