ఆదికాండము 4:16-26; 5:21-6:22; 1 పేతురు 3:20; 2 పేతురు 3: 1-9
ఉద్దేశము/లక్ష్యము
మనుష్యులు ఇప్పటికి కూడా నోవహు దినములలో వలె ఉన్నారు అని చూపుట. రాబోవుచున్న దేవుని తీర్పు దినమును గురించి వినుటకు ఇష్టపడని వారు అనేక మంది ఉన్నారు అని గుర్తు చేయుట.
ముఖ్యాంశము
స్కూల్ లో ఫైర్ అలారం మోగిన వెంటనే మనము ఏమి చేస్తాము? వెంటనే పరుగుతో స్కూల్ నుండి బయటకు వస్తాము. అలా వినిన తరువాత కూడా దానిని పట్టించుకోకుండా మూర్ఖంగా అలాగే ఉన్నాము అనుకోండి. అప్పుడు ఏమి జరుగుతుంది? నిజంగానే స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లయితే అందులో చిక్కుకొని పోయి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి మనకు కలుగవచ్చు. ఈ రోజు చాలా ముఖ్యమైన హెచ్చరికను విని నిర్లక్ష్యం చేసిన కొందరు జనులను గూర్చి తెలుసుకుందాము.
గతవారము తన తమ్ముడైన హేబెలును చంపిన తరువాత కయీను దేవుని సన్నిధి నుండి వెళ్లగొట్టబడిన విషయము మీకు గుర్తుందా? సంవత్సరాలు గడుస్తున్న కొలది కయీనుకు అనేక మంది సంతానము కలిగారు. వారు చాలా రకములైన పనులు చేయుటకు నేర్చుకున్నారు. కొందరు పశువులను మేపుతూ గుడారములలో నివసించేవారు, యాబాలు వారికి మూల పురుషుడు. మరికొందరు సితారాను, పిల్లనగ్రోవిని వాయించేవారు, యూబాలు వారికి మూల పురుషుడు. ఇంకా కొందరు పదునుగల రాగి పనిముట్లను, ఇనుప పనిముట్లను తయారు చేసేవారు, తూబల్కయీను వారికి మూలపురుషుడు(4:20-22). , కయీను ఒక ఊరిని కూడా కట్టించాడు.
తన కుమారుని పేరునుబట్టి ఆ ఊరికి హనోకు అని పేరు పెట్టాడు. కయీను వంశస్థులు ఎంతో తెలివిగలవారుగా ఉంటూ అనేక రకములైన పనులు చేస్తున్నారు, కానీ వారు తమను సృష్టించిన దేవుని గురించి ఏ మాత్రము ఆలోచించేవారు కాదు. వారు ఎంతో చెడ్డవారుగా జీవించుటకు అలవాటుపడ్డారు. కయీను సంతతి వారు ఎంతో గర్వము, అసూయతో నిండిపోయి కయీను వలె హత్య చేయుటకు కూడా భయపడనివారుగా ఉన్నారు (4 :23). ఇప్పటికంటె కయీను నాటి దినములు పరిస్థితులు ఎంతో భిన్నంగా ఉండేవి. ఆ దినములలో నెఫీలులు (బలాత్కారులు) అనువారు భూమి మీద ఉండేవారు (6:4) మనుష్యులు ఆ కాలములో ఎక్కువ సంవత్సరాలు జీవించేవారు. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. కయీను హేబెలు తరువాత ఆదాము హవ్వలకు షేతు అనే కుమారుడు జన్మించాడు. షేతుకు ఎనోషు అనే కుమారుడు పుట్టాడు. అప్పుడు దేవుని నామములో ప్రార్థన చేయడం మొదలైంది(4:25-26).
దేవుని యధార్ధముగా ప్రేమిస్తూ, ఆయనకు అన్ని విషయాలలో విధేయత చూపుతూ వెంబడించిన ఒక వ్యక్తిని గురించి బైబిల్ లో వ్రాయబడింది. అతని పేరు హనోకు. అతడు ఎప్పుడూ దేవుని గురించి ఆలోచిస్తూ, ఆయనతో సంభాషిస్తూ, ప్రార్ధిస్తూ ఉండేవాడు. దేవుడు హానోకును చూచి ఎంతగానో సంతోషించేవాడు. దేవుడు ఒకరోజు హనోకును తనతోపాటు పరలోకమునకు తీసుకొని వెళ్ళాడు. హనోకు మరణము చూడలేదు. అతడు ఒక రోజు కనిపించకుండా పోయాడు. తరువాత మరెన్నడూ ఎవరికీ కనబడలేదు. దేవుడు హనోకును భూమి మీద నుండి తీసుకొని వెళ్లినప్పుడు హనోకు వయస్సు 365 సంవత్సరములు (5:21-24). భూమిపై అందరికంటె ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తి హనోకు కుమారుడైన మెతూషెల. అతడు 969 సంవత్సరములు జీవించాడు.
మానవులు భూమి మీద విస్తరించుట మొదలుపెట్టిన తరువాత వారి అక్రమము ఎంతగానో ఎక్కువ కాసాగింది. వారి చెడుతనము వలన దేవుడు ఎంతో ఆగ్రహముతో నిండి వారిని శిక్షించబోతున్నాను అని హెచ్చరించాడు. ముఖ్యముగా భక్తిహీనులైన పాపులు దేవునికి విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి దేవుడు వారికి శిక్ష విధించబోతున్నాడు అని హనోకు ప్రవచించాడు(యూదా 14,15). అయినప్పటికి మనుష్యులు హనోకు మాటలు పట్టించుకోలేదు. దేవునికి అవిధేయత చూపుచు షేతు కుటుంబపు వారు కూడా చెడుతనముతో జీవించసాగారు.
పాపముతో నిండిన ప్రపంచం భూమిపై ఉన్నవారందరిని దేవుడు పరిశీలించి చూస్తూ ఉన్నాడు. భూమిపై జరుగుచున్న చెడుతనమును, బలాత్కారమును దేవుడు చూచాడు(6:11). దేవుడు కోపముతో హృదయములో ఎంతో నొచ్చుకున్నాడు (బాధపడ్డాడు 6:6). భూమిమీద నరులను చేసినందుకు దేవుడు తన హృదయములో సంతాపము నొందెను అని బైబిల్ లో వ్రాయబడింది. మానవులు దేవుని గూర్చి ఏ మాత్రం ఆలోచించకుండా, తమ మార్గములు చెరిపి వేసుకుని పాపముతో నిండిన వారుగా జీవించసాగారు. దేవుడు కోపముతో భూమిని, భూమిపై నున్న సమస్తమును నాశనము చేయుటకు నిశ్చయించుకున్నాడు. అయితే దేవుడు భూమిని పరిశీలించినపుడు ఒక్క వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా కనిపించాడు. తనను ప్రేమించి, విధేయత చూపించే ఒక మానవుని దేవుడు కనుగొన్నాడు. అతని పేరు నోవహు. నోవహు నీతిపరుడు, నిందా రహితుడై దేవునితో కూడా నడచినవాడు. దేవుడు ఎంతో కృప కలిగిన వాడు
గనుక, నోవహును అతని కుటుంబమును నశింప జేయుటకు ఇష్టపడలేదు. తాను చేయబోతున్న దానిని నోవహుకు తెలియ చేశాడు. దేవుడు గొప్ప జలప్రవాహమును భూమిమీదికి పంపబోతున్నాడు, అయితే నోవహును, అతని భార్య కుమారులు కోడండ్రను దేవుడు క్షేమంగా ఉంచాలని అనుకున్నాడు (6:17-18).
నోవహు ఓడ తయారు చేయుట
ఒక పెద్ద ఓడను చేసికొనుమని దేవుడు నోవహుతో చెప్పాడు. గట్టిగా ఉండే చితిసారకపు మ్రానుతో అరలు పెట్టి లోపట, వెలుపట నీళ్లు పాడు చేయకుండునట్లు కీలు పూయాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. 300 అడుగుల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు కలిగి మూడు అంతస్తులతో తయారు చేయబడాలి, అది చాలా గదులు కలిగి ఉండాలి, ఆ ఓడకు కిటికీ చేసి దాని ప్రక్కనే తలుపుతో ద్వారము ఉండాలి - ఇవన్నీ దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన కొలతలు, వివరాలు. నోవహు కుటుంబానికి, జంతువులకు, పక్షులకు అవసరమైన ఆహారం కూడా ఆ ఓడలోనే పెట్టుకోవాలి కనుక ఓడ పెద్దదిగా తయారు చేయమని దేవుడు నోవహుకు ఆజ్ఞా పించాడు. నోవహు దేవుడు తనకు ఆజ్ఞాపించి న ప్రకారము సమస్తము చేశాడు. అంతకుముందు ఎప్పుడూ వర్షము చూడకపోయినప్పటికి, దేవుని మాటలు విశ్వసించి రాబోయే జలప్రళయము తప్పించుకొను లాగున ఓడను కట్టుటకు మొదలుపెట్టాడు (ఆదికాండము 6:22;హెబ్రీ 11:7).
నోవహు హెచ్చరించుట
అంత గొప్ప ఓడ నిర్మాణానికి నోవహుకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. మానవుల ఎడల దేవుడు ఎంతో కనికరము గలవాడు. వారిని అందరిని నశింప జేయుటకు దేవునికి ఏ మాత్రము ఇష్టము లేదు. జలప్రళయము పంపించబోతున్నాను అనే విషయం ప్రకటించి ప్రజలను హెచ్చరించుమని దేవుడు నోవహుకు చెప్పాడు (2 పేతురు 2:5). నోవహు ఓడను తయారుచేస్తూ, దేవుడు తనకు చెప్పిన విధంగానే జనులను కూడా హెచ్చరించాడు. దేవుడు జలప్రళయం పంపించబోతున్న సంగతిని రహస్యంగా ఉంచలేదు. ఆ విషయం తెలుసుకొనిన తరువాత కొందరైనా తమ చెడు మార్గములను విడిచిపెట్టి మారుమనస్సు పొందాలి అనేది దేవుని కోరిక. దేవుడు చేయబోవుచున్న సంగతులను నోవహు ప్రకటించినప్పటికి, ఒక్కరు కూడా నమ్మలేదు. నోవహు ఓడ తయారుచేయుట చూచి అతని దగ్గరకు వెళ్ళి - “నోవహు, నీవు తెలివి లేని పని చేస్తున్నావు, జల ప్రళయం ఎందుకు వస్తుంది? ఈ ఓడ తయారు చేయడం బుద్ధిలేని పని'' అని చెప్పి ఎగతాళి చేసి ఉండవచ్చు.
నోవహు ఓడను తయారు చేస్తూనే వారందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు, కాని ఎవ్వరూ అతని హెచ్చరికలను పట్టించుకోలేదు. అందరూ తనను హేళన చేస్తున్నారు గనుక ఓడ కట్టడం మాని వేస్తాను అని నోవహు అనుకొని ఉండవచ్చు, కానీ నోవహు అలా అనుకొనలేదు. వారి మాటల కంటె, దేవుని మాటలయందు విశ్వాసముంచుట ముఖ్యము అని నమ్మాడు. దేవుడు చెప్పిన విధముగా నోవహు ఓడ తయారు చేయుట ముగించాడు, తరువాత జరిగిన విషయాలు వచ్చే వారం చూద్దాము.
సందేశము
ప్రభువైన యేసు భూమిమీద జీవించినప్పుడు, జల ప్రళయమునకు ముందు లోకము ఎలా ఉండేదో వివరించాడు. జనులు జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవువరకు ఏమీ జరుగదు అన్నట్లుగానే జీవించారు. వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసికొనుచు, పెండ్లికిచ్చుచు జీవిస్తున్నారు. కాని దేవునికి ఏ మాత్రం వారి జీవితాలలో స్థానము లేనట్లుగా ఉన్నారు. నోవహు జలప్రళయం గురించి చెప్పిన మాటలను కూడా వారు ఏమాత్రము లక్ష్యపెట్టలేదు. వారు మూర్ఖత్వంతో ఉన్నారు. యేసు మనలను కూడా హెచ్చరిస్తూ లోకమునకు తీర్పు తీర్చుటకు మనుష్యకుమారుడు రానైయున్నాడు అని(మత్తయి 24: 37- 39) చెప్పాడు. స్కూల్ లో ఫైర్ అలారం మ్రోగితే ఎలా జాగ్రత్త తీసుకుంటామో అలాగే ప్రభువు రెండవ రాకడ సమయములో ఆయనను కలుసు కొనుటకు జాగ్రత్తతో సిద్ధముగా ఉండాలి.
అన్వయింపు
ప్రపంచము ఎంతో బలాత్కారముతో నిండి ఉంది. ఎక్కడ చూచినా దొంగతనాలు, అబద్ధాలు, గొడవలు, టి.వి.లో చెడు ప్రోగ్రామ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. చాలా మందికి దేవుని గురించిన ఆలోచన కూడా ఉండదు. అనవసరమైన పనులతో కాలము గడుపుతుంటారు. మన హృదయాలలో దేవునికి స్థానము ఇవ్వకుండా మనకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తే తగిన శిక్ష అనుభవించాలి అని బైబిల్ బోధిస్తుంది. బైబిల్ లోని విషయాలు చెప్తున్నప్పుడు చాలామంది ఎగతాళి చేస్తుంటారు. నేను సండే స్కూల్ కి వెళ్తాను బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తాను అని చెప్పినప్పుడు మిమ్మల్ని కూడా ఎగతాళి చేయవచ్చు. దేవునిపై, ఆయన వాక్యంపై మన విశ్వాసాన్ని ఇతరులు పాడుచేయకుండా మనము నోవహు వలె జ్ఞానము కలిగిఉండాలి. అది దేవుని దృష్టికి ఎంతో విలువైనది.
కంఠతవాక్యము
అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చెదరు (2వ పేతురు 3:3).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF