సౌలు తృణీకరించబడుట - దావీదు ఎన్నుకొనబడుట
ఉద్దేశము
దేవుడు మన హృదయాలను పరిశీలిస్తాడు అని బోధించుట.
ముఖ్యాంశము
మీకు ఎవరైనా పుట్టినరోజు బహుమానంగా మంచి కథల పుస్తకం ఇచ్చారు అనుకుందాం. అది ఎంతో ఆకర్షణీయంగా రంగులతో నిండి ఉంది. మీకు ఎంతో సంతోషం కలుగుతుంది కదూ! వెంటనే చదవాలి అని ఆశ కలుగుతుంది. దానిని తెరిచి చూడగానే లోపల పేజీలు అన్ని చినిగిపోయి, అంతా పెన్నుతో గీసి పాతగా కనిపిస్తే, అప్పుడు మీకు ఎంత నిరుత్సాహం కలుగుతుంది! పైకి ఎంతో అందంగా కనిపించిన పుస్తకం లోపల చాలా భయంకరంగా ఉంది. చాలాసార్లు మనకు పైకి కనిపించేది ఒక విధముగా ఉంటే లోపల మరొక విధంగా ఉంటుంది. పైకి ఎంతో మంచిగా కనిపించిన ఒక చెడ్డ వ్యక్తి గురించి ఈ రోజు తెలుసుకుందాము.
నేపధ్యము
ఆ చెడ్డ వ్యక్తి ఎవరు తెలుసుకోవాలి అని కుతూహలంగా ఉంది కదూ! ఆ వ్యక్తి ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయిన సౌలు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కనాను దేశమునకు నడిపించిన తరువాత వారికి న్యాయాధిపతులు అని పిలువబడే వారిని నాయకులుగా ఏర్పరచాడు. వారికి రాజు లేడు. వారు ఇశ్రాయేలీయులకు దేవుని మార్గాలను బోధిస్తూ,వారు పశ్చాత్తాపముతో ప్రార్థించినప్పుడు శత్రువుల చేతిలో నుండి వారిని కాపాడుతుండేవారు. మన కథ ప్రారంభమైన సమయానికి దేవుని ప్రత్యేకమైన న్యాయాధిపతిగా, సేవకునిగా సమూయేలు ఉన్నాడు. ఒకరోజు ఇశ్రాయేలీయులు సమూయేలు దగ్గరకు వచ్చి - "సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. అతడు మాకు న్యాయము తీర్చును'' అని అడిగారు. వారి మాటలు సమూయేలు దృష్టికి బాధను కలిగించాయి.
దేవుడు వారి క్షేమము కొరకు సమస్తము జరిగిస్తున్నాడు గనుక ఆయన ఆలోచన ప్రకారము నడుచుట మంచిది అని వారికి చెప్పినప్పటికి వారు సంతృప్తి చెందలేదు. అప్పుడు సమూయేలు దేవుని సన్నిధికి వెళ్లి ప్రార్థించినప్పుడు ప్రభువు సమూయేలుతో - "వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టి వాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము'' అని ఆజ్ఞాపించాడు.
సౌలు - మొదటి రాజు
సమూయేలు, ఇశ్రాయేలీయులు సౌలుకు రాజుగా పట్టాభిషేకం చేశారు. సౌలు ఎలా ఉండేవాడు? సౌలు ఎంతో అందమైన యవ్వనస్తుడు అని బైబిల్ లో వ్రాయబడింది. అతడు జనసమూహములో నిలిచినప్పుడు అందరికంటే ఎత్తు గలవాడుగా ఉండేవాడు. సౌలును చూచిన వారందరూ అందమైన, ఎత్తయిన ఈ యౌవనస్థుని కంటే రాజుగా ఉండటానికి అర్హులు మరి ఎవరూ లేరు అని తలంచారు. వారు అందరూ సంతోషముతో "రాజు చిరంజీవి అగును గాక'' అని కేకలు వేశారు. తాము ఎంతగానో ఎదురు చూస్తున్న రాజు ఇతడే అని వారు సౌలును గూర్చి అనుకున్నారు.
సౌలు యెడల దేవుని ఆలోచన
సౌలు ఎంతో అందంగా ఉన్నాడు కానీ అతని హృదయం ఎలా ఉంది? సౌలు హృదయం చెడుతనము కలిగి ఉంది. అంటే అతని హృదయానికి ఏదో వ్యాధి ఉన్నది అని కాదు గాని అతని హృదయములోని ఆలోచనలు, తలంపులు సరి అయినవి కాదు అని అర్థం. దేవునికి కోపము తెప్పించిన ముఖ్యమైన విషయాలు రెండింటిని సౌలు జీవితములో చూద్దాము.
సౌలు అవిధేయత
సమూయేలు దేవుని పరిచారకుడు గా ఉంటూ ఇశ్రాయేలీయులు దేవుని ఆరాధించే సమయములో వారికి సహాయ పడేవాడు. ఆరాధన క్రమము వారికి నేర్పేందుకు దేవుని చేత ఎన్నుకొనబడిన న్యాయాధిపతి, ప్రవక్త, యాజకుడు సమూయేలు. ఒక రోజు రాజైన సౌలు తెలివి తక్కువ పని చేశాడు. ఇశ్రాయేలీయులు, సౌలు దేవునికి బలి అర్పించి, ఆరాధించుట కొరకు సిద్ధపడి సమూయేలు కోసము ఎదురు చూస్తున్నారు. సమూయేలు రాకడ ఆలస్యమైనందుకు సౌలు సహనం కోల్పోయాడు. సమూయేలు వచ్చిన తరువాత ఆరాధన జరిగించుటకు బదులు తానే దానిని జరిగించాలి అని నిర్ణయించుకున్నాడు. సమూయేలు చేయవలసిన పనిని తాను చేయాలనుకోవడం సౌలునకున్న గర్వాన్ని చూపుతుంది. బలిని అర్పించి ఆరాధన క్రమమును జరిగించ వలసిన బాధ్యత సమూయేలుదే అని సౌలుకు బాగా తెలుసు. అతడు ప్రభువు మాటలకు అవిధేయత చూపడానికి నిశ్చయించుకున్నాడు. సౌలు బల్యర్పణ చేసిన వెంటనే సమూయేలు అక్కడకు చేరుకున్నాడు. సమూయేలు ఆగ్రహంతో - " నీవు చేసిన పని ఏమి?'' అని ప్రశ్నించాడు. అందుకు సౌలు - " జనులు నా యొద్దనుండి చెదరి పోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాక పోవుటయు నేను చూచి ఫిలిష్తీయులు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితిని'' అని సమూయేలుతో చెప్పాడు. దేవునికి అవిధేయత చూపి యుద్ధములో సహాయము చేయమని ప్రార్థించడం సౌలు అవివేకానికి రుజువు. తాను యుద్ధములో విజయము పొందితే ప్రజలందరూ తనను పొగుడుతారు అని అనుకున్నాడు. ప్రభువు కు విధేయత చూపుటకంటె తనకు పేరు రావడం సౌలుకు ముఖ్యమైనదిగా అనిపించింది.
సౌలు దేవునికి అవిధేయత చూపే మరొక పనిని చేశాడు. ఒకరోజు సమూయేలు సౌలు దగ్గరకు వచ్చి దేవుడు ఆజ్ఞాపించిన విషయాన్ని తెలియజేశాడు. సమూయేలు సౌలు తో - "మీ శత్రువు లైన అమాలేకీయులను నీవు పోయి కనికరింపక పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నింటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలము చేయుము" అని చెప్పాడు. కాని సౌలు ఏమి చేసాడో తెలుసా? గొర్రెలలో,ఎడ్ల లో మంచి వాటిని ప్రక్కన పెట్టి మిగిలిన వాటిని మాత్రము హతము చేశాడు. సౌలు ఎందుకు అలా చేసాడు? దేవుడు ఇచ్చిన ఆజ్ఞల కంటే తన ఆలోచనలు మంచివి అని సౌలు తలంచాడు.
పైన చెప్పిన రెండు పనులు సౌలు యొక్క అవిధేయతను, ప్రభువు పట్ల ప్రేమ లేని విషయాన్ని తెలియజేస్తున్నాయి.
దేవుడు సౌలు పై కోపగించుట
సౌలు చూపిన అవిధేయతను బట్టి దేవునికి ఆగ్రహం కలిగింది. సౌలు హృదయము లోని చెడుతనము ఎరిగిన ప్రభువు రాజు గా ఉండుటకు సౌలు తగిన వాడు కాదు అని అనుకున్నాడు. సమూయేలు సౌలు దగ్గరకు వచ్చి ప్రభువు చెప్పిన మాటలను వివరించాడు. ఆ మాటలు ఏమనగా - "సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించి నందుకు నేను పశ్చాతాప పడుచున్నాను". దేవుడు సౌలును రాజుగా ఉండకుండా విసర్జించి మరొకరిని ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఏర్పాటు చేయబోతున్నాడు. సమూయేలు సౌలు తో- "ప్రభువు ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. నేడు ప్రభువు ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగి వేసి నీ కంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి దానిని అప్పగించి యున్నాడు" అని చెప్పాడు.
సమూయేలు మాటలు వినిన సౌలు తన తప్పులను కప్పి పుచ్చుకోవాలని ఎంతగానో ప్రయత్నించాడు కానీ చివరకు - "నేను పాపము చేసితిని" అని సమూయేలుతో చెప్పాడు. ఆ మాటలు నిజమైన పశ్చాత్తాపం కలిగినది కాదు అని దేవునికి తెలుసు. అంతే కాకుండా దేవుని క్షమించమని కూడా సౌలు అడగలేదు. ఇశ్రాయేలీయులకు రాజు గా ఉండాలి అని సౌలుకు ఎంతో కోరిక. ప్రజలు తనను పొగడటం సౌలుకు ఎంతో ఇష్టం. దేవుని పట్ల సౌలుకు ఏ మాత్రము ప్రేమ లేదు. ఆ విషయం దేవునికి తెలుసు (1 సమూయేలు 13:13-14; 15:19- 24)
ప్రభువు దావీదును ఎన్నుకొనుట
బేత్లెహేములోని యెష్షయి అనే వ్యక్తిని కలుసుకొనుమని దేవుడు సమూయేలుకు చెప్పాడు. యెష్షయి ఎనిమిది మంది కుమారులలో ఒకరిని ఇశ్రాయేలీయులకు రాజుగా, సౌలుకు బదులుగా దేవుడు నియమించబోతున్నాడు. యెష్షయి కుమారులు ఒక్కొరొక్కరుగా సమూయేలు ముందుకు రాగా, అతడు వారిని చూచి దేవుడు ఏర్పరచుకొనిన వాడు ఇతడు కాదు అని చెప్పసాగాడు. ఆ విధముగా ఏడుగురు కుమారుల గురించి చెప్పిన తర్వాత - "ప్రభువు వీరిని కోరుకోన లేదు. నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా" అని అడిగాడు. అందుకు యెష్షయి సమూయేలుతో - "ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు అయితే వాడు గొర్రెలను కాచుకొనుచున్నాడు'' అని చెప్పాడు. అప్పుడు సమూయేలు నీవు వానిపిలువనంపించుము అని చెప్పగా యెష్షయి తన చివరి కుమారుని పిలిపించాడు. అతని పేరు దావీదు. అతడు రాగానే ప్రభువు సమూయేలుతో - "నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వానిని అభిషేకించు'' అని సెలవిచ్చాడు. అప్పుడు సమూయేలు తైలపు కొమ్మును తీసి దావీదు తలపై పోసి అభిషేకం చేశాడు. ఆ విధముగా అభిషేకించిన వ్యక్తి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు అని ఇశ్రాయేలు దేశమందు అంగీకరించేవారు. దావీదు చూచుటకు ఎలా ఉన్నాడు? అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు చూచుటకు సుందరమైన వాడుగా ఉన్నాడు అని బైబిల్ లో వ్రాయబడింది. మరి దావీదు హృదయము ఎలా ఉంది? దావీదు సౌలు వలె కాక ప్రభువును ప్రేమించే హృదయం గలవాడు అని చెప్పబడింది. దావీదు ఇంకను గొర్రెలు కాస్తున్న చిన్న బాలుడు గనుక ఇశ్రాయేలీయులకు రాజు కావడానికి ఎన్నో సంవత్సరములు ఎదురు చూడవలసి వచ్చింది. సౌలు,దావీదు గురించి అనేకమైన విషయాలు రాబోయే వారాలలో చూద్దాము.
సందేశము
ఇశ్రాయేలీయుల మొదటి రాజు అయిన సౌలును గురించి ఈ రోజు తెలుసుకున్నాము. సౌలు యవ్వనస్తుడు గా అందమైన వాడుగా అందరికంటే ఎత్తుగా ఉండి వెలుపల ఎంతో బాగా కనిపిస్తున్నాడు.
ప్రజలందరూ సౌలును చూచి దేవుడు తమకు ఏర్పరచిన రాజు అతడే అని ఎంతో సంతోషించారు. కానీ సౌలు హృదయము గర్వము, స్వార్థంతో నిండి ఉన్నది అని దేవుడు చూశాడు. దేవుని ఆజ్ఞలు తెలిసికూడా సౌలు ఉద్దేశపూర్వకంగానే వాటిని అతిక్రమించాడు . సౌలు అవిధేయత చూపించుట ద్వారా పాపము చేశాడు. సౌలు పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగితే ఇశ్రాయేలీయుల మీద రాజుగా దేవుడు సౌలును స్థిరపరచేవాడు. దేవుడు కోపముతో సౌలు స్థానంలో మరొకరిని ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించుటకు నిశ్చయించుకున్నాడు. క్రొత్తగా పరిపాలించే రాజు దేవుని హృదయాను సారమైన వాడు. సౌలు వంటి వాడు కాదు అతడు ప్రభువును ప్రేమించి విధేయతతో జీవించేవాడు.
అన్వయింపు
మనము ఎంతో అందంగా మంచిగా పైకి కనిపించినా మన హృదయాలు చెడుతనము తో నిండి ఉన్నాయి అని మీకు తెలుసా? లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేక పోవుచున్నారు అని రోమా3:23 లో ఉంది. చిన్న పిల్లలు కూడా తమకు ఇష్టమైన పనులు చేయడానికి అల్లరి చేసి ఏడుస్తుంటారు. పెద్దవారు కూడా స్వార్థంతో నిండిన వారై తమకు ఇష్టమైన మార్గాలలో నడుస్తుంటారు''. "నేను ఎప్పుడూ మా తల్లిదండ్రుల మాటలకి విధేయత చూపిస్తాను'' అని ఎవరైనా చెప్పగలరా? లేదు, ఎందుకంటే మనమందరమూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా వారికి అవిధేయత చూపిస్తాము. మన హృదయము సరియైనదిగా ఉండాలి అంటే మన పాపములుక్షమించమని ప్రభువుకు ప్రార్థించాలి. దావీదు గొర్రెలు కాచుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ, పాటలు పాడుతూ ఆయనకు ఎంతో దగ్గరగా జీవించి ఉండవచ్చు. అంతేగాక తన పాపములు క్షమించమని దేవుని ప్రాధేయపడి ఉండవచ్చు. మనము సౌలు వలె పైకి ఎంతో అందంగా కనిపిస్తూ హృదయములో చెడుతనమును కలిగి ఉండకూడదు. పైకి ఎంతో మంచిగా కనిపించే పండు లోపల చెడిపోయి ఉంటే దానివలన ప్రయోజనము ఉండదు కదా? ప్రభువైన యేసును రక్షకునిగా కలిగి ఉండకపోతే మన జీవితాలు కూడా ఆ పండు వలె ఉంటాయి. ప్రతి పురుషుడు, స్త్రీ, బాలుడు, బాలిక పాపక్షమాపణ పొంది నూతన హృదయము కలిగి ఉండునట్లు యేసు సిలువపై తన ప్రాణాన్ని అర్పించాడు. మనము బయట ఎలా కనిపిస్తున్నాము అనేది అద్దంలో చూసుకుంటే తెలిసిపోతుంది. కాని మన హృదయాలు ఎలా ఉన్నది తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యపు వెలుగులో మనలను మనము పరీక్షించుకోవాలి. మన హృదయాలు మారి నూతన పరచబడునట్లు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి.
కంఠతవాక్యము
మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని ప్రభువు హృదయమును లక్ష్యపెట్టును (1 సమూయేలు 16:7).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

