అబ్షాలోము దావీదు పై తిరగబడుట
2వ సమూయేలు 14:25; 19:30; కీర్తన 3
ఉద్దేశము
దేవుడు మనలో ఏదైనా ప్రత్యేకత ఉంచినప్పుడు దానినిబట్టి గర్వించక కృతజ్ఞత కలిగి దేవుని కొరకు ఆ ప్రత్యేకతను ఉపయోగించాలి అని బోధించుట.
ముఖ్యాంశము
మీ తరగతిలో ఎవరైనా మిగిలిన వారి కంటె వేరుగా ప్రవర్తిస్తుంటారా? కలెక్టర్ పిల్లలు తమ తండ్రి అధికారాన్ని బట్టి తాము ఇతరుల కంటె ఎంతో ముఖ్యమైన వారమని, గొప్పవారమని అనుకొనవచ్చు. క్లాసులో అందరూ తమను చాలా ప్రత్యేకంగా చూడాలి అని అనుకుంటారు. లేదా బాగా డబ్బు ఉన్నా కూడా తమను అందరూ గౌరవించాలి అని ఆశిస్తారు. కొందరు వారిని అలాగే ప్రత్యేకంగా చూస్తుంటారు. కాని వారిని చూస్తే కొందరికి చిరాకు, కోపము కలుగుతుంది.
ఒకవేళ వారి తండ్రికి ఉద్యోగం పోయినా, డబ్బు అంతా నష్టపోయినా ఎలా ఉంటుంది? ఏ విషయంలో గర్వంగా ఉన్నారో, ప్రత్యేకంగా ఉన్నారో అవే దూరమై పోయినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించండి! " నాశనమునకు ముందు గర్వము నడుచును" అని బైబిల్ లో వ్రాయబడి ఉంది. ఈరోజు తనలో ఉన్న ప్రత్యేకతను బట్టి గర్వించి అందరూ తనను గొప్పగా చూడాలని ఆశ పడిన ఒక వ్యక్తిని గురించి తెలుసుకుందాము. కాని అతని ఆశలు అన్నీ చివరకు ప్రయోజనము లేనివిగా మిగిలిపోయాయి.
నేపధ్యము
దావీదు రాజును గురించి మనము కొన్ని వారాలుగా ఎన్నో విషయాలు చూస్తున్నాము. దేవునికి కోపం తెప్పించిన దావీదు పాపమును గూర్చి గతవారము తెలుసుకున్నాము. బత్షెబ అనే వివాహమైన స్త్రీని మరలా వివాహము చేసుకొనుటకు ఆమె భర్త అయిన ఊరియాను దావీదు చంపించాడు. దేవుని ఆజ్ఞలను దావీదు అతిక్రమించి పాపము చేసాడు. తాను చేసిన తప్పును తెలుసుకొని దావీదు పశ్చాత్తాపముతో దేవుని క్షమాపణ కొరకు ప్రార్థించాడు. ప్రభువు దావీదును క్షమించాడు.
సౌందర్యవంతుడైన అబ్షాలోము (2వ సమూయేలు 14: 25,26)
దావీదుకు ఎంతోమంది కుమారులు ఉన్నారు, వారిలో అబ్షాలోము అనే కుమారుని గురించి ఈరోజు చూద్దాము. అబ్షాలోము చాలా సౌందర్యం గల అందమైన యౌవనస్థుడు. ప్రపంచపు అందాల పోటీ గనుక ఏర్పాటు చేస్తే అబ్షాలోము అందులో మొదటి స్థానము గెలుచుకుంటాడు. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవారు ఎవరూ లేరు. అరికాలు మొదలుకొని తలవరకు అతని యందు ఎటువంటి లోపం లేకుండెను. అబ్షాలోము ఎంతో అందంగా కనిపించేవాడు అంతేకాక అతని తల వెండ్రుకలు ఎంతో పొడవుగా, దట్టంగా ఉండేవి. అతడు ప్రతి సంవత్సరము తన జుట్టును కత్తిరించుకొనవలసి వచ్చేది. అబ్షాలోము తన అందము, వెండ్రుకలు చూచుకొని ఎంతో గర్వపడుతూ ఉండి ఉండవచ్చు. కాని వాటి వలన ఎటువంటి ఉపయోగం లేదు అని అబ్షాలోముకు అర్థం కాలేదు.
ప్రజలందరూ అబ్షాలోము అందాన్ని ఎంతగానో పొగిడేవారు. ఇశ్రాయేలు వారిలో అంత అందమైన వారు ఎవరూ లేరు అని అందరూ చెప్పుకునేవారు. ఈ మాటలు అబ్షాలోమును ఎంతో గర్వముతో నింపాయి. అబ్షాలోము ఎంతో అందంగా బయటకు కనిపిస్తున్నప్పటికి, అతని హృదయము అంత అందమైనది కాదు అనే విషయము మనము చూడబోతున్నాము.
అబ్షాలోము పశ్చాతాప పడినట్లు నటించుట
అబ్షాలోము తన సహోదరుడైన అమ్నోను చేసిన చెడు పనికి కోపంతో నిండినవాడై అతనిని చంపాడు. ఆ విషయము తెలుసుకున్న దావీదు అబ్షాలోమును పట్టుకొనవలనని ప్రయత్నించగా, అతడు పారిపోయి వేరొక దేశమందు నివసించ సాగాడు. కొన్ని రోజుల తరువాత దావీదుకు అబ్షాలోమును చూడవలననే కోరిక కలిగింది. దావీదు సైన్యాధిపతి అయిన యోవాబు అబ్షాలోమును తిరిగి రప్పించుటకు దావీదును ఒప్పించాడు. అబ్షాలోము తిరిగి యెరూషలేమునకు వచ్చాడు. కాని రెండు సంవత్సరములు దావీదును చూచుటకు అనుమతి దొరకలేదు. రాజును చూడవలెననే తన కోరికను అబ్షాలోము తెలియచేయగా దావీదు అంగీకరించాడు. అప్పుడు అబ్షాలోము రాజు దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేయగా దావీదు అతనిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అమ్నోనును చంపినందుకు పశ్చాతాప పడుచున్నాను అనే భావము కలిగించుటకు అబ్షాలోము సాష్టాంగ నమస్కారము చేశాడు, కానీ అతని హృదయములో ఎటువంటి పశ్చాత్తాపము లేదు. అబ్షాలోము నిజముగా మారిపోయాడు అని నమ్మిన దావీదు అతనిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టాడు. అబ్షాలోమును పిలిపించుకొని దావీదు పెద్ద పొరపాటు చేశాడు. అబ్షాలోము హంతకుడు అతడు నిజముగా మారలేదు గనుక దావీదు ప్రేమను పొందుటకు ఏమాత్రం పాత్రుడు కాదు.
అబ్షాలోము ప్రజల అభిమానము పొందుట
అబ్షాలోము హృదయములో ఒక చెడు ఆలోచన కలిగింది. తన తండ్రి అయిన దావీదును చంపిన యెడల తాను ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండవచ్చు అని ఆలోచించాడు. తన యొక్క అందముతో ప్రజలను ఆకర్షించి వారి అభిమానము పొందాలి అనుకున్నాడు. వారి అభిమానము పొందినట్లయితే ఎంతో సులభముగా దావీదుకు బదులుగా రాజుగా ఉండవచ్చు అని తలంచాడు. ఎంత చెడు ఆలోచన!
రాజు అగుటకు అబ్షాలోము రెండు పనులు మొదలు పెట్టాడు. ఒక రథమును, గుర్రములను సిద్ధపరచి తన ఎదుట పరిగెత్తుటకు 50 మంది మనుష్యులను ఏర్పరచుకున్నాడు. అది పెద్ద ఊరేగింపుగా ఉండేది గనుక ప్రజలందరు ఎంతో సౌందర్యవంతుడైన అబ్షాలోమును రథముపై చూచి సంతోషించేవారు. అబ్షాలోమును చూచి కేకలు వేసేవారు. రెండవదిగా ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒకవైపున నిలిచి, రాజు చేత తీర్పు పొందుటకు వ్యాజ్యమాడువారు వచ్చినప్పుడు వారిని పిలిచేవాడు. వారు ఎక్కడ నుండి వచ్చారు తెలుసుకొని విచారించేవాడు. వారు సమాధానము చెప్పిన తర్వాత వారితో - " నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దాని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకడును లేడు. నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు అప్పుడు రాజ్యము లోని వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదును" అని చెప్పేవాడు. ఎవరైనా తనకు నమస్కారము చేయుటకు దగ్గరకు వచ్చినప్పుడు చేయి చాపి ముద్దు పెట్టుకునే వాడు. ఈ విధముగా
ఇశ్రాయేలీయులందరినీ అబ్షాలోము తన వైపు త్రిప్పుకున్నాడు.
ఈ విధముగా రెండు సంవత్సరములు గడిచిన తర్వాత తాను రాజు అగుటకు సమయము వచ్చింది అని అబ్షాలోము తలంచాడు. దావీదు దగ్గరకు వచ్చి హెబ్రోనుకు వెళ్లి తనకు గల మ్రొక్కుబడి తీర్చుకొని వస్తాను అని అబద్ధం చెప్పాడు. అబ్షాలోము మోసము దావీదు గ్రహించలేదు. తన వెంట రెండు వందల మంది ఏమీ తెలియని వారిని విందు పేరుతో తీసుకుని వెళ్ళాడు. ఇశ్రాయేలు గోత్రములన్నిటి వద్దకు వేగుల వారిని పంపి జనులను పిలిపించాడు. అప్పుడు అబ్షాలోము ఇశ్రాయేలీయులతో - " మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడు" అని కేకలు వేయమని చెప్పగా వారు ఆ విధముగానే చేశారు. అబ్షాలోమును రాజుగా ప్రకటించారు.
దావీదు తప్పించుకొని పారిపోవుట
అబ్షాలోము చేసిన మోసము యెరూషలేములో ఉన్న దావీదునకు తెలిసింది. అబ్షాలోము చేసిన మోసమునకు దావీదు దిగ్భ్రాంతి చెందాడు. దావీదు తన సేవకులతో - "అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము మనము పారిపోదము రండి" అని చెప్పగా వారు సంతోషముతో ఒప్పుకున్నారు. దావీదు ముందు నడువగా అతని సేవకులు దావీదును వెంబడించారు. వారు కిద్రోను వాగు దాటి, తలలు కప్పుకొని పాదరక్షలు లేకుండా ఒలీవ చెట్ల కొండను ఎక్కారు. తాము యెరూషలేము తిరిగి రాగలమా లేదా అని బాధతో వారు ప్రయాణం చేయసాగారు. దావీదు ఎంతో దుఃఖముతో బాధతో ఉన్నప్పటికీ ప్రభువు నందు విశ్వాసముంచాడు. దేవుడు తనకు ఇష్టమైనట్లు జరిగించుటకు దావీదు ప్రార్ధన చేశాడు. తన చిత్తము కాక, దేవుని చిత్తము జరగాలి అని కోరుకున్నాడు. ఒలీవల చెట్ల కొండ ఎక్కిన తరువాత దావీదు దేవునికి ప్రార్థించి ఆయనను ఆరాధించాడు. తన పరిస్థితులన్నింటిలో ప్రభువు తనతో కూడా ఉన్నాడు అని దావీదు విశ్వసించాడు.
దావీదు తెలివి గలవాడై తన దగ్గర ఉన్న వారిలో ఇద్దరిని వేగువారుగా ఉండుటకు యెరూషలేము పంపాడు. అబ్షాలోము యొక్క ఆలోచనలను వారు తెలుసుకొని ఆ సమాచారం రహస్యముగా దావీదుకు పంపించేవారు. దావీదును అతని జనులును ఎఫ్రాయిము వనములో దిగారు. వారికి సమీపముననున్న ప్రజలు వారికి ఆహారము తెచ్చి ఇచ్చారు.
అబ్షాలోము చంపబడుట
అబ్షాలోము సైన్యమును ఏర్పరచుకొని దావీదును అతని వెంట ఉన్న వారిని తరుముటకు నిశ్చయించుకున్నాడు. దావీదును చంపిన యెడల తాను రాజు అగుట సులభము అని అబ్షాలోము ఆలోచన. అబ్షాలోము తన సైన్యముతో గాడిద మీద ఎక్కి అరణ్యములో దావీదును వెదకుటకు వెళ్లాడు. యుద్ధము మొదలైంది, అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అబ్షాలోము గాడిద మీద ఎక్కి పోవుచున్నప్పుడు అతని తల వెండ్రుకలు మస్తకి వృక్షపు కొమ్మలకు చిక్కుకున్నాయి. అబ్షాలోము ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్య వ్రేలాడుచుండగా అతడు ఎక్కిన గాడిద ముందుకు వెళ్ళిపోయింది. తల వెండ్ర కలు కొమ్మలలో చిక్కుకొని నందున తప్పించుకొనుటకు మార్గము లేకుండా పోయింది. అప్పుడు దావీదు సైన్యాధిపతి అయిన యోవాబు గాలిలో వ్రేలాడుచున్న అబ్షాలోమును బాణముతో కొట్టగా అతడు చనిపోయాడు. అప్పుడు యోవాబు బాకా ఊదింపగా యుద్ధము ఆగిపోయింది.
దావీదు దుఃఖించుట
అబ్షాలోము మరణించిన సంగతిని యోవాబు దావీదుకు తెలియజేయగా దావీదు ఎంతగానో దుఃఖించాడు. ఎన్నో దుష్కార్యములు చేసినప్పటికీ దావీదు తన కుమారుడైన అబ్షాలోముపై ఎంతో ప్రేమ గలవాడు. దావీదు ఏడ్చుచు - " నా కుమారుడా అబ్షాలోమా నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును" అని దుఃఖించాడు. తనకు,ఇశ్రాయేలు ప్రజలకు అంత కీడు చేసిన అబ్షాలోమును గురించి దావీదు అంతగా దుఃఖించడం సరైనది కాదు అని యోవాబు చెప్పగా దావీదు లేచి జనులను ధైర్యపరచాడు.
యెరుషలేములోని జనులందరు దావీదును మరల తమకు రాజుగా ఉండమని కోరగా దావీదు తిరిగి యెరూషలేమునకు రాగా అందరూ అతనిని ఆహ్వానించారు. దావీదు తిరిగి తమకు రాజు అయినందుకు వారు ఎంతో సంతోషించారు.
సందేశము
అబ్షాలోము తనకున్న అందము, పొడవైన జుట్టును బట్టి ఎంతగానో గర్వించేవాడు. ప్రజలు కూడా అతనిని ఎంతగానో పొగిడేవారు కానీ ప్రభువు దుష్టత్వము, క్రూరత్వముతో నిండిన అబ్షాలోము హృదయాన్ని చూశాడు.
సౌలు విషయములో కూడా అదే విధంగా జరిగింది. దేవుడు పై రూపమును కాక హృదయమును లక్ష పెట్టువాడు అని తెలిసింది. అబ్షాలోములోని ఈర్ష్య, అబద్ధాలు, ద్వేషము దేవుడు గ్రహించాడు. తండ్రి యెడల అబ్షాలోము అంత క్రూరముగా ప్రవర్తించుట ఎంతో భయంకరము! కానీ దావీదు ఆ పరిస్థితులలో కూడా ప్రభువుపై విశ్వాసముంచాడు.
అన్వయింపు
మనము అందముగా ఉంటే అందరూ మనలను ఇష్టపడుతుండవచ్చు, దానివలన మనము గర్వముగా ఉండవచ్చు. మనకు గర్వాన్ని కలిగించే విషయాలు ఏమి ఉంటాయి? పెద్ద ఇల్లు, కారు, డబ్బు, ఉద్యోగం ఇలా ఎన్నో ఉంటాయి. మన తెలివితేటలు కూడా మనకు గర్వాన్ని కలిగిస్తాయి. మనము మిగిలిన వారి కంటే గొప్పవారము అనే ఆలోచన మనకు గర్వాన్ని కలిగిస్తుంది.
కానీ ప్రభువు మన హృదయాలను చూస్తున్నాడు అనే విషయం మరిచిపోకూడదు. మనలో ఉన్న గర్వం ప్రభువుకు బాధను కలిగిస్తుంది. మనకున్నవన్నీ ప్రభువే మనకు ఇచ్చాడు అని మరిచిపోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన బహుమానాలను చూచి గర్వపడకూడదు. దేవుడు అనుకుంటే వాటన్నింటినీ ఎంతో సులభంగా మన దగ్గర నుండి తీసివేయగలడు. దేవుడు మనకు ఇచ్చిన వాటిని మనము దేవుని పరిచర్య కొరకు వాడగలగాలి. అది గొప్ప ఆశీర్వాదము. దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి మనము ఎంతో సంతోషించాలి గాని గర్వించి దేవునికి కోపము కలిగించకూడదు.
కంఠతవాక్యము
సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవునియందే నమ్మిక యుంచుడి (1వ తిమోతి 6:17)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

