దావీదు -నాబాలు
1వ సమూయేలు 25:1-42
ఉద్దేశము
మనకు హాని చేసిన వారిపై పగ తీర్చుకొనుట సరియైనది కాదు అని బోధించుట.
ముఖ్యాంశము
ఎప్పుడూ మీకు కోపం తెప్పించాలి అని ప్రయత్నించేవారు మీ స్కూల్ లో ఎవరైనా ఉన్నారా? మీరు నడిచి వెళ్తుంటే కాలు అడ్డము పెట్టి పడవేస్తుంటారు. మీ జుట్టు లాగి ఎగతాళి చేయవచ్చు. ఏదో పేర్లు పెట్టి మిమ్మల్ని పిలువవచ్చు. ఎదుటివారిని విసిగించి, కోపము తెప్పించడానికి పిల్లలకు ఎన్నో మార్గాలు ఉంటాయి. వారు అలా చేసినప్పుడు ఏమి చేయాలో అర్థం కాకుండా చాలాసార్లు బాధపడుతుంటాము. ఈరోజు తన పట్ల కఠినంగా ప్రవర్తించిన వ్యక్తిపై దావీదుకు ఎంత కోపము కలిగింది చూద్దాము.
నేపధ్యము
గత వారములో సౌలు రాజు దావీదును చంపుటకు ఎన్ని విధములుగా ప్రయత్నించాడు అని మనము చూసాము. సౌలు ఎందుకు దావీదును చంపడానికి ప్రయత్నించాడు? ఒక దినము తనకు బదులుగా దావీదు ఇశ్రాయేలీయులకు రాజు అవుతాడు అని సౌలు గ్రహించి దావీదును చంపాలి అనుకున్నాడు. దావీదు ఎన్నోసార్లు మరణానికి ఎంతో దగ్గరగా వచ్చాడు. అతడు రాజనగరును, తన ఇంటిని వదిలిపెట్టి అరణ్యములో, కొండలలో, గుహలలో ఉండవలసి వచ్చింది. సౌలును చంపుటకు దావీదుకు అవకాశాలు ఎదురైనప్పటికి, అది పాపము అని తలంచి దావీదు సౌలును చంపలేదు. సౌలు దావీదును తరుమను అని మాట ఇచ్చినప్పటికి దావీదు అతనిని నమ్మలేకపోయాడు. అందుకే క్షేమముగా ఉండునట్లు అరణ్యములోనే నివసించ సాగాడు.
దావీదు అరణ్యములో నివాసముండుట
దావీదు అరణ్యములో ఉండగా జరిగిన ఒక సంఘటనను గురించి ఈరోజు తెలుసుకుందాము. దావీదు ఒంటరిగా లేడు నాలుగు వందల మంది మనుష్యులు అతని వెంట ఉన్నారు. వారు పర్వతములలో గుహలలో ఉండేవారు గనుక అక్కడ పంటలు ఎక్కువ పండేవి కాదు. వారు అక్కడ జంతువులను పక్షులను వేటాడి తినేవారు. పండ్లు కూరగాయలు దొరికితే తినేవారు.
దావీదు బసచేసిన చుట్టుపక్కల చాలామంది గొర్రెల కాపరులు గొర్రెలను కాసేవారు. వారిలో చాలామంది ధనవంతుడైన నాబాలు అనే వ్యక్తి యొక్క కాపరులు. దావీదు, అతని మనుష్యులు వారి యెడల ఎంతో దయ చూపిస్తూ, వారికి ఏదైనా కష్టము వచ్చినప్పుడు ఆదుకునే వారు.
నాబాలు - అబీగయీలు
కర్మెలు లోని మయోను నందు నాబాలు కాపురముండేవాడు. అతడు చాలా ధనవంతుడు. అతనికి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలు ఉండేవి. నాబాలు మోటువాడు, దుర్మార్గుడు అని బైబిల్ లో వ్రాయబడింది. నాబాలు భార్య పేరు అబీగయీలు. ఆమె ఎంతో తెలివిగలిగిన బుద్ధిమంతురాలు. ఆమె చాలా జ్ఞానము కలిగినదై ఆలోచించి పనులు చేసేది. అన్నింటికంటె మించి ఆమె ప్రభువును ఎంతగానో ప్రేమించేది. అబీగయీలుకు దుర్మార్గుడైన నాబాలు భర్తగా దొరకడం ఎంత బాధాకరం!
దావీదు నాబాలును ఆహారము అడుగుట
ఇశ్రాయేలు దేశమందు గొర్రెల బొచ్చు కత్తిరించు సమయములో గొప్ప విందును ఏర్పాటు చేసుకుంటారు. నాబాలు కూడా తన గొర్రెలకు బొచ్చు కత్తిరించు సమయము వచ్చింది. దావీదు ఆ విషయము తెలుసుకొని తన మనుష్యులలో పది మందిని నాబాలు దగ్గరకు పంపాడు. ఆ పనివారు నాబాలుతో - "నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు వారేదియు పోగొట్టుకొనలేదు, కాబట్టి నా పని వారికి దయ చూపుము. నీకు ఇష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము" అని దావీదు చెప్పిన మాటలు తెలియచేశారు. నాబాలు తప్పక ఆహారము పంపుతాడు అని దావీదు తలంచాడు. కాని నాబాలు వారితో - "దావీదు ఎవడు? నేనెందుకు నా ఆహారమును అతనికి ఇవ్వవలెను?" అని కఠినముగా మాట్లాడి దావీదు మనుష్యుషులను పంపి వేశాడు.
దావీదు పగ తీర్చుకొనుటకు ఆలోచించుట
దావీదు పనివారు వెనుకకు తిరిగి వెళ్లి దావీదుకు నాబాలు పలికిన మాటలు తెలియజేయగా దావీదు కోపముతో నాబాలును, అతని వారందరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు. కాని ఆ నిర్ణయం దేవుని దృష్టికి సరియైనది కాదు కదా! ప్రతి విషయానికి దేవునిపై ఆధారపడే దావీదు ఈసారి తన సొంత నిర్ణయముతో ముందుకు వెళుతున్నాడు. దావీదు, అతని మనుష్యులు అందరూ కత్తులు ధరించుకొని నాబాలు దగ్గరకు బయలుదేరారు.
దావీదు నాబాలు దగ్గరకు మనుష్యులను పంపుట, నాబాలు వారిని వట్టి చేతులతో పంపుట నాబాలు పని వారిలో ఒకడు చూశాడు. వాడు నాబాలు భార్య అయిన అబీగయీలు దగ్గరకు పరిగెత్తుకొని వెళ్లి ఆమెతో ఇట్లు చెప్పాడు - "అమ్మా, దావీదు అతని మనుష్యులు మాకెంతో ఉపకారము చేసియున్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. అతడు మన యజమానుని దగ్గరకు మనుష్యులను పంపగా అతడు వారితో కఠినముగా మాటలాడెను. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవరిని తనతో మాటలాడనీయడు. అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము"
సుబుద్ధి కలిగిన జ్ఞానవంతురాలైన అబీగయీలు
దాసుని మాటలు వినిన అబీగయీలు జ్ఞానము గలదై నాబాలుతో ఏమీ మాట్లాడలేదు. నాబాలు విందు కొరకు సిద్ధపడుతూ ఉండవచ్చు. అబీగయీలు 200 రొట్టెలు, రెండు ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, అయిదు మానికలు వేయించిన ధాన్యము, నూరు ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు గాడిదల మీద వేసుకొని తన పని వారిని ముందుగా పంపి, వారి వెనుక దావీదును కలుసుకొనుటకు బయలుదేరింది.
దావీదు
దావీదును కలుసుకొనుటకు అబీగయీలు భయపడలేదు. అబీగయీలు దావీదును చూచిన వెంటనే గాడిద పై నుండి దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములపై పడింది. ఆమె దావీదుతో - "నా యేలినవాడా ఈ దోషము నాదని యెంచుము. దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. ప్రభువు జీవముతోడు నీ జీవము తోడు ప్రాణహాని చేయకుండా ప్రభువు నిన్ను ఆపియున్నాడు. అయితే నేను నా యేలిన వాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పును క్షమించుము. ప్రభువు నా యేలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత - నా యేలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, పగ తీర్చుకొనినందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక. ప్రభువు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము" అని చెప్పింది. దావీదు అబీగయీలు చెప్పిన మాటలన్నిటిని శ్రద్ధగా విన్నాడు. తరువాత అబీగయీలు - "నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునొందుదువుగాక" అని చెప్పి అబీగయీలు తెచ్చిన వాటిని తీసుకున్నాడు. దావీదు అబీగయీలుతో - "నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించితిని. సమాధానముగా నీ ఇంటికి పొమ్ము" అని చెప్పాడు. నాబాలును చంపకుండా అబీగయీలు తనను ఆపినందుకు దావీదు ఎంతో సంతోషించి ఆమె జ్ఞానమును గుర్తించాడు.
నాబాలు మరణించుట
అబీగయీలు తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నాబాలు విందులో సంతోషిస్తున్నాడు. అది రాజులు చేసే విందువలె ఎంతో ఆర్భాటముతో ఉంది. నాబాలు విందు చేసుకుంటూ విపరీతంగా త్రాగి మత్తులో ఉన్నాడు. అబీగయీలు ఆ రాత్రి నాబాలుతో ఏమీ మాట్లాడలేదు. ఉదయమున నాబాలుకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అబీగయీలు జరిగిన సంగతులను నాబాలుకు వివరించింది. అతడు భయము చేత గుండె పగిలి రాతి వలె బిగుసుకొని పోయాడు. 10 దినములైన తరువాత ప్రభువు నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. నాబాలు పశ్చాతాప పడుటకు వీలుగా దేవుడు పది రోజులు సమయం ఇచ్చి ఉండవచ్చు. కాని నాబాలులో ఎటువంటి పశ్చాత్తాపము కలుగలేదు. అతడు అలాగే చనిపోయాడు.
దావీదు అబీగయీలును వివాహము చేసుకొనుట
నాబాలు చనిపోయెనని దావీదు విని - "ప్రభువు నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన ప్రభువుకు స్తోత్రము కలుగును గాక" అనెను. అబీగయీలు భర్తను పోగొట్టుకొని ఒంటరిగా ఉన్నది కనుక తనను వివాహము చేసుకొనుమని అడుగుటకు దావీదు మనుష్యులను పంపాడు. అబీగయీలు దావీదు మాటలకు సంతోషముతో అంగీకరించి పని వారి వెంట దావీదు దగ్గరకు వెళ్ళింది. అబీగయీలు దావీదును వివాహము చేసుకుంది. దావీదు అబీగయీలు ఇరువురు ప్రభువును ప్రేమించే మనస్సు గలవారు గనుక తమ వివాహము జరిగినందుకు వారెంతగానో సంతోషించి ఉండవచ్చు.
సందేశము
దావీదు జీవితములో ఎన్నో విషయాలు ఒకదాని వెంబడి మరొకటి జరుగుతుండడం మనము చూసాము. సౌలు పై పగ తీర్చుకొనకుండా సహనముతో ఉన్న దావీదు నాబాలు విషయములో ఆ విధముగా ఆలోచించలేదు. తన మనుష్యులను అవహేళన చేసి, ఆహారము ఇవ్వడానికి నిరాకరించిన నాబాలు పట్ల దావీదుకు ఎంతో కోపం కలిగింది. నాబాలును దావీదు చంపకుండా దేవుడు అబీగయీలును పంపించాడు. హత్య జరిగించకుండా అబీగయీలు ద్వారా తనను ఆపినందుకు దావీదు ప్రభువుకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించాడు. పగ తీర్చుకొనకుండా దావీదును ఆపిన ప్రభువే నాబాలును మరణము ద్వారా శిక్షించాడు.
అన్వయింపు
చాలామంది నాబాలు వలె స్వార్ధపరులై ఉంటారు. ఇతరుల గురించి వారు ఎంత మాత్రము పట్టించుకోరు. మన యెడల నిర్లక్ష్యంగా ఉండే వారి పట్ల మనకు కోపము కలుగుతుంది. అప్పుడు మనము ఎలా ప్రవర్తిస్తాము? కోపముతో వారిని తిట్టడం చాలా సులభం. అది వారికి సరి అయినది అనిపిస్తుంది.
తన చుట్టూ ఉన్నవారు తనను అపహాస్యము చేసినప్పుడు ప్రభువైన యేసు ఏమి చేశాడు? కొండ చివర నుండి యేసును క్రిందకు త్రోయాలి అని కొందరు ఒకసారి అనుకున్నారు(లూకా 4:28). యేసు వారిపై పగ తీర్చుకున్నాడా? లేదు, సహనముతో వారిని ఓర్చుకున్నాడు(1 పేతురు 2:20). తనను సిలువకు అప్పగించిన వారిని క్షమించమని యేసు తండ్రిని వేడుకున్నాడు.
ప్రభువైన యేసును రక్షకునిగా అంగీకరిస్తే మనము కూడా మన శత్రువులను క్షమించమని దేవునికి ప్రార్థించగలము.
కంఠతవాక్యము
మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి (మత్తయి 5:44)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

