పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

లేవీయకాండము 17:1-5
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను. నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగు చెప్పుము ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొను వాడు అది ఎద్దేగాని గొఱ్ఱెయేగాని మేకయేగాని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించిన వాడు; ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలిపశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసికొని వచ్చి సమాధానబలిగా అర్పించునట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టి వేయబడవలెను.

ఈ వచనాలలో దేవుడు ప్రత్యక్షగుడారపు‌ ఆవరణలోనే అనగా ద్వారమునొద్ద బలిపీఠంపైనే బలులు అర్పించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. మోషేకు ముందున్న చరిత్రను పరిశీలించినప్పుడు నోవహు, అబ్రాహాము వంటి భక్తులు తమకు అనుకూలమైన చోట బలిపీఠాలను కట్టి ఆయనకు బలులు అర్పించేవారు. అయితే ఇప్పుడు ప్రత్యక్షగుడారం ఏర్పడింది కాబట్టి బలులన్నీ ఆ ఆవరణంలోనే అర్పించాలి, వాటిని యాజకులే అర్పించాలి. ఈ నియమాన్ని విస్మరించడం దేవుని హక్కునూ ప్రత్యక్షగుడారపు ఘనతనూ యాజకవ్యవస్థనూ తూలనాడడం కాబట్టి అలా చేసినవారిని ప్రజల్లో నుండి కొట్టివెయ్యాలి.

అరణ్యంలో ఉన్నంతవరకూ ఇశ్రాయేలీయులు ప్రత్యక్షగుడారపు ఆవరణంలో బలి ఇచ్చిన తర్వాతనే మాంసాన్ని తినేవారు. అప్పుడు ప్రత్యక్షగుడారం వారందరికీ సమీపంగా ఉంది కాబట్టి అలా చెయ్యడానికి అణువుగా ఉండేది. అయితే వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఎవరి స్వాస్థ్యంలోనికి వారు చేరుకుంటారు కాబట్టి బలి అర్పించే ప్రత్యక్షగుడారం అందరికీ సమీపంలో ఉండదు. అందుకే కృపకలిగిన దేవుడు తమ తమ నివాసస్థలాల్లోనే తమ పశువులను చంపుకుని తినే అనుమతిని వారికి కల్పించాడు (ద్వితీయోపదేశకాండము 12:20-22). బలులు మాత్రం ప్రత్యక్షగుడారపు ఆవరణలోనే అర్పించాలి (ద్వితీయోపదేశకాండము 12:5-14).

ఇశ్రాయేలీయుల హృదయం దేవునికి సమీపంగా ఉన్నంతవరకూ వారు ఆ నియమాన్ని మీరలేదు. అందుకే రూబేనీయులు గాదీయులు మనష్షే అర్థగోత్రపు వారు తమ సరిహద్దులో ఒక బలిపీఠం కట్టినప్పుడు బలులు అర్పించడానికే దానిని కట్టారని భావించిన ఇతరగోత్రికులు వారిపై యుద్ధానికి సిద్ధపడడం, కారణం అది కాదని తెలుసుకుని శాంతించడం యెహోషువ 22లో చదువుతాం. తర్వాత కాలంలో మాత్రం వారు ఆ నియమం నుండి తొలగిపోయి ఉన్నతస్థలాల్లో బలులు అర్పించడం ప్రారంభించారు. ఆ విషయంలో "ప్రజలు ఇంకను ఉన్నతస్థలములలో బలులు అర్పించుచుండిరి" అని ఇశ్రాయేలీయులను మంచిగా పరిపాలిస్తున్న రాజులను కూడా ఆయన నిందించినట్టు రాజుల గ్రంథాలలో రాయబడింది. ఉదాహరణకు యెహోషాపాతు (1 రాజులు 22:43), యోవాషు (2 రాజులు 12:2,3). అంటే ప్రత్యక్షగుడారపు ఆవరణలో మాత్రమే బలులు అర్పించబడాలనే నియమాన్ని అతిక్రమించడం ఆయన ఎప్పుడూ నేరంగానే పరిగణించాడు.

అయితే గిద్యోను (న్యాయాధిపతులు 6:25-28), మనోహ (న్యాయాధిపతులు 13:19,20), సమూయేలు (1 సమూయేలు 7:5-10, 7:17, 16:1-5), ఏలియా (1 రాజులు 18:30-38), దావీదు (2 సమూయేలు 24:18-25) వంటి భక్తులు ప్రత్యక్షగుడారపు ఆవరణంలో కాకుండా ఇతరస్థలాల్లో కూడా బలులు అర్పించినట్టు చదువుతాం. ఆ సందర్భాల్లో ఆయనే వారికి అలా చెయ్యమని ఆజ్ఞాపించాడు కాబట్టి అది నేరం కాదు. వారు దేవునిమాట ప్రకారమే చేసారు. ఇతర ప్రజలైతే ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞను బట్టి ప్రత్యక్షగుడారపు ఆవరణంలోనే బలులు అర్పించాలి. ఈ నియమం యేసుక్రీస్తే మన ప్రత్యక్షగుడారం, ఆయన ద్వారానే మన స్తుతియాగాలు దేవునికి చేరాలి అనేదానికి ఛాయగా ఉంది. అందుకే ఆయనే ప్రజలమధ్య నివసించినప్పుడు రాబోవుకాలంలో ఇక స్థలాలతో నిమిత్తం లేకుండా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలని నేర్పించాడు (యోహాను 4:23,24). ఆ కాలం వచ్చినప్పుడు "కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను" (1తిమోతికి 2:8) అని బోధించబడింది. ఇప్పుడు ఆయనద్వారానే మన ఆరాధనలు దేవునికి చెల్లించబడుతున్నాయి కాబట్టి స్థలాలతో మనకు పనిలేదు.

లేవీయకాండము 17:6
యెహోవాకు ఇంపైన సువాసన గలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దనున్న యెహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను.

దీనికి ముందటి వచనాలలో దేవుడు ప్రత్యక్షగుడారపు ఆవరణంలోనే బలులు అర్పించాలని ఆజ్ఞాపిస్తే ఈ వచనంలో యాజకుడు మాత్రమే ఆ క్రమాన్ని జరిగించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అంటే ఇక్కడ ఏదీకూడా ప్రజలు తమ ఇష్టానుసారంగా చెయ్యడానికి వీలు లేదు. ప్రతీదీ దేవుని నియమాన్ని బట్టే జరగాలి. "యెహోవాకు ఇంపైన సువాసన గలుగునట్లు" అంటే ఆయనకు అంగీకారమయ్యేట్టు అని అర్థం. ఈ విషయం ఇప్పటికే చర్చించుకున్నాం.

లేవీయకాండము 17:7
వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింపరాదు. ఇది వారి తర తరములకు వారికి నిత్యమైన కట్టడ.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు గతంలో దెయ్యాల పేరిట బలులు అర్పించారని, అయితే ఇకపై అలా అర్పించకూడదని ఆయన ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈమాటలు వారు ఐగుప్తులో ఉండగా విగ్రహాలకు అర్పించిన బలులను సూచిస్తున్నాయి. దెయ్యాలు అంటే అపవాదిని బట్టి దేవునికి విరుద్ధంగా రూపించబడిన విగ్రహాలే (2 దినవృత్తాంతములు 11:15). పౌలు కూడా "అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని" (1కోరింథీ 10:20) దీనిని స్పష్టం చేసాడు. కాబట్టి దేవునిపిల్లలు విగ్రహాలను దెయ్యాలవలే భావించి వాటికి దూరంగా ఉండాలి. వాటి సంబంధమైన వేటిలోనూ పాలుపొంపులు కలిగియుండకూడదు‌.

లేవీయకాండము 17:8,9
మరియు నీవు వారితో ఇట్లనుము ఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను యెహోవాకు అర్పింప నుద్దేశముగలవాడై ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును.

ఈ వచనాలలో దేవుడు మరోసారి ప్రత్యక్ష గుడారపు ఆవరణంలో కాకుండా ఇతర స్థలాలకు బలులు తీసుకువెళ్ళేవారు ప్రజల్లోనుండి కొట్టివెయ్యబడతారని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ నియమం యొక్క ఉల్లంఘన తీవ్రతను తెలియచెయ్యడానికి ఆయన మరలా మరలా ఈమాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక ప్రజల్లోనుండి కొట్టివేయబడును అన్నప్పుడు ఎవరైనా ఆ ఉల్లంఘన బహిరంగంగా చేస్తే సమాజం నుండి వెలివెయ్యడమో మరణశిక్ష విధించడమో జరుగుతుంది. రహస్యంగా చేస్తే దేవుడే తీర్పు తీరుస్తాడని అర్థం.

లేవీయకాండము 17:10-14
మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలో నేమి, మీలో నివసించు పరదేశులలో నేమి, ఒకడు దేని రక్త మునుతినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. మరియు ఇశ్రాయేలీయులలోనేగాని మీలో నివసించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినయెడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము; దానిరక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణా ధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.

ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులు కానీ వారిలో నివసించే పరదేశులు కానీ రక్తాన్ని తినకూడదని అలా తిన్నవారికి మరణశిక్ష విధించబడుతుందని కఠినంగా ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ రక్తాన్ని ఎందుకు తినకూడదో అక్కడే వివరించబడింది "రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని".

అంటే రక్తమే సకలజీవుల ప్రాణానికీ ఆధారంగా ఉంది. అది లేకపోతే ఏ జీవియైనా చనిపోతుంది. ఆ ప్రాణాధారమైన రక్తాన్ని ఆయన మనిషి చేసే పాపానికి ప్రాయశ్చిత్తంగా నియమించాడు. అందుకే రక్తాన్ని ఎవరూ తినకూడదు. అలా తినడం మానవుల పాపానికి ప్రాయశ్చిత్తంగా నియమించినదానిని అవమానించడం ఔతుంది. ఈవిధంగా దేవుడు రక్తాన్ని ఎప్పుడూ పాప ప్రాయశ్చిత్తానికి సంబంధించిందిగానే చూసాడు, చూస్తున్నాడు. అందుకే క్రీస్తు రక్తానికి ఛాయగా నియమించబడిన ఆ రక్తప్రోక్షణలు ప్రస్తుతం నిలిచిపోయినా ఒకప్పుడు కూడా అది ఛాయగా నియమించబడిన కారణాన్ని బట్టి మనం కూడా ఈ నియమం పాటించవలసిందే. అపోస్తలుల‌ బోధలో ఇది స్పష్టంగా గమనిస్తున్నాం (అపొ.కార్యములు 15:28). కాబట్టి రక్తాన్ని తినకుండా దానిని నీళ్ళవలే బయటపారబొయ్యాలి (ద్వితియోపదేశకాండము 12:16).

దీనిని పాటించడం వల్ల మన‌ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. ఎందుకంటే రక్తాన్ని "fluid of life" అంటారు. శాస్త్రీయకోణంలో దీనిని పరిశీలించినప్పుడు, ఏదైన ఒక జీవికి రోగం సంక్రమించినప్పుడు ఆ ప్రభావం రక్తంలోనే ఎక్కువగా ఉంటుంది (మనిషికి కూడా అందుకే మొదట రక్తపరీక్ష చేస్తారు). ఈ కారణం చేత ఏదైనా రోగం బారినపడిన జీవి రక్తాన్ని తింటే వారికి కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రక్తమే ప్రాణానికి ఆధారమని "విలియం హార్వే" అనే ఇంగ్లీష్ శాస్త్రవేత్త 1628లో మొదటిసారి తెలియచేసాడు. ఆయనకు వేల సంవత్సరాల ముందే ఇక్కడ బైబిల్ ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ప్రాణం తియ్యడాన్ని రక్తాపరాధం అంటూ ప్రస్తావించింది (నిర్గమకాండము 22:3, కీర్తనలు 9:12). బైబిల్ ఎంత శాస్త్రీయమైనదో అర్థం చేసుకోవడానికి ఇదో మంచి ఉదాహరణ. అలానే ఒకే రక్తం (ఒకే రక్తసంబంధం) నుండే మానవుల్లో ఇన్ని జాతులు ఉద్భవించాయని కూడా బైబిలే చెబుతుంది. ఆ మాటలు తెలుగు తర్జుమాలో స్పష్టంగా లేనందువల్ల ఇంగ్లీషునుండి పెడుతున్నాను. చూడండి.

"And hath made of one blood all nations of men for to dwell on all the face of the earth, and hath determined the times before appointed, and the bounds of their habitation" (acts 17:26).

"దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని"

రక్తాన్ని ఆయన ప్రాణంతో సమానంగా చూస్తున్నాడని ఈమాటలు మరోసారి నొక్కిచెబుతున్నాయి. ఎందుకంటే ప్రాణం తీసినవారి ప్రాణం తియ్యాలన్నదే మొదటినుండీ ఆయన నియమం (ఆదికాండము 9:6). రక్తాన్ని ఆయన ప్రాణంతో సమానంగా చూస్తున్నాడు కాబట్టే అది తిన్నవారికి మరణశిక్ష విధించాలని ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ శిక్ష అమలు జరగకున్నప్పటికీ తెగించి ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపించినవారు తమ దోషశిక్షను భరించక తప్పదు.

లేవీయకాండము 17:15
మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశియేమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును.

వాస్తవానికి ఇశ్రాయేలీయులు చనిపోయినదానిని తినకూడదు (ద్వితీయోపదేశకాండము 14:21). కాబట్టి ఈమాటలు పొరపాటున లేక తెలియక తిన్నవారి గురించి చెప్పబడుతున్నాయి. ఈ వచనం ప్రకారం అలా తెలియక లేక పొరపాటున తిన్నవారు విషయం తెలిసాక బట్టలు ఉతుక్కుని స్నానం చెయ్యాలి. సాయంకాలం వరకూ ఆలయసంబంధమైన వాటిని భుజించడం కానీ అక్కడికి ప్రవేశించడం కానీ చెయ్యకూడదు. "అపవిత్రుడగును" అంటే అదే.

లేవీయకాండము 17:16
అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండినయెడల వాడు తన దోషశిక్షను భరించును.

ఈ వచనం ప్రకారం తాను చనిపోయినదానిని తిన్నానని తెలిసి కూడా ఒకడు "తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకోకుండా" ఉంటే ఇది ఆచారసంబంధమైన ఆజ్ఞ అయినప్పటికీ దానిని ఉల్లఘించినందుకు నైతికంగా పాపం చేసినవాడు ఔతాడు. దోషశిక్షను భరిస్తాడు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.