ఆదికాండము 25:20-34; 27:1-46

ఉద్దేశము/లక్ష్యము
అబద్దాలు చెప్పడం, మోసం చేయడం కూడా దేవుని దృష్టిలో పాపాలు గానే గుర్తించబడతాయి, మరియు దేవుడు వాటిని చూస్తున్నాడు అని బోధించుట.

ముఖ్యాంశము
మీకు తెలిసిన కవల పిల్లలు ఎవరైనా ఉన్నారా? కొంతమంది కవలలు చూడటానికి ఒకే విధంగా ఉంటారు. అటువంటివారు ఇతరులను తమాషా చేస్తుంటారు. ఈరోజు మనము విభిన్నంగా, వేరుగా ఉండే కవల పిల్లల గురించి తెలుసుకుందాము.

గతవారము
ఇస్సాకు కొరకు భార్యను వెదకుటకు అబ్రాహాము ఎలియాజరును పంపుట మనము చూశాము. అబ్రాహాము తాము నివసిస్తున్నదేశ ప్రజలలో నుండి తన కుమారునికి భార్యను చూడకూడదు అనుకున్నాడు. అబ్రాహాము దాసుడైన ఎలియాజరు ఏ విధముగా దేవుని నడిపింపు కొరకు ప్రార్థించాడు? దాహానికి తాను నీరు అడిగినప్పుడుఏ స్త్రీ నీరు ఇస్తుందో ఆమె ఇస్సాకుకు కాబోయే భార్య అని ఎలియాజరు అనుకున్నాడు. ఎలియాజరుకు నీళ్లు ఇచ్చిన స్త్రీ పేరు ఏమిటి? తన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చిన వెంటనే ఎలియాజరు ఏమి చేశాడు? రిబ్కా ఎంతో చక్కనిది. ఆమె ఇస్సాకును వివాహమాడుటకు ఎలియాజరుతో కలిసి ప్రయాణానికి అంగీకరించింది.

ఇస్సాకు సంతానము కొరకు ప్రార్ధించుట

ఇస్సాకు రిబ్కాను వివాహము చేసికొనిన 20 సం.లకు కూడా వారికి సంతానము కలుగలేదు. సంతానము కోసం ఇస్సాకు పట్టుదలగా ప్రభువుకు ప్రార్థించాడు. దేవుడు తమను ఆశీర్వదించి, ఆకాశనక్షత్రములవలె సంతానమును విస్తరింప చేస్తాను అని వాగ్దానం చేశాడు. మరియు ఆ దేశమును మీ సంతానం స్వతంత్రించుకుంటుంది అనే వాగ్దానములను అబ్రాహాము ఇస్సాకులు దేవుని దగ్గర నుండి పొందారు. ప్రభువు ఇస్సాకు ప్రార్ధన ఆలకించాడు. రిబ్కా గర్భము దాల్చింది. ప్రసవానికి ముందు ఒక ప్రత్యేకమైన, అసాధారణమైన విషయాన్ని దేవుడు రిబ్కాకు చెప్పాడు. ఆమె గర్భములో కవల పిల్లలు ఉన్నారు అని దేవుడు చెప్పాడు. అంతేకాకుండా చిన్నవాడు పెద్ద వాని కంటె గొప్పవాడు అవుతాడు అని ప్రకటించాడు. దేవుని యొక్క వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఆ చిన్నవానికి చెందుతాయి అని కూడా చెప్పాడు.

ఏశావు - యాకోబు

ఇస్సాకు రిబ్కాలకు కవల పిల్లలు పుట్టారు. వారు చిన్నవారుగా ఉన్నప్పటి నుండి పూర్తిగా ప్రత్యేకంగా ఉన్నారు. పెద్దవాని పేరు ఏశావు. అతని శరీరము ఎర్రని రంగు కలిగి, ఒళ్లంతా రోమములతో నిండి ఉండేది. చిన్నవాడు యాకోబు. అతని శరీరము ఏశావు వలె కాక నున్నగా వెంట్రుకలు లేకుండా ఉండేది. పెద్దవారైన తరువాత వారి పనులు, అలవాట్లు కూడా వేరుగానే ఉండేవి. ఏశావు వేటాడుటలో నేర్పుకలిగి అరణ్యములో ఎక్కువగా తిరుగుతుండేవాడు. అతడు అడవులు, పర్వతములు, పొలాలలో తిరుగుతూ జంతువులను వేటాడుతూ ఉండేవాడు. తన విల్లు బాణములతో జంతువులను చంపి ఇంటికి తెచ్చి వండి పెట్టేవాడు. అతని తండ్రి ఇస్సాకు ఆ మాంసాహారము ఎంతో ఇష్టంగా తింటుండేవాడు. ఆ ఆహారమును బట్టి ఇస్సాకు ఏశావును ఎక్కువగా ప్రేమించేవాడు అని బైబిల్ లో వ్రాయబడింది. కాని, వారు తమకు ఇస్తున్న వాటిని బట్టి పిల్లల పట్ల పక్షపాతం చూపడం సరియైనది కాదు(ఆది.25: 28)

యాకోబు సాధు స్వభావం కలిగిన వాడు. అతడు ఇంటి దగ్గరే ఉంటూ పశువులను చూసుకునేవాడు. ఆహారానికి కావలసిన ధాన్యాన్ని కూడా ఇంటి దగ్గర పొలములోనే పండిస్తూ ఉండి ఉండవచ్చు. యాకోబు ఇంటి దగ్గరే ఉంటూ, ఇంటి పనులలో సహాయపడేవాడు. కనుక రిబ్కా ఏశావు కంటే యాకోబును ఎక్కువ ప్రేమించేది. ఇస్సాకు ఏశావును ఎక్కువగా ప్రేమిస్తే, రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించేది. వారిరువురూ చేస్తున్నది పొరపాటు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల పక్షపాతం చూపకూడదు.

ఈ కవల పిల్లలు ఇద్దరి మధ్య మరొక తేడా కూడా గమనించవచ్చు. ఏశావు, యాకోబులు జన్మించిన 15 సంవత్సరముల వరకు అబ్రాహాము జీవించి ఉన్నాడు. ఇస్సాకుతో పాటు దేవుని వాగ్దానములను గూర్చి అబ్రాహాము వారికి వివరించి ఉండవచ్చు. కానీ ఏశావు ప్రభువు యొక్క విషయాలను ఎక్కువగా ఆలోచించక అనేకమంది విగ్రహారాధికులైన స్త్రీలను వివాహము చేసుకున్నాడు (ఆది 26: 34-35). అలా చేయుట ద్వారా ఇస్సాకు రిబ్కాలకు మనోవేదన కలుగజేసాడు, కానీ యాకోబు దేవుని ఆశీర్వాదలను, వాగ్దానాలను తాను ఎలాగైనా పొందాలి అని ఆశపడ్డాడు.

ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేయుట

ఒకరోజు యాకోబు చిక్కుడుకాయలతో వంటకం చేస్తున్నప్పుడు ఏశావు పొలము నుండి అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఏశావు యాకోబు చేస్తున్న వంటకము చూచినప్పుడు అది ఎంతో రుచికరంగా కనిపించింది. ఏశావు యాకోబును - "నేను అలసి యున్నాను ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుము" అని అడిగాడు. కానీ యాకోబు వెంటనే దానిని ఇవ్వడానికి ఇష్టపడలేదు. అప్పుడు యాకోబు ఏశావుతో - " నీ జేష్ఠత్వము నేడు నా కిమ్ము" అని యాకోబు అడిగాడు. దేవుని వాగ్దానాలను , ఆశీర్వాదాలను

పొందుటకు జ్యేష్ఠ కుమారుడు అర్హత కలిగి ఉంటాడు. జ్యేష్ఠుడైన ఏశావు నుండి యాకోబు ఆ ఆశీర్వాదాలను వాగ్దానాలను తన స్వంతం చేసుకోవాలి అని ఆలోచించాడు. ఏశావు తన జ్యేష్ఠత్వమును అమ్మి వేయునట్లు గా యాకోబు ప్రమాణము చేయించుకున్నాడు. తరువాత తన వంటకమును ఏశావుకు ఇచ్చివేశాడు. ఆకలితో చావనైయున్న నాకు జ్యేష్ఠత్వము ఎందుకు అని ఏశావు యాకోబుతో చెప్పి తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. ఏశావు ఆ వంటకమును తిని లేచి వెళ్ళిపోయాడు. యాకోబు ఏశావుకు ఆ విధంగా చేయడం మోసంతో కూడిన పని. యాకోబు చేసిన పనికి ఏశావు తరువాత ఎంతో కోపముతో నిండిపోయాడు.

ఇస్సాకు వృద్ధాప్యము
కంటిచూపు మందగించుట (27వ అధ్యాయము) ఇస్సాకు వృద్ధుడు అయినప్పుడు అతని కన్నులు సరిగా కనిపించకుండా దృష్టి మాంద్యం కలిగింది. అతడు తన మరణము సమీపముగా ఉన్నది అని గ్రహించి, చనిపోవుటకు ముందు ఏశావును ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నాడు. ఇస్సాకు ఏశావును పిలిచి - " నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబులపొదిని, విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించునట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్ము" అని చెప్పాడు. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాడు. ఇస్సాకు ఏశావుకు చెప్పిన మాటలను రిబ్కా విన్నది. ఆమె యాకోబును ఎక్కువగా ప్రేమించేది గనుక ఇస్సాకు ఇవ్వబోయే ఆశీర్వాదాలు అన్నీఏశావుకు బదులుగా యాకోబుకు చెందాలి అని అనుకున్నది.

తాను గర్భవతిగా ఉన్నప్పుడు పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ప్రభువు చెప్పిన మాటలు కూడా రిబ్కా గుర్తు చేసుకుని ఉండవచ్చు. రిబ్కా ఆ మాటలను ఇస్సాకు దగ్గరకు వెళ్లి గుర్తు చేసి ఉండవచ్చు. దేవుని మాటల చొప్పున ఆ ఆశీర్వాదాలుఅన్నీ యాకోబుకు చెందాలి అని తెలియజేసి ఉండవచ్చు. కానీ రిబ్కా సహనంతో ఎదురు చూడకుండా దానికి బదులుగా ఇస్సాకును మోసం చేయడానికి నిర్ణయించుకున్నది. ఇస్సాకు వృద్ధుడై దృష్టి మాంద్యము కలిగి ఉన్నాడు గనుక మోసముతో ఏశావుకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు యాకోబుకు చెందవలెనని ఆలోచించింది.

ఇస్సాకును మోసగించుటకు యాకోబును సిద్ధపరచుట

ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళినప్పుడు రిబ్కా యాకోబును పిలిచి - " ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని ప్రభువు సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్దపరచుమని చెప్పగా వింటిని, కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్లి రెండు మంచి మేకపిల్లలను అక్కడనుండి నాయొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెను" అని చెప్పింది. యాకోబు రిబ్కాతో - "నా సహోదరుడైన ఏశావు రోమములు గలవాడు, నేను నున్నని వాడను కదా! ఒకవేళ నా తండ్రి నన్ను తడవిచూచిన యెడల నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన యెడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనను" అని చెప్పాడు. అయినను రిబ్కా అతనితో నేను చెప్పినట్లు చేయుము ఆ శాపము నా మీదికి రానిమ్ము అని చెప్పగా యాకోబు వాటిని తెచ్చి రిబ్కాకు ఇచ్చాడు. రిబ్కా ఇస్సాకుకు ఇష్టమైన రుచిగల భోజనాన్ని సిద్ధం చేసింది. తన దగ్గర ఉన్నఏశావు బట్టలను యాకోబుకు తొడిగించి, మేకపిల్ల చర్మముతో చేతులను మెడను కప్పివేసింది. యాకోబు తండ్రి యొద్దకు భోజనము తీసుకొని వెళ్ళాడు.

యాకోబు ఇస్సాకును మోసగించుట

ఇస్సాకుకు దృష్టి మాంద్యము ఉన్నందున తనకు భోజనము తెచ్చినది యాకోబు అని గుర్తించ లేకపోయాడు. యాకోబు ఇస్సాకు దగ్గరకు వెళ్లి - "నా తండ్రీ" అని పిలువగా ఇస్సాకు - "ఏమి నా కుమారుడా, నీవెవరవు?" అని అడిగాడు. అందుకు యాకోబు - "నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి యున్నాను. నీవు నన్ను దీవుంచుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుము" అని ఇస్సాకుకు చెప్పాడు. ఇస్సాకు - "నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికెను?" అని ప్రశ్నించగా - "నీ ప్రభువు నా యెదుటికి దాని రప్పించుట చేతనే" అని మరొక అబద్ధం చెప్పాడు. దేవుని సహాయముతో కాదు గాని రిబ్కా మోసము వలననే అంత త్వరగా సిద్ధపరచాడు కదా! తనతో మాట్లాడుతున్నది ఎవరో తెలుసుకొనుటకు ఇస్సాకు యాకోబును దగ్గరకు రమ్మని పిలిచాడు. అప్పుడు తడవి చూచి స్వరము యాకోబు స్వరమే గానీ చేతులు ఏశావువి అని అన్నాడు. తిరిగి ఇస్సాకు నీవు నా కుమారుడవైన ఏశావు వేనా అని అడుగగా యాకోబు అవును నేనే అని మరల అబద్ధం చెప్పాడు. అప్పుడు ఇస్సాకు యాకోబు తెచ్చిన భోజనం తిని యాకోబును ఆశీర్వదించుమని ప్రభువును ప్రార్థించాడు. నీ జనులకు నీవు ఏలికగా ఉంటావు నీ తల్లి కుమారులు నీకు లోబడి ఉంటారు అని ఆశీర్వదించాడు.

ఏశావు ఆగ్రహము

ఆశీర్వాదం పొందిన తరువాత యాకోబు అక్కడనుండి వెళ్లి పోయిన వెంటనే వేశావు వేటాడి వచ్చాడు. తన తండ్రికి ఇష్టమైన వంటలు సిద్ధముచేసి తీసుకొని వచ్చి దానిని తిని తనను ఆశీర్వదించమని కోరాడు. ఇప్పుడు తన దగ్గరకు వచ్చినది ఏశావు అని తెలిసి ఇస్సాకు చాలా భయపడ్డాడు. అంతకుముందే తనకు భోజనము తెచ్చిన వానిని నిజముగా ఆశీర్వదించాను అని చెప్పాడు. యాకోబు మోసంతో తనకు రావలసిన ఆశీర్వాదములు, దీవెనలను తీసుకొని పోయాడు అని ఏశావు గ్రహించాడు. ఏశావు ఎంతో దుఃఖముతో పెద్దగా కేక వేసాడు. ఎంతో నిరాశతో కలత చెందాడు. యాకోబు చేసిన మోసానికి అతనిని ద్వేషించటం మొదలుపెట్టాడు. తన తండ్రి మరణించిన తరువాత యాకోబును చంపాలి అని అనుకున్నాడు. ఏశావు మాటలను రిబ్కా వినినప్పుడు యాకోబును పిలిపించి ఏశావు చేతిలో మరణించకుండునట్లు పారిపొమ్మని చెప్పింది. తరువాత యాకోబుకు ఏమి జరిగింది వచ్చేవారం చూద్దాము.

ఈ విషయాలు జరిగిన తరువాత ఆ కుటుంబం చెదిరిపోయింది. ఇస్సాకు తాను చేసిన పొరపాటుకు ఎంతగానో దుఃఖించాడు. ఏశావు కోపముతో యాకోబును చంపాలి అనుకున్నాడు. యాకోబు దూరంగా వెళ్లిపోతున్నందుకు రిబ్కా ఎంతగానో దుఃఖపడింది. తాను చేసిన మోసానికి యాకోబు త్వరగా అక్కడ నుండి తప్పించుకొని పోవాలి అని అనుకున్నాడు.

సందేశము
ఎంత బాధాకరమైన విషయాలు జరిగాయి కదూ? యాకోబు కళ్ళు కనపడని తండ్రిని మోసం చేయడం ఎంతో పెద్ద పాపము. యాకోబు వేషం వేసుకుని తండ్రితో మాటలాడి ఎన్నో అబద్ధాలు చెప్పాడు. రిబ్కా, యాకోబులు దేవుని సహాయము, సమయము కొరకు ఎదురు చూడకుండా వారికి ఇష్టమైనట్లు నిర్ణయాలు చేసుకున్నారు.

అన్వయింపు
మన ప్రయోజనాలు, అవసరాలు, కోరికల కోసం ఇతరులను మోసం చేయడం పాపం. పిల్లలు కూడా ఎన్నోసార్లు తమ తల్లిదండ్రులను మోసం చేస్తూ, వాటిని దాచిపెట్టడానికి అబద్ధాలు చెప్తుంటారు. మీరు మీ గదిలో కూర్చుని చదువుకుంటున్నారు అనుకోండి. ఆ పుస్తకము మధ్యలో మీకిష్టమైన నవల పెట్టుకుని చదువుతున్నారు. మీ మమ్మీ రూమ్ లోనికి వచ్చినప్పుడు క్లాసు పుస్తకాలు కనబడేలా పెట్టి నవల చదువుతుంటారు. వాళ్లు మిమ్మల్ని నమ్మి వెళ్లిపోతారు. ఒకవేళ వాళ్లను మోసం చేసినా ప్రభువును మోసం చేయలేము అనే విషయాన్ని మనం మరిచి పోకూడదు. మన మాటలు, క్రియలు అన్నీ దేవుని గ్రంథములో వ్రాయబడతాయి అని బైబిల్ లో వ్రాయబడింది (ప్రకటన 20: 12). ఒక దినాన ప్రభువు మన పాపముల నన్నిటినీ గుర్తుచేసి మనల్ని గద్ధిస్తాడు. మనము చేసిన పాపములవలన, తప్పుల వలన వచ్చే ఫలితాన్ని ఎలా పోగొట్టుకోగలము? యేసు మాత్రమే మన పాపములను క్షమించగలడు. మన పాపముల కొరకు మనము నిజముగా పశ్చాత్తాప పడితే యేసు మనలను తప్పక క్షమిస్తాడు. మన హృదయాలు శుద్ధి చేయబడతాయి.

మన హృదయాలలో యేసును చేర్చుకుని క్రైస్తవులమైన యెడల, మనము అబద్ధాలు చెప్పలేము, మోసము చేయలేము. యేసు ఈ భూమిమీద నివసించినప్పుడు ఎన్నడూ అబద్ధమాడలేదు. మనం కూడా ఎప్పుడూ నిజము మాట్లాడే వారముగా ఉండాలి. హృదయము అన్నిటికంటె మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది అని బైబిల్ లో వ్రాయబడింది. ఆ వ్యాధిని యేసు మాత్రమే బాగు చేయగలడు అని మనము విశ్వసించాలి.

కంఠతవాక్యము

హృదయము అన్నిటికంటె మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది దాని గ్రహింపగల వాడెవడు? (యిర్మీయా 17: 9).

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

  1. మోషే తన పని ప్రారంభించుట
  2. ఐగుప్తు దేశము మీద తెగుళ్ళు
  3. పస్కా పండుగ
  4. ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రమును దాటుట
  5. దేవుడు మన్నా కురిపించుట
  6. దేవుడు ఇశ్రాయేలీయులకు నీటిని సమకూర్చుట
  7. సీనాయి పర్వతం
  8. పది ఆజ్ఞలు
  9. బంగారు దూడ
  10. వేగులవారి సమాచారము
  11. ఇత్తడి సర్పము
  12. మోషే మరణము

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.