పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 2:1-3, 2:4, 2:5,6 , 2:7-10, 2:11,12 , 2:13 ,2:14-16 .

 లేవీయకాండము 2:1-3

ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దాని మీద నూనెపోసి సాంబ్రాణి వేసి యాజకులగు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.

గత అధ్యాయంలో దేవునికి అర్పించవలసిన పశు మరియు పక్షుల బలుల గురించి వివరించబడితే ఈ అధ్యాయంలో పంటకు సంబంధించిన నైవేద్యాల గురించి మనం చూస్తాం. ఇవి పశుసంపద లేని పేదవారు కూడా అర్పించడానికి అనుకూలమైనవి. పై వచనాల ప్రకారం ఆ నైవేద్యాల్లో మొదటిది గోధుమపిండి. దానితో నైవేద్యం చెయ్యాలనుకునే వ్యక్తి దానితో పాటుగా నూనెనూ సాంబ్రానినీ తీసుకురావాలి. అప్పుడు యాజకులు వాటిని చేర చేర చొప్పున అనగా పిడికిళ్ళతో తీసుకుని బలిపీఠంపై వాటిని దహిస్తారు. మిగిలిన భాగమంతా యాజకులకు చెందుతుంది. ఈవిధంగా ఈ నైవేద్యాలు యాజకులకు కూడా ఆహారసమృద్ధి కలుగచేసేవిగా నియమించబడ్డాయి.

లేవీయకాండము 2:4
నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు, పొంగనిదియునైన గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలేగాని కావలెను.

ఇది రెండవ రకపు నైవేద్యం. ఇందులో గోధుమపిండెను నూనెతో ముద్దలుగా చేసి తరువాత అప్పడాలుగా నిప్పులపై కాలుస్తారు.

లేవీయకాండము 2:5,6
నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన యెడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను. అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను.

ఇది మూడవ రకపు నైవేద్యం. వీటిని కూడా నూనెతో తయారు చేసి నూనెతో పెనంపై కాలుస్తారు.

లేవీయకాండము 2:7-10
నీవు అర్పించునది కుండలో వండిన నైవేద్యమైన యెడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము.

ఇది నాలుగవ రకపు నైవేద్యం. వీటిని కుండలో వండుతారు. అలానే మొదటి నైవేద్యం తరహాలోనే మిగిలిన ఈ అన్ని నైవేద్యాల్లోనూ యాజకులు కొంతభాగాన్ని బలిపీఠంపై దహించి మిగిలినవాటిని తమకు ఆహారంగా ఉంచుకుంటారు.

లేవీయకాండము 2:11,12
మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగినదానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెయైనను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటి నర్పింపవలదు.

వీటికి పై వచనాల్లోనూ అలానే 14,15,16 వచనాల్లోనూ దేవునికి నైవేద్యంగా ఏమి ఎలా అర్పించాలో వివరించబడితే ఈ వచనాల్లో ఆయనకు ఏం అర్పించకూడదో తెలియచెయ్యబడడం మనం చూస్తాం, ఇక్కడ అర్పించకూడదు అంటే ఆయన బలిపీఠంపై దహించకూడదు అని అర్థం. కానీ ఈ పులిసినపిండితో చేసినవాటిని సమాధాన బలిలోని పిండివంటలతో తీసుకురావచ్చు, వాటిని యాజకుడు బలిపీఠంపై దహించడు కానీ, తన ఆహారం నిమిత్తం తీసుకుంటాడు (లేవీకాండము 7:11-14). అలానే ప్రథమఫలంగా పులిసినపిండి రొట్టెలనూ తేనెనూ తీసుకువచ్చినప్పుడు కూడా అవి యాజకుడికే చెందుతాయి. బలిపీఠంపై అర్పించే వాటిలో మాత్రం తేనె కానీ పులిసినవి కానీ ఉండకూడదు (నిర్గమకాండము 24:18, 34:25). పులిసినది అనగా నిలువ‌ ఉంచబడింది పాపానికి సాదృష్యంగా ఉంది కాబట్టి (1 కొరింథీ 5:7,8) దానిని ఆయన బలిపీఠంపై అర్పించకూడదు‌. ఈ నియమం పాపసహితమైన జీవితం ఆయనకు సువాసనగల అర్పణంగా మారలేదని, లేక ఆయనకు ప్రతిష్టితంగా ఉండలేదని మనల్ని హెచ్చరిస్తుంది. ఆయనకు అర్పించబడే అర్పణల్లో పులిసినవి ఉండకూడదు, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి ఆయనకు ప్రతిష్టించబడిన జీవితంలో కూడా పాపం ఉండకూడదు‌.

1థెస్సలొనికయులకు 4:7 tపరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.

లేవీయకాండము 2:13
నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను.

ఈ వచనంలో దేవుడు ఈ అధ్యాయమంతటిలోనూ కనిపిస్తున్న నైవేద్యాలో ఉప్పుకూడా చేర్చాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దానిని ఆయన తన నిబంధన ఉప్పు అని ప్రస్తావించి, ఉప్పును తన నిబంధనలో పోలుస్తున్నాడు. ఇదే పోలిక మనకు మరోచోట కూడా కనిపిస్తుంది (2 దినవృత్తాంతములు 13:5). ఉప్పు అనేది పాడుకాకుండా భద్రపరచడానికీ అలానే రుచిని అందించడానికీ ఉపయోగపడుతుంది. అందుకే తన ప్రజలను పాపం నుండి భద్రపరిచే ఆయన నిబంధనను, వారి జీవితాలను సమస్తజనుల దృష్టికీ రుచికరంగానూ (మెలుకరంగా) పరిశుద్ధులుగానూ మార్చే ఆ నిబంధనను (ద్వితీయోపదేశకాండము 4:6-8) ఉప్పుతో పోలుస్తున్నాడు. ఈ నిబంధన ప్రజలమైన మనం కూడా యేసుక్రీస్తు మాటల్లో ఉప్పుతో పోల్చబడడం మనకు తెలుసు (మత్తయి 5:13). కాబట్టి పౌలు హెచ్చరిస్తున్నట్టుగా మన మాటలూ అలానే జీవితాలూ ఉప్పు వెయ్యబడిన రుచికరమైనవిగానూ కృపాసహితంగానూ ఉండాలి.

కొలస్సీయులకు 4:6 ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియ్యుడి.

మనం నిబంధన ప్రజలం అనడానికి ఇది గొప్ప సాక్ష్యం. నిబంధన ప్రజలుగా (క్రైస్తవులుగా) పిలవబడుతూ ఈ లక్షణం మనలో లేకుంటే మనం నిస్సారమైన అనగా సారం లేని ఉప్పుతో సమానం. అందుకే యేసుక్రీస్తు "ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు" (మత్తయి 5:13) అని కూడా అంటున్నారు. సాధారణంగా ఉప్పు పండించేవారు ఒక చేలో నీరు పెట్టి ఆ నీటితో మట్టిని బాగా తొక్కి సుమారు రెండు మూడు వారాలపాటు అలానే విడిచిపెడతారు. ఆ సమయం గడిచాక ఆ చేలలో ఉప్పు పెళ్ళలుగా పేరుకుని ఉంటుంది, దానిని ముక్కముక్కలుగా కొట్టే క్రమంలోనే ఉప్పు చిన్నచిన్న రాళ్ళ రూపంలో మారి మనదగ్గరకు వస్తుంది. అలా వచ్చిన ఉప్పును కొంతకాలం బయట ఒక రాశిగా పోస్తారు. అప్పుడు సూర్యరశ్మికి పైన ఉండే ఉప్పు పొర నిస్సారం ఔతుంది. అది కూరలోకి పనికిరాదు, క్రింద ఉన్నది మాత్రమే‌ అమ్మకానికి వస్తుంది. నిస్సారమైన ఉప్పును, యూదులు దేవాలయాల్లో బలులు ఇచ్చే చోటకానీ, తడిగా ఉండే చోట కానీ కాలుజారి పడిపోకుండా పట్టుకోసం చల్లుతారు‌. అది వారి కాళ్ళు జారకుండా పట్టుగా ఉంటుంది, ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో చెట్లు ఎక్కేవారు ఈ ఉప్పును కాళ్ళకు రాసుకుంటారు. ఆవిధంగా నిస్సారమైన ఉప్పు మనుష్యుల కాళ్లతో తొక్కబడుతుంది. ఈవిధంగా ఆలోచించినప్పుడు నిబంధన ప్రజల సంభాషణలూ‌ జీవితాలూ సారమైన ఉప్పులా ఉండకుంటే చివరికి వారికి కాళ్ళతో త్రొక్కబడే నిస్సారమైన ఉప్పులా అవమానమే మిగులుతుందని ఆయనమాటల భావం.

లేవీయకాండము 2:14-16
నీవు యెహోవాకు ప్రథమఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అది నైవేద్యరూపమైనది, నీవు దాని మీద నూనెపోసి దానిపైని సాంబ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును, అనగా విసిరిన ధాన్యములో కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము.

ఈ వచనాల్లో దేవుడు ప్రథమఫలముల నైవేద్యం గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇది ఐదవరకపు నైవేద్యం. అలానే ప్రతీ ఇశ్రాయేలీయుడూ తన తొలి భూమిపంటనుండి తప్పక అర్పించవలసిన నైవేద్యం. ఇందులో కూడా యాజకుడు కొంతభాగం‌ బలిపీఠంపై అర్పించి, ఒక పనను ఆయన సన్నిధిలో అల్లాడించి (లేవీకాండము 23:10,11) మిగిలింది తనకూ తన కుటుంబానికీ ఉంచుకుంటాడు. ఈ నైవేద్యం తమకు ఆహారాన్ని అనుగ్రహించే దేవునికి కృతజ్ఞతగానూ, అలానే ప్రత్యక్షగుడారంలో పనిచేసే యాజకులకు ఆహార సమృద్ధిని అనుగ్రహించేదిగానూ నియమించబడింది. ఈ నైవేద్యాలు అన్నిటిలోనూ "యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా" అనే మాటలు గమనించండి. దాదాపుగా ఇదే బాషను పౌలు కూడా ఉపయోగించినట్టు మనం చూస్తాం.

ఫిలిప్పీయులకు 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైయున్నవి.

ఈమాటల ప్రకారం ఆయన పరిచర్యలో నమ్మకంగా ఉండే సేవకులకు ఇవ్వడం కూడా ఆయనదృష్టికి సువాసన గల హోమమే. ఈ సువాసన గల హోమాన్ని తమ సమృద్ధినుండి సంఘమంతా చెయ్యాలి. అయితే మన జీవితాలు ఆయనకు సువాసన గల హోమంగా ఉన్నప్పుడే మన అర్పణలూ లేదా కానుకలు కూడా ఆయనకు సువాసన గల హోమంగా ఉంటాయి. అలాంటి జీవితాలు లేనివారి అర్పణలను ఆయన ఎలా అసహ్యించుకుంటున్నాడో చూడండి.

యెషయా 1:13 మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.

అలానే నేను "ఆయన పరిచర్యలో నమ్మకంగా ఉండే సేవకులకు" అని అంటున్నాను, అది బాగా గుర్తుంచుకోండి. ఆ క్రమంలో వారు పౌలులా సత్యాన్నే ప్రకటిస్తున్నారా లేక తమ వక్రీకరణలతో, కల్పనా కథలతో ప్రజలను సత్యవాక్యం నుండి దారితప్పిస్తున్నారా అనేది కూడా పరిశీలించి మీ కానుకలను ఇవ్వండి. అప్పుడు మాత్రమే మీది "యెహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా" ఉంటుంది.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.