దావీదు జీవితము
1వ సమూయేలు 16- 31 అధ్యాయాలు; 2వ సమూయేలు1-24 అధ్యాయాలు; 1వ రాజులు 1,2 అధ్యాయాలు
ఉద్దేశము
చిన్నతనములోనే ప్రభువును విశ్వసించుట నేర్చుకొనిన యెడల పెద్దవారమైన తరువాత గొప్ప కార్యములు చేయుటకు దేవునిచే ఎన్నుకొనబడతాము అని బోధించుట.
ముఖ్యాంశము
జీవిత చరిత్ర - ఒకరి జీవితాన్ని గురించిన వివరాలు వ్రాసినప్పుడు దానిని జీవిత చరిత్ర అంటారు. హడ్సన్ టేలర్ అనే గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర చదివితే అతడు ఎక్కడ పుట్టాడు ఎప్పుడు పుట్టాడు, ఏమి చదివాడు, ఏమి పని చేశాడు, చైనాలో మిషనరీగా ఉండుటకు ఏ విధముగా వెళ్ళాడు ఇలా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా చిన్నవాడిగా ఉన్నప్పుడే ప్రభువు నందు ఏ విధముగా విశ్వాసముంచాడు, చైనా దేశమునకు మిషనరీగా వెళ్ళుటకు ఎలా ప్రేరేపణ పొందాడు ఇలా ఎన్నో విషయాలు తెలుసుకొనవచ్చు.
దావీదును గురించి కొన్ని వారాలుగా మనము చూస్తూ వచ్చాము. ఈ రోజు వాటన్నింటిని ఒకసారి గుర్తు చేసుకుందాము. దావీదు బాలుడిగా ఉన్నప్పుడే ప్రభువును విశ్వసించాడు గనుక పెద్దవాడైన తరువాత అతనికి గొప్ప పని అప్పగించబడింది. గొర్రెలను కాచుకునే సమయమందే ఇశ్రాయేలీయులపై రాజుగా ఉండేందుకు దేవుడు దావీదును సిద్ధపరిచాడు. దావీదు గురించి బైబిల్ లో 40 అధ్యాయాల కంటే ఎక్కువగా వ్రాయబడ్డాయి.
దావీదు
మనము దావీదును మొదట గొర్రెలు కాచుకొనే బాలుడిగా చూస్తాము. అతడు బేత్లెహేములో తండ్రి అయిన యె షయు, మిగిలిన ఏడుగురు అన్నలతో కలిసి నివసించేవాడు. దావీదు చక్కని రూపం కలిగిన యవ్వనస్థుడు అని బైబిల్ లో చూస్తాము. అతడు ఎర్రగా ఉండి చక్కటి కన్నులు కలిగి ఉండేవాడు. దావీదు చాలా తేలికగా చమత్కారముగా వీణను వాయించేవాడు. అతడు కీర్తనలు రాసేవాడు. అతని పని తన తండ్రి గొర్రెలను మేపడం.
దావీదు చిన్నగా ఉన్నప్పుడే ప్రభువును విశ్వసించాడు. ప్రభువు తనను క్షమించగలడని, తాను ప్రభువుకు చెందిన వాడనని గ్రహించాడు. దావీదు గొర్రెలను కాచే సమయములో నేర్చుకొనిన విషయాలను ముందుగా చూద్దాము. ఆ విషయాలు ఇశ్రాయేలు రాజ్యమునకు రాజు అయినప్పుడు దావీదుకు ఎంతో ఉపయోగపడినట్లు చూడగలము.
దావీదు గొర్రెల కాపరి
బేత్లహేము చుట్టూ కొండలు లోయలు ఉండేవి. దావీదు తన తండ్రి గొర్రెలను తీసుకొని అక్కడ మేపేవాడు. గొర్రెలు తమ కాపరిని వెంబడిస్తుంటాయి. దావీదు మేత కొరకు గొర్రెలను కొండల లోనికి తీసుకుని వెళ్లేవాడు. అంతేకాకుండా నీటి కొరకు లోయలలోనికి తీసుకొని వెళ్లేవాడు. దావీదు తన గొర్రెలను క్షేమంగా ఉండునట్లు చూసుకునేవాడు. గొర్రెలకు గాయమైతే నూనె రాచి కట్టు కట్టేవాడు. పాలిచ్చే గొర్రెలను మెల్లగా నడిపించేవాడు. చిన్నపిల్లలను భుజముల మీద మోసేవాడు. దావీదు మంచి కాపరి వలె తన గొర్రెలను రాత్రింబగళ్లు శ్రద్ధగా చూసుకునేవాడు.
దావీదు ఎవరూ చేయలేని గొప్ప పనిని తన గొర్రెలకు చేశాడు. ఆ దేశములో చాలా క్రూర మృగాలు తిరుగుచుండేవి. అవి పొదల వెనుక లేదా గుహలలో దాగుకొని అకస్మాత్తుగా చిన్న గొర్రెల మీద దూకి వాటిని నోట కరచుకొని పోయేవి. క్రూర మృగములు గొర్రెలను పట్టుకొనిన వెంటనే కాపరి గట్టిగా కేకలు వేసి కర్రతో బెదిరించి వాటిని విడిపించుటకు ప్రయత్నిస్తాడు. ఒకసారి సింహము ఒక గొర్రె పిల్లను నోట కరచుకొని వెళ్తున్నప్పుడు దావీదు పరిగెత్తుకొని పోయి దాన్ని తరిమి చంపి సింహము నోట నుండి గొర్రెను విడిపించాడు. అది దావీదు మీదికి రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపాడు. సింహమును చంపిన రీతిగానే మరోసారి ఎలుగుబంటిని కూడా దావీదు చంపాడు(1వ సమూయేలు 17: 34- 36). ఎంత ధైర్యముతో కూడిన పని! దావీదు మంచి కాపరిగా తన గొర్రెలను ప్రేమించే వాడు గనుక వాటిని కాపాడుటకు తన ప్రాణము పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండేవాడు. ఈ విషయాలు సౌలుతో చెప్పిన సమయంలో నేను చాలా తెలివిగలవాడును, బలము గలవాడును అని దావీదు తనను గూర్చి గొప్పగా చెప్పుకొనలేదు గాని సింహం యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు ప్రభువే తనను రక్షించాడు అని చెప్పాడు.
దావీదు ప్రభువును విశ్వసించుట వలన అంత గొప్ప ధైర్యము గలవాడై ఆ సింహమును, ఎలుగుబంటిని చంపగలిగాడు. గొర్రె పిల్లను రక్షించుటకు ప్రభువు తనకు సహాయము చేస్తాడు అని విశ్వసించాడు. దావీదు ధైర్యము గల కాపరి అని మీరు నమ్ముతున్నారా? దావీదును క్షేమంగా కాపాడిన ప్రభువు ఎంత అద్భుతమైన వాడు!
దావీదు అభిషేకింపబడిన రాజు
ఒకరోజు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి జరిగింది. ఎప్పటి వలె దావీదు గొర్రెలను మేపుచున్న సమయములో అతని తండ్రి ఇంటికి రమ్మని వర్తమానం పంపాడు. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండుటకు యెషయి కుమారులలో ఒకరికి అభిషేకించుటకు దేవుని సేవకుడైన సమూయేలు బేత్లెహేముకు వచ్చాడు. తన ఏడుగురు సహోదరులలో ఎవరిని సమూయేలు అభిషేకించలేదని తెలిసి దావీదు ఎంతగానో ఆశ్చర్యపోయి ఉండవచ్చు. దావీదు అక్కడికి రాగానే ప్రభువు సమూయేలుతో - " నేను కోరుకున్న వాడు ఇతడే నీవు లేచి వానిని అభిషేకించుము" అని సెలవిచ్చాడు. యెషయు కుటుంబంలో అందరికంటే చిన్నవాడైన గొర్రెలు కాచుకొనే దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. దావీదు తన పట్ల ప్రేమ విశ్వాసము గల వాడని, ఇశ్రాయేలీయులకు మంచి రాజుగా ఉండగలడు అని దేవునికి తెలుసు. కానీ ఇశ్రాయేలీయులకు అప్పటికి ఒక రాజు ఉన్నాడు. అవును, సౌలు వారి రాజుగా ఉన్నాడు. దేవుడు ఎందుకు సౌలును రాజుగా ఉండకుండా తీసివేయాలి అనుకున్నాడు? సౌలు దేవునికి అనేకమార్లు అవిధేయత చూపాడు, మరియు గర్వముతో తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించేవాడు. అందువలన దేవుడు సౌలును రాజుగా ఉండకుండా తీసివేసి మరొక వ్యక్తిని రాజుగా చేయాలనుకున్నాడు. ఆ వ్యక్తి దావీదు. సమూయేలు దావీదుకు అభిషేకము చేసిన వెంటనే రాజు అయిపోయాడా? లేదు సౌలు మరణించే వరకు ఎన్నో సంవత్సరములు దావీదు ఎదురు చూడవలసి వచ్చింది.
దావీదు గొల్యాతును చంపుట
దావీదు జీవితాన్ని మార్చివేసే సంఘటన ఒక రోజు జరిగింది. సౌలు సైన్యములో సైనికులుగా ఉన్న తన సహోదరుల యోగక్షేమాలు కనుగొనుటకు యెషయు దావీదును వారి దగ్గరకు పంపించాడు. ఆ సమయములో ఇశ్రాయేలీయులకు, ఫిలిష్తీయులకు మధ్య యుద్ధము జరుగుతూ ఉంది. ఫిలిష్తీయుల యొక్క శూరుడు అయిన గొల్యాతును చూచి ఇశ్రాయేలీయుల సైన్యకులు భయపడి వెనుకకు పరుగెత్తుట దావీదు చూశాడు. దావీదు గొల్యాతును చంపడానికి ముందుకు వచ్చాడు. అంత గొప్ప యుద్ధ వీరుడిని బాలుడైన దావీదు ఎలా చంపగలడు? సింహమును, ఎలుగుబంటిని చంపుటకు తనకు సహాయపడిన ప్రభువు గొల్యాతును చంపుటకు కూడా సహాయపడతాడు అని దావీదు విశ్వసించాడు. దావీదు గొల్యాతును చంపిన వెంటనే ఇశ్రాయేలీయుల దృష్టికి గొప్పవాడై పోయాడు. అందరూ, ప్రతి చోటా దావీదును పొగడుచు పాటలు పాడసాగారు. దావీదు యుద్ధములో ఇశ్రాయేలీయులకు విజయము కలిగించాడు వెంటనే దావీదు జీవితము మారిపోయింది. అతడు సైనికుడిగా నియమించబడి అక్కడే రాజు దగ్గర ఉండిపోయాడు, తిరిగి గొర్రెలను కాయుటకు బేత్లెహేము వెళ్ళలేదు.
సౌలు దావీదును తరుముట
గొల్యాతును చంపినందుకు దావీదును ఎంతగానో మెచ్చుకొనిన సౌలు, ప్రజలు దావీదును తనకంటే గొప్పవాడిగా చూడటం సౌలుకు నచ్చలేదు. దావీదు పట్ల ఎంతో ఈర్ష్య, ద్వేషముతో నిండిపోయాడు. రెండుసార్లు ఈటెతో పొడిచి దావీదును చంపుటకు ప్రయత్నించాడు కానీ దావీదు అక్కడ నుండి తప్పించుకొని పారిపోయాడు. సౌలు కుమార్తె అయిన మీకాలు తన భర్త అయిన దావీదును కిటికీ నుండి పారిపోవుటకు సహాయము చేసింది. సౌలు కుమారుడు, దావీదు ప్రాణ స్నేహితుడైన యోనాతాను తన తండ్రి దావీదును చంపుటకు ప్రయత్నిస్తున్నాడు అనే విషయాన్ని దావీదుకు చెప్పి పారిపోవునట్లు సహాయపడ్డాడు. దావీదు కొండలలో, అరణ్యములో సంచరిస్తున్నాడు అని తెలుసుకుని నా సౌలు తన మనుష్యులతో దావీదును తరుమ సాగాడు. పాపం దావీదు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. కానీ దావీదు ప్రభువుపై తనకు గల విశ్వాసాన్ని పోగొట్టుకొనలేదు. ప్రభువు దావీదుకు తోడైయుండి క్షేమముగా కాపాడినందువలన సౌలు దావీదును చంపలేకపోయాడు. దావీదు వేరొక దేశములో నివసించుటకు వెళ్ళిపోయిన తర్వాత సౌలు దావీదును తరుముట మాని యెరూషలేముకు వెళ్ళిపోయాడు.
దావీదు రాజగుట
సౌలు ఒక దినము ఫిలిష్తీయులతో యుద్ధము చేస్తుండగా సౌలు, యోనాతాను ఇంకను అనేక మంది సైనికులు యుద్ధములో మరణించారు. ఇశ్రాయేలీయులు సంతోషముతో దావీదును తమకు రాజుగా ఉండుటకు ఏర్పరచుకున్నారు. దావీదు సౌలు వలె కాక మంచి రాజుగా ఇశ్రాయేలీయులను పరిపాలించాడు. ప్రజల పట్ల దయ కలిగి జ్ఞానముతో పరిపాలించే వాడు గనుక ప్రజలు కూడా దావీదును ప్రేమించేవారు. తన స్నేహితుడైన యోనాతానుకు ఇచ్చిన మాట చొప్పున, అతని కుమారుడైన మెఫీబోషెతును దావీదు తన దగ్గరకు పిలిపించుకున్నాడు. అతడు కాళ్లు రెండు కుంటివి. అతడిని తన భోజనపు బల్ల దగ్గర ఎల్లప్పుడూ భోజనం చేయునట్లు దయ చూపించాడు.
దావీదు పాపము చేయుట
దావీదు ప్రభువును ఎంతో ప్రేమించేవాడు మంచివాడు గనుక ఎప్పుడూ పాపము చేయలేదు అని మనము అనుకోవచ్చు, కాని దేవునికి ఆగ్రహము తెప్పించిన ఘోరమైన పాపము దావీదు చేశాడు. వివాహమైన బత్షెబ అనే స్త్రీని దావీదు వివాహము చేసుకోవాలి అనుకున్నాడు. అందు కొరకు బత్షెబ భర్త అయిన ఉరియాను మోసంతో చంపించాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపి దావీదు చేసిన పాపాన్ని అతనికి తెలియజేశాడు. దావీదు ఎంతగానో పశ్చాతాప పడ్డాడు. దేవుని పాపక్షమాపణ కొరకు ఎంతగానో ప్రార్ధించాడు (కీర్తన 51) ప్రభువు దావీదును క్షమించాడు.
అబ్షాలోము
దావీదు జీవితములో దుఃఖకరమైన విషయాలు కూడా జరిగాయి. తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను యుద్ధములో మరణించినప్పుడు దావీదు దుఃఖించాడు. దావీదు కుమారుడైన అబ్షాలోము తన తండ్రిని మోసము చేసి తాను రాజుగా ప్రకటించుకున్నాడు. దావీదు అబ్షాలోము దగ్గర నుండి పారిపోవలసి వచ్చింది. అబ్షాలోము దావీదును వెదకుచు గాడిద మీద వెళ్తున్నప్పుడు అతని తల వెండ్రుకలు చెట్టు కొమ్మలకు తగులుకొంది. యోవాబు బాణముతో కొట్టి అబ్షాలోమును చంపాడు. దావీదు అబ్షాలోమును ఎంతగానో ప్రేమించే వాడు గనుక అతని మరణ వార్తను విని ఎంతో దుఃఖించాడు. అబ్షాలోము మరణము తరువాత దావీదు యెరూషలేమునకు తిరిగి వెళ్లి మరల ఇశ్రాయేలీయులను పరిపాలించ సాగాడు. దావీదు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నాడు, దావీదు తరువాత అతని కుమారుడైన సొలొమోను రాజుగా ఏర్పరచబడ్డాడు.
కీర్తనలు
దావీదు అనేకమైన కీర్తనలు వ్రాశాడు. తన జీవితములో ఎదుర్కొన్న పరిస్థితులను అన్నింటిని కీర్తనల రూపములో వ్రాసేవాడు. దావీదు కీర్తనలు దేవునికి చేసిన ప్రార్ధనలుగా ఉంటాయి. దేవుడు తనను కాపాడినందుకు ఎంతో కృతజ్ఞతను తెలియజేస్తూ కూడా ఆ కీర్తనలు వ్రాశాడు. క్రైస్తవులందరూ దావీదు వ్రాసిన కీర్తనలను చదివి ఆదరణ పొందుతుంటారు.
సందేశము
దావీదు రాజులందరిలో ఎంతో అద్భుతమైన వాడు. బాలుడిగా ఉన్నప్పుడే తన హృదయమంతటితో ప్రభువును ప్రేమించాడు. దేవుని యందలి విశ్వాసము వలననే గొర్రెలను మేపే సమయములో సింహమును, ఎలుగుబంటిని చంపగలిగాడు. అదే విధముగా గొల్యాతును కూడా చంపగలిగాడు. గొర్రెల మంచి కాపరి అయిన దావీదు ఇశ్రాయేలీయులకు మంచి రాజుగా కూడా ఉండగలిగాడు. దేవుని సహాయము వలననే దావీదు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులను చక్కగా పరిపాలించగలిగాడు.
అన్వయింపు
చిన్న వయస్సులోనే మనము తనను ప్రేమించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. మనము అలా ప్రేమించగలిగితే, దేవుడు మనకు గొప్ప కార్యాలను అప్పగిస్తాడు. మనము సింహాన్ని ఎలుగుబంటిని గొల్యాతు వంటి వారిని చంపవలసిన అవసరము లేదు గాని, మనకు ఎదురయ్యే అన్ని విషయాలలో ధైర్యముగా ఉండగలము. మనము క్రైస్తవులము కాకపోతే, మన పాపములను క్షమించమని దేవుని అడగాలి.
హడ్సన్ టేలర్ యవనస్తుడిగా ఉన్నప్పుడే ప్రభువుపై ఎంతో విశ్వాసము గలవాడై తన దగ్గర ఉన్న చాలా తక్కువ డబ్బుతో జీవించేవాడు.
చాలాసార్లు తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు. ఆ పరిస్థితులలో దేవుడు ఎవరి ద్వారానో సహాయపడేవాడు. టేలర్ చైనా దేశమునకు మిషనరీగా వెళ్ళినప్పుడు చాలా డబ్బు అవసరమైంది. అనేకమంది మిషనరీలను పోషించవలసి వచ్చేది. హడ్సన్ టేలర్ ఎంతో విశ్వాసముతో ప్రభువుకు ప్రార్ధించినప్పుడు ఆయన వారి అవసరాలను తీర్చేవాడు. హడ్సన్ టేలర్ విశ్వాసము దినదినానికి ఎంతో అభివృద్ధి చెందింది. మనము చిన్నవారముగా ఉన్నప్పుడే విశ్వసించుటకు నేర్చుకుంటే, పెద్దవారమైన తర్వాత కూడా ప్రభువు పట్ల విశ్వాసము కలిగి జీవించగలము. ప్రభువు సహాయముతో ఆయన కొరకు గొప్ప కార్యములు చేయగలము.
కంఠతవాక్యము
నీ మార్గమును ప్రభువుకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును (కీర్తన 37:5)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

