పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

లేవీయకాండము 8:1-5 మరియు యెహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాపపరిహారార్థబలి రూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసికొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడి రాగా మోషే సమాజముతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను.

యాజకప్రతిష్టిత గురించి నిర్గమకాండము 29వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపించిందంతా ఈ అధ్యాయంలో మోషే జరిపిస్తున్నట్టుగా మనం చదువుతాం. దీనికి సంబంధించిన వివరణ అంతా ఆ అధ్యాయపు వ్యాఖ్యానంలో వివరించడం జరిగింది (నిర్గమకాండము 29 వ్యాఖ్యానం చూడండి). అందుకే ఇందులో నేను వాటన్నిటినీ మరలా వివరించకుండా కొన్ని విషయాలను మాత్రమే చర్చించదలిచాను. చదువరులు సంపూర్ణ వివరణ కొరకు ముందుగా ఆ వ్యాఖ్యానం చదవాలని విజ్ఞప్తి.

"సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దకు కూడి రాగా మోషే సమాజముతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను"

ప్రత్యక్షగుడారం యొక్క నిర్మాణం ప్రారంభమైనప్పటినుండి దాని సంబంధిత‌ వస్తువుల తయారీ వరకూ యెహోవా ఆజ్ఞాపించినట్టుగానే‌ మోషే చేస్తున్నట్టు (చేయిస్తున్నట్టు) పదేపదే మనం చదువుతుంటాం. అవే మాటలు ఈ యాజకప్రతిష్టిత విషయంలో కూడా ఉపయోగించబడింది.‌ మోషే సమాజం ముందు ఆ విషయం‌ ఒప్పుకుంటున్నాడు. దీనిని బట్టి ఆ కార్యమంతా మోషే స్వంతంగా‌ కల్పించింది కాదని అదంతా యెహోవా ఆజ్ఞాపించిన కార్యమని ఆ ప్రజలకూ‌ మరియు ఆ చరిత్రను చదువుతున్న మనకు కూడా మరోసారి జ్ఞాపకం చెయ్యబడుతుంది.

లేవీయకాండము 8:6-9 అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగీని, ఏఫోదునువేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి, అతనికి పతకమువేసి ఆ పతకములో ఊరీము తుమ్మీమమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి, ఆ పాగామీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

ఈ వచనాలలో మోషే అహరోనుకూ అతని కుమారులకూ స్నానం చేయించి వారికి యాజకవస్త్రాలనూ అహరోనుకైతే ఎఫోదునూ తలపైన పాగానూ ధరింపచెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ ఊరీము తుమ్మీము ఉన్నటువంటి పతకం గురించి కూడా మనం చదువుతున్నాం.‌ వీటిద్వారానే ప్రధానయాజకుడు న్యాయనిర్దేశకం చేస్తుంటాడు. వీటన్నిటిగురించీ ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 28, 29వ్యాఖ్యానాలు చూడండి).

లేవీయకాండము 8:10-12 మరియు మోషే అభిషేకతైలమును తీసికొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠము మీద ప్రోక్షించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేకతైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను.

ఈ వచనాలలో మోషే అభిషేక తైలంతో మందిరంలోని వస్తువులనూ మరియు ప్రధానయాజకుడైన అహరోనునూ అభిషేకించడం‌ మనం చూస్తాం. ఈ అభిషేకం గురించీ నిర్గమకాండము 29వ అధ్యాయంలోనూ ఆ అభిషేక తైలం ఎలా‌ చెయ్యాలో నిర్గమకాండము 30వ అధ్యాయంలోనూ‌ వివరించబడింది (ఆ వ్యాఖ్యానాలు చదవండి).

లేవీయకాండము 8:13-32 అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్లాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను తీసికొని వచ్చెను. అహరోనును అతని కుమారులును పాపపరిహారార్థబలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి. దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ములచుట్టు వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాపపరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దానిప్రతిష్ఠించెను. మోషే ఆంత్రములమీది క్రొవ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠము మీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను. తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని వచ్చెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడతీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి, ఆ పొట్టేలంతయు బలిపీఠము మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది యింపైన సువాసనగల దహనబలి ఆయెను. అది యెహోవాకు హోమము. అతడు రెండవ పొట్టేలును, అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొనిరాగా అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనమీదను అతని కుడిచేతి బొట్టనవ్రేలిమీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనమీదను దాని చమిరెను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి, వారి కుడిచెవుల కొనలమీదను వారి కుడిచేతుల బొట్టనవ్రేలి మీదను వారి కుడి కాళ్ల బొట్టనవ్రేలి మీదను ఆ రక్తములో కొంచెము చమి రెను. మరియు మోషే బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షించెను తరువాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రముల మీది క్రొవ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని యొక పిండివంటను నూనె గలదై పొడిచిన యొక భక్ష్యమును ఒక పలచని అప్పడ మును తీసి, ఆ క్రొవ్వుమీదను ఆ కుడి జబ్బమీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటిని ఉంచి, అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠము మీద నున్న దహనబలి ద్రవ్యము మీద వాటిని దహించెను. అవి యింపైన సువాసనగల ప్రతిష్ఠార్పణలు. అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠము మీది రక్తములో కొంతయు తీసి, అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి, అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనెను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఆ మాంసమును వండి, అహరోనును అతని కుమారులును తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని, ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను.

ఈ వచనాలలో మోషే అహరోను కుమారులకు చొక్కాయిలు తొడిగించి వారి ప్రతిష్టిత నిమిత్తం బలులను అర్పించడం, ఆ బలి రక్తాన్ని వారిపై ప్రోక్షించడం అలానే వారి తినవలసిన బలిద్రవ్యాన్ని కూడా వారికి నియమించడం మనం చూస్తాం. ఈ విషయాలన్నీ ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 29 వ్యాఖ్యానం చూడండి).

లేవీయకాండము 8:33-36 మీ ప్రతిష్ఠదినములు తీరువరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నుండి బయలువెళ్లకూడదు; ఏడు దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్ఠను చేయుచుండును. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడు దినములవరకు రేయింబగళ్లుండి, యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను; నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన వన్ని అహరోనును అతని కుమారులును చేసిరి.

ఈ వచనాలలో ఆ యాజకప్రతిష్ట ఏడురోజుల వరకూ జరుగుతున్నట్టు ఆ సమయమంతా అహరోనూ మరియు అతని కుమారులూ పత్యక్షగుడారపు ఆవరణం దాటి బయటకు పోకూడదన్నట్టు మనం చూస్తాం. వారు ఆ ప్రకారమే నడుచుకున్నట్టు కూడా మనం చదువుతున్నాం. అయితే వారు కాలకృత్యాలను ఎలా తీర్చుకున్నారనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. దానికి సమాధానం: వారు ఏడు దినాలూ ఆ ఆవరణంలోనే‌ ఉండాలి అన్నప్పుడు ఇతరపనులేవీ పెట్టుకోకూడదనే అర్థమే వస్తుంది తప్ప కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా బయటకు వెళ్ళకూడదని కాదు. వారు ఆ సమయంలో సంపూర్ణంగా ఆయన ప్రతిష్టతకు లోబడాలని ఆ మాటలయొక్క భావం. ఈ యాజకప్రతిష్టిత గురించి మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి.

1. ఒకటి ఈ యాజకత్వం అనేది క్రీస్తుకు ఛాయగా నియమించబడింది. కాబట్టి దీనికి ఇంతటి ఘనత సంతరించుకుంది. అందుకే ఈ యాజకుల గురించి "నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను; భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి, నా నామము విషయములో భయము గలవారై సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమునుబట్టి బోధింపవలెను" (మలాకీ 2:5-7) అని రాయబడింది.

2. ఈ యాజకత్వం అనేది క్రీస్తుకు ఛాయగా నియమించబడింది. ఛాయకంటే నిజస్వరూపం గొప్పదిగా ఉంటుంది. అందుకే "మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపాయెను. వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను; ఆయన పశ్చాత్తాపపడడు అనియీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను. మరియు ఆ యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.(లేక, తగినవాడు) ధర్మ శాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్నుతాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను" (హెబ్రీ 7:20-28) అని రాయబడింది.

ఛాయగా నియమించబడిన యాజకవ్యవస్థే ఘనమైనదిగా ఎంచబడి ఇశ్రాయేలీయుల ప్రజలంతా దానికి లోబడాలని ఆజ్ఞాపించబడినప్పుడు నిజస్వరూపమైన క్రీస్తు యాజకత్వం మరెంత శక్తివంతమైనదో దానికి మనం మరెంతగా లోబడియుండాలో ఆలోచించండి.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.