ఆదికాండము 18:16-23; లూకా 17-28-32; ఆదికాండము 19:1-30; రోమా 1:18-32; 2పేతురు 2:6-9, న్యాయాధిపతులు 7

ఉద్దేశము/లక్ష్యము
పాపము దేవునికి కోపము కలిగిస్తుంది అని బోధించుట. దుష్ట ప్రవర్తనకు ఖచ్చితంగా దేవుని తీర్పు ఉంటుంది అని సొదొమ గొమొర్రా పట్టణముల నాశనం ద్వారా తెలియచేయుట.

ముఖ్యాంశము
హత్య - కొన్ని రోజుల క్రిందట ఇద్దరు యౌవనస్థులు ఒక చిన్న పిల్లవాడిని హత్య చేసి చంపారు. వారికి కోర్టువారు శిక్ష విధించి జైలుకు పంపించారు. యౌవనస్థులు అని కోర్టు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు ప్రతి పాపము పట్ల ఆగ్రహము కలిగి ఉంటాడు అని,పాపము చేసినవారికి తప్పకుండా శిక్షఉంటుంది అని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. పాపము విస్తరించిన నోవహు దినములలో జలప్రళయము ద్వారా దేవుడు భూమిపై నున్న సమస్తమును నాశనం చేశాడు అని మనము నేర్చుకున్నాము. ఘోరమైన పాపముతో నిండిన సొదొమ గొమొర్రా పట్టణములను దేవుడు ఏ విధముగా నాశనం చేశాడు అని మనము ఈ రోజు తెలుసుకుందాము.

గతవారము
అబ్రాహాము దగ్గరకు ముగ్గురు అతిథులు వచ్చినట్లు మనము చూశాము. ఆ అతిథులు ఎవరు? అబ్రాహాముతో వారు ఏమి మాట్లాడారు? అప్పుడు శారా ఎక్కడ ఉంది? వారు చెప్పిన మాటలు గురించి శారా ఏమి అనుకుంది? వారు అబ్రాహాముతో ఇంకా ఏమి మాట్లాడారు? సొదొమ వారి పాపము బహు భారముగా ఉన్నందువలన ఆ పట్టణాన్నినాశనం చేయబోతున్నాను అని ప్రభువు అబ్రాహముతో చెప్పాడు. తన సహోదరుని కుమారుడైన లోతు అక్కడ నివసిస్తున్నందువలన అబ్రాహాము ఆ మాట విని భయపడ్డాడు. ఆ పట్టణములను నాశనము చేయుటకు ముందు దేవుడు లోతును ఎలా తప్పించాడో ఈరోజు చూద్దాము.

సొదొమ పట్టణములో లోతు
అబ్రాహాము,లోతు విస్తారమైన పశువులు, దాస జనం కలిగినవారు అయినందున వారు నివసిస్తున్న ప్రదేశము వారికి సరిపోలేదు. అందువలన వారు వేరై పోవాలని నిర్ణయించుకున్నారు. లోతు తన కన్నులకు మంచిగా, సారవంతమైనదిగా కనిపిస్తున్న యొర్దాను నది ప్రాంతమును తనకొరకు ఎన్నుకున్నాడు. అక్కడ సమృద్ధిగా పంటలు పండుతాయి కనుక తాను ఎక్కువ శ్రమ పడనక్కరలేదు అని లోతు తలంచాడు. సొదొమ గొమొర్రా పట్టణముల పాపము బహు ఘోరమైనది అని బైబిల్ లో వ్రాయబడింది. లోతు మొదట సొదొమకు దగ్గరలో తన గుడారము వేసుకున్నాడు. కాని తరువాత సొదొమ పట్టణస్థులతో కలిసి పట్టణం లోపల ఒక ఇంటిలో నివసించ సాగాడు (ఆది 19:2). ఆ పట్టణస్థులు ఎంతమాత్రము దేవుని భయము లేని దుష్ట మనస్సు కలిగినవారు. ఒకవేళ లోతు భార్య పట్టణం లోపల నివసించుటకు ఇష్టపడి ఉండవచ్చు. లోక సంబంధమైన ఆస్తులు, వస్తువుల పట్ల ఆమె ఎంతో ఇష్టం కలిగి ఉండవచ్చు (లూకా 17:31,32 ). లోతు కొంతకాలం మాత్రమే ఆ పట్టణములో నివసించాలి అని అనుకుని ఉండవచ్చు(ఆది 19:9), కాని లోతు తన కుటుంబంతో కలిసి అక్కడే స్థిరపడ్డాడు.

తరువాత లోతు ఆ పట్టణపు వారితో కలిసిపోయి తీర్పు తీరుస్తూ ఉండేవాడు (ఆది 19:1). ఆ దినములలో తీర్పు తీర్చే వారు పట్టణపు ద్వారము దగ్గర కూర్చుని ఉండేవారు. లోతు వారితో కలిసి ఉండటం ద్వారా అక్కడి ప్రజలను ప్రభావితం చేయవచ్చు అని అనుకుని ఉండవచ్చు.

దేవుడు సృష్టిని ఎంతో అద్భుతమైన, పరిపూర్ణమైన ప్రణాళికతో చేశాడు. దేవుడు తన స్వరూపములో, తన పోలిక చొప్పున స్త్రీనిగాను పురుషుని గాను మానవులను సృజించాడు.

వారు పెద్దవారయిన తరువాత వివాహము చేసుకొనులాగున దేవుడు నియమించాడు. కాని సొదొమ గొమొర్రా పట్టణస్థులు దేవుని లక్ష్యపెట్టని వారుగా ఉండేవారు. స్త్రీలు స్త్రీలతో పురుషులు పురుషులతో స్నేహం చేసేవారు. వీరి ప్రవర్తన దేవునికి ఎంతో ఆగ్రహాన్ని కలిగించింది. అందువలననే ఆ పట్టణములను నాశనం చేయాలని అనుకున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఎంతమాత్రము పాపమును సహించలేడు. వారి పాపములను బట్టి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములను ఏ విధముగా నాశనము చేయబోతున్నాడో తెలుసుకుందాము.

లోతు మనస్సు నొచ్చుకొనుట
లోతు సొదొమలో సంతోషంగా ఉన్నాడా? లేదు - సొదొమ పట్టణస్థుల అక్రమ క్రియలను బట్టి, వారికి దేవుని భయము లేకపోవుటను బట్టి లోతు ఎంతగానో బాధపడేవాడు (2 పేతురు 2:7). వారి అక్రమ క్రియలను బట్టి ప్రతిదినము తన మనస్సును నొప్పించుకొనుచు ఉండేవాడు. వారికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నించిన లోతును వారు ఎగతాళి చేసి ఉండవచ్చు. వారు తమ దుష్ట ప్రవర్తనతో చెడు మార్గాలలో నడవడానికి ఇష్టపడేవారు.

వారు దుష్టత్వము, పాపముతో పాటు సోమరితనము కూడా కలిగి ఉండవచ్చు. వారి భూములు సారవంతమైనవి గనుక కష్టపడవలసిన అవసరం వారికి ఉండేది కాదు. వారు పేదలకు సహాయము చేయుటకు బదులుగా తినుచు త్రాగుచూ ఉండేవారు. వారికి కలిగిన ఆహార సమృద్ధి, గర్వము, నిర్వి చారమైన సుఖ స్థితి దేవునికి ఎంతో ఆగ్రహం కలిగించింది (యెహెజ్కేలు 16:49,50). వీటన్నింటిని చూచిన దేవుడు వారిని శిక్షించుటకు తీర్మానించుకున్నాడు.

వారి పాపము బహు ఘోరమైనదిగా దేవుని దృష్టికి కనిపించింది. వారు శిక్షకు పాత్రులు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయుటకు నిశ్చయించుకున్నాడు (ఆది. 18:20).

దేవదూతల సందేశము
అబ్రాహాము దగ్గరకు ముగ్గురు అతిథులు వెళ్ళినట్లు గతవారం చూశాము. ప్రభువు అబ్రాహాముతో మాట్లాడుటకు ఆగిపోయాడు, కాని ఇద్దరు దేవదూతలు సొదొమ వైపు వెళ్ళినట్లుగా బైబిల్ లో ఉంది. సాయంకాలము ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరిన సమయానికి లోతు పట్టణపు ద్వారం వద్ద కూర్చొని ఉన్నాడు. మనుష్యుల వలె కనబడినప్పటికి వారు దేవదూతలు. లోతు వారిని చూచి ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి వారితో "నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రివెళ్ల బుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును" అని చెప్పాడు (19 :1,2). అబ్రాహాము వలె లోతు కూడా అతిథులను ఆహ్వానించటానికి ఇష్టపడేవాడు. వారు పండుకొనకముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు - బాలురు వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి అక్కడికి వచ్చారు (19:4). వారు లోతు ఇంట్లో ఉన్న మనుష్యుల యెడల ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగారు. వారు లోతు మీదపడి ఇంటి తలుపులు పగులగొట్టుటకు సమీపించారు. ఆ దేవదూతలు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తీసుకుని తలుపు వేశారు. లోతు వారితో మాట్లాడుటకు ప్రయత్నించినప్పుడు వారు లోతుతో "నీవు అవతలకు పొమ్ము నీవు పరదేశిగా మాలోనికి వచ్చి తీర్పరిగా ఉండచూచుచున్నావు కాగా వారికంటె నీకు

ఎక్కువ కీడు చేసెదము" అని చెప్పారు. అప్పుడు ఆ దేవదూతలు లోతును లోపలికి తీసుకుని ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారికి కనుమబ్బు (కనిపించకపోవు ట) కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిపోయారు. దేవుడు వారినుండి లోతును తప్పించాడు.

తరువాత ఆ దేవదూతలు నీ కుటుంబమును ఈ ఊరి నుంచి వెలుపలికి తీసుకొని రమ్మని లోతుతో చెప్పారు. లోతుకు ఇద్దరు కుమార్తెలు, వారిని పెళ్లి చేసుకోబోయే ఇద్దరు అల్లుళ్ళు కూడా అక్కడ ఉన్నారు. లోతు తన అల్లుళ్లతో "లెండి ఈ చోటు విడిచి రండి. ప్రభువు ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడు" అని చెప్పాడు. అయితే లోతు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువాని వలె కనిపించాడు (19 14). తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి "లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలో నశించి పోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్ము" అని చెప్పారు. లోతు ఆలస్యము చేయగా ఆ దేవదూతలు లోతు చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొనివచ్చి ఆ ఊరినుండి బయటపడ్డారు. వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తరువాత - "నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకుము ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్ము" అని చెప్పారు.

అకస్మాత్తుగా నాశనము సంభవించుట
సొదొమ పట్టణస్థులు తినుచు త్రాగుచు కొనుచు,అమ్ముచు,నారునాటుచు,ఇండ్లు కట్టుచు మామూలుగానే ఉన్నారు (లూకా 17:28-32). కాని లోతు సొదొమ పట్టణము నుండి వెలుపలికి వచ్చిన వెంటనే ఆకాశమునుండి అగ్ని,గంధకములు వచ్చి ఆ పట్టణములను నాశనము చేశాయి. ఆ పట్టణములు, మైదానములు, అక్కడ నివసించేవారు, నేల మొలకలు అన్నీ నాశనమైపోయాయి. లోతు తన కుటుంబముతో బయటకు వస్తున్న సమయంలో అతని భార్య వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారిపోయింది. దేవుడు దూతల ద్వారా పలికిన మాటలను లోతు భార్య వినలేదు. ఆమె తమకు ఉన్న ఆస్తుల మీద ఎంతో ఆశ కలిగి ఉంది. లోతు సోయరు అనే చిన్న ఊరికి తన కుమార్తెలతో చేరుకున్నాడు, తరువాత సోయరు నుండి పోయి పర్వతమందు నివసించాడు. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి సొదొమ గొమొర్రాల వైపు చూడగా ఆ మైదానపు ప్రదేశము యావత్తు పొగ లేచుట చూశాడు. సొదొమ పట్టణం బూడిదగా మారిపోయింది, అక్కడి జనులందరూ నశించారు.

సందేశము
ఈ రోజు చాలా విచారకరమైన కథను మనము చూశాము. లోతు, అతని కుటుంబము సొదొమ నుండి బయటకు రావటానికి ఆలస్యం చేసినా దేవుడు తన కనికరాన్ని బట్టి వారు తప్పించుకొనుటకు సమయం ఇచ్చాడు. లోక సంబంధమైన ఆస్తుల పట్ల ఆశ కలిగిన వారు లోతు భార్య వలె నశించిపోతారు అని దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. లోతు భార్య తన అవిధేయతకు ప్రతిఫలం అనుభవించింది. దేవుడు పాపమును సహించలేడు అనే దానికి నిదర్శనముగా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేశాడు.

అన్వయింపు
ఈ రోజులలో దేవుడు మనుష్యులను నాశనం చేయుట మనము చూడకపోయినా ఆయన ఒక దినం అందరికీ తీర్పు తీర్చనైయున్నాడు అని బైబిల్ లో వ్రాయబడింది (రోమా 14:12). మనమందరము పాపులము. కొందరు సొదొమ గొమొర్రా పట్టణస్థులవలె పాపము చేయుటలో ఎంతో సంతోషిస్తూ వుంటారు, వారు దేవుని అపహసిస్తారు. ఈ కాలంలో కూడా అటువంటి వారు అనేకులు ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు గనుక తప్పక పాపమును శిక్షిస్తాడు, కాని మానవుల పాపము కొరకు సిలువలో మరణించునట్లు దేవుడు క్రీస్తును ఈ లోకములోనికి పంపాడు. మానవులకు బదులుగా యేసు సిలువలోఆ పాపశిక్షను అనుభవించాడు. ఎటువంటి పాపి అయినా యేసు దగ్గరకు వచ్చి, పాపములను ఒప్పుకొని క్షమాపణ కోరినప్పుడు వారు క్షమించ బడతారు. తరువాత వారు పరలోకమునకు వెళ్ళగలుగుతారు. ఆ విధముగా చేయని వారు నరకానికి వెళ్లక తప్పదు (మత్తయి 10:15, 2 పేతురు 2:8)

అమెరికా దేశంలోని టెక్సస్ నగరములో ఒక జైలు ఉండేది. మరణశిక్ష విధించబడిన వారు మాత్రమే ఆ జైలులో ఉండేవారు. ఆ జైలులోని వారు ప్రభుత్వం జారీచేసిన ఆజ్ఞ ప్రకారము శిక్షను అనుభవించేవారు. హత్యలు చేసిన వారే అక్కడ ఉండేవారు. అందరూ భయముతో మరణంకోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఎంత బాధాకరం! ఆ జైలులోని ఒక స్త్రీ బైబిల్ చదవడం మొదలు పెట్టింది. ప్రభువైన యేసును విశ్వసిస్తే తన పాపాలు క్షమించ బడతాయి అని ఆ స్త్రీ గ్రహించింది. యేసుని తన రక్షకునిగా అంగీకరించింది. ఆమెను మరణమునుండి తప్పించటానికి జైలు అధికారులు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు.

ఆమె మరణ దినము సమీపించింది. ఆమె ఎంతో సంతోషంగా మరణించింది. తాను తప్పక పరలోకములో దేవునితో కలిసిఉంటాను అనే నిరీక్షణ ఆమెకు ఎంతో సంతోషాన్ని, ఆదరణను కలిగించింది.

ఎటువంటి పాపులనైనా, క్రూరులనైనా ప్రభువైన యేసు క్షమిస్తాడు అనే వార్త ఎంతో అద్భుతమైనది. మనము చేయవలసినది విశ్వాసముతో యేసు దగ్గరకు వెళ్లి పాపములు క్షమించుమని ప్రార్థించటం మాత్రమే. అప్పుడు ఆయన మన పాపాలను తప్పక క్షమించి తన బిడ్డలుగా చేసుకుంటాడు.

కంఠతవాక్యము
న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు (కీర్తన 7:11).

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.