ఆదికాండము 18:1-33
ఉద్దేశము/లక్ష్యము
క్రైస్తవులు ఎల్లప్పుడూ ప్రభువును, ఆయన చేసిన వాగ్దానాలను విశ్వసించాలి అని బోధించుట.
గతవారము
అబ్రాహాము, లోతు ఒకరికొకరు ఏ విధముగా విడిపోయారో మనము చూసాము. వారు ఎందుకు విడిపోయారు? లోతు ఎక్కడకు వెళ్లాలి అని ఎంపిక చేసుకున్నాడు? అది సరియైన ఎంపికా, కాదా? స్నేహితుల ప్రభావం మనపై చాలా ఉంటుంది కనుక వారిని ఎన్నుకునే టప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకున్నాము. అబ్రాహాము గుడారములలో నివసిస్తూ ప్రభువు చేత ఆశీర్వదించబడినవాడై ఎంతో సంతోషంగా ఉన్నాడు. లోతు సొదొమలో నివసించి అక్కడి వారితో కలిసిపోయి సంతోషం లేని జీవితాన్ని జీవించసాగాడు.
ముఖ్యాంశము
అతిథులను ఆహ్వానించుట - క్రొత్తవారు ఎవరైనా మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తుంటారా? మీరు వారిని ప్రేమతో ఆహ్వానించి మంచిగా చూసుకుంటారా? వారి యెడల దయతో, ప్రేమతో ప్రవర్తిస్తారా? తనను చూచుటకు వచ్చిన అతిధులను అబ్రాహాము ఏ విధముగా ఆహ్వానించాడో ఈ రోజు చూద్దాము.
దేవుని వాగ్దానమును శారా సందేహించుట
ఊరు అనే పట్టణమును విడిచిపెట్టి తాను చూపించబోవు కొత్తదేశమునకు వెళ్ళుటకు దేవుడు అబ్రాహామును పిలిచాడు. అబ్రాహాము ప్రభువు పిలుపుకు విధేయత చూపాడు. వారు కనాను దేశములో 25 సంవత్సరముల నుండి నివసిస్తున్నారు. లోతు కూడా వారికి దూరంగా వెళ్ళిపోయి తన కుటుంబముతో సొదొమ పట్టణములో నివసిస్తున్నాడు. అబ్రాహాము,శారాలు దేవుడు తమకు చేసిన వాగ్దానము ప్రకారము సంతానం కోసం ఎదురు చూస్తున్నారు.
అబ్రాహాము 99 సంవత్సరముల వయస్సులో ప్రభువు మరల ప్రత్యక్షమై తన వాగ్దానాన్ని మరోసారి గుర్తుచేశాడు. అబ్రాహాముతో "నీవు అనేక జనములకు తండ్రివగుదువు. నీ సంతతికి కనాను దేశమంతటిని స్వాస్థ్యముగా ఇస్తాను" అని చెప్పాడు. మరియు - నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు" అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాటలు అబ్రాహాముకు అసాధ్యమైనవిగా అనిపించినప్పటికీ - "అబ్రాహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను" అని బైబిల్ లో వ్రాయబడింది (యాకోబు 2:23). దీనినే విశ్వాసము అంటారు.
శారా ప్రభువును ప్రేమించి, ఆయన వాగ్దానములను నమ్మినప్పటికి, సంవత్సరములు గడిచిన కొలది ఆమె విశ్వాసం బలహీనపడసాగింది. శారా వయస్సు 90 సంవత్సరములు, కనుక తనకు సంతానం కలగడం అసాధ్యము అని తీర్మానించుకుంది. నిజంగా అంత వృద్ధాప్యములో ఉన్న వారికి సంతానం కలగడం అసాధ్యం. ఆమె మనస్సు ఎన్నో సందేహాలతో నిండిపోయింది. దేవుడు చేసిన వాగ్దానాల పట్ల ఏ మాత్రం నమ్మకం లేకుండా పోయింది. దేవుని వాగ్దానం కొరకు 25 సంవత్సరములు ఎదురు చూసింది, కానీ ఇప్పుడు పూర్తిగా ఆశలు వదిలివేసింది.
పరలోకము నుండి అతిధులు
అబ్రాహాము ఒకరోజు మమ్రే దగ్గర నున్న సింధూరవనములో ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నాడు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడ్డారు. అబ్రాహాము వారిని చూచి గుడారపు వాకిట నుండి పరుగెత్తి వారి దగ్గరకు వెళ్ళాడు. వారు మామూలు మనుష్యులవలె కనబడినప్పటికి
వారిలో ఇద్దరు దేవదూతలు, మూడవ వ్యక్తి ప్రభువు. వారిని చూచిన వెంటనే అబ్రాహాము వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి వారి ముందు నేల మట్టుకు వంగి వారికి నమస్కరించాడు. దీనిని చూచినప్పుడు అబ్రాహాము కొత్తవారిని ఎల్లప్పుడూ ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చేవాడు అని మనము గ్రహించవచ్చు. వారు పరలోకము నుండి దిగి వచ్చారు అని అబ్రాహాము గ్రహించి ఉండవచ్చు. ఈ ప్రత్యేకమైన అతిథులకు ఆతిధ్యము ఇవ్వాలి అని అబ్రాహాము ఆశించాడు. ఎంతో ఎండ ఉన్నది కనుక నీళ్లు తెప్పించి కాళ్ళు కడుగుకొనుమని చెప్పాడు. తరువాత భోజనము సిద్ధమగువరకు చెట్టు క్రింద అలసట తీర్చుకొనుమని వారికి చెప్పాడు. అబ్రాహాము వారితో - "కొంచెము ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును" అని చెప్పాడు. కొత్తవారికి కూడా ఆతిధ్యము ఇచ్చుటకు సిద్ధపడిన అబ్రాహాము ఎంత మంచి మనస్సు గలవాడు! అవసరములో ఉన్నవారి ఎడల దయ చూపించుట క్రైస్తవులముగా మనము అలవాటు చేసుకోవాలి (హెబ్రీ 13 :2).
భోజనము సిద్ధపరచుట
అబ్రాహాము గుడారములో ఉన్న శారా యొద్దకు వెళ్ళి - "నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుము" అని చెప్తాడు. వెంటనే శారా అబ్రాహాము చెప్పిన ప్రకారం చేసింది( 1 పేతురు 3:6). తరువాత అబ్రాహాము పశువులమందకు పరుగెత్తి ఒక మంచి లేతదూడను తెచ్చి ఒక పని వానికి అప్పగించాడు. వాడు దానిని త్వరగా సిద్ధం చేశాడు. అబ్రాహాము రొట్టెలు, మాంసము,వెన్న, పాలు వారి ఎదుట పెట్టాడు.
వారు భోజనము చేస్తున్నప్పుడు అబ్రాహాము వారి దగ్గరే చెట్టుక్రింద నిలబడ్డాడు. వారికి సరియైన ఆతిధ్యము ఇవ్వాలి అని అబ్రాహాము ఆశపడ్డాడు.
శారా నవ్వుట ఆ అతిధులలో ప్రభువు కూడా ఉన్నాడు. ఆయన అబ్రాహాముతో "నీ భార్యయైన శారయి ఎక్కడ ఉన్నది?" అని అడుగగా అబ్రాహాము "అదిగో గుడారములో ఉన్నది" అని చెప్పాడు. ప్రభువు అబ్రాహాముతో "మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును" అని చెప్పాడు.శారా గుడారపు ద్వారము దగ్గర లోపల నిలుచుండి ఆ మాటలను వింటూ ఉంది. శారా ద్వారము దగ్గర ఉండి అన్నిమాటలు విన్నది అని ప్రభువుకు తెలుసు. అంతేకాకుండా ఆ మాటలు వినిన శారా తనలో తాను నవ్వుకుంది అని కూడా ప్రభువు గ్రహించాడు. నేను, నా యజమానుడైన అబ్రాహాము వృద్ధాప్యములో ఉన్నాము గనుక మాకు కుమారుడు జన్మిస్తాడా? అని తలంచి నవ్వుకుంది. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని శారా విశ్వసించ లేకపోయింది. ప్రభువు అబ్రాహాముతో "వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల?" అని ప్రశ్నించాడు. ప్రభువు మాటలకు శారా భయపడి "నేను నవ్వలేదు" అని చెప్పింది. ప్రభువు వెంటనే "అవును నీవు నవ్వితివి" అని శారాతో చెప్పాడు. తన హృదయములోని ఆలోచనలన్నీ ప్రభువుకు తెలిసి పోయినందుకు శారా ఎంతో బాధపడింది. అంతేకాకుండా అబద్ధం చెప్పినందుకు నొచ్చుకుంది. మనము కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు దానిని దాచిపెట్టడానికి అబద్ధాలు చెప్తుంటాము. అవి బయటపడినప్పుడు ఎంతో బాధ పడతాము. ప్రభువు నుండి తాను ఏమీ దాచలేను అని తెలిసికొనిన తరువాత శారా ప్రభువు చేసిన వాగ్దానాల పట్ల మరల విశ్వాసం నిలిపి ఉండవచ్చు. బైబిల్ లో - "విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను" అని హెబ్రీ 11:11 లో వ్రాయబడింది. దేవుడు తాను చేసిన వాగ్దానములను తప్పక నెరవేరుస్తాడు అనే నమ్మకము, విశ్వాసముతో శారా దేవుని వైపు చూచుట నేర్చుకుంది .
ప్రభువు అబ్రాహాముతో మాటలాడుట
తరువాత అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాడు. దేవదూతలు ఇద్దరూ అక్కడనుండి సొదొమ వైపు వెళ్లారు, కానీ అబ్రాహాము ఇంకను ప్రభువు సన్నిధిలో నిలువబడి ఉన్నాడు. వారు లోతు నివసిస్తున్న సొదొమవైపు చూశారు. అబ్రాహాము నమ్మకస్థుడు అని ప్రభువుకు తెలుసు కనుక తన మనసులో ఉన్న ఆలోచనలను, ప్రణాళికలను అబ్రాహాముకు తెలియజేయాలి అనుకున్నాడు. సొదొమ గొమొర్రాల పాపము బహు గొప్పది గనుక ఆ పట్టణములను నాశనము చేయాలని నిశ్చయించుకొని నట్లు ప్రభువు అబ్రాహాముకు చెప్పాడు. అబ్రాహాముకు ఈ మాటలు వినిన వెంటనే అక్కడ నివసిస్తున్న లోతు గుర్తుకొచ్చాడు. అబ్రాహాము ప్రభువుతో - "దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక'' అని చెప్పాడు. అప్పుడు ప్రభువు 50 మంది నీతిమంతులు కనబడితే వారిని బట్టి ఆ స్థలమంతటిని కాపాడుతాను" అని అబ్రాహాముతో చెప్పాడు. అయితే అబ్రాహాము 45 మంది మాత్రమే ఉంటే, 40 మంది లేదా 30 మంది ఉంటే, 20 మంది ఉంటే చివరిగా 10 మంది ఉంటే నాశనము చేస్తావా? అని ప్రభువును అనేక సార్లు అడిగాడు. పదిమంది నీతిమంతులు కనబడినా నాశనము చేయను అని ప్రభువు అబ్రాహాముతో చెప్పాడు. అక్కడ పదిమంది కూడా నీతిమంతులు లేరు అని మనము గ్రహించవచ్చు. అబ్రాహాము విజ్ఞాపనను బట్టి ప్రభువు లోతును నాశనము నుండి తప్పించాలని అనుకున్నాడు.
సందేశము
ప్రభువు వాగ్దానం చేసినదానిని నెరవేరుస్తాడు అని అబ్రాహాము నమ్మాడు. ఆ నమ్మకాన్నే విశ్వాసము అంటాము. బహు వృద్ధులైన అబ్రాహాము శారాలకు సంతానం కలుగుట మానవ రీతిగా అసాధ్యం అని తెలిసినా దేవునికి సమస్తము సాధ్యమే అని అబ్రాహాము విశ్వసించాడు. దేవుడు సమస్తాన్ని సృష్టించినవాడు గనుక అబ్రాహాము విశ్వాసంతో ఎదురు చూశాడు.
మొదట శారా కూడా విశ్వాసంతోనే ఉండి ఉండవచ్చు. కానీ 25 సంవత్సరముల తర్వాత తన నిరీక్షణ సన్నగిల్లింది. అబ్రాహాము వలె సంపూర్ణంగా దేవునిపై విశ్వాసముంచలేకపోయింది. ప్రభువు ఆమెతో మాట్లాడినప్పుడు తిరిగి తన విశ్వాసాన్ని పొందగలిగింది. వారి విశ్వాసము ప్రభువుకు సంతోషం కలిగించింది.
అన్వయింపు
కొందరు దేవుడు ఉన్నాడు అని నమ్మరు. మీరు అటువంటి స్థితిలో ఉంటే క్షమించమని దేవుని అడగాలి. మనము క్రైస్తవులము అయినట్లయితే ప్రభువు అన్ని విషయాలలో మనకు సహాయము చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. కొన్నిసార్లు కష్టాలలో ఉన్నప్పుడు క్రైస్తవులు దేవునిపై పూర్తిగా ఆధారపడరు, విశ్వాసముంచరు. బైబిల్ లోని దేవుని వాగ్దానాలు విశ్వసించుట వారికి కష్టంగా అనిపిస్తుంది. ప్రార్థనలకు సమాధానం పొందడానికి కొంత సమయం వేచి ఉండవలసి వస్తుంది. దేవుడు తప్పక ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. కానీ కొన్ని సార్లు వారు అడిగిన విధంగా జవాబులు ఉండకపోవచ్చు. ఏది ఏమైనా, ఎంత కష్టమైనా మనము దేవుని యందు విశ్వాసముంచి ముందుకు సాగిపోవాలి.
సునీతకు 50 సంవత్సరముల వయస్సులో ఆమె కుమార్తె కుటుంబము అమెరికా వెళ్లిపోయింది. వారు వెళ్లే ముందు తప్పక త్వరలో తిరిగి వస్తాము అని చెప్పారు. పది సంవత్సరాలు గడిచినా వారు తిరిగి రాలేదు. 20 సంవత్సరాలు గడిచిపోయినా ఆమెను చూడడానికి వారు రాలేదు. సునీత మెల్లగా వారు తిరిగి వస్తారు అనే నమ్మకాన్ని, ఆశను కోల్పోయింది. అమెరికా నుండి ఆమె స్నేహితురాలు వచ్చి నీ కుమార్తె కుటుంబము త్వరలో నిన్ను చూడడానికి వస్తుంది అని చెప్పినప్పటికి సునీత నమ్మలేక పోయింది. పెద్దగా నవ్వి వారిని కళ్ళతో చూస్తే తప్ప నమ్మలేను అని స్నేహితురాలితో చెప్పింది. సునీత వృద్యాపముతో అనారోగ్యంపాలైంది కానీ ఆమె కుమార్తె కుటుంబం రాలేదు. తిరిగి వస్తాము అని కూతురు చేసిన ప్రమాణంపై సునీత నమ్మకం కోల్పోయింది. శారా కూడా అలాగే నమ్మకాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు. మనుష్యులు ఎన్నోసార్లు మాట ఇచ్చి తప్పిపోతుంటారు కానీ దేవుడు వాగ్దానాలు ఇచ్చి తప్పక నెరవేరుస్తాడు అని అబ్రాహాము శారాలను చూచి మనము గ్రహించవచ్చు.
బైబిల్ లో ప్రభువైన యేసు శతాధిపతిని చూచి గొప్ప విశ్వాసము కలిగినవాడు అని సాక్ష్యం ఇచ్చాడు. శిష్యులను చూచి అల్ప విశ్వాసులారా అని సంబోధించాడు. వారు తమ శ్రమలలో యేసును విశ్వసించలేదు. మన కష్టాలలో ప్రభువును విశ్వసించుట ఆయనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మనము ప్రభువునందు నమ్మకముంచి బైబిల్ లోని ఆయన వాగ్దానాలను విశ్వసించాలి .
కంఠతవాక్యం
ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ( ఆదికాండము 18:14)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF