దావీదు తప్పించు కొనిపోవుట
1వ సమూయేలు 18 - 20 అధ్యాయాలు
ఉద్దేశము
మన నిజమైన స్నేహితుడు యేసు అని బోధించుట.
ముఖ్యాంశము
ఈర్ష్య ,అసూయ - అసూయ మానవులలో చాలా సాధారణంగా కనిపించే చెడ్డ లక్షణం. మీ స్నేహితులకు మీ కంటే ఎక్కువ గ్రేడ్ వస్తే మీకు కూడా అసూయ కలుగుతుంది కదూ! అలాగే మన కంటే వేరే వారికి మంచి పేరు వచ్చినా, అందరూ వారిని హెచిస్తూ మాట్లాడినా వెంటనే ఈర్ష్యతో నిండి పోతాము, కాని ఈర్ష్య అసూయ దేవునికి ఇష్టమైనవి కావు. ఈర్ష్య ద్వేషం దేవుని రాజ్యమును స్వతంత్రించి కొనుటకు ఆటంకము అని బైబిల్ చెబుతుంది. ఈరోజు మనము ఆ విషయాలను గురించి చూద్దాము.
నేపధ్యము
ఇశ్రాయేలీయుల మొదటి రాజు ఎవరు? అతడు చూచుటకు ఎలా ఉండేవాడు? అవును సౌలు అందరికంటే అందంగా ఉండేవాడు కానీ అతని హృదయము గర్వము స్వార్థంతో నిండి ఉండేది. అందువలన దేవుడు సౌలును రాజు గా ఉండకుండా తప్పించి దావీదును ఎన్నుకున్నాడు.
దావీదు ఫిలిష్తీయుల శూరుడైన గొల్యాతును ఏ విధముగా చంపాడు అని మనము తెలుసుకున్నాము. అతడు ఇశ్రాయేలీయులను వారి దేవుని అపహసిస్తూ మాట్లాడేవాడు. దావీదు బాలుడైనప్పటికి దేవుని శక్తి పై తన విశ్వాసముంచి గొల్యాతు ని చంపగలిగాడు.
సౌలు ఈర్ష్యతో నిండి పోవుట
గొల్యాతును చంపిన తరువాత దావీదును తన దగ్గర ఉంచుకొనుటకు సౌలు అతనిని పిలిపించాడు. దావీదు గొర్రెలను మేపుట మానివేసి సౌలు సైన్యములకు అధిపతిగా నియమించబడ్డాడు. దావీదు అందరి దృష్టిలో ఎంతో గొప్పవాడుగా పేరుపొందాడు.
దావీదు ఒక యుద్ధములో విజయము సాధించి తిరిగి వస్తున్న సమయంలో అనేకమంది స్త్రీలు అతనిని ఎదుర్కొనుటకు వెళ్ళి పాటలు పాడుతూ - "సౌలు వేలకొలదియు దావీదు పదివేల కొలది యు శత్రువులను హతముచేసిరి" అని చెప్ప సాగారు. అది విని సౌలు సంతోషించాడా? లేదు అతడు చాలా కోపముతో దావీదు యెడల అసూయ పడసాగాడు. స్త్రీలు పాడిన పాటలు మరల మరల గుర్తు చేసుకుంటూ, దావీదు తన రాజ్యమును తీసుకుంటాడు అని భయపడ సాగాడు. అప్పటినుండి ఎలాగైనా దావీదును వదిలించుకోవాలి అనుకున్నాడు.
సౌలు మీదికి కొన్నిసార్లు దురాత్మ వస్తుండేది. అలా దురాత్మ వచ్చినప్పుడు అతడు ఎంతో కోపంతో వింతగా ప్రవర్తించేవాడు. అప్పుడు దావీదు వీణ వాయించినప్పుడు సౌలు బాగుపడేవాడు. ఒక రోజు అదే విధముగా సౌలు మీదికి దురాత్మ వచ్చినప్పుడు దావీదు వీణ పట్టుకొని వాయించ సాగాడు. సౌలు తన చేతిలో నున్న ఈటెను దావీదు పైకి విసిరాడు కాని దావీదు రెండు మారులు తప్పించుకొని పారిపోయాడు. సౌలు దావీదును చూచిన ప్రతి సారి స్త్రీలు పాడిన పాటలు గుర్తుకు వస్తూ ఉండి ఉండవచ్చు. అవి గుర్తుకు రాగానే దావీదును చంపాలి అనే ఆలోచన అతని హృదయములో బలంగా నాటుకొని పోయింది. అందుకే దావీదు తన ఎదుటికి రాగానే అతడిని చంపడానికి ప్రయత్నించేవాడు. సౌలును చూచి దావీదు ఎంత భయపడి ఉంటాడో అని మనం ఊహించవచ్చు. సౌలు ఏ విధముగానైనా సరే దావీదును చంపాలని నిశ్చయించుకున్నాడు.
యోనాతాను, దావీదు ప్రాణ స్నేహితులు
సౌలుకు తన పై గల ఈర్ష్యను చూచి దావీదు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. కాని ప్రభువు దావీదుకు తోడుగా ఉండి కాపాడుతున్నాడు.
రాజభవనములో ఉన్నప్పుడు సౌలు కుమారుడైన యోనాతానుతో దావీదుకు మంచి స్నేహము ఏర్పడినట్లు బైబిల్ లో వ్రాయబడింది. యోనాతాను దావీదుకు ఎన్నో బహుమతులను ఇస్తుండేవాడు. వారిరువురూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. రాజభవనములో మాట్లాడుటకు స్నేహితుడు దొరికినందుకు దావీదు ఎంతో సంతోషించాడు. వారిరువురు దేవుని పట్ల విశ్వాసము కలిగిన వారుగా ఒకరికొకరు ఎంతగానో సహాయం చేసుకునేవారు.
దావీదు మీకాలును వివాహమాడుట
సౌలు కుమార్తె అయిన మీకాలు దావీదు పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండటం సౌలు గ్రహించాడు. అది చూచిన సౌలు హృదయములో ఒక చెడు ఆలోచన కలిగింది. సౌలు తన సేవకులను దావీదు యొద్దకు పంపి - "రాజు నీ యందు ఇష్టం కలిగియున్నాడు. రాజు 100 మంది ఫిలిష్తీయులను చంపమని కోరుచున్నాడు" అని పలికించాడు. దావీదు ఫిలిష్తీయుల చేతిలో తప్పక చనిపోతాడు అని సౌలు తలంచాడు. దావీదు చనిపోతే ప్రజలు తిరిగి తనను పొగుడుతారు అని సౌలు ఆలోచించాడు. దావీదు ఫిలిష్తీయుల మీదికి వెళ్ళి వారిని చంపాడు. అప్పుడు సౌలు తప్పనిసరిగా తన కుమార్తె అయిన మీకాలుకు దావీదు తో వివాహము జరిగించవలసి వచ్చింది.
సౌలు మరల దావీదును చంపుటకు ఆలోచించుట
ప్రభువు దావీదు కు తోడుగా ఉన్నాడు అని సౌలు గుర్తించాడు. దావీదు పట్ల తనకున్న ఈర్ష్య అసూయ తీసివేయమని ప్రభువుకు ప్రార్ధించుటకు బదులుగా సౌలు దావీదు పై ఇంకా ఎక్కువ ఆగ్రహము చూపించ సాగాడు. దావీదును చంపమని తన సైనికులకు, తన కుమారుడైన యోనాతానుకు కూడా చెప్పాడు. యోనాతాను, దావీదు మంచి స్నేహితులు. ఒకరోజు యోనాతాను తన తండ్రి అయిన సౌలు తో - "దావీదు ఎందుకు మరణ శిక్ష పొందవలెను? అతడు ఏమి చేసెను? అతడు ప్రాణమునకు తెగించి ఫిలిష్తీయుడైన గొల్యాతుని చంపగా నీవే చూచి సంతోషించితిని గదా! నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువు?" అని అడిగాడు. సౌలు యోనాతాను మాటలు విని దావీదును చంపి వేయాలి అనే ఆలోచన మానుకున్నాడు. పారిపోయిన దావీదు తిరిగి సౌలు దగ్గరకు వచ్చాడు కానీ మరి కొద్ది రోజులలోనే సౌలు దావీదును చంపటానికి ప్రయత్నించసాగాడు. సౌలు తనను విడిచి పెట్టడు అని గ్రహించిన దావీదు తిరిగి సౌలు దగ్గర నుండి పారిపోయాడు.
దావీదు తప్పించుకొనుటకు మీకాలు సహాయ పడుట
దావీదు జరిగిన విషయాలను మీకాలుకు చెప్పి ఉండవచ్చు. మీకాలు దావీదు పరిస్థితి ఎంత భయంకరముగా ఉన్నది గ్రహించి అతనితో - " ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటే గాని రేపు నీవు చంప బడుదువు" అని చెప్పింది. దావీదు ఆమె మాటలు విని కిటికి నుండి క్రిందకు దిగి తప్పించుకొని పారిపోయాడు.
మీకాలు ఒక గృహ దేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేక బొచ్చును తల వైపున ఉంచి దుప్పటి కప్పివేసింది. సౌలు దావీదును పట్టుకోవడానికి దూతలను పంపించగా దావీదు అనారోగ్యముతో పడుకొని ఉన్నాడు అని చెప్పింది .
సైనికులు ఆమె మాటలు విని వెళ్ళి సౌలుకు ఆ విషయాన్ని చెప్పారు. సౌలు కోపముతో మంచము తోనే దావీదును తన యొద్దకు తీసుకుని రమ్మని ఆజ్ఞా పించాడు. అప్పుడు దావీదును చంపి వేయవచ్చు అనుకున్నాడు. వారు వెళ్ళి చూచినప్పుడు మంచం మీద దావీదుకు బదులుగా ఒక బొమ్మ కప్పివేయబడి ఉంది గాని దావీదు లేడు. అప్పుడు సౌలు ఎందుకు దావీదును పంపి వేసావు అని మీకాలు మీద కోపగించు కున్నాడు. దావీదు తనను చంపబోయాడు గనుక అతనిని వదిలి పెట్టాను అని మీకాలు తన తండ్రి తో చెప్పింది.
దేవుని హస్తాలలో దావీదు క్షేమముగా ఉండుట
దావీదు ఎంతో దూరము ప్రయాణం చేసి వాళ్లకు దూరంగా పారిపోయాడు. ముందుగా సమూయేలు దగ్గరకు వెళ్లాడు. సమూయేలు ప్రభువుపై విశ్వాసముంచునట్లు దావీదును ధైర్యపరచి ఉండవచ్చు. అన్ని పరిస్థితులు దేవుని స్వాధీనములో ఉన్నాయి అని, దావీదు తప్పక ఒక రోజు ఇశ్రాయేలీయులకు రాజుగా వారిని పరిపాలించ బోతున్నాడు అని కూడా సమూయేలు చెప్పి ఉంటాడు.
దావీదు తన ప్రియమైన స్నేహితుడైన యోనాతాను కూడా రహస్యంగా కలుసుకున్నాడు. తన తండ్రి అయిన సౌలు దావీదును చంపుటకు తీర్మానించుకున్నాడు అని యోనాతాను అర్థం చేసుకున్నాడు. దావీదును తన తండ్రి వద్ద నుండి పారిపొమ్మని చెప్పాడు. తిరిగి తాము కలుసుకొనలేమని దావీదు యోనాతాను ఎంతగానో దుః ఖించారు. వారు ఎన్నటికి తాము స్నేహితులముగా ఉంటాము అని ప్రమాణం చేశారు. ఎంతో దుఃఖముతో వీడ్కోలు తీసుకున్నారు.
సందేశము
సౌలు ఈర్ష ద్వేషం కలిగి దావీదు ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు మనము చూసాము. దావీదు కు మంచి పేరు వచ్చినందువలన, అందరూ తన కంటే ఎక్కువగా అతనిని పొగిడినందువలన సౌలు అలా ప్రవర్తించాడు. సౌలు నుండి దావీదు దేవుని సహాయముతో తప్పించుకొనగలిగాడు.
యోనాతాను దావీదుకు ఎంత మంచి స్నేహితుడు! యోనాతాను దావీదుకు ఎంతగానో సహాయపడుతూ, తప్పించుకొనుటకు ఆలోచన చెప్పాడు. మీకాలు కూడా దావీదు తన తండ్రి చేతిలో మరణించకుండా తప్పించింది.
అన్వయింపు
మనకున్న మంచి స్నేహితుల విషయములో దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెప్పాలి. సామెతలు (17:17). మన జీవితములోని బాధను సంతోషాన్ని ఎవరితో చెప్పగలమో వారే మంచి స్నేహితులు. మనకు ఎదురయ్యే ప్రతి సమస్యలో మనతో ఉంటూ ధైర్యం చెబుతూ సలహాలు ఇస్తూ తోడుగా ఉండే వారే మన నిజమైన స్నేహితులు. మనలను అర్థం చేసుకుని మన కోసము వారు ఎప్పుడూ ప్రార్ధిస్తుంటారు. మన కోసం త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు.
కాని, అందరి కంటే మనకు మంచి స్నేహితుడు ప్రభువైన యేసు. ఆయన అందరి కంటె మనతో సన్నిహితంగా సమీపంగా ఉండగలడు. యేసుతో స్నేహం చేయాలంటే ముందు ఆయనను మన రక్షకునిగా అంగీకరించాలి. మన పాపములను క్షమించి తన కుటుంబములో చేర్చుకొనుమని ప్రార్థించాలి. మనము ఆయన పిల్లలమైన తరువాత, మన స్నేహితులతో మాట్లాడినట్లుగా ఆయనతో మాట్లాడగలము. మనము ఆయనను చూడకపోయినా, ఆయన మన మాటలు వింటున్నాడు అని, ఏ సమయంలోనైనా మన ప్రార్ధనను ఆలకిస్తాడు అని గ్రహించాలి. క్రైస్తవులు కూడా తమ కష్టాలను ఇతరులతో పంచుకొని, ఒకరికొకరు మరొకరు ప్రార్థించాలి. తన యందు విశ్వాసం ఉంచిన వారిని ప్రభువు ఎన్నడూ వదిలిపెట్టను అనే వాగ్దానము చేశాడు. మరి ప్రభువు వాగ్దానాలను మనము నమ్ముతున్నామా, లేదా పరీక్షించుకోవాలి.
కంఠతవాక్యము
సహోదరుని కంటెను ఎక్కువగా హత్తి యుండు స్నేహితుడు కలడు (సామెతలు 18 : 24)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

