పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

 

లేవీయకాండము 26:1
మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన... ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.

ఈ వచనంలో దేవుడు మరోసారి విగ్రహారాధనను నిషేధిస్తున్నట్టు మనం చూస్తాం. ఆయనే జీవము గల దేవుడు కాబట్టి ఆయనకు ప్రతిగా విగ్రహాలను కల్పించుకోకూడదు (నిర్గమకాండము 20:4 వ్యాఖ్యానం చూడండి).

లేవీయకాండము 26:2
నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను.

దేవుడు నియమించిన విశ్రాంతిదినాలేంటో గత అధ్యాయంలో చూసాం. ఇక్కడ వాటిగురించే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రజలు విగ్రహాలను ఆరాధించకుండా ఉండాలంటే వారికి సరైన ఆరాధన ఏంటో కూడా తెలియాలి. దేవుడు నియమించిన విశ్రాంతిదినాలు, ప్రత్యక్షగుడారంలోని చర్యలు వారికి సరైన ఆరాధన క్రమం నేర్పించేవిగా ఉన్నాయి. ఈ ఆజ్ఞ మిగిలిన అన్ని ఆజ్ఞలకూ పునాదిగా ఉంది. ప్రజలు ఆయన్ను ఆరాధించినప్పుడే ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపించగలరు. అప్పుడు వారికి కలిగే ఆశీర్వాదాలేంటో క్రింది వచనాలలో వివరించబడింది.

లేవీయకాండము 26:3-5
మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.

దేవుడు రెండవ వచనంలో ఆజ్ఞాపించినట్టుగా ఆయనను మాత్రమే ఆరాధిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఇక్కడినుండి మనం చూస్తాం. మొదటిగా వారికి తగినకాలంలో వర్షం కురుస్తుంది. దానినే తొలకరి వర్షం, కడవరి వర్షం అంటారు. వాటివల్ల వారి పంటలు సమృద్ధిగా పండుతాయి. వ్యవసాయంపై ఆధారపడే ప్రజలకు ఇది గొప్ప వరం. దీనికారణంగా ఆ దేశంలో ఒక‌ పంట వెంబడి మరోపంట పండుతూనే ఉంటుంది.

లేవీయకాండము 26:6
ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు.

ముందు వచనంలో ఆయన పోషణకు సంబంధించిన ఆశీర్వాదం వాగ్దానం చేస్తే ఈ వచనంలో వారి క్షేమం, భద్రతలకు సంబంధించిన ఆశీర్వాదాన్ని వాగ్దానం చెయ్యడం చూస్తున్నాం. ప్రజలకు సమృద్ధిగా పంటలు పండి వారి పోషణకు ఏ లోటూ లేనప్పటికీ దేశంలో యుద్ధ భయం, దుష్టమృగాల భయం ఉంటే వారు సంతోషంగా తిని జీవించలేరు కాబట్టి క్షేమంతో కూడిన సమృద్ధినే మనిషికి శ్రేయష్కరం కాబట్టి ఆయన ఈ ఆశీర్వాదాన్ని కూడా వారికి అనుగ్రహిస్తానంటున్నాడు.

లేవీయకాండము 26:7,8
మీరు మీ శత్రువులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గము చేత పడెదరు. మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గము చేత కూలుదురు.

ఈ మాటలు ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించే యుద్ధ సామర్ధ్యాన్ని తెలియచేస్తున్నాయి. "మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు" అనేవి అలంకారంగా చెప్పబడిన మాటలు. మీలో తక్కువమంది ఎక్కువమందిపై విజయం సాధించగలరు అని ఆ మాటలకు అర్థం. ఈ ఆశీర్వాదం ఇశ్రాయేలీయుల చరిత్రలో స్పష్టంగా నెరవేరింది. ఉదాహరణకు గిద్యోను మూడువందల మంది సైన్యంతో మిద్యానీయుల భారీ సైన్యాన్ని జయించాడు (న్యాయాధిపతులు 7), సౌలు కుమారుడైన యోనాతాను విషయంలో కూడా ఇలాంటి విజయాన్ని మనం చూస్తాం (1 సమూయేలు 14). షవ్గురు‌ అనే న్యాయాధిపతి కూడా తన మునికోల కర్రతో ఆరువందలమంది శత్రువులను సంహరించి ఇశ్రాయేలీయులను వారి బారి నుండి రక్షిస్తాడు. సంసోను ఐతే వేలమందిని చంపుతాడు. అలానే దావీదు ప్రధాన సైనికులు ఒక్కొక్కరూ కూడా వందలమందిని చంపుతారు.

లేవీయకాండము 26:9
ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను.

ఈ వచనంలో దేవుడు సంతానానికి సంబంధించిన ఆశీర్వాదాన్ని వాగ్దానం చెయ్యడం మనం చూస్తాం. ప్రజలకు సమృద్ధిగా పంటలు పండి పోషనకు లోటులేనప్పటికీ దేశంలో క్షేమం ఉన్నప్పటికీ సంతానం లేకపోతే వారి జాతి అంతరించిపోతుంది కాబట్టి ఆయన ఈ ఆశీర్వాదాన్ని కూడా వాగ్దానం చేస్తున్నాడు.

లేవీయకాండము 26:10
మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలి యుండును.

ఈ మాటలు ఇశ్రాయేలీయులకు ఆయన అనుగ్రహించే పంటల సమృద్ధిని తెలియచేస్తున్నాయి. వారికి గోధుమలు, బార్లీ, ద్రాక్షలు ప్రధాన పంటలు. ఈ ఆశీర్వాదం ప్రకారం వారి పాత పంట ఇంకా ధాన్యాగారాల్లోనూ ద్రాక్షరస తిత్తుల్లోనూ మిగిలియుండగానే క్రొత్త పంట చేతికి వస్తుంది. ఇది దేవుడు ఆకాశవాకిల్లు విప్పి వారిని సమృద్ధిగా దీవించడాన్ని సూచిస్తుంది. దీనివల్ల వారు దేశంలోని పేదలకూ పరదేశులకు కూడా సహాయం చెయ్యగలరు‌. 

లేవీయకాండము 26:11,12
నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలై యుందురు.

ఇంతవరకూ ఆయన వారి భౌతిక అవసరాలకు సంబంధించిన ఆశీర్వాదాలను వాగ్దానం చేస్తే ఈ వచనాలలో ఆయన  ఆత్మీయమేలుకు సంబంధించిన ఆశీర్వాదాన్ని వాగ్దానం చెయ్యడం మనం చూస్తాం. ఆయన మందిరం లేదా ఆయన సన్నిధి వారి మధ్యలో ఉండడమే వారి అన్ని ఆశీర్వాదాలకూ మూలం కాబట్టి ఆయన ఈ వాగ్దానం చేస్తున్నాడు. వారిమధ్య ఆయన సన్నిధి లేకపోతే ఆ భౌతికమైన ఆశీర్వాదాలు కూడా వారికి లభించవు. అందుకే ఫిలిష్తీయుల వల్ల మందసం పట్టబడినప్పుడు ఫీనెహాసు భార్య ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి తొలగిపోయెను అని పలికి తన బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెడుతుంది (1 సమూయేలు 4:19-22).

"నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలై యుందురు."

ఈ మాటలు ప్రజలతో ఆయన నిబంధనను స్థిరపరచడానికి సంబంధించిన మాటలు. ఇవే మాటలను పౌలు సంఘం విషయంలో కూడా ప్రస్తావించినట్టు మనం చూస్తాం (2 కొరింథీ 6:16).

లేవీయకాండము 26:13
మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములో నుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని.

ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆయన చేసిన మేలునూ విమోచననూ వారికి గుర్తు చెయ్యడం మనం చూస్తాం. ఆయన వారిని ఐగుప్తీయులకు దాసులు కాకుండా విడిపించింది ఆయనకు దాసులుగా ఉండడానికే. అందుకే వారు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గైకొనాలి. ఈ నియమం మనకు కూడా వర్తిస్తుంది. మనం పాపానికి దాసులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపించింది ఆయనకు దాసులుగా ఉండడానికే. అందుకే పౌలు "మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై, పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము" (రోమా 6:17,18) అంటున్నాడు. కాబట్టి సంఘమైన మనమంతా ఆయన కట్టడలను గైకొనాలి.

లేవీయకాండము 26:14,15
మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించినయెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనినయెడలను-

ఇంతవరకూ ప్రజలు ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనను మాత్రమే ఆరాధిస్తే కలిగే ఆశీర్వాదాలేంటో తెలియచేసిన దేవుడు వారు కనుక అలా చెయ్యకుంటే అనగా ఆయనపై తిరుగబడితే కలిగే శాపాలేంటో ఈ వచనాల నుండి హెచ్చరించడం మనం చూస్తాం.

లేవీయకాండము 26:16
నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు.

ఈ వచనాల ప్రకారం ప్రజలు ఆయనపై తిరుగబడి ఆయన ఆజ్ఞలకు అవిధేయులైతే మొదట వారి ఆరోగ్యాన్ని ఆయన పాడుచేస్తాడు. తర్వాత వారి పంటలు వారికి దక్కవు, శత్రుసైనికులు వాటిని అనుభవిస్తారు‌.

లేవీయకాండము 26:17
నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.

ఈ వచనాల ప్రకారం; నేను మీకు దేవుడనై యుందును అని పలికిన దేవుడే వారికి పగవాడు ఔతాడు. మీలో ఐదుగురు నూరుమందిని తరుముతారని వాగ్దానం చేసిన దేవుడు వారిని ఎవరూ తరమకపోయినా పారిపోయేలా చేస్తాడు. ఈ మాటలు శత్రుభయాన్ని సూచిస్తున్నాయి.

లేవీయకాండము 26:18
ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.

ఇవి దేవుని క్రమశిక్షణను సూచించే మాటలు. ఆయన ఉద్దేశం దారితప్పిన తన ప్రజలను నాశనం చెయ్యడం కాదు. వారిని దండించి సరైన మార్గంలో పెట్టడమే. అందుకే ఈ అధ్యాయంలో ఈమాటలు మరలా మరలా మనకు కనిపిస్తాయి.

లేవీయకాండము 26:19
మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను.

ఈ వచనం ప్రకారం వారికి ఆకాశం మరియు భూమి వారిని నలగగొట్టే ఇనుము ఇత్తడిలా ఉంటాయి. అనగా ఆకాశం నుండి వారికి వర్షం కురియదు, భూమినుండి పంట పండదు.

లేవీయకాండము 26:20
మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫల మియ్యకుండును.

పై వచనంలో ఆయన హెచ్చరించినట్టు ఆకాశం వారికి ఇనుముగా భూమి వారికి ఇత్తడిగా ఉంటుంది కాబట్టి అనగా వారికి వర్షం కానీ భూమి సారం కానీ లభించదు కాబట్టి వారికి పంటలు పండవు. దానివల్ల వారు తిండిలేక బలహీనం ఔతారు‌.

లేవీయకాండము 26:21
మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను.

18వ వచనంలో వివరించినట్టు ఇవి ఆయన క్రమశిక్షణను సూచించే మాటలు.

లేవీయకాండము 26:22
మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతానరహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును.

మీ దేశంలో అడవిమృగాలు లేకుండా చేస్తానని పలికిన దేవుడే ఇక్కడ ఆ అడవి మృగాల ద్వారా వారిని నాశనం చేస్తానని హెచ్చరించడం మనం చూస్తాం.

యిర్మియా 5:6 వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచి యుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.

లేవీయకాండము 26:23-25
శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల నేనుకూడ మీకు విరోధ ముగా నడిచెదను; మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను. మీమీదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధనవిషయమై ప్రతిదండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింపబడెదరు.

ఇవన్నీ కూడా ప్రజలు ఆయనపై తిరుగుబాటు చేసినప్పుడు పొందుకునే శాపాలే. ఆశీర్వాదాలకు ప్రతిగా ఈ శాపాలు వారు పొందుకుంటారు‌.

లేవీయకాండము 26:26
నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణా ధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు.

ఈ శాపం వారి ఆహార కొరతను సూచిస్తుంది.

లేవీయకాండము 26:27,28
నేను ఈలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.

18వ వచనంలో వివరించినట్టు ఈ మాటలు ఆయన క్రమశిక్షణను సూచిస్తున్నాయి. ఆయన ఉద్దేశం వారు మరలా ఆయనవైపు తిరగడమే.

లేవీయకాండము 26:29
మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు.

ఈ మాటలు వారు అనుభవించే భయంకరమైన కరువును సూచిస్తున్నాయి. వారికి కలిగిన కరువులో ఆకలి బాధను బట్టి వివరికి వారి పిల్లలనే తినేంతగా వారు దిగజారిపోతారు‌. ఇది ఇశ్రాయేలీయుల చరిత్రలో జరిగినట్టు మనం చూస్తాం (2 రాజులు 6:24-29, విలాపవాక్యాలు 4:10).

లేవీయకాండము 26:30
నేను మీ యున్నతస్థలములను పాడు చేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించెదను.

ఈ ఉన్నతస్థలాలు అనేవి సొలొమోను మందిరం లేనప్పుడు ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి నియమించుకున్న ప్రదేశాలు (1 సమూయేలు 9:12, 10:5, 1 రాజులు 3:2,4, 12:31). అయితే ప్రజలు విగ్రహారాధన చెయ్యడానికి కూడా ఈ ఉన్నత స్థలాలను వినియోగించుకున్నారు. ఈ చరిత్ర మనకు రాజుల గ్రంథాలలో కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు నాశనం చేస్తాను అంటుంది వాటినే. యుద్ధసమయంలో ఇది నెరవేరేది.

లేవీయకాండము 26:31
నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడు చేసెదను; మీ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రాణింపను.

ఈ మాటలు ఆ ప్రజల పట్ల దేవుని విముఖతను సూచిస్తున్నాయి. ప్రజలు పాపం చేస్తూ ఆయనకు బలులు అర్పించినప్పుడు ఆయన వాటిని అంగీకరించడు (ఆమోసు 5:21).

లేవీయకాండము 26:32
నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.

ఈ వచనం ప్రకారం ఇశ్రాయేలీయుల నాశనం వారి శత్రువులకు కూడా ఆశ్చర్యం కలిగించేదిగా ఉంటుంది. ఇది అనేకసార్లు వారి చరిత్రలో నెరవేరింది.

లేవీయకాండము 26:33
జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.

ఇది ఇశ్రాయేలీయుల చరిత్రలో చాలాసార్లు నెరవేరింది. మొదట వారు అష్షూరీయుల కారణంగా చెదిరిపోయారు, తర్వాత బబులోనీయుల కారణంగా చెదిరిపోయారు. ఇప్పటికీ చెదరిపోయిన ఎంతోమంది యూదులు ఆయా దేశాల్లో స్థిరపడి ఉన్నారు. మన దేశంలో కూడా.

లేవీయకాండము 26:34-39
మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును. అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును. మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకని మీద నొకడు పడెదరు; మీ శత్రువులయెదుట మీరు నిలువలేక పోయెదరు. మీరు జనముగానుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును. మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయెదరు.

ఇవన్నీ కూడా యుద్ధానికి సంబంధించిన శాపాలే.

"మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయెదరు"

ఎందుకంటే వారు కూడా తమ తండ్రుల మార్గంలోనే నడిచారు కాబట్టి.

లేవీయకాండము 26:40-46
వారు నాకు విరో ధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పిం చితిననియు, ఒప్పు కొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; ఆ దేశమునుకూడ జ్ఞాపకము చేసికొందును. వారిచేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతిదినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించు కొనిరి. ఆ హేతువుచేతనే వారు తమ దోషశిక్ష న్యాయ మని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారికి దేవుడనైయుండునట్లు వారి పూర్వికులను జనములయెదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులను బట్టి జ్ఞాపకము చేసికొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. యెహోవా మోషేద్వారా సీనాయికొండ మీద తన కును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే.

ఈ వచనాలలో దేవుడు మరలా ప్రజలకు అవకాశం ఇవ్వడం మనం చూస్తాం. కాబట్టి ఆయన ఉద్దేశం ఆ ప్రజలను నాశనం చెయ్యడం కాదు, వారిని శిక్షించి సరైన మార్గంలో పెట్టడమే. ఈ నెరవేర్పు మనం నెహెమ్యా కాలంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించవలసినవి.

1&2 వచనాల ప్రకారం; ప్రజలు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఆయన విశ్రాంతి దినాలను కట్టడలను పాటించడం ద్వారా ఆరాధించాలి. ఇదే అన్ని ఆజ్ఞలకూ మూలం. అలా ఆయన్ను ఆరాధిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటో 3 నుండి 13 వచనాల వరకూ రాయబడింది. అయితే ప్రజలు ఆయనపై తిరగబడి ఆయన ఆజ్ఞలకు అవిధేయులై విగ్రహాలను నిలుపుకుంటే కలిగే శాపాలేంటో 14 నుండి 39 వచనాల వరకూ రాయబడింది. 40 నుండి వారు తమ పాపాన్ని ఒప్పుకుని మరలా దేవునివైపుకు తిరిగితే ఆయన ముందు వాగ్దానం చేసిన అన్ని ఆశీర్వాదాలూ తిరిగి ఇస్తానంటున్నాడు, మళ్ళీ వారికి దేవునిగా ఉంటానంటున్నాడు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.