ఆదికాండము 37:12-36

ఉద్దేశము ఇతరుల యెడల మనము ద్వేషాన్నిపెంచుకొనరాదు అని బోధించుట.

ముఖ్యాంశము స్కూల్ లో మీకు ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా? మిమ్మల్నిగురించి వారు ఎప్పుడైనా చెడుగా మాట్లాడితే వారిపై కోపం వస్తుంది, వారితో మాట్లాడరు, వాళ్లను క్షమించలేరు కూడా! వారిని గురించి అందరికీ చెడుగా చెప్పి ఎవరూ వారితో మాట్లాడకుండా చేయడానికి కూడా మీరు ప్రయత్నిస్తారు. వారిని బాధపెట్టాలని చూస్తుంటారు. వారు మీకు చేసిన విధంగానే మీరు కూడా వారికి చేసి సంతృప్తి చెందుతుంటారు. మనసులోని ద్వేషపు ఆలోచనలు ఎలా క్రియలుగా మారుతాయి అనేది ఈ రోజు చూద్దాము.

గతవారము
యోసేపు సహోదరులు ఎందుకు అంత ఈర్ష్యతో ఉన్నారు? వారికి ఎందుకు అంత అసూయ?

యోసేపు తన సహోదరుల చెడు ప్రవర్తన గురించి తండ్రికి చెప్పేవాడు.
యాకోబు యోసేపుకు మాత్రమే ఒక విచిత్రమైన నిలువుటంగీని కుట్టించి ఇచ్చాడు.
యోసేపుకు వచ్చిన కలలు వారికి ఎంతో కోపాన్ని తెప్పించాయి. వారు తనతో కోపంగా, ఎగతాళి చేస్తూ మాట్లాడడం యోసేపుకు ఎంతో బాధ కలిగించి ఉంటుంది. యోసేపును గురించి ఎంతో కఠినమైన మాటలు వారు మాట్లాడి ఉండవచ్చు. యోసేపు కూడా కోపం తెచ్చుకుని వారితో కఠినముగా మాట్లాడలేదు, కాని ప్రభువుపై విశ్వాసముంచాడు. వారి అసూయ ద్వేషముగా మారడం వలన వారు యోసేపుకు హాని చేయలని ఎన్నోఆలోచనలు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

యోసేపు విధేయత గలవాడు
యోసేపు తల్లి చనిపోయిన తరువాత యాకోబు తనకు ప్రియమైన కుమారుని తన దగ్గరే ఉంచుకుని ఉండవచ్చు. యాకోబు యోసేపును మిగిలిన వారితో కలిసి పనిచేయుటకు పొలములోనికి పంపలేదు. మిగిలిన కుమారులకంటే యోసేపును ప్రత్యేకంగా చూడటం యాకోబు చేసిన పొరపాటు. పిల్లలలో ప్రత్యేకంగా ఒకరిని ఎక్కువగా ప్రేమించడం తల్లిదండ్రులు ఎన్నడూ చేయకూడదు. అది మిగిలిన వారిలో ఎంత అసూయ కలిగిస్తుందో తెలుసుకోవాలి. కానీ యోసేపు ఎప్పుడూ అటువంటి ప్రేమ కావాలని యాకోబును కోరలేదు.

పశువులకు మంచి మేత కొరకు యోసేపు సహోదరులు కొన్నిసార్లు ఎంతో దూరం ప్రయాణం చేసి వెళ్ళేవారు. వారు ఒకసారి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లారు. యాకోబు వారి క్షేమము గురించి ఆందోళన చెంది యోసేపును చూచి - "నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్ము" అని చెప్పగా యోసేపు - "మంచిది" అని తండ్రితో చెప్పాడు. యోసేపు వారి దగ్గరకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. "అంత దూరం ప్రయాణం చేసి కష్టపడి అక్కడికి ఎందుకు వెళ్లాలి? నా సహోదరులు నాతో ఎంతో కఠినంగా ఉంటున్నారు, ఎంతో అసూయతో ఉంటున్నారు నేను వెళ్ళను" అని అనుకొనలేదు. తండ్రి చెప్పిన మాటలు విని తన సహోదరుల దగ్గరకు వెళ్ళాడు.

యోసేపు తన సహోదరులను కనుగొనుట
యోసేపుకు షెకెములో తన సహోదరులు కనిపించలేదు. అతడు పొలములో ఇటుఅటు తిరుగుతూ వారిని వెదికాడు, కానీ వారు కనిపించలేదు. అక్కడ ఒక మనుష్యుడు యోసేపును చూచి ఏమి వెదుకుతున్నావు అని యోసేపును అడిగాడు. అందుకు యోసేపు -"నేను నా సహోదరులను వెదుకుచున్నాను. వారు మందను ఎక్కడ మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుము" అని అడిగాడు. అందుకు ఆ మనుష్యుడు - "ఇక్కడ నుండి వారు సాగి వెళ్లారు. వారు దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట నేను విన్నాను" అని చెప్పాడు. ఆ మనుష్యుని ద్వారా ప్రభువు యోసేపును సరియైన ప్రదేశానికి నడిపించి ఉండవచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి కనిపించకపోతే యోసేపు వెనుకకు వెళ్ళిపోయి తన సహోదరులను కలిసి ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ల సహోదరుల నుండి హాని కలుగక పోయి ఉండవచ్చు. కాని యోసేపు జీవితములో ప్రభువు యొక్క ఆలోచనలు, ప్రణాళికలు నెరవేర్చబడటం మనము చూడవచ్చు. అప్పుడు యోసేపు తిరిగి ప్రయాణం చేసి దోతానుకు వెళ్లి తన సహోదరులను కనుగొన్నాడు. యోసేపు సహోదరులు దూరమునుండి అతనిని చూచి అతని చంపుటకు దురాలోచన చేశారు. వారు అతనిని చూచి - "ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు" అని ఎగతాళి చేశారు. యోసేపు చెప్పిన కలలు వారికి గుర్తు వచ్చి ఉండవచ్చు. వీడిని చంపివేస్తే ఆ కలలు ఎలా జరుగుతాయి చూద్దాము అని వారు అనుకున్నారు. తమ కోసం వచ్చిన యోసేపును చూచి వారు సంతోషించక, కోపముతో నిండిపోయారు.

యోసేపును చంపుటకు అతని సహోదరుల ఆలోచన
యోసేపును చంపి అక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము యోసేపును తినివేసింది అని తమ తండ్రితో చెప్పాలి అని వారు ఆలోచన చేశారు. కానీ రూబేను కొంత దయగలిగి - "మనము వానిని చంపరాదు. రక్తము చిందించకుడి అతనికి

హాని ఏమియు చేయక అడవిలో నున్నఈ గుంటలో పడద్రోయుము" అని వారితో చెప్పాడు. యోసేపు వారి చేతిలో పడకుండా కాపాడి యాకోబుకు అప్పగించాలి అని రూబేను అనుకున్నాడు. యోసేపు తిరిగి వెళ్లకపోతే యాకోబు ఎంతో దుఃఖిస్తాడు అని రూబేను ఆలోచించి ఉండవచ్చు.

యోసేపు తన సహోదరుల దగ్గరకు వచ్చినప్పుడు వారు యోసేపు యొక్క విచిత్రమైన నిలువు టంగీ తీసివేసి అతని పట్టుకుని అక్కడ ఉన్న గుంటలో పడవేశారు. వారు యోసేపు ఏడుపును పట్టించుకోకుండా భోజనం చేయడానికి కూర్చున్నారు. తమకంటె చిన్నవాడైన యోసేపు పట్ల వారు అంత కఠినంగా ఎలా ప్రవర్తించు గలిగారు అని ఆశ్చర్యం కలుగుతుంది కదూ!

యోసేపును వర్తకులకు అమ్మి వేయుట
వారు బోజనము చేస్తుండగా గిలాదు నుండి గుగ్గిలము, మస్తకి, బోళము తీసుకొని ఐగుప్తునకు ఓడలమీద వెళ్లుచున్న ఇష్మాయేలీయులు వారికి కనిపించారు. అప్పుడు ఆ సహోదరులలో ఒకడైన యూదా - "మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టి నందు వలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మి వేయుదము" అని చెప్పాడు. యూదా ఆలోచన మిగిలిన వారికి కూడా నచ్చింది. అప్పుడు వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి 20 తులముల వెండికి అతనిని అమ్మివేశారు. తనను అమ్మివేయవద్దని యోసేపు తన సహోదరులను ఎంతగానో ప్రాధేయపడి ఉండవచ్చు, కాని వారు యోసేపును పట్టించుకొనలేదు. యోసేపు తనకు తెలియని దేశానికి, తెలియని వారితో కలిసి ప్రయాణం మొదలుపెట్టాడు. పాపం యోసేపు!

యోసేపు ఖాళీ చేతులతో బట్టలు కూడా లేకుండా వారితో వెళ్ళిపోయాడు. తన ఇంటిని, దేశాన్ని వదిలి పెట్టి వెళ్లి పోతున్నందుకు యోసేపు ఎంతగానో బాధ పడి ఉండవచ్చు. మరి యోసేపుతో ఎవరు ఉన్నారు? ప్రభువు యోసేపుకు తోడుగా ఉన్నాడు అని బైబిల్ లోవ్రాయబడింది (ఆది 39 :2). యోసేపుకు జరిగిన దానిని ప్రభువు చూస్తూ ఉన్నాడు, యోసేపును కాపాడుతున్నాడు. ప్రభువు తన ప్రణాళిక చొప్పున యోసేపుకు సమస్తము జరిగిస్తున్నాడు.

యోసేపు సహోదరులు అబద్దమాడుట
యోసేపు సహోదరులు యాకోబుతో ఏమి చెప్పబోతున్నారు? నిజము చెబితే యాకోబుకు కోపం వస్తుంది. తమ చెడుతనము కప్పిపుచ్చుకునేందుకు అబద్ధము చెప్పవలసి వచ్చింది. వారు యోసేపు యొక్క విచిత్రమైన అంగీని తీసుకుని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ముంచి తమ తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. అప్పుడు వారు యాకోబుతో -"ఇది మాకు దొరికెను. ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టుము" అని చెప్పారు. యాకోబు దానిని గుర్తుపట్టి "ఇది నా కుమారునిదే. దుష్ట మృగము వానిని తినివేసెను" అని చెప్పాడు.

యాకోబు తన కుమారుని గురించి ఎంతగానో దుఃఖించాడు. అతని కుమారులు ఓదార్చడానికి ప్రయత్నించారు, కాని యాకోబు తన బట్టలు చింపుకొని, నడుమున గోనెపట్ట పట్టుకొని అనేక దినములు యోసేపు కొరకు ఏడ్చాడు. యోసేపు వలె తాను కూడా చనిపోతే బాగుంటుంది అని ఎంతో బాధపడ్డాడు. యోసేపును అమ్మివేసి, చనిపోయాడు అని చెప్పి తమ తండ్రిని దుఃఖపెట్టిన యోసేపు సహోదరులు ఎంత దుర్మార్గులు.

సందేశము
యోసేపు ఎడల ఎంతో కఠినంగా ప్రవర్తించి, అతని సహోదరులు యాకోబును దుఃఖ పెట్టారు. వారు ఎంతో చెడుతనము కలిగినవారు. యోసేపును చంపునంతగా తమ హృదయాలలో ద్వేషాన్ని పెంచుకున్నారు. ఎన్నడూ చూడని వర్తకులైన ఇష్మాయేలీయులకు యోసేపును అమ్మివేశారు. తండ్రికి అబద్ధాలు చెప్పి తమ చెడుతనము, క్రూరత్వము దాచిపెట్టారు. తమ తప్పులు తండ్రికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. వారి విషయములో దేవుడు ఎంత ఆగ్రహం కలిగిఉన్నాడో ఊహించండి.

అన్వయింపు మీరు యోసేపు సహోదరులు వలె ఉన్నారా? మీపై ఈర్ష్యపడే వారిపై ద్వేషాన్ని పెంచుకుంటున్నారా? చెడు ఆలోచనలను అలాగే వదిలిపెడితే, ఇతరులకు హాని చేయాలి అనే పరిస్థితుల వరకు మనము వెళ్ళగలము అని గుర్తుంచుకోవాలి. ప్రభువు ఇటువంటి విషయాలను కూడా పాపముగానే ఎంచుతాడు. దేవునికి మన గురించి, మన ఆలోచనల గురించి పూర్తిగా తెలుసు. మనము మన హృదయాలలో ద్వేషాన్ని కలిగి ఉన్న వారమైతే క్షమించమని దేవుని వేడుకోవాలి. ప్రభువు మనలను క్షమించి ద్వేషమునకు బదులుగా ప్రేమతో మన హృదయాలు నింపగలడు.

ఉదాహరణ
సుధేష్, సందీప్ యౌవనస్థులైన అన్నదమ్ములు. పెద్దవాడైన సుధేష్ కు మంచి మార్కులు రావడం వలన స్కూల్ లో మంచి స్కాలర్ షిప్ వచ్చింది. సుధేష్ చదువులలోనే కాక పాటలు, సంగీతములో కూడా చాలా నైపుణ్యం కలవాడు. స్కూల్ లో కూడా చాలా మంచిపేరు ఉండటంవలన ఎంతోమంది స్నేహితులు ఉండేవారు. అందరూ సుధేష్ను మెచ్చుకోవడం చూచి సందీప్ ఎంతో ఈర్ష్య,అసూయతో నిండిపోయాడు. సందీప్ కూడా తెలివైనవాడు కానీ సురేష్ తో పోటీ పడలేక పోయేవాడు. సుధేష్ కు కోపం తెప్పించే విధముగా మాట్లాడేవాడు. సుధేష్ కూడా వెంటనే కోపంగా మాట్లాడేవాడు. ఆ విధముగా ఇద్దరూ గొడవలు పెట్టుకునేవారు. వారి చిన్నతనం అంతా గొడవలతోనే గడిచిపోయింది. సందీప్ కి సుధేష్ పట్ల ఉన్న ఈర్ష్య అసూయలే దానికి కారణం.

వీరి తల్లిదండ్రులు మంచి క్రైస్తవులు. ప్రతివారం తప్పక వీరిని చర్చికి తీసుకుని వెళ్ళేవారు. వారు గొడవలు పడకుండా ఉండటానికి తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నించేవారు. వారిద్దరు కూడా తాము చేస్తున్న పని సరి అయినది కాదు అనిపించి ప్రార్ధించు కొనేవారు. కాని మరలా ఏదో ఒక విషయంలో గొడవ పడేవారు. అది పరిష్కారం లేని సమస్య అని అందరూ వదిలివేశారు. కానీ వారు యౌవనస్థులుగా ఉన్నప్పుడు క్రైస్తవులుగా మారిపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలలో ఉన్నాడు కనుక వారి జీవితాలు మారిపోయాయి. ఎప్పుడైనా గొడవలు వచ్చినా వెంటనే ఒకరి కొకరు క్షమాపణ చెప్పుకొనేవారు. సందీప్ లోని ఈర్ష్య అసూయ, సుధేష్ లోని అసహనం మాయమైపోయాయి. ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండుటకు మొదలుపెట్టారు. వారిలో వచ్చిన మార్పును చూచి తల్లిదండ్రులు బంధువులు, స్నేహితులు, సంఘములోని వారు ఎంతో సంతోషించారు. ఇప్పుడు వారి హృదయాలు దేవుని ప్రేమతో నిండిపోయాయి.

మన హృదయాలలో ఎవరిమీదైనా ద్వేషం ఉన్నది అని మనకు అనిపిస్తుంటే ఏమి చేయాలి? దానిని అలాగే ఎక్కువ చేసుకుంటూ

యోసేపు సహోదరుల వలె వారికి హాని చేసే స్థితికి వెళ్ళకూడదు. సహోదరులు తనను కష్టపెట్టినా దేవునిపై విశ్వాసముంచిన యోసేపు వలె మనము కూడా ఉండాలి. యోసేపు తన సహోదరులతో గొడవ పడకుండా వారి పట్ల ప్రేమ,దయ కలిగి ప్రవర్తించాడు. ఎంత అద్భుతమైన విషయం !

కంఠతవాక్యం
చెడుతనమును అసహ్యించుకొనుడి (కీర్తనలు 97:10).

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.