షేబ దేశపు రాణి సొలొమోనును దర్శించుట
1వ రాజులు 10:1-13; 2వ దిన.వృ 9:1-12
ఉద్దేశము
ప్రభువును గురించి, ఆయన పాప క్షమాపణ గురించిన విషయాలను మనము సాధ్యమైనంత ఎక్కువ తెలుసుకోవాలి అని బోధించుట.
ముఖ్యాంశము
మీకు ఏమైనా బంగారపు నగలు ఉన్నాయా? ఉంగరం, గొలుసు ఇలా విలువైనవి ఏమైనా ఉన్నాయా? ధనవంతులు బంగారపు వాచీలను, గొలుసులను ఇంకా ఎన్నో నగలను కలిగి ఉంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర విస్తారమైన బంగారము ఉండదు. ఎందుకంటే బంగారము చాలా ఖరీదైనది చిన్న గొలుసు కొనాలి అంటే ఎన్నో వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
గతవారము
దేవుడు సొలొమోనుకు ప్రపంచంలో ఎవరికీ లేని విశేష జ్ఞానమును అనుగ్రహించాడు అని మనము చూసాము. సొలొమోను దేవుని ధనము ఐశ్వర్యము అడగకుండా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను పరిపాలించుటకు కావలసిన జ్ఞానము కావాలి అని అడిగినప్పుడు దేవుడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చాడు. భూమి మీద అప్పటివరకు ఎవరికి లేనంత బంగారమును సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు.
చిన్న బిడ్డ విషయములో ఇద్దరు స్త్రీలు సొలొమోను దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని జ్ఞానము చొప్పున సొలొమోను వారికి న్యాయం చెప్పినట్లు మనము చూసాము. సొలొమోను జ్ఞానము దేవుడు అనుగ్రహించినది గనుక ఎటువంటి సమస్యనైనా సొలొమోను పరిష్కరించేవాడు. సొలొమోను గురించి ఇంకా ఎక్కువ మనము ఈరోజు చూద్దాము.
దేవుని మందిరము నిర్మించుటకు దావీదు ఆశపడుట
దావీదు జీవించినప్పుడు ప్రభువు కొరకు ఒక మందిరమును కట్టాలి అని ఎంతో ఆశించాడు. ప్రజలందరూ దేవుని స్తుతించుచు ఆరాధించుటకు ఒక మందిరము ఉండాలి అని కోరుకున్నాడు. అదేవిధంగా దేవుని నిబంధన మందసము కూడా మందిరములో ఉంటే బాగుంటుంది అని తలంచాడు. నిబంధన మందసము దాదాపు 500 సంవత్సరములు ప్రత్యక్షపు గుడారములోనే ఉన్నది కానీ ఇప్పుడు మందిరము నిర్మించి దానిలో ఉంచుటకు దావీదు తీర్మానించుకున్నాడు.
కానీ ప్రభువు ఒక దినము దావీదుకు ప్రత్యక్షమై - " నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును" అని చెప్పాడు. మందిరమును కట్టుటకు అవసరమైన వాటి నన్నింటిని దావీదు సమకూర్చుట మొదలు పెట్టాడు. చెక్క, రాళ్లు, బంగారము, వెండి, ప్రశస్తమైన రాళ్లు - ఇలా అన్నింటిని దావీదు పోగు చేయసాగాడు.
సొలొమోను మందిరమును కట్టించుట
దావీదు మరణించిన తరువాత సొలొమోను మందిరమును కట్టుట ప్రారంభించాడు. తన తండ్రి ఇచ్చిన మాదిరి ప్రకారము కట్టుట మొదలుపెట్టాడు. మందిరపు మాదిరి (నమూనాని) దావీదుకు ఎవరు ఇచ్చారు? దేవుడే మందిరపు మాదిరిని దావీదుకు ఇచ్చాడు. దేవుడు చెప్పిన నమూనా ప్రకారం, కొలతల ప్రకారము కట్టబడిన ఒకే ఒక మందిరము సొలొమోను కట్టించిన మందిరము.
ఆ గొప్ప మందిరమును కట్టుటకు అనేక వేలమంది ఏర్పాటు చేయబడ్డారు. యెరూషలేము మధ్యలో ఎంతో ఎత్తుగా కట్టబడిన ఆ గొప్ప మందిరము ఎంతో అందంగా ఉండి అందరినీ ఆకర్షించేది. బంగారము పొదిగిన ఎత్తైన స్తంభములతో ఆ మందిరము కట్టబడింది.
మందిరపు నిర్మాణము 7 సంవత్సరములలో పూర్తి చేయబడింది. దానిని ప్రభువుకు ప్రతిష్టించుటకు సొలొమోను గొప్ప కృతజ్ఞతార్పణలు అర్పించాడు. ప్రజలందరినీ అక్కడ సమకూర్చి వారందరూ చూచుచుండగా సాష్టాంగ పడి దేవునికి ప్రార్ధన చేశాడు. తాను కట్టించిన ఆ మందిరమును ఆశీర్వదించుమని ప్రార్థించాడు. వారు నిబంధన మందసము కొరకు ప్రత్యేకంగా నిర్మించిన అతి పరిశుద్ధ స్థలములో మందసమును ఉంచగా గొప్ప అద్భుతం జరిగింది. పైనుండి ఒక మేఘము దిగివచ్చి మందిరమును కమ్మి వేసింది. దేవుని సన్నిధి ఆలయములో ఉన్నది అనుటకు సూచనగా దేవుడు ఆ మేఘమును పంపాడు. ప్రభువు సంతోషించినవాడై తన ప్రజలను ఆశీర్వదించుటకు ఇష్టపడ్డాడు.
సొలొమోను ఐశ్వర్యము
మందిరమును కట్టించుట పూర్తి అయిన తరువాత సొలొమోను తన కొరకు ఒక అందమైన రాజనగరును కట్టించాడు (1వ రాజులు 9:10). సొలొమోను ఇంకను అనేక భవనములతో పాటు, యెరూషలేము చుట్టూ ఎతైన ప్రాకారమును కట్టించాడు. అనేక పట్టణములను కూడా కట్టించాడు. తన దగ్గర విస్తారమైన సంపద ఉన్నందువలన తనకు ఇష్టమైన వాటిని అన్నింటినీ సొలొమోను కట్టించగలిగాడు. అంత విస్తారమైన
ధనం మన దగ్గర ఉంటే మనం ఏమి చేయాలని అనుకుంటాము? సొలొమోను సైన్యములో 40 వేలమంది గుర్రపు రౌతులు, ఎన్నో ఓడలు, వాటిని చూసేవారు ఉండేవారు. అందమైన తోటలు, ప్రశస్తమైన వస్తువులు అన్నీ సొలొమోను కలిగి ఉండేవాడు. సొలొమోను నివసించే భవనము భోజన పాత్రలు గిన్నెలు అన్ని బంగారంతో చేయబడినవి. భూమిపై అంతవరకు ఎవరికీ లేనంత ఐశ్వర్యము, సంపద సొలొమోను కలిగియున్నట్లు మనము గ్రహించవచ్చు.
సమస్త ఐశ్వర్యము, సంపద కంటే విలువైనది మరొకటి సొలొమోను దగ్గర ఉంది. అదే దేవుడు ఇచ్చిన జ్ఞానము. మంచి చెడులను వివేచింపగలిగిన జ్ఞానము సొలొమోను కలిగియున్నాడు. అతడు కొన్ని వేల సామెతలు చెప్పాడు. అవి బైబిల్ లో మనము చదవగలము. సొలమోను ఇంకా పరమగీతము, ప్రసంగి అనే పుస్తకాలు కూడా రాశాడు. అతడు మొక్కలు, వృక్షములు, చెట్లు, మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు ఇలా అన్నింటిని గురించి రాశాడు.
సొలొమోను జ్ఞానమును గూర్చి వినుటకు జనులలో రాజులు అనేకులు వెళ్లుచుండే వారు. అనేకులు ఎన్నో బహుమానములు తీసుకొని వచ్చి సొలొమోనును దర్శించే వారు.
షేబ దేశపు రాణి సొలొమోనును దర్శించుట
సొలొమోనును గూర్చి వినిన షేబ దేశపు రాణి గొప్ప పరివారమును వెంటబెట్టుకుని యెరూషలేముకు వెళ్ళింది. ఆమె ఆఫ్రికా దేశము నుండి వచ్చి ఉంటుంది అని చరిత్రకారులు చెప్తారు.
సొలొమోను యొక్క ఐశ్వర్యమును, ఘనతను జ్ఞానమును గూర్చి విని కొన్ని గూఢమైన ప్రశ్నలతో పరీక్షించాలి అని అనుకుని యెరూషలేమునకు వచ్చింది. సొలొమోను జీవముగల దేవునియందు విశ్వాసము గలవాడు అని ఆమె గ్రహించింది (1వ రాజులు 10:1). షేబ దేశపు రాణి గొప్ప పరివారంతో, గంధపు చెక్క, విస్తారమైన బంగారము, రత్నములను ఒంటెలపై వేసుకొని వచ్చింది. ఆమె ఎంతో దూరము నుండి ప్రయాణం చేసి ఎన్నో ప్రశస్తమైన వస్తువులను సొలొమోనకు బహుమానముగా తీసుకొని వచ్చింది.
సొలొమోను రాజు ఏనుగు దంతముతో చేయబడి, బంగారము పొదిగించబడిన ఎత్తైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా షేబ రాణి, రాజు ఎదుటకు వచ్చింది. ఆ సింహాసనము ఆరు బంగారపు మెట్లు, బంగారపు పాదపీఠముతో చేయబడింది. ఆరు మెట్లకు రెండు ప్రక్కల బంగారు సింహములు చెక్కబడి ఉండేవి. ఏ రాజ్యములో కూడా అటువంటి సింహాసనము లేదు. షేబ దేశపు రాణి అడిగిన ప్రశ్నలన్నింటికీ సొలొమోను ఎంతో జ్ఞానము కలిగి సమాధానం చెప్పాడు. సొలొమోనుకు కష్టమైన ప్రశ్న ఏదీ లేకపోయింది.
షేబ దేశపు రాణి ఆశ్చర్యపడుట
సొలొమోను ప్రత్యుత్తరములను, అతని ఐశ్వర్యమును, ఘనతను చూచిన రాణి ఎంతో విస్మయముతో నిండిపోయింది. తాను వినిన దానికంటే ఎంతో ఎక్కువ ప్రసిద్ధి సొలొమోనుకు ఉండుట గమనించింది. సొలొమోను యొక్క అందమైన రాజభవనమును సేవకులను దేవుని మందిరమును భోజనపు ఏర్పాట్లను, పాత్రలను చూచి ఆమె ఎంతో
ఆశ్చర్యముతో నిండిపోయింది. సొలొమోనుతో - " నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక యుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీయందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల రాజుగా నియమించిన నీ దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువు ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను" అని చెప్పింది. షేబ దేశపు రాణి సొలొమోనుకు అంతటి గొప్ప జ్ఞానము, సంపద ఇచ్చిన ప్రభువును ఘనపరచడం ఎంత మంచి విషయం.
షేబ దేశపు రాణి తన బహుమతులను ఇచ్చుట
తరువాత షేబ దేశపు రాణి అనేకమైన విలువగల బహుమానములను సొలొమోను రాజుకు ఇచ్చింది. బంగారము, గంధము, విలువైన రత్నములను కానుకగా రాజుకు ఇచ్చింది. సొలొమోను కూడా తన ఐశ్వర్యమునకు తగినట్లు షేబ దేశపు రాణికి కానుకలను ఇచ్చాడు. అంతేకాకుండా ఆమె కోరిన వాటన్నింటిని సొలొమోను రాజు ఆమెకు ఇచ్చాడు.
ఆమె తన బహుమానములను పరివారమును తీసుకొని తిరిగి తన దేశమునకు ప్రయాణమైనది. జీవముగల దేవుని వలననే సొలొమోను ఎంతో జ్ఞానము, సంపద కలిగి ఉన్నాడని షేబ దేశపు రాణి గ్రహించింది. దేవుడు ఎంత గొప్పవాడు!
సందేశము
భూమిపై నివసించిన వారందరిలో సొలొమోను కంటే జ్ఞానవంతులు లేరు, ఐశ్వర్యవంతులు లేరు. దేవుడే సొలొమోనును ఆ విధముగా ఘనపరచాడు. ఒకే ఒక వ్యక్తి చరిత్రలో సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు. అవును ప్రభువైన యేసు సొలొమోను కంటే గొప్పవాడు. ప్రభువైన యేసు జన సమూహముతో మాటలాడుచు - "షేబ దేశపు రాణి సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు" అని చెప్పాడు (మత్తయి12:42). మనము జీవమునిచ్చు మాటలు వినుటకు యేసు దగ్గరకు వెళ్లాలి.
అన్వయింపు
మనము ఏ విధముగా యేసు దగ్గరకు వెళ్లి ఆయన మాటలు వినగలము? యేసు మాటలు బైబిల్ లో వ్రాయబడి ఉన్నాయి గనుక మనము బైబిల్ చదువుకోవాలి. సొలొమోను గురించి చెప్పబడిన మాటలు నిజమైనవి అని తెలుసుకొనుటకు షేబ దేశపు రాణి ఎంతో దూరం నుండి ప్రయాసముతో యెరూషలేము వెళ్ళింది. మరి యేసు మాటలు వినడానికి మీరు ఏ విధముగా ప్రయాస పడుతున్నారు? మనము షేబ దేశపు రాణి వలె ప్రయాణం చేయవ లసిన అవసరము ఎంత మాత్రము లేదు. యేసును గూర్చి వినుట ద్వారా ఆలోచించుట ద్వారా ప్రార్థించుట ద్వారా ఆయనను గురించి ఎక్కువ తెలుసుకొనగలం.యేసు మన పాపములను క్షమించి మనలను తన స్నేహితులుగా వారసులుగా చేసుకుంటాడు.
మీకు ఏదైనా కొనుక్కోవాలని గాఢమైన కోరిక ఉంటే మీ తల్లిదండ్రులు ఇచ్చే డబ్బును దాచుకొని కొనుక్కుంటారు. అలాగే క్రీస్తును వెంబడించాలి, ప్రేమించాలి అనే కోరిక ఉంటే ఆయనకు ప్రార్థిస్తూ, బైబిల్ చదువుతూ ఉంటారు. యేసును మీ రక్షకునిగా అంగీకరించినప్పుడు "" యేసు ప్రేమను గూర్చి నేను విన్నాను కానీ ఇప్పుడు అనుభవించాను" అని చెప్పగలము. యేసుని రక్షకునిగా కలిగి ఉండుట కంటే గొప్ప సంపద మన జీవితాలలో మరొకటి లేదు.
కంఠతవాక్యము
నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును (లూకా 10:27).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

