ఆదికాండము 20:1-18

ఉద్దేశము/లక్ష్యము
అబద్ధములు చెప్పడం సరియైనది కాదు అని భోధించుట. మోసం చేయడం కూడా అబద్ధమాడుట వంటిదే. ఎల్లప్పుడూ నిజం చెప్పడం మనము అలవాటు చేసుకోవాలి.

ముఖ్యాంశము
మనమందరం ఎంతో విభిన్నమైన ప్రవర్తన కలిగి ఉండటం ఎంత ఆశ్చర్యం! మీ క్లాస్ మేట్స్ గురించి ఆలోచించండి. కొంతమంది పిల్లలు ఎప్పుడూ అల్లరి చేస్తూ మిగిలిన పిల్లలను ఏడిపిస్తుంటారు. మరి కొంతమంది పిల్లలు టీచర్లను కష్టపెడుతూ ఎంతో ప్రమాదకరమైన పనులు చేస్తుంటారు. కొందరు మాత్రమే క్రమశిక్షణతో మంచి ప్రవర్తన కలిగిన వారై ఉంటారు. వారు బాగా చదువుతూ టీచర్ చెప్పే మాటలు వింటూ అవసరములో ఉన్న తోటి విద్యార్థులకు సహాయపడుతుంటారు. వారిని చూచినప్పుడు వీళ్ళు ఎప్పుడైనా పొరపాట్లు చేస్తారా అని సందేహం వస్తుంది. ఎంత మంచివారైనా తప్పక ఏదో పొరపాటు చేస్తుంటారు. ఎందుకంటే సృష్టి ఆరంభంలో ఏదెను వనములో ఆదాము, హవ్వలు దేవునికి అవిధేయత చూపినప్పటినుండి ప్రతి మనుష్యుడు పాపములోనే జన్మిస్తూ దేవునికి అవిధేయత చూపుతున్నాడు (రోమా 5:12). మనము అందరము పాపులమే .

గతవారము
లోతు ఎవరో మీకు గుర్తున్నాడా? లోతు సొదొమ పట్టణములో నివసించుట సరిఅయిన నిర్ణయమేనా? లోతు అక్కడ సంతోషంగా ఉన్నాడా? ఆ పట్టణము విడిచిపెట్టి వెళ్ళమని లోతుకు ఎవరు చెప్పారు? ప్రభువు సొదొమ పట్టణము ఎలా నాశనం చేశాడు? ఎవరు వెనుకకు తిరిగి చూశారు? దేవుడు పాపమును అసహ్యించుకుంటాడు, దానికి తగిన శిక్ష ను కూడా వేస్తాడు.

అబ్రాహాము మంచి హృదయము కలవాడు
అబ్రాహాము గురించి మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము. అబ్రాహాము తన పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించేవాడు. ప్రభువు మాటలకు లోబడి ఎన్నడూ చూడని క్రొత్త దేశమునకు బయలుదేరాడు. తనకు కావలసిన ప్రదేశము ఎన్నుకొనుటకు మొదట లోతుకు అవకాశాన్ని ఇచ్చాడు. సొదొమ ప్రజలు నాశనం కాకుండా ప్రభువు దగ్గర ఎంతగానో వేడుకున్నాడు (ఆది 18: 23). మరియు వారు ఒక సమయములో శత్రువుల చేత చెరపట్టబడినప్పుడు వారిని విడిపించాడు (14 16). అబ్రాహాము గొప్ప విశ్వాసి అని మనము గ్రహించవచ్చు. అతడు క్రైస్తవులకు గొప్ప మాదిరిగా ఉన్నాడు. కానీ అబ్రాహాము చేసిన ఒక పొరపాటు గురించి మనము తెలుసుకుందాము. తన కష్ట సమయంలో దేవుడు సహాయం చేస్తాడు అని విశ్వసించ లేకపోయాడు. కష్టం నుంచి బయట పడుటకు ఒక అబద్ధం చెప్పాడు. మంచివాడైన అబ్రాహాము కూడా పొరపాటు చేసినట్లు మనము గ్రహించవచ్చు.

అబ్రాహాము అబద్ధము చెప్పుట
అబ్రాహాము తన కుటుంబంతో గుడారములలో నివసించేవాడు. వారు ఆ దేశంలోని అన్ని ప్రాంతాలకు తిరుగుతుండేవారు. అబ్రాహాము పడమట దిక్కుగా ప్రయాణము చేసి గెరారు అనే ప్రాంతమునకు వచ్చి నివసించసాగాడు. అక్కడ ఫిలిష్తీయులు నివసించేవారు. వారు అబ్రాహాము వలె నిజమైన దేవుని ఆరాధించక విగ్రహారాధన చేసేవారు. వారిని చూసి అబ్రాహాము తనలోతాను ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు, వారు ఎంత మాత్రము దేవుని ఆజ్ఞలు పాటించుట లేదు గనుక నేను చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అని అనుకున్నాడు. శారా వృద్ధురాలైనప్పటికి ఎంతో అందంగా ఉండేది అని బైబిల్ లో వ్రాయబడింది. అక్కడి ప్రజలు ఎవరైనా శారాను తీసుకొనిపోయి ఆమెను వివాహం చేసుకుంటారేమో అని అబ్రాహాము భయపడ్డాడు. అంతేకాక శారా నిమిత్తము తనను చంపుతారు అని కూడా అనుకున్నాడు. ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి అబ్రాహాము శారాకు ఒక ఆలోచన చెప్పాడు. తాము అన్నా చెల్లెళ్ళము అని అక్కడి ప్రజలకు చెప్పునట్లు ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అటువంటి కష్టమైన సమయములో దేవుని సహాయం కొరకు ప్రార్థించకుండా అబద్ధము చెప్పాలి అనుకోవడం ఎంత పొరపాటు. అబ్రాహాము అనుకున్న విధముగానే అక్కడ జరిగింది. గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంటిలో చేర్చుకున్నాడు. ఆమెను తన భార్యగా చేసుకోవాలి అనుకున్నాడు. తాను చేసేపని తప్పు అని అబీమెలెకు ఆలోచించలేదు. శారా అబ్రాహాము చెల్లెలు గనుక ఆమెను వివాహం చేసుకోవడంలో తప్పు లేదు అనుకున్నాడు. ఈ పరిస్థితులలో దేవుడు సహాయం చేయకపోతే అబ్రాహాము తన భార్యను పోగొట్టుకొన వలసి వచ్చేది. అబ్రాహాము శారా తన భార్య అని చెప్పినందువలన అబీమెలెకును మోసపుచ్చిన వాడయ్యాడు.

అబీమెలెకు రాజు యొక్క స్వప్నము
జరిగిన విషయాలన్నింటిని ప్రభువు చూస్తున్నాడు. ఆ సమస్య నుండి ప్రభువు తనను కాపాడగలడు అని అబ్రాహాము విశ్వసించక పోవడం దేవునికి ఎంతో బాధ కలిగించింది. పరిస్థితులను అన్నింటిని అబ్రాహాము తన చేతుల లోనికి తీసుకొని అబీమెలెకు రాజును మోసపుచ్చాడు. దేవుడు అబ్రాహాము శారాల పట్ల ఎంతో కృప కలిగినవాడై ఆ పరిస్థితులలో కూడా వారిని కాపాడాడు. రాత్రివేళ స్వప్నమందు దేవుడు అబీమెలెకు నొద్దకు వచ్చి "నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా!" అని చెప్పాడు. అప్పుడు అబీమెలెకు దేవునితో "ప్రభువా!ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా, మరియు ఆమెకూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యధార్థ హృదయముతో ఈ పని చేసితిని" అనెను. అందుకు దేవుడు - "అవును,యధార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్ధన చేయును. నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని యెడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుము" అని అబీమెలెకు రాజుకు స్వప్నమందు చెప్పాడు. తెల్లవారిన వెంటనే అబీమెలెకు లేచి తన సేవకులను అందరిని పిలిపించి ఈ సంగతులన్నియు వారికి వినిపించినప్పుడు వారు చాలా భయపడ్డారు. ఆ స్వప్నం దేవుని దగ్గర నుండి వచ్చినది అని తెలిసి ఇంకా ఎక్కువ భయపడ్డారు.

అబీమెలెకు కోపగించుట
అబీమెలెకు కోపముతో అబ్రాహామును పిలిపించి "నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకు నా రాజ్యము మీదకు మహాపాతకము తెప్పించునట్లు నేను నీ యెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివి. నీవేమి చూసి ఈ కార్యము చేసితివి?" అని ప్రశ్నించాడు. అబ్రాహాము తాను చేసిన పనికి ఎంతో బాధపడి ఉండవచ్చు. అబ్రాహాము అప్పుడు అబీమెలెకుతో "ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్నుచంపుదురనుకొని చేసితిని. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తెకాదు. ఆమె నాకు భార్య అయినది" అని చెప్పాడు. కాని అబ్రాహాము అబీమెలెకు రాజును మోసం చేశాడు. ప్రభువు ఎటువంటి పరిస్థితులలోనైనా కాపాడగలడు అనే విశ్వాసముతో అబ్రాహాము నిజము చెప్పవలసినది, కానీ అబ్రాహాము అలా చేయలేదు.

అబీమెలెకు క్షమించుట
అబ్రాహాము తనను మోసం చేసినప్పటికి అబీమెలెకు రాజు వెంటనే క్షమించగలిగాడు. అతడు శారాను తిరిగి అబ్రాహామునకు అప్పగించాడు. గొర్రెలను,గొడ్లను దాసదాసీ జనాన్ని,ధనాన్ని అబ్రాహాము శారాలకు కానుకగా ఇచ్చాడు. తరువాత అబ్రాహాముతో - "ఇదిగో నా దేశము నీ యెదుట నున్నది నీకు ఇష్టమైన స్థలమందు కాపురముండుము" అని చెప్పాడు. అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును, అతనిభార్యను, అతని దాసీలను బాగు చేశాడు. అప్పుడు వారు పిల్లలను కన్నారు. అబ్రాహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో పిల్లలు పుట్టకుండా చేశాడు. ప్రభువు మాటలకు లోబడి శారాను అబ్రాహామునకు అప్పగించుట వలన అబీమెలెకు ఆశీర్వాదాలు పొందాడు.

సందేశము
దేవుని భయము లేని గెరారు దేశంలో కూడా ప్రభువు తమను కాపాడగలడు అని అబ్రాహాము విశ్వసించవలసింది. కష్టము వస్తుందేమో అనే భయముతో అబ్రాహాము అబద్ధం చెప్పడం ఎంత బాధాకరం! బైబిల్ లోని అద్భుతమైన వ్యక్తులలో అబ్రాహాము ఒకడు. అయినా అతడు కూడా పాపము చేశాడు. ప్రతి ఒక్కరు తమ పాపముల వలన దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు అని మనము చూశాము. "అబద్ధం చెప్పకూడదు" అనే ఆజ్ఞను అబ్రాహాము ఉల్లంఘించాడు(నిర్గమ 20:16). ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో దేవుని పది ఆజ్ఞలలో ఒక దానినైనా అతిక్రమించి ఉంటారు. సాతాను అబద్ధమునకు తండ్రి అని బైబిల్ లో వ్రాయబడింది (యోహాను 8:44). మనము అబద్ధాలు చెప్తే సాతాను సంతోషిస్తాడు. భూమిపై జీవించిన వారిలో ప్రభువైన యేసు మాత్రమే ఎటువంటి పాపము లేని పరిశుద్ధుడు, సత్యవంతుడు.

అన్వయింపు
"ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి" అని నూతన నిబంధన గ్రంథము కొలస్సి 3:9 లో వ్రాయబడింది. దేవుడు అబద్ధమును అసహ్యించుకుంటాడు. కొన్ని సమయాలలో సమస్యల నుండి బయటపడడానికి అబ్రాహాము వలె అబద్ధాలు చెప్తుంటాము. మనము చెప్పే అబద్దాలు అందరూ నమ్ముతారు, అవి ఎప్పటికీ బయటపడవు అని అనుకుంటాము. కాని దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. మనుష్యులకు కూడా మనము చెప్పిన అబద్దాల గురించి ఎప్పటికైనా తెలుస్తుంది.

ఉదాహరణ
కావ్యకు లడ్లు అంటే చాలా ఇష్టం. ఒకరోజు కావ్య వాళ్ళ అమ్మ పని మీద బయటకు వెళ్ళింది. కావ్య డబ్బాలో ఉన్న లడ్లు చూసి ఒకటి తీసుకుని మిగిలినవి జాగ్రత్తగా పెట్టేసింది. కావ్య వాళ్ళ అమ్మ తిరిగి వచ్చి - "లడ్డు తీసుకొని తిన్నావా?" అని అడిగింది. కావ్య లేదు అని చెప్పింది. నాతో అబద్దం ఎందుకు చెప్తున్నావు? అని వాళ్ళ అమ్మ అడిగింది. నేల మీద చిన్న చిన్న లడ్డు ముక్కలు కనిపించి వాళ్ళ అమ్మకు అనుమానం వచ్చింది. అబద్దం చెప్పినా చాలాసార్లు అవి బయటపడతాయి. కావ్య వాళ్ళ అమ్మను అడిగి లడ్డు తీసుకొని ఉండవచ్చు. అబద్దం చెప్పవలసిన అవసరం లేదు.

మనము చెప్పే అబద్ధాలు ఎవరికీ ఎప్పటికీ తెలియవు అని మనము అనుకుంటాం, కాని దేవునికి అన్నీ తెలుసు కనుక మనము అబద్దాలు చెప్పినప్పుడు దేవుని క్షమించమని అడగాలి. మన హృదయములో క్షమించబడ్డాము అనే నమ్మకము కలిగే వరకూ ప్రార్ధన చేయాలి. మన పాపములు క్షమించుటకు యేసు సిలువపై తన ప్రాణం అర్పించాడు. మనలను క్షమించిన తరువాత తిరిగి మరెన్నడూ మన పాపములను గుర్తు చేసుకొనను అని దేవుడు వాగ్దానం చేశాడు. మన పాపములను సముద్రములో పాతిపెట్టిన రీతిగా మరెన్నటికి జ్ఞాపకము చేసికొనడు (యిర్మీయా 31:34).

కంఠతవాక్యము
మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి. (సంఖ్యాకాండము 32 :23)

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.