ఆదికాండము 27:41-46;28:1-22
ఉద్దేశము/లక్ష్యము
పరలోకమునకు ఎక్కి పోవుటకు ప్రభువైన యేసు నిచ్చెన వంటివాడు, ఆయన తప్ప రక్షణకు మరొక మార్గము లేదు అని బోధించుట. మనుష్యులను దేవుని ప్రేమ మాత్రమే మార్చగలదు అని వివరించుట.
ముఖ్యాంశము
స్కూల్ లో మీ స్నేహితుని పెన్సిల్ బాక్స్ తీసుకొని కాలువలో పడవేసి పరిగెత్తి ఇంటికి వెళ్లారు అనుకుందాము. మీరు చేసిన పని తెలిసిన తరువాత మీ స్నేహితునికి కోపం వస్తుందా రాదా? మరుసటి రోజు స్కూల్ కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, వెళ్తే మీ స్నేహితుడు కొడతాడేమో అని భయపడతారు కదూ! మీ స్నేహితునికి కోపం రావడానికి మీరు చేసిన తప్పే కారణము. అవునా, కాదా?
గతవారము
యాకోబు తన సహోదరుడైన ఏశావుకు కోపం తెప్పించి నట్లు మనము చూసాము. యాకోబు ఏమి చేశాడు? జ్యేష్ఠుడు అయిన ఏశావుకు చెందవలసిన ఆశీర్వాదాలను తండ్రి దగ్గర నుండి యాకోబు తీసుకున్నాడు. దృష్టి మందగించిన ఇస్సాకును యాకోబు ఎలా మోసగించాడు? యాకోబు ఆశీర్వాదాలు పొందగలిగాడా? ఆ విషయం తెలుసుకున్న ఏశావు ఎలా స్పందించాడు? అప్పుడు యాకోబు ఏమి చేశాడు?
రిబ్కా ఆలోచన - ప్రణాళిక
ఏశావు యాకోబును చంపాలని నిర్ణయించుకున్న విషయము తెలిసి వారి తల్లి రిబ్కా యాకోబును అక్కడనుండి దూరంగా పంపివేసి మరణించకుండా కాపాడాలి అనుకుంది. ఇస్సాకు దగ్గరకు వెళ్ళి యాకోబు ఆ దేశస్థులను వివాహమాడకుండా, ప్రభువును ప్రేమించే వారిని వివాహమాడునట్లు అతనిని అక్కడ నుండి పంపివేద్దాము అని చెప్పింది. ఇస్సాకుకు నిజం తెలిస్తే ప్రమాదము అని రిబ్కా ఆలోచించి ఆ విధముగా చెప్పి ఉండవచ్చు. ఏశావు వివాహము చేసికొనిన హేతు కుమార్తెలు ఇస్సాకు రిబ్కాలకు ఎంతో బాధను కలుగజేశారు. యాకోబు కూడా అక్కడ నివసిస్తున్న వారిని వివాహము చేసికొనడం వారికి ఇష్టం లేదు. కనానీయులు నిజమైన దేవుని ఎరుగక విగ్రహారాధికులుగా ఉండేవారు. దేవుని ప్రేమించే వారు తమవంటి వారినే వివాహము చేసుకోవాలి అని బైబిల్ బోధిస్తుంది (1కొరింథి. 7:39). ఇస్సాకు, రిబ్కా ఇరువురు యాకోబును హారానులో ఉన్న రిబ్కా సహోదరుడైన లాబాను నొద్దకు పంపుటకు నిశ్చయించుకున్నారు. యాకోబు అక్కడి బంధువులలో నుండి వివాహము చేసుకుంటే మంచిది అని వారు తలంచారు. యాకోబు బయలుదేరుటకు ముందు ఇస్సాకు అతని కోసం ప్రార్థించాడు. అబ్రాహాముకు వాగ్ధానము చేయబడిన ఆశీర్వాదాలు అన్నీ యాకోబు పొందునట్లు సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థన చేశాడు. చిన్నవాడు అయినప్పటికీ దేవుని ఆశీర్వాదాలు యాకోబుకే చెందుతాయి అని ఇస్సాకు గ్రహించగలిగాడు.
యాకోబు ప్రయాణము
తల్లిదండ్రుల మాట ప్రకారము యాకోబు త్వరపడి నిశ్శబ్దంగా తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. యాకోబు వెళ్లి పోతున్నందుకు రిబ్కా దుఃఖపడి ఉండవచ్చు. ఇస్సాకును మోసము చేయుటకు తాను ప్రేరేపించకపోతే యాకోబు తమను వదిలి వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు, తన కుమారునికి దూరంగా, ఒంటరితనంతో బాధపడవలసి వచ్చేది కాదు. కానీ విచారకరమైన విషయము - రిబ్కా మరెన్నడూ యాకోబును చూడలేదు. యాకోబును ప్రయాణంలో పూర్తిగా మార్చివేసిన గొప్పవిషయాన్ని గురించి మనము తెలుసుకుందాము. యాకోబు వెళ్ళవలసిన దేశం దాదాపు 650 కిలోమీటర్ల దూరములో ఉంది. ఇస్సాకు కనాను దేశపు దక్షిణపు తట్టు ఉన్న బెయేర్షబాలో నివసించేవాడు. హారాను సిరియా దేశమందుండేది. ఆ దినాలలో కార్లు, విమానాలు లేవు గనుక యాకోబు కాలినడకన వెళ్లి ఉండవచ్చు. కొన్ని బట్టలు, ఆహారముతో యాకోబు ప్రయాణం చేస్తూ ఉండి ఉండవచ్చు. కొన్ని రోజుల ప్రయాణం తరువాత యాకోబు బేతేలు అనే స్థలము దగ్గర రాత్రి నిద్రించడానికి ఆగిపోయాడు. అబ్రాహాము కనాను దేశము వచ్చినప్పుడు మొదట అదే స్థలములో నివసించాడు. అది కొండలు, పర్వతములు కలిగిన ప్రాంతము గనుక యాకోబుకు చుట్టుప్రక్కల చాలా దూరం కనిపిస్తూ ఉండి ఉండవచ్చు. యాకోబు ప్రయాణం వలన అలిసిపోయినందువలన ఆ స్థలం చేరుకోగానే నిద్రపోవాలి అనుకున్నాడు. అక్కడ రాళ్లలో ఒకటి తీసుకుని తలక్రింద పెట్టుకుని పడుకున్నాడు.
యాకోబు ఒంటరిగానుండుట
తల్లిదండ్రులను, స్నేహితులను, తన ఊరిని వదిలి పెట్టి ఒంటరిగా ఉండటం యాకోబుకు ఎంతో బాధను కలిగించి ఉండవచ్చు. తల్లిదండ్రులను మరల చూస్తానా? తన తల్లి బంధువులు తనను వారి ఇంటిలో చేర్చుకుంటారా? హారానులో తనకు భార్య దొరుకుతుందా? ఒకవేళ ఏశావు హారాను వచ్చి తనను చంపుతాడా? ఇలా ఎన్నో సందేహాలతో యాకోబు ఉండి ఉండవచ్చు. తల్లి మాటలు విని తండ్రిని మోసగించకపోతే ఏశావుకు తనను చంపాలి అనే ఆలోచన వచ్చేదికాదు. అంతా తన పొరపాటు వలన జరిగింది అని యాకోబు అనుకున్నాడు. అటువంటి పనులు ఎలా చేయగలిగాను? అని బాధ పడి ఉండవచ్చు. మాట్లాడటానికి తనకు ఎవరూ లేరు గనుక ఒంటరిగా తాను చేసిన తప్పులను గూర్చి ఆలోచించే సమయం దొరికింది. అబద్ధాలు చెప్పి, మోసం చేసి దేవునికి ఇష్టం లేని పనులు చేశాడు. మనము చెడు పనులు చేసినప్పుడు హృదయంలో ఎంతో బాధ కలుగుతుంది కదూ! చెడ్డవాడైన,మోసగాడైన తనను దేవుడు ఏ విధముగా ఆశీర్వదిస్తాడు అని యాకోబు ఆశ్చర్యపడి ఉండవచ్చు. ఏమని ప్రార్థించాలి? అనే బాధ కూడా కలిగి ఉంటుంది.
యాకోబుకు వింతైన కలవచ్చుట
యాకోబుకు నిద్రలో ఒక కల వచ్చింది. అది అసాధారణమైన కల. దేవుడు యాకోబుతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజుల్లో ప్రభువు కలల ద్వారా మాట్లాడడాం చాలా తక్కువ. దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతాడు. ఆ దినములలో బైబిల్ లేదు గనుక ఇస్సాకు, అబ్రాహాము చెప్పిన విషయాల ద్వారా మాత్రమే యాకోబు ప్రభువును గురించిన జ్ఞానము కలిగి ఉండవచ్చు. ఆ రాత్రి స్వప్నము ద్వారా ప్రభువు యాకోబుతో మాట్లాడాడు. యాకోబు కలలో ఒక నిచ్చెన భూమిమీద నిలువబడి ఉండుట చూశాడు. ఆ నిచ్చెన చివర ఆకాశమును అంటుకొని ఉంది. దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండటం చూశాడు. ప్రభువు ఆకాశమును అంటుచున్న నిచ్చెన కొనకు పైగా నిలిచి యాకోబుతో మాట్లాడసాగాడు. ప్రభువు మూడు అద్భుతమైన విషయాలను యాకోబుకు వాగ్దానము చేశాడు. ప్రభువు యాకోబుతో - "నీవు పడుకొని యున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. మరియు భూమి యొక్క వంశములన్నియు నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును, మరియు నేను నీకు తోడై యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు మరల నిన్ను రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువను" అని చెప్పాడు. ఎంత ఆదరణ కరమైన మాటలు,గొప్ప ఆశీర్వాదాలు!
యాకోబు నిద్ర నుండి మేలుకొనుట
యాకోబు నిద్రలేచిన తరువాత ప్రభువు రాత్రి కలలో తనతో మాట్లాడాడు అని గ్రహించాడు. దేవుడు అక్కడకు వచ్చి మాట్లాడాడు గనుక అది పరిశుద్ధస్థలము అని యాకోబు విశ్వసించాడు. పరలోకపు ద్వారము అదే అని యాకోబు భయపడ్డాడు. ప్రభువు యాకోబుతో అద్భుతమైన స్వప్నము ద్వారా మాట్లాడాడు. ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టక తనకు తోడుగా ఉంటాడు అనే విషయం యాకోబుకు ఎంత గొప్ప ఆదరణ!
తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలక్రింద పెట్టుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసి ఆ స్థలమునకు దేవుని మందిరము అనే అర్థము కలిగిన "బేతేలు" అని పేరు పెట్టాడు. తాను ఎంత అల్పుడను అనే సత్యాన్ని యాకోబు గ్రహించి ఉంటాడు. ఆకాశమును, భూమిని సృజించిన గొప్ప ప్రభువు తనను లక్ష పెట్టడానికి ఎటువంటి కారణంలేదు అని అర్ధం చేసికొని ఉండవచ్చు. తాను చేసిన పాపాలు, మోసము వలన ప్రభువు ప్రేమను, దయను పొందడానికి తనకు అర్హత లేదు అని యాకోబు దుఃఖించి ఉండవచ్చు. తాను చేసిన చెడుపనులను బట్టి తనను శిక్షించకుండా ఎంతో గొప్ప ఆశీర్వాదాలను వాగ్దానము చేసిన దేవుడు ఎంత కరుణామయుడు!
దేవుని అద్భుతమైన క్షమాపణ
తన పాపములను క్షమించిన ప్రభువు యొక్క అద్భుతమైన ప్రేమను బట్టి యాకోబు ఎంతగానో ధైర్యము తెచ్చుకొని ఉండవచ్చు. క్రొత్త దేశమునకు వెళ్తున్నాను అనే భయము కూడా పోయింది. ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు అని చేసిన వాగ్దానం యాకోబు హృదయములో ఎంతో సంతోషం నింపింది. అంతేకాక యాకోబును మరల ఆ దేశమునకు తీసుకొని వస్తాను అని చెప్పిన మాటలు కూడా యాకోబును బలపరిచి ఉండవచ్చు. యాకోబు దేవునితో ఒక నిబంధన చేశాడు. యాకోబు - "నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి నేను వెళ్లుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి,తినుటకు ఆహారమును,ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల ప్రభువు నాకు దేవుడై యుండును" అని మ్రొక్కుకున్నాడు. తిరిగి యాకోబు తన ప్రయాణం మొదలుపెట్టాడు. యాకోబు ఇప్పుడు సంతోషముతో నిండిన ఒక నూతనమైన వ్యక్తి.
సందేశము
ఈరోజు మనము అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాము. పాపుల యెడల దేవుని ప్రేమను గూర్చి మనము తెలుసుకున్నాము. యాకోబు ఎంతో దీనస్థితిలో తన ఇంటిని విడిచి బయలుదేరాడు. మోసముతో తన సహోదరుని జ్యేష్ఠత్వపు హక్కును తీసుకుని తన తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు దొంగిలించడంవలన, ఏశావు చేతిలో మరణించకుండా పారిపోవలసి వచ్చింది. తాను చేసిన పనులకు ఫలితంగా శిక్ష పొందవలసిన వాడై ఉన్నాడు. ప్రభువు పరిశుద్ధుడు గనుక పాపమును సహించలేడు, కాని ఎందుకు యాకోబు యెడల
అంత ప్రేమ చూపాడు? ప్రభువు ఎంతో దయ కలిగినవాడై స్వప్నములో యాకోబుతో మాట్లాడాడు. ఆ కలలోయాకోబు ఆకాశమును అంటుచున్న నిచ్చెన చూశాడు. యాకోబు యోగ్యుడు కానప్పటికి, ప్రభువు మాట్లాడి తన ప్రేమను కనికరమును చూపి క్షమించాడు. యాకోబు జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రభువు వాగ్దానాలన్నింటిని విశ్వసించాడు.
అన్వయింపు
నిచ్చెన గూర్చి ఒకసారి ఆలోచించండి. మనము అందుకోలేని వాటికోసం నిచ్చెన వాడుతాము. యాకోబు కలలో చూచిన నిచ్చెన యేసును మనకు చూపుతుంది. మనంతట మనము చేరుకోలేని పరలోకపు దేవుని చేరుకొనుటకు యేసు మనకు నిచ్చెన వలె ఉన్నాడు. యేసు ద్వారా మాత్రమే మనము పరలోకమునకు వెళ్ళగలము. మన పాపములను క్షమించుటకు యేసు సిలువలో తన ప్రాణమును అర్పించాడు అని విశ్వసించి నప్పుడే పరలోకము స్వతంత్రించు కొనగలము. ప్రభువు యాకోబు పాపములను క్షమించడమే కాక, నూతన హృదయాన్నికూడా అనుగ్రహించాడు. ఎటువంటి పాపములు చేసిన వారినైనా యేసు క్షమించడానికి ఇష్టపడతాడు అని యాకోబు జీవితం ద్వారా మనము అర్థం చేసుకోగలము. మనమందరము పాపము చేసి దేవునికి దూరస్థులముగా జీవిస్తుంటాము, కాని పశ్చాత్తాపముతో ప్రభువు దగ్గరకు వెళ్ళినట్లయితే క్షమించి మనలను తన బిడ్డలుగా చేసుకొనుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. యేసును విశ్వసించినట్లయితేనే మనము పరలోకమునకు ఎక్కి పోగలము. మరి ఏ ఇతర మార్గము లేదు. పరలోకమునకు ఎక్కి పోవుటకు మార్గము యేసే అని మీరు నమ్ముతున్నారా?
ఉదాహరణ
ఒక చిన్నఊరిలో రాహుల్, రాజేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఇద్దరు పేద కుటుంబాలకు చెందినవారు. ఇద్దరూ చాలా బాగా చదువుకునేవారు. స్కూల్ లో క్రమశిక్షణతో ఉండేవారు. ప్రతివారం బైబిల్ క్లాస్ కు వెళ్లేవారు. యేసు అందరి హృదయాలను మార్చి క్రైస్తవులుగా చేయగలరు అని క్లాస్ లో నేర్చుకున్నారు. స్కూల్ లో చదువులు అయిన తరువాత వారి మార్గాలు పూర్తిగా వేరైపోయాయి. రాహుల్ మంచి క్రైస్తవునిగా మారితే, రాజేష్ తనకు ఇష్టమైన విధముగా జీవించుటకు అలవాటు పడ్డాడు. చెడు స్నేహాలకు చోటు ఇచ్చి, దొంగతనాలు నేర్చుకున్నాడు. దొంగతనం చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లాడు.
వారిద్దరూ మొదట ఒకే విధంగా ఉన్నారు, కానీ తరువాత వారి మార్గాలు వేరైపోయాయి. ఏశావు, యాకోబులు కూడా అలాగే ఉండేవారు. యాకోబు తన పాపములకు దేవుని క్షమాపణ పొందాడు, కానీ ఏశావు తన సొంత మార్గములో వెళ్ళాడు. యాకోబు దేవుని దగ్గర నుండి ఎన్నో వాగ్దానాలు, ఆశీర్వాదాలు పొందితే, ఏశావు వాటిని పొందుకోలేకపోయాడు. మన జీవితాలలో మనము ఏ దారిలో ప్రయాణిస్తున్నాము అని తప్పకుండా ఆలోచించుకోవాలి.
కంఠతవాక్యము
యేసు- నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పెను (యోహాను 14: 6).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF