ఆదికాండము 31:11-33:20

ఉద్దేశము/లక్ష్యము
భయాన్ని కలిగించే పరిస్థితులలో మనము ఉన్నప్పుడు ప్రభువు వైపు చూడాలి అని బోధించుట.

ముఖ్యాంశము

ఎవరైనా మీతో ఎప్పుడైనా చెడ్డగా ప్రవర్తించారా? మీ అక్క లేదా తమ్ముడు ఎవరైనా వారికి నచ్చని పని ఏదైనా మీరు చేస్తే, గొడవ పెట్టుకోవాలని చూస్తుంటారు. అది మీకు ఎంతో బాధ కలిగిస్తుంది. అంతేకాకుండా అసలు వాళ్ళు మీతో ఎప్పుడైనా మంచిగా ఉంటారా అనే అనుమానం కూడా వస్తుంది. మీ పట్ల అంత కఠినంగా ఉన్నవారిని ద్వేషించకుండా ఉండేందుకు సహాయపడమని ప్రభువును అడగాలి. ప్రభువు లూకా 6: 27లో మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి అని చెప్పాడు. లాబాను యాకోబు పట్ల ఎంతో మోసంగా ప్రవర్తిస్తున్నట్లు మనము చూశాము. తరువాత ఏమి జరిగిందో తెలుసుకుందాము.

గతవారము

యాకోబు హారానులో నివసించినట్లు బైబిల్ లో వ్రాయబడింది. యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలు తండ్రి లాబాను యాకోబును ఎలా మోసం చేశాడో చూశాము. లాబాను ఎటువంటివాడు అని మీరు అనుకుంటున్నారు? రాహేలును పెండ్లి చేసికొనుటకు యాకోబు ఎన్ని సంవత్సరములు ఎదురు చూడవలసి వచ్చింది? ఎన్ని సంవత్సరములు యాకోబు లాబానుకు పనిచేశాడు? రాహేలు,లేయాలను యాకోబు పెండ్లి చేసుకోవడానికి 14 సంవత్సరములు లాబాను దగ్గర పని చేయవలసి వచ్చింది.

యాకోబు భార్య అయిన లేయా ఆరుగురు కుమారులను కన్నది. అనేక సంవత్సరముల తరువాత రాహేలుకు యోసేపు పుట్టాడు. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె పుట్టారు. దేవుడు తాను వాగ్దానము చేసినట్లుగానే యాకోబు సంతానమును ఎంతగానో విస్తరింపచేశాడు (ఆది 28: 14).

యాకోబు తన ఇంటికి దూరంగా 20 సంవత్సరములు హారానులో నివసించాడు. తిరిగి తన దేశమునకు వెళ్లాలని యాకోబుకు కోరిక కలిగింది. యాకోబు వలన లాబాను ఎంతో ధనవంతుడు అయ్యాడు కనుక యాకోబును పంపి వేయడానికి ఇష్టపడలేదు. తన మందలోని మచ్చలు, పొడలుగల గొర్రెలను యాకోబుకు జీతముగా నిర్ణయించి తన దగ్గరే పని చేయమని కోరాడు. యాకోబు మందలోని పశువులు ఎంతో విస్తరించాయి. అతనికి అనేకమైన ఒంటెలు, గొర్రెలు, పనివారు కూడా ఉన్నారు. దేవుడు తోడుగా ఉన్నందున యాకోబు ఎంతగానో ఆశీర్వదించ బడ్డాడు (ఆది 30: 25-43). యాకోబు ఇప్పుడు సమృద్ధి గలవాడుగా ఉన్నాడు.

యాకోబుకు ఎటూ తోచని పరిస్థితి

యాకోబు సంపద చూచి లాబాను అసూయతో నిండిపోయాడు. లాబాను తన పట్ల ప్రవర్తిస్తున్న తీరు యాకోబుకు ఎంతో కష్టాన్ని కలిగించింది. లాబాను మోసపు హృదయముతో అనేకమార్లు యాకోబు జీతాన్ని మార్చాడు (ఆది 31:7). అటువంటి కఠినమైన, స్వార్ధ పరుడైన లాబానుతో ఏ విధముగా కలిసి పని చేయాలో యాకోబుకు అర్థం కాలేదు. లాబాను ముఖములో ఎప్పుడూ తన పట్ల కోపము, ద్వేషము ఉన్నట్లు యాకోబు గుర్తించాడు. లాబాను విగ్రహాలను ఆరాధించేవాడు,దేవుని భయం లేనివాడు అని బైబిల్ లో వ్రాయబడింది (ఆది 31:30). కాని యాకోబు తన యందు విశ్వాసముంచిన వాడు గనుక ప్రభువు తోడుగా ఉండి కాపాడుతున్నాడు.

యాకోబు స్వప్నము

ఒక రాత్రి యాకోబు కలగన్నాడు. అందులో దేవుని దూత - "యాకోబూ, నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుము" అని చెప్పాడు. యాకోబుకు బేతేలులో కలిగిన స్వప్నము గురించి, తాను తిరిగి యాకోబును స్వదేశమునకు రప్పిస్తాను అని చేసిన వాగ్దానము గురించి ప్రభువు గుర్తుచేశాడు (ఆది 31:3,12,13). యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును,లేయాను పిలిచి వారితో మాట్లాడాడు. వారితో - "మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై యున్నాడు. మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసేయున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయ నియ్యలేదు" అని చెప్పాడు. ప్రభువు దూత ద్వారా తన స్వదేశమునకు తిరిగి వెళ్లుమని చెప్పినట్లు వారికి తెలిపాడు. దేవుని మాట చొప్పున తిరిగి కనాను దేశము వెళ్ళుటకు లేయా, రాహేలు కూడా అంగీకరించారు.

యాకోబు లాబాను యొద్ద నుండి పారిపోవుట

యాకోబు కుటుంబముతో అక్కడనుండి వెళ్లి పోవుటకు సిద్ధమయ్యాడు. యాకోబు తాను సంపాదించిన సంపద యావత్తును తీసుకొని త్వరగా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. యాకోబు వెంట పెద్ద గుంపు బయలుదేరింది. హారానును విడిచి కనాను దేశము వెళ్ళుటకు వారు బయలుదేరారు. దాదాపు 650 కిలోమీటర్ల దూరములో ఉన్న కనాను చేరుకోవడానికి ఎన్నో రోజులు పడుతుంది కనుక ప్రతిరోజు రాత్రి ఒకచోట బస చేయాలి. యాకోబు కుటుంబమును తీసుకొని వెళ్లిపోయిన సంగతి మూడవ దినమున లాబానుకు తెలిసింది. అతడు త్వరపడి వెంబడించి వారిని కలుసుకున్నాడు. తాను వెళ్ళిపోతున్న సంగతి యాకోబు చెప్పకుండా రహస్యముగా ఉంచినందుకు లాబానుకు కోపము వచ్చింది.

తాను పనిచేసిన 20 సంవత్సరములు లాబాను తనను సరిగా చూసుకొనలేదు అని యాకోబు అతనితో చెప్పాడు. యాకోబు లాభానుతో - "దేవుడు నా ప్రయాసము, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నాకు కలలో కనిపించాడు. నా దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి యుందువు" అని చెప్పాడు. లాబాను చెడుతనమును గురించి యాకోబు చెప్పినప్పటికి లాబానులో ఎటువంటి పశ్చాత్తాపము లేదు, యాకోబును క్షమించమని అడగలేదు. లాబాను ఎంతో దురాశ, స్వార్థము కలవాడు. లాబాను తాను యాకోబును ఏమీ చేయలేను అని అర్థం చేసుకున్నాడు. వారు తిరిగి తనతో హారాను రారు అని కూడా గ్రహించాడు. దేవుడు యాకోబుకు ఎటువంటి హాని చేయకుండా లాబానును ఆపివేశాడు గనుక లాబాను వారికి వీడ్కోలు చెప్పి తన దేశానికి వెళ్లిపోయాడు. యాకోబు కనానుకు తన ప్రయాణం కొనసాగించాడు. లాబాను నుండి దూరంగా వెళ్లి పోతున్నందుకు యాకోబు ఎంతగానో సంతోషించి ఉండవచ్చు.

యాకోబు ఏశావు కలుసుకొనుట

దేవుడు యాకోబును లాబాను నుండి విడిపించాడు. మరి ఏశావు మాట ఏమిటి? కనాను దేశమునకు సమీపంలో ఉన్నప్పుడు తన సహోదరుడైన ఏశావును కలుసుకోవాలి అనే విషయం యాకోబుకు ఎంతో భయం కలిగించింది. ఏశావు నుండి తప్పించుకోవడానికి యాకోబు కనాను దేశము విడిచి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఫోన్ లు ఉండేవి కాదు కాబట్టి ఏశావుకు ఇంకా తనపై కోపం ఉందో లేదో యాకోబుకు తెలియదు. తాను కనాను దేశమునకు వస్తున్న విషయము ఏశావుతో చెప్పటానికి యాకోబు ఒక దూతను ముందుగా పంపాడు. ఆ వ్యక్తి యాకోబు దగ్గరకు వచ్చి - "ఏశావు నిన్ను ఎదుర్కొనుటకు నాలుగు వందల మంది మనుష్యులతో వచ్చుచున్నాడు" అని చెప్పాడు. ఆ మాటలు విని యాకోబు ఎంతగానో భయపడ్డాడు.

ఏశావు తనను తన కుటుంబమును చంపేయడానికి వస్తున్నాడు అని యాకోబు భయపడ్డాడు. యాకోబు ఏమి చేయగలడు? అప్పుడు యాకోబు దేవునికి ప్రార్థన చేశాడు - "నా దేవా, నీ దేశమునకు నీ బంధువులు యొద్దకు తిరిగి వెళ్లుము నీకు మేలు చేసెదను అని చెప్పిన దేవా, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము" అని ప్రార్థించాడు. అప్పుడు యాకోబు తన అన్న కొరకు ఒక కానుక పంపాలని అనుకున్నాడు. యాకోబు 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు,30 పాడి ఒంటెలు వాటి పిల్లలు, 40 ఆవులు,10 ఆబోతులు , 20 ఆడు గాడిదలు, 10 గాడిద పిల్లలను తీసికొని ఏశావుకు కానుకగా పంపాడు. ఒకవేళ ఆ కానుకలు చూచి ఏశావు తన కోపమును వదిలి పెట్టవచ్చు అని యాకోబు అనుకున్నాడు. ఇది ఇరువురూ సమాధాన పడటానికి సహాయపడుతుంది అని ఆశించాడు. యాకోబు తన కుటుంబమును, పిల్లలను, దాసదాసీలను ముందుగా యబ్బోకు రేవు దాటించి తాను ఒక్కడు ఒంటరిగా మిగిలిపోయాడు.

యాకోబు దేవునితో పోరాడుట

యాకోబు ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాడు? యాకోబు దేవునికి ప్రార్థన చేయాలి అనుకున్నాడు. ఏశావును ఎదుర్కొనబోతున్నందుకు యాకోబు ఎంతో భయపడుతున్నాడు. ఆ పరిస్థితిలో దేవుడు మాత్రమే తనను కాపాడగలడు అని విశ్వసించాడు. అప్పుడు దేవుడు ఒక నరుని యాకోబు దగ్గరకు పంపాడు. నిజానికి ప్రభువే యాకోబు దగ్గరకు నరునిగా వచ్చాడు. అతడు తనకు సహాయపడగలడు అని యాకోబు నమ్మి ఉండవచ్చు. తెల్లవారు వరకు యాకోబు ఆయనతో పెనుగులాడాడు. "అతడు కన్నీరు విడిచి బతిమాలెను. అతడు దూతలతో పోరాడి విజయమొందెను" అని బైబిల్ లో హోషేయ 12:4లో వ్రాయబడింది. యాకోబు ఆ నరునితో - "నీవు నన్ను ఆశీర్వదించి తేనే గాని నిన్ను పోనియ్యను" అని చెప్పగా ఆయన అక్కడ యాకోబును ఆశీర్వదించాడు. ఆకాశమును భూమిని సృష్టించిన దేవునితో యాకోబు పోరాడాడు. మరెవరూ ఇటువంటి అనుభవం కలిగి ఉండకపోవచ్చు. అప్పుడు దేవుడు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు అను పేరుకు మోసగాడు అని అర్థము, ఇశ్రాయేలు అను పేరుకు "దేవునితో పోరాడువాడు" అని అర్థము. ఇప్పుడు యాకోబు హృదయములో ఎంతో నెమ్మది కలిగింది. దేవుని కలుసుకున్నాడు గనుక ఏశావును గురించిన భయము యాకోబులో తొలగిపోయింది. ఏ పరిస్థితుల్లోనైనా దేవునిపై ఆధారపడాలని నేర్చుకున్నాడు.

యాకోబు ఏశావును కలుసుకొనుట

తరువాత యాకోబు కూడా నది దాటి వారిని కలుసుకున్నాడు. ఏశావును, అతనితో నాలుగు వందల మంది మనుష్యులు వచ్చుట యాకోబు చూశాడు. యాకోబు ఏశావును కలసికొనుటకు అందరికంటె ముందుగా వెళ్ళాడు. ఏశావును చేరుకునే వరకు ఏడుసార్లు నేలమీద సాగిలపడ్డాడు. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తి పోయి యాకోబును కౌగలించుకుని మెడమీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు వారిద్దరూ ఏడ్చారు. తిరిగి తన సహోదరుని కలుసుకున్నందుకు ఏశావు ఎంతగానో సంతోషించాడు. యాకోబు చేసిన మోసము ఏశావు మరచి పోయినట్లుగా అనిపిస్తుంది.

ఇప్పుడు యాకోబుకు ధైర్యం వచ్చి ఉండవచ్చు. ప్రభువు యాకోబు ప్రార్థనలు విన్నాడు. ఏశావు యాకోబు భార్య పిల్లలను, అతని ఆస్తిని చూచిన తరువాత సంతోషముగా తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. యాకోబు సుక్కోతుకు ప్రయాణమై పోయి తనకొక ఇల్లు కట్టించుకొని, పశువుల పాకలు వేయించాడు. షెకెము దగ్గర ఒక బలిపీఠము కట్టి ఏల్ ఎలొహేయి ఇశ్రాయేలు అనగా "ఇశ్రాయేలు దేవుడే దేవుడు" అని పేరు పెట్టాడు. యాకోబు తిరిగి వచ్చినప్పుడు తండ్రిని చూడగలిగాడు గాని రిబ్కాను చూడలేకపోయాడు. రిబ్కా అప్పటికే మరణించి ఉండవచ్చు.

సందేశము

యాకోబు తన ఇంటికి దూరముగా వెళ్ళిన సమయములో ఎన్నో విషయాలు జరిగాయి. ఆ సమయమంతా ప్రభువు యాకోబుకు తోడుగా ఉన్నాడు. లాబాను పెండ్లి విషయములో, జీతము విషయములో యాకోబును ఎంతగానో మోసం చేశాడు. 20 సంవత్సరముల తరువాత దేవుడు యాకోబును తిరిగి కనాను దేశము వెళ్ళమని చెప్పాడు. ఏశావును ఎదుర్కొనుటకు ఎంతో భయపడిన యాకోబు దేవుని సహాయము కొరకు ప్రార్థించాడు. ప్రభువు యాకోబు ప్రార్థన విని అన్నీ సక్రమంగా జరుగునట్లు చేశాడు. దేవుడు తాను యాకోబుకు చేసిన ప్రమాణాలను అన్నింటినీ నెరవేర్చాడు.

యాకోబుకు దేవుడు ఇశ్రాయేలు అనే క్రొత్త పేరు పెట్టడం కూడా చూశాము. అప్పటి నుండి ఇశ్రాయేలు ఒక దేశముగా ఏర్పడటం మొదలయింది. యాకోబు సంతానము నక్షత్రముల వలె విస్తరించింది. వారినే ఇశ్రాయేలీయులు అని పిలుస్తారు. ఇప్పటికి కూడా వారు కనాను దేశములో నివసిస్తున్నారు.

అన్వయింపు

మనందరికి బాధలు కష్టాలు వస్తుంటాయి. కొన్నిచాలా చిన్నవిగా ఉంటాయి. ఉదా: ఏదైనా వస్తువులు పోగొట్టుకోవడం, లేదా స్కూల్ మారడం ఇలాంటివి. కొన్నిసార్లు చాలా పెద్ద కష్టాలు ఎదుర్కొంటాము. ఉదా: మనకు ఇష్టమైన వాళ్లను పోగొట్టుకోవడం, వేరే దేశం వెళ్ళిపోవడం. అటువంటి సమయాలలో మనసులో ఎంతో బాధ ఉంటుంది, ఏడవాలి అనిపిస్తుంది. అలా మీకెప్పుడైనా అనిపించిందా? అప్పుడు ఏమి చేయాలి? యాకోబు వలె ప్రభువుకు ప్రార్థన చేయాలి. మన కష్టాల గురించి ఆయనకు చెప్పుకోవాలి. ఆయన మనలను అర్థం చేసుకొని సహాయపడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

ఉదాహరణ

జగదీష్ 13 సంవత్సరముల వయసులో క్రొత్త స్కూల్ లో చేరాడు. అక్కడ అతనికి ఎవరూ తెలియదు, ఒంటరిగా ఉన్నట్లు అనిపించేది. ఎంతో బాధతో దేవునికి ప్రార్ధించాడు. వెంటనే అతనికి చాలా మంది కొత్త స్నేహితులు దొరికారు. అప్పటి నుండి ప్రతి దినము బైబిల్ చదివి ప్రార్ధన చేసుకునేవాడు. తాను మంచి క్రైస్తవుడిగా ఉండాలి అని ఆశపడ్డాడు. తన ప్రార్థనకు అద్భుతంగా సమాధానం ఇచ్చిన ప్రభువును గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అనుకున్నాడు. జగదీష్ యేసును తన హృదయం లోనికి ఆహ్వానించి క్రైస్తవునిగా మారాడు. మన భయాలలో, కష్టాలలో మనము ప్రభువు వైపు చూడటం నేర్చుకోవాలి.

కంఠత వాక్యము
నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను (కీర్తనలు 56:3).

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.