దావీదు యొక్క భయంకరమైన పాపము
2వ సమూయేలు 11,12:1-24
ఉద్దేశము
ప్రతి ఒక్కరికి క్షమాపణ అవసరము అని బోధించుట
ముఖ్యాంశము
ఎప్పుడూ పొరపాటు చేయనివారు ఎవరైనా మీకు తెలుసా? చాలా మంచివారుగా కనిపించేవారు కూడా ఎప్పుడో ఏదో ఒక పొరపాటు చేసి ఉంటారు. ప్రభువైన యేసు మాత్రమే ఎటువంటి పొరపాటు, పాపము లేని వాడుగా భూమి మీద నివసించాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మానవుని హృదయము మోసకరమైనది మరియు ఘోరమైన వ్యాధి కలది గనుక, ఎంత ప్రయత్నించినా పాపము చేయకుండా ఉండలేరు. ఎంతో మంచివాడైనప్పటికి పాపములో పడిపోయిన వ్యక్తిని గురించి ఈరోజు తెలుసుకుందాము.
గతవారము
కుంటి కాళ్లు గల యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు పట్ల దావీదు ఎంతో దయను ప్రేమను చూపించినట్లు మనము తెలుసుకున్నాము. యోనాతాను కుటుంబమునకు కీడు చేయక దయ చూపుతాను అని తాను ఇచ్చిన మాటను బట్టి మెఫీబోషెతును దావీదు తన బల్ల దగ్గర భోజనము చేయువానిగా చేర్చుకున్నాడు.
దావీదు ఎంతో దయ కలిగినవాడు. దేవుని హృదయానుసారముగా నడిచేవాడు అని బైబిల్ లో వ్రాయబడింది. దావీదు ప్రభువును హృదయపూర్వకముగా ప్రేమించేవాడు. కానీ, ఒకరోజు గొప్ప పాపము చేశాడు. దేవుని ప్రేమించే వారు అటువంటి పాపము చేయగలరా అనే సందేహము మనకు కలుగుతుంది మనము కూడా కొన్నిసార్లు బైబిల్ చదవడం మానివేసి ప్రార్థన చేయకపోతే దేవునికి దూరమై పోతాము. అలా దేవునికి దూరమైనప్పుడు మనకు ఇష్టమైన విధముగా జీవించడానికి ప్రయత్నిస్తుంటాము. దేవునికి సమీపముగా జీవించక పోవడం వలన మంచి పనులు చేయడానికి మనకు ఇష్టము లేకుండా పోతుంది. దావీదు కూడా కొంత కాలము దేవుని మరిచిపోయి ఘోరమైన పాపములో పడిపోయిన విషయం ఈరోజు చూద్దాము.
దావీదు గర్వము, స్వార్థము
దావీదు గురించి మనము ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. సౌలు దావీదును తరమడం, చంపడానికి ప్రయత్నించడం మనకు తెలుసు. సౌలును గూర్చి దావీదు ఎంతగానో భయపడి అరణ్యములో, కొండలలో తిరుగుతుండేవాడు. దావీదు తన కష్ట పరిస్థితులలో దేవునికి ప్రార్థించేవాడు. దేవుడు సౌలు చేతిలో నుండి దావీదును తప్పించి క్షేమంగా కాపాడాడు. సౌలు మరణించిన తరువాత దావీదు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు. ఇప్పుడు రాజు గనుక దావీదుకు సమస్తమైన అధికారము ఉంది. కష్టములలో ఉన్నప్పటి వలె దేవుని సహాయము కొరకు ప్రార్థించకుండా తన అధికారము ఉపయోగించి అన్ని పనులు జరిగించడం నేర్చుకొని ఉండవచ్చు. ఆ సమయములోనే దావీదు పాపము చేశాడు. ఇశ్రాయేలు వారు యుద్ధమునకు బయలుదేరే సమయంలో దావీదు రాజుగా ముందు నిలిచి సైన్యమును నడిపించుటకు బదులు తన సైన్యాధిపతి అయిన యోవాబును పంపించాడు. తాను మాత్రము రాజనగరులోనే నిలిచిపోయాడు. దావీదు ఎటువంటి పని లేకుండా తీరికగా ఉన్నాడు. అప్పుడే దావీదు పాపమునకు లోబడి పోయాడు. ఒక పొరపాటు ఎన్ని తప్పులు చేయడానికి మనలను నడిపిస్తుందో దావీదు జీవితం ద్వారా నేర్చుకుందాము.
దావీదు పరాయి వ్యక్తి భార్యను వివాహమాడుట
ఒకరోజు సాయంకాలము దావీదు తన భవనము మీద మిద్దెపై తిరుగుచు ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ మిద్దె మీద తిరుగుచున్న సమయములో స్నానము చేస్తున్న ఒక అందమైన స్త్రీ దావీదుకు కనిపించింది. దావీదు ఆమె అందము చూచి ఎంతో ఆశతో ఆమెను వివాహము చేసుకోవాలి అనుకున్నాడు. ఆమెను గురించిన వివరాలు దావీదు తెలుసుకొనుటకు తన మనుష్యులను పంపాడు. ఆమె పేరు బత్షెబ అని, ఆమె భర్త పేరు ఊరియా అని దావీదుకు తెలిసింది. ఆమెకు వివాహమైన విషయము తెలుసుకొనిన తర్వాత దావీదు ఆమెను గురించిన ఆలోచనను వదిలి పెట్టవలసింది. కానీ దావీదు దేవుని ఆజ్ఞలను మరచి ప్రవర్తించటం మనము చూడవచ్చు. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో - " వ్యభిచరించకూడదు" అని స్పష్టంగా ఉంది. వివాహమైన స్త్రీని తిరిగి వివాహము చేసుకోవాలి అని కోరుకోవడం పాపం. దేవుడు భార్యాభర్తలుగా ఏర్పరచిన వారిని ఎవరూ విడదీయ కూడదు అని దేవుని ఆజ్ఞ. కాని దావీదు బత్షెబకు వివాహమైనది అని తెలిసినప్పటికీ మరలా ఆమెను వివాహము చేసుకోవాలి అని అనుకున్నాడు. ఎవరికీ తెలియకుండా బత్షెబను ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు.
దావీదు ఊరియాను చంపించుట
ఊరియాను చంపితే అతని భార్య అయిన బత్షెబను తెచ్చి వివాహము చేసుకొనుట సులభము అని దావీదు మనసులో చెడు ఆలోచన కలిగింది. యోవాబు తో పాటు యుద్ధభూమిలో ఉన్న ఊరియాను చంపుటకు దావీదు ఒక చెడు ఆలోచన చేశాడు. ఊరియాను సైన్యము మొదటి వరుసలో ఉంచి, శత్రువుల చేతిలో చనిపోవునట్లు చేయుమని యోవాబుకు ఉత్తరం రాసి పంపించాడు. యోవాబు రాజు అయిన దావీదు ఆజ్ఞకు లోబడి ఊరియాను సైన్యములో ప్రమాదకరమైన స్థానములో ఉంచాడు. ఊరియా బాణముల చేత గాయపడి మరణించాడు. ఊరియా మరణ వార్త దావీదుకు అందింది. దావీదు బత్షెబ దగ్గరకు మనుష్యులను పంపి ఆమెను తన నగరకు రప్పించుకొని ఆమెను వివాహము చేసుకున్నాడు.
దేవుడు కోపపడుట
దావీదు తాను చేసిన దుష్కార్యము ఎవరికీ తెలియదు అని ఎంతో ధైర్యంతో ఉన్నాడు. కాని దావీదు క్రియలన్నిటిని ఎవరు చూస్తున్నారు? అవును దేవుడు సమస్తాన్ని చూసాడు. దావీదు చేసిన పనుల వలన దేవుడు ఎంతో ఆగ్రహంతో నిండి, తన ప్రవక్తయైన దావీదు దగ్గరకు పంపించాడు. దావీదు తన పాపమును గ్రహించునట్లు ఒక ఉపమానము చెప్పమని నాతానుకు చెప్పాడు.
నాతాను దావీదు దగ్గరకు వచ్చి ఈ ఉపమానాన్ని చెప్పాడు - "ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలును, గొడ్లును కలిగియుండెను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కునిన ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమియు లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను.
అట్లుండగా మార్గస్తుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్తునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తము చేసెను" దావీదు ఆ మాటలు విని ఆ ఐశ్వర్యవంతుని మీద ఎంతో కోపం తెచ్చుకున్నాడు. అది నాతాను తనకు బుద్ధి వచ్చుటకు చెప్పాడు అని అర్థము చేసుకొనలేదు. దావీదు - " ప్రభువు జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలను ఇయ్యవలెను" అని నాతానుతో చెప్పాడు.
అప్పుడు నాతాను దావీదును చూచి - "ఆ మనుష్యుడవు నీవే" అని చెప్పాడు. ప్రభువే దావీదునకు ఆ ఉపమానమును చెప్పుటకు తనను పంపించాడు అని నాతాను దావీదుకు తెలిపాడు. దావీదు చేసిన పాపమును గురించి ప్రభువు నాతను ద్వారా ఈ విధముగా హెచ్చరించాడు - "ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనిన యెడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి యుందును. హిత్తీయుడగు ఊరియాను చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకుని యున్నావు. కనుక నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. "
దావీదు పశ్చాతాప పడుట
వెంటనే దావీదు - "నేను పాపము చేసితిని" అని నాతానుతో చెప్పాడు. దావీదు హృదయము ఎంతగానో నొచ్చుకుంది. అంత ఘోరమైన దుష్కార్యము తాను ఎలా చేయగలిగాడు అని దావీదు బాధపడ్డాడు. దావీదు నిజముగా పశ్చాతాప పడుట నాతాను చూచి - " నీవు చావకుండునట్లు ప్రభువు నీ పాపమును పరిహరించెను" అని చెప్పాడు. దావీదు యదార్థ హృదయముతో పశ్చాత్తాప పడ్డాడు కనుక ప్రభువు క్షమించాడు.
దావీదు తాను చేసిన దుష్కార్యము గురించి ఎంతో దుఃఖంతో ప్రార్ధించాడు. తన దుఃఖాన్ని పశ్చాత్తాపాన్ని ఒక పాట రూపంలో 51వ కీర్తన రచించాడు. "నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము" అని దేవుని ప్రాధేయపడ్డాడు. దావీదును క్షమించిన ప్రభువు ఎంత కనికరము గలవాడు! దేవుడు తనను క్షమించి నందుకు దావీదు ఎంతో సంతోషించి ఉంటాడు.
సందేశము
దావీదు చేసిన భయంకరమైన పాపమును గురించి ఈ రోజు తెలుసుకున్నాము. వేరొక వ్యక్తి భార్యను వివాహము చేసుకొనుటకు అతనిని చంపించాడు. దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యపెట్టి తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకున్నాడు. సైన్యముతో కలిసి యుద్ధమునకు పోకుండా ఖాళీగా రాజనగరిలో తిరుగుట దావీదు పొరపాటు. బత్షెబకు వివాహమైన విషయము తెలిసి కూడా ఆమెను భార్యగా చేసుకోవాలి అనుకోవడం మరొక తప్పు. తనకు శోధన ఎదురైన సమయములో దేవుని సహాయముతో దాని నుండి తప్పించుకొనవలసినది, బత్షెబను వివాహమాడుటకు అమాయకుడైన ఊరియాను చంపించడం ఎంత ఘోరమైన పాపం! "నీ పొరుగువాని దేదియు ఆశింపకూడదు" అనే పదవ ఆజ్ఞతో పాటు "వ్యభిచరింపకూడదు" అనే ఆరవ ఆజ్ఞను కూడా అతిక్రమించాడు. తాను చేస్తున్న పాపములు ఎవరూ చూడటం లేదు అని దావీదు తలంచాడు. కానీ దేవుని దృష్టికి మరుగైనది ఏదియు లేదు అని మరిచిపోయాడు. దేవుడు దావీదు యెడల కోపముతో నాతానును అతని దగ్గరకు పంపగా దావీదు నా తాను మాటలు విని నిజముగా పశ్చాత్తాప పడ్డాడు. అప్పుడు ప్రభువు దావీదును క్షమించాడు. పాపము చేసి పశ్చాతాప పడిన వారిని దేవుడు క్షమించినట్లు మనము బైబిల్ లో చూడగలము.
అన్వయింపు
మీరెప్పుడైనా ఘోరమైన పొరపాటు చేశారా? వేరే వారి వస్తువులను తీసుకుని ఉండవచ్చు, లేదా మీ స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు మీకు చాలా నచ్చిన ఆట వస్తువును వారికి చెప్పకుండా తీసుకొని దాచి పెట్టుకోవచ్చు. దొంగతనము చేయడం కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే. దానిని కప్పిపుచ్చుకోవడానికి, ఎవరికీ తెలియకుండా ఉండడానికి అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. అది కూడా దేవుని ఆజ్ఞను పాటించకపోవడమే. దావీదు విషయములో జరిగినట్లుగానే ఎవరైనా ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో తప్పులు చేయవలసి వస్తుంది. మనము చేస్తున్న తప్పులు రహస్యంగా ఉన్నాయి అనుకుంటాము కానీ దేవుడు మనము చేసే ప్రతి పనిని చూస్తున్నాడు అనే విషయం మరిచిపోకూడదు.
కానీ దేవుడు మనకు ఒక మంచి వార్తను తెలియజేశాడు. పాపము విషయములో మనము నిజముగా పశ్చాతాప పడినప్పుడు దేవుడు మనలను క్షమించడానికి ఇష్టపడతాడు. దేవుడు పురుషులు, స్త్రీలు, బాలురు, బాలికలు అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుక వారి పాప క్షమాపణ కొరకు ప్రభువైన యేసు సిలువపై మరణించుటకు ఈ లోకములోనికి పంపించాడు. మనము పొందవలసిన శిక్షను దేవుడు ప్రభువైన యేసు సిలువలో పొందునట్లు చేశాడు. అందువలన యేసు నందు విశ్వాసముంచిన ఎడల పాపులమైన మనము క్షమాపణ పొందుటకు అవకాశం కలుగుతుంది. మన పాపములు నల్లని మరకల వలె ఉన్నప్పటికి, హిమము కంటే తెల్లగా ఉండునట్లు పవిత్ర పరచుమని దావీదు వలె ప్రార్థించాలి. దేవుడు మనలను తప్పక క్షమించి నీతిమంతులుగా తీరుస్తాడు.
కంఠతవాక్యము
హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము (కీర్తన 51:7)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

