పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 6:1-4 , 6:5-7, 6:8 , 6:9 , 6:10,11 , 6:12,13 ,6:14-16 , 6:17 , 6:18 , 6:19-22 , 6:23 , 6:24-26 , 6:27-29 , 6:30.

 

 లేవీయకాండము 6:1-4
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహముచేసి పాపియైనయెడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియేగాని తాకట్టు ఉంచినదాని గూర్చియేగాని, దోచుకొనినదాని గూర్చి యేగాని, తన పొరుగువానితో బొంకినయెడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన యెడలనేమి పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకినయెడల నేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగు దురో వాటన్నిటిలో దేనివిషయమైనను అబద్ధప్రమాణము చేసినయెడల నేమి, అతడు పాపము చేసి అపరాధి యగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి గాని బలాత్కారముచేతను అపహరించినదాని గూర్చిగాని తనకు అప్పగింపబడినదాని గూర్చిగాని, పోయి తనకు దొరి కినదాని గూర్చిగాని, దేనిగూర్చియైతే తాను అబద్ధప్రమాణము చేసెనో దానినంతయు మరల ఇచ్చుకొనవలెను.

గడచిన అధ్యాయంలో దేవుడు "ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరబాటున పాపముచేసిన" (లేవీయకాండము 5:15) అంటూ ఆయనకు ప్రతిష్టించినవాటిని లేక ఆయనకు ఇవ్వవలసినవాటిని ఆయనకు చెల్లించకపోవడం పాపంగా పేర్కొన్నాడు. ఇప్పుడైతే తన పొరుగువానిది దోచుకోవడం, వాటి విషయంలో అబద్ధమాడడం కూడా ఆయనకు విరోధంగా చేసే ద్రోహంగానే హెచ్చరిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ఆయనకు చెందవలసినవాటిని దొంగిలించినా, లేక పొరుగువానిది దొంగిలించినా రెండూ సమానమైన పాపాలుగానే భావిస్తున్నాడు.‌ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశమే దేవుణ్ణి ప్రేమించడం, తన పొరుగువారిపట్ల కూడా ప్రేమకలిగి యథార్థంగా జీవించడం. ఇశ్రాయేలీయులు ఆయన దృష్టిలో అసహ్యులుగా మారడానికి ఈ నియమాన్ని అతిక్రమించడమే ప్రధానకారణం.

మలాకీ 2:10 మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహము చేయుచు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము?

విషయానికి వస్తే; సాధారణంగా ఆరోజుల్లో ఎవరైనా ఇతరప్రాంతాలకు వెళ్తున్నప్పుడు తమ‌ విలువైన వస్తువులనూ లేక పశువులనూ పొరుగువారికి అప్పగించి వెళ్ళేవారు. కానీ వారు తిరిగివచ్చినప్పుడు కొందరు నువ్వు‌ మాకు ఏమీ ఇవ్వలేదని అబద్ధం చెప్పడం, లేక వారు అప్పగించినదానికంటే తక్కువగా తిరిగి ఇవ్వడం, లేదా న్యాయంగా వాటిని అప్పగించినప్పటికీ అవతలి వ్యక్తి నాకు అప్పగించలేదని అబద్ధాలు చెప్పడం జరుగుతుండేవి. తాకట్టు విషయంలో కూడా ఇంతే. ఆవిధంగా జరిగినదానికి సాక్షులు లేనప్పుడు వారు న్యాయాధిపతుల ముందు ప్రమాణం చేసి నిజం చెప్పాలి. కానీ అలా ప్రమాణం చేసి కూడా అబద్ధమే చెబితే, లేక దొంగిలిస్తే, లేక అతనికి దొరికిన పశువును కానీ వస్తువును కానీ అది ఎవరిదని విచారణ చెయ్యకుండా అతనే సొంతం చేసుకుంటే ఇలా ఇవన్నీ పాపాలుగా ఎంచబడతాయి. అలాంటప్పుడు వారు తమ మనసాక్షి గద్దింపును లక్ష్యపెట్టి దేవునిపట్ల భయంతో ఆ పాపాన్ని సరిచేసుకోవాలి అనుకుంటే దానికి ప్రాయశ్చిత్తంగా ఏం చెయ్యాలో దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. దానిప్రకారం; ముందుగా వారు తమ పొరుగువాని నుండి అన్యాయంగా తీసుకున్నది కానీ, దొంగిలింగింది కానీ తిరిగి అప్పగించాలి. దొరికినవాటి విషయంలో కూడా అలానే చెయ్యాలి. ఎందుకంటే అలా దొరికినవి ఎవరివో విచారణ చెయ్యకుండా సొంతం చేసుకోవడం, వాటి యజమానుడు ఎవరో తెలియనప్పుడు న్యాయాధిపతులకు దానిని అప్పగించకపోవడం కూడా దొంగిలించడమే. అది ఎంత విలువైనదైనప్పటికీ "నీ పొరుగువానిది ఆశింపకూడదు" అనే ఆజ్ఞ ప్రకారం తమది కానిదానిని ఎవరూ స్వంతం చేసుకోకూడదు. ఇలా తమకు దొరికినది ఎవరిదని విచారణ చేసి వారికి అప్పగించడం వల్ల లేదా న్యాయాధిపతికి అప్పగించడం వల్ల భవిష్యత్తులో వీరి‌ సొత్తు తప్పిపోయినా దేవుడు వాటిని వేరేవారి ద్వారా తిరిగి అప్పగించగలడు.‌ ఎందుకంటే ఆయన మన మంచిమనసాక్షిని బట్టి మనకు మేలు చేసే దేవుడు.

కీర్తనలు 125:4 యెహోవా, మంచి వారికి మేలు చేయుము యథార్థహృదయులకు మేలు చేయుము.

అందుకే దావీదు "యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము" (కీర్తనలు 7:8) అని ప్రార్థిస్తున్నాడు.

లేవీయకాండము 6:5-7
ఆ మూల ధనము నిచ్చుకొని, దానితో దానిలో అయిదవ వంతును తాను అపరాధ పరిహారార్థబలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసికొని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును.

ముందటి వచనాల్లో మనం‌ చూసినట్టుగా ఎవరైనా అలా పొరుగువానిది అన్యాయంగా సొంతం చేసుకుని, దాని విషయమై‌ గద్దించబడి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకున్నప్పుడు, వారు బలి అర్పించాలి. అలానే అర్పించేరోజు అతను సొంతం చేసుకున్న దానితో పాటు దాని విలువలో ఐదో వంతు కూడా ఆ సొత్తు యజమానుడికి అధనంగా చెల్లించాలి. దేవునికి చెందినవాటిని దొంగిలించినప్పుడు కూడా ఇలా ఐదోవంతును అధనంగా చెల్లించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం (లేవీకాండము 5:16). ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించడం, నీ పొరుగువానిని ప్రేమించడం అనేవి రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన ఆజ్ఞలు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన పొరుగువానిని కూడా ప్రేమిస్తాడు, తన పొరుగువానిని ప్రేమించని వాడు దేవుణ్ణి కూడా ప్రేమించలేడు (1 యోహాను 4:20,21). ఇక్కడ మనం మూడు ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి.

1. దోచుకున్నది తిరిగి ఇచ్చివేసినా దాని విలువలో ఐదోవంతు కూడా అధనంగా చెల్లించినా దేవునిముందు ఆ వ్యక్తి చేసిన పాపం పాపం కాకుండా పోదు, అది ప్రాయశ్చిత్తం చెయ్యబడదు. అందుకే అతను దోచుకున్నది సొత్తుయజమానుడికి చెల్లించడంతో పాటు అతనిపాపానికి ప్రాయశ్చిత్తంగా అపరాధ పరిహారార్థ బలి అర్పించాలి.

2. దోచుకున్నది తిరిగి ఇవ్వకుండా, ఇంకా దానిని అనుభవిస్తూ దేవునికి బలి అర్పించినంత మాత్రాన ఆ ఒప్పుకోలు యధార్థమైనదిగా ఉండదు. కాబట్టి ఆ‌ బలి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంకా ఆ సొత్తును అనుభవిస్తూనే ఉన్నాడు. అందుకే దోచుకున్నదానితో పాటు ఐదోవంతు కూడా అధనంగా చెల్లించాలి. నిజమైన మారుమనస్సు‌ ఈవిధంగా యధార్థతకు ప్రేరేపిస్తుంది. అందుకే జక్కయ్య నిజమైన మారుమనస్సుకు ప్రేరేపించబడినప్పుడు అనగా యేసుక్రీస్తు అతనితో "జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పినప్పుడు" (లూకా 19:5) అతను వెంటనే "ఇదిగో ప్రభువా నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని" (లూకా 19:8) తన మారుమనస్సు యొక్క యధార్థతను చాటుకున్నాడు. నిజమైన మారుమనస్సు అనుభవం కలిగిన విశ్వాసులందరూ ఈవిధంగానే తాము చేసిన అన్యాయాన్ని దేవునిసన్నిధిలో ఒప్పుకోవడమే కాదు, వారు ఎవరిపట్ల ఐతే అన్యాయం చేసారో దానిని కూడా సరిచేసుకుంటారు. ఇది దోచుకున్నదాని విషయంలోనే కాదు అన్నిరకాల అన్యాయాల విషయంలోనూ వర్తిస్తుంది.

3. ఒకరికి చెందినదానిని దానిని ఆశించి దోచుకోవడం వల్ల మొదట ఆ దోచుకున్నదే కాకుండా దానితో ఐదోవంతు కూడా కలిపి చెల్లించాలి. అలానే అతనికి నియమించబడిన వెలను బట్టి పొట్టేలును కూడా కొని బలి అర్పించాలి. వీటిలో ఏది చేయకున్నా అతను తన పాపాన్ని భరించవలసిందే. కాబట్టి ఈ నియమం పొరుగువానిది ఆశించి దోచుకోవడం వల్ల తమ సొంత ధనాన్ని (స్వంతమైనవాటిని) కూడా నష్టపోయేలా చేస్తుందని నేర్పిస్తుంది. దీనిని మనం ఆస్తులు, విలువైన వస్తువుల విషయంలో మాత్రమే కాకుండా పొరుగువాని భార్యను ఆశించడం, భర్తను ఆశించడం విషయంలో కూడా అన్వయించుకోవాలి. ఎందుకంటే దానివల్ల ఎంతోమంది తమకు అన్నిటికంటే విలువైన ప్రాణాలనూ జీవితాలనూ కోల్పోయారు.

లేవీయకాండము 6:8
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం; ఈ అధ్యాయం ఈ వచనం నుండి ప్రారంభమౌతుంది. ఎందుకంటే ఇప్పటివరకూ మనం చూసినదంతా గత అధ్యాయంతో సంబంధం కలిగినమాటలే.

లేవీయకాండము 6:9
నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము ఇది దహనబలిని గూర్చిన విధి. దహనబలిద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించు చుండును; బలిపీఠము మీది అగ్ని దానిని దహించు చుండును.

1 అధ్యాయం నుండి ఇప్పటివరకూ దేవుడు ప్రజలు తీసుకురావలసిన బలిద్రవ్యాలు, నైవేద్యాల గురించి ఆజ్ఞాపించాడు. ఈ వచనం నుండైతే ఆ బలిద్రవ్యాలను దహించేవిషయంలో ఆయన యాజకుల కోణం నుండి ఆజ్ఞాపిస్తున్నాడు. దానిప్రకారం యాజకులు బలిపీఠంపై అగ్ని ఆరిపోకుండా కట్టెలు వేస్తూ దహన బలి మాంసాన్ని దహిస్తూనే ఉండాలి. పగలు రాత్రీ అలానే చెయ్యాలి. అంటేవారు తమదగ్గరకు వస్తున్న బలి పశువులను అంచనా వేస్తూ వాటి మాంసాన్ని ఒకోసారి ఎక్కువగా ఒకోసారి తక్కువగా దహిస్తుండాలి. కాబట్టి కొందరు యాజకులు వంతుల చొప్పున ప్రత్యేకంగా ఇదేపని కలిగియుండాలి.

లేవీయకాండము 6:10,11
యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగు కొని బలిపీఠము మీద అగ్ని దహించు దహనబలిద్రవ్యపు బూడిదెను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్రస్థలమునకు ఆ బూడిదెను తీసికొనిపోవలెను.

ఈ వచనాలలో దేవుడు బలిద్రవ్యాల యొక్క బూడిద గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీనిప్రకారం ఒక యాజకుడు వేరు వస్త్రాలను ధరించుకుని ఆ బూడిదను పాళెం వెలుపల పవిత్రస్థలంలో పోయాలి. ఒక వస్త్రాలతో బూడిదను ఎత్తాలి. మరో వస్త్రాలను ధరించి బూడిదను పారబోయాలి. రెండూ యాజకవస్త్రాలే. ఇక పవిత్ర స్థలంలో ఆ బూడిదను పారబోయాలి అన్నప్పుడు శుభ్రంగా ఉన్న ప్రదేశంలో అని అర్థం. అంటే ఆ ప్రదేశంలో ఎలాంటి మలినాలూ ఉండకూడదు. ఉదాహరణకు చనిపోయిన జంతు కళేబరాలు, మలమూత్ర విసర్జనలు అలా. ఎందుకంటే అది పరిశుద్ధుడైన దేవునికి బలిగా అర్పించబడినవాటి బూడిద. అలానే ఆ బలులన్నీ క్రీస్తుకు ఛాయగా ఉన్నాయి.‌

లేవీయకాండము 6:12,13
బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలువేసి, దాని మీద దహనబలి ద్రవ్యమును ఉంచి, సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.

ఈ వచనాల ప్రకారం; బలిపీఠంపై నిత్యము దహనబలి ద్రవ్యం దహించబడుతున్నప్పుడు సమాధాన బలి పశువు క్రొవ్వును కూడా దహించాలి. దహన బలిలో పశువుయొక్క దేహమంతా దహించబడితే సమాధాన బలిలో క్రొవ్వు మాత్రమే దహించబడుతుంది (లేవీకాండము 3 వ్యాఖ్యానం చూడండి). ఇక "బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను" అని మాటిమాటికీ ఎందుకు చెప్పబడుతుందంటే, ప్రత్యక్షగుడారం ఏర్పడినప్పుడు మొట్టమొదటి బలిద్రవ్యాలను దేవుడే తన‌ అగ్నిని దింపి దహించివేసాడు (లేవీకాండము 9:24). అప్పటినుండి ఆ అగ్నినే యాజకులు బలికి ఉపయోగించాలి. అందుకే అది ఆరిపోకుండా రాత్రింపగళ్ళు కట్టెలు వేస్తూ బలిమాంసం, క్రొవ్వు దానిపై అర్పిస్తుండాలి. వారి ప్రయాణంలో కూడా దానిని ఆరిపోనివ్వకూడదు. సొలొమోను నూతనమందిరం కట్టించి నూతనబలిపీఠాన్ని ప్రతిష్టించినప్పుడు కూడా దేవుడు మరలా తన అగ్నిని పంపి దానిపై ఉన్న బలిద్రవ్యాలను దహించివేసాడు (2 దినవృత్తాంతములు 7:1). మొదటి దేవాలయంలో బలులన్నీ బలిపీఠంపైని ఆ అగ్నితోనే దహించబడేవి. అందుకే " సీయోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి" (యెషయా 31:9) అని రాయబడింది. కానీ యూదులు బబులోను నుండి తిరిగివచ్చి నిర్మించిన యేసుక్రీస్తు కాలం నాటి రెండవ దేవాలయంలో ఇలాంటిదేమీ మనము చూడము.

లేవీయకాండము 6:14-16
నైవేద్యమును గూర్చిన విధి యేదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము నెదుట దానిని నర్పించవలెను. అతడు నైవేద్యతైలము నుండియు దాని గోధుమ పిండి నుండియు చేరెడు పిండిని నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతివారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధస్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను.

ఈ వచనాల్లో దేవుడు నైవేద్యాలకు సంబంధించిన క్రమాన్ని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (లేవీకాండము 2 వ్యాఖ్యానం చూడండి). ఆ నైవేద్యంగా తీసుకువచ్చిన గోధుమపిండిలో పిడికెడు తీసుకుని దానికి నూనెనూ సాంబ్రాణినీ చేర్చి బలిపీఠంపై దహించాక మిగిలిన పిండినంతా యాజకులు రొట్టెలుగా చేసుకుని తినాలి. దానిని వారు మాత్రమే ప్రత్యక్షగుడారపు ఆవరణలో తినాలి. అక్కడే తినాలి తప్ప ఇంటికి తీసుకువెళ్ళకూడదు. ఎందుకంటే అది యాజకులుగా వారు మాత్రమే తినవలసిన భాగం. వారి కుటుంబాలు దశమభాగాలు, అర్పణలు వంటివాటితో పోషించబడతాయి. ఈ నియమం దేవునికి సంబంధించిన ప్రత్యేక ఆశీర్వాదాలలో అన్యులకు పాలు ఉండదని నేర్పిస్తుంది.

లేవీయకాండము 6:17
దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధ పరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము.

ఈ వచనం ప్రకారం ఆ నైవేద్యపు గోధుమపిండిని యాజకులు పులియబెట్టి రొట్టెలు చేసుకోకూడదు. అది పులియకుండానే రొట్టెలు చేసుకుని తినాలి‌. ఎందుకంటే "పాపపరిహారార్థబలివలెను అపరాధ పరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము" పులిపిండి అనేది పాపానికి సాదృష్యంగా చెప్పబడింది (1 కొరింథీ 5:7,8).

లేవీయకాండము 6:18
అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును.

పైన నేను వివరించినట్టుగా యాజకులు అనగా అహరోను సంతతివారైన యాజకులు మాత్రమే ఆ నైవేద్యమైన గోధుమపిండిని తినాలి. ఇక వాటికి తగిలిన ప్రతివస్తువు పరిశుద్ధము అనంటే, అది దేవునికి నైవేద్యంగా తీసుకురాబడింది కాబట్టి అందులో కొంత దేవునికి అర్పించబడింది కాబట్టి దానికి తగిలే వస్తువులు కూడా పరిశుద్ధంగా ఎంచబడతాయి. అందువల్ల దానిని ఎక్కడబడితే అక్కడ పెట్టడం, ఎలాబడితే అలా కాల్చడం కాదు.‌ శుభ్రమైన ప్రదేశంలోనే దానిని పెట్టాలి. శుభ్రమైన దానిలోనే దానిని వండాలి. అలానే శుభ్రమైన బల్లపైనే దానిని భుజించాలి.‌

లేవీయకాండము 6:19-22
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను అహరోనుకు అభిషేకము చేసిన దినమున, అతడును అతని సంతతివారును అర్పింపవలసిన అర్పణమేదనగా, ఉదయ మున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్య ముగా తూమెడు గోధుమ పిండిలో పదియవవంతు. పెనము మీద నూనెతో దానిని కాల్చవలెను; దానిని కాల్చిన తరువాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతివారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు ఆలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ, అదంతయు దహింపవలెను.

ఈ వచనాల్లో దేవుడు ప్రధానయాజకుడు అర్పించవలసిన నైవేద్యం గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దేవుడు ఈమాటలు చెప్పేసరికి ఇంకా అహరోను యాజకుడిగా ప్రతిష్టించబడలేదు అది లేవీకాండము 8లో జరిగింది. అలా అతను ప్రతిష్టించబడ్డాక తమ స్వంత కర్చుతో గోధుమపిండిని రొట్టెలుగా చేసి ఆయనకు అర్పించాలి. ఇది యాజకవ్యవస్థకు నిత్యమైన కట్టడ. ఒకవిధంగా ఇది వారు ఇస్తున్నటువంటి దశమభాగము.

లేవీయకాండము 6:23
యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను; దాని తినవలదు.

ఈ వచనంలో దేవుడు "యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను; దాని తినవలదు" అని ఆజ్ఞాపించడం మనం‌ చూస్తాం. ఎందుకంటే క్రీస్తుకు ఛాయగా ఉన్న యాజకుడు ప్రజలు తీసుకువచ్చే అర్పణలనూ బలి మాంసాలనూ వారియొక్క పాపాలను భరిస్తున్నట్టుగా తింటాడు.‌ అందుకే మోషే నాదాబు అబీహులు చనిపోయిన సందర్భంలో "మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలి పశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధముగదా. సమాజము యొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా" (లేవీయకాండము 10:17) అని గద్దిస్తున్నాడు.

అలానే "యాజకులు నా జనుల పాపములను ఆహారముగ చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు" (హోషెయ 4:8) అని ప్రజల పాపాలను బట్టి అర్పించబడే పశుమాంసంలో యాజకుల‌‌ వంతు గురించి రాయబడింది. కాబట్టి ప్రజల పాపాలను‌ భరిస్తున్నట్టుగా యాజకులు వారి తీసుకువచ్చేవి తినాలి. కానీ వీరి పాపాలను వీరు భరించలేదు దేవుడే‌ భరించాలి అనడానికి సాదృష్యంగా వీరు అర్పించే అర్పణలు అన్నిటినీ బలిపీఠంపై కాల్చివెయ్యాలి. ఈ నియమం ఎవరి పాపాలను వారే భరించుకోలేరని బోధిస్తుంది. క్రీస్తు మాత్రమే అందరి పాపాలనూ భరించగలడు ఎందుకంటే ఆయనలో ఈ యాజకుల మాదిరిలా ఎలాంటి పాపం లేదు.

లేవీయకాండము 6:24-26
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుకును అతని సంతతివారికిని ఈలాగు ఆజ్ఞాపించుము పాపపరిహారార్థబలిని గూర్చిన విధియేదనగా, నీవు దహనబలి రూపమైన పశువులను వధించు చోట పాపపరిహారార్థబలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను; అది అతి పరిశుద్ధము. పాపపరిహారార్థ బలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరిశుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను.

ఈ వచనాల్లో దేవుడు పాపపరిహార్థ బలి గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (లేవీకాండము 4 వ్యాఖ్యానం చూడండి). అయితే అక్కడ దాని మాంసమును తినకుండా కాల్చివెయ్యాలని రాయబడింది (లేవీకాండము 4:11,12). కానీ ఇక్కడ "పాపపరిహారార్థ బలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను" అని రాయబడింది. కొందరికి ఇది వైరుధ్యంగా అనిపించవచ్చు కానీ పాపపరిహారార్థ బలిలో దేనిరక్తం పరిశుద్ధస్థలంలోకి తీసుకువెళ్ళబడుతుందో దాని మాంసాన్ని మాత్రమే ఎవరూ తినకూడదు. క్రింది వచనంలో కూడా అది స్పష్టంగా రాయబడింది.

లేవీయకాండము 6:30 మరియు పాపపరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను.

అనగా యాజకుడు పాపం చేసినప్పుడు, సంఘమంతా పాపం‌ చేసినప్పుడు అర్పించబడే పశువును తినకూడదు. ఎందుకంటే దాని రక్తం పరిశుద్ధ స్థలం లోపలికి తీసుకువెళ్ళబడుతుంది (లేవీకాండము 4:1-21). దీనిగురించి హెబ్రీగ్రంథకర్త కూడా తన పత్రికలో జ్ఞాపకం చేస్తాడు (హెబ్రీ 13:10,11). కానీ ప్రజలు వ్యక్తిగత పాపాలకై అర్పించే పాపపరిహారార్థ బలుల్లోని మాంసము యాజకులు సమాధానబలి మాంసం తిన్నట్టే తినవచ్చు (లేవీకాండము 4:26). కాబట్టి ఇక్కడ ఎలాంటి వైరుధ్యమూ లేదు.

లేవీయకాండము 6:27-29
దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించినయెడల అది దేని మీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను. దాని వండిన మంటికుండను పగుల గొట్టవలెను; దానిని ఇత్తడిపాత్రలో వండినయెడల దాని తోమి నీళ్లతో కడుగవలెను. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము.

ఈ వచనాల్లో దేవుడు గోధుమపిండి నైవేద్యంలో ఆజ్ఞాపించినట్టుగానే "దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించినయెడల అది దేని మీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను" అని ఆజ్ఞాపించడం మనం చూస్తాం.‌ అనగా ఆ మాంసాన్నీ రక్తాన్ని పరిశుద్ధమైనదిగా ఎంచి వానిని గౌరవించాలి. ఎందుకంటే అవి క్రీస్తు బలికి సాదృష్యంగా ఉన్నాయి. అందుకే యాజకుడు ఆహారంగా దానిని వండుకునేటప్పుడు మంటిపాత్రను వాడితే దానిని పగులగొట్టెయ్యాలి. సాధారణంగా మంటికుండలో వంట చేసాక ఎంత తోమినా ఆ ప్రభావం కుండ పీల్చుకుంటుంది. మరలా అందులో మాంసాన్ని వండేటప్పుడు ఆ మాంసానికి ఆ ప్రభావం సోకుతుంది. అందుకే ఆ మాంసం వండిన కుండను పగలగొట్టెయ్యాలి. మరలా ఆ మాంసం అందులో వండకూడదు. అదే ఇత్తడిది ఐతే అలా పీల్చుకోవడమేమీ ఉండదు కాబట్టి శుభ్రంగా తోముకుంటే సరిపోతుంది.

ఇక "యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను" అన్నప్పుడు ప్రత్యక్షగుడారంలో పరిచర్య చేసేవారు వారే కాబట్టి ఆ మాంసాన్ని అక్కడే తినాలి తప్ప బయటకు (ఇంటికి) తీసుకువెళ్ళకూడదు కాబట్టి ఆవిధంగా చెప్పబడింది.

లేవీయకాండము 6:30
మరియు పాపపరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను.

దీనిగురించి 24-16 వచనాల వ్యాఖ్యానంలో వివరించాను. ఆ సందర్భాల గురించి లేవీకాండము 4:1-21లో రాయబడింది.

 

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.