సండే స్కూల్ విద్యార్థులకు బోధిస్తున్న ఒక టీచర్ ద్వారా ఈ బైబిల్ పాఠాలు వ్రాయబడ్డాయి. టీచర్లు ఎవరి పద్ధతిలో వారు బోధించినప్పటికి, ఇవి వారి సిద్ధపాటులో ఎంతగానో సహాయపడాలి అని మా ప్రార్థన.
పాఠ్య భాగము వివరణ యొక్క లక్ష్యం:
1. బైబిల్ లో వ్రాయబడిన భాగాలను వివరముగా తెలియజేస్తూ, వాటికి ఇతర వాక్యభాగాలతో గల సంబంధమును తెలుపుట.
2. పిల్లల మధ్య పరిచర్య చేయనివారు కూడా సులభమైన రీతిలో బోధించుటకు సహాయపడుట.
3. చిన్న పిల్లలకు బైబిల్ లోని ప్రదేశాలు, పరిస్థితులు, వ్యక్తుల గురించిన పూర్తి సమాచారాన్ని బోధించుట. కానీ బైబిల్ లో లేని విషయాలను ఇది ఖచ్చితమైనవి అని ఎంత మాత్రము బోధించ కూడదు. అటువంటి సమయాలలో “ బహుశా, కాబోలు ,ఊహించ వచ్చు, ఉండవచ్చు
అను కొనవచ్చు” అనే పదాలను వాడాలి,
ఉదాహరణ: గొర్రెల కాపరి ఎంతో సంతోషంగా పాటలు పాడుతూ గొర్రెలను మేపుతూ ఉండవచ్చు.
4. ప్రతి పాఠం యొక్క ఉద్దేశము,లక్ష్యం, ముఖ్యాంశములను గురించి వివరించడం మంచిది.
పాఠములను బోధించుటకు సిద్ధపాటు:
మీరు చెప్పబోయే పాఠ్య భాగము ముందుగా మీ హృదయాలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు ప్రార్థించండి. వారము మొదటి రోజు నుండే మీరు సిద్ధపడితే బాగుంటుంది అని సూచన.
సూచించబడిన బైబిల్ భాగాలను, వచనాలను తప్పకుండా చదవండి. పాఠంలోని ప్రధానమైన విషయాలు, ముఖ్య సందేశముల మీద ఎక్కువ దృష్టి ఉంచండి.
మీరు సిద్ధపడుతున్న సమయములో క్రింది విషయాలు గుర్తుంచుకోవడం మంచిది.
పిల్లల వయస్సు, బైబిల్ పట్ల వారికి ఉన్న జ్ఞానం, క్రైస్తవ సిద్ధాంతాల పట్ల వారికి ఉన్న అవగాహన
పాఠ్యభాగములను ఎక్కువ సార్లు చదవడం వలన క్లాసులో మీ నోట్స్ పిల్లల ముందు చూడవలసిన అవసరం ఉండదు. పిల్లలు శ్రద్ధగా, ఆసక్తిగా వినడానికి కొన్ని బొమ్మలు పెయింటింగ్స్ వాడితే మంచిది.
పాఠములను బోధించు విధానము:
సండే స్కూల్ కు వారి బైబిల్ ను తెచ్చుకొన వలసినదిగా పిల్లలను ప్రోత్సహించండి. వారి ముందు మీ బైబిల్ తెరచి ఉంచడం మంచిది. పిల్లల వయస్సు ఆధారంగా ఒకటి లేదా రెండు వచనాలు మాత్రం చదివించండి.
పిల్లలు అర్థం చేసుకునే శక్తిని అనుసరించి స్పష్టంగా, వివరంగా, సులభంగా బోధించండి. ఎక్కువ సమయం పిల్లలకు ఏకాగ్రత ఉండదు అని గుర్తుంచుకోండి.
ముందు పాఠాలలో నేర్చుకున్న విషయాలను తిరిగి గుర్తు చేయడం మంచిది.
క్రైస్తవ విశ్వాసానికి పునాది వంటి సత్యాలను వారికి మరల మరల గుర్తు చేయండి.
ఉదాహరణ: బైబిల్ సత్యమైనది, యేసుప్రభువు నిజమైన దేవుడు
మిమ్మల్ని ప్రశ్నలు అడగడం ద్వారా వారికి ఉన్న సందేహాలు అనుమానాలు పోగొట్టుకోవడానికి ప్రోత్సహించండి.
పిల్లలకు ఉన్న భయాలు, ఆందోళనలు, సమస్యలు మీతో భయం లేకుండా చెప్పగలిగిన స్వేచ్ఛ వారికి కలిగించండి. వారి పట్ల ప్రేమను శ్రద్ధ కనపరచండి.
ప్రార్థనతో మీ క్లాస్ ను ముగించండి.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.