సౌలు దావీదును వెంటాడుట
1వ సమూయేలు 23: 14 - 29 & 24 అధ్యాయాలు, కీర్తన 142
ఉద్దేశము
దావీదు ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి వచ్చింది. కష్టాలు వచ్చినప్పుడు దావీదు దేవునికి చేసిన ప్రార్థనలు కీర్తనలుగా వ్రాయబడ్డాయి. మనము కూడా కష్ట పరిస్థితులలో దేవునికి ప్రార్ధన చేయాలి అని బోధించుట.
ముఖ్యాంశము
మీరెప్పుడైనా దాగుడుమూతలు ఆడుకుంటారా? చాలా సరదాగా ఉంటుంది కదూ? ఎవరూ చూడకుండా మంచము క్రింద, తలుపు వెనక, వంట గదిలో, తోటలో ఇంకా ఎన్నో చోట్ల దాగుకున్నప్పుడు మనము కనబడకుండా ఉండటం ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈరోజు అటువంటి విషయం గురించి మనము నేర్చుకోబోతున్నాము. అది సరదాగా ఆడుతున్న ఆట కాదు గాని ప్రాణం కాపాడుకోవడం కోసం ప్రయత్నం.
నేపధ్యము
దావీదు యెడల సౌలు ఈర్ష్య, ద్వేషము, అసూయ కలిగి ఉండుట మనము చూసాము. సౌలు ఎందుకు దావీదుపై ఈర్ష్య పెంచుకున్నాడు? స్త్రీలు నాట్యమాడుతూ - " సౌలు వేలకొలదియు దావీదు పది వేల కొలదియు శత్రువులను హతముచేసిరి" అని పాడుట సౌలు విన్నాడు. దావీదు గొల్యాతును చంపినందువలన అతడు అందరి దృష్టికి ఎంతో గొప్పవాడుగా హెచ్చించ బడ్డాడు. అందరి ఎదుట దావీదుకు పేరు రావడం సౌలుకు నచ్చలేదు. తనకు బదులుగా దావీదు ఇశ్రాయేలీయులకు రాజుగా ఎన్నుకొనబడతాడు అని సౌలు భయపడ్డాడు. తన ఈర్ష్య, అసూయ తీసివేయమని సౌలు ప్రభువుకు ప్రార్థించవలసింది, కాని అలా చేయకుండా దావీదు యెడల ద్వేషాన్ని పెంచుకుంటూ వచ్చాడు. తన ఈటెతో దావీదును చంపడానికి రెండు సార్లు ప్రయత్నించాడు. దావీదు తప్పించుకొని అక్కడ నుండి పారిపోయినట్లు మనము చూసాము. దావీదు సౌలు నుండి తప్పించుకొనుటకు సౌలు కుమారుడు, దావీదు ప్రాణ స్నేహితుడైన యోనాతాను, సౌలు కుమార్తె అయిన మీకాలు సహాయము చేశారు. అప్పటి నుండి సౌలు దావీదును తరుముట మొదలుపెట్టాడు. కాని దావీదు చేసిన ప్రార్థనలు విని దేవుడు అతనిని ఎలా తప్పించాడు చూద్దాము.
దావీదు సౌలు నుండి తప్పించుకుని దాగుకొనుట (1 సమూయేలు 20- 22 అధ్యాయాలు)
దావీదు యెరూషలేము నుండి పారిపోయి ముందుగా రామాలోని ప్రవక్త అయిన సమూయేలు దగ్గరకు వెళ్లాడు. సమూయేలు దావీదును అభిషేకించిన విషయాన్ని వారు గుర్తు చేసుకుని ఉండవచ్చు. దావీదు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండునట్లు దేవుడు నిర్ణయించాడు గనుక దానిని ఎలాగైనా ఆయన నెరవేరుస్తాడు అని సమూయేలు దావీదుకు ధైర్యం చెప్పాడు.
దావీదు ఎంతో దూరం ప్రయాణం చేస్తూ రామా, నోదు, గాతు, అదుల్లాము తిరిగాడు. అతడు పర్వతములలో, అరణ్యములో ఉండేవాడు. దావీదు సహాయము చేయుటకు నాలుగు వందల మంది అతని దగ్గరకు వచ్చారు. వారు సౌలుకు కనిపించకుండా చాటైన స్థలములను వెదకి అక్కడ బస చేస్తుండేవారు.
దావీదు తనవారితో అరణ్యములో ని ఒక వనములో దిగినప్పుడు దావీదు ప్రాణ స్నేహితుడైన యోనాతాను అతనిని రహస్యముగా కలవడానికి వచ్చాడు (23:16-18). యోనాతాను దావీదుతో - "నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు. నీవు భయపడవద్దు. నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు. నేను నీకు సహకారినౌదును". అని చెప్పి దేవుని బట్టి దావీదును బలపరిచాడు. వారు ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉండునట్లు గా ప్రమాణము చేసుకొని వీడ్కోలు తీసుకున్నారు. యోనాతాను కలిసినందుకు దావీదు ఎంతగానో సంతోషించి ఉండవచ్చు.
సౌలు దావీదును వెదకుట
దావీదు దాగుకొనిన స్థలము కనిపెట్టుటకు సౌలు అన్నిచోట్ల మనుష్యులను ఉంచాడు. దావీదు తన జనులతో మయోను అరణ్యములో ఉన్నట్లు సౌలు మనుష్యులు తెలియజేశారు. అప్పుడు సౌలు తన సైనికులను తీసుకొని దావీదును పట్టుకొన వలెనని తరమ సాగాడు. దావీదు తన జనుల తో కలసి సౌలు నుండి తప్పించుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు. దావీదు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నాడు. దావీదు ప్రభువు సహాయం కొరకు ఎలుగెత్తి మొర పెట్టాడు. అప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు . ఫిలిష్తీయులు దండెత్తి దేశములో చొరబడి ఉన్నారు అని సౌలు కు వర్తమానము రాగా, సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు. ప్రభువు అద్భుత రీతిలో దావీదును ఆ పరిస్థితి నుండి కాపాడాడు. సౌలు ఫిలిష్తీయులను తరుముట అయిన తరువాత తిరిగి దావీదును వెదకుటకు మూడు వేల మందితో బయలుదేరాడు.
దావీదు సౌలును చంపకుండా వదిలి పెట్టుట (1 సమూయేలు 24 అధ్యాయము, కీర్తన 142)
దావీదు, అతని జనులు కొండ మేకలు ఉండే చోట బస చేశారు. దానికి దగ్గరలోనే ఒక గొర్రెల దొడ్డి గుహ ఉన్నాయి. దావీదు తన జనులతో కలసి ఆ గుహలో క్షేమంగా ఉంటున్నాడు. దావీదును వెతుకుతూ తిరుగుతున్న సౌలు కొంతసేపు విశ్రాంతి తీసుకొనుటకు ఆ గుహ లోపలికి వెళ్ళాడు. గుహ లోపల ఉన్న దావీదు మనుష్యులు ఎంతో సంతోషించారు. సౌలును చూచిన వెంటనే తమ శత్రువు తమ ఎదురుగా ఉండుట చూచి ఆశ్చర్య పోయి ఉండవచ్చు. వారు దావీదుతో - " ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని ప్రభువు నీతో చెప్పిన దినము వచ్చెను" అని చెప్పారు.
కానీ దావీదు వారితో - " ఇతడు అభిషేకము పొందినవాడు గనుక అతనిని నేను చంపను" అని చెప్పాడు. దావీదు సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోశాడు. ఆ విధముగా చేసినందుకు దావీదు తరువాత బాధ పడ్డాడు. సౌలు మీదికి తన జనులు పోకుండా దావీదు వారిని అడ్డగించి ఆపాడు. దావీదు సౌలుకు ఎటువంటి కీడు చేయడానికి ఇష్టపడలేదు. తనకు మంచి అవకాశం వచ్చినప్పటికి సౌలుకు ఎటువంటి హాని చేయాలని దావీదు తలంచలేదు. సౌలు విషయములో దేవుడు తీర్పు తీరుస్తాడు అని దావీదు నమ్మాడు. దేవుని సమయములోనే తాను ఇశ్రాయేలీయులకు రాజుగా పరిపాలన చేస్తాను అని దావీదు విశ్వసించాడు. దావీదు తనను తాను కాపాడుకొనుటకు సౌలును చంపి ఉండవచ్చు, కాని దావీదు అలా చేయకపోవడం ఎంత మంచితనం!
సౌలు పశ్చాత్తాప పడినట్లు నటించుట
సౌలు లేచి గుహలో నుండి బయటకు వెళ్ళిన వెంటనే దావీదు కూడా బయటకు వెళ్లాడు. దావీదు సౌలు వెనుకనుండి - " నా యేలినవాడా రాజా" అని కేక వేయగా సౌలు వెనకకు తిరిగి చూడగా సాష్టాంగ పడి నమస్కారము చేస్తున్న దావీదు కనిపించాడు. అప్పుడు దావీదు సౌలుతో - " దావీదు నీకు కీడు చేయనుద్దేశించు చున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము ఈ దినమున ప్రభువు నిన్ను ఏలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లార చూచితివి. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు ప్రభువు చేత అభిషేకము పొందిన వాడు గనుక నా యేలిన వాని చంపనని నేను చెప్పితిని. నా తండ్రీ ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంతమాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు నీవు తెలిసికొనవచ్చును. ఈ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్నుతరుముచున్నావు" అని చెప్పాడు. దావీదు సౌలు పట్ల ఎంతో యధార్థ హృదయము కలిగినవాడైయున్నాడు. సౌలు దావీదు తో ఏమి మాట్లాడి ఉండవచ్చు? దావీదు మాటలు విన్న తరువాత సౌలు బిగ్గరగా ఏడ్చి - " ప్రభువు నన్ను నీ చేతికి అప్పగింప గా నన్ను చంపక విడిచి నందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసినవాడవై నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు. నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచ బడుననియు నాకు తెలియును" అని చెప్పాడు. సౌలు సంతతి వారికి ఎటువంటి హాని చేయను అని దావీదు సౌలుకు ప్రమాణం చేసిన తరువాత సౌలు తిరిగి తన ఇంటికి వెళ్ళాడు, దావీదు అరణ్యములో నే నిలిచిపోయాడు.
సౌలు తిరిగి దావీదును వెదకుట
కొన్ని దినముల తరువాత సౌలు తన మనస్సు మార్చుకుని దావీదును వెదకి చంపుటకు తిరిగి బయలుదేరాడు. దావీదు మాటలు వినిన తరువాత మారినట్లు అనిపించినప్పటికిని సౌలు హృదయములో నిజమైన మార్పు కలుగలేదు. దావీదు సౌలు మాటలపై నమ్మకముంచక ఇంకను క్షేమముగా ఉండునట్లు అరణ్యములో కొండలలో అనుసరించు సాగాడు. తిరిగి సౌలు తనను వెదుకుతూ తిరిగి వస్తున్నాడని తెలిసి దావీదు ఎంతగానో కలత చెందాడు. మరల ఒకరోజు రాత్రి సౌలు నిద్రపోతున్న సమయంలో అతనిని చంపడానికి దావీదుకు అవకాశం దొరికింది. దావీదు రాత్రివేళ సౌలు నిద్ర పోవుచున్న ప్పుడు అతని తల దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వెళ్ళిపోయాడు. తరువాత దావీదు దూరముగా వెళ్లి తాను చేసిన పనిని సౌలు చెప్పాడు. సౌలు దావీదు మాటలు వినిన తరువాత పశ్చాత్తాప పడినట్లు కనిపించాడు. దావీదును తరుముట మాని సౌలు తిరిగి తన నగరుకు వెళ్ళిపోయాడు. దావీదుకు సౌలుపై నమ్మకము లేక వేరొక దేశము వెళ్లి అక్కడ నివసించాలని అనుకున్నాడు.
సందేశము
సౌలు దావీదును తరుముట, దావీదు తప్పించుకొని దాగియుండుట మనము చూసాము. సౌలు ఎందుకు దావీదును తరిమి చంపాలి అనుకుంటున్నాడు? దావీదులో చెడు తనము లేదు. సౌలుకు దావీదు యెడల ఉన్న ఈర్ష్య, అసూయ వలన ఎంతో ద్వేషంతో నిండిన వాడై చంపాలని తరమ సాగాడు. సౌలును చంపుటకు దావీదుకు ఎన్నో అవకాశాలు వచ్చాయి కాని ప్రభువు అభిషేకించిన వానిని ముట్టకూడదు అనే అభిప్రాయము కలిగి సౌలును చంపలేదు. దావీదు తన పనులు ప్రభువుకు ప్రీతికరమైనవి గా ఉండాలని ఆశించాడు.
దావీదు తనకు ఎదురైన ప్రతి కష్టంలో యధార్ధముగా ప్రభువుకు ప్రార్థించాడు. ప్రభువు దావీదు ప్రార్థనలను విని దావీదును క్షేమముగా ఉంచాడు. దావీదు తన కష్ట సమయాలలో చేసిన ప్రార్థనలన్నీ బైబిల్ లో కీర్తనలు రూపంలో ఉన్నాయి. తన ప్రార్థనలు పాటల రూపంలో బైబిల్ లో ఉంటాయి అని దావీదు అనుకుని ఉండకపోవచ్చు. క్రైస్తవులందరూ తమ కష్ట సమయాల లో దావీదు వ్రాసిన కీర్తనలను చదివి ఆదరణ పొందుతుంటారు. కీర్తనలు చదివినప్పుడు దావీదు ఎంత కృతజ్ఞత కలిగి ప్రభువు సన్నిధిలో జీవించాడు అనే విషయం మనం గుర్తించగలం. 23 వ కీర్తన ప్రతి క్రైస్తవుడు కంఠోపాఠం చేసి చెప్పుకుంటూ సంతోషిస్తుంటారు.
అన్వయింపు
ప్రపంచములను సృష్టించిన దేవుడు మానవుల ప్రార్ధన ఆలకించడం ఎంత అద్భుతం! మనకు ఎటువంటి కష్టం వచ్చినా ప్రభువుకు ప్రార్థన చేయవచ్చు. ప్రభువు మన ప్రార్థనలను విని జవాబు ఇచ్చినప్పుడు మనము ఇంకా సంతోషముతో, కృతజ్ఞతతో ఆయనను ప్రేమించగలము.
కంఠతవాక్యము
ఆపత్కాలమందు ప్రభువు నీకుత్తరమిచ్చును గాక (కీర్తన 20 :1)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

