ప్రస్తుతం సంఘం రాజీపడిపోయిన అనేకమైన వాక్యవిరుద్ధమైన కార్యకలాపాలలో సినిమాలు చూడడమనేది ఒకటిగా మనకు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలుగా, సంఘానికి పాపం పట్ల అవగాహన కల్పించివలసిన బోధకులు చాలామంది దీనిపై ఎటువంటి అభ్యంతరాలనూ తెలియచెయ్యకపోవడం, కొందరైతే తమ ప్రసంగాలలో సినిమా డైలాగులను పదేపదే ప్రస్తావించడంగా మనం భావించవచ్చు.
ఈమధ్యకాలంలో మరికొందరు బోధకులైతే సినిమా అనగానే చెడ్డదనే అభిప్రాయం విడిచిపెట్టి అందులో ఉన్న మంచిని తీసుకోడానికి మనం వాటిని చూసినా కూడా తప్పులేదని వాదిస్తున్నారు. దీనికారణంగా, దేవునిపట్ల నిజమైన విశ్వాసం కలిగినవారు కూడా ఇటువంటి అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఆ దైవవిరుద్ధమైన కార్యాకలాపంలో కొనసాగుతున్నారు.
కాబట్టి, ప్రస్తుత సినిమాల్లో ఎంత మట్టుకు మంచి ఉంటుందో, మనం ఎలాంటి వాటిని చూడవచ్చో బైబిల్ ఆధారంగా వివరించే ప్రయత్నం చేయడానికే నేను ఈ వ్యాసాన్ని రాస్తున్నాను. దానికంటే ముందు పైన నేను ప్రస్తావించిన కొందరు బోధకుల గురించి బైబిల్ చెబుతున్న వాక్యభాగాన్ని చూడండి.
రెండవ పేతురు 2:18 వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించు కొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు.
ఈ వచనంలో పేతురు చెబుతున్నట్టుగా ప్రస్తుతకాలంలో కూడా కొందరు బోధకులు, గతంలో వాక్యవిరుద్ధమైన కార్యాలలో జీవితాన్ని గడిపిన కొందరు ప్రభువు కృపచేత రక్షించబడి సంఘంలోనికి చేర్చబడితే, వారిని మరలా అలాంటి వాక్యవిరుద్ధమైన కార్యాలు చెయ్యడానికి ప్రోత్సహిస్తూ మార్గం తప్పిస్తున్నారు. ఇటువంటి బోధకుల విషయంలో జాగ్రత.
తీతుకు 1: 11 వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు.
ఎఫెసీయులకు 5:6 వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును.
ఇక మనం మాట్లాడుకుంటున్న అంశంలోనికి వెళ్తే మొదటిగా, ప్రస్తుత సినిమాలు, సీరియళ్ళు, మరికొన్ని చిత్రీకరణలు బైబిల్ విశ్వాసులపైన మనకు బోధించే నియమాలకు విరుద్ధంగా ఉన్నాయో లేక మనకేదైనా మంచిని నేర్పించేలా ఉన్నాయో చూసి, రెండవదిగా దీనిపైన సంధించబడే కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చూద్దాం.
(1) రోమీయులకు 12: 19 ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.
బైబిల్ గ్రంథం వ్యక్తిగతంగా పగ తీర్చుకోవడాన్ని నిషేధిస్తుంది. ఒక వ్యక్తికి మరోవ్యక్తి నుండి ఏదైనా ప్రమాదం సంభవించబోతున్నపుడు ఆత్మరక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యక్తిపై దాడి చెయ్యడానికీ, మరియు గతంలో ఆ వ్యక్తి చేసిందేదో మనసులో పెట్టుకుని ప్రణాళిక ప్రకారంగా ఆ వ్యక్తిపై పగ తీర్చుకోవడానికీ చాలా తేడా ఉంది. దీనికి నూతన నిబంధన ఏమాత్రం ఒప్పుకోదు కాబట్టి విశ్వాసులంతా ఖచ్చితంగా ఈ నియమానికి లోబడి ఉండాలి.
కానీ నేటి సినిమాలు/ఇతర చిత్రీకరణలలో చాలా మట్టుకు హీరో విలన్ ని చట్టప్రకారం శిక్షించే మార్గంలో కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం వెతుక్కుంటూ వెళ్ళి పగతీర్చుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నం కూడా సాధారణంగా ఉండదు చాలా కౄరంగా ఉంటుంది. హీరో అలా చేస్తుంటే దానిని ఆడియన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ ఔతుంటారు. నీ దేవుడు వద్దన్నదానిని ఎవడో చేస్తుంటే, అది కూడా మానవత్వాన్ని అవమానించేదిగా ఉంటుంటే, దానిని చూసి ఆయన విశ్వాసిగా నువ్వెలా థ్రిల్ ఫీల్ అవ్వగలవు? అందులో నీకేం మంచి కనిపిస్తుంది?
(2) రోమీయులకు 13: 13 అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము.
ఎఫెసీయులకు 5:3,4 మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను (లేక,వెఱ్ఱి మాటలైనను), సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.
ఈ వచనాల్లో పౌలు, విశ్వాసుల్లో ఏవి ఉండకూడదో వాటి జాబితాను వివరిస్తున్నాడు. ప్రస్తుత సినిమాల్లో, ఇవి లేని సినిమాలు, సీరియళ్ళు, ఇతర చిత్రీకరణలు ఎన్ని? వాటిలో, హీరోగారు మందు బాటిల్ పట్టుకుని త్రాగడం, సిగరెట్లు కాల్చడం, కామానికి సంబంధించిన సన్నివేశాలూ, అశ్లీలమైన వస్త్రాలూ, అల్లరితో కూడిన పాటలూ ఇవన్నీ సాధారణమే కదా! సినిమాలలో కనిపించే ఎక్కువ శాతం హాస్య సన్నివేశాలు డబల్ మీనింగ్/బూతులతోనే ఉంటాయి. ఇలాంటివన్నీ ఉన్నవాటిని మనం చూస్తూ ఆనందం (enjoyment) గా భావిస్తున్నామంటే, పగలబడి నవ్వుకుంటున్నామంటే మన మనసులో వాటిపైన ఇష్టం లేకుండానే అలా చేస్తున్నామా?
ఉదాహరణకు, మన కళ్ళ ముందు ఏదైనా ఒక అసహ్యమైంది ఉందనుకోండి, దానిని చూసి మనం enjoyment గా, entertainment గా భావించగలమా? నవ్వుకోగలమా? మరి దేవుడు అంతకన్నా అసహ్యించుకునేవాటిని చూస్తూ, వింటూ మనమెలా ఆనందించగలం? నవ్వుకోగలం? (ఆయన కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కళంకమైనది కదా! హబక్కూకు 1:13).
ఎఫెసీయులకు 5:1,8-11 కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనుడి. మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి.
ఒకవేళ మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు ఉంటే అలానే చేస్తారా? ఆయన అప్పటికాలపు ప్రజల హృదయకాఠిన్యం, వారు చేస్తున్న హేయమైన కార్యాలను బట్టి ఎంతగానో వేదనపడినట్టు లేఖనాలు చెబుతున్నాయి (మార్కు 3:5, లూకా 19:41) కాబట్టి క్రైస్తవుడంటే క్రీస్తును ధరించుకున్నవాడనీ, ఆయనవలే ఈలోకంలో నడుచుకునేవాడనీ మరిచిపోవద్దు.
గలతియులకు 3: 27 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.
1 యోహాను 2: 6 ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.
దేవునియందు భయభక్తులు కలిగి ఆయన చేత యధార్థవంతుడని పిలవబడ్డ యోబు గురించి మనందరికీ తెలుసు, ఒకసారి ఆయన మాటలు చూడండి -
యోబు గ్రంథము 31:1,2 నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును? ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును? ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?
ఈ సందర్భంలో యోబు, తన కన్నులతో నిబంధన చేసుకున్న కారణం చేత దేవుని ఆజ్ఞను మీరి కన్యకను మోహంతో చూడలేనని చెబుతున్నాడు. మనం మాత్రం దేవుడు పాపంగా చెబుతున్న సన్నివేశాలను ఆయన ఆజ్ఞను మీరి enjoyment, entertainment కోసం చూడకుండా, మన కన్నులతో నిబంధన చేసుకోలేకపోతున్నాం. అయినప్పటికీ దేవునిపట్ల మన భయభక్తులు, ప్రవర్తన యథార్థమైనదే అనుకుంటూ ఆ భ్రమలో బ్రతికేస్తున్నాం.
సామెతలు 8: 13 యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే.
(3) ఎఫెసీయులకు 5:15-17 దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.
ఈ వచనంలో, విశ్వాసులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రభువు యొక్క చిత్తాన్ని గ్రహించాలని రాయబడింది. దానర్థం, మనకున్న సమయాన్ని ఆయన చిత్తానుసారంగా మనకి అప్పగించిన పరిచర్యలోనూ, కుటుంబ బాధ్యతల్లోనూ, మన మన జీవనోపాధి పనుల్లోనూ, మన జీవితానికి అవసరమైన వాటికోసమే వెచ్చించాలి తప్ప, టైమ్ పాస్ కోసం ఏమీ చేయకూడదు. సినిమాలు, సీరియళ్ళూ, మరికొన్ని వెబ్ సెరీస్ చూసేవాళ్ళంతా దాదాపుగా టైమ్ పాస్ చేయడానికే వాటిని చూస్తుంటారు. అది కాస్తా కొంతకాలానికి వ్యసనంగా మారి వాటికి బానిసలై ఇక చూడకుండా ఉండలేక కూడా చూస్తుంటారు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసులుగా మనం దేవుని ఆజ్ఞ మీరి ఈ విధంగా ఎలా చేయగలం, ఆయన దాసులుగా మనకి అప్పగించబడ్డ బాధ్యతను ఎలా తృణీకరించగలం?
హెబ్రీయులకు 10: 37 ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును.
లూకా 12: 47 తన యజమానుని చిత్తమెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును.
ఈరోజు చాలామంది విశ్వాసులు మేము దేవుణ్ణి ప్రేమించేస్తున్నామంటూ అనేకులకు సాక్ష్యాలు చెబుతుంటారు, మనసులో మురిసిపోతుంటారు ఇంతకూ దేవుణ్ణి ప్రేమించడమంటే ఏంటో తెలుసా? దీనిగురించి స్వయంగా యేసుక్రీస్తు చెబుతున్న మాటలనే చూడండి.
యోహాను 14: 21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచు కొందునని చెప్పెను.
ఈమాటల ప్రకారం మనం పైన చూసిన దేవుని ఆజ్ఞలను ఎవరైతే మీరుతూ ఆయనకు విరుద్ధంగా ఉన్న సినిమాలూ, ఇతర చిత్రీకరణలు చూస్తున్నారో వారు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు కారు కాబట్టి ఒకసారి వారంతా తమ స్థితిని పరీక్షించుకోవాలి.
మొదటి యోహాను 2:4,5 ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను.
(4) మత్తయి సువార్త 5:27,28 వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
ఈ సందర్భంలో యేసుక్రీస్తు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారమని చెబుతున్నాడు. ఆవిధంగా ఒక స్త్రీ చూసినా, తనను చూసేలా ఒకరిని ప్రోత్సహించినా కూడా అది వ్యభిచారమే ఔతుంది. ప్రస్తుతం చాలా సినిమాల్లో హీరో హీరోయిన్‌వైపు ఎలా ఎక్కడెక్కడ చూస్తున్నట్టుగా చిత్రీకరించబడుతుంది? హీరోయిన్ కూడా దానికి ఎలా స్పందిస్తుంది? ఇందులో మనకి ఏ మంచి కనిపిస్తుంది? మనతోకలసి వాటిని చూస్తున్న పిల్లలకు ఎలాంటి మంచి నేర్పించబడుతుంది?
యెషయా గ్రంథము 3:16,17 మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు; కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును.
(5) ఫిలిప్పీయులకు 4:4 ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.
ఈ వాక్య భాగంలో విశ్వాసులు ప్రతీ సమయంలోనూ ప్రభువునందు ఆనందించాలని రాయబడింది. మనం ఆయన చిత్తానుసారంగా ఆనందించాలనే మన ఆనందానికి అవసరమైనవెన్నో ఆయన మనకు అనుగ్రహిస్తున్నాను ఉదాహరణకు కుటుంబం, పరిచర్య, జీవనోపాధి ఇలాంటివన్నీ. ముఖ్యంగా దేవుణ్ణి నిజంగా ప్రేమించే విశ్వాసి ఆయన వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, ఆయనకు ప్రార్థన చేసేటప్పుడు వర్ణించలేని ఆనందానికి లోనౌతాడు. ఆ సమయంలో అతనికున్న కఠినమైన కష్టాలు కూడా అతని మనసును బాధించవు. అందుకే ప్రభువుపై ఆధారపడ్డ పేతురు తెల్లారితే తనను హేరోదు చంపుతాడేమో అనే భయం లేకుండా ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు.
అపో.కార్యములు 12: 6 హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను.
అనేక దెబ్బలు తిని శరీరమంతా గాయాలతో ఉన్న పౌలు సీలలు చెరశాలలో ఉండి ఆనందంగా కీర్తనలు పాడగలిగారు.
అపో. కార్యములు 16:23-25 వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోవేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను. అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి.
ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడమంటే ఇదే, నేడు వాక్యవిరుద్ధమైన సినిమాలు చూస్తూ ఆనందించేవారు ప్రభువునందు ఆనందించమని పేతురు చేత ఆజ్ఞాపించబడిన విశ్వాసులు కాదు. చీకటి క్రియలను బట్టి ఆనందించే సాతాను సంబంధులు.
సామెతలు 2: 13 అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు
(6) ప్రస్తుతం చిత్రీకరించబడుతున్న దాదాపు అన్ని సినిమాలలో తప్పకుండా ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఎందుకంటే యువత వాటికే ఎక్కువగా మొగ్గు చూపుతుంది. ప్రేమించుకోవడం తప్పని నేను కూడా అనను కానీ, ఆ ప్రేమలో మనం పైన చూసిన పోకిరీమాటలూ, మోహపు చూపులూ, కామం, సరసోక్తులు ఇటువంటివేమీ ఉండకూడదు. వారి వివాహం జరిగేవరకూ వారిద్దరూ మంచి స్నేహితుల్లా మాత్రమే ఉండగలగాలి. సినిమాల్లోనూ, వెబ్ సెరీస్ లోనూ మనకు కనిపించే లవ్ స్టోరీలు ఇలా ఉంటున్నాయా? ఇదివరకటి సినిమాల్లో హీరో హీరోయిన్ మధ్య మిగిలిన సన్నివేశాలు ఎలా ఉన్నప్పటికీ కనీసం లైంగిక సంబంధం ఒకటైనా మినహాయించేవారు. ప్రస్తుత చిత్రీకరణలలో అది కూడా జోడించేసారు, పైగా కొన్నింటిలో దానినే బాగా హైలెట్ చేస్తున్నారు. మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం చేసినట్టని ప్రభువు చేత ఆజ్ఞాపించబడిన విశ్వాసులకు ఇందులో ఏ మంచి కనిపిస్తుంది?
ఈ రోజు 7/8 క్లాస్ చదివే పిల్లలు కూడా ప్రేమ అంటున్నారు, లవర్ లేకపోవడమంటే అదో పెద్ద లోటుగా భావిస్తుంటున్నారు. దాదాపుగా ఆ మత్తును వారిలో కలిగిస్తుంది ప్రేమ కోసం చచ్చినా, జీవితాన్ని పాడుచేసుకున్నా, తల్లితండ్రులను విడిచిపెట్టినా, అవసరమైతే ఒకర్ని చంపినా కూడా తప్పు కాదనిపించేలా ప్రేరేపిస్తుంది అలాంటి సన్నివేశాలతో చిత్రీకరించబడుతున్న సినిమాలు, సీరియళ్ళు కాదా? JC RYLE అనే బోధకుడు పిల్లలు చెవి ద్వారా విన్నదానికంటే కళ్ళతో చూసినదానినే బాగా నేర్చుకుంటారని ప్రస్తావించాడు.
నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటంటే, పరమ అసహ్యమైన సన్నివేశాలు ఉన్న సినిమాలను కూడా తల్లితండ్రులు తమ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని చూస్తున్నారు. ఈమధ్యకాలంలో నాకు వరసకు వదిన అయ్యే ఒకామె, తన పిల్లలు ఆమెను సినిమాలు, సీరియళ్ళు చూడనీయకుండా, కార్టూన్ channel చూస్తున్నారని వాటిని తీయించేసింది, ఇప్పుడు పిల్లలతో కలసి సినిమాలూ, సీరియళ్ళూ చూస్తుంది.
అబ్రాహాము దేవుని పిలుపుకు విధేయత చూపి, తన బంధువుల దేశం నుండి కనానుకు బయలుదేరి వచ్చినపుడు, తాను చనిపోయేవరకూ మరలా ఆ బంధువుల దేశానికి వెళ్ళి దేవుని పిలుపును మీరలేదు. అతను మాత్రమే కాదు తన కుమారుడైన ఇస్సాకు విషయంలో కూడా అతను అదే జాగ్రతను తీసుకుంటూ, అతని వివాహం నిమిత్తం ఎలీయెజెరును తాను విడిచి వచ్చిన బంధువుల ఇంటికి పంపేటపుడు ఎలీయెజెరు ఆమె (రిబ్కా) నా వెంట రాకపోతే ఇస్సాకును అక్కడికి తీసుకువెళ్ళాలా అని ప్రశ్నిస్తే, అందుకు అబ్రాహాము నువ్వు ఆవిధంగా చేయ్యవద్దని సమాధానం ఇస్తాడు (ఆదికాండము 24:5,6). ఎందుకంటే, ఒకవేళ ఇస్సాకు కనుక అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశానికి తన భార్యకూ ఆకర్షితుడై అక్కడే నివసిస్తే కనానులో నివసించమన్న దేవుని పిలుపుకు అతను అవిధేయత చూపినవాడు ఔతాడేమో అని అబ్రాహాము భయపడ్డాడు.
ప్రస్తుతం విశ్వాసం ద్వారా మేము అబ్రాహాముకు పిల్లలమని చెప్పుకునే చాలామంది విశ్వాసులు మాత్రం తమ పిల్లల్ని అవిధేయతవైపు నడిపించే కొన్ని సినిమాలు, సీరియళ్ళు, వెబ్ సెరీస్ విషయంలో ఎటువంటి ఆటంకాన్ని కలిగించకుండా దగ్గరుండి మరీ చూపిస్తున్నారు.
(నేనిక్కడ అవిశ్వాసులను కూడా ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను ఈరోజు మీరు ఏ సినిమాలను ఇతర చిత్రీకరణలను అయితే ఎగబడిమరీ చూస్తున్నారో, వాటిని చూసి ఆనందిస్తున్నారో వాటిలో ఉన్న కేరక్టర్ల తరహాలో మీ పిల్లలు/కుటుంబ సభ్యులు ఎవరైన ప్రవర్తిస్తే దానిపై మీరు ఎలా స్పందిస్తారు? నేను మీరు చూసేవాటిలో విలన్ కేరక్టర్ల గురించి మాట్లాడడం లేదు కానీ హీరో/హీరోయిన్ తరహాలోనే మీ పిల్లలు ప్రవర్తిస్తే మీరు దానిని స్వాగతిస్తారా?)
(7) మార్కు సువార్త 4:18,19 ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు; వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును.
ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా, ఐహిక విచారాలు, ఇతరమైన ఆపేక్షలు మనలోకి వెళ్తే, మనం విన్న/చదివిన వాక్యం అణచి వేయబడుతుందని చెబుతున్నారు. సాధారణంగా మన జీవితంలో మనకున్న ఐహిక విచారాలూ, ఇతర ఆపేక్షలే మనల్ని ఇబ్బందిపెడుతూ మనసులో వాక్యాన్ని అణచివేస్తూ ఉంటారు, వాటికి తోడుగా మనం చూసిన సినిమాలు, ఇతర చిత్రీకరణలలోని చెత్త సన్నివేశాలు మనపై ఇంకా ప్రభావం చూపిస్తాయి. గతంలో నేను కూడా ఈ విధంగా బాధితుడైనవాడినే. అందుకే ఈ అంశంపైన భారంతో దీనిని రాస్తున్నాను.
నిజాయితీగా మనం మాట్లాడుకుంటే సినిమా/సీరియల్/మరేదైనా చిత్రీకరణను మనం చూసేది గంటలూ, అరగంటలే అయినప్పటికీ ఆ ధ్యాస మనలోనే మెదులుతూ ఉంటుంది (ఈ ప్రభావం సీరియల్ విషయంలో మరికాస్త ఎక్కువే ఉంటుంది). ఆ ధ్యాస తెలియకుండానే మనల్ని చాలా కలవరపెడుతుంది. వాడెవడో కల్పించి చిత్రీకరించిన సన్నివేశం మన మనసుపై ఆధిపత్యం కొనసాగిస్తుంది. దీనివల్ల మనం చదివిన/విన్న వాక్యం పైనే కాదు, మరికొన్ని వ్యక్తిగత బాధ్యతలపై కూడా కచ్చితంగా ధ్యాసను కోల్పోతాము. ఒకసారి బైబిల్ గ్రంథం మనల్ని వేటిపై ధ్యానం ఉంచమంటుందో చూడండి.
ఫిలిప్పీయులకు 4:8,9 మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి. మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
మనం చూసే సినిమాలు మరియు మిగిలిన చిత్రీకరణల వల్ల మన ధ్యానం పైన పౌలు చెప్పినవాటిపైనే ఉంటుందా లేక పైన నేను చెప్పిన చెడ్డవాటిపై ఉంటుందా? ఆలోచించండి.
మొదటి థెస్సలొనీకయులకు 5:21,22 సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును (కీడుగా కనబడు ప్రతిదానికి) దూరముగా ఉండుడి.
ప్రస్తుత సినిమాలు, ఇతర చిత్రీకరణలలో ఇప్పటివరకూ మనం చూసినవే కాకుండా వాక్యప్రకారంగా పరిశీలించినప్పుడు మరికొన్ని ప్రాముఖ్యమైన సమస్యలు కూడా ఉన్నాయి. వాటిలో మరో రెండింటిని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను చూడండి.
బైబిల్ లింగపక్షపాతం లేకుండా నేరం ఏ జెండర్ వారు చేసినప్పటికీ దానిని నేరంగానే చూసి సమానంగా శిక్షించమంటుంది, లోపం ఎవరిలో ఉన్న దానిని లోపంగానే చూసి ఖండించమంటుంది. ఉదాహరణకు ఈ వచనాలు చూడండి;
ద్వితియోపదేశకాండము 19: 21 నీవు ఎవనిని కటాక్షింపకూడదు (సానుభూతి చూపించకూడదు) ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.
(ఈ శిక్షలు ప్రస్తుతం అమలులో లేనప్పటికీ నేరం పట్ల ఒకేవిధంగా స్పందించాలనే ఈ నియమం మాత్రం మనం ఎప్పుడూ అనుసరించాలి)
లేవీయకాండము 24: 22 మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను.
యాకోబు 2: 9 మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.
అదేవిధంగా, ద్వితీ. కాండము 25:11వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఒక స్త్రీ చేసిన నేరం గురించి ప్రస్తావిస్తూ ఆ నేరానికి విధించబడే శిక్షను తెలియచేసి ఆ క్రింది మాటలలో స్పష్టంగా "నీ కన్ను కటాక్షించకూడదు" అనే మాటను దేవుడు రాయించాడు. ఒకవేళ నేరం చేసిన వ్యక్తి జెండర్ ను బట్టి ఆమెపై సానుభూతి చూపిస్తూ ఆ శిక్షను అమలుచెయ్యరేమో అనే ఉద్దేశంతోనే ఆయన ఆ మాటలు అంత కచ్చితంగా రాయించాడు. ఒకసారి ఇశ్రాయేలీయులు అదేవిధంగా వ్యవహరించినప్పుడు మోషే వారిని కఠినంగా గద్దించాడు.
సంఖ్యాకాండము 31:14-16 అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకులమీద కోపపడెను. మోషే వారితోమీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చితిరా? ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయులచేత యెహోవామీద తిరుగు బాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా.
ఎందుకంటే నేరం చేసినవారి జెండర్ ను బట్టి వారిపై సానుభూతి చూపించడం వారు చేసిన నేరాన్ని సమర్థించడం, ప్రోత్సహించడమే ఔతుంది. అందుకే తీర్పు దినాన కూడా దేవుడు ఎటువంటి లింగబేధం లేకుండా అవిధేయులందరినీ ఒకే నరకంలో వేస్తాడని బైబిల్ లో స్పష్టంగా రాయబడింది. కానీ సినిమాలలో చాలామట్టుకు మనకు ఇటువంటి లింగపక్షపాతం లేని న్యాయం కనిపించదు. హీరో పురుష విలన్లపట్ల కఠినంగా వ్యవహరించే విధంగా స్త్రీ విలన్లపట్ల వ్యవహరించడు. పైగా కొన్ని సినిమాలలో స్త్రీలు చేసేకొన్ని నేరాలకు/పొరపాట్లకు అవి అసలు నేరాలే కాదన్నట్టుగా ఏవేవో కారణాలను కూడా చూపిస్తుంటారు. అవే కారణాలను మనం ప్రామాణికంగా తీసుకుంటే పురుషులు చేసే కొన్ని నేరాలను కూడా నేరాలుగా భావించలేం.
కాబట్టి సినిమాలలో చిత్రీకరించబడుతున్న లింగపక్షపాత వైఖరి దేవుడు మనకు నేర్పించిన న్యాయానికి పూర్తి విరుద్ధంగా ఉంది. దీనిని విశ్వాసి ఎలా మంచిగా భావించగలడు? దీనినుండి ఎటువంటి న్యాయాన్ని తీసుకోగలడు? ఇప్పటికే సమాజం చాలామట్టుకు ఇటువంటి లింగపక్షపాత వైఖరికి బానిసగా మారిందని చెప్పేందుకు చాలా ఉదంతాలను మనం ఉదాహరణలుగా తీసుకోవచ్చు.
ఒక Gender ను కానీ, ఒక Role ను కానీ గౌరవించడమంటే వారు నేరం చేసినా సమానంగా శిక్షించకూడదని, వారిలో ఎలాంటి లోపాలు ఉన్నా ఖండించకూడదని అర్థం కాదు. గౌరవం అనేది మంచి కేరక్టర్ బట్టి ఇచ్చేదే తప్ప అక్రమంగా ఎవరికీ అపాదించబడేది కాదు.
ఇంకా విచిత్రం ఏంటంటే, ఇటువంటి లింగ పక్షపాత వైఖరి లోకంలో ఉండడం వల్లే కొంతమంది బోధకులు కూడా యేసుక్రీస్తు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని క్షమించిన సంఘటనను చూపించి, స్త్రీ ఏ నేరం చేసిన దానిని క్షమించాలి అన్నట్టుగా బోధిస్తుంటారు. వాస్తవానికి ఆ సందర్భంలో ఆమెను ఆయన క్షమించింది లింగపక్షపాతంతో కాదు, ఆయనలో ఉన్న ప్రేమను బట్టే. అదే యేసుక్రీస్తు సిలువలో అనేకమైన హత్యలు, అల్లర్లు జరిగించిన బందిపోటు దొంగను కూడా క్షమించి పరదైసును ఇచ్చాడు.
మరొక సమస్య; సమాజంలో సినిమా హీరోలను తమ కుటుంబం కంటే ఎక్కువగా అభిమానించే యువత మనకు కనిపిస్తుంది. ఈమధ్యకాలంలో ఒక సినిమా హీరోను తన అభిమానులు ఏకంగా మా దేవుడు అని సంబోధిస్తున్నారు. విశ్వాసులు తమ పిల్లలకు సినిమాల విషయంలో ఎటువంటి అభ్యంతరాలు చెప్పకపోవడం వల్ల వారు కూడా ఒక వేషగాడికి అభిమానులుగా మారుతున్నారు. క్రీస్తుకు దాసులుగా ఉండవలసిన పిల్లలు ఒక వేషగాడికి బానిసలుగా జీవిస్తున్నారు.
కాబట్టి ఇంతవరకూ నేను చూపించిన వచనాలకూ, మిగిలిన వాక్యభాగాలకు కూడా విరుద్ధంగా లేనిదైన స్టోరీతో, అటువంటి చెడు సన్నివేశాలూ, మాటలూ లేకుండా ఏదైనా సినిమా/సీరియల్/వెబ్ సెరీస్/షార్ట్ ఫిల్మ్ ఉంటే, అది నా జీవితానికి ఏదైనా మంచిని నేర్పిస్తుందంటే నేను కూడా వాటిని నా విశ్రాంత సమయంలో కొద్దిపాటి సమయాన్ని కేటాయించి చూడడానికి సిద్ధం (అది సమయాన్ని దుర్వినియోగపరచడం కూడా అవ్వదు, ఎందుకంటే అది నా జీవితానికి అవసరం మరియు నేనది వ్యసనంలా కాకుండా విశ్రాంత సమయంలో "సమయ పరిధిపెట్టుకుని" చూస్తున్నాను).
అలా కాదు, ప్రతీదానిలోనూ 50% మంచి 50% చెడు ఉంటుంది, మంచి తీసుకుని చెడు వదిలేయాలి అంటారా? దేవుని ముందు నిజాయితీగా చెప్పండి, పాపస్వభావంతో ఉన్న నువ్వు నేను వాటిలో ఉన్న చెడుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నామా? మంచికా? మనం కేవలం వాటినుండి మంచినే తీసుకుంటూ, చెడు సన్నివేశాల కోసం ఆలోచించకుండా ఉండగలుగుతున్నామా? బురదనీటిలో పైకి తేలిన తేటనీరును తాగవలసిన అవసరం మనకేమన్నా ఉందంటారా? అది పైకి తేటగా కనిపించినప్పటికీ దాని క్రింద ఉన్న మురికి ప్రభావం దానిపై పడకుండా ఉండదు.
అందుకే కీర్తనాకారుడి మాటలు చూడండి -
కీర్తనల గ్రంథము 139:23,24 దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.
కీర్తనలు గ్రంథం మొదటి అధ్యాయంలోనే "దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండేచోట కూర్చుండక, దీవారాత్రమూ యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించమనే" మాటలు మనకు కనిపిస్తాయి. దానర్థం డే & నైట్ బైబిల్ ముందువేసుకుని చదువుతూ ఉండమని కాదు. అది ఎవరికీ సాధ్యం కాదు. చివరికి ఆ మాటలు రాస్తున్న దావీదుకు కూడా సాధ్యం కాదు. కానీ ప్రతీ సమయంలోనూ మన ఆలోచనలు, మన క్రియలు వాక్యం మనకు నేర్పించేవాటి ఆధారంగానే ఉండాలని ఆ సందర్భం మనకి బోధిస్తుంది. ఎందుకంటే, దేవుడు కేవలం మానవ క్రియలనే కాదు ఆలోచనలు కూడా తీర్పులోకి తీసుకుంటాడు.
1 కోరింథీయులకు 4: 5 కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.
ఒక విశ్వాసి తన మనసులో దైవవిరుద్ధమైనవాటి కోసం ఆలోచించడం కూడా ఆయనకు ఆయాసకరంగానే ఉంటుంది. కీర్తనాకారుడు దాని గురించే ఆందోళన చెందుతూ "దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము" అంటున్నాడు. అందుకే నోవాహు జలప్రళయం సమయంలో ఆయన వారి క్రియలు బట్టే కాదు వారి ఆలోచనలు బట్టి కూడా సంతాపపడి వారిని నాశనం చేసినట్టు రాయబడింది.
ఆదికాండము 6:5,6 నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను.
ఇక ఈ అంశం పై ఉత్పన్నమయ్యే కొన్ని ప్రశ్నలను కూడా చూద్దాం.
1 గతంలో ఒక సోదరి సినిమాలు చూడడం పాపమైతే, కరుణామయుడు, దయామయుడు, పేషన్ ఆఫ్ థ క్రైస్ట్ కూడా సినిమాలే కదా, వాటిని కూడా చూడకూడదా అని అడిగింది. వాస్తవానికి నేను సినిమాలు చూడకూడదంటే, ఆ పేరుతో పిలవబడే ఏ చిత్రీకరణనూ చూడకూడదని అర్థం కాదు. ఆమె చెప్పిన కరుణామయుడు, దయామయుడు వంటి సినిమాల్లో మంచిని తీసుకోవడమే తప్ప విడిచిపెట్టే చెడు ఏమీ ఉండదుగా? ఎందుకంటే అవి బైబిల్ ఆధారిత చిత్రీకరణలు. లోక సంబంధుల్ని Enjoyment, Entertainment చెయ్యడానికి చిత్రీకరించేట్టుగా పైన నేను చెప్పిన వాక్యవిరుద్ధమైన వాటికి అందులో స్థానం లేదు.
అయితే వాణిజ్యపరంగా వాటిని చిత్రీకరించేటపుడు దర్శకుడు వాటిలోకి కొన్ని చెడు సన్నివేశాలను కల్పించినప్పటికీ, లేక చూపించినప్పటికీ, మనం ఆ సినిమాను/స్టోరీని అందులో చెడు ఉంటుందని enjoyment కోసం చూడడం లేదు. మన మతసంబంధమైన చరిత్రనో లేక మరేదైనా వాస్తవగాథనో (చరిత్రకు సంబంధించిన స్టోరీలు) మన జీవితానికి, ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చూస్తున్నాం. కల్పిత సినిమాల్లోనూ, స్టోరీల్లోనూ చెడు ఉంటుందని తెలిసి కూడా ఎందుకు చూస్తున్నాం, enjoyment కోసం కాదా?
2 కొందరు సన్నిహితులు నాతో సినిమాలు కానీ, మరేమైనా కానీ చూడడం తప్పు కాదు కానీ వాటిని అనుసరించడం, మనసులో ఉంచుకోవడమే తప్పన్నట్టుగా మాట్లాడారు. చూసినదానిని మనసులో పెట్టుకోకుండా ఉండదం సాధ్యం కాదని నేను ఇప్పటికే పైన వివరించాను. చూసి వదిలేయడం అంత సులభమే అయితే ఈ రోజు చాలామంది సినిమాలవల్ల ప్రభావితమై డైలాగుల దగ్గర నుండి వారి ప్రవర్తన వరకూ వాటినే ఎందుకు అనుసరిస్తున్నారు? (దురదృష్టవశాత్తూ కొందరు దైవసేవకులు కూడా, తమ ప్రసంగాల్లో సినిమా డైలాగులు చెప్పడం, హీరోల్లా మీసాలు త్రిప్పుకోవడం, మేకప్పులు వేసుకోవడం fashion అయిపోయింది). చూసి మనసులో పెట్టుకోకూడదు కానీ, చూసి వదిలేస్తే తప్పుకాదనే వాదన ఎవరైనా తీసుకుంటే వారు బ్లూఫిలింస్ కూడా చూసి వదిలేస్తే తప్పుకాదంటూ నిర్మొహమాటంగా అందరిముందూ చూస్తుండాలి, చూడమని అందరికీ చెబుతుండాలి మరి.
3 సినిమాలు చూసేటపుడే కాదు సైన్స్ సబ్జెక్ట్ లో కొన్నిటిని చదివేటపుడు/చూసేటపుడు, అంతెందుకు బైబిల్ లోనే పరమగీతాలు, యెహెజ్కేలు 23 వ అధ్యాయం వంటి భాగాలు చదివేటపుడు కూడా కొన్ని చెడు ఆలోచనలు వస్తుంటాయి, అందుచేత వాటిని కూడా చదవకూడదా అని ఒకరు ప్రశ్నించారు.
(A) సైన్శ్ సబ్జెక్ట్ అనేది మన జీవితానికి, ఇతరుల జీవితానికి కూడా అవసరం కాబట్టి దానిగురించి చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం తప్ప, అందులో ఉండే కొన్ని రహస్య అవయవాల గురించి తెలుసుకుంటూ ఆనందిద్దామని కాదుగా? సినిమాలు చూడడం మన జీవితానికి సైన్శ్ సబ్జెక్ట్ గురించి తెలుసుకునేంతగా అవసరమా? అవి చూసేది వాస్తవాన్ని తెలుసుకోడానికా లేక Enjoyment, entertainment గా ఫీల్ అవ్వడానికా? కాబట్టి మన జీవితానికి ఉపయోగపడే వాటిని సినిమాలు, ఇతర చిత్రీకరణలతో ముడిపెట్టడం సరైన పద్ధతి కాదు.
(B) బైబిల్ లో రాయబడిన కొన్నిమాటలు చదివినప్పుడు కూడా మన ఆలోచనలు వేరేవిధంగా మారుతుండవచ్చు. కానీ వాటిని దేవుడు రాయించింది ఒక పవిత్రమైన ఉద్దేశంతోనే తప్ప వాటిద్వారా ఎవర్నీ దారితప్పించడానికో, తనకు లాభం సంపాదించుకోడానికో కాదు.
మీకా 2:7 యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా? దేవుడు తన గ్రంథంలో రాయించినవన్నీ తన పిల్లల క్షేమం గురించే రాయించాడు వాటిని చదువుతున్నపుడు మనం ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో గ్రహించగలుగుతాం.
కానీ ప్రస్తుతం అశ్లీలమైన సన్నివేశాలతో, బూతులతో, హింసాభావంతో కథలు రాసి వాటిని సినిమాలుగా, సీరియళ్ళుగా చిత్రీకరిస్తున్న డైరెక్టర్లు వారు అలా చెయ్యడానికి వారి మనసులో ఏదైనా పవిత్ర ఉద్దేశం ఉండే అలా చేస్తున్నారా లేక అలాంటివి ఉంటే పతనమైన మానవుడు బాగా ఆకర్షించబడి వాటిని చూసి ఆ చిత్రీకరణలకు లాభం చేకూరుస్తాడని చేస్తున్నారా? ఒకవేళ వారు తమ చిత్రీకరణ వల్ల సమాజానికి ఏదైన మంచి ఉపదేశం ఇవ్వాలి అనుకున్నప్పటికీ అందులో నేను పైన ప్రస్తావించిన చెడును అంత వివరంగా చూపించవలసిన అవసరం ఉందంటారా?
ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రంథం (book) లో ఒక సంఘటన రాయబడడానికీ, ఒక డైరెక్టర్ ఒక స్టోరీని కంటికి స్పష్టంగా కనిపించేలా చిత్రీకరించడానికీ చాలా తేడా ఉంది. బైబిల్ లో రాయబడిన కొన్ని సందర్భాలను చిత్రీకరించేటప్పుడు కూడా డైరక్టర్లు ఆ విషయంలో జాగ్రతలు తీసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో పవిత్ర ఉద్దేశంతో రాయబడిన సంఘటనలనూ, జనాలను ఆకర్షించడానికి డైరెక్టర్లు ఉద్దేశపూర్వకంగా కల్పిస్తున్న చెడు చిత్రీకరణలనూ పోల్చి ప్రశ్నించడం సరైన పద్ధతికాదు.
ఒకవేళ బైబిల్ లోని కొన్ని వాక్యభాగాలు చదువుతున్నపుడు ఆ ప్రశ్నను సంధించినవారు చెబుతున్నట్టుగా నాలో ఉన్న పతనస్వభావం కారణంగా నా మనసు ఎప్పుడైనా చెడుగా ఆలోచిస్తే ఆ చెడు ప్రభావం నుండి నన్ను తప్పించి నీవు ఏ పవిత్ర ఉద్దేశంతో ఆ మాటలు రాయించావో దానిని మాత్రమే నేను గ్రహించేలా నా మనసును స్థిరపరచమని నేను దేవుణ్ణి ప్రార్థించగలను. ఈవిధంగా, సినిమాలు చూసేవారు ఎవరైనా వాటిలో చెడు ఉంటుందని తెలిసి కూడా వాటినే చూస్తూ ఆ ప్రభావం వారిపై పడకుండా తప్పించుకోగలరా?
ఇదంతా చదివాక మీరు చూసేవాటిలో ఏ మంచి ఉందో ఆలోచించుకుని వాక్యానికి విరుద్ధంగా లేనివాటిని, మీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, వ్యసనంలా మార్చుకోకుండా చూడండి.
కీర్తనలు 119: 37 వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.
మత్తయి 6:22,23 దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.నీ కన్ను చెడినదైతే నీ దేహ మంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో గొప్పది.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2021 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.