ఆదికాండము 41:46-45 అధ్యాయము
ఉద్దేశము
మనము చేసిన చెడు పనులను మరచిపోవడానికి చాలా ప్రయత్నిస్తుంటాము. దేవుడు వాటిని మరచిపోడు కాని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు.
ముఖ్యాంశము
చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు మీకు ఎప్పుడైనా గుర్తుకు వస్తుంటాయా? అమెరికా నుండి మీ మామయ్య మంచి గిఫ్ట్ తెచ్చి మీకు ఇచ్చి ఉండవచ్చు, లేదా మీరు స్కూల్ లో ఉన్నప్పుడు చేసిన అల్లరి పనులు కూడా గుర్తుకు రావచ్చు. చాలా సంవత్సరాలు ఆ విషయాలను మరిచిపోయి ఉంటారు, కానీ అప్పుడప్పుడు అకస్మాత్తుగా గుర్తుకు వస్తుంటాయి. ముఖ్యంగా చెడుపనులను మరచిపోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తుంటాము, కాని మనము చేసిన పనులలో ఒక్కదానిని కూడా దేవుడు ఎన్నడూ మరిచిపోడు అనే విషయం మనము గ్రహించాలి. ఈరోజు యోసేపు సహోదరులు తాము తమ సహోదరునికి చేసిన కీడు గురించి, హానిగురించి 20 సంవత్సరాల తరువాత గుర్తు చేసుకున్న విషయాలను తెలుసుకుందాము.
గతవారము
యోసేపు చెరసాలలో ఉన్నట్లు మనము చూశాము. అతని ప్రార్థనలు వినిన ప్రభువు ఆశ్చర్య రీతిగా చెరసాల నుండి యోసేపును బయటకు తీసుకుని వచ్చినట్లు కూడా మనము చూశాము. ఫరో రాజు యొక్క కలలకు భావము చెప్పగలిగిన జ్ఞానము ప్రభువు యోసేపుకు దయచేశాడు. ఫరో రాజుకు వచ్చిన కలలు ఏమిటి? ఆ కలల అర్థము ఏమిటి? యేడు సంవత్సరములు సమృద్ధి అయిన పంట, తరువాత యేడు సంవత్సరములు కరువు కలుగుతాయి. ఫరో రాజు యోసేపును చెరసాల నుండి విడిపించడం మాత్రమే కాక, ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా నియమించాడు. ఇంకా ఫరో యోసేపుకు ఏమి ఇచ్చాడు? తన జీవితం క్రొత్తగా ప్రారంభమైనందుకు యోసేపు దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగియున్నాడు. యోసేపు తన పరిస్థితుల వలన ప్రభువును మరిచిపోలేదు కాని, మరి ఎక్కువ నమ్మకంగా వెంబడిస్తూ ముందుకు సాగాడు.
ఫరో కలలు నెరవేరుట
యోసేపు ఐగుప్తు దేశమంతటికి అధికారిగా ఉన్నాడు. తాను చెప్పిన ప్రతి మాటకు ఐగుప్తు ప్రజలు విధేయత చూపాలి. అది ఫరో ఇచ్చిన ఆజ్ఞ. పంట సమృద్ధిగా పండిన యేడు సంవత్సరములలో యోసేపు వెళ్లి ఐగుప్తు దేశమంతా తిరిగి చూసాడు. సమృద్ధిగా పండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పంటను ఇచ్చింది. ప్రజలు తినిన తరువాత కూడా పంట విస్తారముగా మిగిలిపోయింది. యోసేపు ప్రతి పట్టణములో పెద్దకొట్లు కట్టించి మిగిలిపోయిన ధాన్యము అక్కడే కొట్లలో నిలువ చేసాడు. మిగిలిపోయిన పంటను కొలవడము ఆసాద్యమై పోయింది గనుక వారు కొలవడం మానివేశారు.
అటు తరువాత యేడు కరవు సంవత్సరములు మొదలయ్యాయి. వర్షములు లేనందువలన కరవుతో ఆ యేడు సంవత్సరములు ఎటువంటి పంటలు పండలేదు. సాధారణంగా అటువంటి కరవు వచ్చినప్పుడు ప్రజలు ఆకలితో మరణిస్తారు, కాని యోసేపు ధాన్యము నిలువ చేయుటవలన వారిని మరణమునుండి కాపాడగలిగాడు. ప్రజలు ఆహారము అవసరమైనప్పుడు యోసేపు దగ్గరకు వచ్చి అడిగేవారు .
యోసేపు సహోదరులు ఐగుప్తుకు వచ్చుట
ఆ కరవు ఐగుప్తు దేశమునందు మాత్రమేగాక ప్రతి దేశమందు చాలా భారముగా ఉంది. యోసేపు తండ్రి, అతని సహోదరులు ఉంటున్న ఇశ్రాయేలు దేశమందు కూడా కరువు అధికమైంది. ఒకరోజు యాకోబు తన కుమారులను పిలిచి ధాన్యము కొరకు ఐగుప్తు వెళ్లమని చెప్పాడు. ఐగుప్తులో ధాన్యము సమృద్ధిగా ఉన్నది అని తెలిసింది గనుక అక్కడకు వెళ్లి కొనుక్కొని రమ్మని వారికి చెప్పాడు. అక్కడ ధాన్యము అంతా యోసేపు ఆధీనములో ఉన్నది అన్న విషయం యోసేపు సహోదరులకు తెలియదు. అసలు యోసేపు బ్రతికి ఉన్నాడు అనే విషయమే వారికి తెలియదు.
బెన్యామీనును యాకోబు దగ్గర ఉంచి మిగిలిన పదిమంది ఐగుప్తుకు బయలుదేరారు. యోసేపుకు జరిగినట్లు బెన్యామీనుకు ఏదైనా హాని కలుగుతుందేమో అని యాకోబు అతడిని వారితో పంపలేదు. యోసేపువలె బెన్యామీనును పోగొట్టుకోవడం యాకోబుకు ఇష్టం లేదు.
యోసేపు సహోదరులు ఐగుప్తు దేశమునకు వెళ్లారు. ప్రజలందరికి ధాన్యము అమ్మకము చేసే అధికారం యోసేపుదే గనుక అతని సహోదరులు వచ్చి ముఖములు నేలకు వంచి యోసేపుకు నమస్కారము చేసారు. వారి ఎదురుగా యోసేపు ఉన్నాడు, కాని వారు యోసేపును గుర్తుపట్టలేదు. వారు యోసేపును చూచి 20 సంవత్సరములు దాటిపోయింది. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశపు వస్త్రములు ధరించి, వారి భాషను మాట్లాడుతున్నాడు. తమ సహోదరుడు అంత గొప్ప అధికారంలో ఉన్నాడు అని వారు ఎంతమాత్రము ఊహించి ఉండరు. అందరూ యోసేపుకు సాగిలపడి నమస్కరించారు.
యోసేపు కలలు నెరవేరుట యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టాడు. అతడు ఆ విషయాన్ని నమ్మలేక పోయాడు. 20 సంవత్సరముల క్రిందట తనను ఎంతగానో బాధించి, హింసించిన సహోదరులు తన ఎదుట సాగిలపడి తనకు నమస్కరిస్తున్నారు! అప్పుడు యోసేపు తన సహోదరులకు వివరించి చెప్పిన కలల భావము అదే. మీకు
ఆ కలలు గుర్తున్నాయా? సూర్య చంద్రులు, 11 నక్షత్రములు తనకు సాగిలపడి నట్లు యోసేపుకు కల వచ్చింది. చేనిలో యోసేపు పనకు మిగిలిన పనలు సాష్టాంగ పడినట్లు మరొక కల వచ్చింది. భవిష్యత్తులో జరగబోయే విషయాలు దేవుడు యోసేపుకు కలల ద్వారా బయలు పరిచాడు. ఇప్పుడు ఆ కలలు నెరవేరాయి.
ఇప్పుడు యోసేపు ఏమి చేయబోతున్నాడు? "అన్నలారా బాగున్నారా, నేను యోసేపును" అని చెప్పాడా? లేదు, యోసేపు వారిని గుర్తు పట్టనట్లు మాట్లాడాడు. తనకు చేసిన కీడు విషయములో వారు పశ్చాత్తాప పడుతున్నారా లేదా పరీక్షించాలి అని యోసేపు అనుకున్నాడు. వారు ఇంకా ఆ విషయాలు జ్ఞాపకం ఉంచుకుని బాధపడుతున్నారా? వారు మారినది లేనిది ఎలాగైనా తెలుసుకోవాలి అని యోసేపు అనుకున్నాడు.
యోసేపు వారితో కఠినముగా మాటలాడి - "మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలిసికొన వచ్చితిరి" అని అన్నాడు. అప్పుడు యోసేపు సహోదరులు యోసేపుతో - "లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము మా కంటె కనిష్ఠుడు మా తండ్రి దగ్గర ఉన్నాడు. మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కాము" అని చెప్పారు. అప్పుడు యోసేపు తిరిగి వారితో - "లేదు ఈ దేశము గుట్టు తెలిసికొనుటకు వచ్చితిరి" అని చెప్పాడు. అప్పుడు యోసేపు వారినందరిని మూడు రోజులు చెరసాలలో వేయించాడు. మూడవ దినమున వారిని బయటకు రప్పించి తాను చెప్పినట్లు చేయుమని వారికి చెప్పాడు. వారితో - "మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనబడును గనుక మీరు చావరు" అని యోసేపు చెప్పాడు. నేను దేవునికి భయపడు వాడను గనుక మీరు నేను చెప్పినట్లు చేయండి అని యోసేపు తన సహోదరులకు చెప్పాడు.
యోసేపు సహోదరులు విచారపడుట
యోసేపు సహోదరులు తమలో తాము మాట్లాడుకొనుటకు మొదలు పెట్టారు. తమ మాటలు యోసేపుకు అర్థమవుతున్నట్లు వారికి తెలియదు. వారు - "మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందు చున్నాము. అతడు మనలను బతిమాలుకొని నప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చెను" అని మాట్లాడుకున్నారు. తనకు హాని కలిగించినందుకు వారు బాధపడుతున్నారు అని యోసేపు అర్థం చేసుకున్నాడు. యోసేపు వారి యొద్దనుండి అవతలకి పోయి యేడ్చి మరల వారి దగ్గరకు వచ్చాడు. తన దుఃఖాన్ని సహోదరులు చూడకూడదు అని యోసేపు అనుకున్నాడు.
అప్పుడు కూడా యోసేపు తాను ఎవరో తన సహోదరులకు చెప్పలేదు. తన తమ్ముడైన బెన్యామీను పట్ల వారు ఏ విధముగా ప్రవర్తిస్తున్నారు అనే విషయం కూడా యోసేపు కు తెలియదు. బెన్యామీను యెడల వారు అసూయ,ఈర్ష్య కలిగి ప్రవర్తిస్తున్నారా అనే సందేహం యోసేపుకు కలిగింది. అందుకే వారు తిరిగి వస్తున్నప్పుడు బెన్యామీనును వెంట తీసుకొని రమ్మని చెప్పాడు.
వారు షిమ్యోనును యోసేపు దగ్గర వదిలిపెట్టి తమ దేశమునకు బయలుదేరారు. దారిలో ఒక చోటకు వచ్చినప్పుడు వారిలో ఒకడు తన గాడిదకు మేత పెట్టుట కై తన సంచి విప్పినప్పుడు అందులో డబ్బులు కనిపించాయి. తరువాత వారి అందరి గోనెసంచులలో అదే విధముగా డబ్బు దొరికింది. ధాన్యము కొనుటకు తాము చెల్లించిన డబ్బులు తిరిగి తమ సంచులలో ఉన్నట్లు వారికి అర్థమైంది. వారు ఆ డబ్బు చూచి ఎంతో భయపడ్డారు. అప్పుడు వారు గుండె చెదరి నవారై భయపడి దేవుడు ఎందుకు ఇలా చేసాడు? అని అనుకున్నారు. ఆ డబ్బులు ఎందుకు యోసేపు తిరిగి తమ సంచులలో పెట్టాడు అనే విషయం వారికి అర్థం కాలేదు.
వారు జరిగిన విషయాలన్నీ తమ తండ్రికి వివరించి చెప్పారు. అక్కడ ధాన్యము అమ్మిన అధికారి తమతో కఠినముగా మాట్లాడినట్లు, షిమ్యోనును పట్టుకుని చెరసాలలో వేసినట్లు యాకోబుకు చెప్పారు. తిరిగి వెళ్ళినప్పుడు బెన్యామీనును తీసుకుని వెళ్లాలి అని చెప్పగా యాకోబు వారితో - "యోసేపు లేడు, షిమ్యోను లేడు మీరు బెన్యామీనును కూడా తీసికొన పోవుచున్నారు" అని చెప్పి ఎంతగానో దుఃఖించాడు. తరువాత ఏమి జరిగిందో వచ్చే వారం తెలుసుకుందాం.
సందేశము
యోసేపు కలలు నెరవేరినట్లు మనము చూశాము. అతని సహోదరులు అతని యెదుట సాగిలపడ్డారు. యోసేపు పగతో తన సహోదరుల యెడల కఠినముగా ప్రవర్తించలేదు కాని వారి ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అని తెలుసుకొనుటకు ఆ విధముగా మాట్లాడాడు. యోసేపును గుంటలో పడవేసి, వర్తకులకు దాసునిగా అమ్మివేసి 20 సంవత్సరములు అయినప్పటికి ఇంకా వారు ఆ విషయాలు మరిచిపోలేదు. తాము చేసిన చెడ్డ పనులను గూర్చి ఆలోచించు కొనునట్లు వారిని చెరసాలలో వేయించాడు. అలాగే జరిగింది. యోసేపు పట్ల తాము కఠినంగా ప్రవర్తించి హాని చేసిన విషయాలు గుర్తు తెచ్చుకుని వారు ఎంతగానో పశ్చాత్తాప పడ్డారు.
అన్వయింపు
మనము కూడా కొన్నిసార్లు చెడ్డ పనులు చేస్తూ, ఇతరుల యెడల కఠినంగా ప్రవర్తిస్తుంటాము. అటువంటి విషయాలను మరిచి పోవడానికి ప్రయత్నిస్తాము. కాని దేవుడు వాటన్నింటిని గుర్తుంచుకుంటాడు అని, వాటిని తన దగ్గర ఉన్న గ్రంథములో వ్రాసి ఉంచుతాడు అని బైబిల్ లో వ్రాయబడింది (ప్రకటన 20: 12). మనము చేసిన చెడు పనులను గుర్తు చేసుకొని, పశ్చాత్తాప పడాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. మనకు ఎవరి మీదనైనా ఈర్ష్య, ద్వేషము ఉంటే వారిమీద అబద్దాలు, చెడ్డమాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాము. మీరు స్కూల్ లో ఎవరిదైనా లంచ్ బాక్స్ దొంగతనం చేశారు అనుకుందాము. అది ఎవరికీ తెలియదు అని అనుకుంటారు, మరిచిపోతారు. కాని, ఆ విషయం దేవుని దృష్టిలో పాపము కనుక మనము చేసిన పనుల నిమిత్తము ప్రభువును క్షమించమని అడగాలి. ప్రభువైన యేసు మాత్రమే మన పాపములను క్షమించగలడు. ఆయన మన పాపముల నిమిత్తమై సిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు. మన పాపములను దాచి పెట్టినట్లయితే దేవుడు తప్పక ఒకరోజు వాటిని గుర్తు చేస్తాడు. దేవుని క్షమాపణ పొందినట్లయితే తిరిగి ఆ పాపములు గుర్తు చేసుకొనవలసిన అవసరము లేదు. దేవుడు కూడా వాటిని గుర్తు చేసుకొనడు.
కంఠతవాక్యము
మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తము మారు మనస్సునొంది తిరుగుడి. (అ.కా. 3:19)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF