సొలొమోను జ్ఞానము కోరుకొనుట
1వ రాజులు 3 అధ్యా, 2వ ది.వృ 1-12
ఉద్దేశము
మనము జ్ఞానము గల వారమైతే, దేవుని అమూల్యమైన బహుమానము రక్షణ కోరుకోవాలి అని బోధించుట.
ముఖ్యాంశము
ఎవరైనా మీ దగ్గరకు వచ్చి - " ప్రపంచంలో నీకు నచ్చినది ఏదైనా కోరుకొనండి అది మీకు దొరుకుతుంది" అని చెప్పారు అనుకుందాము. అప్పుడు మీరు ఏమి కోరుకుంటారు? అమెరికా వెళ్లాలి, పెద్ద ఇల్లు కావాలి, మంచి బైక్ కావాలి - ఇలా మీకు ఇష్టమైన వాటిని అడుగుతారు కదూ? అటువంటి అవకాశం ఎదురైనప్పుడు ఒక వ్యక్తి ఏమి కోరుకున్నాడు అని ఈరోజు చూద్దాము.
నేపధ్యము
దావీదును గురించి మనము కొన్ని వారాల నుండి నేర్చుకున్నాము. గొర్రెలను మేపుచున్న దావీదు ఇశ్రాయేలీయులపై రాజుగా పరిపాలన చేశాడు. దావీదు 40 సంవత్సరములు మంచి రాజుగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. దావీదు తర్వాత అతని కుమారుడైన సొలొమోనును రాజుగా చేయుటకు దావీదు నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని ప్రభువు దావీదుకు ముందుగానే తెలియచేశాడు (1ది.వృ 22:9,10) ప్రభువును ప్రేమించి ఆయన యందు విశ్వాసముంచి నట్లయితే వారు సంతోషంగా జీవించగలరు అని దావీదు తాను మరణించుటకు ముందు సొలొమోనుకు, ఇశ్రాయేలీయులకు చెప్పాడు.
సొలొమోను రాజు అగుట
దావీదు మరణించిన సమయానికి సొలొమోను ఇంకా యౌవనస్థుడుగానే ఉన్నాడు. మీ నాన్నగారికి బట్టల షాపు ఉంది అనుకుందాము. మీ తండ్రిగారు వేరొక ప్రాంతానికి వెళ్తూ మిమ్మల్ని షాపు చూసుకోమని చెప్పాడు అనుకోండి. అప్పుడు మీకు చాలా భయము కలుగుతుంది కదూ! షాపు గురించి మీకు ఏమీ తెలియదు గనుక ఏదైనా మోసం, పొరపాట్లు జరగవచ్చు అని ఆందోళన కలుగుతుంది. అప్పుడు మీరు మీ నాన్నగారి దగ్గరకు వెళ్లి - " నేను చిన్నవాడను వ్యాపారము ఎలా చూసుకోవాలో తెలియదు" అని చెప్తారు. సొలొమోను పరిస్థితి కూడా అలాగే ఉంది. తానింకను యౌవనస్థుడు గనుక రాజ్య పరిపాలన ఎలా చేయాలో సొలొమోనుకు తెలియదు.
సొలొమోను జ్ఞానము కొరకు అడుగుట
సొలొమోను రాజుగా నియమింపబడిన తరువాత ముందుగా గిబియోనులోని మందిరమునకు వెళ్లి అక్కడ ప్రభువుకు కృతజ్ఞతార్పణలుగా బలులు అర్పించాడు. సొలొమోనును ప్రభువును ప్రేమించేవాడు గనుక తనను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటకు ఇష్టపడ్డాడు. దేవుని ఆరాధించిన తరువాత, సొలొమోను నిద్రించాడు. అప్పుడు ఒక అద్భుతమైన విషయము జరిగింది. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు సొలొమోనుతో - " నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుము" అని సెలవిచ్చాడు. సొలొమోను ఏది అడిగినప్పటికీ దేవుడు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. సొలొమోను అడిగినదానిని వింటే మీరు ఆశ్చర్యపోతారు. సొలొమోను దేవునితో - "ప్రభువా, దేవా నీవు నా తండ్రి అయిన దావీదు యెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక ప్రభువా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల దూళియంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గల వాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము" అని అడిగాడు. తనకు అనుభవము లేదు గనుక ప్రజలను పరిపాలించుటకు తన జ్ఞానము సరిపోదు అని సొలొమోను తలంచాడు. తాను మంచి రాజుగా పరిపాలించడానికి జ్ఞానము ఎంతో అవసరము అని సొలొమోను గ్రహించాడు. జ్ఞానమును ఇమ్మని సొలొమోను దేవుని అడిగాడు.
ప్రభువు సొలొమోనుకు జ్ఞానము అనుగ్రహించుట
సొలొమోను తనను జ్ఞానము దయచేయుమని అడిగినందుకు దేవుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు దేవుడు సొలొమోనుతో - "నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువు నైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్న ముందుగా ఉన్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘన తను నీకిచ్చెదను" అని చెప్పాడు. సొలొమోను స్వార్ధముతో తన కొరకు ఏది కోరుకొనలేదు గనుక ప్రభువు ఎంతో సంతోషించాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను చక్కగా పరిపాలించుటకు వివేకమును జ్ఞానమును ప్రసాదించుమని దేవుని అడిగాడు. సొలొమోను నిద్రలేచి తన స్వప్నమును గుర్తు చేసుకున్నాడు. తాను అడిగినది ప్రభువు తనకు దయచేసి అని సొలొమోను గ్రహించాడు. అతడు దేవుడు అనుగ్రహించిన జ్ఞానముతో నిండినవాడై ఇశ్రాయేలీయులను పరిపాలించ బోతున్నాడు.
సొలొమోను జ్ఞానమునకు పరీక్ష
సొలొమోను జ్ఞానమునకు పరీక్ష ఎదురైంది. ఒకరోజు ఇద్దరు స్త్రీలు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని సొలొమోను రాజు దగ్గరకు న్యాయము కొరకు వచ్చారు. వారి సమస్య చాలా క్లిష్టమైనది. వారు రాజు ఎదుట సాష్టాంగ పడి నమస్కరించి ఒకరిపై ఒకరు కోపంతో ఫిర్యాదు చేయుటకు మొదలుపెట్టారు.
వారిలో ఒక స్త్రీ సొలొమోను రాజుతో - " నా ఏలిన వాడా, చిత్తగించుము నేను ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక బిడ్డను కంటిని. నేను కనిన మూడవ దినమున ఇదియు బిడ్డను కనెను. మేమిద్దరమును తప్ప ఇంటిలో మరి ఎవరును లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన బిడ్డ మీద పడగా వాడు చచ్చెను. కాబట్టి మధ్య రాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి, నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిలిలో పెట్టుకుని, చచ్చిన తన బిడ్డను నా కౌగిలిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా బిడ్డకు పాలీయ చూడగా బిడ్డ చచ్చినదాయెను. తరువాత ఉదయమున నేను బిడ్డను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన
వాడు కాడని నేను తెలిసి కొంటిని" అని చెప్పగా అంతలో రెండవ స్త్రీ - " అది కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ" అని చెప్పింది. మరలా మొదటి స్త్రీ - " కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికి యున్నది నా బిడ్డ" అని చెప్పింది. ఈ ప్రకారముగా వారిరువురూ వాదించు కొనసాగారు. వారి ఇంటిలో మరెవరూ లేరు గనుక జరిగినది ఎవరికి తెలియదు. సొలొమోను ఎలా న్యాయం చెప్పాలి? ఇరువురు బిడ్డ తమ బిడ్డే అని వాదిస్తున్నారు. నిజాన్నిసొలొమోను ఎలా తెలిసి కొనగలడు?
సొలొమోను యొక్క జ్ఞాన యుక్తమైన తీర్పు
అప్పుడు సొలొమోను కత్తి తెమ్మని తన సేవకులకు ఆజ్ఞాపించాడు. వారు ఒక కత్తిని రాజు దగ్గరకు తీసుకొని రాగా - " రెండు భాగములుగా బ్రతికిన బిడ్డను చేసి దీనికి సగము దానికి సగము ఈయుము" అని ఆజ్ఞ ఇచ్చాడు. సొలొమోను నిజముగా ఆ బిడ్డను రెండు భాగాలు చేయాలి అనుకున్నాడా? లేదు బిడ్డకు నిజమైన తల్లి ఎవరు అని కనిపెట్టుటకు ఆ విధముగా ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు బ్రతికి ఉన్న బిడ్డ యొక్క నిజమైన తల్లి - " నా యేలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుము" అని ఎంతో దుఃఖముతో మనవి చేసింది. ఆమె తల్లి గనుక తన బిడ్డ యెడల ఎంతో ప్రేమ గలదై ఆ విధముగా చెప్పింది. ఆ రెండవ స్త్రీ - "ఆ బిడ్డ నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయుము" అని చెప్పింది. అప్పుడు బ్రతికి ఉన్న బిడ్డను చంపక మొదటి స్త్రీకి ఇవ్వమని సొలొమోను ఆజ్ఞాపించాడు. మొదటి స్త్రీ నిజమైన తల్లి గనుక తన బిడ్డను చంపుటకు ఎంత మాత్రమును ఒప్పుకొనలేదు. రెండవ స్త్రీ తన బిడ్డ కాదు గనుక ఎటువంటి ప్రేమ లేనిదై చంపివేయమని చెప్పింది. సొలొమోను ఆ స్త్రీ చేసిన మోసము గ్రహించాడు సరియైన తీర్పు ఇచ్చాడు. అంత క్లిష్టమైన సమస్యకు సొలొమోను ఇచ్చిన తీర్పు ఎంత జ్ఞాన యుక్తమైనది!
సొలొమోను తీర్పు విని అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. న్యాయమును విచారించుట యందు రాజు దైవ జ్ఞానము పొందిన వాడు అని గ్రహించి అతనికి భయపడ్డారు. తమకు మంచి చెడు వివరించగలిగిన వివేకముగల రాజు ఉన్నందుకు ఎంతో సంతోషించారు.
సందేశము
ప్రభువును జ్ఞానము ఇమ్మని సొలొమోను అడగటం సరియైన నిర్ణయం. తన కొరకు ఎన్నో ఆశీర్వాదాలు కోరుకొని ఉండవచ్చు కానీ మంచి రాజుగా ఉండుటకు అవసరమైన జ్ఞానాన్ని సొలొమోను దేవుని దగ్గర అడిగాడు. సొలొమోను ప్రభువు ఎడల ప్రేమ కలిగిన వాడై ఆయనకు ప్రీతికరముగా జీవించాలి అని ఆశించాడు .
సొలొమోను భూమి మీద నివసించిన వారందరిలో జ్ఞాన వివేకములు గలవాడు. సొలొమోను ఎన్నో జ్ఞాన యుక్తమైన మాటలను "సామెతలు’’ అనే పేరుతో రచించాడు. బైబిల్ లో పరమగీతములు, ప్రసంగి గ్రంథములు కూడా సొలొమోను రచించాడు. స్వార్థం లేకుండా జ్ఞానము కోరుకున్నాడు గాని దేవుడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును కూడా కలుగజేశాడు. భూమి మీద నివసించిన వారిలో సొలొమోను కంటే ఐశ్వర్యవంతులైన రాజులు ఎవరు లేరు
అన్వయింపు
దేవుడిని అడుగవలసి వస్తే మనము ఏమి అడుగుతాము? మనకు అవసరమైన వాటిని కోరుకొనడం తప్పు కాదు కానీ ప్రభువును అడగవలసిన ముఖ్యమైనది ఏమిటి? మనము నిత్య జీవము కొరకు ప్రభువును ప్రార్థించాలి. మనలను క్రైస్తవులుగా మార్చమని అడగాలి. మన పాపములు క్షమించబడి మరణించినప్పుడు పరలోకము వెళ్ళునట్లు దేవుని రక్షణను కోరుకోవాలి. ఆయన మనకు నిత్య జీవమును అనుగ్రహించగలడు.
క్రైస్తవుడైన వ్యక్తి జ్ఞానము గలవాడు. దేవుడు వారిని మార్చి జ్ఞాన హృదయము కలుగ చేస్తాడు. "బుద్ధిమంతుడు, జ్ఞానము గలవాడు రాతి మీద తన ఇంటిని కట్టుకొనును" అని బైబిల్ లో వ్రాయబడింది. ప్రభువైన యేసు నందు తన జీవితమును స్థిరపరచుకొను వాడు జ్ఞానము గలవాడు. జ్ఞానము గలవాడు తాను నడవవలసిన మార్గము తెలుసుకొనునట్లు ప్రతి దినము బైబిల్ చదువుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవుల హృదయాలలో నివసిస్తూ దేవునికి ప్రీతికరమైన జీవితము జీవించుటకు సహాయపడుతుంటాడు. క్రైస్తవులు దొంగతనం, అబద్హాలు, ఒట్టు పెట్టుకొనడం, మోసం చేయడం ఇటువంటి చెడ్డ పనులను అసహ్యించుకుంటారు. వారు దయ, సత్యము, సహాయము చేయడం ఇటువంటి మంచి గుణ లక్షణములు కలిగి ఉంటారు. ఈ లోకము ఒక దినము అంతరించిపోతుంది అని క్రైస్తవులకు తెలుసు. ప్రభువైన యేసు తిరిగి భూమి మీదకి రానై ఉన్నాడు గనుక ఆయనను ధైర్యముతో, సంతోషముతో ఎదుర్కొనుటకు క్రైస్తవులు జ్ఞానము కలిగి సిద్ధపడుతుంటారు. మరి మనము మన జ్ఞానము ఎలా వాడుతున్నామో ఆలోచించారా?
కంఠతవాక్యము
క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు (2వ తిమోతి 3:15)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

