విషయసూచిక:- 4:1 , 4:2, 4:3 , 4:4 , 4:5-7 , 4:8-10 ,4:11,12 , 4:13 , 4:14-21 , 4:22 , 4:23-26 , 4:27-31 , 4:32-35 .
లేవీయకాండము 4:1
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
దేవుడు తన నూతనమైన ఆజ్ఞలను తెలియచేసే సందర్భాల్లో మోషే ఈ విధంగా "యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను" అని రాయడం నిర్గమకాండము నుండి మనం చూస్తుంటాం. ఎందుకంటే ఆయన ఆజ్ఞలన్నీ మోషేకు ఒకేసారి బయలుపరచలేదు. అలానే అతను ఇలా రాయడం ద్వారా ఆ కట్టడలన్నీ దేవుడు ఆజ్ఞాపించినవే తప్ప తానేదో సొంతంగా కల్పించినవి కావని పదేపదే ప్రకటిస్తున్నాడు. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (లేవీకాండము 1:1 వ్యాఖ్యానం చూడండి).
లేవీయకాండము 4:2
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనివిషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైన యెడల, ఎట్లనగా-
ఈ వచనంలో దేవుడు ప్రజలు ఆయన ఆజ్ఞల విషయంలో పొరపాటున తప్పిపోయినప్పుడు ఏం చెయ్యాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇక్కడ మనం చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.
1. దేవునిదృష్టిలో పొరపాటున చేసే పాపాలు కూడా పాపాలుగానే గుర్తించబడతాయి. ఎందుకంటే ఏ పాపమైనా సరే ఆయన పరిశుద్ధస్వభావానికి వ్యతిరేకంగానే ఉంటుంది. కాబట్టి పొరపాటున చేసినా అది పాపమే. అందుకే భక్తుడైన దావీదు "తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము" (కీర్తనలు 19:12) అని ప్రార్థిస్తున్నాడు. రహస్యంగా అంటే అతనికి తెలియకుండా అని అర్థం. కాబట్టి మనం అలాంటి పాపాల విషయంలో కూడా ప్రతీరోజూ ఆయనను వేడుకోవాలి. ఎందుకంటే మన పాపాలు మనకు రహస్యంగా ఉండవచ్చు కానీ ఆయనకు తెలియని రహస్యమంటూ ఏదీ ఉండదు.
2. మానవ పతన స్వభావాన్ని బట్టి పొరపాటున పాపాలు చెయ్యడం సహజంగానే జరుగుతుంది. అందుకే వాటిని ఆయనముందు ఒప్పుకుని ఆ పాప పరిహారంగా ఆయన ఆజ్ఞాపించిన బలులు చెల్లించాలి. ఒకవేళ అలా చెయ్యకపోతే ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే ఆ పాపంలో కొనసాగుతున్నాడని అర్థం. అలాంటి వ్యక్తి బుద్ధిపూర్వకంగా చేస్తున్న ఆ పాపాన్ని ఒప్పుకుని ఆ పాపపరిహారార్థమైన బలిని అర్పించడు కాబట్టి అతని పాపానికి ఎలాంటి ప్రాయుశ్చిత్తం ఉండదు. ఈవిషయాన్నే హెబ్రీగ్రంథకర్త తన పత్రికలో ఉదహరిస్తున్నాడు.
హెబ్రీయులకు 10:26,27 మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.
అతను ఇశ్రాయేలీయుల ఈ బలినియమాన్ని ఉదహరిస్తూనే ఈవిధంగా విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. దీనిప్రకారం బుద్ధిపూర్వకంగా పాపం చెయ్యడమంటే మనం చేసిన పాపాలను ఎప్పటికప్పుడు ఆయన సన్నిధిలో ఒప్పుకుని, వాటిని విడిచిపెట్టకపోవడమే. అలాంటి వ్యక్తులకు యేసుక్రీస్తు బలియాగం ప్రాయుశ్చిత్తంగా ఉండదు. ఎందుకంటే వారు బుద్ధిపూర్వకంగా దానిని తృణీకరిస్తున్నారు. అందుకే అతను ఈవిధంగా కూడా రాస్తున్నాడు.
హెబ్రీయులకు 10:29 ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?
అలాగే "తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము" (కీర్తనలు 19:12) అని ప్రార్థించిన దావీదు "దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండ నిందా రహితుడనగుదును" (కీర్తనలు 19:13) అని ఆందోళన చెందిన దురభిమాన పాపమంటే ఒప్పుకోకుండా బుద్ధిపూర్వకంగా చేసే పాపం గురించే. దీనినే "మరణకరమైన పాపం" (1 యోహాను 5:15,16) అని పిలిచారు. సొలొమోను కూడా దీనిగురించి "అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును" (సామెతలు 28:13) అని ప్రస్తావించాడు.
కాబట్టి విశ్వాసులమైన మనం మన పతన స్వభావరీత్యా పొరపాటుగా ఎన్నో పాపాలు చేస్తుంటాం. కానీ వాటిని ఎప్పటికప్పుడు ఒప్పుకుని విడిచిపెట్టాలి, దానివిషయమై భారమైన హృదయంతో దేవునిపై ఆధారపడాలి. అలా చెయ్యకుండా ఆ పాపాలలోనే కొనసాగుతున్నామంటే అవి ఇక పొరపాటున చేసే పాపాలు కావు కానీ బుద్ధిపూర్వకంగా చేసే పాపాలే. ఇక వాటికి ఎలాంటి ప్రాయుశ్చిత్తం ఉండదు. ఎందుకంటే తన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టినవారికే యేసుక్రీస్తు రక్తం ప్రాయుశ్చిత్తంగా ఉంటుంది. అందుకే యోహాను ఇలా అంటున్నాడు.
1యోహాను 1:9,10 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.
3. "యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనివిషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైన యెడల" యేసుక్రీస్తుకు ఛాయగా ఉన్న ఈ బలిప్రాయశ్చిత్తాలు నియమించబడడానికి ప్రజలు తమ స్వభావరీత్యా ఆయన ఆజ్ఞల విషయంలో పొరపాటున తప్పిపోవడమే కారణం. అంతేతప్ప బుద్ధిపూర్వకంగా (పైన చెప్పినట్టు ఒప్పుకోకుండా) పాపం చేసేవారికి లేక అందులో కొనసాగేవారికి అనుమతిగా (license గా) ఆయన బలులను నియమించలేదు. ఆ బలులకు నిజస్వరూపమైన యేసుక్రీస్తు బలి కూడా అంతే. అందుకే బుద్ధిపూర్వకంగా పాపం చేసేవారి గురించి "పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియునికను ఉండును" అని రాయబడింది.
4. కొన్నిసార్లు మనం పొరపాటున చేసిన పాపాలేంటో మనకు తెలియకపోవచ్చు. అంటే ఈరోజు నేను అనుకోకుండా ఒకరిపై అనవసరంగా కోప్పడ్డాను, అది నాకు వెంటనే తెలుస్తుంది. దానిని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటాను. కానీ కొన్నిసార్లు నేను పొరపాటుగా చేసిన పాపాలేంటో నాకు తెలీదు. అందుకే మనం ప్రతీరోజూ మనకు తెలియని పాపాలను కూడా ఆయనముందు యథార్థంగా ఒప్పుకోవాలి, ఉదాహరణకు "నేను ఇంకా ఏమైనా పాపాలు చేసుంటే ప్రభువా నన్ను క్షమించు, ఎందుకంటే నేను స్వభావసిద్ధంగా పాపిని కాబట్టి నాకు తెలియకుండా కూడా పాపమే చేస్తుంటాను". అయితే నేను "యథార్థంగా ఒప్పుకోవాలి" అనంటున్నాను. కొందరు అలవాటుగా కూడా పాపాలు ఒప్పుకుంటుంటారు. కానీ వాటిలోనే కొనసాగుతుంటారు. ఆ ఒప్పుకోలు అసలు ఒప్పుకోలే కాదు. వారు బుద్ధిపూర్వకంగానే పాపం చేస్తున్నారు. దేవుని కృపను పాపానికి అనుమతిగా భావిస్తూ అలా చేస్తున్నారు. ఇక వారి "పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియునికను ఉండును".
లేవీయకాండము 4:3
ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపముచేసిన యెడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.
రెండవ వచనంలో నేను "యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనివిషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైన యెడల" అన్నప్పుడు వ్యక్తిగతంగా ప్రజలు చేసే పొరపాటు పాపాలను దృష్టిలో పెట్టుకుని వివరించాను. అక్కడ ఆ పాపం గురించి మొదటిగా ప్రస్తావించబడింది కాబట్టి ఆ కోణంలో వివరించాను. కానీ సందర్భపరంగా ప్రజలు పొరపాటున పాపం చేసినప్పుడు అంటే, యాజకులను బట్టి వారు చేసే పాపాలు అని అర్థం. ఉదాహరణకు; వారు దేవుడు చెప్పిన క్రమంలో బలులు అర్పించకపోవడం వల్ల ఏ ప్రజల పక్షంగా ఆ బలులు అర్పించబడుతున్నాయో వారిపై కూడా ఆ ప్రభావం పడుతుంది. అలానే వారి ఇతర చర్యలు కూడా ప్రజలందరూ పాపం చేసే అవకాశం కల్పిస్తాయి. ఉదాహరణకు మాదిరిగా ఉండకపోవడం వల్ల. ఇక్కడ మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి.
1. ధర్మశాస్త్రం బలహీనులను యాజకులుగా నియమించిందని చెప్పడానికి ఇదొక కారణం. అందుకే వారు తమకోసం కూడా బలులు అర్పించుకోవాలి. కానీ వారికి నిజస్వరూపమైన క్రీస్తు అలాంటి బలహీనుడు కాదు. ఆయన తన పరిశుద్ధరక్తంతో తన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన బలవంతుడైన యాజకుడు.
హెబ్రీయులకు 7:27 ధర్మ శాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్నుతాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.
2. యాజకులు దేవునికి ప్రతినిధులు అయినప్పటికీ ఆయన వారి పాపాలనేమీ చూసీచూడనట్టుగా వదిలెయ్యడం లేదు. ఎందుకంటే ఆయనలో అలాంటి పక్షపాతం ఉండదు (1 పేతురు 1:17). వారు కూడా తమ పాపాలను బహిరంగంగా ఒప్పుకోవసిందే. బహిరంగంగా బలి అర్పించడం వల్ల వారు బహిరంగంగా తమ పాపాలను ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఈరోజు సంఘాల్లో మేము పెద్ద బోధకులం కాబట్టి మా పాపాలు దేవుడే చూసుకుంటాడని తమపాపాలను ఒప్పుకోకుండా దాచిపెట్టుకునేవారంతా, లేక ప్రశ్నించినవారితో అలా వాదించేవారంతా ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. వారు అలా చెయ్యడం వల్ల దేవుడు వారికి అనుగ్రహించిన ఘనతను అడ్డుపెట్టుకుని బుద్ధిపూర్వకంగా పాపం చేసేవారితో కలసిపోతున్నారు. ఆ శిక్షనే పొందుకోబోతున్నారు.
3. బహిరంగంగా జరిగే ఈ బలి యాజకుడు క్రియారూపకంగా మరియు ప్రజలందరూ అపరాధులయ్యేలా చేసిన పాపానికి సంబంధించింది. అంతేతప్ప మనసులో పుట్టే తలంపులకు సంబంధించింది కాదు. అలాగైతే మనసులో చెడు తలంపులు పుట్టినప్పుడల్లా బలి అర్పించాలి, అది ఎవరికీ సాధ్యం కాదు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే కొందరు తమ మనసులో పుట్టే చెడుతలంపులను కూడా పేరుపెట్టి మరీ బహిరంగంగా ఒప్పుకుంటుంటారు. ఉదాహరణకు ఒకరికి ఒక స్త్రీపై మోహపు తలంపులు వస్తే వాటిని బహిరంగంగా ఒప్పుకోవడం వంటివి. అలాంటివాటిని మనం దేవుని ముందు రహస్యంగా ఒప్పుకోవాలి తప్ప బహిరంగంగా కాదు. అలా చెయ్యడం వల్ల అవతలివారు కూడా బలహీనపడే అవకాశం ఉంటుంది.
"తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను"
నిర్దోషమైన కోడెదూడ అంటే కళంకం లేని గోవుపిల్ల అని అర్థం. దీనిగురించి ఇప్పటికే వివరించాను (లేవీకాండము 1: 3 వ్యాఖ్యానం చూడండి).
లేవీయకాండము 4:4
అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసికొనివచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను.
ఈ వచనంలో దేవుడు ఆ యాజకుడు తాను తీసుకువచ్చిన గోవు పిల్లను ఎక్కడ వధించాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ప్రతీబలిలో కూడా ఆ ద్వారం దగ్గరే పశువు వధించబడుతుంది. ఆ తరువాత దాని అవయవాలు ద్వారానికి సమీపంలోని బలిపీఠంపై దహించబడాలి. అలానే ప్రతీబలిలో కూడా బలిని తీసుకువచ్చిన వ్యక్తి వధించబడుతున్న పశువుతలపై తన చేతిని ఉంచాలి. అతను అలా చెయ్యడం ద్వారా నా పాపం ఈ పశువుపై మోపబడి నా స్థానంలో ఈ పశువు వధించబడుతుందని ఒప్పుకుంటున్నాడు. ఇది యేసుక్రీస్తుపై మన పాపాలు మోపబడడానికి సాదృష్యంగా ఉంది (యెషయా 53:6).
అదేవిధంగా సమాధాన బలుల్లో యాజకుడికి పశువుమాంసం కొంత, అలానే దహనబలుల్లో చర్మం ఇవ్వబడుతుంది (లేవీకాండము 7:8, 32-34) కానీ ఈ పాపపరిహారార్థ బలిలో ఎవరికీ ఏమీ ఇవ్వబడదు, చర్మంతో సహా. కొన్ని భాగాలు బలిపీఠంపైనా మరికొన్ని భాగాలు పాళెం వెలుపల పూర్తిగా దహించబడవలసిందే (8-12).
లేవీయకాండము 4:5-7
అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తనవ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డ తెర యెదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను.
ఈ వచనాల్లో దేవుడు గుడారపు ద్వారం దగ్గర వధించబడిన పశువుయొక్క రక్తాన్ని అభిషిక్తుడైన యాజకుడు అనగా ప్రధానయాజకుడు తీసుకుని ప్రత్యక్షగుడారంలోని అడ్డతెర యెదుట మరియు ధూపవేదికపైనా ఆ రక్తాన్ని చల్లి మిగిలిన రక్తమంతటినీ బలిపీఠం అడుగున పోయమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ బలిలో మాత్రమే ఇలా రక్తం ప్రత్యక్షగుడారపు తెర యెదుటా మరియు ధూపవేదికపైనా చిమరబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే అపరాధం చేసాడో ఆ యాజకుడు ఆ ప్రత్యక్షగుడారంలో ధూపం వేసేవాడు కాబట్టి, అతని కారణంగా దానికి కూడా ఆ రక్తంతో ప్రాయుశ్చిత్తం జరగాలి. ప్రజలందరూ పాపం చేసినప్పుడు తెరయెదుటా బలిపీఠంపైనా ఆ రక్తం ప్రోక్షించబడుతుంది. వ్యక్తిగల పాపాలలోనైతే బలిపీఠంపై మాత్రమే ప్రోక్షించబడుతుంది.
లేవీయకాండము 4:8-10
మరియు అతడు పాపపరిహారార్థ బలిరూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వంతటిని మూత్ర గ్రంథులను వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల పైనున్న కాలేజము మీది వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. యాజకుడు దహనబలిపీఠము మీద వాటిని ధూపము వేయవలెను.
ఈ వచనాల్లో దేవుడు బలిగా అర్పించబడిన గోవు పిల్ల నుండి పేగుల చుట్టూ ఉండే క్రొవ్వునూ మూత్రపిండాలనూ దాని చుట్టూ ఉండే క్రొవ్వునూ బలిపీఠంపై దహనబలిగా ఆర్పించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (లేవీకాండము 3 వ్యాఖ్యానం చూడండి). ఇది ఆయన మన అంతరంగంలో పరిశుద్ధతను కోరుతున్నాడు (కీర్తనలు 51:6) అనేదానికి సాదృష్యంగా ఉంది.
లేవీయకాండము 4:11,12
ఆ కోడె యొక్క శేషమంతయు, అనగా దాని చర్మము దాని మాంసమంతయు, దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పేడ పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను.
ఈ వచనాల్లో దేవుడు ఆ పశువుయొక్క మిగిలిన భాగాలు అన్నిటినీ పాళెం వెలుపల దహించివెయ్యాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. నేను పైన తెలియచేసినట్టు ఈ బలిలో యాజకుడికి ఏమాత్రం భాగం ఉండదు. అలాగే ఆ పశువుయొక్క భాగాలు పాళెం వెలుపల దహించబడడం యేసుక్రీస్తు ప్రభువు గవిని వెలుపల శ్రమపొందడానికి సాదృష్యంగా ఉంది. ఇదే పోలికను తీసుకుని హెబ్రీగ్రంథ కర్త ఎలా వివరిస్తున్నాడో చూడండి.
హెబ్రీ 13:10-14 మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైనవాటిని తినుటకు గుడారములో సేవచేయువారికి అధికారములేదు. వేటిరక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, ఆ జంతువులకళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను. కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్లుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచుచున్నాము.
లేవీయకాండము 4:13
ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదముచేసి, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరానిపని చేసి అపరాధులైనయెడల-
ఇంతవరకూ ప్రజలు అపరాధులయ్యేలా యాజకులు పాపం చేసినప్పుడు ఏం చెయ్యాలో చెప్పినదేవుడు ఇప్పుడు ప్రజలంతా అపరాధులైతే ఏం చెయ్యాలో ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే అక్కడ ప్రజలు అపరాధులయ్యేలా పాపం చేసిన యాజకుడు బలిని అర్పించాడు. ఇప్పుడు అతనివల్ల అపరాధులైన ప్రజలు కూడా బలి అర్పించాలి. ఈవిధంగా కొన్నిసార్లు సమాజమంతా కలసి పాపంలో పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సౌలు సమయంలో ప్రజలంతా రక్తంతో మాంసం తిని ఒకసారి అలానే చేసారు (1 సమూయేలు 14:32-34). అలాంటి సమయాల్లో సంఘం కూడా తమ పాపాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. సాధారణంగా క్రైస్తవ్యంలోని కొన్ని ఆచారాలను మనం ఖండించినప్పుడు వారు అవి అందరూ చేస్తున్నారు మీరెందుకు వాటిని తప్పు పడుతున్నారు అన్నట్టుగా వాదిస్తుంటారు, వారి దృష్టిలో అందరూ చేస్తున్నారు కాబట్టి అది సరైనది. కానీ ఈ సందర్భంలో దేవుడు చెబుతున్నదాని ప్రకారం సంఘమంతా కలసి చేసినప్పటికీ అది ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఊంటే అది పాపమే ఔతుంది. ప్రజల అంగీకారాన్ని బట్టి తప్పు ఒప్పులు నిర్ణయించబడవు, దేవుని వాక్యాన్ని బట్టే నిర్ణయించబడతాయి. ఈ నియమం మన సమాజానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నేటి సమాజంలో కూడా ఎక్కువమంది దేనికి అనుకూలంగా ఉంటే అది సరి, దేనికి వ్యతిరేకంగా ఉంటే అది తప్పు అనే దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొంది.
లేవీయకాండము 4:14-21
వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియ బడునప్పుడు, సంఘము పాపపరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను. సమాజము యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసికొని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని ఏడుమారులు దాని ప్రోక్షింపవలెను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధి నున్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలెను. అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను; అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరి హారార్థబలి.
ఈ వచనాల్లో యాజకుడు పాపం చేసినప్పుడు అర్పించబడినట్టే ప్రజల పాపం విషయంలో కూడా ఆ పశువు అర్పించబడడం మనం చూస్తాం. పాపపరిహారార్థ బలి ఈవిధంగానే ఉంటుంది. అయితే ఇక్కడ యాజకుడి విషయంలో చేసినట్టుగా ధూపవేదికపై రక్తం ప్రోక్షింపరు. ఎందుకంటే అక్కడ యాజకుడి కారణంగా అతను పరిచర్య చేసిన ధూపవేదికకు కూడా ప్రాయుశ్చిత్తం కలగాలి కాబట్టి అలా దానిపైనా రక్తం ప్రోక్షించాలి. ప్రజల పాపంలో అది కూడా సమాజమంతా కలసి చేసిన పాపాల్లో అడ్డతెరవద్దా బలిపీఠంపైనా ప్రోక్షిస్తే సరిపోతుంది. అడ్డతెర లోపల కరుణాపీఠం ఉంటుంది కాబట్టి, అక్కడ ప్రోక్షించాలి. అప్పుడు "యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును" అనంటే వారి ఆ పాపం విషయంలో ప్రాయశ్చిత్తం చెయ్యబడి వారి పాపానికి తగిన శిక్ష నుండి తప్పించుకున్నారని అర్థం. ఇది యేసుక్రీస్తు తన స్వరక్తంతో చేసిన ప్రాయశ్చిత్తానికి సాదృష్యంగా ఉంది అందుకే పౌలు "కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు" (రోమా 8:1) అని రాస్తున్నాడు.
అదేవిధంగా "వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడునప్పుడు" అనేమాటలు మనం చదువుతున్నాం. గమనించండి, సంఘం కానీ లేక విశ్వాసులు కానీ తాము చేసిన పాపమేంటో తెలియాలంటే "ఆజ్ఞ అతిక్రమమే పాపం" కాబట్టి వారికి ఆయన ఆజ్ఞలేంటో తప్పకుండా తెలిసుండాలి. అంటే అవి రాయబడిన లేఖనాలను వారు దీవారాత్రములు ధ్యానించాలి. అలా చెయ్యకుంటే, ఆయన ఆజ్ఞలేంటో వేటి విషయంలో తప్పిపోయి మనం పాపం చేసామో మనకు తెలీదు. అలా తెలియనప్పుడు మనం వాటిని ఒప్పుకుని విడిచిపెట్టలేము.
లేవీయకాండము 4:22
అధికారి పొరబాటున పాపముచేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధియైనయెడల-
ఈ వచనం నుండి దేవుడు అధికారి పాపం చేసినప్పుడు ఏం చెయ్యాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అధికారి అంటే ఏ పదవిలో ఉన్న అధికారియైనా అని అర్థం. యాజకుల తరహాలో ఈ అధికారులు కూడా దేవునిచేతనే నియమించబడినప్పటికీ (రోమా 13:1) వారికి కూడా పాపం విషయంలో ఎలాంటి మినహాయింపూ ఉండదు. అందుకంటే ఆయన పక్షపాతం లేని దేవుడు, పాపం ఎవరు చేసినా దానిని ద్వేషించే పరిశుద్ధుడు. అందుకే ఆయన రాజులను కూడా తమ పాపం విషయంలో విడిచిపెట్టలేదు, ఉదాహరణకు దావీదు. చివరికి ఇది రాస్తున్న మోషేను కూడా ఆ విషయంలో ఆయన ఉపేక్షించలేదు. అతను కనానులో ప్రవేశించకపోవడానికి పాపమేగా కారణం (కీర్తనలు 106:33).
లేవీయకాండము 4:23-26
అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగమేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి, ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించుచోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. ఇది పాపపరిహారార్థ బలి. యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి, దహనబలిపీఠము కొమ్ముల మీద చమిరి, దాని రక్తశేష మును దహన బలిపీఠము అడుగున పోయవలెను. సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలిపీఠము మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
ఈ వచనాల్లో దేవుడు అధికారి పాపం చేసినప్పుడు ఏం చెయ్యాలో వివరించడం మనం చూస్తాం. అతను నిర్దోషమైన మగమేకపిల్లను అర్పణగా తీసుకురావాలి. తరువాత యాజకుడు పై సందర్భాల్లో వివరించబడినట్టే ఆ మేకపిల్లకూ చేస్తాడు. గమనించండి. సమాజమంతా పాపం చేసేలా యాజకుడు పాపం చేసినప్పుడు, అలానే సమాజమంతా పాపం చేసినప్పుడూ గోవుపిల్ల వధించబడింది. కానీ ఇక్కడ అధికారి చేసింది వ్యక్తిగత పాపం కాబట్టి మేకపిల్ల మాత్రమే వధించబడింది. అంటే సమాజమంతా కలసి పాపం చెయ్యడం ఒక వ్యక్తి పాపం చెయ్యడంకంటే తీవ్రమైన విషయం కాబట్టి ఆ తీవ్రతను నొక్కిచెప్పడానికి అక్కడ కోడెదూడ వధించబడింది. కాబట్టి ఈరోజు సంఘంగా ఆయన ఆజ్ఞలను ధిక్కరించడం ఆయన దృష్టికి మనం వ్యక్తిగతంగా చేసే పాపాలకంటే తీవ్రమైన విషయమని గుర్తుంచుకోవాలి. నేటి సంఘంలో చోటుచేసుకున్న అన్యాచారాలూ అశ్లీలమైన నృత్యాలూ, సువార్త భారాన్ని కలిగియుండకపోవడం, సమాజానికి వెలుగుగా ఉనికిని చాటుకోకపోవడం ఇవన్నీ ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా జరుగుతున్న పాపాలే.
లేవీయకాండము 4:27-31
మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరానిపనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడిన యెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి పాపపరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి, దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ముల మీద చమిరి, దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను. మరియు సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
ఈ వచనాల్లో దేవుడు ప్రజలు వ్యక్తిగతంగా చేసే పాపాల విషయంలో ఏం చెయ్యాలో వివరించడం మనం చూస్తాం. దీనిగురించి మొదటివచనంలో వివరించాను. మరికొన్ని విషయాలను కూడా మనం గమనిస్తే;
1. "మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరానిపనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల" అన్నప్పుడు దేశంలో నివసించే పరదేశులకు కూడా ఇది వర్తిస్తుంది (సంఖ్యాకాండము 15:29).
2. "అర్పణముగా తీసికొని వచ్చి పాపపరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి" అనేది ఈ బలుల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే "మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను" (యెషయా 53:6) అని యేసుక్రీస్తు విషయంలో జరిగినదానికి సాదృష్యంగా ఇది నియమించబడింది. అసలు ఆ బలులవల్ల ప్రజల పాపానికి ప్రాయుశ్చిత్తం కలుగుతుందే ఆ బలులు యేసుక్రీస్తుకు ఛాయగా ఉండబట్టి. లేదంటే "ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము" (హెబ్రీ 10:4) అని రాయబడినట్టుగా ఆ బలుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పాపం చేసినవాడికి మరణమే విధి.
3. "పొరబాటున పాపము చేసి చేయరానిపనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల" అనేదానిని ఇప్పటికే వివరించాను (1 వచనం). దానిప్రకారంగా తెలిసిన తన పాపాన్ని ఒప్పుకోకుండా అందులో కొనసాగడమే బుద్ధిపూర్వకమైన పాపం. దానికి ఎలాంటి క్షమాపణా ఉండదు, దీనినే సాహసించి పాపం చెయ్యడమని కూడా రాయబడింది.
సంఖ్యాకాండము 15:27-31 ఒకడు పొరబాటున పాపము చేసినయెడల వాడు పాప పరిహారార్థబలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసికొని రావలెను. పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చి త్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన వాడు క్షమాపణ నొందును. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారి మధ్యను నివసించు పరదేశి యేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడేగాని పర దేశియే గాని యెవడైనను సాహసించి పాపముచేసినయెడల వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టి వేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోషశిక్షకు వాడే కారకుడు.
"వాని దోషశిక్షకు వాడే కారకుడు" అనంటే, వాడు చేసిన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టే అవకాశం దేవుడు కల్పించినప్పటికీ వాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, సాహసించి అదే పాపంలో కొనసాగాడు. ఆవిధంగా వాడు "యెహోవాను తృణీకరిస్తున్నాడు" అందుకే వాడి శిక్షకు వాడే కారణం. ఈ విషయం మనమంతా గుర్తుంచుకోవాలి.
లేవీయకాండము 4:32-35
ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొఱ్ఱెను తీసికొని వచ్చినయెడల నిర్దోషమైన దాని తీసికొనివచ్చి పాపపరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాపపరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. యాజకుడు పాపపరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ముల మీద చమిరి, ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు సమాధానబలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
ఈ వచనాల్లో దేవుడు పాపం చేసిన వ్యక్తి గొర్రెపిల్లను తీసుకువస్తే ఏం చెయ్యాలో తెలియచెయ్యడం మనం చూస్తాం. మిగిలిన వాటిలానే దానివిషయంలో కూడా చెయ్యాలి. అయితే అధికారి కానీ, లేక సామాన్యుడు కానీ వ్యక్తిగతంగా చేసిన పాపాలకు పశువుయొక్క రక్తం ప్రత్యక్షగుడారంలోనికి తీసుకెళ్ళబడదు. ఆవిధంగా యాజకుడి పాపం విషయంలోనూ ప్రజలందరి పాపాల విషయంలో మాత్రమే జరుగుతుంది. ఇది కూడా ప్రజలందరూ పాపం చేసేలా యాజకుడు పాపం చెయ్యడం, అలానే ప్రజలందరూ ఏకీభవించి పాపం చెయ్యడం దేవునిదృష్టికి చాలా తీవ్రమైన విషయమని తెలియచేస్తుంది.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
లేవీయకాండము అధ్యాయం 4

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"