నిర్గమకాండము 2:10-25; అ.కా. 7:21-29; హెబ్రీ. 11:24- 26

ఉద్దేశము
అందరి జీవితాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొన వలసిన పరిస్థితులు వస్తాయి అని బోధించుట. ఆ సమయములో దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకుంటున్నామా, లేదు మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామా అనేది ముఖ్యం అని వివరించుట.

ముఖ్యాంశము
మన జీవితాలలో ఎన్నో నిర్ణయాలు తీసుకొనవలసి ఉంటుంది. అవి మనకు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అని లేదా రాబోయే పుట్టినరోజుకు ఎవరిని పిలవాలి ఇలా ఎన్నో ఉంటాయి. కానీ పెద్దవారు అయిన తరువాత ఎంతో ముఖ్యమైన విషయాలలో కూడా నిర్ణయాలు తీసుకొనవలసి ఉంటుంది. ఉదాహరణకు ఏ కోర్సు చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి ఇలా ఎన్నో.

గతవారము
నైలు నదిలో మునిగి పోకుండా చిన్నవాడైన మోషే ఎలా రక్షించబడ్డాడో మనము చూసాము. ఫరో ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? మోషే తల్లిదండ్రులు ఏమి చేశారు? తమ ఇంటిలో మూడు నెలలు దాచి, ఒక పెట్టెలో పెట్టి నది ఒడ్డున జమ్ములో ఉంచారు. విశ్వాసమును బట్టి మోషే తల్లిదండ్రులు రాజు ఆజ్ఞకు భయపడక మూడు నెలలు అతనిని దాచిపెట్టారు. (హెబ్రీ 11: 23). ఫరో కుమార్తె తన కొరకు మోషేను పెంచవలసిందిగా అతని తల్లిని కోరింది. అతడు పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె దగ్గరకు వచ్చాడు.

తన స్వంత ఇంటిలో మోషే

చిన్నవాడుగా మోషే తమ దగ్గర కొంతకాలం పెరగడం అతని తల్లిదండ్రులకు ఎంతో సంతోషం కలిగించింది. అమ్రాము యోకెబెదులు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు కనుక వారి దగ్గర తగినంత ధనం ఉండి ఉండకపోవచ్చు. మోషేను పెంచుతున్నందుకు ఫరో కుమార్తె యోకెబెదుకు ఇస్తున్న జీతము వారికి ఎంతో ఉపయోగపడి ఉండవచ్చు. మోషే చదువుకోవడానికి స్కూల్ లేదు, ఆడుకోవడానికి కూడా ఎవరూ ఉండి ఉండకపోవచ్చు. అందమైన సృష్టిని చేసిన అద్భుతమైన జీవముగల దేవుని గురించి అమ్రాము యోకెబెదు తప్పక మోషేకు చెప్పి ఉంటారు. చిన్నవాడిగా ఉన్నప్పుడు నదిలో మునిగి పోకుండా దేవుడు కాపాడిన విషయాన్ని కూడా వారు మోషేకు వివరించి ఉండవచ్చు. యోసేపు ఐగుప్తులో నివసించి అధికారిగా పరిపాలించిన విషయాన్ని కూడా వారు తెలియజేసి ఉంటారు. తమ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు చేసిన వాగ్దానములను గురించి కూడా మోషే తల్లిదండ్రుల దగ్గర నుంచి విని ఉండవచ్చు. వారు పరదేశమునందు 400 సంవత్సరములు బానిసలుగా ఉండి తరువాత దేవుడు వాగ్దానము చేసిన భూమికి తిరిగి వెళతారు అనే విషయాలు కూడా మోషే తెలుసుకుని ఉంటాడు.

మోషే తన చిన్న వయస్సునందే ప్రభువును గురించిన ఎన్నో విషయాలు నేర్చుకుని ఉండవచ్చు. మోషే తాను వినిన విషయాలను బట్టి విశ్వాసంతో దేవునికి ప్రార్ధించే వాడిగా తయారై ఉంటాడు అని మనము గ్రహించవచ్చు.

రాజభవనములో మోషే

ఫరో కుమార్తె దగ్గరకు మోషేను తీసుకొని వెళ్ళవలసిన సమయము వచ్చింది. ఫరో కుమార్తెకు సంతానము లేనందువలన మోషేను తన సొంత కుమారుని గా భావించి తన దగ్గరే ఉంచుకుంది. నీటిలో నుండి ఇతని తీసితిని అని అర్థము వచ్చునట్లుగా మోషే అను పేరు పెట్టింది. ఫరో కుమార్తె మోషేను ప్రేమతో జాగ్రత్తగా చూసుకుంటుంది అని అమ్రాము యోకెబెదులు గ్రహించారు. మోషే వెళ్ళిపోవడం వారికి బాధ కలిగించినా ప్రభువు మోషేను సురక్షితంగా కాపాడుతాడు అనే విశ్వాసము వారికి ఆదరణ కలిగించి ఉంటుంది. మోషే విషయములో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అని వారు గ్రహించారు.

కాని, రాజకుమారుడిగా ఫరో కుమార్తె దగ్గర ఉండడం మోషేకు ఎంతో కొత్తగా అనిపించి ఉండవచ్చు. రాజభవనము, ఎంతో ఖరీదైన వస్తువులు, ఆహారం, దుస్తులు, ఆట వస్తువులు అన్ని మోషేకు ఉన్నాయి. పనులు చేయడానికి ఎంతో మంది పనివారు ఉన్నారు. బాలుడైన మోషే ఫరో కుమార్తె దగ్గర రాజభవనములో పెరుగుతున్నాడు.

మోషే బాలుడిగా ఎదుగుతూ ఉన్న సమయములో ఎన్నో విద్యలు నేర్చుకొనుటకు మొదలుపెట్టాడు. అధికవిద్య అభ్యసించుట ఎంతో ముఖ్యము అని ఐగుప్తీయుల నమ్మకము. మోషే అనేక విధములైన శాస్త్రాలను నేర్చుకున్నాడు. గణితం (లెక్కలు), చరిత్ర, భౌగోళిక శాస్త్రం, సైన్స్ ఇలా ఎన్నో అభ్యసించాడు. నాయకుడిగా ఇతరులను ఎలా నియంత్రించాలి అనేది కూడా నేర్చుకున్నాడు. దేవుడు తోడుగా ఉన్నందున మోషే అన్ని విద్యలలో ప్రావీణ్యం సంపాదించాడు. ఐగుప్తీయులు కూడా తెలివైన వానిగా మోషేను గుర్తించారు(అ.కా. 7: 22). ఐగుప్తు యొక్క సకల విద్యలు మోషే నేర్చుకున్నప్పటికి వారి దేవుళ్ళను గురించి మాత్రము తెలుసుకొనలేదు. ఐగుప్తీయులు జీవముగల దేవుని ఆరాధించరు అని మోషేకు తెలుసు. వారు నైలునదిని , సూర్యుడిని ఎంతగానో ఆరాధించి పూజించేవారు. నదిని సూర్యుడిని సమస్తమును సృజించిన నిజమైన దేవుని వదలిపెట్టి వాటిని పూజించడం ఎంత విచారకరం! కానీ మోషే వారివలె వాటిని పూజించలేదు. తన తల్లిదండ్రుల వలె దేవునియందు విశ్వాసముంచాడు. తాను చిన్న పిల్లవాడిగా ఉన్నపుడు వారు చెప్పిన విషయాలు మోషే గుర్తుంచుకొన్నాడు.

మోషే నిర్ణయము

మోషే పెద్దవాడైన తరువాత 40 సంవత్సరముల వయస్సులో తన జీవితం పట్ల దేవుని ఉద్దేశము ఏమిటి అని ఆలోచించాడు. రాజభవనం లోనే ఉంటూ విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన సమస్యలు లేని జీవితము జీవించాలా, లేదు ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు సహాయపడాలా అని ఆలోచించ సాగాడు. ఫరో కుమార్తెకు కుమారుడుగా ఉన్నప్పటికి మోషే కూడా ఇశ్రాయేలీయులలో ఒకడు. అతడు రాజ్యములో తిరుగుతూ ఉన్నప్పుడు తన ప్రజలు బానిసలుగా అనుభవిస్తున్న కష్టాలను చూచాడు. తిరిగి కనాను దేశమునకు తీసుకుని వెళ్తాను అని దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానమును గురించి మోషేకు తెలుసు. 400 సంవత్సరముల తరువాత కనాను చేరుకుంటారు అని దేవుడు ముందుగానే అబ్రాహాముకు చెప్పాడు. వారు ఐగుప్తుకు వచ్చి 400 సంవత్సరముల దాటిపోయింది గనుక కనాను వెళ్ళవలసిన సమయం సమీపించింది. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను కనాను తీసుకొని వెళ్ళుటకు దేవుడు తనను నాయకునిగా ఏర్పరచుకున్నాడు అని మోషే తలంచాడు (అ.కా. 7: 25).

మోషే ఐగుప్తీయుని వలె రాజభవనములో ఉండడానికి ఇష్టపడలేదు. అక్కడ తనకు ఎంతో సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితం ఉంది, ఒక దేశమునకు రాజు కావడానికి కూడా అవకాశం వుంది. కాని మోషే దేవుని ప్రజలతో ఉండి వారికి సహాయం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. అతని హృదయము తన ప్రజలు అయిన ఇశ్రాయేలియుల పట్ల ఎంతో భారముతో నిండి ఉంది. వారిని ఎలాగైనా కనాను దేశమునకు నడిపించాలి అని ఆశించాడు. మోషే ఐగుప్తు ధనము కంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, మరియు అల్ప కాలము పాప భోగము అనుభవించుట కంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని తలంచాడు (హెబ్రీ11:24- 26)

మోషే ఐగుప్తీయుని చంపుట

ఒకరోజు మోషే బయట తిరుగుతూ తన జనులైన ఇశ్రాయేలీయులు చేస్తున్న భారమైన పనులు చూశాడు. తరువాత మోషే చూచిన ఒక సంఘటన అతనికి ఎంతగానో బాధ కలిగించింది. ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడైన వ్యక్తిని కొట్టడం మోషే చూచాడు. ఆ సంఘటన మోషేకు ఎంతో కోపం తెప్పించింది. మోషే ఇటు అటు తిరిగి చూచి అక్కడ ఎవరూ లేకపోవడం వలన ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో కప్పి పెట్టాడు.

మోషే చేసిన పని సరియైనదా? ఎంత మాత్రము కాదు. అది ఎంతో పెద్ద పొరపాటు. మోషే ఎందుకు అలా చేసాడు? ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు బాధ పెట్టుట మోషే సహించలేకపోయాడు.

మరుసటి రోజు తిరిగి మోషే బయటకు వెళ్ళాడు. అప్పుడు ఇద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడుకోవడం చూశాడు. అప్పుడు మోషే వారి దగ్గరకు వెళ్ళి అన్యాయము చేసిన వారితో - నీవేల నీ పొరుగువాని కొట్టున్నావు? అని అడిగాడు. అప్పుడు ఆ రెండవ వ్యక్తి మోషేతో - మా మీద తీర్పరిగా నిన్ను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా? అని అడిగాడు. ఆ మాటలు వినిన మోషే ఎంతగానో భయపడ్డాడు. తాను ఐగుప్తీయుని చంపిన విషయం తెలిసిపోయింది అని మోషేకు అర్థమైంది. వారికి సహాయము చేయాలని మోషే తీసుకున్న నిర్ణయం వారు గుర్తించలేదు. తన ద్వారా తన సహోదరులైన ఇశ్రాయేలీయులకు దేవుడు రక్షణ చేయుచున్న సంగతి వారు గ్రహిస్తారు అని మోషే తలంచాడు, కాని వారు గ్రహించలేదు( అ. కా. 7:5). ఇప్పుడు మోషే పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడు. తాను ఐగుప్తీయుని చంపిన విషయం తెలిసిపోయింది గనుక ఐగుప్తు రాజు అయిన ఫరో తనను తప్పక చంపుతాడు అని మోషే భయపడ్డాడు.

మోషే పారిపోవుట

మోషే ఐగుప్తీయుని చంపిన సంగతి ఫరోకు తెలిసింది. ఫరో ఎంతో కోపముతో మోషేను చంపాలని నిశ్చయించుకున్నాడు. మోషే భయముతో ఫరో ఎదుటనుండి పారిపోయాడు. మోషే అక్కడనుండి దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిద్యాను అనే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చొని ఏమి చేయాలి అని ఆలోచించడం మొదలు పెట్టాడు. మోషే దేవునికి ప్రార్థించి ఉండవచ్చు. మిద్యాను యాజకుని కుమార్తెలైన ఏడుగురు అక్క చెల్లెళ్ళు తమ తండ్రి మందకు నీళ్లు పెట్టుటకు ఆ బావి దగ్గరకు వచ్చారు. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేశాడు. వారి తండ్రి అయిన యిత్రో మోషేను గురించి వినినప్పుడు తమతో కలసి నివసించుమని మోషేను ఆహ్వానించాడు. మోషే అతని దగ్గర ఉంటూ వారి మందలను మేపుతుండేవాడు. యిత్రో కుమార్తె అయిన సిప్పోరాను మోషే వివాహము చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు పుట్టారు. దేవుడు మోషే పట్ల ఎంతో ప్రేమ కలిగి అతడిని ఆశీర్వదించాడు. పరాయి దేశంలో ఉన్నప్పటికి ఒక ఇంటిని, భార్యను కుమారులను మోషేకు అనుగ్రహించాడు. మోషే ఐగుప్తులోని తన ప్రజలను ఏ మాత్రం మరిచిపోలేదు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ దేవునికి మొర్ర పెట్టసాగారు. వారు పెట్టిన మొర్ర దేవునియొద్దకు చేరింది. వారిని విడిపించుటకు దేవుడు మోషేను మరల ఐగుప్తునకు తీసుకొని వెళ్ళుటకు సిద్ధం చేస్తున్నాడు. వచ్చేవారం ఈ విషయాలను గురించి తెలుసుకుందాము.

సందేశము
మోషే ఒక నిర్ణయము తీసుకొనవలసి వచ్చింది. రాజభవనములో నివసించాలా లేదు దేవుని ప్రజలైన తన వారి దగ్గరకు తిరిగి వెళ్లాలా? విలాసవంతమైన జీవితం ఒక వైపు, మరియు శ్రమతో ఉన్న తన ప్రజలు మరొకవైపు. దేనిని ఎంచుకోవాలి? తనను తాను సంతోషపరుచుకోవాలా లేదు ప్రభువును సంతోషపరచాలా? దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మోషే సరియైన నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రజలకు సహాయం చేయుటకు మోషే తలంచినప్పటికి, తన ఆలోచన చొప్పున జరుగలేదు. తరువాత దేవుని సమయములో మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఏర్పరచబడ్డాడు.

అన్వయింపు
మన జీవితాలకు గమ్యం ఏమిటి? మనలను మనము సంతోష పరచుకోవడానికి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? మనకు నచ్చిన విషయాలు చేస్తూ, వాటిని గురించి ఆలోచిస్తూ దేవుని గురించి పూర్తిగా మరచిపోతున్నామా? పెద్దవారమైన తరువాత విపరీతంగా డబ్బు సంపాదించి, పెద్ద ఇల్లు కారు కొనుక్కుని జీవితాన్ని విలాసవంతంగా గడపాలని ఆశ పడుతున్నామా? లేదు దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయనకు ఇష్టమైన రీతిగా జీవించాలని అనుకుంటున్నామా? ధనవంతులుగా ఉండి అన్ని సౌకర్యాలు ఉన్నందువలన మనము సంతోషంగా ఉంటాము అని అనుకోవడం పొరపాటు. హృదయపూర్వకంగా దేవుని ప్రేమించినప్పుడే మనము సంతోషంగా జీవించగలము.

ఎంతోమంది క్రైస్తవులు కూడా మోషే వలె జీవించడానికి నిర్ణయించుకుంటారు. ఎంతో సౌకర్యవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉన్నప్పటికి దానిని వదులుకుంటారు. దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడి అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తుంటారు.

ఉదాహరణ
ఢిల్లీలో ఒక పెద్ద వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతడు ఎంతో ధనవంతుడు. ప్రతి సంవత్సరం ఎన్నో కోట్ల ఆదాయం వస్తుండేది. అతడు ప్రభువైన యేసును తన హృదయములోనికి ఆహ్వానించిన తరువాత తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. తనకు వచ్చే ఆదాయాన్ని పేదల కోసం ఖర్చు పెట్టేవాడు. తిండి లేనివారికి, అనారోగ్యంతో ఉన్న పేదలకు సహాయం చేసేవాడు. వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలు కట్టించాడు. వారి దగ్గరకు వెళ్లి ప్రభువు ప్రేమను గురించి వివరించేవాడు. ఆ వ్యాపారి ప్రభువైన యేసుకు తన జీవితంలో మొదటి స్థానం ఇవ్వడం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగాడు. తాను తీసుకొనిన నిర్ణయం దేవునికి ఎంతో సంతోషం కలిగించి ఉంటుంది.

కంఠతవాక్యము
మీరు ఎవరిని సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి (యెహోషువ 24: 15).

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.