మెఫీబోషెతు
2వ సమూయేలు 9 అధ్యాయము, సామెతలు 27:10
ఉద్దేశము
పాపుల యెడల దేవుని ప్రేమ ఎంతో అద్భుతము అని చూపుట.
ముఖ్యాంశము
మీకు తెలిసిన వారిలో ఎవరికైనా ప్రమాదంలో కాలు విరిగిందా? అటువంటి పరిస్థితులలో వారిని వెంటనే హాస్పిటల్ కు తీసుకొని వెళ్లి ఆపరేషన్ చేయించి తిరిగి ఆ కాలు బాగుపడేలా చూస్తాము. కానీ పాతకాలములో హాస్పిటల్, వైద్యము సరిగా ఉండేది కాదు కాబట్టి అలా ప్రమాదములో కాళ్లు చేతులు విరిగిపోయిన వారు అలాగే వారి జీవితమంతా గడపవలసి వచ్చేది. చిన్నతనములో ప్రమాదము వలన కాళ్లు పోగొట్టుకొనిన ఒకరిని గురించి తెలుసుకుందాము.
నేపధ్యము
రాజైన సౌలు యుద్ధంలో మరణించినట్లు మనము చూసాము. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఎవరు ఉండబోతున్నారు? అవును దావీదు. సౌలు మరణము తరువాత దావీదుకు రాజుగా పట్టాభిషేకము చేశారు. దావీదు ఏడున్నర సంవత్సరములు ఇశ్రాయేలు దేశములో కొంత భాగానికి మాత్రమే రాజుగా ఉన్నాడు. ఆ తరువాత అతడు ఇశ్రాయేలు దేశమంతటికి రాజుగా ఎన్నుకొనబడ్డాడు. దావీదు ఫిలిష్తీయులతో, ఇంకను అనేకమైన శత్రుదేశములతో యుద్ధము చేయవలసి వచ్చింది. కాని ప్రభువు ఆ యుద్ధములన్నింటిలో దావీదుకు అతని సైన్యమునకు తోడుగా ఉండి వారిని కాపాడుతూ విజయం కలుగజేశాడు. తరువాత కొన్ని సంవత్సరములు యుద్ధములు లేకుండా ఇశ్రాయేలు దేశము ప్రశాంతముగా ఉంది. అప్పుడు దావీదు గతంలో ప్రభువు తనకు చేసిన గొప్ప కార్యములను బట్టి దేవుని స్తుతించాడు. అంతేకాక రాబోయే సంవత్సరములలో తాను మంచి రాజుగా పరిపాలించాలని ఆశించాడు.
దావీదు తన ప్రమాణమును గుర్తుచేసుకొనుట (1 సమూయేలు 18:3, 20 14 17; 2 సమూయేలు)
దావీదు ఒక దినము తన ప్రాణ స్నేహితుడైన యోనాతానను గురించి ఆలోచించ సాగాడు.
యుద్ధములో సౌలుతో పాటు అతని కుమారుడైన యోనాతాను కూడా అదే దినమున మరణించాడు.
యోనాతాను మరణం దావీదుకు ఎంతో బాధను కలిగించింది. దావీదు, యోనాతాను మంచి స్నేహితులు. సౌలు తర్వాత అతని కుమారుడైన యోనాతాను ఇశ్రాయేలీయులకు రాజు కావలసిన వాడు, కాని దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్నాడు అని యోనాతాను గ్రహించాడు. యోనాతాను దావీదు యెడల ఎంతో ఈర్ష్య, అసూయ కలిగి ఉండవలసినది, కానీ యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించాడు. దావీదు రాజు అయిన తరువాత తన కుటుంబమునకు హాని చేయకుండా వారి యెడల దయ కలిగి ఉండునట్లు యోనాతాను ప్రమాణము చేయించుకున్నాడు. యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడు గనుక అతనికి ప్రమాణము చేయుటకు దావీదు సందేహించలేదు. దావీదు రాజుగా స్థిరపడిన తర్వాత యోనాతానుకు తాను చేసిన ప్రమాణము జ్ఞాపకము చేసుకున్నాడు.యోనాతాను కుటుంబపు వారికి ఏదైనా ఉపకారము చేయాలి అని దావీదు తలంచాడు.
దావీదు యోనాతాను కుమారుని కనుగొనుట (2 సమూయేలు 9:4)
యోనాతాననుబట్టి ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని దావీదు విచారించాడు సౌలు కుటుంబమునకు సేవకుడైన సీబా అను ఒకరిని వారు కనుగొని పిలిపించారు. అప్పుడు దావీదు ఆ సేవకుని-" ప్రభువు నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు
కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించియున్నాడా?" అని ప్రశ్నించాడు. దావీదు హృదయములో ఉన్న దేవుని ప్రేమ అతడిని ఆ విధముగా ప్రేరేపించింది అని మనము అర్థము చేసుకొనవచ్చు. సౌలు దావీదును చంపుటకు ప్రయత్నించాడు గనుక దావీదు వారి కుటుంబమును నాశనము చేయాలి అని మనము ఆలోచించవచ్చు. దావీదు ప్రభువును ఎంతగానో ప్రేమించేవాడు గనుక దయ చూపించటం దేవునికి ఇష్టమైన విషయం అని గ్రహించి ఉండవచ్చు. యోనాతాను సౌలు కుమారుడైనప్పటికీ తాను ఇచ్చిన మాట చొప్పున చేయాలి అనుకున్నాడు.
దావీదు ప్రశ్నకు సౌలు కుటుంబీకుల సేవకుడైన సీబా -"యోనాతానుకు కుంటి కాళ్లు గల కుమారుడు ఒకడున్నాడు" అని చెప్పాడు. అప్పుడు దావీదు యోనాతాను కుమారుని కలుసుకొనునట్లు అతడు ఎక్కడ నివసిస్తాడు అని విచారించాడు.యోనాతాను కుమారుని పేరు మెఫీ భూషత్. యోనాతాను యుద్ధములో మరణించిన సమయములో మెఫీభూషత్ వయస్సు 5 సంవత్సరములు. వారి మరణ వార్తను వినినప్పుడు అతని దాది భవిష్యత్తును ఎత్తుకొని దాచిపెట్టుటకు పారిపోవుచుండగా మెఫీబోషెతు క్రింద పడగా అతని రెండు కాళ్లు విరిగి కుంటివాడైపోయాడు. అప్పటినుండి అతడు కుంటివాడుగానే ఉండి ఏ పని చేయలేని వాడుగా ఉన్నాడు.
దావీదు మెఫీబోషెతుకు దయ చూపించుట
మెఫీబోషెతు యొక్క సమాచారము తెలిసికొనిన వెంటనే దావీదు అతని దగ్గరకు తన మనుషులను పంపి పిలిపించాడు.
పంపిన మనుషులను చూచి ఎంతగానో ఆశ్చర్యపడి ఉండవచ్చు. భయపడి ఉండవచ్చు కూడా. తన తాత అయిన సౌలు దావీదును చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అని కూడా విని ఉండవచ్చు తన తాతను బట్టి తనపై పగ తీర్చుకోవాలని ఉద్దేశంతో దావీదు పిలిచాడు అని కూడా భయపడి ఉండవచ్చు. ఒకవేళ దావీదుకు బదులుగా రాజుగా ఉండే అవకాశం తనకు వస్తుంది అనే ఆలోచనతో దావీదు తనను చంపివేయాలనుకుని ఉండవచ్చు అని మెఫీబోషెతు అనుకొని ఉండవచ్చు. దావీదు యోనాతాను చేసిన ప్రమాణము గురించి తెలిసి ఉండకపోవచ్చు.
మెఫీబోషెతు లోదెబారు అనే చిన్న ఊరును విడిచి యెరూషలేము పట్టణానికి చేరుకున్నాడు. అతని కాళ్లు రెండు కుంటివి గనుక అతనిని మోసుకొని వచ్చి ఉండవచ్చు.మెఫీబోషెతు దావీదు దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కారము చేశాడు. దావీదు-" మెఫీబోషెతు అని పిలిచినప్పుడు అతడు-"చిత్తము నీ దాసుడనైన నేనున్నాను" అన్నాడు. అప్పుడు దావీదు అతనితో- నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దని భోజనము చేయుదువు అని చెప్పాడు.
మెఫీబోషెతు దావీదు దయను పొందుట
తాను ఊహించని మాటలు దావీదు మాట్లాడినందుకు మెఫీబోషెతు ఎంతో ఆశ్చర్యపడి ఉండవచ్చు. అప్పుడు మెఫీబోషెతు మరలా దావీదుకు నమస్కరించి- చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను"? అని పలికాడు. ఎంతో బలహీనుడైన తన యెడల దావీదు ఎందుకు అంత దయ చూపుతున్నాడు అని మెఫీ భవిష్యత్తుకు అర్థము కాలేదు. దేవుడు తన యెడల చూపిన ప్రేమకు బదులుగా, తాను ఇతరుల ఎడల ప్రేమ చూపాలి అన్న దావీదు ఆలోచన యోనా తానుకు తాను చేసిన ప్రమాణము నిలబెట్టుకోవాలి అని దావీదు నిశ్చయించుకున్నాడు.
దావీదు సౌలు సేవకుడైన సీబాను పిలిచి-" సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన స్వతంత్రని నీ యజమానుని కుమారునికి నేనిప్పించియున్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులును అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారుని భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్ద నే భోజనం చేయును " అని చెప్పాడు. అప్పటినుండి మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా దావీదు బల్ల యొద్దని భోజనము చేయసాగాడు. సౌలు సేవకుడైన సీబా దావీదు చెప్పిన మాటలకు అంగీకరించాడు.
మెఫీబోషెతు రాజనగరులో నివసిస్తూ ప్రతి దినము రాజు బల్ల దగ్గర భోజనం చేయ సాగాడు. దావీదు మేఫీ భవిష్యత్తు తండ్రి అయిన యోనాతాను గురించి,యోనాతానుతో తన స్నేహము గురించి అతనికి చెప్పి ఉండవచ్చు దావీదు మెఫీబోషెతును తన ఇంటి వారిలో ఒకని వలె ఎంచి ఆదరించాడు .
సందేశము
ఇశ్రాయేలు దేశమంతటికి రాజైన దావీదు, కుంటివాడు ఎన్నిక లేని వాడు అయినా మెఫీబోషెతు పట్ల దయ, ప్రేమ చూపించటం ఎంత అద్భుతం! దావీదు దయ, ప్రేమ పొందటానికి ఎటువంటి అర్హత లేదు దావీదు యోనాతానుకు ఇచ్చిన మాటను బట్టి మెఫీబోషెతును తన యొద్ద చేర్చుకున్నాడు.
అన్వయింపు
ఈ కథ పాపుల ఎడల ప్రభువైన యేసు చూపిన ప్రేమకు మాదిరిగా ఉంది. దేవుడు సమస్తమును సృష్టించిన సృష్టికర్త. అయినప్పటికీ అయోగ్యులైన, బలహీనులైన , అపరాధములతో, పాపములతో నిండిన మానవుల పట్ల జాలిని దయ, ప్రేమను చూపుతున్నాడు మెఫీబోషెతు వలె మన కాళ్లు కుంటివి కాకపోవచ్చు కానీ మన హృదయాలు పాపము అనే వ్యాధితో నిండి ఉన్నాయి.. మనము చేసే చెడ్డ పనులు, తప్పులు మన హృదయము యొక్క పరిస్థితిని గురించి తెలియజేస్తుంటాయి. మనము పాపములోనే జన్మించాము, మన క్రియలు పాపముతో కూడినవి మన పాపముల నుండి మనంతట మనము బయటకు రాలేము. దేవుడు మన పాపములకు మనము పొందవలసిన శిక్షను ప్రభువైన యేసుపై వేశాడు. మనకు బదులుగా ఆయనను శిక్షించాడు. తన కుమారుడైన యేసును ఈ లోకములోనికి పంపించాడు ప్రభువైన యేసు యొక్క సిలువ మరణము ద్వారా మన పాపముల నుండి మనము బయటకు రాగలము. అందరూ పాపముల చేత, అపరాధముల చేత మరణమునకు పాత్రులుగా ఉన్న సమయములో యేసు మన కొరకు తన ప్రాణమును సిలువలో అర్పించాడు. ఆ సత్యమును మనము నమ్మిన ఎడల మన పాపములు క్షమించబడతాయి. అప్పుడు మెఫీబోషెతు దావీదు దయను, కృపను, ప్రేమను పొందినట్లుగా మనము యేసు యొక్క దయను, కృపను, ప్రేమను పొందగలము. మన పాపములు క్షమించబడి రక్షణను పొందగలము అప్పుడు దావీదు మెఫీబోషెతును తన కుమారులలో ఒకనిగా ఎంచి తన బల్ల యొద్ద చేర్చుకొనినట్లుగా., మనము జీవము కలిగిన దేవుని కుమారులు, కుమార్తెలుగా ఎంచబడి, సదాకాలము దేవునితో నివసించుటకు చేర్చుకొనబడతాము.
కంఠతవాక్యము
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును. (మత్తయి 11: 28)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

