ఆదికాండము 7:1-24
ఉద్దేశము/లక్ష్యము
దేవుని యందు విశ్వాసముంచుట వలన నోవహు, అతని కుటుంబము ఓడలో సురక్షితంగా ఉన్న విధముగానే, మనము కూడా ప్రభువైన యేసునందు విశ్వాసముంచిన యెడల దేవుని ఉగ్రతను తప్పించుకుంటాము అని చూపుట.
ముఖ్యాంశము
మీకెంతో ఇష్టమైన బొమ్మతో మీ ఇంటి తోటలో ఆడుకొని, ఆ బొమ్మను అక్కడే మరిచిపోయి ఇంటి లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి. మరుసటిరోజు ఉదయం లేచినప్పుడు ఆ బొమ్మ కనిపించదు. తోటలోనికి వెళ్లి చూద్దాము అనుకుంటే పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. వర్షం తగ్గిన తరువాత వెళ్లి చూస్తే మీ పెంపుడు కుక్క ఆ బొమ్మను చిన్నచిన్న ముక్కలుగా కొరికి తోటలో అంతా పడవేసినట్లు అర్థమైంది. బాధతో పాటు మీ కుక్క మీద కోపం కూడా వస్తుంది కదా! మీకు చాలా ఇష్టమైన బొమ్మ పూర్తిగా పాడైపోయింది. ఆ బొమ్మను బయట పారవేయడం తప్ప మీరు ఇంకేమీ చేయలేరు.
దేవుడు ఈ అందమైన ప్రపంచాన్ని సృష్టించాడు, కాని చెడుతనముతో నిండిపోయిన మానవులు సృష్టిని పాడు చేశారు. దానివలన దేవునికి ఎంతో కోపము, బాధ కలిగింది. దేవుడు పరిపూర్ణుడు మరియు పరిశుద్ధుడు గనుక పాపమును చూడలేడు (హెబ్రీ 1:13). అందువలన సమస్తమును నాశనం చేయాలి అనుకున్నాడు. మనుష్యుల చెడుతనము, దుష్టత్వమును బట్టి దేవుడు ఆ రీతిగా అనుకోవడం న్యాయమే! మానవులు దేవుని మాటలు వినుటకంటె, సాతాను మాటలు వినుటకే ఇష్టపడ్డారు.
గతవారము:
సమస్తమును నాశనము చేయుటకు ముందు దేవుడు భూమిని పరిశీలించి చూడగా నోవహు దేవుని యందు విశ్వాసము కలిగినవాడిగా కనిపించాడు. నోవహు దేవుని ఎదుట నీతిమంతుడుగా, నిందారహితునిగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకునేవాడు. తన తరం వారు అందరూ చెడ్డవారుగా ఉన్నప్పటికి, నోవహు ఎప్పుడూ వారితో కలిసేవాడు కాదు. నోవహు హృదయపూర్వకంగా దేవుని ప్రేమించేవాడు. దేవుడు నోవహును చూచి, తానుకలుగజేయబోతున్న నాశనమునుండి ఎలాగైనా నోవహును, అతని కుటుంబమును తప్పించాలి అనుకున్నాడు.
జలప్రళయము రాబోతున్నది అని దేవుడు నోవహును హెచ్చరించాడు అని గత వారం తెలుసుకున్నాము (హెబ్రీ 11:07). దేవుడు ఓడను తయారు చేసికొనుమని నోవహుకు ఆజ్ఞాపించాడు అని కూడా చూశాము. నోవహు ఓడను తయారు చేస్తున్న సమయంలోనే జలప్రళయం గురించి ప్రజలను హెచ్చరించాడు(2 పేతురు 2:5). కాని వారు ఆ హెచ్చరికలను ఏమాత్రం లక్ష్యపెట్టక తమ పాపములోనే జీవించుటకు నిర్ణయించుకున్నారు.
నోవహు ఓడలోనికి ప్రవేశించుట అనేక సంవత్సరముల తరువాత ఓడను తయారు చేయుట పూర్తయింది. అప్పుడు దేవుడు నోవహును, అతని కుటుంబమును ఓడలోనికి వెళ్ళమని చెప్పాడు. నోవహు,అతని భార్య, వారి ముగ్గురు కుమారులైన షేము,హాము, యాపెతు, వారి భార్యలు మొత్తం ఎనిమిది మంది ఓడలోనికి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నారు. మరియు దేవుడు నోవహుతో ప్రతి జాతి పక్షులను,జంతువులను, నేలను ప్రాకు వాటిని కూడా ఓడలోనికి తీసుకుని వెళ్ళునట్లు ఆజ్ఞాపించాడు. పవిత్ర జంతువులలో మగవి యేడు, ఆడవి యేడు, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతివి మగది ఒకటి ఆడది ఒకటి ఓడలో ఉంచుకోవాలి అని దేవుడు నోవహుకు ఆజ్ఞాపించాడు. జలప్రళయము తరువాత భూమి మీద అన్ని జీవరాశులు బ్రతికి ఉండునట్లు, నోవహు దేవుడు ఆజ్ఞాపించిన విధముగా చేయుటకు సిద్ధపడ్డాడు.
కాని నోవహు వాటన్నింటిని ఎలా పట్టుకోగలడు? ఎగిరే పక్షులను నోవహు పట్టుకోగలడా? దేవుడు తన సృష్టిపై సంపూర్ణ అధికారము కలిగియున్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారము పవిత్ర జంతువులలోను, పక్షులలోను, నేలనుప్రాకు వాటన్నిటిలోను మగది, ఆడది జంటలుగా ఓడలో ఉన్న నోవహు దగ్గరకు చేరాయి. దేవుడు అవన్నియు సరియైన సమయానికి ఓడలో ప్రవేశించునట్లు చేశాడు. అవి రావటం చూచినప్పుడు నోవహు ఎంతో ఆశ్చర్యపడి ఉండవచ్చు. వాటినిచూచి దేవునికి ఉన్నఅధికారాన్ని నోవహు బాగుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. జంతువులు, పక్షులు అన్నిఓడలోకి ప్రవేశించాయి. అందులో ఒక్కటి కూడా తప్పించుకొనుటకు ప్రయత్నించలేదు. అన్నీవరుసగా, క్రమముగా ఓడలోనికి చేరుకుని ఉండవచ్చు. నోవహు, అతని కుటుంబము,జంతువులు, పక్షులు అన్నీక్షేమంగా ఓడలోనికి ప్రవేశించిన తరువాత దేవుడు ఓడను మూసివేశాడు. ఆయన ఎన్నడూ వారిని విడిచి పెట్టలేదు. ప్రతి క్షణం వారిని గూర్చి శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఓడలోనికి ఎవరూ ప్రవేశించలేరు, లోపల ఉన్నవారు బయటకు రాలేరు.
నోవహును ఎగతాళి చేసిన జనులు, జంతువులు, పక్షులు ఓడ దగ్గరకు వెళ్ళటం చూసి ఉండవచ్చు. అయినా వారిలో ఎటువంటి మార్పు కలగలేదు. దేవుడు జలప్రళయం పంపుతాడు అనే భయం వారిలో లేదు. వారు ఎంత కఠినమైన, మూర్ఖమైన హృదయాలు కలిగియున్నారో గమనించారా! నోవహు కుటుంబం కాకుండా కనీసం ఒక్కరు కూడా ఆ ఓడలోనికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన ఆ ప్రజలను చూచి నోవహు ఎంతో బాధపడి ఉండవచ్చు.
దేవుడు జలప్రళయము పంపుట నోవహు ఓడలో ప్రవేశించిన తరువాత ఏడు దినములకు వర్షం కురవడం మొదలైంది. ఆ వర్షం చూచిన తరువాత బయట ఉన్న జనులు ఎలా ఆలోచించి ఉంటారు? నోవహు మాటలు వింటే బాగుండేది అని అనుకుని ఉండవచ్చు. ఓడలోనికి వెళ్ళటానికి ఎంతగానో ప్రయత్నించి ఉంటారు, కాని సమయం దాటిపోయింది. నోవహు ఓడ తయారు చేస్తున్నప్పుడు మనస్సులు మార్చుకోవడానికి ఎంతో సమయం వారికి ఉంది, కాని వారు లక్ష్యపెట్టలేదు.
అంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ప్రచండ వర్షం భూమి మీద కురిసింది. ఆకాశపు జలముల ఊటలన్నీ ఒక దినమందే తెరువబడి నట్లుగా వర్షం కురవడం మొదలుపెట్టింది. నలుబది పగళ్లు నలుబది రాత్రులు ప్రచండ వర్షము భూమిమీద కురిసింది(7:12). ఆ జలములు భూమిమీద అత్యధికముగా ప్రవహించినందున గొప్ప పర్వతములు కూడా మునిగిపోయాయి. అప్పుడు పక్షులు, పశువులు, మృగములు, భూమిమీద ప్రాకు పురుగులు, భూమిమీద సంచరించు సమస్త శరీరులు, సమస్త నరులు చనిపోయారు (7:21-23).
ఓడలో ఉన్న నోవహు, మిగిలినవారు ఎలా ఉన్నారు? వారు క్షేమంగా ఉన్నారు. ఓడ కప్పుమీద వర్షం పడుతున్న శబ్దం విని వారు భయపడి ఉండవచ్చు. అంత పెద్ద ఓడ నీటిపై తేలుతూ వెళ్తుంటే భయంతో కేకలు వేసి ఉంటారు. భూమిపై ఉన్న జీవరాసులు అన్నీ నశించినప్పటికి, తమను క్షేమంగా ఉంచిన దేవునికి నోవహు, అతని కుటుంబము ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి ఉండవచ్చు.
సందేశము
దేవుడు ఎంతో దీర్ఘశాంతము కలిగినవాడైనప్పటికి, భూమి మీద మనుష్యుల పాపము సహించలేకపోయాడు. మానవులు దేవుని హెచ్చరికను ఏమాత్రం పట్టించుకొనలేదు. దేవుని మాటలు విశ్వసించి, విధేయత చూపిన నోవహు కుటుంబం ఓడలో ప్రవేశించి క్షేమంగా ఉండగలిగారు. మిగిలినవారు అవిశ్వాసముతో నశించి పోయారు.
అన్వయింపు
నోవహు దినములలో వలె ఈ దినములలో కూడా మనుష్యులు చెడ్డవారుగా ఉన్నారు. తనపై విశ్వాసం ఉంచని మనుష్యుల యెడల దేవుని ఉగ్రత రాబోవుచున్నది అని బైబిల్ లో వ్రాయబడింది. నోవహు దినములనాటి జలప్రళయము కంటె మనుష్యకుమారుని రెండవ రాకడ దినము ఎంతో భయంకరంగా ఉండబోతుంది. మన అందరి హృదయాలు కూడా మోసకరమైనవి. ప్రభువైన యేసును రక్షకునిగా అంగీకరించకుండా, ఆయనయందు విశ్వాసము ఉంచక పోయినయెడల మనకు కూడా శిక్ష ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దేవుని శిక్ష నుండి మనలను తప్పించగలడు. ఎందుకంటే, మన పాపములను క్షమించుట కొరకు యేసు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన వైపు తిరిగి మన పాపములు క్షమించమని అడిగిన యెడల మనము రక్షణ పొందుతాము. దేవునికి మన జీవితాలలో మొదటి స్థానం ఇచ్చి, ఎల్లప్పుడూ మనతో ఉండమని ప్రార్ధన చేయాలి. నాకు ఇప్పుడు దేవునితో అవసరం లేదు అని అనుకుంటే మరొక సమయం రాక పోవచ్చు. నోవహు దినములలో జనులు కూడా అలాగే దేవుని మాటలు లక్ష్యపెట్టకుండా నశించిపోయారు. మనము అలాంటి నిర్లక్ష్యమైన జీవితం జీవించకుండా దేవుని మన హృదయాలలో చేర్చుకోవాలి.
కంఠతవాక్యము
అందుకు వారు - “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును, నీ ఇంటి వారును రక్షణ పొందుదురు'' అని చెప్పారు. (అ.కా. 16:31).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF