పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 5:1 , 5:2, 5:3 , 5:4 , 5:5,6 , 5:7-10 ,5:11-13 , 5:14-16 , 5:17 , 5:18,19 .

 

లేవీయకాండము 5:1
ఒకడు ఒట్టు పెట్టుకొనినవాడై తాను చూచినదాని గూర్చిగాని తనకు తెలిసినదాని గూర్చిగాని సాక్షియైయుండి దాని తెలియచేయక పాపము చేసినయెడల అతడు తన దోషశిక్షను భరించును.

పాపపరిహారార్థ బలికి సంబంధించిన ఈ అధ్యాయంలో దేవుడు ఆ బలిని యేయే పాపాల విషయంలో అర్పించాలో వివరిస్తూ ఈ వచనం ప్రకారం మొదటిగా తమకు తెలిసిన సాక్ష్యాన్ని ఒప్పుకోనివారి గురించి ప్రస్తావించడం మనం చూస్తాం. ఈ అనువాదం వాడుక బాషలో మరింత స్పష్టంగా ఉంది.

"తాను చూచిన, తెలిసిన సంగతి గురించి సాక్ష్యమిమ్మని ఒక వ్యక్తిని ఆదేశించడం జరుగుతుందనుకోండి. ఆ సంగతి తెలియజేయకపోతే అది పాపం. అలా చేసిన వ్యక్తి తన అపరాధం భరిస్తాడు"
(లేవీ 5:1).

దీనిప్రకారం; ఎవరైనా వ్యక్తి న్యాయాధిపతుల ముందు కానీ లేక ఇతర సందర్భాలలో కానీ తనకు తెలిసిన విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టడం పాపంగా ఎంచబడుతుంది. అది ఒక నిర్దోషికి శిక్షపడేలా అబద్ధసాక్ష్యం చెప్పడం లేక దోషిని శిక్షనుండి తప్పించడానికి ప్రయత్నించడంతో సమానం. ఎందుకంటే దానివల్ల నిర్దోషికి శిక్ష పడడం లేక దోషి శిక్ష నుండి తప్పించుకోవడం జరుగుతుంది. అందుకే సొలొమోను "దొంగతో పాలుకూడువాడు తనకుతానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు" (సామెతలు 29:24) అని అంటున్నాడు. ఇది సత్యవంతుడైన దేవుని న్యాయానికి విరుద్ధమైనది. అందుకే అలా చెయ్యడం పాపం. అలా సంగతి దాచిపెట్టేవాడు ఆయన దృష్టిలో తనకు తానే పగవాడు. కాబట్టి ఈ నియమం యొక్క ఉద్దేశం ఆయన పిల్లలు తమకు తెలిసిన విషయాన్ని ఎవరిముందైనా సరే దాచకుండా చెప్పాలి. ఏవో ఇబ్బందుల్లో ఇరుక్కుంటామనే భయంతో కానీ లేక ఎవరికో విరోధమౌతామనే ఆందోళనతో కానీ ఏదీ దాచిపెట్టకూడదు.

ఈ విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు మనకు మాదిరి చూపించాడు. ప్రధానయాజకుడు ఆయనను "నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని" (మత్తయి 26:63) పలికినప్పుడు అప్పటివరకూ మౌనంగా ఉన్న ఆయన ఈ నియమాన్ని బట్టే "నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని" (మత్తయి 26:64) తనకు తెలిసిన దానిని దాచకుండా చెప్పాడు.‌ అలా చెప్పడం వల్ల వారికి ఆయనపై మరింత కోపం పెరుగుతుందని తెలిసినా కూడా తనకు తెలిసింది చెప్పకుండా దాచిపెట్టలేదు.

కానీ ఎవరైనా ఈ విషయంలో పొరపాటుగా తప్పిపోతే 5,6 వచనాల‌ ప్రకారం, పాపపరిహారార్థ బలి అర్పించాలి. ఆ బలిలో అతను తాను ఏ విషయంలో అబద్ధసాక్షిగా అనగా మౌనంగా ఉండి పాపం చేసాడో యాజకుడి ముందు ఒప్పుకోవడం వల్ల అతని మౌనం కారణంగా శిక్షపడిన నిర్దోషి ఆ శిక్షనుండి విడుదల కావడం, శిక్షనుండి తప్పించుకున్న దోషి శిక్షించబడడం జరుగుతుంది. ఆవిధంగా ఈ బలి అతను చేసిన పాపానికి దేవునిముందు క్షమాపణను అనుగ్రహించేదిగానే కాకుండా ఆ పాపపు పర్యవసానాన్ని సరిచేసేదిగా కూడా నియమించబడింది.

అయితే గమనించండి; ఈ నియమం న్యాయాధిపతుల ముందు కానీ యాజకుడి ముందు కానీ తెలిసిన నిజాన్ని దాచకుండా చెప్పాలని నియమించబడింది. కారణం: తెలిసిన నిజాన్ని దాచిపెట్టడం వల్ల నిర్దోషికి శిక్షపడడమో దోషి శిక్షనుండి తప్పించుకోవడమో జరుగుతుంది. కాబట్టి ఇది మనం చట్టం ముందు కానీ ఊరి, సంఘ, కుటుంబ పెద్దలముందు కానీ పాటించలసిన నియమమే తప్ప ఎవరుపడితే వారు ఒట్టుపెట్టుకుని అడిగితే వారికి అన్నీ దాచకుండా చెప్పేయాలని కాదు. మన మౌనం కారణంగా ఒకరికి అన్యాయం జరుగుతుంది, లేక న్యాయం జరగట్లేదు అన్నప్పుడు మాత్రం మనకు తెలిసింది దాచకుండా చెప్పాలి.

లేవీయకాండము 5:2
మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టినయెడల, అది అపవిత్రమృగ కళేబరమేగాని అపవిత్రపశు కళేబరమేగాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమేగాని అది అపవిత్రమని తనకు తెలియక పోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును.

ఈ వచనంలో దేవుడు అపవిత్రజంతువుల కళేబరాన్ని ముట్టి అపవిత్రులైనప్పుడు కూడా పాపపరిహారార్థ బలిని అర్పించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ అపవిత్ర జీవులేంటో లేవీకాండము 11వ అధ్యాయంలో వివరించబడింది. అయితే ప్రజలు వాటిని ముట్టినప్పుడు కూడా అపవిత్రులూ అపరాధులూ ఔతారని చెప్పబడింది నైతికసంబంధమైన అపవిత్రత గురించి కాదు, ఇది ఆచారసంబంధమైన అపవిత్రత. అయినప్పటికీ వాటికి కూడా బలి అవసరం. ఎందుకంటే ఇశ్రాయేలీయుల శుద్ధీకరణ ఆచారాలు మన ఆత్మీయ పరిశుద్ధతకు ఛాయగా నియమించబడ్డాయి (హెబ్రీ 9:11, 10:1, కొలస్సీ 2:16,17). పాపం తనను తాకినవారి ఆత్మను ఎలా అపవిత్రపరుస్తుందో దానికి సాదృష్యంగా చెప్పబడిన ఆ అపవిత్రజంతువులన్నీ వారికి శారీరకంగా అపవిత్రత (అనారోగ్యం) కలుగచేసేవే. ముఖ్యంగా చనిపోయినవాటిని తాకడం వల్ల.

లేవీయకాండము 11:44 నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ద పరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.

అందుకే "అది అపవిత్రమని తనకు తెలియక పోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును" అని రాయబడింది. మనిషి పాపాన్ని పాపం అని తెలియకచేసినప్పటికీ పరిశుద్ధుడైన దేవునిదృష్టిలో పాపినే ఔతాడు.‌ కాబట్టి ఇశ్రాయేలీయుల ప్రజలు అపవిత్రజంతు కళేబరాలను తాకి శారీరకంగా అపవిత్రులైనప్పుడు కూడా, యేసుక్రీస్తు బలికి ఛాయగా ఉన్న బలులను అర్పించాలి.‌ ఎందుకంటే ఆ యేసుక్రీస్తు బలి మన ఆత్మీత అపవిత్రతలు అన్నిటినుండీ మనల్ని శుద్ధిచేస్తుంది.

లేవీయకాండము 5:3
మనుష్యులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండ అంటినయెడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగినయెడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధియగును.

ఈ వచనంలో దేవుడు మనుష్యులకు తగులు అపవిత్రతలు అని మాట్లాడుతుంది కూడా నైతికమైన అపవిత్రతల గురించి కాదు కానీ శవాన్ని ముట్టడం, కడగా ఉండవలసిన స్త్రీ పురుషులను (స్రావము గలవారిని) ముట్టడం వంటివాటికోసమే. పైన చెప్పినట్టుగా ఇవన్నీ మన ఆత్మీయ అపవిత్రతకు ఛాయగా వారికి నియమించబడ్డాయి.

లేవీయకాండము 5:4
మరియు కీడైనను మేలైనను, మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసెదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసెదనని యొకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన యెడల, అది తెలిసిన తరువాత వాడు అపరాధియగును.

ఈ వచనంలో దేవుడు ఒట్టులకు సంబంధించిన అపవిత్రత గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అనగా అనాలోచితంగా నెరవేర్చుకోలేని ఒట్టు పెట్టుకోవడం గురించి. ఇది నైతికసంబంధమైన అపవిత్రత క్రిందకే‌ వస్తుంది. "మేలైనను" అన్నప్పుడు ఒకరికి మేలు చేస్తానని ఒట్టుపెట్టుకుని అది చెయ్యకుంటే పాపం. "కీడైనను" అన్నప్పుడు "నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను" అనే ఆజ్ఞకు వ్యతిరేకంగా ఒకరికి కీడు చేస్తానని ఒట్టుపెట్టుకోవడం పాపం. ఉదాహరణకు పౌలును చంపుతామని యూదులు ఒట్టుపెట్టుకోవడం (అపొ.కా 23:11). కాబట్టి ఇవి రెండూ కూడా నైతికపరమైన అపవిత్రతలుగా ఉన్నాయి.‌

లేవీయకాండము 5:5,6
కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాపవిషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడుగొఱ్ఱెపిల్లనేగాని ఆడు మేకపిల్లనే గాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును.

ఈ వచనాల ప్రకారం ఇప్పటివరకూ మనం చూసిన శరీరసంబంధమైన అపవిత్రతలకు గురైనవారు మరియు ఒట్టు పెట్టుకోవడం ద్వారా నైతికంగా కూడా పాపానికి పాల్పడినవారు తాము చేసిందేంటో తమకు తెలియగానే "ఆడుగొఱ్ఱెపిల్లనే గాని ఆడు మేకపిల్లనే గాని పాపపరిహారార్థ బలిగా" అర్పించాలి. గమనించండి "ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని" అనే మాటలు ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి ఈ బలియొక్క‌ ఉద్దేశం వారు తమ పాపాన్ని ఒప్పుకునేలా చేసి ఆ ఒప్పుకున్న పాపానికి ప్రాయశ్చిత్తం చెయ్యడమే తప్ప, చేసిన పాపాలను కప్పిపుచ్చడమో లేక మరిన్ని పాపాలు చేసేలా అవకాశం కల్పించడమో కాదు. ఈ విషయం‌ నేను ఇప్పటికే వివరించాను (లేవీకాండము 4 వ్యాఖ్యానం చూడండి).

అలానే "ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని" అంటే, సాధారణంగా నేను పాపినని అందరూ ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ ఏ విషయంలో పాపం చేసారో కూడా ఒప్పుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల అతనికి దేవుని సన్నిధిలో తగ్గింపు కలుగుతుంది. మరోసారి దేవుని సన్నిధిలో తనను తగ్గించే పాపం చెయ్యాలంటే సిగ్గు కలుగుతుంది.

లేవీయకాండము 5:7-10
అతడు గొఱ్ఱెపిల్లను తేజాలని యెడల, అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాపపరిహారార్థమైన దానిని మొదట నర్పించి, దాని మెడ నుండి దాని తలను నులమవలెను గాని దాని నూడదీయకూడదు. అతడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను. దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాపపరిహారార్థబలి. విధిచొప్పున రెండవదానిని దహనబలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

ఈ వచనాల్లో దేవుడు తన పాపపరిహారార్థ బలికై గొర్రె, మేకలను తేలేనివారికి అనగా పేదవారికి పావురాల నుండి కానీ గువ్వలనుండి కానీ రెండింటిని తీసుకువచ్చి వాటిని అర్పించాలని ఆజ్ఞాపించడం మనం‌ చూస్తాం. మొదటి పక్షిని శరీరం నుండి తల మొత్తాన్నీ వేరు చెయ్యకుండా దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి, రెండవ దానిని దహనబలిగా అర్పించాలి.

లేవీయకాండము 5:11-13
రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకనియెడల పాపముచేసినవాడు తూమెడు గోధుమ పిండిలో పదియవవంతును పాపపరిహారార్థబలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థబలి గనుక దాని మీద నూనె పోయవలదు. సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది పాపపరిహా రార్థబలి. పై చెప్పినవాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషమువలె యాజకుని దగును.

ఈ వచనాల్లో దేవుడు తమ పాపపరిహారార్థ బలికై పక్షులను కూడా తీసుకురాలేని వారికి గోధుమపిండి నైవేద్యాన్ని నిర్ణయించడం మనం చూస్తాం. గమనించండి.‌ ఈ నియమాల ప్రకారం ఎవరైనా సరే నాకు గొర్రెమేకలను కానీ చివరికి పక్షులను కూడా అర్పించే స్థాయిలేని కారణంగా నా పాపాలను‌ ఒప్పుకోలేకపోయానని చెప్పలేరు. ధనికులూ పేదవారు అందరూ ఈ నియమాలను అనుసరించి తమ పాపాలను ఒప్పుకోగలరు, ఆ అవకాశాన్ని దేవుడు వారిముందు ఉంచాడు. ఇశ్రాయేలీయుల్లో చివరికి గోధుమపిండి కూడా అర్పించలేనంత పేదవారంటూ ఎవరూ ఉండరు. వారందరికీ తమ తమ స్వాస్థ్య భాగమైన భూములు ఉంటాయి. అవి శాశ్వతంగా వేరొకరికి అమ్మివేసే పరిస్థితి కూడా వారికి ఉండదు. ఈవిధంగా పాపక్షమాపణ లేక రక్షణ అనేది ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా ధనిక పేద అనే వ్యత్యాసం లేకుండా అందరికీ సమీపంగా ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు "బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది" (లూకా 7:22) అని అంటాడు. కాబట్టి ఏకాలంలోనైనా ప్రజలు తమకు సమీపంగా‌ ఉన్న రక్షణను అందుకోకపోవడానికి వారి పరిస్థితులు కారణం కాదు కానీ, పాపంపై వారికి ఉన్న గాఢమైన ప్రేమనే కారణం.‌

యోహాను 3:19,20 ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.

అదేవిధంగా గోధుమపిండి నైవేద్యం విషయంలో "అది పాప పరిహారార్థబలి గనుక దాని మీద నూనె పోయవలదు. సాంబ్రాణి దాని మీద ఉంచవలదు" అని రాయబడడం మనం చూస్తున్నాం. దీనికి రెండు కారణాలు ఉన్నాయని మనం భావించవచ్చు.

1. ఇది పేదవారికి నియమించబడింది కాబట్టి మళ్ళీ వారు గోధుమపిండితో పాటు సాంబ్రాణిని అర్పించాలంటే సాంబ్రాణిని కొనవలసి వస్తుంది. అందుకే వారిపై మళ్ళీ భారం పడేలా ఆయన సాంబ్రాణి‌ కానీ నూనెను కానీ వద్దు అంటున్నాడు.

2. ఇది పాపపరిహారార్థ బలి కాబట్టి అందులో ఎలాంటి అలంకారం, సువాసన వచ్చే సాంబ్రాణిని అర్పించకూడదు. మన పాపపు ఒప్పుకోలు మనల్ని ఆయన సన్నిధిలో దుఖఃపెట్టేదిగా ఉండాలే తప్ప ఆనందభరితంగా కాదు.

ఇక "దాని శేషము నైవేద్య శేషమువలె యాజకుని దగును" అన్నప్పుడు నైవేద్యాల గురించి ఇప్పటికే వివరించాను (లేవీకాండము 2 వ్యాఖ్యానం చూడండి).

లేవీయకాండము 5:14-16
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరబాటున పాపముచేసిన యెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసికొనిరావలెను. పరిశుద్ధమైనదాని విషయములో తాను చేసిన పాపమువలని నష్టము నిచ్చుకొని దానితో అయిదవవంతు యాజకుని కియ్యవలెను. ఆ యాజకుడు అప రాధపరిహారార్థ బలియగు పొట్టేలువలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

ఈ వచనాల్లో దేవుడు తనకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున ఎవరైనా పాపం చేస్తే ఏం చెయ్యాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం.‌ "యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో" అనంటే, దశమభాగం విషయంలో కానీ లేక ఆయనకు ప్రత్యేకించబడిన వాటి విషయంలో అని అర్థం. ఇశ్రాయేలీయులు తమ మందలనుండి తొలిచూలు పిల్లలను ఆయనకు ప్రతిష్టించాలి (నిర్గమకాండము 34:19), అలానే పొలం నుండి తొలిపంటను కూడా ఆయనకు అర్పణగా తేవాలి (నిర్గమకాండము 34:26). కానీ ఒకవేళ ఎవరైనా అలాంటి విషయంలో పొరపాటున తప్పిపోతే ఉదాహరణకు; ప్రతిష్టించబడిన తొలిచూలు గొర్రెపిల్లను పొరపాటున వ్యక్తిగతంగా వినియోగించుకుంటే, దాని ఖరీదుకు ఐదవవంతు అంటే గొర్రెపిల్ల 1000 రూపాయలు అనుకుంటే దానికి మరో 200 కలిపి ఆ 1200 యాజకుడికి చెల్లించాలి. అలానే మరో పొట్టేలును ఆయనకు అపరాధ పరిహారార్థ బలిగా కూడా అర్పించాలి. ఈ నియమం దేవునికి చెల్లించవలసిన వాటి విషయంలో అశ్రద్ధ చూపిస్తే, అధనంగా మరింత నష్టపోవలసి వస్తుందని తెలియచేస్తుంది. అన్నీ ఇచ్చిన ఆయనకు, అందులో నుండి ఆయన ఆదేశించింది కూడా చెల్లించకపోవడం కృతజ్ఞతా రాహిత్యం.‌ ఇది మన తలాంతులు, కానుకలు, ఆయనకోసం మనం కేటాయించవలసిన సమయం ప్రయాసల‌ విషయంలో కూడా వర్తిస్తుంది.

లేవీయకాండము 5:17
చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించినవాటిలో దేని నైనను చేసి ఒకడు పాపియైనయెడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియై తన దోషమునకు శిక్ష భరించును.

ఈ వచనంలో దేవుడు తాను చెయ్యకూడదని ఆజ్ఞాపించిన వాటిని పొరపాటున ఎవరైనా చేస్తే "అతడు అపరాధియై తన దోషమునకు శిక్ష భరించును" అని ఆజ్ఞాపించడం మనం‌ చూస్తాం. ఆ దోషశిక్ష అతనిపై మోపబడకుండానే బలి ప్రవేశపెట్టబడింది. ఈ బలుల్లో "యాజకుడు ప్రాయశ్చిత్తం‌ చెయ్యగా" అనే మాటలకు అతను తన దోషశిక్షను తప్పించుకున్నాడని అర్థం. అలానే ఇక్కడ "అది పొరబాటున జరిగినను అతడు అపరాధియై తన దోషమునకు శిక్ష భరించును" అని రాయబడింది. అంటే మనిషి పొరపాటున చేసే పాపాలు కూడా ఆయన దృష్టికి పాపాలే. ఎందుకంటే పతనస్వభావియైన మనిషి చేసే పాపం తెలిసి చేసినా పొరపాటున చేసినా పరిశుద్ధుడైన దేవుని నైతిక ప్రమాణానికి వ్యతిరేకంగానే చెయ్యబడుతుంది. అందుకే ఈ వివరి వచనంలో "అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము" (లేవీయకాండము 5:19) అని నొక్కిచెప్పబడింది. ఆయన కనుదృష్టి పాపాన్ని చూడలేనంత‌ నిష్కళంకమైనది (హబక్కూకు 1:13). కాబట్టి మానవుడు ఆయన దృష్టి యెదుట ఎలా చేసినా ఆ పాపం ఆయనను నొచ్చుకునేలా చేస్తుంది (ఆదికాండము 6:5,6). అందుకే న్యాయంగా దానికి కూడా శిక్షతప్పదు. ఉదాహరణకు ఈ వాక్యభాగం చూడండి.

లూకా 12:47,48 తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును.
"అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును."

దీనిప్రకారం; తెలియక తప్పులు చేసినా దెబ్బలు తగులుతాయి. ఈ విషయాన్ని విశ్వాసులు బాగా అర్థం చేసుకోవాలి. మనం తెలియక చేసే పాపాలే ఆయన నొచ్చుకునేలా (దెబ్బలకు తగినవిగా) ఆయన పరిశుద్ధ ప్రమాణానికి వ్యతిరేకంగా చెయ్యబడుతుంటే మనం తెలిసి తెలిసి చేసే పాపాల సంగతేంటి? ఉదాహరణకు వాక్యవిరుద్ధమైన సినిమాలు, కార్యక్రమాలు, పోకిరీ శ్రేష్టలు,...Etc Etc... అప్పుడు అనేకమైన దెబ్బలు తగులుతాయి కదా! ఈ వ్యాసాలు చదవండి.

సినిమాలు-క్రైస్తవులు

దేవునిపై నీ ప్రేమ వాస్తవమా లేక భ్రమా?

లేవీయకాండము 5:18,19 కావున నీవు ఏర్పరచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధపరిహారార్థబలిగా అతడు యాజకుని యొద్దకు తీసికొనిరావలెను. అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధపరిహారార్థబలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము.

ఈ వచనాల్లో దేవుడు అలా తన ఆజ్ఞల‌ విషయంలో పొరపాటునా తప్పిపోయినవారు ఏం చెయ్యాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన సంగతులను జ్ఞాపకం చెయ్యదలిచాను.

1. మానవుడు తన పతనస్వభావం కారణంగా పాపం‌ చేస్తున్నప్పటికీ (పొరపాటుగా) ఆ పాపం దేవుని పరిశుద్ధ స్వభావానికి వ్యతిరేకంగా చెయ్యబడుతున్నప్పటికీ ఆయన మనిషిని అతని పాపంలోనే వదిలెయ్యడం లేదు. ఈ బలుల ద్వారా అతని పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి ఆదరిస్తున్నాడు. మనం కూడా యేసుక్రీస్తు బలిని బట్టి ఆదరించబడుతూనే ఉన్నాం.‌ ఆయన ఎప్పుడూ ఇప్పుడూ కృపకలిగిన దేవునిగానే మనపట్ల తన ఆదరణను చూపిస్తున్నాడు.

2. మనిషి చేసే పాపం పొరపాటుదైనా దానికి బలి అర్పించబడాలి. ఆ బలి చాలా కర్చుతో కూడుకున్నది. ఉదాహరణకు పైన "నీవు ఏర్పరచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధపరిహారార్థబలిగా అతడు యాజకుని యొద్దకు తీసికొనిరావలెను" అని రాయబడింది. అంటే ఈ అపరాధపరిహారార్థబలి పశువు‌ ఎంత ధరలో తీసుకురావాలో కూడా యాజకుడు నిర్ణయిస్తాడు. మనిషి తాను చేసే పాపం పొరపాటుదైనా సరే దానికీ మూల్యం‌ చెల్లించాలి కాబట్టి పాపం‌ విషయంలో జాగ్రత్తగా ఉండమని కూడా ఈ నియమం నేర్పిస్తుంది.

 

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.