పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 1:1 , 1:2, 1:3 , 1:4 , 1:5 , 1:6-9 ,1:10-13 , 1:14 .

గ్రంథపరిచయం:

నిర్గమకాండానికి కొనసాగింపుగా ఈ లేవీకాండము రాయబడింది. హీబ్రూలో దీని పేరు וַיִּקְרָא (va-yikra) దీనికి దేవుడు ఆహ్వానించుచున్నాడు అని అర్థం. ఆదికాండములో మానవ పతనం దేవుని ఏర్పాటు వివరించబడితే నిర్గమకాండములో దేవుడు తాను ఏర్పరచుకున్న ఆ పిల్లలను ఐగుప్తునుండి విడిపించి, వారిని తన ఆజ్ఞల ద్వారా ప్రత్యేకించి వారిమధ్య నివసించడానికి (ప్రత్యక్షగుడారం) ఇష్టపడడం వివరించబడింది. అలా ఆయన ప్రత్యేకించుకున్న ప్రజలు తనను ఆరాధించడానికి పిలుపునిస్తుందే ఈ పుస్తకం. వారు మనస్పూర్తిగా అర్పించవలసిన బలులే ఆ ఆరాధన‌. ప్రజల పక్షంగా ఆ బలులను లేవీయులే అర్పించాలి కాబట్టి ఈ పుస్తకం పేరు గ్రీకులో Λευιτικόν (Leuitikon) గా ప్రస్తావించబడింది. దానినే మనం తెలుగులో లేవీకాండము అని పిలుస్తున్నాం. ఇందులో బలులకు సంబంధించిన విధులతో పాటు, ఆహారసంబంధమైన, శుద్ధీకరణ సంబంధమైన, నైతిక విలువల సంబంధమైన ఆజ్ఞలను కూడా మనం చదువుతాం. ఈ పుస్తకం ఎంత ప్రాముఖ్యమైనదంటే, నేటికీ యూదుల పిల్లలు మొదటిసారిగా ఈ పుస్తకాన్నే ధ్యానిస్తారంట.

ప్రాచీన యూదుల మరియు యేసుక్రీస్తు, అపోస్తలుల అంగీకారం ప్రకారం ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలను మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో రచించాడు (మార్కు 12:26, యోహాను 1:17, 5:46, 7:19, 7:23, ఆపో.కార్యములు 7:37,38, 13:39, 15:1, 28:23.) వీటిని యూదులు తోరా అని పిలుస్తారు. ఈ పుస్తకాలను గురించి కొన్ని సందర్భాలలో, ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, మోషే అని కూడా రాయబడింది (2 కొరింథీ 3:16 English version, అపో.కార్యములు 21:21, 24:14, లూకా24:44).

లేవీయకాండము 1:1
యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికీలాగు సెలవిచ్చెను.

నిర్గమకాండము లో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి విడిపించి వారి మధ్య నివసించాలనే కోరికతో ప్రత్యక్షగుడారాన్ని నిర్మింపచెయ్యడం మనం చూస్తాం. దానికి కొనసాగింపుగా రాయబడుతున్న ఈ పుస్తకం మొదటివచనంలో ఆయన తాను నివసిస్తున్న ప్రత్యక్షగుడారం నుండి మోషేను పిలిచి అతనితో మాట్లాడుతున్నాడు. గతంలో కూడా ఆయన తన విధులను బయలుపరిచేటప్పుడల్లా మోషేను పిలిచినట్టుగా అతను ప్రస్తావించాడు (నిర్గమకాండము 19:20). కాబట్టి ఇది గత పుస్తకానికి కొనసాగింపుగా మోషే రాస్తున్నదే అని మరోసారి స్పష్టమౌతుంది. అలానే ఈ పిలుపు ప్రత్యక్ష గుడారం ఏర్పడినాక అక్కడినుండే నీతో మాట్లాడతానని ఆయన మోషేకు చేసిన వాగ్దానానికి (నిర్గమకాండము 25:22) నెరవేర్పు కూడా. ఇంతకూ ఆయన ఇప్పుడు మోషేతో ఏం మాట్లాడబోతున్నాడని క్రింది వచనాలను మనం పరిశీలించినప్పుడు, అవి ఆయనకు అర్పించవలసిన బలులకు సంబంధించినవిగా కనిపిస్తాయి. ధర్మశాస్త్రం ప్రకారం ఆ బలి అర్పణలే ఆయనకు ప్రజలు చెల్లించవలసిన ఆరాధన. దీనిని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. మొదటిగా ప్రజల మధ్యలో ప్రత్యక్షపుగుడారం ఏర్పరచబడింది, అందులోకి దేవుని‌ మహిమ దిగివచ్చి నివసిస్తుంది (నిర్గమకాండము 40). అలా వారి మధ్య నివసిస్తున్న దేవునికి ఇప్పటినుండి ఆ ప్రజలు బలి అర్పణల ద్వారా తమ ఆరాధనను చెల్లించాలి. దీనిని నూతననిబంధన విశ్వాసులమైన మనం మన కోణం నుండి ఆలోచిస్తే, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనందరిలోనూ ఆయన నివసిస్తున్నాడు (1 కొరింథీ 3:16, 6:16,19). కాబట్టి మనం కూడా ఆయనను ఆరాధించాలి. ఆరాధన అంటే మన సంఘంగానూ వ్యక్తిగతంగానూ చెల్లించే స్తుతులు మాత్రమే కాదు, మన సమస్త క్రియలూ ఆయనకు ఆరాధనగానే ఉండాలి. అనగా మన సమస్త క్రియలూ దేవుని వాక్యానికి లోబడుతూ ఆయనను ప్రజల మధ్య మహిమపరిచేవిగా ఉండాలి. అందుకే పౌలు "విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి" (1కోరింథీ 6:20). అలానే "కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది" (రోమా 12:1) అని కూడా ఆయన రాస్తున్నాడు. ఈ ఆరాధన గురించి మరింత‌ వివరంగా నేను ఇప్పటికే వివరించాను (ఆదికాండము 22:5 వ్యాఖ్యానం చూడండి).

లేవీయకాండము 1:2
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీలో ఎవరైనను యెహోవా వాకు బలి అర్పించునప్పుడు, గోవుల మందలో నుండి గాని గొఱ్ఱెల మందలో నుండి గాని మేకల మందలో నుండి గాని దానిని తీసికొని రావలెను.

పై వచనంలో నేను వివరించినట్టుగా ఈ వచనం నుండి దేవుడు తనకు ఆరాధనగా బలి అర్పణలను తీసుకుని రమ్మనడం మనం చూస్తాం. ప్రస్తుతం‌ ప్రత్యక్షగుడారం మరియు బలిపీఠం నిర్మించబడ్డాయి కాబట్టి ఇప్పుడు ఆ బలిపీఠంపై బలులు అర్పించబడాలి. ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా "నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము" అంటున్నాడు. అనంటే ఈ అర్పణలు ఆయన ఏ ఇశ్రాయేలీయులతోనైతే నిబంధన చేసుకున్నాడో ఆ ప్రజలు మాత్రమే అర్పించవలసినవి. అన్యులకు ఆ అర్హత లేదు. వారు ఆ అర్హతను పొందుకోవాలంటే వారు కూడా ఇశ్రాయేలీయులుగా మారాలి (నిర్గమకాండము 12:48). అలానే ఈ కాలంలో కూడా ఆయనను ఆరాధించే భాగ్యం యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నిబంధన ప్రజలుగా మారిన మనకు మాత్రమే అనుగ్రహించబడింది. ఇందులో అన్యులకు ఎలాంటి పాలుపొంపులూ ఉండవు. ఆయనను ఆరాధించాలంటే వారు నిబంధన ప్రజలుగా మారవలసిందే. అటు లోకంలో గడుపుతూ ఇటు చర్చులకు కూడా పోయి ఆరాధిస్తామంటే, లేక మరో మతాన్ని అనుసరిస్తూ యేసుక్రీస్తును కూడా సేవిస్తామంటే కుదరదు‌.

ఇక ఇశ్రాయేలీయులు ఆ బలి అర్పణలకోసం తమ గోవుల మందనుండి కానీ గొఱ్ఱెల మంద నుండి కానీ మేకల మంద నుండి కానీ పశువులను తీసుకురావాలి. గోవుల మంద అంటే ఎద్దులు, ఆవులు అని అర్థం. ఇశ్రాయేలీయులను ఆయన ఐగుప్తునుండి విడిపించినప్పుడు విస్తారమైన పశుసంపదతో బయటకు వచ్చేలా చేసాడు (నిర్గమకాండము 12:38). అలా ఆయన కృపను బట్టి వారికి లభించిన పశుసంపద నుండే ఆయన కొన్నిటిని తనకు ఆరాధనగా బలి అర్పించమంటున్నాడు. గమనించండి, ఆయనకు బలిగా వేటిని అర్పించాలో ఆయనే చెబుతున్నాడు. ఎలా అర్పించాలో కూడా తరువాత సందర్భాల్లో వివరిస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఆయనకు చెల్లించవలసిన ఆరాధన పూర్తిగా ఆయన ఆజ్ఞానుసారమే అయ్యుండాలి, అందులో మానవస్వేచ్చకు ఎంతమాత్రం అవకాశం ఉండడు. అలానే బలికోసం గోవుల మందనుండి కానీ గొఱ్ఱెల మంద నుండి కానీ మేకల మంద నుండి కానీ తీసుకురావాలి అని చెప్పడం ద్వారా అవి వారికి చెందినవే అయ్యుండాలని అర్థమౌతుంది. ఇతరుల పశువులను కాజేసి తీసుకువచ్చే అవకాశం ఇక్కడ లేదు. వారు తమకు చెందిన పశువులనే మనస్పూర్తిగా తీసుకురావాలి, లేదా సొమ్ము చెల్లించి తీసుకోవాలి. ఎందుకంటే మొదటినుండీ ఆయన ఆ ప్రజలకు తనకోసం మనస్పూర్తిగా స్వచ్చందంగా తీసుకురావాలనే నేర్పించాడు (నిర్గమకాండము 25:1,2). కాబట్టి దేవుడు బలవంతంగా ఏదీ తీసుకోవడం లేదు. ఆయన ఇచ్చినవాటినుండి కూడా మనస్పూర్తిగానే తీసుకురమ్మంటున్నాడు. అలాంటి దేవునికి మనస్పూర్తిగా అర్పించడం ఆయన ప్రజల బాధ్యత.

మరో విషయం ఏంటంటే ఆయన ఇశ్రాయేలీయుల దగ్గర సమృద్ధిగా ఉన్నటువంటి సాధుజంతువులనే తన బలికి తీసుకురమ్మంటున్నాడు. వారు వాటిని సులభంగా తీసుకురాగలరు. ఒకవేళ ఆయన ఏ క్రూరజంతువులనో బలిగా తీసుకురమ్మంటే వారి పరిస్థితి ఏంటో ఊహించండి. వాటికోసం వారు ప్రాణాలను ఒడ్డిమరీ ఎంతగా కష్టపడాలో కదా? కానీ ఆయన అలా చెయ్యమనట్లేదు. దీనిని బట్టి మన దేవుడు మన శక్తికి మించిన భారాన్ని లేక కష్టాన్ని మనపై మోపేవాడు కాడని అర్థమౌతుంది, ఆయన మనకు కలిగినవాటినుండే అర్పణలు కోరతాడు, మనం చెయ్యగలిగిన కష్టాన్నే మనపై మోపుతాడు, మనం సహించగలిగినంత శోధనను మాత్రమే అనుమతిస్తాడు (1 కొరింథీ 10:13). అలానే మనం అనుసరించగలిగిన ఆజ్ఞలనే తన లేఖనాల్లో రాయించాడు, అవి నెరవేర్చేలా ఆయనే సహాయం చేస్తున్నాడు. అయినప్పటికీ వాటి విషయంలో కూడా మనం అలవాటుగా తొట్రిల్లిపోతున్నామంటే నిజంగా అది మన దౌర్భాగ్యం. ప్రాచీన కొన్ని మతాల్లో దారుణంగా తమ అవయవాలను కూడా తమ దేవతలకు అర్పణగా కోసుకునేవారట. వారి దేవతా భక్తి వారికి అలా నేర్పించింది. అలాంటి క్రూరమైన ఆజ్ఞలేమీ మన దేవుడు ఇవ్వలేదుగా? పైగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం ద్వారా ఇహమందూ పరమందూ మేలుపొందేది మనమే. అవి నిర్ణయించబడింది అందుకే (ద్వితీయోపదేశకాండము 5:29, 10:13).

లేవీయకాండము 1:3
అతడు దహనబలి రూపముగా అర్పించునది గోవులలోనిదైన యెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను.

ఈ వచనంలో మొదటిగా దేవుడు తనకు బలిగా అర్పించబడేది నిర్దోషమైన మగదైయుండాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. నిర్దోషమైనది అంటే కళంకము లేనిది అని అర్థం (నిర్గమకాండము 29:2, లేవీకాండము 22:19,20). తరువాత కాలంలో ఇశ్రాయేలీయులు ఈ నియమాన్ని మరచిపోయి కళంకం గలవాటిని ఆయనకు అర్పించి ఆయన ఉగ్రతకు గురైనట్టు మనం చదువుతాం (మలాకీ 1:8). ఇంతకూ నిర్దోషమైన వాటినే అనగా కళంకం లేనివాటినే ఆయనకు ఎందుకు అర్పించాలంటే;

1. సాధారణంగా మనం గౌరవించే వ్యక్తికి లేదా మనకంటే గొప్ప వ్యక్తికి కానుకగా మంచివాటినే ఇస్తాం తప్ప చెడిపోయిన వాటిని ఇవ్వము. అలా చెయ్యడం అతన్ని కించపరచడమే ఔతుంది. ఆవిధంగా ఆలోచించినప్పుడు మన దేవుడు అందరికంటే ఎక్కువగా గౌరవించబడవలసిన గొప్పవాడు. కాబట్టి ఆయనకు ప్రజలు శ్రేష్టమైనవాటినే అర్పించాలి. ఈ నియమాన్ని మనం మన శరీరం విషయంలో కూడా అన్వయించుకోవాలి. ఈ దేహంలో శక్తి ఉన్నప్పుడే అది ఎలాంటి లోపాలకూ గురికాకముందే దానిని ఆయనకు సజీవయాగంగా సమర్పించడానికి వినియోగించాలి (రోమా 12:1). ఒక వయస్సు వచ్చాక, లేదా మన పాపాలను బట్టి ఏదైనా లోపానికి గురయ్యాక మనం ఇప్పటిలా ఆయనకోసం పనిచెయ్యలేం కదా! అందుకే "యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు" (విలాపవాక్యములు 3:27, ప్రసంగి 12:1,2) అని రాయబడింది. ఈ నియమాన్ని ఇది చదువుతున్న యవ్వనస్తులంతా బాగా ఆలోచించాలి. అలాగే తమ శరీరం పాపపు క్రియలమూలంగా ఎలాంటి లోపాలకూ గురికాకుండా భద్రపరచుకోవాలి. పాపం మన మనసుకే కాదు మన శరీరానికి కూడా కొన్నిసార్లు కళంకం తీసుకువస్తుంది. ఉదాహరణకు పౌలు మాటలు చూడండి.

1కోరింథీయులకు 6:18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.

కాబట్టి విశ్వాసులు కళంకం లేని శరీరంతో ఆయనను మహిమపరిచేలా, కళంకం కలుగచేసే పాపాలకూ తొందరపాటులకూ దూరంగా ఉండాలని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను.

2. ధర్మశాస్త్రంలోని బలులన్నీ క్రీస్తుకు ఛాయగా ఉన్నాయి (హెబ్రీ 9,10). ఆయన నిర్దోషిగా మనకోసం బలయ్యాడు (హెబ్రీ 9:14). కాబట్టి ఆయన బలికి ఛాయగా అర్పించబడుతున్న పశువులన్నీ నిర్దోషమైనవిగా అనగా కళంకం లేనివిగా ఉండితీరాలి.

అలానే నిర్దోషమైన మగదానిని అర్పించాలంటే బలుల్లో అసలు ఆడవాటినే అర్పించకూడదు అని కాదు. ఒక్కోబలిలో ఒక్కోవాటిని అర్పించాలి. అలా ఈ ప్రత్యేకమైన దహనబలుల్లో మగవాటిని అర్పించాలి, ఆడవాటిని అర్పించే బలులు కూడా ఉన్నాయి (లేవీకాండము 4:28, 5:6). సమాధాన బలుల్లో ఐతే ఆడవాటిని కానీ మగవాటిని కానీ వేటినైనా అర్పించవచ్చు (లేవీకాండము 3:1,6).

"తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను"

ఈ ద్వారం దగ్గరే బలిపీఠం ఉంటుంది. కాబట్టి బలిగా పశువును తీసుకువచ్చేవారు ఎవరైనా ఆ ద్వారం దగ్గరే ఉండాలి. అప్పుడు యాజకుడు ఆ పశువును అక్కడే చంపి దాని మాంసమును బలిపీఠంపై దహిస్తాడు. ఈవిధంగా బలులన్నీ ఆ ద్వారం సమీపంలోనే జరుగుతాయి.

లేవీయకాండము 1:4
అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యినుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును.

ఈ వచనంలో పశువు బలిగా అర్పించబడే సమయంలో ఆ బలిని తీసుకువచ్చినవాడు ఏం చెయ్యాలో దేవుడు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అతను ఆ పశువుతలపై తన‌ చెయ్యిని ఉంచడం ద్వారా అతని పాపాలు అన్నిటినీ ఆ పశువుపై మోపుతున్నాడు. అప్పుడు ఆ పశువు అతని స్థానంలో చంపబడడం ద్వారా అతని పాపాలకు ప్రాయుశ్చిత్తం లభిస్తుంది. ఇది మన పాపాలు యేసుక్రీస్తుపై మోపబడడానికి ఛాయగా నియమించబడింది. సిలువలో మన పాపాలన్నీ ఆయనపై మోపబడ్డాయి, అందుకే మన పాపాలను బట్టి పాపంగా మారిన ఆయనను తండ్రి చెయ్యి విడిచాడు. దీనిగురించే యెషయా "మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను" (యెషయా 53:6) అని ప్రవచించాడు. అలాగే "ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను" (2కోరింథీ 5:21) అని కూడా రాయబడింది.

లేవీయకాండము 1:5
అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.

ఈ వచనంలో దేవుడు పశువును తీసుకువచ్చిన వ్యక్తి దానిపై తన చేతిని మోపాక ఆ పశువును వధించి యాజకులు దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలని ఆజ్ఞాపించ‌డం మనం చూస్తాం. 3వ వచనంలో వివరించబడినట్టు బలి అనేది ప్రత్యక్షగుడారపు ద్వారం దగ్గర బలిపీఠం సమీపంలో జరుగుతుంది. తర్వాత ఆ పశువు రక్తాన్ని యాజకులు బలిపీఠం చుట్టూ ప్రోక్షిస్తారు. తరువాత ఆ పశువు చర్మాన్ని ఊడదీసి అవయవాలను విడదీసి, పేడ ఉండే పొట్టనూ పేగులనూ వేరుచేసి ఆ అవయవాలను బలిపీఠంపై దహనబలిగా అర్పిస్తారు. ఈ వివరాలన్నీ క్రింది వచనాలలో మనం చూస్తాం. అయితే ఇక్కడ "అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత" అని రాయబడడాన్ని బట్టి యాజకులు కాకుండా బలి అర్పణను తీసుకువచ్చిన వ్యక్తే ఆ పశువును చంపుతాడనే అభిప్రాయం ఉంది. కానీ నేను దానితో విభేదిస్తున్నాను. ఎందుకంటే యాజకవ్యవస్థ ఏర్పడినాక బలులు అర్పించే బాధ్యత ఆ యాజకులకే అప్పగించబడినట్టు వారే ఆ సమస్త కార్యాన్నీ పూర్తి చేస్తున్నట్టు మనం గమనిస్తాం (ద్వితీయోపదేశకాండము 12:11-15). అలానే ఈ అధ్యాయం 15వ వచనంలో పక్షులను యాజకుడే వధిస్తున్నట్టుగా రాయబడింది. కాబట్టి బలిపశువును యాజకుడే వధిస్తున్నప్పటికీ, అతను ఆ పశువును తీసుకువచ్చిన వ్యక్తి పక్షంగా వధిస్తున్నాడు కాబట్టి, ఆ కోణంలో ఇక్కడ పశువును తీసుకువచ్చిన వ్యక్తే దానిని వధిస్తున్నట్టుగా రాయబడిందని నేను విశ్వసిస్తున్నాను‌.

లేవీయకాండము 1:6-9
అప్పుడతడు దహనబలి రూపమైన ఆ పశుచర్మమును ఒలిచి, దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్నియుంచి ఆ అగ్నిమీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలెను.

ఈ వచనాల్లో దేవుడు బలిపశువు రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించిన తరువాత ఆ పశువును బలిపీఠంపై ఎలా దహనబలిగా అర్పించాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. 16వ వచనం ప్రకారం ఏ బలి అర్పణలోనైనా పశువు మలం ఉండే పొట్టను బూడద పారబోసేచోట పడవెయ్యాలి, దానిని బలిపీఠంపై అర్పించకూడదు, పాళెంకు వెలుపల దహించాలి. ఈవిధంగా యాజకులు యెహోవాకు ఇంపైన సువాసైనగల దహనబలిని అర్పిస్తాడు.‌ ఇంపైన సువాసన అంటే ఆయనకు అంగీకారమైన బలి అని అర్థం. ఈ విషయం ఇప్పటికే నేను వివరించాను (ఆదికాండము 8:20,21 వ్యాఖ్యానం చూడండి). అంతేతప్ప దేవుడు మనకులా ముక్కు ఉండి వాసన చూస్తాడని కానీ, దహనబలి సువాసన వస్తుందని కానీ కాదు. ఆయనకు సువాసన గల దహనబలిగా అంటే ఆయనకు అంగీకారమైన దహనబలిగా అని భావం. అలానే ఆయనకు అంగీకారం కాని నైవేద్యాలను, ధూపార్పణలను ఆయనకు అసహ్యం పుట్టించే లేక చెడ్డవాసన వచ్చేవాటిగా కూడా ఆయన వర్ణించాడు (యెషయా 1:13). చూడండి; ధూపార్పణ ఎవరు అర్పించినప్పటికీ అది సువాసనే వస్తుంది, కానీ ఆయన పాపులు దానిని అర్పించడాన్ని బట్టి ఆయన దృష్టికి చెడ్డవాసన వచ్చేదిగా అసహ్యించుకుంటున్నాడు. ఈ విషయం ఇంకా వివరంగా అర్థం కావాలంటే, యేసుక్రీస్తు బలి పరిమళవాసనగా పోల్చబడింది (ఎఫెసీ 5:2). ఎందుకంటే ఆయన దేవునికి అంగీకారయోగ్యమైన బలిగా తనకు తానే అర్పించుకున్నాడు (హెబ్రీ 9:14). అలా ఆయన బలి దేవునికి అంగీకారయోగ్యంగా ఉండడాన్ని బట్టే ఆయన దృష్టికి పరిమళవాసనగా మారింది.

అదేవిధంగా బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం బలిపీఠంపై దహనబలిగా అర్పించడానికి యాజకులు వినియోగించే అగ్ని ప్రత్యక్షగుడారం ఏర్పడినప్పుడు మొదట అర్పించబడిన బలిలో దేవుడు పంపినదే (లేవీకాండము 9:24). అప్పటినుండి దానిపై నిరంతరంగా బలులు అర్పించబడుతూ ఉంటాయి కాబట్టి ఆ అగ్నినే వారు ఆరిపోకుండా ఉంచి దానితోనే మిగిలిన దహనబలులన్నీ అర్పించేవారు.

లేవీయకాండము 6:12,13
​బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలువేసి, దాని మీద దహనబలి ద్రవ్యమును ఉంచి, సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.

బహుశా అహరోను కుమారులైన నాదాబు అబీహులు ధూపార్పణ కోసం బలిపీఠంపై దేవుడు వెలిగించిన ఆ అగ్నిని కాకుండా వేరొక అగ్నిని వినియోగించినందుకే ఆయన వారిని చంపివేసాడు (లేవీకాండము 10:1,2).

అయితే యాజకులు కనాను ప్రయాణంలోనూ మరియు రాత్రివేళ మంచుకూ ఆ ఆగ్నిని ఆరిపోకుండా ఎలా భద్రపరిచేవారో మనకు వివరించబడలేదు. అయినప్పటికీ అది సాధ్యమే. వారు మోతకర్రలతో ఆ బలిపీఠాన్ని మోస్తుంటారు కాబట్టి దానిపై నిప్పులు ఆరిపోకుండా చిన్నపాటి కట్టెలు వెయ్యబడుతుండవచ్చు, అలానే‌ మంచునుండి కూడా ఆ అగ్ని ఆరిపోకుండా కాపాడబడుతూ ఉండవచ్చు "బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు" అన్నప్పుడు ఇలా కూడా చేయవచ్చు కదా!

లేవీయకాండము 1:10-13
దహనబలిగా అతడు అర్పించునది గొఱ్ఱెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనిదైన యెడల అతడు నిర్దోష మైన మగదాని తీసికొని వచ్చి
బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠము మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహో వాకు ఇంపైన సువాసనగల హోమము.

ఈ వచనాల్లో దేవుడు గొఱ్ఱె మేకల బలుల గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం.‌ వీటివిషయంలో కూడా నేను‌ పైన చెప్పినట్టుగానే చెయ్యాలి. ఇక్కడ ఒక విషయానికి స్పష్టత ఇవ్వదలిచాను. ఈ దహనబలుల్లో మాంసం అంతా బలిపీఠంపై అర్పించబడుతుంది. ఆ మాంసంలో యాజకుడికి ఎలాంటి భాగం‌ ఉండదు, చర్మం తప్ప. కొందరు దీనిని ఆధారం చేసుకుని ఆ మాంసాన్ని అలా కాల్చేసేబదులు పేదలకు పంచితే వారు తృప్తిగా భోజనం చేసేవారుగా అని ఆరోపిస్తుంటారు. ఈ ఆరోపణ మరియ యేసుక్రీస్తు పాదాలపై అత్తరు పోసినప్పుడు "యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను" (యోహాను 12:5) అనే యూదా ఆరోపణతో సరిగ్గా సరిపోతుంది. కానీ అక్కడ వాడి ఉద్దేశమేంటో స్పష్టంగా వివరించబడింది "వాడీలాగు చెప్పినది బీదల మీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను" (యోహాను 12:6). అలానే ఈ ఆరోపణ చేసేవారు కూడా బీదలపై ప్రేమతో అలా చెయ్యట్లేదు కానీ, దేవుని ప్రజలు ఆ దేవునికి అర్పించవలసిన వాటిని అర్పించకుండా ఆటంకపరచడానికే అలా చేస్తున్నారు‌. ఇశ్రాయేలీయులకు ఆ పశుసంపదనంతా ఇచ్చింది దేవుడే (నిర్గమకాండము 12:38). వారికే కాదు మనకు కూడా సమృద్ధిని అనుగ్రహిస్తుంది దేవుడే. ఆ మాటకొస్తే "భూమియూ దాని సంపూర్ణతయూ ఆయనవే" (కీర్తనలు 24:1). అలాంటప్పుడు ఆయనకు చెందినవాటినుండి, ఆయన ఇచ్చినవాటినుండి ఆయనకు కొన్నిటిని అర్పిస్తే వీరికి అభ్యంతరమా? పోని ఆయనేమైనా ఇక‌ బీదలకు దానం చెయ్యడానికి ఏమీలేకుండా తనకు అర్పించేసెయ్యమన్నాడా? ఇశ్రాయేలీయులు అర్పించే బలి అర్పణలు వారి పాపప్రాయుశ్చిత్తం కోసం మరియు ఆయన వారిని కాపాడుతున్నందుకు కృతజ్ఞతగానూ కనుక ముఖ్యంగా అవన్నీ మానవరక్షణార్థమైన క్రీస్తు బలికి ఛాయగా అర్పించబడుతున్నాయి కనుక అవేమీ వ్యర్ధంగా అర్పించబడడం‌ లేదు. ఆయన ఉద్దేశం ప్రకారం ప్రజలమేలుకే అర్పించబడుతున్నాయి. అలాగని ఆ అర్పణలకోసం పేదవాడిపై ఆయన ఎలాంటి భారమూ మోపలేదు. ఆ విషయం క్రింది వచనాల్లో వివరిస్తాను. ఆయన బీదలకోసం ఎలాంటి శ్రద్ధను చూపించాడో, వారి మేలుకోరి ఎలాంటి ఆజ్ఞలను జారీ చేసాడో బైబిల్ లో స్పష్టంగా ఉన్నాయి (లేవీకాండము 19:10, 23:22, ద్వితీయోపదేశకాండము 15:11, సామెతలు 14:31, 19:17). అయితే ఇలాంటి ఆరోపణలు చేసేవారు బీదల కోసం ఏం వెలగబెడుతున్నారో బాగా పరీక్షించుకోవాలి. మా మట్టుకు మాకు కైసరువి కైసరుకు దేవునివి దేవునికి చెల్లించడమే ఆయన నియమించిన న్యాయమైన విధి (మత్తయి 22:21).

లేవీయకాండము 1:14
అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షి జాతిలోనిదైన యెడల తెల్లగువ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను.

ఈ వచనంలో దేవుడు పక్షుల దహనబలి గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం.‌ రెండవ వచనం ప్రకారం ఆయనకు పశువుల నుండి బలులు ఇవ్వాలంటే గోవులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ అయ్యుండాలి. అలానే ఈ వచనం ప్రకారం పక్షులనుండి‌ బలులను ఇవ్వాలంటే గువ్వలు కానీ పావురాలు కానీ అయ్యుండాలి. ఇతరలేఖనాల్లో మనకు ఎక్కడ జంతు, పక్షు బలుల గురించి కనిపించినా అవి ఇవే అని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ సాధుజంతువులు మరియు పక్షులు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మొదటిగా గోవులను ప్రస్తావించి, పక్షులదాకా వచ్చాడు. ఎందుకంటే; ఇశ్రాయేలీయులను ఆయన ఐగుప్తునుండి తీసుకుని వచ్చినప్పుడు వారందరికీ సమృద్ధిగా పశుసంపద అనుగ్రహించినప్పటికీ, తరువాత కాలంలో పరిస్థితులను బట్టి ఎవరైనా పేదవారిగా మారితే, ఆయనకు గోవులను అర్పించలేకపోవచ్చు, మరీ పేదవారిగా మారితే గొర్రె మేకలను కూడా అర్పించలేకపోవచ్చు. అందుకే ఆయన వాటి స్థానంలో పక్షులను ఉంచుతున్నాడు. ఈ పక్షులు ఎలాంటి పేదవారికైనా చాలా తక్కువ ధరకే లభిస్తాయి, లేదా వారు స్వంతంగా పట్టుకోవచ్చు కూడా. ఈవిధంగా దేవుడు ప్రజల పాపపరిహారార్థమై క్రీస్తుబలికి ఛాయలుగా జంతు, పక్షు బలులను ప్రవేశపెడుతూనే వాటిని అర్పించలేని పేదవారికి ఎలాంటి ప్రత్యమ్నాయాలను కల్పించాడో ఇక్కడ మనం గమనిస్తున్నాం. నేను పై సందర్భంలో తెలియచేసినట్టుగా ఆయన శక్తికి మించిన భారాన్ని తన ప్రజలపై మోపడు. చివరికి ఆయన ఆ పక్షులను కూడా అర్పించలేని పేదవారిని కేవలం కొంచెం గోధుమ పిండిని మాత్రమే తీసుకురమ్మన్నాడు (లేవీకాండము 5:6-11). కాబట్టి కొందరు ధనాపేక్ష కలిగిన‌ బోధకుల‌ మాటలను నమ్మి తమ శక్తికి మించిన కానుకలను వారికి చెల్లిస్తున్న అమాయకులంతా ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఆయన తన ప్రజలు ఎంత విలువైనవి ఇస్తున్నారని చూడడు కానీ ఎలా ఇస్తున్నారు అనేదానిని మాత్రమే చూస్తారు. అందుకే మనం మనకున్నదానిలోనే మనస్పూర్తిగా ఆయనకు ఇస్తుండాలి (2 కొరింథీ 9:7).

మరి పేద విధవరాలు కానుకల పెట్టెలో తనకున్న జీవనోపాధినంతా వేసినప్పుడు యేసుక్రీస్తు "తన శిష్యులను పిలిచికానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెను" (మార్కు 12:42-44) అని మెచ్చుకున్నాడుగా అనే సందేహం మీకు కలిగితే ఆయన అలా మెచ్చుకుంది ఆమె ఆసక్తినే తప్ప, ఆమెకులానే అందరూ ఉన్నదంతా ఇచ్చేసెయ్యాలని ప్రోత్సహించడానికి కాదని గమనించాలి. మరోవిధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ఆమెపైన సానుభూతితో ఈ మాటలు చెబుతున్నాడు, అది ‌మనకు అర్థం కావాలంటే పై సందర్భం నుండి ఈ మాటలు చదవాలి-

మార్కు సువార్త 12:38-40 మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుచు విధవరాండ్ర యిండ్లు దిగమింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను.

ఈమాటల్లో ఆయన యూదుల్లోని శాస్త్రులు అనబడేవారు విధవరాండ్ర ఇళ్ళను దిగమింగుతున్నారని చెబుతున్నాడు. దీనర్థం వారి బోధలు విధవరాండ్ర సొమ్మును కూడా కాజేసేవిగా ఉన్నాయి. అలాంటి బోధవల్ల మోసపోయిందే ఆ విధవరాలు, అందుకే తనకేమీ ఉంచుకోకుండా ఉన్నదంతా తీసుకువచ్చి కానుకల హుండీలో వేసింది. మనం కూడా అలానే ఉన్నదంతా ఆయనకు కానుకగా ఇచ్చేస్తే, ఆయన మనకిచ్చిన కుటుంబాన్ని, మన శరీరాన్ని ఎలా పోషించుకుంటాము? కనీస అవసరాలు ఎలా తీర్చుకుంటాము? ఇలా చేసి మన కుటుంబాన్నీ, మన శరీరాన్నీ పస్తులుంచడం, కనీస అవసరాలు తీర్చకపోవడం దేవుడు మనకిచ్చినవాటి పట్ల బాధ్యతారాహిత్యంగా నడుచుకోవడమే ఔతుంది, ఇది పాపంగా ఎంచబడుతుంది (1 తిమోతీ 5:8). "సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు" (కీర్తనలు 34:10) అనే మాటలు మన కష్టసమయంలో ఆయన ఆదుకుంటాడని చెబుతున్నాయి తప్ప, నీకు ఆయన ఇచ్చినదంతా మరలా ఆయనకే కానుకగా ఇచ్చేయి, ఆయనే నిన్ను పోషిస్తాడు అని కాదు.

ఇప్పుడు మీలో కొందరికి; ప్రారంభక్రైస్తవ విశ్వాసులు‌ తమకున్నదంతా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారుకదా? సారెపతు విధవరాలు ఏలీయాకు తనకున్న కొంచెం పిండితోనే అప్పంచేసి పెట్టిందిగా అనే ప్రశ్నలు రావచ్చు.‌ సారెపతు విధవరాలు ఏలీయాకు అప్పంచేసి పెట్టి తాను, తన కుమారుడు పస్తులతో‌ చావలేదు. ఆమె అప్పం‌ చేసిపెట్టాక ఏమౌతుందో ఏలీయా ముందే ఆమెకు తెలియచేసాడు. ఆమె ఆ మాటలు నమ్మి ఆ ప్రకారం‌గా చేసింది. కరువు కాలంలో తన కుమారుడితో కలసి సమృద్ధిగా భోజనం చేసింది. గమనించండి, ఆమె తనకున్న పిండి మొత్తాన్నీ ఏలియాకు అప్పం చేసి పెట్టలేదు, ఆ కొంచెం పిండెలోనే మరికొంచెం అతనికి కేటాయించింది. ఆ సంఘటన నేను చెబుతున్నదానికి వ్యతిరేకం కాదు. మనకున్న కొంచెంలో కూడా ఆయనకు ఇవ్వాలనే నేనూ చెబుతున్నాను.

ప్రారంభక్రైస్తవ సంఘస్తులు కూడా తమకున్నదంతా ఆపోస్తలుల పాదాల దగ్గర పెట్టి తాము నీళ్ళుతాగి పడుకోలేదు, వారంతా అమ్ముకున్న దానిని సమానంగా కలిసి అనుభవించారు. అపోస్తలులు దానిని సంఘానికి (అమ్మేసి ఇచ్చిన వారితో సహా) పంచారే తప్ప తమకోసం పోగేసుకోలేదు (అపో.కార్యాలు 2:44-47). అప్పటి రోమాప్రభుత్వం‌ నుండి అలాగే యూదుల నుండి సంఘానికి కలిగిన హింసలను‌ బట్టి అలా చెయ్యవలసి వచ్చింది‌, ఇది చారిత్రక కోణంలో రాయబడిందే తప్ప ఆజ్ఞగా కాదు. పోని ఇలాంటి వాక్యభాగాలు చూపించి కానుకలు అడుక్కునే బోధకులు సంఘంలో అందరికీ సమానంగా పంచుతున్నారా లేక పోగేసుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి.

లేవీయకాండము 1:15-17
యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని తీసికొనివచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము మీద దాని దహింపవలెను, దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కలసందున దాని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద, అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.

ఈ వచనాల్లో ఆయన ఆ పక్షులను ఎలా అర్పించాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. జంతువులను అవయవాలను విడదీసినట్టుగా పక్షుల అవయవాలను విడదీయకూడదు, బహుశా బలిపీఠం‌ యొక్క పరిమితిని బట్టి జంతువుల అవయవాలను విడదీసి దానిపై పేర్చాలి. కానీ పక్షులు చిన్నగానే ఉంటాయి కాబట్టి వాటిని విడదియ్యవలసిన అవసరం లేదు. దీనివెనుక మరే కారణముందో నాకు తెలియదు కానీ, అబ్రాహాము కూడా ఈవిధంగానే చేసినట్టు చదువుతాం (ఆదికాండము 15:10).

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.