సండే స్కూల్ పాఠాలు

ఆదికాండము 15:5-14; నిర్గమ 1:18; అ.కా.7:2-18; కీర్తనలు 105:1-25

ఉదేశము/లక్ష్యము
దేవుడు తన వాగ్దానము చొప్పున అబ్రాహాము సంతతిని అధికముగా విస్తరింపచేశాడు అని చూపుట. దేవుడు క్రైస్తవులకు బైబిల్ లో ఎన్నో వాగ్దానాలు అనుగ్రహించాడు అని బోధించుట.

ముఖ్యాంశము
కుటుంబములోని పితరుల గురించి తెలుసుకోవాలి అనే ఆశ అందరూ కలిగి ఉంటారు. మనకు దొరికిన సమాచారము అంతా పరిశీలించి కొన్ని వందల సంవత్సరాల పూర్వమునుండి మన వంశపు వారు ఎవరు అని తెలుసుకుంటుంటాము. పూర్వపు దినములలో ఇప్పటి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉండేవారు గనుక ఎంతో పెద్ద వంశావళి కలిగి ఉండేవారు. ఒక్క కుమారునితో ప్రారంభమైన అబ్రాహాము సంతానము లక్షల కొలది విస్తరించింది.

అబ్రాహాము(ఆది 12:1-7)

అత్యధికముగా విస్తరించిన ఆ కుటుంబమునకు అబ్రాహాము మూలపురుషుడు. అబ్రాహాము, అతని భార్య శారా ప్రభువును ఎంతగానో ప్రేమించే వారు. దేవుడు ఒక దినము అబ్రాహాము నివసిస్తున్న ప్రదేశమును వదిలిపెట్టి తాను చూపించబోవు దేశమునకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ప్రభువు మాటకు వారిరువురూ లోబడి తమకున్న సమస్తమును తీసుకుని ఆ దేశమును విడిచిపెట్టి ప్రయాణం సాగించారు. వారు వెళ్ళిన ప్రాంతం కనాను దేశము.

అబ్రాహాము సంతానము అధికముగా విస్తరిస్తారు, కనాను దేశమును వారు స్వా ధీన పరుచుకుంటారు అని దేవుడు అబ్రాహాముకు ప్రత్యేకమైన వాగ్దానములు అనుగ్రహించాడు. ప్రభువైన యేసు కూడా అబ్రాహాము వంశము నందు జన్మిస్తాడు అని చెప్పాడు.

దేవుడు అంత అద్భుతమైన వాగ్దానములు చేసినప్పటికి తమకు ఎందుకు సంతానము కలుగలేదు అని అబ్రాహాము ఆశ్చర్యపడే వాడు, కాని దేవుడు తప్పక తన వాగ్దానములు నెరవేరుస్తాడు అని విశ్వసించేవాడు. దేవుడు అబ్రాహాముకు తన వాగ్దానములను గురించి అనేకసార్లు గుర్తు చేసేవాడు. లెక్కించుటకు సాధ్యము కాని ఇసుక రేణువులు, నక్షత్రముల వలె నీ సంతానమును అభివృద్ధి పరచెదను అని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు(ఆది 15:5). సంవత్సరములు గడిచిపోతున్నా వారికి సంతానము కలుగలేదు. వారిరువురూ ఎంతో వృద్ధాప్యములో ఉన్నారు గనుక సంతానము కలగడం అసాధ్యము అని వారు అనుకున్నారు. దేవుడు తన వాగ్దానములు మరిచిపోయాడా? కాని దేవునికి అసాధ్యమైనది ఏది లేదనికూడా వారికి తెలుసు. ఎంతో అసాధ్యముగా కనిపించినప్పటికి, 25 సంవత్సరములు ఎదురు చూచిన తరువాత దేవుడు ఇస్సాకును వారికి కుమారునిగా అనుగ్రహించాడు. ఎంత గొప్ప అద్భుతం! ఇస్సాకు ఎంత ప్రత్యేకమైన కుమారుడు. అబ్రాహాము, శారాలకు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారము ఇస్సాకు జన్మించాడు. దేవుడు తన వాగ్దానము నెరవేర్చాడు. అబ్రాహాము, శారాలు ఎంతో సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు తెలిపారు.

అబ్రాహాము కుటుంబము వృద్ధి పొందుట

ఇస్సాకు పెద్దవాడైన తరువాత రిబ్కాను వివాహము చేసుకున్నాడు. అబ్రాహాముకు చేసిన విధముగానే ఇస్సాకుకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు (ఆది 26 3-4). ఇస్సాకు రిబ్కాలకు ఏశావు యాకోబు అను ఇద్దరు కుమారులు కలిగారు. యాకోబుకు 12 మంది కుమారులు, కుమార్తెలు జన్మించారు. వారి సంతానము ఎంతో విస్తరించసాగింది. వారు కనాను దేశములోనే నివసిస్తున్నారు. దేవుని వాగ్దానములు అన్నీ నెరవేరుతున్న సమయములో ప్రభువు వారిని కనాను దేశము నుండి ఐగుప్తునకు నడిపించాడు.

అబ్రాహాము కుటుంబం ఐగుప్తులో నివసించుట

యోసేపును గురించి మీకు గుర్తుందా? అతని సహోదరులు యోసేపును బానిసగా అమ్మివేశారు. అతడిని అక్కడ నుండి ఐగుప్తు దేశమునకు తీసుకుని వెళ్లారు. యోసేపు ఎంతో కష్టమైన పరిస్థితులలో ఉన్నప్పటికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో అతనిని ఐగుప్తుకు నడిపించాడు. ఆ దేశంలో గొప్ప కరువు వస్తుంది అని ప్రభువు యోసేపుకు బయలు పరిచాడు గనుక యోసేపు సాధ్యమైనంత ధాన్యమును సమకూర్చి, నిలువ చేసి అందరికి ఆహారము దొరుకునట్లు చేశాడు. ధాన్యము కొరకు కనాను దేశమునుండి యోసేపు సహోదరులు ఐగుప్తుకు వెళ్ళిన విషయము గుర్తుంది కదూ! యోసేపు సహోదరులు అతని ఎదుట సాగిలపడినట్లు మనము తెలుసుకున్నాము. కరవునుండి బయటపడునట్లు తన సహోదరులను కుటుంబాలతో కలిసి తన దగ్గరకు వచ్చునట్లు యోసేపు చేసాడు. కనాను దేశమునుండి ఐగుప్తునకు వచ్చిన యాకోబు సంతతివారు డెబ్బదిమంది.

యోసేపును చూడాలని ఎంతో ఆశ ఉన్నప్పటికి, తాను నివసిస్తున్న కనాను దేశము విడిచిపెట్టి వెళ్ళుటకు యాకోబు ఎంతో బాధపడి ఉండవచ్చు. దేవుడు వాగ్దానం చేసి నడిపించిన దేశమును వదలి ఐగుప్తునకు వెళ్ళవలసి రావడం యాకోబుకు అర్థం కాలేదు. దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులను అనుమతించాడో అని యాకోబు ఎంతో ఆలోచించి ఉండవచ్చు. యాకోబు ఐగుప్తుకు బయలుదేరుతున్న సమయములో దేవుడు రాత్రి దర్శనమందు ప్రత్యక్షమై - " నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను ఐగుప్తు నకు వెళ్ళుటకు భయపడకుము. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చెదను. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను" అని చెప్పాడు. ఐగుప్తుకు వెళ్ళిన తరువాత 17 సంవత్సరములకు యాకోబు అక్కడ చనిపోయాడు. చనిపోవుటకు ముందు యాకోబు యోసేపుతో - ``నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము. నా పితరులతో కూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుము" అని చెప్పాడు. యోసేపు కూడా ఐగుప్తులోనే చనిపోయాడు. చనిపోవుటకు ముందు యోసేపు తన సహోదరులతో - "నేను చనిపోవుచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, ఈ దేశములోనుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొనిపోవును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెను" అని ప్రమాణము చేయించుకున్నాడు. యోసేపు మాటలను బట్టి అబ్రాహాము, ఇస్సాకు,యాకోబులతో దేవుడు చేసిన వాగ్దానాలు యోసేపు కూడా విశ్వసించాడు అని మనము గ్రహించవచ్చు (హెబ్రీ11: 22).

ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా జీవించుట

అబ్రాహాము వంశము అభివృద్ధి చెందుట మొదలుపెట్టింది. 70 మందితో ఐగుప్తుకు వచ్చినవారి కుటుంబము దాదాపు 20 లక్షల సంఖ్యకు చేరుకుంది. వారు ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగము అని గుర్తించబడుతున్నారు. ఆకాశ నక్షత్రముల వలె విస్తరింప చేస్తాను అని దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానము నెరవేరింది.

కాని వారు ఐగుప్తు దేశమునందే నివసిస్తున్నారు. వారు దేవుడు తమకు వాగ్దానము చేసిన కనాను దేశమునకు తిరిగి ఎప్పుడు వెళ్తారు? దేవుడు వారిని ఐగుప్తు నుండి వెలుపలికి నడిపిస్తాడా?

దేవుడు వారిని అక్కడ నుండి బయటకు తీసుకొని రావడానికి దాదాపు నాలుగు వందల సంవత్సరములు పట్టింది. యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును పరిపాలించసాగాడు. అతడు ఎంతో క్రూరమైన వ్యక్తి. అతనికి యోసేపును గురించి తెలియదు గనుక ఒక క్రొత్త జనాంగము తన దేశమందు నివసించడానికి ఇష్టపడలేదు. వారు దేవుని చేత ఎన్నుకొనబడిన ఇశ్రాయేలు జనాంగముగా ప్రత్యేకించబడ్డారు. ఇశ్రాయేలు వారిని ఐగుప్తు రాజు అయిన ఫరో బానిసలుగా చేసుకున్నాడు. వారు ఎంతో కష్టపడి పని చేసేవారు. అక్కడ వారి జీవితాలు ఎంతో బాధతో కష్టాలతో నిండి ఉన్నాయి. దేవుడు వారిని మర్చిపోయి ఉంటాడు అని అనుకుంటున్నారా? లేదు, అంతా దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంది. వారు 400 సంవత్సరములు దాసులుగా ఉంటారు అని దేవుడు ముందుగానే అబ్రాహాముతో చెప్పాడు(ఆది 15:13-14). దేవుడు వారిని కనాను దేశమునకు తీసుకొని వెళ్ళుటకు సమయము నిర్ణయించి, పరిస్థితులను సిద్ధపరుస్తున్నాడు. తన ప్రజలను వాగ్దాన దేశమునకు నడిపించుటకు దేవుడు గొప్ప నాయకుని ఏర్పరచిన విషయాలను మనము వచ్చేవారం తెలుసుకుందాము.

సందేశము
దేవుని వాగ్దానములన్నీ నెరవేరుట అబ్రాహాము,ఇస్సాకు,యాకోబులు తాము జీవించి ఉండగా చూడలేక పోయినప్పటికి, ప్రభువు తప్పక తన సమయమందు నెరవేరుస్తాడు అని విశ్వసించారు. తాను ఎన్నుకొనిన ఇశ్రాయేలీయులైన తన ప్రజల విషయములో దేవుడు అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు అని వారు నమ్మారు.

యోసేపు ఐగుప్తులో ఉండుటకు ప్రభువే నడిపించాడు అని మనము చూశాము. ప్రభువే ఆ కరవు కూడా పంపినట్లు బైబిల్ లో వ్రాయబడింది (కీర్తనలు105:16). కరవు సమయములో తమ కుటుంబము చనిపోకుండునట్లు ప్రభువు ముందుగానే తనను ఐగుప్తుకు పంపాడు అని యోసేపు తన సహోదరులకు చెప్పాడు(ఆది 45 :7-8). ప్రభువు చెప్పిన రీతిగానే వారు తమది కాని పరదేశములో నాలుగు వందల సంవత్సరములు దాసులుగా ఉండవలసి వచ్చింది. తరువాత వారిని తిరిగి వాగ్దాన భూమికి చేరుస్తాను అని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానములను అబ్రాహాము ఇస్సాకు యాకోబులు కూడా విశ్వసించారు. దేవుడు తన వాగ్దానాలన్నింటిని తప్పక నెరవేరుస్తాడు అని వారికి తెలుసు.

అన్వయింపు
దేవుడు బైబిల్ లో మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. పాత నిబంధనలో ప్రభువైన యేసును రక్షకునిగా భూమి మీదకు పంపుతాను అని దేవుడు ఎన్నోసార్లు వాగ్దానాలు చేశాడు. యేసు పుట్టుక గురించి ఎన్నో విషయాలు దేవుడు తెలియచేశాడు. అవి ఏ విధంగా నెరవేరాయో కొన్నింటిని చూద్దాము.

  1. ఆయన బేత్లెహేములో జన్మిస్తాడు - మీకా 5:2; లూకా 2:4 లో నెరవేరింది
  2. ఆయన కన్యక గర్భమునందు జన్మిస్తాడు - యెషయా 7:14; లూకా 1:26- 27 లో నెరవేరింది
  3. ఆయనలో ఎటువంటి దోషం లేకపోయినా మరణిస్తాడు - యెషయా 53:9; మత్తయి 27:57-60 లో నెరవేరింది
  4. ఆయన పునరుత్ధానుడై తిరిగి లేస్తాడు - కీర్తన 16:10; మార్కు16:19 లో నెరవేరింది
  5. ఆయన పరలోకమునకు తిరిగి వెళ్తాడు - కీర్తన 68:18; మార్కు 16:19 లో నెరవేరింది

ప్రభువైన యేసు తిరిగి వస్తాడు అని కూడా దేవుడు వాగ్దానం చేశాడు. రెండవసారి ఆయన చిన్న పసి బాలుని వలె కాక, రాజుగా వస్తాడు అని దేవుడు చెప్పాడు. ప్రభువైన యేసు ప్రభావముతో, మహా మహిమతో, బూర శబ్దముతో, దూతలతో ఆకాశ మేఘారూఢుడై వస్తాడు అని బైబిల్ లో వ్రాయబడింది (మత్తయి 24:30 31; 2 పేతురు 3:10;ప్రకటన 20:12).

క్రైస్తవులు ఆ సమయము కొరకు ఎదురుచూస్తూ ఉంటారు. కాని దేవుని ప్రేమించని వారికి అది ఎంతో భయంకరమైన దినము. పిల్లలారా, దయచేసి ఈ విషయాన్ని గురించి ఆలోచించండి. బైబిల్ సత్యమైనది, దేవుని వాగ్దానములు నమ్మదగినవి. ప్రభువైన యేసు ఏ సమయంలోనైనా వస్తాడు గనుక మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మీరు కూడా యేసుని చూచునట్లు క్రైస్తవ విశ్వాసులుగా మారాలి అని ప్రార్ధించండి.

ఉదాహరణ
ప్రపంచములోని ప్రభుత్వాలు, మనుష్యులు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు, కాని ఎన్నోసార్లు వాటి విషయంలో తప్పిపోతుంటారు. ఏ ప్రభుత్వం కూడా అన్ని వాగ్దానాలను నెరవేర్చలేదు, కాని దేవుడు తన వాగ్దానాల విషయములో నమ్మదగినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఎంత అద్భుతమైన విషయం! బైబిల్ లోని దేవుని వాగ్దానాల యందు క్రైస్తవులు విశ్వాసముంచుతారు. దేవుడు వారిని ఎంతమాత్రము నిరాశపరచడు. వాటన్నింటిని ఆయన తప్పక నెరవేరుస్తాడు.

కంఠతవాక్యము
వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు (హెబ్రీ 10 :23)

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.