నిర్గమకాండము 1- 2:10; అ.కా. 7:20; హెబ్రీ 11: 23

ఉద్దేశము
మనము భయముతో ఉన్న సమయాలలో ప్రభువునందు విశ్వాసముంచి ప్రార్థించిన యెడల ఆయన మనకు శాంతి, సమాధానము అనుగ్రహించి నడిపిస్తాడు అని బోధించుట.

ముఖ్యాంశము
మీరెప్పుడైనా దేనికైనా భయపడ్డారా? మీకు భయం కలిగించేవి ఏమిటి? కొందరికి సాలెపురుగులు అంటే భయం, మరికొందరికి పాములు అంటే భయం ఉంటుంది. మరి కొంతమందికి ఎవరైనా గట్టిగా అరుస్తూ ఉంటే భయం వేస్తుంది. మరి కొందరు పిల్లలు చీకటిలో ఒంటరిగా ఉండాలంటే భయపడతారు. డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఇంజక్షన్ తీసుకోవాలంటే చాలామందికి భయం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయాన్ని బట్టి భయం ఉంటుంది. చిన్న విషయాలకు భయపడే వారిని చూచి అందరూ ఎగతాళి చేస్తారు, కానీ పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అందరూ భయపడతారు. ఈ రోజు తమకు ఎదురైన పరిస్థితులను బట్టి ఎంతగానో భయపడిన తల్లిదండ్రులను గురించి తెలుసుకుందాము.

గతవారము
అబ్రాహాము కుటుంబీకులు ఎందుకు ఐగుప్తు దేశములో నివసిస్తున్నారో మీకు గుర్తుందా? ఐగుప్తులోని గోషెను ప్రదేశములో నివసించుటకు యోసేపు తన తండ్రిని సహోదరులను ఆహ్వానించాడు.70 మందిగా ఐగుప్తు దేశమునకు వచ్చిన వారు అభివృద్ధి చెందుతూ దాదాపు 20 లక్షల జనము అయినట్లుగా గతవారం చూసాము. వారు 400 సంవత్సరములు పరదేశములో దాసులుగా నివసించిన తరువాత తిరిగి కనాను దేశమునకు వస్తారు అని ప్రభువు ముందుగానే అబ్రాహాముకు వాగ్దానం చేశాడు (ఆది 15:13,14). ఇశ్రాయేలు జనాంగము తిరిగి కనాను దేశము వెళ్ళుటకు సమయము దగ్గర పడింది. ఇశ్రాయేలీయులను కనాను దేశమునకు నడిపించుటకు ఒక గొప్ప నాయకుని దేవుడు సిద్ధపరచడం మనము ఈ వారం చూద్దాము.

ఫరో రాజు యొక్క క్రూరత్వము

400 సంవత్సరముల చెర తరువాత ఒక క్రొత్త రాజు ఐగుప్తును పరిపాలించసాగాడు. ఐగుప్తు రాజులను - ఫరో - అని పిలిచేవారు. అతడు ఎంతో క్రూరమైన వాడు. ఇశ్రాయేలీయులు విస్తారమైన, బలమైన జనముగా ఉండుటవలన ఫరో వారిపై ద్వేషం పెంచుకున్నాడు. ఒకవేళ యుద్ధము వస్తే వారు తమ శత్రువులతో చేరి తమకు విరోధముగా యుద్ధముచేసి అక్కడనుండి వెళ్ళిపోతారు అని భయపడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలీయులను ఏ విధముగానైనా బలహీనపరచాలి అని ఫరో రాజు తలంచాడు. వారిని వెట్టి పనులు చేయుటకు నియమించాడు. వారిని శ్రమ పెట్టి, వారితో పనులు చేయించుటకు కఠినమైన వారిని అధికారులుగా నియమించాడు. వారితో ఐగుప్తీయులు కఠినమైన సేవ చేయించుకునేవారు. వారు పని చేయడం ఆపివేస్తే శ్రమ పెట్టేవారు. ఈ విధముగా చేస్తే వారి సంతానము అభివృద్ధి పొంది విస్తరించడం ఆగిపోతుంది అని ఫరో తలంచాడు. ఫరో ఎంత కఠినమైన రాజు! కఠినమైన పనులు, శ్రమల వలన ఇశ్రాయేలీయులు ఎంతగానో విసిగిపోయారు. ఫరో వారిచేత క్రొత్త పట్టణములు కట్టించుట మొదలుపెట్టాడు. ఇశ్రాయేలీయులు చేయు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను వారిపట్ల ఎంతో కఠినముగా వ్యవహరించారు. ఇలా చేయడం ద్వారా ఫరో ఆలోచన నెరవేరింది అనుకుంటున్నారా? లేదు, ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి అభివృద్ధి పొందారు. తన ప్రజల పట్ల దేవుడు శ్రద్ధ కలిగియుంటాడు అని దీనిని బట్టి మనము గ్రహించవచ్చు.

మగ పిల్లలను చంపుటకు ప్రణాళిక

తన ఆలోచన వలన ఎటువంటి ఫలితం లేకపోవుట ఫరో చూచి మరొక ఆలోచన వేశాడు. ఇది మొదటి ఆలోచన కంటె క్రూరమైనది. ఇశ్రాయేలీయుల మంత్రసానులను (నర్సులు) పిలిచి ఇశ్రాయేలు స్రీలు ప్రసవించే సమయములో మగ పిల్లవాడైన యెడల చంపివేసి, ఆడపిల్ల అయిన యెడల బ్రతకనివ్వమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎంత భయంకరమైన ఆలోచన! కాని ఆ నర్సులు దేవునికి భయపడే వారు గనుక మగ పిల్లలను చూసి చంపివేయుమని ఫరో ఇచ్చిన ఆజ్ఞ సరియైనది కాదు అని వారికి తెలుసు. ఫరో ఆజ్ఞను అతిక్రమిస్తే శిక్ష పడుతుంది అని తెలిసినప్పటికి, వారు ధైర్యముగా ఫరో ఆజ్ఞను పట్టించుకొనలేదు. వారు ఇశ్రాయేలీయుల మగ సంతానమును చంపలేదు గనుక వారు ఇంకను విస్తరించి మిక్కిలి అభివృద్ధి చెందారు. వారు చేసిన పనికి దేవుడు ఆ మంత్రసానుల కు మేలు చేశాడు.

ఫరోకు మరొక క్రూరమైన ఆలోచన కలిగింది. ఇశ్రాయేలీయులకు పుట్టిన ప్రతి కుమారుని నైలు నదిలో పారవేయమని ఆజ్ఞాపించాడు. ఫరో సైనికులు వచ్చి మగపిల్లలను బలవంతముగా తీసుకుని వెళ్లి నైలు నదిలో పారవేసారు. వారు నీటిలో మునిగి పోయి ఉండవచ్చు, లేదా నదిలోని మొసళ్ళు వారిని తినివేసి ఉండవచ్చు. ఆ పరిస్థితులలో తల్లులు తమ కుమారులను పోగొట్టుకొనుట వలన ఎంతో దుఃఖించి ఉంటారు.

దేవుడు మోషే తల్లిదండ్రుల హృదయములలో సమాధానము ఉంచుట (హెబ్రీ11:23)

ఆ సమయములో దేవుని ఎంతగానో ప్రేమిస్తున్న ఒక కుటుంబము ఉండేది. అమ్రాము, యోకెబెదు అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారికి మిర్యాము అనే 13 సంవత్సరముల కుమార్తె, అహరోను అనే మూడు సంవత్సరముల కుమారుడు ఉన్నారు. యోకెబెదు గర్భవతిగా ఉన్న దినములలో ఫరో ఆజ్ఞ అమలులో ఉంది. తనకు జన్మించబోయే బిడ్డ ఆడపిల్ల కావాలి అని యోకెబెదు కోరుకొని ఉండవచ్చు. ఒకవేళ మగ పిల్లవాడు పుడితే ఏమి చేయాలి అనే ఆలోచన యోకెబెదుకు ఎంతో భయాన్ని కలిగించి ఉంటుంది. మగబిడ్డ పుడితే నైలు నదిలో పారవేయాలి అనే ఆలోచన అమ్రాము యోకెబెదులకు ఎంతో దుఃఖం కలిగించి ఉండవచ్చు. ప్రతిరోజు వారిరువురు ఈ విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ, ఎంతో భయముతో దుఃఖముతో ప్రభువు సన్నిధిలో ప్రార్ధిస్తూ ఉండి ఉంటారు. చివరకు ఒకరోజు యోకెబెదు కుమారుని ప్రసవించింది. ఆ కుమారుడు ఎంతో అందమైన వాడుగా జన్మించాడు. ఆ బిడ్డను నదిలో పారవేయడానికి వారికి మనస్సు రాలేదు. ఆ శిశువును చూచినప్పుడు దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో ఆ బిడ్డను తమకు కుమారునిగా అనుగ్రహించాడు అని వారు తలంచారు. వారు విశ్వాసముతో రాజాజ్ఞకు భయపడక మూడునెలలు ఆ శిశువును దాచిపెట్టారు. ప్రభువు అతడిని కాపాడుతాడు అని వారు విశ్వసించారు (హెబ్రీ11: 23). వారు ఏ మాత్రము భయము లేక సమాధానముతో ఉన్నారు.

చిన్న కుమారుని దాచిపెట్టుట

ప్రభువు ఆ బిడ్డ విషయములో తల్లిదండ్రులకు జ్ఞానము ఇచ్చాడు. ముందుగా ఆ శిశువు పుట్టిన విషయం రహస్యంగా ఉంచాలి. సాధారణంగా ఇటువంటి విషయాన్ని తల్లిదండ్రులు అందరికి సంతోషంగా చెప్తారు. కాని వారు ఆ బిడ్డను ఇంటిలో దాచి పెట్టవలసి వచ్చింది. పిల్లవాని ఏడుపు వినిపించకుండా రహస్యంగా దాచిపెట్టి ఉండవచ్చు, కాని మూడునెలల వయస్సు తరువాత ఆ కుమారుని దాచిపెట్టడం వారికి ఎంతో కష్టంగా మారిపోయింది. ఏమి చేయాలి? భార్యాభర్తలు తమ పరిస్థితిని గురించి ప్రభువు సన్నిధిలో ప్రార్థించి ఉండవచ్చు. యోకెబెదు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి (నీరు రాకుండా) అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచింది. యోకెబెదు ఎందుకు అలాచేసి ఉండవచ్చు? వారు దేవుని విశ్వసించారు. ప్రభువు తమ ప్రార్థన అంగీకరించి తమ కుమారుని తప్పక కాపాడుతాడు అని వారు నమ్మారు. వానికి ఏమి జరుగుతుందో తెలిసికొనుటకు వాని అక్క మిర్యాము దూరముగా నిలుచుండి చూస్తూఉంది.

ఫరో కుమార్తె శిశువును కనుగొనుట

అప్పుడు ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటి దగ్గరకు వచ్చింది. ఆమె ఆ గడ్డిలో ఉన్న పెట్టెను చూచింది. అందులో ఏమి ఉంటుంది అని ఎంతో ఆశ్చర్యంతో తన పనికత్తెను పంపి ఆ పెట్టెను తెప్పించింది. ఆ పెట్టెను తెరచి చూచినప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు. అప్పుడు ఫరో కుమార్తెకు అందమైన ఆ పిల్లవాని పట్ల ఎంతో కనికరము కలిగింది. ఆ పిల్లవాడు ఇశ్రాయేలీయులకు చెందినవాడు అని ఆమె గ్రహించింది. ఆమె తండ్రి అయిన ఫరో ఇశ్రాయేలీయుల మగపిల్లల నందరిని నదిలో పార వేయునట్లు ఆజ్ఞ ఇచ్చాడు, కాని ఫరో కుమార్తె ఆ శిశువును కాపాడాలి అనుకుంది. ఎంతో అందంగా ఉన్న ఆ శిశువును తానే పెంచాలి అని నిర్ణయించుకుంది. ఈ విషయాలన్నింటిని మిర్యాము దూరములో నిలబడి చూస్తూ ఉంది. అప్పుడు మిర్యాము ఫరో కుమార్తె దగ్గరకు వచ్చి - "నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ (ఇశ్రాయేలు) స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వత్తునా?" అని అడిగింది. అందుకు ఫరో కుమార్తె అంగీకరించింది. మిర్యాము వెంటనే తల్లి దగ్గరకు పరిగెత్తుకొని పోయి జరిగిన విషయాలను చెప్పి, తన తల్లి అయిన యోకెబెదును ఫరో కుమార్తె దగ్గరకు తీసుకొని వచ్చింది. తన కొరకు పిల్లవాడిని పెంచే దాది దొరికినందుకు ఫరో కుమార్తె ఎంతో సంతోషించి ఉండవచ్చు. యోకెబెదు ఆ పిల్లవాని కన్నతల్లి అని ఫరో కుమార్తెకు తెలియదు. ఫరో కుమార్తె యోకెబెదుతో -

"ఈ బిడ్డను తీసికొనిపోయి నా కొరకు వానికి పాలిచ్చిపెంచుము, నేను నీకు జీతమిచ్చెదను" అని చెప్పింది. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత యోకెబెదు అతనిని ఫరో కుమార్తె దగ్గరకు తీసుకొని రాగా, ఆమె అతడిని తన కుమారునిగా చేసుకుంది. నీటిలో నుండి ఇతని తీసితిని అని చెప్పి ఫరో కుమార్తె అతనికి మోషే అను పేరు పెట్టింది. ఫరో కుమార్తెకు సంతానము లేనందువలన మోషే ఆమె కుమారునిగా ఎంచబడ్డాడు. ఆమె తండ్రి తన కుమార్తె చేసిన పనికి అడ్డు చెప్పలేకపోయాడు.

అమ్రాము యోకెబెదు తమ కుమారుడు కొంతకాలము తమతో కలిసి ఉన్నందుకు ఎంతో సంతోషించి ఉంటారు. తమ కుమారుడు ఫరో కుమార్తె దగ్గర ఉంటాడు గనుక అతనికి ఎటువంటి ప్రాణ భయం లేదు అని వారు అనుకుని ఉండవచ్చు. అంతేగాక మోషేను పెంచినందుకు వారికి ఫరో కుమార్తె డబ్బు కూడా ఇచ్చింది. ఎంతో అద్భుతంగా తమ ప్రార్థనలకు సమాధానం ఇచ్చినందుకు వారు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి ఉంటారు.

సందేశము
ఎంత అద్భుతమైన విషయాలు మనము ఈ రోజు చూసాము. తమకు కుమారుడు జన్మిస్తే నదిలో పడవేయ వలసి వస్తుంది అని అమ్రాము యోకెబెదు ఎంతగానో భయపడ్డారు. కాని దేవుడు వారి ప్రార్థనలకు ఎంతో ఆశ్చర్య రీతిగా జవాబు ఇచ్చాడు అనే విషయాలను మనము చూసాము. మోషే పెద్దవాడైనప్పుడు ఇశ్రాయేలీయులను తిరిగి కనానుకు నడిపించు గొప్ప నాయకుడు కాబోతున్నాడు. అందుకే సాతాను ఎలాగైనా మోషేను నాశనము చేయాలని ప్రయత్నించినప్పటికి, దేవుడు ఆ ప్రయత్నాలను కొట్టివేసాడు. పెద్దవాడైన తరువాత మోషే తన ప్రణాళికను నెరవేర్చునట్లు దేవుడు అతడిని చిన్నవయస్సులోనే కాపాడాడు.

అన్వయింపు
మనకు భయం కలిగించే విషయాలు ఎలాంటివైనా దేవుని దగ్గర ప్రార్థించాలి. మనము నిజముగా భయపడవలసిన ముఖ్యమైన విషయం - ప్రభువైన యేసు మరల వచ్చినప్పుడు మనము ఆయన యందు విశ్వాసం కలిగియున్నామా లేదా అనేది. మనము దేవుని యొక్క క్షమాపణ అడిగి, మన హృదయాలలో శాంతి సమాధానము కలిగేంతవరకు ఆయనకు ప్రార్థించాలి. ఆయన మన భయాలన్నింటిని తీసివేయగలడు.

ఉదాహరణ
సౌమ్య ప్రతిరోజు పక్క వీధిలో ట్యూషన్ క్లాస్ కు వెళ్ళేది. ఒకరోజు ట్యూషన్ నుంచి ఇంటికి బయలుదేరగానే అకస్మాత్తుగా పెద్ద వర్షం మొదలైంది. నడుస్తుండగానే కరెంట్ పోయింది. చిన్న చిన్న చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయి. పెద్ద ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. సౌమ్య ఎంతగానో భయపడి ఏడవడం మొదలు పెట్టింది. కాని తనకు సహాయము చేయడానికి బయట ఎవరూ లేరు. వెంటనే సౌమ్యకు 23వ కీర్తన గుర్తుకు వచ్చి గట్టిగా చెప్పసాగింది. ఎంతో ఆశ్చర్యంగా తనలోని భయము, దుః ఖము తొలగిపోయాయి. దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అని ధైర్యం కలిగింది. క్షేమంగా ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని చెప్పినప్పుడు వారు కూడా ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. సౌమ్య అప్పటినుండి తన విశ్వాసములో బలపడి దేవునిలో ఎదగడం మొదలు పెట్టింది.

కంఠతవాక్యము
నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను - ( కీర్తనలు 56:3)

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.