ఆదికాండము 16:1-16;21:8-21

ఉద్దేశ్యము/లక్ష్యము
మనము చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట దేవునికి తెలుస్తుంది అని బోధించుట

గతవారము
దేవుడు తన వాగ్దానము చొప్పున అబ్రాహాము శారాలకు కుమారుని అనుగ్రహించాడు. ఆయన ఎన్నిసార్లు అబ్రాహాముతో తన వాగ్దానము గురించి మాట్లాడాడు? దేవుని మాటలను అబ్రాహాము నమ్మాడా? వారు ఎంత కాలం సంతానం కోసం ఎదురు చూడవలసి వచ్చింది? శారా దేవుని మాటలు విశ్వసించిందా? ఇస్సాకు పుట్టినప్పుడు శారా ఏమి చెప్పింది? ప్రభువు నమ్మదగినవాడు కనుక తన వాగ్దానము ప్రకారము అబ్రాహాము శారాలకు కుమారుని ఇచ్చాడు.

ముఖ్యాంశము
మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా హేళన (ఎగతాళి) చేశారా? స్కూల్ లో చాలాసార్లు పిల్లలు ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటూ ఏడిపిస్తుంటారు. ఎవరైనా అలా చేస్తే చాలా బాధ వేస్తుంది కదూ! సాధారణంగా పెద్ద పిల్లలు చిన్న పిల్లలను ఏడిపిస్తుంటారు. ఒక పెద్ద పిల్లవాడు చిన్న పిల్లవాడిని చూచి పరిహసించి, ఎగతాళి చేసిన విషయాన్ని, సందర్భాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాము.

ఇష్మాయేలు జన్మించుట
ఇస్సాకు జన్మించుటకు 15 సంవత్సరముల ముందు శారా తనకు పిల్లలు పుట్టకపోవడం చూచి తన దాసి అయిన హాగరును తీసుకొని అబ్రాహామునకు ఉపపత్నిగా ఇచ్చింది. హాగరు ఐగుప్తీయురాలు. హాగరు వలన అబ్రాహాముకు సంతానము కలుగుతుంది అని శారా తలంచింది (ఆది 16:1-16). అబ్రాహాము దానికి అంగీకరించాడు. తరువాత హాగరు గర్భవతి అయింది. కాని దేవుడు అబ్రాహామునకు దాసి ద్వారా వారసుడిని ఇవ్వాలని అనుకొనలేదు.

అబ్రాహాము శారాలకు కుమారుడిని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానము నెరవేరేవరకు వేచి ఉండకుండా అబ్రాహాము శారాలు తమ స్వంత నిర్ణయం తీసుకున్నారు.

హాగరు తాను గర్భవతిగా ఉన్నాను అని తెలిసినప్పటి నుండి ఎంతో గర్వంతో నిండిపోయింది. శారాకు సంతానము లేనందువలన తక్కువ చేసి నీచముగా చూడటం మొదలు పెట్టింది. అప్పటినుండి శారా హాగరును ద్వేషిస్తూ, శ్రమ పెట్టుటకు మొదలుపెట్టింది. హాగరు భయముతో అక్కడనుండి పారిపోయింది. అరణ్యములో నీటి బుగ్గ యొద్ద దేవుని దూత హాగరును కనుగొని - "శారా దాసివైన హాగరూ, ఎక్కడనుండి వచ్చితివి ఎక్కడికి వెళ్లుచున్నావు?" అని అడిగాడు. అప్పుడు హాగరు దూతతో "నా యజమానురాలైన శారా యొద్దనుండి పారి పోవుచున్నాను" అని జవాబు చెప్పింది. తిరిగి ఆ దూత "నీ యజమానురాలి దగ్గరకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి యుండుము" అని చెప్పాడు. అప్పుడు తిరిగి ఆ దూత హాగరుతో - "దేవుడు నీ మొరను వినెను. నీవు గర్భవతియై యున్నావు నీవు ఒక కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు" అని చెప్పాడు. అప్పుడు హాగరు చూచుచున్న దేవుడవు నీవే అని దేవుని స్తుతించింది. భూమిని ఆకాశమును సృష్టించిన గొప్ప దేవుడు అరణ్యములో తాను ఒంటరిగా ఉండుట చూచి సహాయం చేసాడు అని హాగరుకు తెలుసు. తరువాత హాగరు తిరిగి అబ్రాహాము శారాల దగ్గరకు వచ్చి నివసించింది. హాగరుకు కుమారుడు పుట్టినప్పుడు అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టారు.

ఇస్సాకు బాల్యము
ఇష్మాయేలు పుట్టిన తరువాత దాదాపు 14 సంవత్సరములకు దేవుడు అబ్రాహాము, శారాలకు కుమారుని ఇచ్చాడు. వృద్ధాప్యంలో పుట్టినవాడు గనుక అబ్రాహాము శారాలు ఇస్సాకును ఎంతో జాగ్రత్తగా పెంచుతూ ఉండి ఉండవచ్చు. అతడు పెరుగుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు కుమారునితో ఆడుకుంటూ పాడుకుంటూ సమయం గడుపుతూ ఉండి ఉంటారు. ఇస్సాకు పాలు విడిచే సమయం వచ్చింది. అబ్రాహాము నివసించే దేశములో పిల్లలు నాలుగు లేదా ఐదు సంవత్సరముల వయసులో పాలు తాగడం మానివేసి ఆహారం తీసుకునే సందర్భాన్ని తల్లిదండ్రులు గొప్ప వేడుకగా జరుపుకునేవారు. అందరినీ విందుకు పిలిచి కలిసి సంతోషించేవారు. పిల్లవాడిని క్షేమంగా కాపాడుతున్నందుకు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించేవారు.

ఇష్మాయేలు ఈర్ష్యతో పరిహసించుట
చిన్నపిల్లవాడుగా అంతటా తిరుగుతూ ఆడుకునే ఇస్సాకును చూచి అందరూ ఎంతగానో సంతోషిస్తూ ఉండవచ్చు. ఆరోజు గొప్ప విందు కనుక ఇంకా ఎంతో ప్రత్యేకంగా ఇస్సాకును అందరూ చూస్తూ ఉండి ఉంటారు, కాని ఒకరు మాత్రము ఇస్సాకుపై ఈర్ష్యతో ఉన్నారు. సవతి సోదరుడైన ఇష్మాయేలు ఎంతో ఈర్ష్యతో ఇస్సాకును హేళన చేయుటకు మొదలుపెట్టాడు. అప్పటికే ఇష్మాయేలు 17, 18 సంవత్సరముల వయస్సు కలిగి ఉండవచ్చు. ఇస్సాకు పుట్టకముందు అందరూ ఇష్మాయేలును ఎంతో గారాబంగా చూచుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇస్సాకు చిన్నవాడు గనుక అందరూ ఇస్సాకునే ముద్దుచేయటం ఇష్మాయేలుకు కోపంతెప్పించి ఉండవచ్చు. ఇష్మాయేలు అన్నీ అర్థం చేసుకోగలిగిన వయస్సు కలిగి ఉన్నాడు, కాని చిన్నపిల్లవాని వలె ఇస్సాకును ఎగతాళి చేస్తూ, పరిహసిస్తూ ఉన్నాడు. ఆ విందు సమయంలో అందరి ముందు అలా చేయడం సరికాదు. ఇష్మాయేలు చేస్తున్న పనుల వలన ఇస్సాకు ఏడుస్తూ తల్లి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి ఉంటాడు. తనకంటె ఎంతో పెద్దవాడైన ఇష్మాయేలు పనుల వలన ఇస్సాకు ఎంతో భయపడుతూ ఉండి ఉండవచ్చు. ఇస్సాకు తల్లి శారాకు ఆ సంఘటన ఎంతో కోపము, బాధ కలిగించింది. చిన్నవాడైన ఇస్సాకును అలా ఏడిపించడం శారాకు ఎంతో కష్టంగా అనిపించింది. వెంటనే శారా అబ్రాహాము దగ్గరకు వెళ్లి - "ఈ దాసిని, దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు" అని చెప్పింది. తన కుమారుడైన ఇష్మాయేలును బట్టి శారా మాటలకు అబ్రాహాము ఎంతో దుఃఖించాడు. అప్పుడు దేవుడు అబ్రాహాముతో "ఈ చిన్నవాని బట్టియు, నీ దాసిని బట్టియు నీవు దుఃఖ పడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలనైనదియే నీ సంతాన మనబడును. అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే కనుక అతని కూడా ఒక జనముగా చేసెదను" అని చెప్పాడు.

హాగరు ఇష్మాయేలును తీసుకుని వెళ్ళిపోవుట
ఆ విందు అయిపోయిన తెల్లవారి అబ్రాహాము లేచి ఆహారము, నీళ్ల తిత్తిని తీసుకుని ఇష్మాయేలుతో కూడా హాగరునకు అప్పగించాడు. హాగరు భుజముమీద వాటిని పెట్టి వారిని పంపి వేశాడు. వారు అక్కడనుండి వెళ్లి పోవుటకు ప్రయాణం కొనసాగించారు. హాగరు వెళ్లి బెయేర్షబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను అని బైబిల్ లో వ్రాయబడింది. బెయేర్షబా ప్రాంతము ఎంతో వేడిగా ఉండే ఎండిపోయిన భూములు గల ప్రాంతము.

హాగరు తీసుకుని వచ్చిన కొద్దిపాటి ఆహారము అయిపోయింది. ఏమీ లేకుండా ఎడారిలో వారిద్దరూ ఒంటరి వారై పోయారు. తరువాత నీళ్లు కూడా మిగలలేదు. ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉండవచ్చు కానీ నీళ్లు లేకుండా జీవించడం అసాధ్యం.

ఇష్మాయేలు త్రాగడానికి నీరు లేనందువలన ఎంతో బలహీనతకు లోనయ్యాడు. దాహం తీర్చుకోవడానికి నీరు లేదు కనుక ఇష్మాయేలు త్వరలో చనిపోతాడు అని హాగరు అనుకుంది. తన కుమారుని చావు చూడలేక ఒక చెట్టు పొద క్రింద ఇష్మాయేలును ఉంచి కొంచెము దూరంగా వెళ్ళి కూర్చుంది.

హాగరు కొంచెము దూరంలో కూర్చుని పెద్దగా ఏడవటం మొదలు పెట్టింది. ఇష్మాయేలు పుట్టకముందు తాను ఒంటరిగా ఎడారిలో తిరుగులాడిన సంగతిని హాగరు గుర్తు చేసుకుని ఉండవచ్చు. అప్పుడు ప్రభువు హాగరుతో తిరిగి శారా దగ్గరకు వెళ్లి ఆమెకు లోబడి ఉండమని చెప్పిన విషయము కూడా గుర్తుకు వచ్చి ఉంటుంది. అప్పుడు హాగరు నన్ను చూచుచున్న దేవుడు అని ఆయనను పిలిచింది, ఇప్పుడు మరల హాగరు తన కుమారునితో ఎడారిలో నిస్సహాయురాలిగా ఉంది.

దేవుడు ఇష్మాయేలు ప్రార్ధన ఆలకించుట
ఇష్మాయేలు ఎంతో దాహంతో ఎలుగెత్తి ప్రభువుకు మొరపెట్టాడు. దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి - "హాగరూ నీకేమి వచ్చినది? భయపడకుము ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని యున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసెదను" అని చెప్పాడు. ఇష్మాయేలు పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను గనుక అతడు చనిపోడు అని దేవుడు హాగరుకు వివరించాడు.

అప్పుడు దేవుడు హాగరు కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతోనింపి ఇష్మాయేలుకు త్రాగించింది. ఎంత గొప్ప అద్భుతం! ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీళ్లు త్రాగిన తరువాత వారిద్దరూ తెప్పరిల్లారు. మరణించకుండా వారిని కాపాడిన దేవుడు ఎంత మంచివాడు! వారు ప్రభువుకు ఎంతగానో కృతజ్ఞతలు తెలిపి ఉంటారు. ప్రభువు ఇష్మాయేలుకు తోడై యున్నాడు. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను అని బైబిల్ లో ఉంది. హాగరు ఐగుప్తు దేశములో నుండి ఒక స్త్రీని తెచ్చి ఇష్మాయేలుకు పెళ్లి చేసింది. తరువాత ఇష్మాయేలు సంతానం కూడా దేవుడు వాగ్దానము చేసిన విధముగా ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇప్పటికి కూడా ఇష్మాయేలు సంతతివారు అరేబియా ప్రదేశములో నివసిస్తూ అరేబియా దేశస్థులుగా పిలువబడుతున్నారు.

సందేశము
అబ్రాహాము శారాలు ఇస్సాకు పాలు విడిచిన దినమందు ఒక గొప్ప విందు చేశారు. అందరూ ఇస్సాకును ప్రేమించుట చూచి ఇష్మాయేలు ఈర్ష్య, అసూయతో పరిహసించుటకు మొదలుపెట్టాడు. శారా వారిని పంపివేసినప్పుడు దేవుడు ఎడారిలో హాగరు,ఇష్మాయేలును కాపాడి హాగరుతో మాట్లాడాడు. ఆ ఎడారిలో వారిని ఎవరూ కాపాడకపోయినా ప్రభువు వారిని కాపాడాడు. ఇష్మాయేలు దాహంతో ప్రభువుకు మొరపెట్టగా ఆయన ఆ మొరవిని ఇష్మాయేలును రక్షించాడు.

అన్వయింపు
ఎంతో కష్ట సమయాలలో ప్రార్థించిన అనేకమందిని ప్రభువు రక్షించినట్లు బైబిల్ లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. దావీదు గొల్యాతు యుద్ధం చేసినప్పుడు, దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు ఇలా ఎన్నో. దేవుడు ప్రార్థన విని జవాబులు అనుగ్రహిస్తాడు అని మనము విశ్వసించాలి. ఇప్పటికి కూడా మనుష్యుల మొరలను దేవుడు ఆలకించి వారిని ఆపదల నుండి, ప్రమాదాల నుండి తప్పిస్తుంటాడు, కానీ అనేకసార్లు దేవుడు చేసిన గొప్ప ఉపకారములను మనుష్యులు మరిచిపోతుంటారు.

ఉదాహరణ
ప్రదీప్ పైలట్ట్ కోర్సు చేస్తున్నయావనస్తుడు. రోజూ మరొక పైలెట్ తో కలిసి విమానంలో వెళ్ళి వస్తూండేవాడు. తన కోర్సు పూర్తి అయిన తరువాత, ఒకరోజు ఒక్కడే విమానం నడిపించటానికి బయలుదేరాడు. విమానం కొంత దూరం వెళ్ళిన తరువాత ఇంజన్ లో సమస్య వచ్చి విమానం వేగంగా క్రిందికి ప్రయాణించటం మొదలుపెట్టింది. ఇంజన్ లో నుండి పొగలు రావడం మొదలైంది. ప్రదీప్ ఎంతగానో భయపడిపోయాడు. ఏమి చేయాలో తెలియలేదు. చిన్నప్పుడు సండే స్కూల్ లో దేవుని గురించి తెలుసుకున్న విషయాలన్నీ మనసులోకి వచ్చాయి. వెంటనే మనసులో తనను కాపాడమని దేవునికి ప్రార్ధించాడు. విమానం మెల్లగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఒక మైదానంలో దిగి ఆగిపోయింది. ప్రదీప్ వెంటనే దిగి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాడు. అప్పటి నుంచి తన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని మొదటి స్థానంలో ఉంచుకొనుటకు అలవాటు చేసుకున్నాడు.

మీ జీవితాలలో కూడా ఎన్నో సందర్భాలలో కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభువుకు ప్రార్ధిస్తారు కదూ! మనము ఏమీ చేయలేని పరిస్థితులలో దేవునికి మొర పెట్టుట, ప్రార్థించుట నేర్చుకోవాలి. మనము ఈరోజు కథలో చూచినట్లుగా దేవుడు ప్రతి ఒక్కరిని చూచేవాడు, ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించేవాడు. తనకు మొరపెట్టు వారందరి మొరలను వింటాను అని దేవుడు వాగ్దానం చేశాడు.

కంఠతవాక్యము
చూచుచున్న దేవుడవు నీవే (ఆదికాండము 16 :13)

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.