పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

లేవీయకాండము 22:1,2
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులును నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము; నేను యెహోవాను.

ఇశ్రాయేలీయులు అర్పించే బలుల్లోనూ అర్పణల్లోనూ యాజకులకు భాగం ఉంటుంది. అవి ప్రతిష్టతమైనవి. వాటిగురించే ఈ వచనాలలో "నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠతములుగా ఎంచవలెనని వారితో చెప్పుము" అని ఆజ్ఞాపించబడుతుంది. అంటే ప్రతిష్ఠితమైన వాటిని వారు పరిశుద్ధంగా ఉండి భుజించాలి. క్రింది వచనాల ప్రకారం శారీరక అపవిత్రతలు గలవారు వాటిని తినకూడదు, అలా చేస్తే వాటిని అప్రతిష్ఠింగా ఎంచి ఆయన నామాన్ని అపవిత్రపరిచినట్టు‌. అలానే కొన్నిటిని మందిరంలో ఉండి మాత్రమే భుజించాలి అలా చెయ్యకుండా ఇంటికి తీసుకెళ్ళి తిన్నా వాటిని అప్రతిష్టంగా ఎంచి ఆయన నామాన్ని అపవిత్రపరిచినట్టు‌.

దీనిని‌బట్టి దేవునికి ప్రతిష్ఠించినవాటిని బట్టే ఆయన నామాన్ని అపవిత్రపరచగలం అని అర్థమౌతుంది. కాబట్టి ఆయనకు ప్రతిష్ఠించినవాటి విషయంలోనూ పరిచర్య విషయంలోనూ పవిత్రంగా ప్రవర్తించాలి. లేకుంటే ప్రతిష్ఠతమైనవాటివల్లే ఆయన నామాన్ని అపవిత్రపరచగలం.

లేవీయకాండము 22:3
నీవు వారితో ఇట్లనుము మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించినయెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండ కొట్టివేయబడును; నేను యెహోవాను.

ఈ వచనం ప్రకారం; అపవిత్రతలు గల యాజకుడు ఇశ్రాయేలీయులు అర్పించిన ప్రతిష్టితమైనవాటిని భుజించడమే కాదు కనీసం వాటిని సమీపించినా కూడా దేవుని సన్నిధిలో ఉండకుండా కొట్టివెయ్యబడతాడు. ఆ అపవిత్రతలేంటో క్రింది వచనాలలో వివరించబడింది. అంటే దేవునిసన్నిధిలో ఉన్నంతమాత్రాన భద్రంగా ఉన్నామని కాదు, దేవుని సన్నిధిని ఆయనకు తగినట్టుగా సమీపిస్తున్నప్పుడే అందులో ఆయన ఆజ్ఞాపించినట్టుగా కొనసాగుతున్నప్పుడే భద్రంగా ఉంటారు.

లేవీయకాండము 22:4-7
అహరోను సంతానములో ఒకనికి కుష్ఠయినను స్రావమైనను కలిగినయెడల అట్టివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవమువలని అపవిత్రతగల దేనినైనను ముట్టువాడును స్ఖలితవీర్యుడును, అపవిత్రమైన పురుగునేమి యేదో ఒక అపవిత్రతవలన అపవిత్రుడైన మనుష్యునినేమి ముట్టువాడును, అట్టి అపవిత్రత తగిలినవాడును సాయంకాలము వరకు అపవిత్రుడగును. అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొను వరకు ప్రతిష్ఠితమైనవాటిని తినకూడదు. సూర్యుడు అస్త మించినప్పుడు అతడు పవిత్రుడగును; తరువాత అతడు ప్రతిష్ఠితమైనవాటిని తినవచ్చును, అవి వానికి ఆహారమే గదా.

ఈ వచనాల ప్రకారం కుష్టు ఐనా స్రావం ఐనా కలిగిన యాజకుడు ఆ రోగాల నుండి స్వస్థపడేవరకూ దేవునికి అర్పించిన వాటిని (ప్రతిష్టితమైనవి) తినకూడదు.‌ అలానే శవాన్ని ముట్టినవాడు, వీర్యస్ఖలనం జరిగినవాడు, అపవిత్రమైన పురుగును ముట్టినవాడు, అపవిత్రమైన మనుష్యుని ముట్టినవాడు అనగా స్రావం గలవాడిని, కుష్టురోగిని, శవాన్ని ముట్టినవాడిని ఇలా.. దేవుడు ఆజ్ఞాపించిన అపవిత్రత గల మనుష్యుడ్ని ముట్టినవాడు కూడా స్నానం చేసి సాయంకాలం వరకూ ప్రతిష్టితమైన వాటిని తినకూడదు‌. తింటే ప్రారంభవచనాల్లో తెలియచేసినట్టు దేవుని నామాన్ని అపవిత్రపరిచినట్టు ఔతుంది.

గమనించండి; ఇవన్నీ ఆచారసంబంధమైన అపవిత్రతలు. వాటికి లోనైతేనే ప్రతిష్ఠతమైనవాటిని తినకూడదంటే నైతికంగా అపవిత్రతలు కలిగి పరిచర్యలో కొనసాగడం దేవుని నామాన్ని మరింతగా అపవిత్రపరచడం ఔతుంది కదా! పరిచారకులు ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి.

లేవీయకాండము 22:8
అతడు కళేబరమునైనను చీల్చ బడినదానినైనను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు; నేను యెహోవాను.

ఈ వచనం ప్రకారం యాజకుడు ముందే చచ్చిన జంతువును కానీ చీల్చబడినదానిని కానీ తినకూడదు. సాధారణ ఇశ్రాయేలీయులకు కూడా ఈ నియమం వర్తిస్తుంది (ద్వితియోపదేశకాండము 14:21) ప్రతిష్టితమైన వాటిని తినే యాజకులకు మరింతగా వర్తిస్తుంది.

లేవీయకాండము 22:9
కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి, దాని పాపభారమును మోసికొని దానివలన చావకుండు నట్లు ఈ విధిని ఆచరించవలెను; నేను వారిని పరిశుద్ధ పరచుయెహోవాను.

ఈ వచనం ప్రకారం; దేవుడు ఆజ్ఞాపించిన విధిని అపవిత్రపరచినవాడు అనగా ఇప్పటివరకూ ఆయన ప్రతిష్టితమైనవాటిని తినకూడదని ఆజ్ఞాపించిన అపవిత్రుడు వాటిని తిని ఆయన విధిని అపవిత్రపరిస్తే పాపం భారం మోసుకొని చస్తాడు. ఉదాహరణకు నాదాబు అబీహులు ఆయన విధిని అతిక్రమించే చనిపోయారు (లేవీకాండము 10:1,2). కాబట్టి ఆయనవిధిని పవిత్రపరిచేవారుగా వాటికి లోబడాలి. ఈ నియమం క్రీస్తు నామాన్ని ధరించిన మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా సంఘంలో సమాజంలో ఆయన విధులను పవిత్రపరిచేవారంగా వాటికి సంపూర్ణంగా లోబడాలి.

లేవీయకాండము 22:10,11
అన్యుడు ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు, యాజకునియింట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు, అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని యింట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును.

ఈ వచనాల ప్రకారం; ఇశ్రాయేలీయులు అర్పించిన ప్రతిష్టితమైనవాటిని యాజకుడి ఇంటిలో పనిచేసే అన్యుడు కానీ జీతగాడు కానీ తినకూడదు. ఎందుకంటే వారు ఆ యాజకుడికి సంబంధించినవారు కారు. కానీ ఆ యాజకుడు కొనుక్కున్నవాడు అతని ఇంటిలో పుట్టినవాడు అతనికి దత్తపుత్రులుగా పరిగణించబడతారు. ఈ కారణాన్ని బట్టి వారు తినవచ్చు‌.

ఈ నియమం ప్రకారం దేవునికి ప్రతిష్టితమైనవి దేవునికి ప్రతిష్టితమైనవారికి మాత్రమే చెందుతాయని అర్థం చేసుకోవాలి. ఆయన వాగ్దానాలు కానీ ఆశీర్వాదాలు కానీ అన్నీ ఆయన ప్రజలకే. అన్యులకు అందులో పాలుపొంపులు ఉండవు. అలానే క్రీస్తు శరీర రక్తాలకు సాదృష్యమైన రొట్టెద్రాక్షారసం కూడా బాప్తీస్మం ద్వారా ఆ క్రీస్తును ధరించుకున్న వారు మాత్రమే తినాలి.

లేవీయకాండము 22:12
యాజకుని కుమార్తె అన్యుని కియ్యబడినయెడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు.

ఇక్కడ అన్యుడు అంటే ఇశ్రాయేలీయుడు కానివాడు అని కాదు, లేవీగోత్రం కానివాడు లేక యాజకకుటుంబం కానివాడు అని అర్థం. అలా వేరొకగోత్రానికి చెందినవాడిని వివాహం చేసుకున్న యాజకుని కుమార్తె ప్రతిష్టితమైనవి తినకూడదు. ఎందుకంటే అవి యాజకకుటుంబానికి మాత్రమే నియమించబడినవి. ఇప్పుడు ఆమె ఆ కుటుంబానికి చెందదు, వేరే గోత్రంలో కలసిపోయింది కాబట్టి ఆమె తినకూడదు‌.

లేవీయకాండము 22:13
యాజకుని కుమార్తెలలో విధవరాలేకాని విడనాడబడినదే కాని సంతానము లేనియెడల ఆమె తన బాల్యమందువలె తన తండ్రి యింటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడును దాని తినకూడదు.

ఈ వచనం ప్రకారం; యాజకుడి కుమార్తె అన్యుడ్ని వివాహం చేసుకున్నప్పటికీ తన భర్తచనిపోయినా విడనాడబడినా ఆమెకు సంతానం లేకపోయినా ఆమె తిరిగి తన తండ్రి ఇంటికి చేరుకుంటే ఆమె ప్రతిష్టితమైనవి తినవచ్చు‌. ఎందుకంటే ఇంక ఆమెకు వేరే ఆధారం లేదు.

లేవీయకాండము 22:14
ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైనదానిని తినినయెడల వాడు ఆ ప్రతిష్ఠితమైనదానిలో అయిదవవంతు కలిపి దానితో యాజకునికియ్యవలెను.

ఈ వచనం ప్రకారం; ఎవరైనా తెలియకుండా యాజకుడికి చెందిన ప్రతిష్టితమైనవి తినేస్తే ఉదాహరణకు అతని ఇంటిలో పనిచేసేవారు. తిన్నది ఎలాగూ తిరిగి ఇవ్వలేరు కాబట్టి దానికి ఐదువంతులు కలిపి ఆ యాజకుడికి తిరిగివ్వాలి.

లేవీయకాండము 22:15
ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినుటవలన అపరాధమును భరింప కుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు.

ఈ వచనం BSI అనువాదంలో కాస్త అస్పష్టంగా ఉన్నందువల్ల గ్రేస్ మినిస్ట్రీస్ వారి వాడుక అనువాదం ప్రస్తావిస్తున్నాను.

"ఇస్రాయేల్ ప్రజలు యెహోవాకు ప్రతిష్ఠించిన అర్పణలు తినేహక్కు లేని వ్యక్తిని యాజి తిననివ్వకూడదు. అలా వాటిని అపవిత్ర పరచకూడదు, అలాంటి వ్యక్తిని తిననివ్వడంవల్ల అతడిమీదికి అపరాధం, శిక్ష తెచ్చిపెట్టకూడదు"

ఈ మాటల ప్రకారం; యాజకుడు మాత్రమే తినవలసిన వాటిని సామాన్య ప్రజలు తినకుండా ఆ యాజకుడు జాగ్రత్త వహించాలి. లేకుంటే ఆ తిన్న వ్యక్తి తెచ్చిపెట్టుకునే శిక్షకు పరోక్షంగా ఆ యాజకుడు కారణమౌతాడు. ఈ నియమం పరిచారకులు తాము పాపం చెయ్యకుండా ఉండడమే కాదు, ఇతరులు కూడా పాపం చెయ్యకుండా జాగ్రత్త వహించాలని నేర్పిస్తుంది.

అసలు ప్రతిష్టితమైనవి యాజకుడు మాత్రమే ఎందుకు తినాలి అన్యుడు తినకూడదంటే యాజకుడు జనుల దోషాన్ని భరించడానికి వాటిని తినాలి (నిర్గమకాండము 28:38, లేవీకాండము 10:17). కాబట్టి యాజకులు భరించవలసిన ఆ దోషాన్ని ఇతరులు భరించేలా వాటిని తినకూడదు. అది యాజకులు మాత్రమే చెయ్యాలి. ఈ యాజకుడు క్రీస్తుకు ఛాయగా ఉన్నాడు కాబట్టి క్రీస్తు ఒక్కడే మన పాపాలను భరించాడు అనడానికి సాదృష్యంగా వాటిని యాజకుడు మాత్రమే తినాలి.

లేవీయకాండము 22:16
నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము.

ఈ వచనం ప్రకారం; ఆయన తన అర్పణలను పరిశుద్ధపరచుకుంటాడు. ఆయన ఈ ఆజ్ఞల ద్వారా అపవిత్రులు కానీ అన్యులు కానీ వాటిని తినకుండా చెయ్యడం ద్వారా వాటిని పరిశుద్ధపరచుకుంటాడు.

లేవీయకాండము 22:17-25
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఇట్లు చెప్పుము ఇశ్రాయేలీయుల యింటివారిలోనేగాని ఇశ్రాయేలీయులలో నివ సించు పరదేశులలోనేగాని యెవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కు బళ్లనైనను అర్పిం చునోవాడు అంగీకరింపబడినట్లు, గోవులలో నుండి యైనను గొఱ్ఱెమేకలలో నుండియైనను దోషములేని మగదానిని అర్పింప వలెను. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు; అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకేగాని స్వేచ్ఛార్పణము అర్పించుటకేగాని సమాధానబలిరూపముగా గోవునైనను గొఱ్ఱెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషములేనిదై యుండవలెను; దానిలో కళంకమేదియు నుండకూడదు. గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరతగలదేమి గడ్డగలదేమి గజ్జిరోగముగలదేమి చిరుగుడుగలదేమి అట్టివాటిని యెహోవాకు అర్పింపకూడదు; వాటిలో దేనిని బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురూపియైన కోడెనైనను గొఱ్ఱె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింప వచ్చును గాని అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన దానినేగాని విరిగినదానినేగాని చితికినదానినేగాని కోయబడినదానినేగాని యెహోవాకు అర్పింపకూడదు; మీ దేశములో అట్టికార్యము చేయకూడదు; పరదేశి చేతినుండి అట్టివాటిలో దేనిని తీసికొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు; అవి లోపము గలవి, వాటికి కళంకములుండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము.

గడచిన అధ్యాయంలో కళంకం ఉన్న లేవీవంశస్థుడు యాజకపరిచర్య చెయ్యకూడదని చూసాం. ఈ వచనాల ప్రకారం దేవునికి బలిగా అర్పించే గోవులు కానీ గొఱ్ఱెమేకలు కానీ ఎలాంటి లోపం లేనివిగా ఉండాలి. అనగా వాటికి ఎలాంటి‌ కళంకం ఉండకూడదు. అంటే అర్పించే యాజకుడూ కళంకం లేనివాడిగా ఉండాలి, అర్పించబడే పశువు కూడా కళంకం లేకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ఇద్దరూ క్రీస్తుకు ఛాయగానే ఉన్నారు. ఆయన ఏ లోపమూ (పాపమూ) లేని నిష్కళంకుడు.

1 పేతురు 1:19 అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా.

హెబ్రీయులకు 7:26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.

కాబట్టి యాజకుడే కాదు ఆయనకు ఛాయగా అర్పించబడుతున్న బలిపశువులు కూడా శారీరకంగా ఎలాంటి లోపం లేకుండా ఉండాలి. లేకుంటే ఆయన పరిశుద్ధతను శంకించినట్టు.

అలాగే లోపము గలవాటిని దేవునికి అర్పించడమంటే ఆయనను అగౌరవపరుస్తున్నట్టు. ఇశ్రాయేలీయులు ఇలా చేసే దేవునిచేత‌ నిందించబడ్డారు.

మలాకీ 1:8 ​గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.

నిజంగా దేవునిపై భయభక్తులతో బలులు అర్పిస్తుంటే ఇలా లోపము గలవాటిని కాదు, హేబెలు లా శ్రేష్టమైన వాటిని ఆయనకు అర్పిస్తారు.

లేవీయకాండము 22:26,27
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను దూడయేగాని, గొఱ్ఱెపిల్లయేగాని, మేకపిల్లయేగాని, పుట్టినప్పుడు అది యేడు దినములు దాని తల్లితో నుండ వలెను. ఎనిమిదవనాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింప తగును.

ఇశ్రాయేలీయుల పవిత్ర పశువుల్లో తొలిచూలుగా పుట్టిన పిల్లలను దేవునికి అర్పించాలి (నిర్గమకాండము 34:19). అయితే ఆ తొలిచూలు పిల్లను ఎనిమిదవ దినాన కానీ ఆ తర్వాత కానీ ఆయనకు అర్పించాలి. అప్పటివరకూ అది తల్లివద్దనే ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏడు అనేది సంపూర్ణతను సూచిస్తుంది కాబట్టి ఆ ఏడు దినాలూ అది తల్లివద్దనే ఉండాలి.

లేవీయకాండము‌ 22:28
అయితే అది ఆవైనను గొఱ్ఱె మేకలలోనిదైనను మీరు దానిని దానిపిల్లను ఒక్క నాడే వధింపకూడదు.

ఈ వచనం ప్రకారం తల్లినీ దాని పిల్లనూ ఒకేరోజు దేవునికి అర్పించకూడదు. ఇదే తరహాలో "మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు" (ద్వితియోపదేశకాండము 14:21), "గుడ్లయినను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టుమీదనే గాని నేలమీదనేగాని త్రోవలోనేగాని నీకు కనబడిన యెడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్న యెడల పిల్లలతో కూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగు నట్లును నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసికొనవచ్చును" (ద్వితియోపదేశకాండము 22:6,7) అని ఆజ్ఞాపించబడింది. ఇవి తన ప్రజల సహజ ప్రవృత్తిలో కనికరం కలిగియుండాలని నేర్పిస్తున్నాయి. ఆ కనికరం బలి అర్పించేటప్పుడు కూడా కలిగియుండి అప్పటికే పిల్ల దూరమైన బాధలో ఉన్న తల్లిని కూడా బలిగా అర్పిస్తూ దానిని మరింత‌ బాధను కలిగించకూడదు.

లేవీయకాండము 22:29,30
మీరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది మీకొరకు అంగీకరింపబడునట్లుగా దానిని అర్పింపవలెను. ఆనాడే దాని తినివేయవలెను; మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు; నేను యెహోవాను.

ఈ వచనాల ప్రకారం; కృతజ్ఞతాబలియగు పశువును అర్పించినప్పుడు ఆరోజే దానిని తినాలి, మరునాటికి ఉంచుకోకూడదు (లేవీకాండము 7:11-18 వ్యాఖ్యానం చూడండి). "అంగీకరింపబడునట్లుగా దానిని అర్పింపవలెను" అంటే ఆయన ఆజ్ఞాపించినట్టుగా అర్పించాలి, తినాలి అని అర్థం.

లేవీయకాండము 22:31,32
మీరు నా ఆజ్ఞలననుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను; నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసికొందును.

ఇప్పటివరకూ ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అతిక్రమించడమే ఆయన పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచడం, కాబట్టి దేవుని ప్రజలు అలా చెయ్యకూడదు. అందుకే మనం "నీ నామము పవిత్రపరచబడును గాక" అని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞలప్రకారం ఆయన నామానికి తగినట్టుగా జీవించాలి.

"నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసికొందును"

ఇవి చాలా గంభీరమైన మాటలు. ఆయన తనను తాను పరిశుద్ధుడిగా చేసుకుంటాడు. అంటే ఆయన నామాన్ని ఒకడు అపవిత్రపరచాలని చూసినప్పటికీ తనను తాను పరిశుద్ధునిగా చేసుకుంటాడు. ఎలాగంటే;
1. ఆ వ్యక్తికి మారుమనస్సు ప్రసాదించి, మరలా ఆయన నామాన్ని పవిత్రపరిచే కార్యానికి పూనుకునేలా చెయ్యడం ద్వారా.
2. ఆ వ్యక్తిపై తన ఉగ్రతను కుమ్మరించి నాశనం‌ చెయ్యడం ద్వారా.
ఇలా దేవుడు రెండు విధాలుగా తన నామాన్ని పరిశుద్ధపరచుకుంటాడు.

లేవీయకాండము 22:33
నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై యుండునట్లు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము.

ఇక్కడ ఆయన ఆ ప్రజలకు కలిగించిన విమోచనను వారితో చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చెయ్యడానికి ఈ మాటలు పలుకుతున్నాడు. ఆయన కలిగించిన విమోచనను బట్టి ఆయన చేసిన నిబంధనను బట్టి ప్రజలు ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఇది మనకు కూడా వర్తిస్తుంది, ఆయన మనతో క్రీస్తు రక్తాన్ని బట్టి క్రొత్తనిబంధన చేసాడు, మనల్ని పాపమనే బానిసత్వం నుండి ఆ రక్తం ద్వారా విమోచించాడు.

1 పేతురు 1:18,19 పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.