ఆదికాండము 37:1-11
ఉద్దేశము
ప్రభువును ప్రేమించిన యౌవనస్థుడిగా యోసేపును మాదిరిగా చూపుట.
ముఖ్యాంశము
మీకు చాలా ప్రియమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? క్లాస్ లో మీ టీచర్ కి ప్రియమైన విద్యార్థి ఎవరైనా ఉన్నారా? క్లాస్ లో టీచర్స్ కు పక్షపాతం, కొంతమంది విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండడం మనము చూస్తుంటాము, కాని అది సరైనది కాదు. అలా చేయడం వలన మిగిలిన విద్యార్థులు అసూయతో ఉంటారు. అలాగే కుటుంబంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల పక్షపాతం కలిగి ఉండకూడదు. ఎవరైనా ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తూ, వారికి ప్రత్యేకమైన బహుమతులు ఇస్తే మిగిలిన వారు ఖచ్చితంగా ఈర్ష్య కలిగి ఉంటారు.
ఈరోజు తన కుమారులలో ఒకని ఎక్కువగా ప్రేమించి మిగిలిన కుమారులు ఈర్ష్య పడడానికి కారణమైన ఒక తండ్రి గురించి తెలుసుకుందాము.
ప్రియమైన కుమారుడు
ఈ రోజునుండి యోసేపును గురించిన పాఠాలను నేర్చుకుందాము. యోసేపు యాకోబు కుమారులలో ఒకడు. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. యోసేపు 12 మందిలో పదకొండవ కుమారుడు. యోసేపుకు 10 మంది అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు. యాకోబుకు 90 సంవత్సరముల వయస్సులో యోసేపు పుట్టాడు. ముసలి తనమందు పుట్టిన కుమారుడు గనుక యాకోబుకు యోసేపు యెడల అధికమైన ప్రేమ ఉండేది. యోసేపు తమ్ముడు బెన్యామీను పుట్టినప్పుడు వారి తల్లియైన రాహేలు చనిపోయింది .
తల్లి లేదు గనుక యాకోబు యోసేపును మిగిలిన వారందరికంటే ఎక్కువగా ప్రేమించి ఉండవచ్చు. యాకోబు యోసేపును తమ కంటె ఎక్కువగా ప్రేమించుట చూచి మిగిలిన వారు యోసేపు పట్ల ఈర్ష్య పడడం మొదలుపెట్టారు.
యోసేపు దేవుని ప్రేమించుట
మనము ఈ కథను ప్రారంభించే సమయానికి యోసేపు వయస్సు 17 సంవత్సరాలు. యాకోబు హెబ్రోనులో వ్యవసాయం చేస్తూ తన కుమారులతో కలిసి ఉండేవాడు. యోసేపు ఎంతో అందమైన వాడు. యోసేపు తన తండ్రికి విధేయుడై సరియైన మార్గములో నడిచేవాడు. మిగిలిన కుమారులకంటె యోసేపు యధార్ధముగా ఉండేవాడు గనుక యాకోబు అతనిని ఎక్కువగా ప్రేమించి ఉండవచ్చు. యోసేపు మిగిలిన వారికంటె ఏ విధముగా ప్రత్యేకమైన వాడు? తన సహోదరుల వలె కాక యోసేపు ప్రభువును ప్రేమించేవాడు. వారందరూ చెడుతనము కలిగినవారు. వారు ఎంతటి చెడుతనము, క్రూరత్వము కలిగినవారు అనే విషయం తరువాత మనము చూడవచ్చు. యోసేపు ప్రభువును గురించి ఎలా తెలుసుకుని ఉండవచ్చు? యాకోబు తన జీవితములో ప్రభువు చేసిన గొప్ప కార్యములను గురించి చెప్పి ఉండవచ్చు. దేవుడు జీవముగల వాడని, ఆయన తన ప్రజలతో మాట్లాడి వారిని కాపాడి నడిపిస్తాడు అని యోసేపుకు వివరించి ఉండవచ్చు. యోసేపు ముత్తాత అయిన అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానముల గురించి కూడా యాకోబు యోసేపుకు తెలియ చేసి ఉంటాడు. చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు తాను వినిన విషయాలను యోసేపు విశ్వసించి, జీవముగల దేవునిపై విశ్వాసముంచాడు. యోసేపు అందునుబట్టి మిగిలిన సహోదరుల కంటె ప్రత్యేకంగా ఉండి ఉండవచ్చు. యోసేపు సహోదరులు కూడా ఆ విషయాలన్నీ వినినప్పటికి, వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యము చేసి ఉండవచ్చు. వారు చెడు మార్గాలలో నడుస్తూ ముందుకు సాగుతున్నారు.
[A]యోసేపు సహోదరుల ఈర్షకు, ద్వేషమునకు గల మూడు కారణములు
తన సహోదరుల చెడు ప్రవర్తన గురించి యోసేపు తండ్రికి తెలియజేయుట. యోసేపు తన సహోదరులతో కలిసి మందను మేపుతూ ఉండేవాడు. ఆ మందను యోసేపు సహోదరులు ఎలా మేపుతూ ఉండేవారో తెలియదు గాని, వాటిని వారు సరిగ్గా చూచుకొని ఉండకపోవచ్చు. యోసేపు కొండెములు మోపేవాడు కాదు గాని వారు చేస్తున్న చెడ్డ పనులు తండ్రికి తెలియాలి అనుకునేవాడు. తండ్రికి తెలిసినట్లయితే వారిని సరియైన రీతిగా క్రమశిక్షణతో నడిపించగలడు అని తలంచి ఉండవచ్చు. యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండువాడు అని బైబిల్ లో వ్రాయబడింది. అందువలన అతని సహోదరులు యోసేపును ద్వేషించేవారు. యోసేపుకు ఆ పరిస్థితి ఎంతో కష్టంగా అనిపించినప్పటికి, తాను చేస్తున్న పని సరియైనదే అని నమ్మాడు. యేసు ప్రభువు కూడా మనుష్యుల పాపముల గురించి చెప్పినప్పుడు వారు కూడా ఆయనను ద్వేషించేవారు.
[B]యాకోబు యోసేపుకు విచిత్రమైన నిలువుటంగీని ఇచ్చుట.
ఇంటిలో చిన్నపిల్ల వానికి ఏదైనా ఆట బొమ్మ కొనిస్తే పెద్ద పిల్లలు ఎంతో ఈర్ష్య పడతారు. అలాచేస్తే ఆ పిల్లవాడు చెడి పోతాడు అని తండ్రి మీద సణుగు కుంటారు. యాకోబు ఆలోచన లేకుండా యోసేపు ఒక్కడికే రంగురంగుల విచిత్రమైన అంగీ(చొక్కా)ని ఇచ్చాడు. ఆ అంగీ కొరకు యాకోబు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఉండవచ్చు. యాకోబు తమందరి కంటె యోసేపును ఎక్కువగా ప్రేమించుట చూచి మిగిలిన వారు యోసేపు మీద పగబట్టారు. అది యోసేపు పొరపాటు కాకపోయినప్పటికీ, వారు ఈర్ష్యతో నిండినవారై అతని మీద పగబట్టి, అతని క్షేమసమాచారము కూడా అడగలేకపోయారు. వారు యోసేపును గురించి అసలు పట్టించుకుని ఉండకపోవచ్చు. కానీ యోసేపుకు వారి పట్ల ద్వేషము, కోపము ఎంతమాత్రం లేవు. దీనిని బట్టి యోసేపు సహనము మనకు అర్థమవుతుంది.
[C] యోసేపుకు కలిగిన స్వప్నములు సహోదరులకు కోపము తెప్పించుట. ఒకరోజు యోసేపు తన సహోదరులతో - "నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా, మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడెను"అని చెప్పాడు. ఆ మాటలకు మా మీద నీవు అధికారివగుదువా అని అతని సహోదరులు ఇంకా కోపం పెంచుకున్నారు. యోసేపు మరొక కల కని అందులో సూర్య చంద్రులును, 11 నక్షత్రములును తనకు సాష్టాంగ పడినట్టు చెప్పాడు. ఆ కలలు విని అతని సహోదరులు యోసేపు నందు అసూయపడ్డారు. యాకోబు నేను, నీ తల్లి, నీ సహోదరులు వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని యోసేపును గద్దించాడు, కాని యాకోబు ఆ మాటలు జ్ఞాపకముంచుకున్నాడు. యోసేపు గర్వముతో తనను తాను హెచ్చించు కుంటున్నట్లు కనిపించాడు. యాకోబు కూడా ఆ కలలను విని యోసేపు సహోదరుల వలె కోపగించుకున్నాడు .
సందేశము
యోసేపు బైబిల్ లో వ్రాయబడిన అద్భుతమైన వ్యక్తులలో ఒకడు. 17 సంవత్సరముల వయస్సులోనే యోసేపు తన సహోదరులకు భిన్నంగా ప్రభువుకు ప్రీతికరంగా జీవించాడు. యోసేపును గూర్చి ఎన్నో విషయాలు మనము రాబోయే తరగతుల్లో నేర్చుకుందాము. యోసేపులో ఉన్న మంచి గుణాలను చూద్దాము. యోసేపుకు చెడ్డ పనులు చేయుట ఇష్టం లేదు. అందుకే ధైర్యంగా తన సహోదరుల చెడుతనాన్ని తండ్రికి చెప్పేవాడు. తన సహోదరులు తనతో కఠినంగా మాట్లాడినప్పటికి, ఎంతో సహనంతో ఎదురు మాట్లాడేవాడు కాదు. యోసేపు ప్రభువును ప్రేమించేవాడు కనుక దేవుడు తనకు ఇచ్చిన కలలను మరిచిపోలేదు. ప్రభువు భవిష్యత్తులో జరగబోయే విషయాలు చూపించినప్పుడు రహస్యంగా ఉంచుకొనక తన తండ్రికి, సహోదరులకు చెప్పాడు.
యోసేపు తనంతట తాను ఆ విధముగా చేయాలని అనుకొని ఉండకపోవచ్చు. ప్రభువును ప్రేమించేవాడు గనుక ఆయన నడిపింపు చొప్పున యోసేపు ముందుకు సాగుతూ ఉన్నాడు.
ఉదాహరణ
బైబిల్ లో చిన్న వయస్సు నందే ప్రభువును ప్రేమించి ఆయనను విశ్వసించిన వారు ఎందరో ఉన్నారు. సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు పిలిచినప్పుడు - "నీ దాసుడు ఆలకించు చున్నాడు ఆజ్ఞ ఇమ్ము" అని చెప్పాడు. దేవుని ఆజ్ఞను నెరవేర్చుటకు సమూయేలు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తనతో చెప్పిన మాటలను ధైర్యంతో యాజకుడైన ఏలీకి చెప్పాడు.
సమూయేలు పెద్దవాడైనప్పుడు గొప్ప ప్రవక్త గా స్థిరపడ్డాడు( రెండవ సమూయేలు 3:10). యోషీయా ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే రాజుగా పరిపాలించసాగాడు. ఆ చిన్న వయస్సులోనే హృదయపూర్వకంగా ప్రభువును వెదికాడు. పెద్దవాడైన తరువాత దేశము లోని విగ్రహములను అన్నింటిని నాశనము చేసి, సృష్టికర్త అయిన ప్రభువును వెంబడించునట్లు ప్రజలను ప్రోత్సాహపరిచాడు (2 ది.వృ.34:3).
క్రొత్త నిబంధన గ్రంధములో తిమోతి అనే యౌవనస్థుని గురించి వ్రాయబడింది. చిన్న వయస్సు నుండి దేవుని వాక్యాన్ని తల్లి బోధించగా నేర్చుకున్నాడు. పెద్దవాడైన తరువాత ప్రభువైన యేసు పరిచర్యను చేస్తూ, అనేకులకు దేవుని వాక్యాన్ని బోధించాడు.
అన్వయింపు
మీరు కూడా యోసేపు వలె ప్రభువుకు విధేయులుగా ఉండాలి అని ఇష్టపడుతున్నారా? చెడు విషయాలను అసహ్యించుకొని, మంచి విషయాలను చేయాలి అనే కోరిక ఉందా? కానీ, మనంతట మనమే ఆ విధముగా చేయలేము, ఎందుకంటే మన హృదయాలు ఎంతో చెడ్డవి, మోసకరమైనవి గనుక. అందువలన ఎప్పుడూ మనకు సంతోషం కలిగించే విషయాలు చేయటానికి ఇష్టపడుతుంటాము. ముందుగా, మన పాపములు క్షమింపబడాలి. అప్పుడే మనము దేవునికి లోబడి జీవించగలము. యేసు మాత్రమే మన పాపములను క్షమించగలడు. పురుషులు, స్త్రీలు, బాలురు, బాలికలు అందరూ పాప క్షమాపణ పొందులాగున ప్రభువైన యేసు సిలువపై తన ప్రాణము అర్పించాడు. ప్రభువును ప్రేమించే హృదయము మనము పొందాలి. మనము క్రైస్తవులమైన యెడల యోసేపు వలె చెడును అసహ్యించుకొని సహనముతో జీవించగలము, మన జీవితాల ద్వారా ప్రభువును సంతోష పరచగలము.
కంఠతవాక్యము
నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. (కీర్తనలు119:8).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF