ఆదికాండము 3:9-24
ఉద్దేశము/లక్ష్యము
ఆదాము హవ్వలు చేసిన పాపన్నిబట్టి ప్రపంచము ఎదుర్కొంటున్న బాధలు, కష్టాలు గురించి బోధించుట.
ముఖ్యాంశము
మీరు ఒక అందమైన చిత్రాన్ని గీసారు అనుకుందాము. మీతో ఎప్పుడూ సరిగా మాట్లాడని ఒక అబ్బాయి వచ్చి ఆ బొమ్మ మీద కాఫీ పోశాడు, అప్పుడు అది పూర్తిగా పాడైపోతుంది కదా! మీకు ఎలా అనిపిస్తుంది? దేవుని అందమైన సృష్టికి కూడా అదే జరిగింది. సాతానుకు దేవునిపై ద్వేషం. దేవుడు ఎంతో అందంగా చేసిన సృష్టిని పాడుచేసి, ఆదాముకు దేవునికి మధ్య ఉన్న సహవాసాన్ని నాశనం చేయాలనుకున్నాడు. సాతాను ఎలా కుయుక్తిగా తన పనిని జరిగించాడో గతవారం చూశాము. సాతాను చెడుతనము హవ్వను శోధించినట్లు మనము చూశాము. ఆదాము కూడా శోధనలో పడి దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టి హవ్వ మాటలు విన్నాడు.
దేవుడు సమస్తమును ఎరిగినవాడు. ఆదాము హవ్వలు పాపము చేశారు అని దేవునికి తెలుసు. ఆయన సాయంకాలము తోటలోనికివచ్చి వారిని పిలువగా వారు చెట్ల చాటున దాగుకొని రాలేదు. ఆదాము తాను తప్పు చేశాను అని గ్రహించి భయపడ్డాడు. దేవుడు నేను తినవద్దు అని ఆజ్ఞాపించిన వృక్షఫలములు తిన్నావా అని ఆదామును అడుగగా ఆదాము హవ్వపై నేరము చెప్పసాగాడు. దేవుడు హవ్వను అడిగినప్పుడు, హవ్వ సాతానుపై నెపములు చెప్పసాగింది (ఆదికాండము 3:8-13). తాము చేసిన తప్పులను ఇతరులపై నెట్టడానికి వారిద్దరూ ప్రయత్నించారు, కాని దేవుడు పరిపూర్ణుడు,పరిశుద్ధుడు,న్యాయవంతుడు మరియు నీతిపరుడు. తాను సృష్టించిన ప్రపంచమును పాడుచేసిన వారిని తప్పక శిక్షించాలి అని నిశ్చయించుకున్నాడు.
సాతానుకు దేవుడు విధించిన శిక్ష సాతాను పామువలె మారు రూపముతో మోసపుచ్చాడు గనుక దేవుడు సర్పమును శపించాడు. ఇకనుండి సర్పము తన కడుపుతో ప్రాకుచు, బ్రతుకు దినములన్నియు మట్టి తింటుంది అని చెప్పాడు. చాలామందికి పాములు అంటే ఇష్టం ఉండదు. అవి భయంకరంగా జారిపోతూ ఎంతో ప్రమాదకరంగా ఉంటాయి.
కాని సాతాను దేవునితో పోరాటం చేస్తూనే ఉన్నాడు. దేవుని ద్వేషిస్తూ ఇతరులు కూడా ద్వేషించు నట్లు వారి మనస్సులను పాడు చేస్తుంటాడు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. కాని తాను చేసిన మనుష్యులను సాతాను నుండి తప్పించుటకు దేవుడు ఒక మార్గాన్ని సిద్ధ పరచాలని ఇష్టపడ్డాడు. సాతానుపై పోరాడి, సాతాను శక్తిని తీసివేయుటకు, సాతాను తలను చితక గొట్టుటకు ఒకరు జన్మించ బోతున్నారు అని దేవుడు సాతానును హెచ్చరించాడు. ఒక దినాన ప్రభువైన యేసు ఈ లోకములోనికి వచ్చి సిలువపై ప్రాణం పెడతాడు అని దేవుడు చెప్తున్నాడు. ఈ కార్యము ద్వారా అందరికి పాపక్షమాపణ దొరుకునట్లు దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. ప్రభువైన యేసు సాతానుపై గొప్ప విజయం పొందుతాడు (ఆదికాండము 3:14-15).
హవ్వకు దేవుడు విధించిన శిక్ష నీ ప్రసవవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను అని దేవుడు హవ్వకు చెప్పాడు. ఎంతో వేదనతో పిల్లలను కంటావు, ఆదాము నీపై అధికారాము కలిగి ఉంటాడు అని దేవుడు హవ్వను శపించాడు. ఆదాముకు లోబడి ఉండాలి అని కూడా చెప్పాడు(3:16). మొదట హవ్వ పాపము చేసింది గనుక ఆమె సరియైన నిర్ణయాలు తీసుకోలేదు అని దేవుడు తలంచాడు (1తిమోతి 2:14).
ఆదాముకు దేవుడు విధించిన శిక్ష ఆదాము చూపిన అవిధేయతను బట్టి దేవునికి సాతానుతో పాటు ఆదాముపై కూడా కోపం వచ్చింది. ఏదెను తోటను కాపాడే పని ఆదాముకు ఇవ్వబడింది, కాని ఇప్పుడు వారిద్దరూ తోటనుండి బయటకు వెళ్లగొట్టబడ్డారు(3:23). వారి అందమైన నివాసాన్ని వదిలి వెళ్లటం వారిని ఎంతగానో బాధించి ఉండవచ్చు. ఇకనుండి నేలపై ముండ్లతుప్పలు, గచ్చపొదలు పెరుగుతాయి అని దేవుడు ఆదామును హెచ్చరించాడు. దేవుని అద్భుతమైన అందమైన సృష్టి ఈ విధముగా చెడిపోవడం ఆదాము, హవ్వలకు ఎంతో దుఃఖాన్ని కలిగించి ఉంటుంది. వారు ఇప్పుడు కష్టపడి పంటలు పండించి ఆహారము సంపాదించుకోవాలి, ఇకనుండి ఆదాము ఎంతో ప్రయాసముతో కష్టముతో పని చేయాలి, ప్రతిదినము ఎండలో పనిచేసి అలసిపోయే పరిస్థితులు ఆదాముకు కలిగాయి.
ఆదాము, హవ్వలు ఒక దినము శారీరకంగా కూడా చనిపోతారు అని దేవుడు సెలవిచ్చాడు. వారు చనిపోయిన తరువాత వారి శరీరాలు తిరిగి మట్టిలో కలిసిపోతాయి అని చెప్పాడు. ఎంత దుఃఖకరం! ఆదాము హవ్వలు పాపం చేయకుండా ఉంటే ఇవన్నీ వారికి సంభవించి ఉండేవి కాదు. వారు నిత్యము సంతోషంగా జీవించు ఉండేవారు. దేవుని మాటలను లక్ష్యపెట్టక, దుష్టుడైన సాతాను మాటలు వారు విన్నారు.
దేవుని దయాళుత్వము దేవుడు వారిని శిక్షించినప్పటికి, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆదాము, హవ్వలు అంజూరపు ఆకులతో వస్త్రములు చేసికొని వేసుకున్నారు అని చూశాము కదా! కానీ ఆకులతో వారు తయారు చేసుకున్న బట్టలు ఎక్కువ రోజులు ఉండవు అని దేవునికి తెలుసు కనుక జంతువుల చర్మముతో బట్టలు చేయించి వారికి ఇచ్చాడు. ఒకవేళ గొర్రె చర్మముతో ఆ బట్టలు తయారుచేయబడి ఉండవచ్చు.
దేవుడు ఎంతో కనికరము తో వారిని ఏదెను తోట నుండి బయటకు పంపివేశాడు. దేవుడు ఒక గొప్ప ఉద్దేశముతో అలా చేశాడు. ఆ తోట మధ్యను జీవవృక్షము కూడా ఉంది. ఆదాము హవ్వలు ఆ వృక్ష ఫలములు తింటే వారు నిత్యము పాపపు శరీరాలతో జీవించవలసి వస్తుంది. అది ఎంత భయంకరం. పాపపు హృదయాలతో భూమిపై మరణించకుండా జీవించడం ఎంత దుర్భరం! వారు తిరిగి ఏదెను తోట లోనికి ప్రవేశించకుండా తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను దేవుడు నిలువబెట్టాడు. దేవుడు సాతానును ఓడించుటకు దయతో ప్రభువైన యేసును పంపుతాను అని వాగ్దానం చేశాడు.
సందేశము
ఆదాము హవ్వలు చేసిన ఒకే ఒక పాపమువలన ప్రపంచములోని సమస్తము పాడైపోయింది. ఎక్కడ చూచినా బాధ, దుఃఖము, కష్టాలు, మరణం, మనుష్యులు ఒకరినొకరు ద్వేషించుకొనడం, జంతువులు ఒకదానినొకటి చంపుకొని తినడం, పురుగులు, పిచ్చిమొక్కలు, ముళ్ళపొదలు పంటలను పాడు చేయడం, ఆహారం కోసం కష్టపడడం ఇలా ఎన్నో సంభవించాయి. పాపము వలన ప్రపంచములోని సమస్తము పాడు చేయబడింది.
అన్వయింపు
విచారకరమైన విషయం ఏమిటంటే మనము అందరమూ పాపులమే. కేవలం ఆదాము హవ్వలు మాత్రమే పాపులు కాదు గాని ప్రపంచములోని ప్రతి ఒక్కరూ పాపాలు చేసినవారే. మనుష్యులు అబద్ధాలు చెప్తారు, దొంగిలిస్తారు,హత్యలు చేస్తారు ఇంకా ఎన్నో చెడు పనులు చేస్తుంటారు. చిన్నపిల్లలు కూడా అసూయ, స్వార్ధం, అల్లరి,ఈర్ష్య కలిగి ఉంటారు. దేవుడు మనలను పాపము చేయమని చెప్పాడా? లేదు కదా! దేవుడు తప్పు అని చెప్పినా అదే పనులు చేయడానికి మనమందరము ఇష్టపడతాము. ఎప్పుడూ పాపము చేయకూడదు అని ఎంతో గట్టిగా నిర్ణయించుకున్నా, అలా ఉండలేము(యోహాను 3:19). మనకు ఇష్టమైన పనులు చేస్తే సంతోషంగా ఉంటాము అనుకుంటాము, కాని అది నిజంకాదు. పాపము చేసిన తరువాత ఆదాము హవ్వలు సంతోషంగా ఉండలేకపోయారు. సాతాను మాట వినకుండా దేవునికి విధేయత చూపి ఉంటే బాగుండేది కదా అని ఎన్నోసార్లు అనుకొని ఉండవచ్చు. పాపక్షమాపణ కొరకు మనము యేసు దగ్గరకు వెళ్లాలి. ప్రభువైన యేసు మన హృదయాలు మార్చగలడు గనుక మనము పాపమును ద్వేషించి దేవుని ప్రేమించగలము. అప్పుడే మనము నిజంగా సంతోషంగా ఉండగలము.
సృష్టి ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసినప్పుడు ఎంతో దుఃఖం కలుగుతుంది (రోమా 8:22). పిల్లి చిన్న పక్షులను చంపి తినడం, జంతువులు ఒకదానినొకటి చంపుకొనడం టి.వి. ప్రోగ్రాంలో చూచినప్పుడు బాధగా ఉంటుంది కదూ! దేవుడు ప్రపంచమును సృష్టించినప్పుడు ఆ విధంగా లేదు అని మనము గుర్తించాలి. ఇవన్నీ ఆదాము హవ్వల పాపము వలన సంభవించాయి. ప్రభువైన యేసు భూమి మీదకు రెండవ రాకడలో వచ్చినప్పుడు తిరిగి అన్ని విషయాలు చక్కగా చేయబడతాయి. పాపము చెడుతనము శాశ్వతంగా నాశనమవుతాయి. ప్రభువైన యేసును విశ్వసించినవారు పరిపూర్ణులుగా చేయబడతారు (రోమా 8:19-23).
కంఠతవాక్యము
పాపమువలన వచ్చుజీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము (రోమా 6:23).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF