పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

లేవీయకాండము 14:1
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను.

గత అధ్యాయంలో దేవుడు కుష్టురోగ నిర్థారణ ఎలా చెయ్యాలో ఆజ్ఞాపించడం మనం చూసాం. ఈ అధ్యాయంలోనైతే ఆ కుష్టురోగం విడిచినవారిని మరలా ఎలా సమాజంలో చేర్చుకోవాలో ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు.

లేవీయకాండము14:2
కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను.

ఈ వచనం ప్రకారం; కుష్టురోగం విడిచిన వ్యక్తిని యాజకుడి దగ్గరకు తీసుకురావాలి. ఎందుకంటే కుష్టురోగ నిర్థారణ చెయ్యాల్సింది యాజకుడే కాబట్టి ఆ కుష్టు బాగుపడిందని కూడా అతనే నిర్ధారించాలి. ఇది దేవుడు వారికి అనుగ్రహించిన అధికారం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కుష్టురోగులను స్వస్థపరిచినప్పుడు "నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొమ్ము" (మత్తయి 8:4) అని ఆజ్ఞాపిస్తాడు.

లేవీయకాండము 14:3
యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన యెడల-

ఈ వచనం ప్రకారం; యాజకుడు పాళెం వెలుపలికి వెళ్ళి కుష్టునుండి బాగుపడిన వ్యక్తిని పరీక్షించాలి. ఎందుకంటే కుష్టురోగులు పాళెం లోపలికి రాకూడదు, వెలుపలే నివసించాలి. ఈ నియమాన్ని బట్టి మనం రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి.

1. సంఘపెద్దలు లేక పరిచారకులు సంఘానికి రాలేని రోగుల యొద్దకు వారే వెళ్ళి ప్రార్థించాలి. ఈ మాటలు మనకు స్పష్టంగా రాయబడ్డాయి (యాకోబు 5:14).

2. కుష్టురోగం పాపానికి ఛాయగా ఉందని (లేక పాపం వల్లనే ఈ రోగం కలిగేదని) గత అధ్యాయంలో వివరించుకున్నాం. ఆ కుష్టు కలిగిన వ్యక్తి పాళెం వెలుపల (లేక వేరుగా) నివసించాలనే నియమం ఉన్నట్టే పాపం చేసిన వారిని సంఘం నుండి వెలివెయ్యాలనే నియమం నూతననిబంధన మనకు నేర్పిస్తుంది (1 కొరింథీ 5:13). కారణం ఒక్కటే: కుష్టువల్ల కానీ పాపం‌ వల్ల కానీ ఇతరులు ప్రభావితం కాకూడదు. అయితే పాళెం వెలుపల నివసించే కుష్టురోగికి యాజకుడు అందుబాటులో ఉన్నట్టే పాపం కారణంగా సంఘం నుండి వెలివెయ్యబడిన వ్యక్తికి కూడా పరిచారకులూ పెద్దలూ అందుబాటులో ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి తన పాపం విషయంలో మారుమనస్సు పొందినప్పుడు తిరిగి సంఘంలోకి చేర్చుకునే అవకాశం ఉంటుంది. వెలివెయ్యబడిన వాడి విషయంలో పౌలు ఇదే ఆదేశించాడు (2 కొరింథీ 2:6,7).

లేవీయకాండము 14:4
యాజకుడు పవిత్రత పొందగోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.

ఈ వచనం ప్రకారం; కుష్టునుండి స్వస్థత పొందిన వ్యక్తి సజీవమైన రెండు పవిత్ర పక్షులను అనగా పావురపు పిల్లను కానీ తెల్ల గువ్వను కానీ (లేవీకాండము 1:14) వాటితో పాటు దేవదారు కఱ్ఱనూ రక్తవర్ణముగల నూలును హిస్సోపును యాజకుడి వద్దకు తీసుకురావాలి. అంటే అతని కుటుంబసభ్యులు కానీ సన్నిహితులు కానీ వాటిని సమకూర్చాలి.

లేవీయకాండము 14:5,6,7
అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించి సజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటి పైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను.

ఈ వచనాల ప్రకారం; యాజకుడు పారే నీరున్న మంటిపాత్రలో అనగా ప్రవహించే నది నుండి తీసుకువచ్చిన నీరున్న పాత్రలో ఆ పక్షుల్లో ఒకదానిని చంపించాలి. రెండవదిగా ఆ పక్షిరక్తంతో మిళిమైన ఆ నీటిలో రెండవ పక్షినీ అలానే దేవదారు కఱ్ఱనూ రక్తవర్ణముగల నూలును హిస్సోపునూ ముంచి ఏడుసార్లు వాటితో కుష్టువిడిచిన వ్యక్తిపై చిమరాలి. చివరిగా ఆ రెండవ పక్షిని విడిచిపెట్టెయ్యాలి.

గమనించండి; ఇది బలే అయినప్పటికీ ప్రత్యక్షగుడారపు బలిపీఠంపై కాకుండా పాళెం వెలుపల జరగవలసిన బలి. ఎందుకంటే ఈ బలి జరక్కుండా ఆ వ్యక్తి ప్రత్యక్షగుడారం దగ్గరకు సమీపించకూడదు. అలానే ప్రతీబలీ యేసుక్రీస్తుకు ఛాయగా ఉంది కాబట్టి ఇక్కడ బలిగా చంపబడిన పక్షి ఆయననే సూచిస్తుంది. విడవబడిన పక్షి కుష్టు నుండి శుద్ధుడైన వ్యక్తిని సూచిస్తుంది. ఇదంతా క్రీస్తురక్తాన్ని బట్టే ఒక వ్యక్తి తన పాపపు రోగం నుండి స్వతంత్రుడు కాగలడు అనేదానికి సాదృష్యంగా నియమించబడింది.

లేవీయకాండము 14:8,9
అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను. ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును.

ఈ వచనాల ప్రకారం; మొదటిగా; కుష్టు నుండి శుద్ధుడైనవాడు తన బట్టలు ఉతుక్కుని శరీరంపై ఉన్న వెంట్రుకలన్నీ కత్తిరించుకున్న తర్వాతనే పాళెంలో ప్రవేశించాలి. ఎందుకంటే కుష్టు నుండి అతని శరీరం బాగుపడుతుంది తప్ప అప్పటివరకూ అతను ధరించిన వస్త్రాలకూ వెంట్రుకలకూ ఆ గాయాల రసి అంటుకునే ఉంటుంది. అందుకే అతను వాటిని శుభ్రం చేసుకోవాలి. లేకుంటే వాటిని బట్టి మరలా ఆ కుష్టుశోకే అవకాశం కానీ లేదా ఇతర వ్యాధులు కానీ సంభవించే అవకాశం ఉంది.

దీనిని మనకు అన్వయించుకుంటే; యేసుక్రీస్తును బట్టి మనమంతా పాపపు రోగం నుండి విడిపించబడ్డాం. అయినప్పటికీ ఆ పాపంలో మరలా చిక్కుకోకుండా మనం చెయ్యాల్సింది చెయ్యాలి. అనగా ప్రతీరోజూ దానితో పోరాడాలి (1 యోహాను 3:3), జాగ్రత్త వహించాలి.

రెండవదిగా; అతను పాళెంలో ప్రవేశించినప్పటికీ ఏడురోజుల వరకూ ప్రత్యేకంగానే ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ శరీరంపై వెంట్రుకలన్నీ తొలగించుకుని బట్టలు ఉతుక్కుని కుటుంబంతో కలవాలి. లేకుంటే వారిపై కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. మూడవ వచనంలో వివరించినట్టుగా ఈ నియమం పాపం విషయంలో మారుమనస్సు పొందిన వ్యక్తిని మరలా సంఘంలోకి చేర్చుకునేముందు జాగ్రత్త పాటించాలనేదానికి సాదృష్యంగా ఉంది. అంటే కుష్టురోగి నిజంగా శుద్ధుడయ్యాడా లేదా అని రెండుసార్లు పరీక్షించినట్టు పాపం కారణంగా సంఘం నుండి‌ వెలివెయ్యబడిన ఆ వ్యక్తి నిజంగా మారుమనస్సు పొందాడా లేదా అని పెద్దలు జాగ్రత్తగా పరీక్షించాలి. ఆ తర్వాతనే సంఘంలోకి చేర్చుకోవాలి. తొందరపడకూడదు.

లేవీయకాండము 14:10
ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱెపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.

ఈ వచనంలో కుష్టునుండి శుద్ధుడైనవాడు ఎనిమిదవ దినాన ప్రత్యక్షగుడారంలోకి తీసుకువెళ్ళవలసిన అర్పణల గురించి మనం చూస్తాం. దీనిగురించే యేసుక్రీస్తు "నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని" (మత్తయి 8:4) శుద్ధుడైన కుష్టురోగికి ఆజ్ఞాపించాడు. ఈ కానుక దేవుడు ఆ వ్యక్తిపై చూపించిన కనికరాన్ని బట్టి బదులుగా చెల్లించవలసిన కృతజ్ఞతను సూచిస్తుంది. దేవుడు మననుండి కోరుకునేది అది మాత్రమే. అందుకే ఆయన పదిమంది కుష్టురోగులు శుద్ధులై ఒకడు మాత్రమే తిరిగివచ్చినప్పుడు ఆ తొమ్మిదిమందీ ఎక్కడ అని ప్రశ్నించాడు (లూకా 17:17).

లేవీయకాండము 14:11-20
పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను. అప్పుడు యాజకుడు ఒక మగ గొఱ్ఱెపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అపరాధ పరిహారార్థబలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాపపరిహారార్థబలి పశువును దహనబలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొఱ్ఱెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దానివలె అపరాధ పరిహారార్థమైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైనదాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలి మీదను, వాని కుడికాలి బొటనవ్రేలి మీదను, దానిని చమరవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన యెడమ అరచేతిలో పోసికొనవలెను. అప్పుడు యాజకుడు తన యెడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతివ్రేలు ముంచి యెహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసికొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను ఉన్న అపరాధపరిహారార్థ బలిపశువు యొక్క రక్తము మీద చమరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొంద గోరువాని తల మీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలిపశువును వధింపవలెను. యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా వాడు పవిత్రుడగును.

ఈ వచనాలలో కుష్టునుండి విడుదలైన వ్యక్తి తీసుకువచ్చిన అర్పణలను యాజకుడు ఎలా అర్పించాలో మనం చూస్తాం. ఈ పాపపరిహార్థ బలి, అపరాధపరిహారార్థ బలి, దహనబలి ఈ బలులన్నిటి గురించీ మొదటి అధ్యాయం నుండి నేను వివరించాను. ఇక వాటి రక్తమూ నూనె ఆ వ్యక్తి కుడిచేతి బొటనవ్రేలి మీద, వాని కుడికాలి బొటనవ్రేలి మీద, తలపైన చమరబడడం అతను పైనుండి క్రిందవరకూ శుద్ధుడయ్యాడనేదానికి సాదృష్యంగా ఉంది.

లేవీయకాండము 14:21-32
వాడు బీదవాడై పైచెప్పినదంతయు తేజాలని యెడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థబలిగా ఒక గొఱ్ఱెపిల్లను నైవేద్యముగా తూములో పదియవవంతు నూనెతో కలిసిన గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని, అనగా పాపపరిహారార్థ బలిగా ఒకదానిని దహనబలిగా ఒక దానిని తీసికొని రావలెను. వాడు పవిత్రతపొంది ఎనిమిదవ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసికొని రావలెను. యాజకుడు అపరాధ పరిహారార్థబలియగు గొఱ్ఱెపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అప్పుడతడు అపరాధ పరిహారార్థబలియగు గొఱ్ఱెపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థబలి పశువు యొక్క రక్తములో కొంచెము తీసికొని, పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన యెడమ అరచేతిలో పోసికొని తన యెడమచేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని ఏడు మారులు ప్రోక్షింపవలెను. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను. యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలమీద పోయవలెను. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనేగాని పావురపుపిల్లలలోనేగాని ఒక దాని నర్పింపవలెను. తన నైవేద్యముగాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. కుష్ఠుపొడ కలిగినవాడు పవిత్రత పొందతగినవాటిని సంపాదింపలేని యెడల వాని విషయమైన విధియిదే.

ఈ వచనాలలో కుష్టువిషయమైన శుద్ధీకరణ కోసం రెండు మగ గొఱ్ఱెపిల్లలనూ యేడాది ఆడు గొఱ్ఱెపిల్లనూ తీసుకురాలేని బీదవాడు ఏం తీసుకురావాలో మనం చూస్తాం. ఇక్కడ బీదలపట్ల దేవుని కనికరాన్ని మనం చూస్తున్నాం. ఎంతబీదవాడైనా చివరికి రెండు పక్షులను తీసుకురాలేని పరిస్థితిలో ఉండదు. అందుకే చివరిగా ఆయన వాటిని ప్రస్తావించాడు.

గమనించండి; బీదవాడు అయినంతమాత్రాన తన శుద్ధీకరణకు సంబంధించిన బలి అవసరం లేకుండా పోలేదు. ఎందుకంటే బలిమాత్రమే ఒక వ్యక్తిని శుద్ధుడిగా చేస్తుంది. కాబట్టి అతను అర్పించగలిగింది అర్పించాలి. అలానే కేవలం పక్షులనే అర్పించినంతమాత్రాన విలువ విషయంలో ధనికులు అర్పించిన బలుల కంటే తక్కువగా ఎంచబడదు. గొర్రెలను అర్పించినవాడికి జరిగిన ప్రాయుశ్చిత్తమే పక్షులను అర్పించినవాడికీ జరుగుతుంది. అయితే దీనిని అవకాశంగా తీసుకుని గొర్రెలను అర్పించగలిగేవాడు పక్షులను అర్పించకూడదు సుమా!. ఆ మినహాయింపు బీదల నిమిత్తమే కాబట్టి గొర్రెలను అర్పించగల ధనికులు కూడా అలా చెయ్యడం పాపంగా ఎంచబడుతుంది. ఒకవేళ బీదవాడు ధనికుడు అర్పించే బలులు అర్పించగలిగినా పర్లేదు కానీ ధనికుడు బీదవాడు అర్పించేవి అర్పించకూడదు.

లేవీయకాండము 14:33-35
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల ఆ యింటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చిన నా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను.

ఈ వచనాల నుండి మనం ఇంటికి కలిగే కుష్టు గురించి చదువుతాం.‌ కొందరు ఇంటికి కుష్టు ఏంటని సందేహపడుతుంటారు కానీ ఇది ఆ ఇంటిపై నిలిచిన శాపసంబంధమైన కుష్టు. అందుకే ఆయన "యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల" అని అంటున్నాడు. అలానే "ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కునేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధ ప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును" (జెకర్యా 5:4) అని రాయబడింది. ఎందుకంటే కుష్టుపొడ కలిగిన ఇళ్ళు అలానే‌ నాశనం చెయ్యబడుతుంది.

లేవీయకాండము 14:36
అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను.

ఈ వచనం‌ ప్రకారం; కుష్టుపొడ ఏ ఇంట కలిగిందో ఆ ఇంటివారు యాజకుడికి ఆ సమాచారం తెలియచేసి అతను వచ్చి అది కుష్టేనా కాదా అని నిర్థారించకముందే ఆ ఇంటిలో ఉన్న వస్తువులన్నీ బయటకు తీసుకువచ్చేయాలి. యాజకుడు ప్రకటించినప్పటినుంచే పవిత్రమూ అపవిత్రమూ అనేవి నిర్థారించబడతాయి కాబట్టి లేకుంటే అవి అపవిత్రంగా పరిగణించబడి పారవెయ్యవలసి వస్తింది. ఆ నష్టం కలగకుండా ముందే ఆ ఇంటిలోని వస్తువులన్నీ బయటకు తీసుకువచ్చెయ్యాలి.

లేవీయకాండము 14:37-47
అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండిన యెడల యాజకుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసి యుంచవలెను. ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైన యెడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను. అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింపవలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరురాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లుగీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలు పడిన యెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడగొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. ఆ యింట పండుకొనువాడు తన బట్టలు ఉదుకు కొనవలెను. ఆ యింట భోజనముచేయు వాడు తన బట్టలు ఉదుకుకొనవలెను.

ఈ వచనాల ప్రకారం; యాజకుడు ఆ ఇంటికి కలిగింది కుష్టో కాదో నిర్థారించడానికి ఏడురోజుల పాటు ఆ ఇంటిని మూసి ఉంచాలి. ఆ ఏడురోజుల తర్వాత ఆ కుష్టు వ్యాపించియుంటే అది వ్యాపించినంతవరకూ రాళ్ళను పెరికించి వాటిని పారవేయించి క్రొత్తరాళ్ళతో క్రొత్త అడుసుతో దానిని పూడ్చివేయాలి. యాజకుడు మరలా దానిని పరీక్షించాలి. అప్పుడు కూడా ఆ కుష్టువ్యాపిస్తే ఆ ఇంటిని శాశ్వతంగా కూల్చివెయ్యాలి.

ఈనియమాన్ని బట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. కుష్టుపొడను చూడగానే ఆ ఇంటివారు యాజకుడికి సమాచారం పంపి ఆ పొడ ఉన్నంతవరకూ రాళ్ళనూ మట్టినీ తీసువేసి ఆ స్థానంలో క్రొత్తవి పెట్టించినట్టే మన గృహంలోకి ఏదైనా పాపం చిన్నగా ప్రవేశించినప్పుడే దానిని అక్కడితో నియంత్రించే ప్రయత్నం చెయ్యాలి‌. లేకుంటే ఆ పాపం పెద్దదిగా విస్తరించి కుటుంబం మొత్తాన్ని పాడు చేస్తుంది‌‌. అందుకే "సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు" (యోబు 22:23) అని రాయబడింది.

అలానే ఇశ్రాయేలు దేశం ఆయన నివసించే గృహంగా వర్ణించబడింది. కానీ అందులోకి అన్యవిగ్రహాలు దుష్టత్వం ప్రవేశించినప్పుడు ఆయన ప్రవక్తల ద్వారా రాజుల ద్వారా వాటిని తొలగించుకోమని ఎన్నోసార్లు హెచ్చరించాడు. వారలా చెయ్యలేదు కాబట్టి చరిత్రలో సర్వనాశనానికి గురయ్యారు‌. క్రీస్తు సమయానికే ఉత్తరరాజ్యమైన ఇశ్రాయేలు (10 గోత్రాలు) అష్షూరు దండయాత్రవల్ల ఉనికిలో లేకుండా పోయింది. అలానే సంఘం కూడా ఆయన గృహంగా పోల్చబడింది (1 కొరింథీ 3:9). ఆ సంఘంలోకి అపవిత్రతలు ప్రవేశించినప్పుడు కూడా ఆయన వాటిని తొలగించుకోమని హెచ్చరించాడు. ప్రకటనలోని ఏడుసంఘాలకు రాయబడిన మాటల్లో ఇది స్పష్టంగా గమనిస్తాం. అలా మారుమనస్సు పొందని ఎన్నో స్థానిక సంఘాలను ఆయన నాశనం చేసాడు. ప్రకటనలో ప్రస్తావించబడిన సంఘాలకు అదే జరిగింది. "వాటి దీపస్థంబములు తీసివెయ్యబడ్డాయి" భవిష్యత్తులో అలానే చేస్తాడు కూడా.

చివరికి మన దేహం కూడా గుడారంగా పోల్చబడింది, దేహసంబంధమైన పాపాల విషయంలో కూడా ఆయన అలానే ఆజ్ఞాపించాడు (కొలస్సీ 3:5) అలా చెయ్యనివారి గుడారాలను అనగా శరీరాలను కూడా ఆయన నాశనానికి అప్పగించాడు. కాబట్టి సంఘంలోకైనా దేహంలోకైనా పాపం చిన్నగా ప్రవేశిస్తున్నప్పుడే కుష్టుకలిగిన ఇంటిరాళ్ళను పెరికివేసినట్టు నియంత్రించడానికి ప్రయత్నించాలి. లేదంటే అది వ్యాపించి ఆ ఇళ్ళు మొత్తం కూల్చబడినట్టు సమూల ధ్వంసానికి గురౌతాం.

లేవీయకాండము 14:48-53
యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను.
ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటి మీద ఏడు మారులు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవ మైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్తవర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరిహారార్థబలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును.

ఈ వచనాలలో కుష్టు పొడవల్ల రాళ్ళు పెరికివెయ్యబడి ఆ స్థానంలో క్రొత్త రాళ్ళు క్రొత్త అడుసు పెట్టబడిన తర్వాత ఇక
కుష్టు వ్యాపించని ఇంటివిషయంలో చెయ్యవలసిన ప్రాయుశ్చిత్తం గురించి మనం చూస్తాం. మనిషి విషయంలో చేసినట్టే దానివిషయంలోనూ చెయ్యాలి. దీనిగురించి ఇప్పటికే మనం వివరించుకున్నాం.

లేవీయకాండము 14:54-57
ప్రతివిధమైన కుష్ఠుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు వస్త్రకుష్ఠమును గూర్చియు, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్ఠమును గూర్చియు, వాపును గూర్చియు, పక్కును గూర్చియు, నిగనిగలాడు మచ్చను గూర్చియు, ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి.

గత అధ్యాయం నుండి ఇంతటితో ఈ కుష్టులను గురించిన విధి ముగుస్తుంది. గమనించండి; ధర్మశాస్త్రం ప్రకారం అధికారం కలిగిన యాజకుడు ఈ కుష్టుల విషయంలో అపవిత్రుడనీ పవిత్రుడనీ నిర్థారించగలడు తప్ప శుద్ధులుగా చెయ్యలేడు. కానీ మన ప్రధాన యాజకుడు ఆ కుష్టునుండీ అలానే అది దేనికైతే సాదృష్యంగా ఉందో ఆ పాపం నుండి కూడా మనల్ని శుద్ధులుగా చెయ్యగలడు. అందుకే ఆయన గురించి "ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు" (హెబ్రీ 7:25,26) అని రాయబడింది.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.