సండే స్కూల్ పాఠాలు

ఆదికాండము 8:1-9:19

ఉద్దేశము/లక్ష్యము
జలప్రళయము నుండి నోవహును కాపాడిన ప్రభువు నమ్మదగినవాడు, వాగ్దానములు నెరవేర్చువాడు అని బోధించుట.

ముఖ్యాంశము
వాగ్దానములు - మీ పుట్టినరోజుకు మంచి బహుమానం ఇస్తాను అని మీ నాన్నగారు వాగ్దానం చేశారు అనుకోండి, కాని ఆరోజు ఏమి ఇవ్వలేదు అనుకుందాము. మీ నాన్నగారు మాట తప్పినందుకు మీకు ఎంతో బాధ, నిరాశ కలుగుతాయి. అంతేకాకుండా ఇంకెన్నడూ మీ నాన్నగారి మాటలు నమ్మకూడదు అని మనస్సులో అనుకుంటారు కదా! కానీ మనము అందరము ఏదో ఒక సమయంలో మాట తప్పుతుంటాము. స్కూల్ లో ఫస్ట్ గ్రేడ్ తెచ్చుకుంటాను, గదిని శుభ్రంగా ఉంచుకుంటాను, కుక్కను బయటకు తీసుకెళ్తాను ఇలా ఎన్నో మాటలు చెప్తుంటాము, కానీ వెంటనే మరచిపోతాము, లేదా మనస్సు మార్చుకుంటాము. ఆ మాటలు ఉపయోగం లేనివిగా మిగిలిపోతాయి. కానీ దేవుడు మన వంటివాడు కాదు, దేవుడు ఎన్నడూ మాట తప్పనివాడు అని మీకు తెలుసా!

గతవారము:
చెడ్డవారైన జనులందరిని నాశనం చేసి, నోవహును, అతని కుటుంబమును కాపాడుతాను అని దేవుడు నోవహుకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు యధాతధంగా నెరవేర్చాడు. దేవుడు భూమిపైకి జలప్రళయము పంపిన విషయము గతవారం చూశాము. 40 రోజులు రాత్రింబగళ్ళు ఎడతెరిపి లేకుండా కురిసిన ప్రచండ వర్షము వలన అన్నీ నీటిలో మునిగి నశించిన విషయం కూడా చూశాము. కాని నోవహును, అతని కుటుంబమును దేవుడు ఓడలో క్షేమంగా కాపాడాడు.

ఓడలో వేచి యుండుట ఎన్నో వేల అడుగుల ఎత్తులో నీటిపై తేలుతున్న ఓడ నుండి నోవహు బయటపడటం సాధ్యమేనా? కాదు, కాని దేవుడు సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకొని యున్నాడు. 150 దినముల(5 నెలలు) తరువాత దేవుడు భూమి మీద గాలి వీచునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయాయి (8:1). నీళ్లు క్రమక్రమముగా తగ్గిపోతూ వచ్చాయి. ఏడవనెల 17వ దినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచింది(8:4). తరువాత 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడ్డాయి. ఆ కొండ శిఖరములు చూసిన వెంటనే నోవహు ఎంతగానో సంతోషించి ఉంటాడు!

తరువాత 40 దినములకు నోవహు ఓడ కిటికీ తీసి భూమిఎండినది, లేనిది చూచుటకు ఒక కాకిని వెలుపలికి విడిచిపెట్టాడు. ఆ ఓడలోనుండి భూమి ఆరినది లేనిది నోవహుకు కనిపించలేదు. ఆ కాకి బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగులాడసాగింది. దానికి బయట ఆహారం దొరికి ఉండవచ్చు గనుక తిరిగి ఓడలోనికి రాలేదు. నోవహు తిరిగి నీళ్లు నేలమీద నుండి తగ్గినవో, లేదో చూచుటకు ఒక నల్ల పావురమును వెలుపలికి విడిచిపెట్టాడు. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందువలన అరకాలు నిలుపుటకు కూడా పావురమునకు స్థలము దొరకలేదు కనుక తిరిగి ఓడలో ఉన్న నోవహు దగ్గరకు వచ్చింది. నీరు ఇంకా ఎండి పోలేదు అని నోవహుకు అర్థమైంది. నోవహు ఇంకా ఏడు దినములు ఆగి మరల నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచిపెట్టాడు. సాయంకాలమున అది నోవహు దగ్గరకు వచ్చినప్పుడు త్రుంచ బడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోటిలో ఉంది. అప్పుడు భూమి మీద నుండి నీళ్లు తగ్గిపోయాయి అని నోవహు అర్థం చేసుకున్నాడు.

ఇంకా 7 దినముల తరువాత ఆ పావురమును మరల విడిచిపెట్టగా,అది నోవహు యొద్దకు తిరిగి రాలేదు. అది ఆహారము సంపాదించి చెట్లపై కూర్చుని తినుటకు వీలుగా భూమి ఆరిపోయి ఉండవచ్చు. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరిపోయింది. కాని దేవుడు చెప్పిన సమయంలోనే వారు ఓడలోనుండి బయటకు రావాలి గనుక దేవుని మాట కొరకు వారు ఎదురుచూస్తున్నారు. నీరు తగ్గి పోయినప్పటికీ భూమి బురదగా ఉండి ఉండవచ్చు.

దేవుడు నీవును, నీతో కూడా నీ భార్య, నీ కుమారులు, నీ కోడండ్రు ఓడలో నుండి బయటకు రమ్మని చెప్పాడు. అంతేకాక ఓడలో ఉన్న పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు, సమస్త శరీరులలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను అని చెప్పాడు. అన్ని నెలల తరువాత తిరిగి భూమి మీద నడవడం ఎంత అద్భుతమైన అనుభవం! వారు దాదాపు ఒక సంవత్సరం పాటు ఓడలో ఉన్నారు. జంతువులు, పక్షులు బయటకు వచ్చి పరిగెత్తుతూ, ఎగురుతూ, స్వేచ్ఛగా వెళ్ళిపోయి ఉంటాయి. అవి భూమి మీద బహుగా విస్తరించి ఫలించి అభివృద్ధి పొందవలెను అని దేవుడు నోవహు తో చెప్పాడు(8:17;9:1). ఎంత సంతోషకరమైన సమయం!

నోవహు యొక్క కృతజ్ఞతార్పణ ఓడలోనుండి బయటకు వచ్చిన తరువాత నోవహు చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? ఇల్లు కట్టుకొని పనులు చేసుకోవాలి అని తలంచకుండా, తన వాగ్దానము చొప్పున క్షేమంగా తమను కాపాడిన దేవుని కృపను జ్ఞాపకము చేసికొని కృతజ్ఞతలు చెల్లించాలి అనుకున్నాడు. నోవహు వెంటనే ఒక బలిపీఠము కట్టి పవిత్ర పశువు లన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ బలిపీఠముమీద దహనబలిగా అర్పించాడు. దేవుడు చూపిన కనికరమును బట్టి కృతజ్ఞతకు సూచనగా బలి అర్పించాడు. అంతేకాక తమ పాపక్షమాపణ నిమిత్తము కూడా దహనబలిని అర్పించి ఉండవచ్చు. అప్పుడు దేవుడు ఆ ఇంపైన సువాసనను బట్టి సంతోషించాడు. దేవుడు మానవులకు అప్పటినుండి కూర మొక్కలతో పాటు ప్రాణముగల సమస్తజీవులను మీకు ఆహారముగా ఇస్తున్నాను అని చెప్పాడు (9:3). అప్పటివరకు మానవులు కూరగాయలను, మొక్కలను, పండ్లను మాత్రమే ఆహారముగా తీసుకునేవారు.

దేవుని వాగ్దానము దేవుడు అప్పుడు నోవహుతో ఒక నిబంధన చేశాడు. ఇకమీదట నరులను బట్టి మరల భూమిని శపించను. ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇక సమస్త జీవులను సంహరింపను అని నిబంధన చేశాడు. మేఘములో ధనుస్సు ఉంచి అది దేవునికి, భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది అని చెప్పాడు. భూమిపైకి దేవుడు మేఘము పంపించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనిపిస్తుంది. అప్పుడు దేవునికి, మానవులకు, సమస్త జీవరాశులకు మధ్యనున్ననిబంధన దేవుడు జ్ఞాపకము చేసికొని నాశనము చేయునంతగా జలప్రవాహము పంపడు గనుక నాశనము చేయుటకు జలములు ప్రవాహముగా రావు అని తన నిబంధనను వివరించి చెప్పాడు. దేవుడు ఆ నిబంధనను మనందరితో కూడా చేస్తున్నాడు. మనము ఆకాశములో ఇంధ్రధనుస్సును చూచిన ప్రతిసారి దేవుని నిబంధనను, వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలి.

సందేశము
మానవుల పాపము, చెడుతనము వలన దేవుడు వారిని శిక్షించవలసి వచ్చింది. దేవుడు నిజముగానే భూమి మీదకు జలప్రళయము పంపించాడు. దేవుడు ఓడలోని నోవహును, అతని కుటుంబమును, పక్షులను, జంతువులను, ప్రాకు పురుగులను కాపాడి క్షేమంగా ఉంచాడు. మరెన్నడూ భూమిమీదకు జలప్రళయము పంపను అని దేవుడు నిబంధన చేశాడు. ఆయన నమ్మదగినవాడు. దేవుడు పాపమును ఓర్చుకొనలేడు అని ఈ కథ ద్వారా మనము తెలుసుకున్నాము. అంతేకాక ఆయన కనికరము గలవాడు మరియు వాగ్దానము నెరవేర్చేవాడు అని కూడా మనము తెలుసుకొనగలిగాము.

అన్వయింపు
ఆకాశములో ఇంద్రధనస్సు మీరెప్పుడైనా చూశారా? అది ఎంత అందంగా ఉంటుంది కదూ! అందులో ఏమి రంగులు ఉంటాయి తెలుసా? ఎరుపు, ఆరెంజ్, పసుపు, ఆకుపచ్చ, నీలము, ఇండిగో మరియు వంగపండు రంగులు ఉంటాయి. మనము ఇంద్రధనస్సు చూచినప్పుడు దేవుని నిబంధన గుర్తు చేసుకోవాలి. లోకములో కలుగుతున్న ప్రమాదాలు చూసి మనము భయపడవలసిన అవసరంలేదు, ఎందుకనగా దేవుడు మాట తప్పనివాడు.
దేవుడు తన ప్రజలకు ఎన్నోవాగ్దానాలు చేశాడు. హృదయపూర్వకంగా ఆయనకు ప్రార్ధించినప్పుడు వారి ప్రార్ధనలు వింటాను అని మాట ఇచ్చాడు (కీర్తన 34:17). ఆయనను విశ్వసించేవారు నడువవలసిన మార్గమును చూపుతాను అని చెప్పాడు (సామెతలు 3:6).

వీటన్నిటికంటె అద్భుతమైన వాగ్దానం ఒకటి ఆయన చేశాడు - ప్రభువైన యేసు తిరిగి భూమిపైకి వస్తాడు అనేదే ఆ వాగ్దానం. కాని ప్రభువైన యేసు రెండవసారి పసిబాలుడిగా కాక గొప్ప రాజు గా రాబోతున్నాడు. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రభువువస్తాడు అని బైబిల్ లో వ్రాయబడింది (1 థెస్స. 4:17). ఆయనయందు విశ్వాసముంచినవారు, ఆయనను ప్రేమించేవారు ఆయనతో కూడా సదాకాలము ఉండుటకు పరలోకమునకు తీసికొని పోబడతారు. అక్కడ వారు దేవునితో కలిసి సదాకాలము సజీవులుగా ఉంటారు. ఆ దినము క్రైస్తవ విశ్వాసులకు ఎంతో ఆశీర్వాదకరమైనది, కాని పాపక్షమాపణ పొందకుండా యేసును విశ్వసించని వారికి అది ఎంతో భయంకరమైన దినము. వారు తప్పక దేవుని తీర్పును, శిక్షను ఎదుర్కొనవలసిన వారై ఉన్నారు (2 పేతురు 3:7). నోవహు వలె మనం కూడా ప్రభువు మాటలు విశ్వసించి క్షేమంగా ఉందాము. దేవుని వాగ్దానములు నమ్మదగినవి గనుక ఆయన మనలను కాపాడి సంరక్షిస్తాడు. అయన చేసిన ఉపకారములను బట్టి నోవహు వలె మనం కూడా కృతఙ్ఞతలు చెల్లించాలి.

కంఠతవాక్యము
వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు(హెబ్రీ. 10:23)

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.